నా కళ్లతో అమెరికా-1(శాన్ ఫ్రాన్సిస్కో)

శాన్ ఫ్రాన్సిస్కో

2008 ప్రారంభంలో అమెరికా వచ్చాం. వరు కిండర్ గార్డెన్ లో ఉంది. మేం ఉన్న ఊరి పేరు “మౌంటెన్ వ్యూ “. చుట్టూ ఎటు చూసినా కనుచూపుమేర కొండలు కనిపిస్తాయి కాబట్టి  ఆ పేరు వచ్చిందట. ( ఈ ఊరి గురించి మరో సారి చెప్తాను లెండి). శాన్ ఫ్రాన్సిస్కో సిటీ నించి మేం దాదాపు 40 మైళ్ల దూరం లో ఉంటాం. కారులో వెళ్తే గంట కూడా పట్టదు. ఇక బస్సులు, రైళ్లు కూడా ఇక్కడి నించి బానే ఉంటాయి.
ప్రయాణం
మేం మొదటి సారి వెళ్లినపుడు బస్సెక్కేం. మా ఇంటి నించి పాలో ఆల్టో  బస్టాండు వరకు కారులో వెళ్లి అక్కడ పార్కింగు లో కారు వదిలేసి, మిల్ బ్రే  వరకు ఒక బస్సు, అక్కడి నించి  సిటీ  బస్సులు. వరు ఒకటే గోల ఎప్పుడు బస్సు దిగుతాం అని. మిల్ బ్రే వరకే గంటన్నర పట్టింది మరి. బస్సు ప్రతి సిగ్నల్ దగ్గర బస్టాపు లోను ఆగుతుంది. పావున్నర మైలుకో సిగ్నలు.  ఉదయానే కాస్త వండుకుని, కాసిన్ని స్నాక్స్ బాగ్ లో నింపుకున్నాం కాబట్టి సరిపోయింది. ఎంతసేపు చూసినా ఒకటే దృశ్యం  బస్సు బయట. మా ఊరికి, దారిలో ఊర్లకి తేడా లేనేలేదు.( ఎంత దూరం వెళ్లినా ఇంతే కాలిఫోర్నియా మొత్తం టౌన్ ప్లానింగ్ ఒకేలా ఉంటుందని తర్వాత అర్థం అయ్యింది). ఒకే లాంటి  ఇళ్లు, షాపింగు కాంప్లెక్సులు. ఒక అంతస్థు కంటే ఎత్తులేని భవనాలు. ఊరి తర్వాత ఊరు కనెక్టివ్ గా ఉంటూనే ఉన్నాయి. అసలే ఊరు ఎక్కడ ఎండ్ అవుతుందో కూడా తెలియదు.
 పోనీ మట్టి రంగు వగైరా ఏమైనా తేడా ఉందేమో అనుకుంటే అసలు మట్టి కనిపిస్తేనా?  చక్కగా గోరు వెచ్చని  ఎండగా  ఉంది దారంతా.  ఏప్రిల్ నెల ఇక్కడ వసంత కాలం. బయటంతా రోడ్ల కార్నర్స్ లో  రంగు రంగుల పూలు, పచ్చని పచ్చిక గార్డెన్ లు.  కనుచూపు మేరలో నీట్ గా, పరిశుభ్రంగా ఉంది. బస్సులో మాతో కలిపి మహా అయితే ఇంకో నలుగురు ఉన్నారు. ఇక రోడ్డు మీద ఎక్కడా నడిచే మనిషి కనపడడేం!  హారన్ లు అత్యంత అవసరమైతే తప్ప మోగించరెవరూ. బస్సులో నిశ్శబ్దం. చుట్టూ బయట నిశ్శబ్దం. రణగొణ నించి కొత్తగా వచ్చిన వాళ్లకి ఈ నిశ్శబ్దం అలవాటు కావడానికి బాగా సమయం పడుతుంది.
తీరా మిల్ బ్రే లో దిగేసరికి బయటంతా దట్టమైన మంచు ఆవరించి వుంది. ఇంటి నించి బయలు దేరేటప్పుడే వెదర్ రిపోర్ట్ చూసుకోవాలని అప్పటికింకా తెలీదు మాకు.  అయినా శాన్ ఫ్రాన్సిస్కో లో ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేమని ఆఫీసులో ఎవరో చెప్పారట మా సత్యకి. నయమే స్వెట్టర్లు తొడుక్కున్నాం. మరో అరగంట తర్వాత సిటీ లోకి వెళ్లే బస్సు దొరికింది. ఆ అరగంట చలిలో చిన్న పిల్లతో మా పాట్లు చూడాలి. చలిగాలిని తట్టుకునే షెల్టర్ లేదు అక్కడ. బాగా వణికి పోయేం నేనూ, వరు.
ఇక మెచ్చుకోదగ్గ విషయం ఏవిటంటే బస్సుల్లో ఒక స్టాపుకైనా,  చివరి స్టాపుకైనా  టిక్కెట్టు ఒకటే. అలా $1.75 టిక్కెట్టు తో దాదాపు 30 మైళ్లు ప్రయాణం చేసేం. వెచ్చగా హీటర్ ఉన్న బస్సు లోంచి బయటకు దిగాలనిపించలేదు. లక్కీగా మరో గంటలో మేం గోల్డెన్ గేట్ బ్రిడ్జీ దగ్గర దిగేసరికి ఎండ వచ్చింది.
గోల్డెన్ గేట్ బ్రిడ్జ్
విఖ్యాతమైన గోల్డెన్ గేట్ బ్రిడ్జి ని మబ్బుల్లోంచి బయటికొస్తున్న సూర్యుడి వెల్తురు లో చూసేసరికి అప్పటి వరకు ఉన్న చలిగిలి అన్నీ ఎగిరి పోయాయి. పొగ మంచు లోంచి కొంచెం కొంచెం గా దర్శనమిస్తూ తళుక్కున మెరిసే కిరణాలు లోంచి అప్పుడే తాళ్లతో చేతులు లాగి బంధించిన గంధర్వుడు ప్రత్యక్షమైనట్లు  అనిపించింది. మానవ నిర్మిత అద్భుతం ఒకటి ధీర గంభీరంగా నిలువెత్తున నిలిచింది.
“అమ్మా! అదేంటి గోల్డెన్ గేట్ బ్రిడ్జి రెడ్ కలర్ లో ఉంది? గోల్డు కలర్ లో లేదు?” అంది మా వరు.
In his memoirs, John C. Frémont ,Captain, topographical Engineers of the U.S. Army circa (1846) wrote, “To this Gate I gave the name of “Chrysopylae”, or “Golden Gate”; for the same reasons that the harbor of Byzantium was called Chrysoceras, or Golden Horn. .” అనిచెప్తే ఆ పిల్లకి ఎలాగూ అర్థం కాదు కదా అందుకని అదుగో ఎండకి బంగారంలా మెరుస్తోందిగా. అన్నాను. “ఓహో” అని “అమ్మా నేను కూడ మెరుస్తున్నా” అంది.
పూర్తిగా ఇనుముతో కట్టబడిన 4200 అడుగుల పొడవైన బ్రిడ్జ్ అది. సముద్రం భూమి లోకి చొచ్చుకుని వచ్చిన ముఖ ద్వారం లో అటు ఇటు రెండు భూభాగాల్ని కలుపుతూ కట్టబడింది.   ఇటుక రంగులో ధగద్ధగమానంగా కనిపించే బ్రిడ్జ్ ఒక మహాద్భుత కట్టడం.
గంటలు ఇట్టే గడిచి పోయాయి బ్రిడ్జ్ మీద వరకు వెళ్లి చూసొచ్చే సరికి . అప్పటికే మళ్లా మబ్బు ముంచుకు రావడం తో విధిలేక వెనక్కు మరలాల్సి వచ్చింది.
ఇప్పటికి మళ్లా చాలా సార్లు వెళ్లినా ప్రతి సారీ కొత్త అనుభూతి కలగుతుంది అక్కడ.
మరుసటేడాది  కోమల్ పదో తరగతి పరీక్షలు రాసి వచ్చాక  వెళ్లాం.
ఈ సారి రైలు ప్రయోగం చేసాం. మౌంటైన్ వ్యూ డౌంటౌన్ నించి కొంతదూరం కాల్ ట్రైన్ లోనూ అక్కడి నుంచి బార్ట్ రైల్లోను తిన్నగా శాన్ ఫ్రాన్సిస్కో డౌంటౌన్ కు వెళ్లాం. ఎటు చూసినా ఆకాశ హర్మ్యాలు, అటు ఇటు తిరుగుతూ తిరిగే బోల్డు జనం. నిజానికి ఇక్కడ మామూలుగా మనుషులు కనిపించక,  ఇలా మనుషులు  కళకళ్లాడుతూ తిరగడం చూస్తే ప్రాణం లేచి వస్తుంది.
కేబుల్ కార్
అక్కడి నుంచి Fisherman’s Wharf వరకు చరిత్రాత్మకమైన కేబుల్ కార్ ఎక్కాం. శనాదివారాల్లో విపరీతమైన పర్యాటకుల వల్ల కేబుల్ కార్ కోసం లైన్ లో 2 గంటలు నిలబడేసరికి ఉత్సాహం కాస్తా పోయింది పిల్లలకు. కానీ  కేబుల్ కార్ వచ్చినపుడల్లా దానిని వెనక్కి తిప్పేందుకు ఒక గుండ్రటి చట్రం మీదకు తీసుకొచ్చి నెమ్మదిగా చక్రం తిప్పినట్టు మొత్తం తిప్పి మళ్లీ పట్టాలెక్కించడం, ఒకే ఒక రైలు పెట్టె లాంటి పెట్టెలో తో రోడ్డు మీద  ప్రయాణించడం సరదా పుట్టించింది. ఇక్కడి కేబుల్ కార్ కు కేబుల్  పైకేమీ కనిపించకుండా పెట్టె కిందనే పట్టాల మధ్య ఉండడం విశేషం.  కేబుల్ కార్ ను అక్కడక్కడా ఆపుతూ అక్కడి నించి కనపడే, దారిలో వచ్చే విశేషాలన్నీ గైడులా వివరిస్తాడు డ్రైవర్. ఇక మేమెక్కిన కేబుల్ కార్ డ్రైవర్ ప్రయాణీకుల్ని అలరిస్తూ విసిరే చమక్కులు మరో విశేషం.
డౌంటౌన్ దాటిన దగ్గర్నించి నుంచి సముద్రం ఒడ్డు వరకు అటూ ఇటూ దగ్గర దగ్గరగా ఉన్న ఒకే లాంటి ఇళ్ల మధ్య నుంచి విశాఖ పట్నం లోని వీధుల్లా కొండ ఎక్కడం, దిగడం గా ఉంటుంది దారంతా. అయితే వరుసగా దాదాపు మైలు ఎత్తు నిలువుగా పైకి వెళ్లి, మళ్లీ దిగుతూ వస్తాం. అలా నిలువుగా కేబుల్ కార్ వేగంగా వస్తూన్నపుడు అసలా పెట్టె ఆధారాన్ని వదిలేస్తుందేమో అన్న థ్రిల్ కు గురవుతాం. ఒక పక్క  ఎదురుగా  దిగువన మహా సముద్రం లో  లెక్కలేనన్ని పడవలు , దూరంగా ఒంటరిగా నిలబడ్డ  alcatraz  ద్వీపం … విశాలమైన సముద్రపు రహస్యాద్భుత దృశ్యం లోకి అలా  జారుడు బల్లలా జారుతూ వెళ్లడం మరపురాని  అనుభూతి. అక్కడ సముద్రం, భూమీ నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు పోటీ పడ్తుంటాయి.
ఫిషర్మాన్ వార్ఫ్ & పియర్లు
సముద్రం ఒడ్డునే దాదాపు రెండు మూడు మెళ్ల దాపున వరసగా లోపలికి జెట్టీ ల లాంటి నిర్మాణాలు. ఒక్కొక్క Pier మీద  కొన్ని రకాలైన ఎంటర్ టైన్మెంట్లు, రెస్టౌరెంట్ లు ఉంటాయి.  అక్కడ పాత నౌకల్ని, జలాంతర్గామిని  సందర్శన కోసం ఉంచారు.  పిల్లలని విశేషంగా ఆకట్టుకుంటాయవి. Pier చివరి వరకూ వెళ్తూంటే దిగువన సముద్రపు రాళ్ల మీద కనిపించే సీలయన్లు, పక్కనే పెద్ద పావురాల్లా ఎగిరే సీగల్ పక్షులు, వణికించే సముద్రపు గాలి బైటి ప్రపంచం నించి దూరానికి వాటితో బాటూ లాక్కెళతాయి. Piers నుంచి దగ్గర్లోని ఐలాండ్ కు, సముద్రపు ఒడ్డునే మరో 50 మైళ్ల పరిధి లో ఉన్న పట్టణాలకు షిప్పు టూర్ లు, శాన్ ఫ్రాన్సిస్కో నగర పర్యాటనకు ఓపెన్ బస్ టూర్లూ ఉంటాయి.
నడుస్తూ ఉంటే ఎక్కడా ఖాళీ లేకుండా జనం, రోడ్డు నిండా  ఆగిపోయిన ట్రాఫిక్, అక్కడక్కడా అడుక్కునే వాళ్లతో ఇండియా ని తలపిస్తుంది. కానీ విచిత్రం ఏమిటంటే అంత జనం తిరిగే ప్రదేశం కూడా పరిశుభ్రంగా ఉంటుంది. ఒక రకమైన క్రమశిక్షణ ఉంటుంది ఇక్కడి జనానికి. ఎక్కడా ఉమ్ములు వేయడం, చెత్త రోడ్లపై పారేయడం వంటివి కూడా కనిపించవు.
ఎంత సేపు తిరిగినా అలసట అంత త్వరగా రాదు. ఇక్కడి వెల్తురు లో ఒక రకమైన తేడా ఉంటుందని నాకనిపిస్తుంది. బైట ఎంత చలిగా ఉన్న ఎండ చాలా కాంతి వంతంగా ఉంటుంది. ఆ brightness కి కళ్లు మిరుమిట్లు గొల్పుతుంటాయి. ఏ కాలంలోనైనా నల్ల కళ్లద్దాలు పెట్టుకుంటారిక్కడ. ఇక్కడ రోడ్ల పక్కన జరిగే చిన్న చిన్న గారడీ ప్రదర్శనలు చేసేవారు, సంగీత వాయిద్యాలు, పాటలతో  పొట్టపోసుకునే వాళ్ళు చిన్నా, పెద్దా అందరినీ అలరిస్తారు. గుంపులు, గుంపులుగా మనుషులు చుట్టూ చేరి నిలబడడం చూసేసరికి నాకు చిన్నప్పటి సంతలో మనుషులు జ్ఞాపకం వచ్చి భలే సంతోషం వేసింది.
 కారులో వచ్చినపుడు పార్కింగుకు తప్పని సరిగా గంటకు $7 చొప్పున పెట్టవలిసిందే. మరోసారి వచ్చినపుడు అక్కడంతా తిరిగొచ్చి $30 సమర్పించాం పార్కింగుకి. అంతే కాదు సెలవు దినాల్లో కారు పట్టుకుని బీచ్ రోద్ కు రావడం అంటే గంటలు వృథా చేసుకోవడమే. విపరీతమైన రద్దీ ట్రాఫిక్ లో ఇరుక్కుపోతాం. మాకు కార్ పార్కింగులో పెట్టడానికి, తిరిగి తెచ్చుకోవడానికి, ఒక సిగ్నల్ దాటడానికి 3,4 గంటలు పట్టింది. సెలవు దినాల్లో దూరంగా మరెక్కడైనా పార్కు చేసుకుని బస్సుల్లో రావడం మేలు.
భోజనాలు- పాట్లు
ఇక తిండి విషయానికొస్తే ఇక్కడి food కు అలవాటు పడ్డానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పటికీ బయటికెళ్లొస్తే  ఇంటికొచ్చి మళ్లా ఎప్పుడు తింటామా అని ఆత్రంగా ఉంటుంది.  bread bowl  లో ఇచ్చే  clam chowder ఒక వెరైటీ ఇక్కడ. గిన్నెలాంటి బ్రెడ్ తో తయారు చేసిన బౌల్ లోపల clams, పొతాతోస్, క్రీం తో తయారు చేసిన చిక్కని సూపు లాంటిది వేస్తారు.  ఒక రకమైన పుల్లని బ్రెడ్, చప్పటి చౌడర్ తో కలిపి వేడిగా వేడిగా తింటారు.
 మాంస విశేషాలు చాలానే ఉంటాయి . ఏదీ ఉప్పూ, కారాలు, మసాలాలు లేకుండా తినడం అలవాటు అయ్యేంతవరకు నచ్చవు. ఇక్కడ సలాడ్లలో వాడడానికి మనకు దొరకనివెన్నో ఆకుకూరలు ఉంటాయి. వాటితో కలిపిన చిన్న కారట్లు, గోళీలంత ఉండే టమాటా లు చాలా రుచిగా ఉంటాయి.
చైనా టౌన్ & డౌంటౌన్
వెనక్కి డౌంటౌన్ కి తిరిగొచ్చే దారిలో పొడవుగా, అడ్డం గా కొన్ని వీధుల వెంబడి చైనా టౌన్ ఉంటుంది. చేపలు కూడా వీధుల్లో పెట్టి అమ్మడం, వీధి భోజనం శాలలు, కూరగాయల కొట్ల వరుసలో దుర్గంధం చూస్తే అది అమెరికాయేనా అని అనుమానం వస్తుంది. పుర్తిగా చైనీయుల కళారూపాలు, సంస్కృతి, ఆహార వ్యవహారాలు, భాషావేషాలు కనిపిస్తాయి. బస్సుల్లో మనుషులు కిక్కిరిసి నిలబడి ఉంటారు. మేం ప్రయాణించినంతసేపు సీటే దొరకలేదు. ఆలా జనం మధ్య తిరుగుతూ కనిపించినవన్నీ బేరమాడుకుంటూ తిరగడం, అక్కడ దొరికే ఆసియా దేశాలనించి వచ్చిన పళ్లని కొనుక్కుని తిరుగుతూ తినడం బాల్యాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చింది.
 డౌంటౌన్ లో చాలా పెద్ద కోటలా కనిపించే Civic Center,  స్పానిష్- అమెరికా యుద్ధ విజయానికి ప్రతీకగా నిలబడ్డ 90 అడుగుల  స్తూపంతో నలుచదరమైన అతి పెద్ద స్టేజ్  Union Square చూడదగ్గవి.
క్లిఫ్ హౌస్ & సుత్రో బాత్స్
కార్లో వచ్చినప్పుడే చూడగలిగిన ప్రదేశాలు మళ్లీ మళ్లీ వెళ్లినపుడల్లా చూస్తూనే ఉంటాం.
GPS లేకుండా ఇక్కడ కారు నడపలేం. దారీ తెన్నూ చెప్పే మరో దిక్కు లేదిక్కడ. అయితే అదొకో సారి హాస్యాస్పదం గా కూడా పనిచేస్తుంది. ఏమీ లేని చోటికి తీసుకెళ్లి, ‘you have arrived your destination’ అని చెపుతుంది. ఏదో location కి  వెళదామంటే వేరే ఏదో చోటికి తీసుకెళ్తుంది.
అలా ఒకసారి మేమెటో తప్పిపోయి మరో దారి పట్టుకుని వెళ్తూండగా హఠాత్తుగా కనిపించిందా ప్రదేశం.
సముద్రం ఒడ్డున ఒక ఏకాకి పర్వతం మీద కట్టిన Cliff House ఇప్పటికి 5 సార్లు కట్టబడిందట. 1893 లో మొదటి సారి కట్టిన తర్వాత రెండు సార్లు అగ్ని ప్రమాదాలకు గురైంది.  ఇక దిగువగా ఏదో పాత కాలపు స్నానవాటికలా కనిపించే  Sutro Baths 1897 లో ఒక గొప్ప Indoor Swimming Pools సముదాయం. ఇక్కడ 6 ఉప్పు నీటి, ఒక మంచి నీటి స్నానవాటికలు ఉండేవట. ఇవి కాక ఒక మ్యూజియం, 8000 మంది వీక్షించగలిగేలా ఒక నాటక శాల ఉండేదట. ఇప్పుడు క్లిఫ్ హౌస్ ఒక హోటల్, గిఫ్ట్ సెంటర్ కాంప్లెక్స్. కిందకు వెళ్లేందుకు ఇట్నించి సరైన దారి లేదు. అయితే ఆ హోటల్ కిందుగా దిగి వెళితే పూర్తిగా శిథిలావస్థ లో ఉన్న స్నానవాటికల గోడల మీంచి నడుచుకుంటూ వెళితే సముద్రం రొద వినిపించే చిన్న గుహలో  మార్గానికి వెళుతుంది. ఇట్నుంచి, అట్నుంచి సముద్రం కనిపించే చిన్న గుహ అది. లోపలికి వెళ్లి చూద్దుము కదా! హోరున రొద పెడుతూ ఒక పక్కగా లోతున రాళ్లని ఒరుసుకుంటూ సముద్రం,  ధభాలున రాళ్లని ఢీకొని గుహలోకి చొచ్చుకుని వచ్చే అలలు. ఒక్క సారిగా ఒళ్లు గగుర్పొడిచే అనుభూతి. నలుపు, చీకటి, రాళ్లు, అలలు, ముఖాన చిమ్మే మంచు లాంటి చల్లని నీళ్లు. గట్టిగా అరుచుకుంటూ వచ్చిన దారి వెంటే పారిపోయి వచ్చాం.
మన దగ్గర సముద్రంలా సముద్రం లో ఇక్కడి పసిపిక్ సముద్రం లో దిగలేం. అయిదు నిమిషాల్లో పాదాలు చలికి గడ్డకట్టుకుపోతాయి. ఓర్చుకోలేక బయటికి వెంటనే పరుగెత్తి  వస్తాం. చుట్టూ నీళ్లున్నా తాగలేనట్లు చక్కగా సముద్రం కనిపిస్తూన్నా స్పృశించలేని అలల చలి పులి. ఏ సీజను లో వెళ్లినా ఎన్ని coast  లు తిరిగినా ఇదే పరిస్థితి. క్లిఫ్ హౌస్  ఎత్తు నించి దూరంగా కనిపించే గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ , అలల  కెరటల మీద బంగారు రంగు పూతలేసినట్లు కెరటాలు.
 ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని ఏకకాలం లో చూడగలిగే విశాల దృశ్యం చూడాలంటే శాన్ ఫ్రాన్సిస్కో
  వెళ్లవల్సిందే. చిన్న రోడ్లతో,  ఎక్కి దిగే కొండలతో ,  క్రమ బద్ధమైన ఒకే లాంటి  బొమ్మరిళ్ల లాంటి ఇళ్లతో  వైవిధ్యమైన నగరం ఇది.
అమెరికా సిటీల్లో  అన్నీ ఇళ్లే అనుకుంటే పొరపాటే. మంచి సిటీ మధ్యలో ఉద్యాన వనాలు, జూ పార్కులు ఉంటాయిక్కడ. ప్రతి కాలనీకి ఒక పార్కు, విధిగా పచ్చదనం ఉండి తీరాల్సిందే.
…………………………
(విహంగ- నవంబరు,2011 ప్రచురణ)

నా కళ్లతో అమెరికా-1

ప్రకటనలు
This entry was posted in నా కళ్లతో అమెరికా(Travelog) and tagged . Bookmark the permalink.

5 Responses to నా కళ్లతో అమెరికా-1(శాన్ ఫ్రాన్సిస్కో)

 1. kalageeta అంటున్నారు:

  Thanks Murthy garu-

 2. sunamu అంటున్నారు:

  గీత గారూ,
  చాలా చక్కగా ఉంది మీ కళ్ళతో చూస్తుంటే అమెరికా. అప్పుడే 3 ఏళ్ళయిపోయిందా మీరు అమెరికా వెళ్ళి? మీ లేక్ తహౌ కవిత కూడా చదివేను. చాలా బాగుంది. అభినందనలతో
  మూర్తి

 3. kalageeta అంటున్నారు:

  Thanks Jnani garu –
  Madhavi garu Moffet daggaralo untamu-Pl call me at 650-641-0889

 4. Madhavi అంటున్నారు:

  మాదీ అదే ఊరండీ….. ఎక్కడా ఉండటం….

 5. jnani అంటున్నారు:

  చలా బాగా వ్రాసారండి.నెను నాలుగు యేళ్ళ క్రితం ట్రెసి అనె ఊరులొ ఉండె వాడిని.అది సాంఫ్రాన్సిస్చ్కొ నుండి 2 గంత్గల ప్రయానం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s