అక్కడ-
ఆకాశం వెన్ను వెనక్కి విరిచి తలతో పాదాల్నందుకుంటూ వుంది
దూరం నించి గరుడ పక్షి రెక్కలార్చి మోకరిల్లినట్లుంటుంది
బ్రిడ్జి మీద ప్రయాణిస్తున్నంత సేపు
నీరు, భూమి అంతర్యుద్ధం చేస్తున్నట్లు
మారు వేషం వేసుకున్న గోదావరి బ్రిడ్జి గజగజలాడుతున్నట్లు వుంటుంది
చుట్టూ ఇరుప్రక్కలా తళత్తళ్ళాడే నీళ్ళు
దూరాన చెరో వైపూ సాయం ఉండే బ్రిడ్జిలు
గోదారి లంకల్లో రాలే కొంగల్లా
బొమ్మ విమానాలు తేల్తున్నట్లు సీగల్ పక్షులు
అంతటా
ఆక్రమించే నీరు-
పెనిన్సులా పాపిడి బొట్టల్లే డంబర్టన్ బ్రిడ్జి
చుట్టూ తెరచాప పడవలు, తాటి బోదెల జాడే వుండదు
జనాల స్టీమర్లు, నాణేల కోసం ఈదులాడే పిల్లలుండరు
అంతటా
ఆక్రమించే నీరు
తళత్తళ్ళని కెరటాల నీళ్ళు-
బ్రిడ్జి దాటుతున్న నిమిషన్నర
కారు కిటికీ లోంచి మనసు మాయమై గాలి గిరికీలు కొడుతుంది
వాహనాల్ని నిషేధించి వెల్లకిలా పడుకుని ఆకాశాన్ని చూడాలనిపిస్తుంది
పాపికొండలు ముందుకు దూసుకొచ్చినట్లు
బ్రిడ్జి దిగుతూనే ఫ్రీమౌంట్ కొండలు నీటికడ్డం నిలబడతాయి
రోడ్డుని మింగేద్దామన్నట్లు
రెండు వెపులా నీళ్ళు పోటీలుగా ఎగిసి పడ్తుంటాయి
గట్లు గట్లుగా భూమి,నీరు గెలిచితీరాలన్నట్లు
కుస్తీలు పడ్తుంటాయి
దూసుకు పోయే కార్ల పందెంలో
మనసు ఓడిపోయి వెనకే వుండి పోతుంది
ఎప్పుడు బ్రిడ్జి దాటినా
దాటలేని అనుభూతి బ్రిడ్జికి వేళ్ళాడుతూంటుంది
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/sep2009/index.html
You are a good ambassador to Tourism. So tempting to visit the places. Wish the world is a VISAless village.