దూరం నించి నిన్ను చూసి కుంచెదిద్దిన చిత్రపటాని వనుకున్నాను
దగ్గరికి రాగానే
ఆకాశం నక్షత్రాలన్నీ ఒక్కసారి రాల్చినట్టు
నీ మేలి ముసుగు
తుంపరై దూకే జలపాతమైంది
ఒళ్ళు గగుర్పొడిచే సౌందర్యం
వెనక్కి అడుగేయలేని సంభ్రమం
బ్రైడల్ వైల్ ! ఎంత ఉత్సాహం నీకు!
యూసోమిటీ లోయలోకి దభాలున దుముకడానికి!
నిన్ను చూస్తే ఉవ్వెత్తున రకం విస్తరించి నీతో పాటూ ఎగిరి గంతేయాలనిపిస్తుంది
జారే నీటి ప్రవాహమ్మీద జారుడు బల్లాడాలనిపిస్తుంది
బ్రైడల్ వైల్ !
నీ నీటి పాయల్ని కొప్పుగా ముడిచి
ఆశగా పూలు తురమాలనుంది
అడవి ముంగిట్లో తీగెలై పాకే వెన్నెలంతా తీసి నీకు నలుగులద్దాలనుంది
నీ జల్లుల హర్షాతిరేకాన్ని నింపుకోవడానికి
మా దగ్గర తగినన్ని హృదయాలు లేవు
ఉక్కుమ్మడిగా ముంచెత్తే వేల జల శరాల్ని ఒడిసి పట్టుకోవడానికి
మా దగ్గర తగినన్ని చేతుల్లేవు
వెల్లువై వేల నవ్వులు పూయించే నీ ముందు పెను బాధలేపాటి?!
నిన్ను నిలువెల్లా కప్పుకున్న సంతోషం ముందు ఏ ప్రపంచమైనా ఏ పాటి!!
చుట్టూ పర్వతాలు పహారా కాసే నీ ప్రవాహం పక్కనే గడ్డి మైదానమై
బల్ల పరుపుగా పర్చుకోవాలనిపిస్తూంది
ఒత్తిగిల్లి నీ కళ్ల్ల్లోకి చూస్తూ
గలగలా చల్లగా నీలాగే నవ్వాలనిపిస్తూంది
………
http://www.pranahita.org/2009/09/bridal_veil_geeta/
అడవి ముంగిట్లో తీగెలై పాకే వెన్నెలంతా తీసి నీకు నలుగులద్దాలనుంది… fantastic!!!
చుట్టూ పర్వతాలు పహారా కాసే నీ ప్రవాహం పక్కనే గడ్డి మైదానమై
బల్ల పరుపుగా పర్చుకోవాలనిపిస్తూంది…
So True. After all we were part of the same nature before we assumed the corporal frame… and shall be after.