మంచు తాకని లేక్ తహౌ

ఆకాశం వెన్నెల్ని  ముద్దలు ముద్దలుగా

నేలకి అతికించినట్లు- ఎటు చూసినా మంచు

పుడమి పైని నీళ్లన్నీ అక్కడే వేళ్లూనుకున్నట్లు- ఘనీభవించిన మంచు

మంచుని తాకే చేతి కొసలు మస్తిష్కానికి మారువేర్లు

నరనరాల్లో తెలుపుదనం పరచిన మిరుమిట్లు

దూరంగా పర్వత సానువుల్నించి

పాదాల అడుగు జాడల వరకు

చెక్కు చెదరని ధవళ హిమోత్పాతం

ప్రశాంత ఆకాశం మధ్య నక్షత్రం విస్ఫోటనం చెందినట్లు

పుడమి ముఖాన ఏక నేత్రంలా

విప్పారిన కన్రెప్పలతో ఎప్పుడూ గడ్డ కట్టని లేక్ తహౌ-

నిరంతరం  మంచుని ఒరుసుకుంటూన్నా

రూపాంతరం చెందడం ఇష్టం లేని గంధర్వ కన్య-

సరస్సు ఒడ్డున నడుం వాలిస్తే

ఆకాశం నేలై మంచై నీరై ప్రత్యక్షమవుతుంది

శరీరాన్నీ హృదయాన్నీ వేరు వేరుగా వేలాడ దీస్తుంది

గడ్ద కట్టే శరీరం దాపున

వెచ్చగా పాకి వెన్ను జలదరించే అనుభూతి

సరస్సు చుట్టూ వల పన్నిన పర్వతాల

మౌనమూ మాటలూ కలగలిసిన

సంభ్రమాశ్చర్యమానంద ప్రతిధ్వని

మొదటి ముద్దు గుండెని కాల్చి ముద్రవేసినట్లు

తెగిపోని జ్ఞాపకమేదో గుండె కిరుప్రక్కలా  వేలాడుతున్నట్లు

మొట్ట మొదటి మంచు అనుభూతి-

పాదాల్నించి ఒడలంతా గప్పున పాకే చల్లదనానికి బూటు కాళ్ల సంకెళ్లు

మంచులో పసిపాపనై పొర్లేందుకు సాధ్యం కాని వయసు ముళ్లు

రోడ్ల నిండా విరబూసే జనసమూహ సుమాలు

రాత్రంతా తళతళ్ళాడే కాసినో నక్షత్రాలు

తెల్లని బెండు నతికించుకున్న పైకప్పుల ఇళ్లు

ప్రాపంచికత్వాన్ని ఇక్కడా తప్పించుకోలేని

రోడ్లపక్క మురికి మంచుదిబ్బలు

ఎత్తుకి వెళ్లే కొలదీ విస్తరించే సియర్రా పర్వతాల విశాల దృశ్యంతో బాటూ

జర్రుజర్రున జారే అద్భుత స్కీయింగ్ విన్యాసాలు

మంచు మాత్రమే పసివాళ్లని చేయగలిగినట్లు

అటూ ఇటు గాలిలో ఎగిరే మంచు బంతులు

పెటేలున పగిలే మంచు తుంపర్ల నవ్వుల్లో గిరికీలు కొట్టే మనస్సు

కన్రెప్పల చివర దృశ్యాలు దడదడా కొట్టుకునే చిక్కని నాడి

చలి సరస్సు నీట్లో మునిగి

పారదర్శక  ఆకాశం కేసి చూస్తూ

అక్కడే ఎక్కడో శాశ్వతంగా ఉండిపోయాయి-

————

http://www.pranahita.org/2010/04/manchu_takani/

This entry was posted in కవితలు and tagged , , . Bookmark the permalink.

4 Responses to మంచు తాకని లేక్ తహౌ

  1. sunamu అంటున్నారు:

    “ప్రశాంత ఆకాశం మధ్య నక్షత్రం విస్ఫోటనం చెందినట్లు

    పుడమి ముఖాన ఏక నేత్రంలా

    విప్పారిన కన్రెప్పలతో ఎప్పుడూ గడ్డ కట్టని లేక్ తహౌ-…. ”

    “సరస్సు ఒడ్డున నడుం వాలిస్తే

    ఆకాశం నేలై మంచై నీరై ప్రత్యక్షమవుతుంది

    శరీరాన్నీ హృదయాన్నీ వేరు వేరుగా వేలాడ దీస్తుంది”

    Wonderful images. I think now you are at th ebest of your poetic expression. Please continue.

  2. kalageeta అంటున్నారు:

    Thank U-

  3. srikaaram అంటున్నారు:

    మంచి అనుభూతిని కలిగించింది…
    అభినందనలతో
    వేదాంతం శ్రీపతిశర్మ

  4. ponnalamohan అంటున్నారు:

    poem bhvundi

వ్యాఖ్యానించండి