నా కళ్లతో అమెరికా-3 (శాంతాక్రూజ్)

శాంతాక్రూజ్

జూలై 4 ఇక్కడ ఇండిపెండెన్స్ డే. శనాదివారాలు సెలవులు ఎలాగూ ఉన్నాయి, సోమవారం ఈ సెలవు కలిసి వచ్చింది. ఓ రెండు పగళ్లు శాంతాక్రూజ్ చుట్టుపక్కల గడుపుదామని అనుకున్నాం. నిజానికి దాదాపు నలభై మైళ్లు మౌంటెన్ వ్యూ నించి. అక్కడ ఉండిపోనక్కర లేదు. పొద్దుటెళ్లి, సాయంత్రం వచ్చేయొచ్చు. కానీ శాంతాక్రూజ్ సముద్ర తీర నగరం. రాత్రి పూట అలల సౌందర్యాన్ని వీక్షించకపోతే ఎలా!

అయినా ఆ దగ్గర్లోనే ఉన్న Mystery Spot కూడా లిస్టు లో ఉంది. పొద్దుటే కాస్త తిని, కాస్త పేక్ చేసుకుని బయలుదేరాం. కారు లో  ఎక్కే ముందు లిస్టులో అన్నీ ఉన్నాయో, లేదో సరి చూసుకుంటున్నాం. “నా కోసం మేగీ పెట్టారా?” అంది వరు.

  ‘అదే మొదట పేక్ చేసాను. అయినా ఈ పిల్లకు “మేగీ “  అని పేరు పెట్టాల్సింది  వరూధిని అనెందుకు పెట్టామో మనం ‘ అన్నాడు సత్య. వరు అన్నిటిలోనూ చురుకే గానీ తినడానికి మాత్రం చాలా ఏడిపిస్తుంది.  ఇంటి నుంచి  బయటకు వెళితే మేగీ తప్ప  ఇంకేమీ తినేది కాదు.  ఇక్కడికి వచ్చిన నాలుగేళ్లకి ఇప్పుడిప్పుడు కాస్త నయం. లక్కీగా నా దగ్గర చిన్న ఎలక్ట్రిక్ స్టవ్ కం కుక్కర్ ఉంది. ఎక్కడికెళ్లినా ఆ సెట్టు మోసుకు తిరగాల్సిందే. నిజానికి అమెరికా వచ్చిన కొత్త కాబట్టి బయట మేమూ పెద్దగా తినలేక పోయే వాళ్లం.

ప్రయాణం

                        మా ఇంటి నుంచి శాంతాక్రూజ్ వెళ్లేదారిలో పది మైళ్ల లో ఫ్రీవే దాటంగానే చుట్టూ పర్వతాలతో ఘాట్ రోడ్డు ప్రారంభమైంది.  ఇరువైపులా రెడ్ వుడ్ చెట్ల మధ్య నుంచి అయిదు నిమిషలకోసారి పాములా మెలికలు  తిరుగుతూ ప్రయాణం. నిట్ట నిలువుగా ఆకాశం వైపుకు ఎదిగి మబ్బులకు కొమ్మల  చేతులు చూపిస్తూ ఏదో మాట్లాడుతున్నట్టే ఉంటాయి  రెడ్ వుడ్ చెట్లు. చెట్ల మొదళ్లు రోడ్డుకి దిగువనెక్కడో, చివర్లు రోడ్డు పైనెక్కడో ఆకాశంలోనూ ఉండి రోడ్ల పక్క స్తంభాలు నాటినట్టున్నాయి. Bear Creek దాటి, Scotts Valley  దాటి వేగంగా వెళ్తూంది కారు. మొదటి సారి   వేగం గా అలా ఘాట్ రోడ్డులో దూసుకు వెళ్లడం చాలా భయంగానూ, థ్రిల్లింగ్ గానూ  అనిపించింది.  వరు అయితే” ఇదిగో  జారుబిల్ల (జారుడు బల్ల) అదిగో ” అంటూ వెనక సీట్లోంచి కేరింతలు కొట్టింది.   ఇక్కడ లా ప్రకారం పిల్లలు 12 స.రాలు  వచ్చేంత వరకు ముందు సీట్లో  కూర్చోకూడదు.  వెనక సీట్లో కూడా వారి బరువుని బట్టి నిర్దేశించిన స్పెషల్ కార్ సీట్ల లోనే కూర్చోవాలి. మొదట్లో ఈ పద్ధతి ఇబ్బంది గానే అనిపించింది, పిల్లని ఒక్కదాన్నీ అలా వదిలేయడానికి. అయినా తప్పదు మరి. అన్ని సీట్ల లోనూ సీట్ బెల్టులు పెట్టుకోకపోయినా పోలీసు టిక్కెట్టు తప్పదు.  ఇలాంటి నిబంధన వల్ల ఒక కారులో ఉన్న సీట్ల కంటే ఎక్కువ మంది మన దగ్గర లాగా కూర్చోవడానికి వీలు పడదు. ఇండియా లో శాంత్రో కారు లో పిల్లా పెద్దా కలిసి 10 మంది  పైనే వెళ్లిన రోజులు గుర్తొస్తే నవ్వొస్తుంది.

మిస్టరీ స్పాట్

                                మిస్టరీ స్పాట్  కు దగ్గరకు వచ్చే కొలదీ మరింత చిక్కని అరణ్యం గుండా చిన్న రోడ్డులో ప్రయాణం చేస్తాం. చుట్టూ అల్లుకున్న నిశ్శబ్దం. ఎక్కడో పైన చెట్ల ఆకుల మధ్య చిన్న దోవ గుండా ప్రసరించే వెలుతురు.  చెట్ల మొదళ్లకి అల్లుకున్న అడవి తీగలు. కారు వేగం మందగించినా అద్దాలు దించితే “గుయ్యి “మని చెవుల్లోకి జొరబడే అతి చల్లని గాలి.  మనిషికి 6$ టిక్కెట్టు, కారు పార్కింగుకి 5 డాలర్లు. టిక్కెట్టు కౌంటర్ నుంచి కొద్దిగా పైకి చెట్ల మధ్యన కాలిబాట పై  నడవాలి. అయితే బాచ్ కు 20 మంది కంటే ఎక్కువ అనుమతించరు. కాబట్టి మాకు మరో గంట తర్వాత  టిక్కెట్లు దొరికాయి.

మా అమ్మ వచ్చినపుడు అలాగే అనుకుని  ఉదయం వెళితే సాయంత్రం బాచ్ వరకు ఖాళీ దొరక లేదు. ఆన్ లైన్ లో ముందు బుక్ చేసుకుంటే అనుకున్న సమయానికి వెళ్లొచ్చు. ఇక్కడ జూన్ నెల నించి ఆగస్టు నెల వరకు మంచి వెచ్చని కాలం( స్వెట్టరు లేకుండా తిరొగొచ్చు). అంతా ఎక్కువగా బయటకు వెళ్ళే కాలం. పైగా వారాంతాలు బాగా రద్దీ ఈ ప్రదేశానికి.

                ఇంతకీ అదొక చెక్క ఇల్లు. ఒక పద్ధతి లో లేకుండా కట్టిన ఇల్లు. అక్కడ కింద రాళ్లు ఎలా ఉంటే అలా కట్టబడినట్లు ఉంటుంది. అంటే ఫ్లోర్ కి ఎటువంటి వాలు ఉంటే అలా చదును చేయకుండా.  గుమ్మం దగ్గర నిల్చోగానే మామూలుగా నిలబడ్డ మనిషి ఎదుటి వారికి పీసా టవర్ లాగా కొంచెం పక్కకు వాలి కనబడతాడు.

          ముందు గది లో బంతి వాలు నించి ఎత్తుకి జరజరా పాకడం వంటి చిత్రాలు ఉంటాయి.  అసలు రెండో గదిలో నిలబడేందుకు కింద స్థిరత్వం లేకుండా ఫ్లోర్ ఒక వైపుకి వాలి పోయి ఉంటుంది.  పట్టుకుని గోడల పైకి ఎగబ్రాకేందుకు చిన్న  నిచ్చెనలు ఉంటాయి. పైన రూఫ్ వరకు నిలబడ్డ మనిషి  తలం వంపుగా వున్నా  తను స్థిరంగా నిలబడగలుగుతాడు. అక్కడవన్నీ ఒక రకం గా మనం ఉన్న కోణానికి, చూసే కోణానికి ఉన్న భేదం వల్ల అలా కనిపిస్తున్నాయో లేదా వాళ్లు చెప్తున్నట్టుగా నిజంగా ప్రత్యేకించి అక్కడ భూమ్యాకర్షణ ప్రభావం లో తేడా ఉందో గానీ గమ్మత్తుగా ఉంటుంది అనుభవం.    దీనికి కారణాలు ఎన్నెన్నో ప్రచారం లో ఉన్నాయి.

“Some speculate that cones of metal were secretly brought here and buried in our earth as guidance systems for their spacecraft. Some think that it is in fact the spacecraft itself buried deep within the ground. Other theories include carbon dioxide permeating from the earth, a hole in the ozone layer, a magma vortex, the highest dielectric bio-cosmic radiation known anywhere in the world, and radiesthesia. Whatever the cause is, it remains a mystery. ” గైడు చెప్పుకుపోతున్నా ఇదంతా నిజమా, అబద్ధమా అని మనసు ఆలోచిస్తుంది.

ఇంటి బయట మనకు ఒక విచిత్రం చూపిస్తారు.  ఎత్తుల వారీగా పొట్టి నించి పొడుగు వాళ్ల వరకూ అక్కడ ఉండే ఒక చెక్క మీద ఒక అయిదారుగురు నిల్చోవాలి. ఈసారి పొడుగు వాళ్ల నించి  వరుసగా పొట్టి వాళ్లు  నిల్చోవాలి. ఆశ్చర్యంగా అందులో అందరి కంటే పొట్టి వాడితో సమానం గా పొడవు వాడు  కనిపిస్తాడు.

బీచ్ & బోర్డ్ వాక్

మేం బోర్డ్ వాక్ నించి నడిచే దూరం లో ఉన్న  హోటల్ లోనే బస చేసాం. సామాన్లు పడేసి సముద్ర తీరానికి పరుగెత్తాం. బోర్డ్ వాక్ బిల్డింగ్లు, రైడ్లు దాటితేనే గానీ సముద్రం కనిపించదు. వెళ్ళేసరికి దాదాపు ఎండ పోవస్తూంది. చలిగాలి రివ్వున వీస్తూంది. అడుగు తీసి అడుగు వెయ్యలేని చలి లో వరు పేచీతో వెనక్కు తిరిగాం. చీకటి పడ్డాక మళ్లీ సముద్ర తీరానికి రావొచ్చు, అందాకా  down town  వరకు వెళ్లి ఊరు చూసొద్దామని వెళ్లాం.

     పార్కింగు కోసం వెతుకుతూ ముందుకెళ్లాం. మామూలుగా రోడ్ల పక్క పార్కింగు ఎక్కడా ఖాళీ లేదు. రెండు మూడంతస్తుల పార్కింగు కనిపించిన చోట సిగ్నల్ దగ్గరకు రాగానే హఠాత్తుగా మా కారు ఆగిపోయింది. బిజీ ట్రాఫిక్ లో వెనక అసహనం గా ఎదురు చూసి మరో కారు హారన్ మోగించేసరికి భలే చెమట్లు పట్టాయి మాకు. అసలే కొత్తగా వచ్చాం. ఇక్కడ డ్రైవొంగు కొత్త. రూల్స్ మహా స్రిక్టు. మనలా మెకానిక్కులు ఎక్కడ పడితే అక్కడ ఉండరు. లక్కీగా నాలుగైదు నిమిషాల్లో స్టార్ట్ అయ్యింది. (అయితే మళ్లీ ఇంటికి తిరిగొచ్చాక ఓ వెయ్యి డాలర్లు పెట్టుబడి పెట్టించిందిలెండి). ఇక ఎక్కడా ఆగకుండా మళ్లీ హోటల్ కు వచ్చి పడ్డాం. మర్నాడు పరిస్థితి చూసుకుని ఆలోచించుకుందామని అనుకున్నాం.  ఇక రాత్రి సముద్ర సౌందర్యం మాట దేవుడెరుగు!

                 ఉదయానే లేచి సముద్ర తీరం లో వాకింగ్ చేద్దామని బయలు దేరాం. ఇంకా మబ్బుగా ఉంది. వర్షం వచ్చే ముందు వీరంగం వేస్తున్నట్టు భీభత్సంగా ఉంది సముద్రం.  తీరంలో ఎవ్వరూ లేరు. అక్కడక్కడా సీగల్ పక్షులు, మేం. మళ్లీ చలిగానే ఉన్నా ఎలాగైనా తీరం లో తడి ఇసుకలోనికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. పాదం తడిసేలా చెప్పులు లేకుండా గట్టిగా పది నిముషాలు  నడిచామో లేదో పాదాల్లోంచి నాకు ఒక విధమైన నొప్పి ప్రారంభమైంది. చలిని ఓర్చుకోలేక పాదాలు అలా బాధిస్తున్నాయని అర్థమైంది. త్వరగా హోటల్ కు వచ్చి వేడి నీళ్లలో పాదాలు అరగంట ముంచే వరకు నొప్పి తగ్గలేదు.

                    అమెరికా పశ్చిమ తీరానికే అత్యంత ప్రాచీన మైన, పెద్దదైన  సముద్ర తీరపు ఎమ్యూజ్ మెంట్ పార్కు  ఇక్కడుంది. సుందరమైన సముద్ర తీరం లో దాదాపు అరమైలు దూరంలో పిల్లల్ని పెద్దల్ని అలరించే రకరకాల ఎంటెర్టైన్మెంట్లు, ఫుడ్ రెస్టారెంట్లు ఉంటాయి. Sky glider పేరుతో  రోప్ వే కూడా ఉంది. దాదాపు 50 అడుగుల ఎత్తునించి ఒక వైపు అంతు లేని సముద్రాన్ని, మరో వైపు సుందర శాంతాక్రూజ్ తీరాన్ని, కింద బొమ్మలాటలా కనిపించే బోర్డ్ వాక్ ను చూస్తూ వెళ్లడం కాస్త భయం వేసినా చెదరని అనుభూతి. గాల్లో ఖాళీగా కాళ్లు కిందకు పెట్టి కూచోవడం వల్ల ఎప్పుడు తొట్టె విరిగి కిందకు పడుతుందో అని భయం వేస్తుంది. కానీ అటు అలల నురుగుని చూస్తే అక్కడి నుంచి పక్షిలా రెక్కలు సాచి ఆవలి తీరానికి ఎగరాలని అనిపించకమానదు. మా అమ్మ, నేను ఎక్కాం మళ్లీ వెళ్లినపుడు. తొట్టె బాగా ఎత్తుకి చేరే స్తంభం వరకు రాగానే నేను కళ్లు గట్టిగా మూసుకుని అరవడం చూసి తను పగలబడి నవ్వింది.

మొత్తం 35  rides & attractions  అన్నీ చూడాలంటే ఒక రోజు చాలదు. పైగా ప్రతీ దానికీ టిక్కెట్టు. అన్నిటికీ కలిపిన టిక్కెట్లు కుడా కొనుక్కోవచ్చు. మేం వరు వయసుకు సంబంధించినవి మాత్రమే చూడాలని అనుకున్నాం.

                             ఇక్కడ చెప్పుకోవలసిన విశేషం ఏమిటంటే ఇక్కడి చాలా రైడ్లు దశాబ్దాల నించీ నడుస్తున్నవట. సముద్రపు ఉప్పు గాలికి తుప్పు పట్టిపోకుండా ఎంత మంచి నాణ్యతతో నిలిచి ఉన్నాయో అవి! ఇదే కాదు, పార్కులు, పబ్లిక్ రెయిలింగులు ఒకటేమిటి ఇనుము అంటూ ఉన్న చోట మంచి నాణ్యత తో ఉంటాయి ఇక్కడ. నాకు విశాఖ లోని అప్పూఘర్ దుస్థితి గుర్తుకొచ్చింది. మనమెందుకు ఇలా చెయ్యలేం? అనిపించింది. 1907 లో ప్రారంభించబడిన  ఈ పార్కు కాలిఫోర్నియాలో (Oldest surviving amusement park) ఇప్పటికీ

నిలిచి ఉన్న ప్రాచీనమైన పార్కు. ఇందులో Gaint dipper roller coaster  1924 నించీ నడపబడుతున్నది. ఇది పూర్తిగా చెక్కతో నిర్మితమైంది. Looff Carousel  మన దగ్గర రంగురాట్నం వంటిది. ఇది 1911 లో నిర్మితమై ఇప్పటికీ అందరినీ అలరిస్తూ ఉంది. నేను కూడా వరు తో బాటూ ఎక్కాను. చాలా సంవత్సరాల తర్వాత చెక్క గుర్రమ్మీద కూచుని రంగుల రాట్నం తిరగడం చాలా సంతోషంగా అనిపించింది. ఎంతైనా బాల్యంలో జరిగినవి మళ్లీ జరిగితే  ఆ ఆనందమే వేరు. ఇదే అమెరికా లో వెసులుబాటు. ఇక్కడ ఏ వయసు వాళ్లు ఏ పని చేసినా వింత ఏమీ ఉండదు. బాగా చిన్న పిల్లలకు పక్కనే పెద్ద వాళ్లు నిలబడొచ్చు.

                    అన్నిటినీ మించి రైడ్లకు చివర దాటి వెళితే వందేళ్ల నాటి పాత చెక్క  రైలు బ్రిడ్జి ఉంటుంది. దాని మీదకు ఇప్పుడు నడిచివెళ్లే వీలు మాత్రమే ఉంది. కిందనే పారే San Lorenzo  నది. వేసవిలో నీరెండి సన్నని ప్రవాహం గా మాత్రమే ఉంది.

                     ఇక అక్కడి నుంచి చుట్టు పక్కల సముద్ర తీరం వెంబడి, నగర వీధుల గుండా గంట సేపు తిప్పి చూపించే రైలు ప్రయాణం కూడా ఉంది. వచ్చిన కొత్త కాబట్టి మనిషికి 25$ పెట్టి గంట రైలు ఎక్కి దిగేంతగా బడ్జెట్టు లేదు. అందుకే అది మానేసి Neptune Kingdom లోని మినీ గోల్ఫ్ ఆడడానికి వెళ్లాం. నెప్ట్యూన్ కింగ్డం లోపల పైరేట్స్ థీం తో చూడడానికి బావుంటుంది.  5 $ చొప్పున టిక్కెట్టుతో రెండు గంటల పాటు వరు కి మంచి సరదా పుట్టించింది. ఇలాంటి ఇండోర్ గోల్ఫ్ సెంటర్లు, ఆర్కేడ్లు చాలా చోట్ల ఉంటాయి మా ఊరికి చుట్టుపక్కల. పిల్లలూ, పెద్దలూ సరదాగా ఆడే మినీ గోల్ఫ్ ఎన్ని సార్లు ఆడినా “మళ్లీ ఎప్పుడు వెళ్తాం?” అంటుంది వరు. ఆర్కేడ్లు డబ్బులు చిప్స్ రూపంలో మిషన్ లలో వేసి ఏవో టిక్కెట్లు సంపాదించి అక్కర్లేని ప్లాస్టిక్ వస్తువులు ఇంటికి తెచ్చుకునే ఒక మాయాజాలం. ఒక పిచ్చి సరదా, వేలంవెర్రి.

 జూలై4

ఇంతకీ జూలై 4 గురించి పూర్తిగా చెప్పుకోనేలేదు.  1776 లో జూలై 4 న అమెరికా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి స్వతంత్రతని పొందింది. ఆ రోజు సెలవు కావడమే కాక, మంచి వెచ్చని వేసవి కావడం తో అందరూ Open barbeque ల తోనూ, పిక్నిక్ ల తోనూ, ఫామిలీ గాదరింగ్స్ తోనూ గడుపుతారు. ఇక శాంతాక్రూజ్ లాంటి  సముద్ర తీరాలు జనాలతో కిట కిట లాడుతూ ఉంటాయి. బీచ్ లలో టెంట్లు, బార్బెక్యూలు, ఆటలు, ఒకటేమిటి అసలు ఇళ్లల్లో ఎవరూ ఉండరేమో అని అనిపిస్తుంది. రోజంతా ఏదో ఒకటి తింటూ, తాగుతూ కనిపిస్తారు.

                    అసలా రోజు కార్ పార్కింగు  దొరకడం చాలా కష్టం. దొరికినా $15 డాలర్ల వరకు రుసుము చెల్లించాలి.  ఇక సాయంత్రం ఊరికి ఒక చోటు చొప్పున పెద్ద పెద్ద Fire works , live music entertainment లు  ఉంటాయి. ఫైర్ వర్క్స్ చూసేందుకు మన దగ్గర రంగుల్ని విరజుమ్మే తారా జువ్వల వంటివి. కానీ విభిన్న ఆకృతులలో, ఆకాశం లో చుక్కలు అక్కడే పుట్టి రాలి పడ్డట్టు చాలా అద్భుతంగా ఉంటాయి.  అవి చూడడానికి జనం విపరీతంగా వస్తారు. శాంతా క్రూజ్ కౌంటీ లా ప్రకారం సముద్ర తీరాలకు 6 మైళ్ల  పరిధి లో  నిషిద్ధమైనా అక్కడక్కడా కొందరు నిరపకారమైన బాణాసంచా  వెలిగిస్తూనే ఉంటారట. పిల్లా పెద్దా అందరి పండగ ఇది.

రోరింగ్ కాంప్ రైల్ రోడ్స్

                 మధ్యలో చాలా సార్లు మళ్లీ శాంతా క్రూజ్ వెళ్లాము. కానీ ఎప్పుడూ మిస్టరీ స్పాట్ లేదా బోర్డ్ వాక్ చూసే సరికే సాయంత్రమైపోతుంది. మొన్న డిసెంబరు 11 న మళ్లీ వెళ్లాం. గడ్డ కట్టించే చలిలో బోర్డ్ వాక్ రైడ్స్ క్లోజ్ వుంటాయి కాబట్టి ఈసారి  ఇంత వరకు చూడనివి ప్లాన్ చేసుకున్నాం. శాంతా క్రూజ్ కు వచ్చే 9 మైళ్ల ముందే Felton  అనే ఊళ్లో ఉందా రైలు.

ఆ రోజు మొత్తానికి  మధ్యాహ్నం పన్నెండున్నర నించి ఒక గంటన్నర పాటు ఒక్కటే ట్రిప్. కారు పార్కింగు 8 డాలర్లు. రైలు టిక్కెట్టు ఒక్కొక్కరికి 24 డాలర్లు. మధ్యాహ్నమైనా చలి వణికిస్తోంది. మబ్బుగా ఉంది. కారు పార్కింగు నించి లోపలికి కొద్దిగా నడవాలి. మేం వెళ్లేటప్పుడు షటిల్ ట్రైన్ ఎక్కేం, వచ్చేటప్పుడు నడిచి వచ్చేం. అక్కడి నుంచి ఒక చిన్న స్టీం ఇంజను, అయిదారు ఓపెన్ టాప్ పెట్టెల చిన్న రైలు ప్రయాణం. స్టేషన్ దగ్గర గిఫ్ట్ షాప్, రెస్టారెంట్, రెస్ట్ రూంస్( ఇక్కడ బాత్రూంస్ ని ఇలా అంటారు.)  ఇతరత్రా ఉన్నాయి. రైలు వచ్చే లోగా చికెన్ నగ్గెట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ తిని, కాఫీ తాగేం. డిసెంబరు నెల అంతా ఇక్కడ ఎక్కడ చూసినా క్రిస్టమస్ సెలబ్రేషన్స్ జరుగుతాయి. అవే డెకరేషన్స్ కనిపిస్తాయి. పిల్లలు చలి,గిలి లేనట్లు బాగా ఆడేరు. చుట్టూ మమ్మల్ని గమనించకుండా తపస్సు చేస్తూన్నట్లు ఉన్న రెడ్ వుడ్ చెట్ల కొండలు.  బాగా చలిగా ఉన్నా చలి కాలం ప్రకృతి సౌందర్యమే వేరు. పొగ చిమ్మే పాత కాలపు రైలు దట్టమైన చెట్ల చీకటిని చీల్చుకుని వెళ్తూంటే మబ్బులు చెట్ల మధ్య నించి తరుముకుంటూ ఆటలాడుకుంటున్నాయనిపిస్తుంది. ఒంటి మీద రెండ్రెండు స్వెట్టర్లు, గ్లోవ్స్, చెవులకు కేప్ లు పెట్టుకున్నా ఇంకా ఎక్కడి నుంచో చలి వచ్చి సూదులు పొడుస్తూంది. మా చిన్న పాప సిరి వెన్నెల బుగ్గలు, ముక్కు ఎర్రగా అయ్యిపోయాయి. దాని వయస్సు పదహారు నెలలే అయినా లెక్క చెయ్యకుండా మాలాగే చెట్ల చివర్లని వెనక్కి తల వాల్చి చూస్తూంది. ఇక్కడి చెట్లు 200 అడుగుల పైనే ఎత్తు, పదిహేను వందల సంవత్సరాల పైనే వయస్సు కలిగినవి. మొత్తం అన్ని పెట్టెల నిండా బానే ఉన్నారు జనం. చిన్న ట్రాక్ చెట్ల మొదళ్లను ఒరుసుకుంటూ నెమ్మదిగా చుట్టూ తిరుగుతూ Bear Mountain కు చేరుకుంటుంది. అక్కడ సీజన్ వారీగా ఉత్సవాలు జరుగుతూ, వచ్చిన వారిని స్వాగతిస్తూ ఉంటారు. అక్కడ ఒక అరగంట స్టాపు ఉంటుంది. మేం చేరే సరికి శాంతా క్లాజ్ కేండీ కేన్ చాక్లెట్ల సంచీ తో రెడీగా ఉన్నాడు. పిల్లలందరికీ శుభాకాంక్షలు చెపుతున్నాడు. పిల్లలు కోలాహలంగా ఫోటోలు తీయించుకుంటున్నారు. “వరూ! నువ్వూ వెళ్లు శాంతా క్లాజ్ తో ఫోటోకి ” అంటే “వద్దులే ఇప్పటికే మూడు సార్లు ముగ్గురు శాంతాల తో ఫోటోలున్నాయిగా” అంది. బాట కి ఇరువైపులా అలంకరించిన పొట్టి క్రిస్మస్ చెట్లు, చుట్టూ ఎత్తైన  చెట్లు.

రెడ్ వుడ్ లు  మొదలు చాలా దూరం ఖాళీగా  ఉండి ఆకాశం లోకి పైకి వెళ్ళే కొలదీ కొమ్మలతో దట్టంగా ఉంటాయి. కొమ్మల కప్పులు ధరించి  ఆకాశానికి అడ్డు నిలబడదామనుకుంటాయి. చెట్ల మధ్య చిల్లర మల్లరగా పోగు పడి పేరిన పేళ్లు తప్ప మొక్కల, తీగల జాడే ఉండదు. అంత దగ్గరగా అడవిని చూడాలంటే ఇలాంటిదేదో ప్రయాణం చెయ్యాల్సిందే. నా పుట్టిన రోజు అలా రెడ్ వుడ్ చెట్ల మధ్య తిరుగుతూ సంతోషంగా మొదలైంది. గంట సేపు అలా చెట్ల మధ్య తిరుగుతూ ఎప్పుడో మొదలైన వెడల్పాటి మొదళ్లని, ఆకాశం చివర దోబూచు లాడే ఇప్పటి చిగురుల్ని  చూస్తుంటే చరిత్రని, వర్తమానాన్ని టైం మెషీన్ లో నుంచి ఏకకాలంలో చూస్తున్న ఆశ్చర్యం.  ధీర గంభీర వృక్ష రాజాల గొప్ప రహస్యం ఒకటి తెలిసిన అనుభూతి.

శాంతాక్రూజ్ వార్ఫ్ & నేచురల్ బ్రిడ్జెస్

సముద్రం ఒడ్డునే ఇంకాస్త ముందుకు వెళితే light house field state park వస్తుంది. అక్కడ భూమి కొంత సముద్రం లోకి సాగి ఒడ్డు లోపలికి అర్థ చంద్రాకారం లో ఉండడం వల్ల surfingకి వీలుగా పెద్ద అలలు వస్తున్నాయి. అక్కడి నుంచి చాలా దూరం మేర సముద్రం రోడ్డు మీద నుంచి బాగా దిగువకి ఉంటుంది. విశాఖ పట్నం లోని ఇప్పటి తెన్నేటీ పార్క్ వ్యూ లాగా. అంత ఘోరమైన చలిలో పైగా గడ్డ కట్టించే నీళ్లలో ఆ రోజు National Surfing Championship పోటీలు జరుగుతున్నాయి. సముద్రం ఒడ్డున అంతా sea weed అల్లుకుపోయి ఉంది. అయినా దాదాపు 200 మంది సర్ఫర్లు నీళల్లో ఈదుతూ, తేలుతూ, అలలపై తమ విన్యాసాలతో  కనువిందు చేస్తున్నారు. అంత ప్రతికూల పరిస్థితుల్లో అలా నీళ్లల్లోకి వెళ్ళినందుకే వాళ్లను సత్కరించొచ్చు.

                        అక్కడి నుంచి ప్రతి వ్యూ పోయింట్ బ్రహ్మాండం గా ఉంటాయి. ఒక చోట సముద్రం లోంచి పైకి లేచిన గొప్ప ఎత్తైన శిలలు, అప్పుడే వాటిని పడగొట్టాలన్నట్లు ఆంత కంటే గొప్ప ఎత్తుకు లేచే ఉధృతమైన అలలు. అక్కడి నుంచి ఎందరో ప్రాణాలు కోల్పోయారట. సరదాకు కూడా కిందకు దిగొద్దని సైన్ బోర్డులు పెట్టారు.

                      బోర్డ్ వాక్ నుంచి దాదాపు 2మైళ్ల దూరం లో ఉన్న Natural bridges state park చూసి తీరవలసిందే.  కొండ రాళ్లు సముద్రం లోకి ముందుకు వంకర గోడ లాగా సాగి  సహజ సిద్ధమైన రాతి వంతెన ఏర్పడింది.  కింద మధ్య నించి ఎప్పటి నించో అలలు కోసేయడం వల్ల అట్నించిటుకి నీరు పారడానికి వీలుగా archల దారి కూడా  ఏర్పడింది.  అయితే అక్టోబరు, 1989 లో వచ్చిన  Loma Prieta  భూకంపం వల్ల ఈ వంతెన మధ్య కొంత మేర  ధ్వంసమై చివర ఒక్క Arch  మాత్రమే ఇప్పుడు వంటరిగా అసలు భాగానికి దూరంగా నిలబడి ఉంది. అప్పటి భూకంప ప్రభావం వల్ల శాంతా క్రూజ్ చుట్టుపక్కల, సముద్ర తీరంలో చాలా వరకు ధ్వంసమైందట.

                       ఇక్కడ సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న యూకలిప్టస్ వనం లో అక్టోబర్ నెల నుంచి ఫిబ్రవరి వరకు monarch శీతాకోక చిలుకల శీతాకాలపు విడుదులలో ఒకటి  అట. ఇక్కడి యూకలిప్టస్ చెట్ల  ఆకుల్లో వందలాది గా నివాసముండి ఇక్కడే కొన్ని తమ జీవితాన్ని విడిచి, కొన్ని కొత్త జీవం పొంది,  చల్లని ఉదయాలు అటు ఇటూ ఎగురుతూ సందర్శకులను బాగా అలరిస్తాయట. నారింజ, నలుపు కలగలిసిన ఈ శీతాకోక చిలుకలు వసంత కాలం లో ఇక్కడి నిండి  పర్వత ప్రాంతాలకు వలస వెళ్లిపోతాయట. శీతాకాలపు పొద్దు అయిదు గంటలకే వాలి పోవడం తో మేం ఇక వనం లోకి నడిచే కార్యక్రమాన్ని వాయిదా వేసుకుని వెనుతిరిగాం.

                     డిసెంబరు క్రిస్మస్ సెలబ్రేషన్స్ నెల కావడం తో బీచ్ రోడ్ నుంచి సాయంత్రం గంటకోసారి బయలు దేరే” లైట్ల రైలు “దేదీప్య మానం గా వెలుగుతూంది. మళ్లీ మమూలే తలకు బోల్డు టిక్కెట్టు. ఈ రైలు రాత్రుళ్లు కావడం వల్ల బయట చూసేదేమీ ఉండదు. పండుగకు సంబంధించిన పాటలు, విశేష కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి వెళ్ళే వారికి ఆనందంగా చేతులూపి సాగనంపాం.

                       రాత్రి పూట శాంతాక్రూజ్ ఒడ్డున పసిఫిక్ సముద్రం ఎగిసి పడే అలల్తో భీభత్సంగా ఉంది. పై నించి తలల్ని గడ్డ కట్టిస్తూ కనిపించని మంచు, కాళ్ల కింద అంత కంటే చల్లనైన ఇసుక, ఎదురుగా వణికిస్తూ సముద్రం. నాకు విశాఖపట్నం బీచ్ లో రాత్రుళ్లు పిడతకిందపప్పు తింటూ చల్లని ఇసుకలో కాళ్లు ముంచి కూర్చోవడం గుర్తుకొచ్చింది. ఇక్కడ పిడతకిందపప్పూ లేదు, హాయైన వాతావరణమూ లేదు. అయినా రాత్రి పూట సముద్ర సౌందర్యం చూడాలన్న కోరిక నెరవేరింది.

———————

Published on January,2012 by విహంగ

(http://vihanga.com/?p=1901)

ప్రకటనలు
This entry was posted in నా కళ్లతో అమెరికా(Travelog) and tagged , . Bookmark the permalink.

4 Responses to నా కళ్లతో అమెరికా-3 (శాంతాక్రూజ్)

 1. kalageeta అంటున్నారు:

  ఓపిగ్గా చదివి, కామెంట్ పెట్టినందుకు చాలా థాంక్స్ వనజ గారూ!

 2. vanajavanamali అంటున్నారు:

  గీత గారు.. బాగుంది. కాస్త ఓపిక చేసుకుని చదవాల్సి ఉన్నా సరే.. ఓ.. దృశ్య కావ్యం ..అలా.. నిశ్శబ్దంగా.. కదలిపోతున్న అనుభూతి. ప్రమాదాల మాట వినగానే ఒణికిపోయాను. భలే ఉన్నాయి మీ కబుర్లు..అమెరికా టూర్లు.

 3. kalageeta అంటున్నారు:

  అవునండీ! శర్మ గారూ- ఆ విషయం నాకు ప్రచురితమయ్యాక అర్థమయ్యింది. ఇక ఇక్కడా అలాగే ఉంచేసాను-

 4. kastephale అంటున్నారు:

  చాలా బాగా చెప్పేరు. ఒక చిన్న ఉచిత సలహా! తప్పనుకుంటే మన్నించండి!!! టపా చాలా పెద్దదయిపోయింది. రెండు రోజులు వరసగా వేసి ఉంటే బాగుండేదేమో!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s