ఇంటూ నలభై

ఇంటూ నలభైల జీవితం కోసం వేనవేల మైళ్ళు

కొండలుకోనలు, సప్త సముద్రాలు దాటుతాం-

గంటల పనికి- గంటకింత-

బతుకుపోరాటంలో సం.రాల తరబడి ప్రవాసం

నీతో సంభాషించేదెవరు?

నీతో పంచుకునేదెవరు?

నీతో గమ్యంచేరేదెవరు?

కదిపే ప్రతి అడుగు ముందూ ఇంటూ నలభై భూతం ప్రత్యక్షమవుతుంది

రూపాయిల్లో తర్జుమా అయ్యే ప్రతి అంకే భూతద్దంలో కనిపించి వణుకు పుట్టిస్తుంది

ఇంటద్దె యాభైవేల పైచిలుకు

వెయ్యికి రాని పదికేజీల బియ్యం

కూరలు బుట్టెడు రెండు వేలు

బస్సెక్కి దిగితే వంద

వేలెడంత కొత్తిమీర,కరివేపాకు రెండు వందలు

పదిరూపాయలకో గుడ్డు-

నూటేభైకీ రాని బ్రెడ్డు-

ఇంటూ నలభైల జీవనంలో ఐసుప్రూటు తినడమా?

సినిమాల కెళ్ళడమా?

పక్క వాటాలో ఎవరుంటారో తెలీదు-

ఎవరి భాష ఎవరికీ రాదు-

ఇంగ్లీషు దారం కుట్టుకుని ఎన్ని ముళ్ళని వేసుకుంటాం?

ఒకేలాంటి చెక్కగూళ్ళలో బడో, గుడో తెలీదు-

మైళ్ళకు మైళ్ళు ప్రయాణించినా ప్రాంతాల తేడా వుండదు

ఇంటూ నలభైల జీవనంలో

భార్యా భర్తా- పిల్లాజెల్లా- ఇల్లూ కుటుంబం శనాదివారాలకు పరిమితం

స్నేహాలు,సంతోషాలు, పార్టీలు, షికార్లు

వేడివేడిగా టిఫిన్లు, భోజనాలు అన్నీ వారాంతాలే

అక్కడ ఊర్లో ఏమైందో-

అమ్మానాన్నా ఎలా ఉన్నారో-

అందర్నీ చూసి ఎన్నాళ్ళైందో

అయినా అవన్నీ ఇప్పుడు నాలుగు పక్కన సున్నాతో సమానం

నలభైల్లో వచ్చేదాని ముందు అవన్నీ ఎంత?!
టాక్సు మూడో వంతు పోయినా

ఇన్సూరెన్సులు సగం మింగేసినా

నెలంతా గడిస్తే నాలుగో వంతే మిగిలినా

‘అమెరికాలో వుండడమే’ పెద్ద ఎస్సెట్టు-

ఇంటికో ఎన్నారై కావడమే ఇప్పటి టార్గెట్టు-

ఇంటూ నలభైల కోసం కలల్ని దాటి

కల్లోలాల్ని దాటి

దూరాంతరాల్లో త్యాగాల్ని దాటి

ప్రవహించి వస్తాం-

తీరా-

ఉగాది పచ్చడిలో వేపపువ్వుండదు

వినాయక చవితికి నిమజ్జనముండదు

దీపావళికి ఆకాశంలో చుక్కలు లెక్కెట్టాల్సిందే

కాల్చాల్సిన క్రేకర్లన్నీ ఎవరిదో జూలై నాలుగులో రాల్చాల్సిందే-

నువ్వు దు:ఖిస్తే హత్తుకోవడానికి చలొక్కటుంటుంది

దిగులు పడితే గుండె నిబ్బర పర్చడానికి గాలొక్కటుంటుంది

గంభీరంగా నిల్చునే గడ్డి కొండలూ

మేఘాలు ముసిరిన మంచు ఉదయాలూ

నిట్రాటల్లా నిల్చున్న రెడ్ వుడ్ చెట్లు

రంగు రంగుల పుష్ప విన్యాసాలూ వుంటాయి

డబ్బు దండిగా పిండి విలాసాలు రాల్చే మాల్ లు

ఎట్నించెటో తీసుకెళ్ళే పాశ్చాత్య పోకడలూ వుంటాయి

ఇంటూ నలభై లో

క్షణక్షణం- ప్రవాస బతుకు పోరాటంలో

నీతో సంభాషించేదెవరు?

నీతో పంచుకునేదెవరు?

నీతో గమ్యంచేరేదెవరు?

నీతో ఆగకుండా ప్రయాణించేదెవరు?

నీ వెన్ను నిమిరేదెవరు?

నిన్ను ప్రేమించేదెవరు?

చివరికి మిగిలేదెవరు?

నువ్వు ఇంటూ నలభై

నలభై ఇంటూ నువ్వు

………….

http://www.navyaweekly.com/2010/oct/20/page32.asp

ప్రకటనలు
This entry was posted in కవితలు and tagged , , . Bookmark the permalink.

5 Responses to ఇంటూ నలభై

 1. sunamu అంటున్నారు:

  The angst of ineluctable alienation from roots is well expressed. you have deftly crafted the native images into the poem.

 2. kalageeta అంటున్నారు:

  Thanks Rao garu-

 3. పిఆర్ తమిరి అంటున్నారు:

  గీత గారూ…..
  వాస్తవ పరిస్థితుల్ని హృద్యంగా చెప్పారు… వర్తమాన ఆర్థిక ప్రపంచంలో ఆర్దత నిండిన మనసు వ్యథల్నీ ఆవిష్కరించిన తీరు బావుంది…

 4. kalageeta అంటున్నారు:

  Thank U-

 5. bujji అంటున్నారు:

  chaala baagundhandi…intoo nalabai…nalabai into nuvvu…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s