బడి పాపాయి

నన్ను చూడగానే ఎన్నో రోజుల తర్వాత చూసినట్లు గబుక్కున పరుగెత్తుకొస్తుంది

నా నడుము చుట్టే చిట్టి చేతుల్లో మేకపిల్ల మృదుత్వం

పాపాయి కళ్లల్లో ఇంద్రధనస్సు కనపడ్డప్పటి ఆనందం

లేలేత గడ్డి కొసలు గాలికి లేతాకు పచ్చగా ఊగినట్లు నవ్వుతుంది

జలపాతం జలజలా దుమికినట్లు కబుర్లు చెపుతుంది

పాపాయి తల నిమిరినప్పుడల్లా నెమలి ఈకతో చెంప మీద తాకినట్లవుతుంది

బడి ముంగిట

నేల మీంచి ఆకాశంలోకి కొమ్మలు ఎగురుతూన్నట్లు బడి పిల్లలు-

నేను వెళ్ళేసరికి ఎవరో అమ్మాయి పిలక పట్టుకుని ఆడిస్తూంటుంది

ఎవరో అబ్బాయి ముఖాన చిర్నవ్వు మొలిపించే మంత్రమేస్తూంటుంది

అంత వరకూ బడి సంరక్షణలో ఉన్న ముడుచుకున్న రెక్కలన్నీ

ఒక్క సారి తెరుచుకున్నట్లు

పాపాయి ముఖంలో గొప్ప గెలుపు మెరుపు

చేతిలో రోజుకో రంగు కాయితంతో నేర్చుకున్న ప్రపంచాన్ని నా కళ్లకి కొత్తగా ఆవిష్కరింపజేస్తుంది

మధ్యాహ్నం బడి బయట ఎదురు తెన్నులు చూసే క్షణాల భారమంతా

పాపాయిని దూరం నించి చూడగానే హిమబిందువులా గప్పున ఆవిరైపోతుంది

నన్ను చూడగానే కడుపులోంచి తన్నుకొచ్చే నవ్వు కోసం

ఎన్ని గంటలైనా ఎదురు చూడాలనిపిస్తుంది

లేడిపిల్ల కాళ్లు

సీతాకోక చిలుక రెక్కలు

కోయిల మధుర కంఠం

చిలుక గారాబు పలుకులు

పాపాయిని  అప్పటికప్పుడు అదుముకుంటాయి

నక్షత్రాలన్నీ తల చుట్టూ మెరుస్తున్నట్లు

తళతళ్లాడే  జుట్టు కొసలు ఎగరేసుకుంటూ వస్తుంది

ఎంత మందిలో ఉన్నా అమ్మని గుర్తుపట్టే చాకచక్యం పాపాయి కళ్లకే తెలుసు

టీచరు మందలించినప్పుడో

నడవడుల రంగుల ఛార్టులో చివర నిలిచినందుకో

లంచ్ బాక్స్ కనిపించనందుకో

పడ్డప్పుడల్లా చిన్న బాండ్ ఎయిడ్ల పెద్ద బాధకో

దూరం నించి తలని, భుజాల్ని వంచి నేల భారమంతా మోస్తున్నట్లు దిగాలుగా నడుస్తుంది

నన్ను చూడగానే దు:ఖభారం కంటి చివరి కొస్తుంది

బడంటే బ్రహ్మరాక్షసైనట్లు వేలితో చూపిస్తుంది

నా భుజమ్మీద తల దాచుకుని ఆత్రంగా కంఠాన్ని చుట్టుకుంటుంది

చెవిలో ఏదో అస్పష్టంగా కువకువలాడుతుంది

పాపాయి ఏడుపు గొంతు నా గొంతుకి అడ్డం పడి

వెచ్చనైన అభయమేదో వీపు నిమిరేంత వరకు

గాలీ, వెలుతురూ, కాలం అన్నీ స్తంభిస్తాయి

కౌగిలింతలోనే గొప్ప సాంత్వనని పొందినట్లు

అంతలోనే చటుక్కున ఏదో గుర్తొచ్చినట్లు మరేదో విషయానికి మళ్లుతుంది

చేతిని గట్టిగా పట్టుకునో-

నడుమునానుకుని నడుస్తూనో-

తుర్రుమని ముందు పరుగెత్తి మళ్లీ వెనక్కి వస్తూనో-

అప్పటికప్పుడు తను సెలయేరై

నన్ను నదిని చేస్తుంది

………

Badi papayi- Andhra Jyothi (Sunday)-September12,-2010

http://www.andhrajyothy.com/sundaypageshow.asp?qry=2010/sep/12/sun.

This entry was posted in కవితలు and tagged , , . Bookmark the permalink.

1 Response to బడి పాపాయి

 1. sunamu అంటున్నారు:

  “నా నడుము చుట్టే చిట్టి చేతుల్లో మేకపిల్ల మృదుత్వం…”
  “లేలేత గడ్డి కొసలు గాలికి లేతాకు పచ్చగా ఊగినట్లు నవ్వుతుంది”
  “పాపాయి తల నిమిరినప్పుడల్లా నెమలి ఈకతో చెంప మీద తాకినట్లవుతుంది”
  novel images
  “తుర్రుమని ముందు పరుగెత్తి మళ్లీ వెనక్కి వస్తూనో-
  అప్పటికప్పుడు తను సెలయేరై
  నన్ను నదిని చేస్తుంది”
  A good classical image

  “నన్ను చూడగానే కడుపులోంచి తన్నుకొచ్చే నవ్వు కోసం
  ఎన్ని గంటలైనా ఎదురు చూడాలనిపిస్తుంది….”
  A very good expression.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s