నా కళ్లతో అమెరికా-2(యూసోమిటీ)

యూసోమిటీ

మే నెలాఖర్లో  వరసగా సెలవులు కలిసి రావడంతో ఎక్కడికెళ్దామని పిల్లల్ని అడగగానే ఏకగ్రీవంగా చెప్పారు. ” యూసోమిటీ ” అని.
Yosemite National Park & Valley  మౌంటెన్ వ్యూ నించి ఎంత దూరం? “అనగానే  ” ఉండు నిమిషంలో మా గూగుల్  బాబాయినడిగి చెపుతాను అన్నాడు సత్య.” డాడీ! నీకిక్కడ బాబాయి ఉన్నాడా?”  అంది వెంటనే వరు.

” ఊ! ఇడిగో వచ్చేసాడు. 200 వందల మైళ్లకు పైనే అంటున్నాడు.” అని maps.google.com లో దారి చూపించాడు”.అప్పట్నించీ మేం ఎక్కడికెళ్లాలన్నా  “అమ్మా! డాడీ వాళ్ల బాబాయినడొగొచ్చుగా ”  అంటుంది వరు. ఆ మధ్య వేణుగోపాల్ గారు అమెరికా  వచ్చినపుడో మాటన్నారు. “అమెరికా లో కారు లేకపోతే కాళ్లు లేనట్లే”  అని. అది అక్షర సత్యం. ఇక్కడ కారు లేకుండా ఎక్కడికీ వెళ్లలేం. బస్సులు అన్ని చోట్లకీ ఉండవు. అసలు ఆటో అనే పదం లేనేలేదు. ఇక టాక్సీ లలో వెళితే సరేసరి జేబు ఒకరోజులో ఖాళీ.

ప్రయాణం

ఉదయానే ఇంటినించి 8 గంటలకల్లా బయలుదేరాం. మా ఇంటి నుంచి ఓ రెండు మూడు ఫ్రీవేలు దాటేంత వరకు తెలుగు పాటలు వింటూ కూర్చోవడం పనిగా పట్టుకున్నాడు సత్య. పిల్లలు పోర్టబుల్ డీవీడీ ప్లేయరు, కేసెట్లు తెచ్చుకుని సినిమాల మీద సినిమాలు చూసేస్తున్నారు. నేను బయటకు చూస్తూ “అదిగో విశేషం ” అని చెప్పేవరకు ఎవరి లోకం వారిదన్న మాట. నిజానికి ఎంత దూరమెళ్లినా ఒకేలాంటి ఫ్రీ వేల మీద డ్రైవింగు లో మజా ఏమీ ఉండదు ఇక్కడ. పట్టణాలు దాటి కొండల మధ్యకు రాగానే హాయిగా శ్వాస ఆడినట్టనిపించింది నాకు. దారిలో మొదటిసారి వ్యవసాయ క్షేత్రాలని చూసే అవకాశం కలిగింది. చిన్నా చితకా మళ్లు కాదు. వందల ఎకరాలు ఒకే కంపెనీ చేతిలో నడుస్తాయి. అలాంటి చోట అక్కడ పండే పళ్లు, కూరగాయలు ఎక్కువ ఖరీదు ఉన్నా, ఫ్రెష్ గా అమ్ముతూంటారు. పిల్లలు తియ్యటి నారింజ పళ్లని తెగ తిన్నారు. ఇక  మధ్యాహ్నం 12 గం.కు జేంస్ టౌన్ కి చేరేం.

1849 ప్రాంతం లో కాలిఫోర్నియా లో ఈ ప్రాంతంలో బాగా బంగారం దొరికేదట. అసలు దేశం లోనే మొదటి బంగారపు గనుల్ని ఇక్కడి Woods Crossing  లో కనుగొన్నారట.   అప్పట్లో ఈ నిక్షేపాల కోసమే ప్రాణాలకు తెగించి ప్రపంచ వ్యాప్తం గా ఇక్కడికి పోటీలు పడి పరుగెత్తుకొచ్చేవారట. అలా ఆ కాలపు Gold Rush లో  ఇక్కడికి కొచ్చిన వారిని ” ఫార్టీ నైనర్స్ ” అంటారు. అయితే ఇప్పటికీ క్కడ మనిషికి $40 డాలర్లు కట్టి వాళ్లు ఇచ్చిన ప్రదేశం లో 2 గంటల పాటు బంగారం వెతుక్కోవచ్చు. మేం మాత్రం అది మానేసి  దగ్గర్లో ఉన్న ” రైల్ టౌన్ & మ్యూజియం చూడడానికెళ్లాం”. 18 వ శతాబ్దం నించీ వాడిన బొగ్గు ఇంజన్లని, అప్పటి ఒకో పెట్టెని ఒక  ప్రదర్శనకు ఉంచారు. చారిత్రత్మకమైన sierra railway  కు సంబంధించిన ప్రతి ఒక్కటీ (పట్టాలతో సహా) ఇక్కడ సాక్షాత్కారమవుతాయి.గంట సేపు గైడు చెప్పిన విశేషాలన్నీ అత్యంత శ్రద్ధగా వింది వరు.” అమ్మా! వీటి కంటే గొప్పవి మనకు ఇండియాలో ఉన్నా ఇలా ప్రదర్శనకు పెట్టరు. వీళ్లు చూడు ఎలా డబ్బు చేసుకుంటున్నారో” అన్నాడు కోమల్.ఆ పరిసరాలు, పట్టాలు, ఆ బోగీలు చూస్తే  నాకు రాజమండ్రి రైల్వే క్వార్ట్రర్సు పరిసర ప్రాంతాలు గుర్తొచ్చాయి. అయితే  ఇక్కడ అక్కడలాగా  మనుషులు కనపడరు. అంతే తేడా. “అమెరికా లో రాజమండ్రి ఇక్కడుందన్నమాట అని నవ్వుకున్నాం. అక్కడే ఉన్న పార్కు బెంచీల మీద కూచుని, చుట్టూ మమ్మల్నే గమనిస్తున్న సరుగుడు చెట్ల లాంటి చెట్ల  ఆకుల వెల్తురు నీడ ల్లో ఇంటి నుంచి తెచ్చుకున్న పులిహోర, పెరుగన్నం ఇష్టంగా తిన్నాం ఏదో రైలు కోసం ఎదురు చూస్తూన్న ప్రయాణీకుల్లా. అప్పటికి మాతో వచ్చిన నలుగురైదుగురు యాత్రికులు, సిబ్బందీ అందరూ మాయమై మేం మాత్రమే మిగిలాం. ఆ టౌన్ పరిసర ప్రాంతాల చుట్టూ తిప్పి వెనక్కు గంట లో తీసుకొచ్చే రైలు టూరు ఆ రోజు లేకపోవడంతో పిల్లలు చెట్ల చుట్టూ తిరుగుతూ ఆట మొదలు పెట్టేరు. సత్య  నిర్మానుష్యంగా, నిశ్శబ్దం గా  ఉన్న పట్టాల పక్కనే కాసేపు  నడక మొదలెట్టాడు. సామాన్లు సర్దుతూంటే నాకు మా పిల్లల్లో నేను, మా అన్నయ్య, చెల్లి,  నాలో మా అమ్మ, సత్య లో మా నాన్న కనిపించారు. ఇదే కదా జీవితం అనిపించింది. అక్కడ్నించి మా బస ‘సొనోరా ‘ కి 8 మైళ్లు. అవన్నీ పేరుకి పల్లెటూళ్లు కానీ టౌన్ ప్లానింగులో సిటీకి, వీటికి భేదమే లేదు. మనుషుల వేష భాషల్లోనూ తేడా లేదు.దార్లో పెద్ద పెద్ద పొలాలు, వాటిని ఆనుకుని పెద్ద ఇళ్లు. మధ్యలో ఒక ఫాం దగ్గర ఆగి పుచ్చకాయలు, నారింజలు, మొక్కజొన్నలు కొన్నాం. అమెరికన్ మొక్కజొన్నలు ఉడక పెట్టుకుని తినడానికి మాత్రమే పనికి వచ్చే మెత్తటి గింజలున్నవి. మేమున్న హోటల్ లో పెద్ద స్విమ్మింగ్ పూల్ ని ఆనుకుని ఒక  jacuzzi (చిన్న హాట్ వాటర్ పూల్) ఉంది. మేం  హోటల్ లో చెకిన్ అవుతూనే పిల్లలు పూల్ కి పరుగెత్తారు. వెచ్చవెచ్చని నీటిలో చాలా సేపు అందరం సేద తీరేం. సొనోరా సముద్ర మట్టానికి 1000 మీ ఎత్తులో చుట్టూ పర్వతాలతో ఉన్న చక్కటి ప్రదేశం. 5000 మీ ఎత్తుకి వెళితే యూసోమిటీ.

సొనోరా నించి యూసోమిటీ
అక్కడినించి దాదాపు 90 మైళ్లు పూర్తిగా ఘాట్ రోడ్డు లో ప్రయాణం.  దారిలో టన్నెల్స్ లోంచి వెళ్తూంటే పిల్లలు గుహ దాటేంత వరకు “ఒహోయ్! ” అని ఒకటే అరుపులు. నాకు అరకు లోయ వెళ్లే దారిలో టన్నెల్స్ లో రైలు ప్రవేశించినప్పుడల్లా చిన్న వయసులో  చేసిన అల్లరి జ్ఞాపకం వచ్చింది. యధావిధిగా మా GPS ఒక చోట తప్పుదారి పట్టించింది. మళ్లీ అసలు రూట్ లోకి చేరేందుకు మరో 20 మైళ్లు అధికంగా ప్రయాణించవలిసి వచ్చింది. కానీ అందువల్ల కొండల లోపలి చిన్న పశువుల శాలలు, వాటిని ఆనుకుని వున్న చిన్న చెక్క ఇళ్లు చూడ గలిగేం. కానీ ఎక్కడో ఒక ఇల్లు. అంత నిర్మానుష్య ప్రదేశాల్లో ఎలా ఉంటారో అనిపించింది. ఇక్కడ  వంటి నిండా బొచ్చుతో బొద్దుగా ఉండే ఆవులు తప్ప ఎక్కడా గేదెలు ఉండవు. అసలు milk products అన్నీ ఆవులవే. ఇక గొర్రెలో, మేకలో తెలీనివి ఒకటో అరో చాలా తక్కువగా కనిపించాయి. విశాలమైన పసుపు రంగు ఎండు గడ్డి కొండలు. వాటి మధ్య చిన్న తారు రోడ్డు మీద మా కారు ఒక్కటే ఒంటరి ప్రయాణం. దారిలో ఎక్కడా నడిచే  మనిషి ఒక్కరు కూడా కనపళ్లేదు.
అసలు యూసోమిటీ లోయ ప్రాంతానికి 20 మైళ్లు ముందుగానే ఎంట్రెన్స్ గేట్ దగ్గర 20$ ప్రవేశ రుసుము చెల్లించి, మేప్ లు వగైరా వివరాలు తీసుకున్నాం. దారికి ఒక వైపు కొండలు, మరో పక్క దిగువగా పక్కనే పారుతూ చల్లని నీటి ప్రవాహాలు. ఎక్కడి నుంచో వస్తున్న  పెద్ద నీటి ప్రవాహం అక్కడ గుండ్రని రాళ్లని మరింత గుండ్రంగాచేస్తూ చిన్నా పెద్దా సుడులు తిరుగుతూంది. కారు ఆపుకుని నీళ్ల లోకి నడిచేం. మరో ఇద్దరు ముగ్గురు కార్ల వాళ్లూ ఆగేరు మాతో బాటూ. అప్పుడే మంచు ముక్కలు కరిగినట్టు అతి చల్లని నీటిలో ఒక్క నిమిషం కంటే ఎక్కువ నిలబడలేకపోయేం.

ఆ ప్రాంతమంతా డిసెంబరు నెల నించి మార్చి నెల వరకు మంచుతో కప్ప బడి ఉంటుందట. ఆ వారంలోనే బాగా ఎండ కాయడం వల్ల శిఖరాగ్రాల మీద మంచు బాగా కరిగిందట. లోయ లోకి ప్రవేశించక ముందే పలకరించే మొదటి అతిథి “బ్రైడల్ వైల్ ” జలపాతం. పేరుకి తగ్గట్టుగా ఉన్న ఈ జలపాతం సందర్శనకు ముందు మాంచి ట్రాఫిక్ జాములో ఇరుక్కుని సరిగ్గా గంటన్నర కారులోనే గడపవలిసి వచ్చింది. ఇక పార్కింగుకి  ఖాళీ దొరక్క మరో అరగంట వేచి చూసాం. అక్కడి నుంచి కొద్దిగా ముందుకు చెట్ల మధ్య లోంచి నడవాలి. అయితే అప్పటి వరకూ చేసిన నిరీక్షణంతా ఫలించేలా కళ్ల ముందు అద్భుత సాక్షాత్కారం చేసింది బ్రైడల్ వైల్. 620 అడుగుల  ఎత్తునించి స్వర్గం నించి భూమికి దూకినప్పుడు గంగ ఇలాగే ఉంటుందేమో అనిపించేటట్లు హోరున దుమికి లేస్తూన్న జలపాతపు పారవశ్యం లో రెండు చేతులూ చాచి కళ్లు మూసుకుని తన్మయురాలినై ఉండి పోయేను. అదృష్టవశాత్తు బాగా వేడిగా ఉందా రోజు. అంత చల్లని నీళ్లలో తడిసి ముద్దయినా మరో అరగంట లో బట్టలు ఆరిపోయాయి. అంత ఎత్తు నించి పడడం వల్ల గాలికి నీటి తుంపర్లు అటు ఇటూ ఊగుతూ పెళ్లి కూతురి మేలి ముసుగు  లా కనిపించడం వల్ల ఈ జలపాతానికి ఆ పేరు వచ్చిందట. ఉధృత జన ప్రవాహం వల్ల ఎక్కువ సేపు అక్కడే ఉండేందుకు వీలు కాలేదు. మళ్లీ మళ్లీ వెనక్కి చూస్తూ అద్భుత దృశ్యాన్ని గుండెకి హత్తుకుంటూనే ఉన్నాను.
Yosemite అన్న పేరు ఇక్కడి స్థానిక ఆటవిక భాషలోని Uzumati అనే పదం నించి వచ్చిందట. ఆ పదానికి అర్థం ఇక్కడ ఎక్కువగా కనబడే ముక్కుపొడుం రంగు ‘ఎలుగు బంటి ‘ అట. Curry Village  లో టూరిజం ఆఫీస్, స్టోర్స్, కాటేజెస్ ఉన్నాయి. ఇక్కడి కాటేజెస్ లో ఎకామడేషన్ కావాలంటే ఆరునెలలు ముందు గానే రిజర్వు చేసుకోవాలట. అక్కడి నుంచి లోయంతా తిప్పి చూపించే గ్లేసియర్ టూర్ అనబడే ఒక గంట ఓపెన్ బస్ టూర్ కి టిక్కెట్లు తీసుకున్నాం. కానీ బస్ టూర్ టైం అయ్యిపోతున్నా మళ్ళీ మామూలే. కార్ పార్కింగు దొరక లేదు. ఏమి చేయాలో అర్థం కాలేదు మాకు. నేను వీళ్లందరినీ వెళ్లిపోమని కారుతో ఉండి పోవాలని అనుకున్నాను. కానీ అదృష్టవశాత్తు  ఆ టూర్ ని  మరో రెండు గంటలకు వాళ్లే బస్ లో ఫెయిల్యూర్ అని వాయిదా వేసేరు. అయితే టూర్ గ్లేసియర్ పాయింట్ వరకు గాక టన్నెల్ పాయింట్ వరకే అని చెప్పారు.  మళ్లీ మళ్లీ రౌండ్లు కొట్టి బస్ స్టేషనుకు అర మైలు దూరం లో ఒక పార్కింగు స్పేసు సంపాదించాం మొత్తానికి. అసలా టూర్ మిస్సయ్యి ఉంటే మొత్తం టూరే వృథా అయ్యి ఉండేదనిపించింది తిరిగొచ్చాక. ఓపెన్ టాప్ లో కూర్చుని చుట్టూ కొండలు, మధ్య వేలీ లో ప్రయాణిస్తూంటే చిత్రకారుడి అందమైన ప్రాణమున్న చిత్రపటం లోకి పాత్రధారులమై ప్రవేశించినట్లనిపించింది. గైడు మాటలు వినిపించడం మానేసి గాలిలోకి విహంగమై ఎగిరి మనసు పర్వత సానువులపై వాలింది. నునుపైన, ఎత్తైన రాతి కొండలు వాటి ఉత్కృష్ట చరిత్ర వింటూంటే మానవులం ప్రకృతి ముందు ఎంతో చిన్న వాళ్లం అనిపించింది.
టూర్ కల్లా అత్యంత సుందరమైన ప్రాంతం Tunnel View. Wawona tunnel ముఖ ద్వారం నించి కనిపించే ఈ దృశ్యం లో ఒక సం.ర కాలంలో ఒక సీజన్ లో కనపడిన దృశ్యం మళ్లీ కనపడకుండా కొత్త కొత్త దృశ్యాలు ఆవిష్కృతమవుతూంటాయట. అక్కడి నుంచి  అర్థ చంద్రా కారం లో తివాచీ లా యూసోమిటీ లోయని పరిచి నునుపైన పర్వతాలు ఒకటొక్కటిగా దారి పక్కకి తొలగుతూ గౌరవంగా వినమ్రంగా దృశ్యంలోకి జలపాతాల పన్నీరు  కురిపిస్తూ ముందుకు తీసుకెళ్తాయి. 7 ప్రదేశాలు ఒక్క సారిగా చూడగలిగే ప్రాంతమిది. El Capitan, Clouds rest, Half Dome, Sentinel Rock, Cathedral rocks  అనే పర్వతాలు, Bridal veil falls, Horsetail falls అనే జలపాతాలు  ఇక్కడి నించి కనిపిస్తాయి.
అన్నీ గ్రానైట్ పర్వతాలే అయినా ఇందులో El Capitan నిట్ట నిలువుగా ఉన్న గోడ కట్టి  ఒకే రాయి పేర్చినట్టున్న పర్వతం. ఇది పర్వతారోహకులకు   ఛాలెంజ్ అట. ఏటా చాలా మంది దీన్ని అధిరోహించడానికి పోటీలు పడ్తూంటారు.  కింద నుంచి చీమల్లా కనిపించే ఈ పర్వతారోహకులను చూడడం గొప్ప సరదా.
టూర్ నించి తిరిగి రాగానే సాయంత్రం Yosemite lower Falls చూసేందుకు  నడుచుకుంటూ వెళ్లాం. అప్పటికే ఎండ తగ్గు ముఖం పట్టడం తో కాస్త తడిసే సరికి చలికి తట్టుకోలేక వరు ఏడుపు మొదలు పెట్టింది. యూసోమిటీ ఫాల్స్ Upper falls గా కొంత దూరం కొంచెం వంపు తిరిగి మళ్లీ  lower falls గానూ దర్శన మిస్తుంది. 2425 అడుగుల ఎత్తుతో ఈ యూసోమిటీ ఫాల్స్ ఉత్తర అమెరికా లోనే ఎత్తైన జలపాతాలట. అప్పర్ ఫాల్స్ కు వెళ్లాలంటే డొంక దారి గుండా మరో రెండు మైళ్లు నడవల్సిందే. అప్పటికే చీకటి పడ్తూండడం, వరు పేచీ తో వెనక్కి తిరిగాం. నిజానికి ఒక్క రోజులో బస్సు టూర్ తో కేవలం ఒక్క శాతం మాత్రమే అక్కడి ప్రకృతి అందాన్ని చూడగలమట. ఈ లోయలో మూడువేలకు పైగా సరస్సులు, 800 వందల మైళ్ల కాలిబాటలు ఉన్నాయంటేనే లోయ ఎంత విశాలమైందో తెల్సుకోవచ్చు.
పర్వతాలు, జలపాతాలు, నీటి ప్రవాహాలు ఇంతకు ముందెన్నడూ చూడనంత పెద్దవి కావడం వల్లో, అన్నీ ఒక చిత్ర పటంలా ఒకే సారి చూడగలగడం వల్లో యూసోమిటీ చాలా చాలా నచ్చింది మా అందరికీ. బహుశా నచ్చని వారెవ్వరూ ఉండరనుకుంటా.
ఇలా రాస్తుంటే ప్రతి ప్రదేశమూ మళ్లీ తిరిగి వస్తూన్నట్లు మనస్సులో దృశ్యాలు ఆవిష్కృతమవుతూ ఉన్నాయి. అదే యూసోమిటీ అంటే.

తిరుగు ప్రయాణం-గుహలు

సొనోరా నించి మేము సెలవు తీసుకుని ఇంటికి వచ్చే రోజు పిల్లలు “అమ్మా! రేపు సెలవే కదా ఇంటికి 4 గంటల్లో వెళ్లిపోయి ఏమి చేస్తాం. దారిలో ఏవైనా చూసుకుంటూ వెళ్దాం ” అన్నారు. వాళ్ల చేతుల్లో అప్పటికే హోటల్ కౌంటర్ దగ్గర్నించి తెచ్చిన ఇన్ఫర్మేషన్  సిద్ధంగా ఉంది. అవి సొనోరాకి ఉత్తరం గా ఉన్న గుహల సముదాయాలు.  దాదాపు 20 మైళ్ల పరిధిలో దగ్గర దగ్గరగానే ఉన్నాయి. సొనోరా నించి మరో గంట లోపే వెళ్లొచ్చు.  నిజానికి మేం దక్షిణానికి వెళ్లాలి. సత్య కూడా అటే ఓటెయ్యడంతో కారుని ఉత్తరం వైపు తిప్పాను. యూసోమిటీ  దారికి పూర్తి విభిన్నంగా ఉన్న దారి లోంచి ప్రయాణం. దారిలో ఎక్కడా మనుష్య సంచారమే లేదు. సింగిల్ రోడ్డు. ఎక్కి దిగే పర్వతాలు, ఎప్పుడో ఒక వెహికిల్.  అరగంట లో Moaning Caverns కి చేరేం. ఇక్కడి గుహల అంతర్భాగం లోని నీటి ప్రవాహం, గాలితో కలిసి ఒక విధమైన బాధతో ఏడుస్తున్నట్లు వినిపించడం వల్ల ఈ గుహలకు ఆ పేరు వచ్చిందట. చక్కగా ఒక గిఫ్ట్ షాప్ , చూసేందుకు టిక్కెట్లు, గైడ్లు, బోల్డు మంది జనంతో కోలాహలంగా ఉంది. నాకు ప్రాణం లేచి వచ్చింది.  నిర్మానుష్య ప్రదేశానికి పిల్లలతో ఎల్లా వెళ్లాలో అనుకుని భయపడుతూ ఉన్నాను. ఇంతకీ “గుహలేవి మమ్మీ! ” అన్నాడు మా కోమల్. ‘అదే రా వెతుకుతున్నాను. ఇక్కడంతా చూస్తే ఇక్కడేదో ఉన్నట్టే ఉంది.’ అన్నాను. ఎర్రని నేల మీద దుమ్ము గాలి వీచి నప్పుడల్లా పైకి లేస్తూంది. కనుచూపుమేర లో కనిపిస్తూన్న చిన్న కొండలకు దాదాపు అరమైలు మేర Zip line  ఏర్పాటు చేసారు. విలువైన రాళ్లని జల్లెడ పట్టే కార్యక్రమమూ ఉంది. అయితే ఉత్తినే కాదు, మనం  5 డాలర్లు పెట్టి ఒక చిన్న సంచీడు మట్టి కొనుక్కోవాలి. చెక్క బోదెల మీదుగా చిన్న గుండ్రంగా తిరిగే సన్నని నీటి ప్రవాహం లో రాళ్లు, మట్టి వేరు చేసే జల్లెడలతో మన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. పొరపాటున ఏదైనా విలువైన రాయో, బంగారమో దొరకొచ్చు. మంచి గోరువెచ్చని ఎండలో ఆ నీళ్లల్లో చెయ్యి పెట్టి ఆడుకోవడం వరుకు బాగా నచ్చింది. పేచీ మొదలు పెట్టింది అక్కడికి తీసుకెళ్లమని. సత్య, కోమల్ ఇద్దరూ zip line అని అప్పటికే పరుగెత్తారు లైనులోకి. తాడుకి ఆధారంగా ఉన్న బెల్టు తో అలా జారుకుంటూ గాల్లో వెళ్ళడం కంటే వరు తో ఇలా ఎండలో సేద తీరడం మంచిదనిపించింది నాకు. అలాగని మట్టి కోసం 5 డాలర్లు పొయ్యడమూ ఇష్టం లేదు. అందుకే మా బేగ్ లోంచి ఒక ప్లాస్టిక్ కవర్ నిండా కాస్త అవతలగా ఉన్న నేల మీది మట్టి తీసి అందులో కాసిన్ని గులక రాళ్ళు  వేసి వరుకి తెచ్చి ఇచ్చాను. ఇక గంట సేపు మాట్లాడకుండా జల్లెడ పడ్తూనే ఉంది. అందరూ ఏవీ దొరకడం లేదని పెదవులు విరుస్తూంటే, వరు మాత్రం ” మమ్మీ దొరికింది” అంటూ అయిదు నిమిషాలకోసారి అరుస్తూనే ఉంది.

పైకి మామూలు గిఫ్ట్ షాప్ లా కనిపిస్తున్నదే ఎంట్రెన్సు. పక్క గదిలో నుంచి కిందకు  లోపల ఒక భూకంపం వచ్చి కూరుకుపోయినట్లున్న పెద్ద అగాధం. కిందన ఏమీ కనిపించని చీకటిలోకి గుండ్రంగా తిరుగుతూ మెట్లు. ఒళ్లు ఝల్లు మంది ఒక్కసారిగా. అది ఎంత లోతు అంటే Statue of Liberty ని ఇముడ్చుకోగలదట. 165 అడుగులు కిందకు 234 మెట్లు అలా కిందికి దిగే సరికి నాకు కళ్లు తిరిగాయి బాగా. అక్కడి నించి ఇంకా లోపలికి ఒక పక్కగా గనుల మాదిరిగా ఉన్న ప్రదేశం నించి మామూలుగా నడిచి వెళ్లలేని ప్రాంతాలకు “Adventure Tour” పేరుతో తీసుకు వెళ్తున్నారు మళ్లీ వేరే టిక్కెట్టుతో. అక్కడికి వెళితే గుహలో గాలీ, నీరూ ఏడవక్కర లేదు మనమే ఏడ్పు మొదలెడతాం అని నవ్వుకున్నాం. అయినా  అప్పటికే కాళ్లు పట్టేసి అడుగు  ముందుకు పడడం లేదు. వరసగా జనం లైను వల్ల ఏ మెట్టు మీదా ఆగడానికి లేదు. అక్కడి నుంచి పైకి, చుట్టూ చూడడానికి, అసలా ప్రాంతం అలవాటు కావడానికి నాకు అరగంట పైనే పట్టింది. ఇదే మొదటి సారి అంత భూగర్భం లోకి వెళ్లడం. నిజంగా ఒళ్లు గగుర్పొడిచే గొప్ప అనుభూతి. ఎప్పుడు బయట పడతామా అనే భయం ఒక వైపు, ఏదో అంతుచిక్కని రహస్యం తెలిసినట్లు ఆనందం మరోవైపు . మళ్లీ అన్ని మెట్లు ఎక్కాల్సిందే, తప్పదుగా మరి.

బయటకు వచ్చి కాసేపు సేద తీరకుండానే బయలుదేరాం రెండో గుహలు చూడడానికి. మళ్లీ ఏకాకి రోడ్డు మీద ప్రయాణం. మరో అరగంట లోనే Mercer Caverns కు చేరుకున్నాం. ఈ టూర్ కి నేను కార్ లో ఉండిపోతానని, వీళ్లంతా వెళ్లి వస్తామని ఒప్పందం వల్ల ఒప్పుకున్నాను. ఇక్కడ బొత్తిగా జనం లేరు. అదే ఆ రోజుకి చివరి ట్రిప్ కావడం వల్లననుకుంటా గైడు తో కలిపి ఇంకో ముగ్గురున్నారు అక్కడ. సత్య గిఫ్ట్ షాప్ లోపలికి వెళ్లి ఎంట్రెన్సు టిక్కెట్లు కొని తెచ్చాడు. నేను అక్కడే చిన్న బెంచీ మీద మఠం వేసి కూచున్నాను. గైడు కొన్ని హేడ్ బాండ్స్ తో వచ్చి ఎవరెవరు? అని అడిగితే ముందు నన్ను చూపించాడు సత్య. నేను ఏమీ అనే ఛాన్సు లేకుండా గైడు వెనక పరుగు తీసారు వీళ్లంతా. నాకు కూడా టిక్కెట్టు తీసేసారన్నమాట. నిజానికి ఆ గైడు నా కంటే మూడు రెట్లు భారీ విగ్రహం. ఆమె చకచకా మెట్లు దిగడం చూసి లేని ఓపిక తో నడిచాను ముందుకి. అయితే ముందు గుహలకు పూర్తి విభిన్నంగా ఉన్నాయివి. అంత వెడల్పయినవి కావు. మెట్లు ఎన్ని దిగుతున్నామో, ఎక్కుతున్నామో మనకే తెలీదు. పైగా పూర్తి గా అందమైన లైం స్టోన్ గుహలవి. రకరకాల ఆకృతుల్లో కంటికి విందుగా ఉన్నాయి. అంతగా కాళ్లు నొప్పి పుట్టలేదు. అయ్యో, నేను రాక పోతే ఎంతో మిస్సయ్యి ఉండేదాన్ని అనుకున్నాను. ఈ గుహలు దాదాపు 3 మిలియన్ల కిందట ఏర్పడినవట. 1885 లో Walter J. Mercer అనే వ్యక్తి వీటిని కొని పర్యాటక ప్రదేశం గా అభివృద్ధి చేసాడట. అంతకు ముందు ఇవి కేవలం స్థానిక ఆటవికులకు మృతకళేబరాలు విసిరి వేసే చోటు గా ఉండేదట. కొన్ని చోట్ల బొర్రా గుహలు జ్ఞాపకం తెచ్చాయి పైనించి వేళ్ళాడే ఆకృతులు, నీటి బొట్లతో. కొన్ని సార్లు వంగి నడవాల్సి వచ్చింది. సరిగా చూసుకోక నాకు రాయి తగిలి తలకు బొప్పి కట్టింది కూడా. సముద్ర గర్భం లో ఉండే రాతి పూల లాంటి ఆకృతులు ఇక్కడ లెక్కలేనన్ని ఉండడం విశేషం.  మొత్తం గంట సేపు మంత్రముగ్ధులమై తిరుగాడేం. ఇక్కడ కూడా 161 అడుగుల లోతు వరకు వెళ్లినా చూసే క్రమంలో అంత దూరం వెళ్లినట్లు అనిపించలేదు. వెళ్లే దారిలోనే తిరిగి రాకుండా తమాషాగా మరో దారిగుండా బయటికొస్తాం.
యూసోమిటీ లో పూర్తిగా భూమి పైకి అంత ఎత్తుకి లేచిన పర్వతాలు, అక్కడి నుంచి జారిపడే జలపాతాల్ని చూసేం. ఇక్కడ గుహల్లో భూమ్యంతర్భాగంలోకి చొచ్చుకు వెళ్లి, అంతకు అంతా లోతుకి ప్రయాణం చేసి పర్వతాల అడుగున దాక్కుని జలధారలకు గొంతు సాచిన రాతి వేళ్లని తడిమి, కప్పు నించి వేళ్లాడే అద్భుతాల్ని వీక్షించి, గగుర్పాటు చెంది వస్తాం. భూమి ఎంత వైవిధ్యమైందో ఈ ప్రయాణం లో అర్థమైంది. తిరిగి వచ్చే దారిలో సూర్యాస్తమయం ఎన్నడూ లేనంత అందంగా కనిపించింది నాకు. ఎంత అందమైన రంగుల ప్రపంచంలో జన్మించాం మనం! నవంబరు, డిసెంబరు  నెలలో ఇక్కడి చలికి Mountain View చుట్టు పక్కల ఎక్కడ చూసినా పసుపు, ఎరుపు రంగు వృక్షాలు దర్శన మిస్తాయి. ఒకో చెట్టు ఆకులన్నీ రాలే ముందు ఒకో రంగులోకి మారిపోతాయి. మా బాల్కనీ లోంచి మారిన రంగులన్నీ కలగలిసి ఒక్క చోటే ప్రత్యక్షమైనట్లు  కనిపిస్తాయి. యూసోమిటీ వెళ్లొచ్చాక ఈ రంగుల వీవెనలన్నీ సరాసరి మా ఇంటిలోనికి, మా అందరి మనసుల అంతర్భాగం లోకి ప్రవేశించి జీవితంలో ఒక కొత్త వెలుగు నిండినట్లయ్యింది.

…………………………..

(విహంగ నవంబరు-2011 ప్రచురణ)

http://vihanga.com/?p=1737

ప్రకటనలు
This entry was posted in నా కళ్లతో అమెరికా(Travelog) and tagged . Bookmark the permalink.

8 Responses to నా కళ్లతో అమెరికా-2(యూసోమిటీ)

 1. kalageeta అంటున్నారు:

  Thanks Jyothi garu! Ela Unnaru?

 2. jyothirmayi అంటున్నారు:

  గీతగారూ… మరొక్కసారి యూసోమిటి వెళ్లివచ్చినట్లనిపించింది…

 3. kalageeta అంటున్నారు:

  kastephale@ Thanks for your comment- I will get double energy when I got a comment-
  All@ Thanks a lot

 4. kastephale అంటున్నారు:

  wow wonderful. you have given a live telecast.Thank u

 5. kalageeta అంటున్నారు:

  Thanks for your comment Vanaja garu-

 6. Vanaja Tatineni అంటున్నారు:

  ఎంత బాగా చూపించారు!? ఏకబిగిన ఆపకుండా.. అక్కడకి మనసు పరుగులు తీస్తుంటే.. మీ ఆస్వాదనలో.. ఆస్వాదనై.. అద్భుత ప్రయాణం చేసాం. చాలా బాగుంది.
  మీ షేరింగ్ కి.. అలాగే మీరు ఈ విశేషాలని పంచుకోవడానికి కేటాయించిన సమయానికి, మీ శ్రమకి ..ధన్యవాదములు గీత గారు.

 7. kalageeta అంటున్నారు:

  Thank you chinni garu!

 8. చిన్ని ఆశ అంటున్నారు:

  బాగుందండీ! కళ్ళకి కట్టినట్టు రాశారు మీ Yosemite ప్రయాణం, అక్కడి అనుభవాలూ…చక్కగా బ్లాగ్ లో పొందుపరచారు అన్ని అనుభూతులూ…చాలా బాగుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s