నా కళ్లతో అమెరికా-4 (లాస్ ఏంజిల్స్-మొదటి భాగం)

లాస్ ఏంజిల్స్ -మొదటి భాగం

లాస్ ఏంజిల్స్ ప్రపంచ ప్రసిద్ధమైన మహా నగరం. ఎవరికీ ఈ పేరు తెలీకుండా ఉండదనుకుంటా. ఇండియా నించి ఎవరు ఫోన్ చేసినా మేం కాలిఫోర్నియా లో ఉన్నాం అంటే ఇంకేం “హాలీవుడ్ ” లోనన్న మాట అంటారు. నాకు ఇక్కడికొచ్చినప్పటినించీ ఎప్పుడు చూద్దామా అని ఒకటే తహ తహ. అయినా ఆరు నెలలు పట్టింది మాకు లాస్ ఏంజిల్స్ ప్రయాణం కావడానికి.

లాస్ ఏంజిల్స్ వెళ్లడం వేరు, మొదటిసారి లాస్ ఏంజిల్స్ వెళ్లడం వేరు. ఏదైనా మొదటి సారి చూసినప్పటి అనుభూతి ఎప్పటికీ చెరగదు. ప్రత్యేకించి లాస్ ఏంజిల్స్ మొదటిసారి మా ఊరి నించి వెళ్లడం చెప్పుకోదగిన గొప్ప విషయం. అదేమిటో చెప్తాను వినండి-

మా ఊరి నుంచి లాస్ ఏంజిల్స్ దాదాపు నాలుగు వందల మైళ్లు దక్షిణానికి ఉంటుంది. దాదాపు ఆరేడు గంటల ప్రయాణం కారులో. మేం అమెరికాకి వచ్చిన సంవత్సరం Thanks Giving సెలవుల్లో ప్రయాణం పెట్టుకున్నాం. నాలుగు రోజుల్లో రెండు రోజులు రానూ పోనూ ప్రయాణం, రెండు రోజులు అక్కడ చూసేందుకు కేటాయించాం. అప్పటికి మేమింకా ఫ్రీవేల మీద అంతగా డ్రైవింగు చేయడం లేదు. కాబట్టి మొత్తం నాలుగు వందల మైళ్ల ఫ్రీవే  ప్రయాణం పెద్ద సాహసమే. మొదటి సారి అంత దూరం డ్రైవింగు మా ఇద్దరికీ బాగా ఎగ్జయిటింగ్ గా ఉంది.

ఇక ప్రయాణానికి కావలసిన సన్నాహాలు వారం ముందే ప్రారంభమయ్యాయి. ముందు మా కారు సరిగా మమ్మల్ని గమ్యం చేర్చేందుకు అన్ని పార్టుల చెకింగ్ వగైరా పెట్టుబడితో హడావిడి మొదలైంది. ఇక నా సంగతి చెప్పనే అవసరం లేదు. లిస్ట్లు రాయడం, ఇస్త్రీలు, బాగ్ లు సర్దడాలు ఒకటేమిటి సమస్తం నేనే చెయ్యాలి. ఇంటి నుంచి బయటికి బేగ్ లు మొయ్యడం , కారులో సర్ది పెట్టడం వరకే సత్య పని. ఇంకేదైనా పని చెప్పబోతే ” నేను ఎలా చేసినా నీకు నచ్చదు, అదేదో నువ్వే చెయ్యరాదూ!” అంటాడు. అదీ నిజమే మరి! స్వయంగా నేనే చేస్తే గానీ చాలా పనులు నాకు నచ్చవు. మొత్తం నేను సర్దిన బేగ్ ల సంఖ్య మా తలల సంఖ్యకు మూడింతలుంది. సత్య తల పట్టుకుని మనమేమీ నెల రోజులు వెళ్లడం లేదు, నాలుగే నాలుగు. ఇదో ఈ బేగ్ తీసెయ్, ఆ బేగ్ తగ్గించు అని మొదలు పెట్టాడు తీరా వెళ్లే ముందు. నేను అన్నీ నాకు అత్యంత అవసరమైనవే అని మొండికేసాను. అవును మరి- ఏమి వదిలేస్తాం చెప్పండి- మరో జత చెప్పుల నించి, ఫేస్ పౌడర్ వరకు అన్నీ కావాల్సినవే.

ప్రయాణం

8 గంటలకు ఇంట్లో బయలుదేరాలని సత్య పట్టుబట్టడంతో తెల్లారగట్ల అయిదింటికే లేవాల్సొచ్చింది నేను. దార్లో తినేందుకు కాస్త ఉప్మా, పులిహోర, వరు కోసం మేగీ సిద్ధం చేసి, తయారై  మొత్తం కారులో కూర్చునే సరికి 8.30 అయ్యింది. మా ఇంటి నుంచి నలభై మైళ్లు ప్రయాణం చేసేమో లేదో మా వరు “అర్జంటు” అని చిటికెన వేలు చూపించింది. గిల్ రాయ్ ఊర్లోకి(ఈ ఊరి గురించి మరో సారి చెప్తాను లెండి) పోనిచ్చాం. ఏదో ఒక కాంప్లెక్సులో మామూలు రిటైల్ షాపు వాళ్ల నడిగితే రెస్ట్ రూం లేదన్నారు, పక్కనే ఉన్న ఏదో రెస్టారెంట్ క్లోజ్, రోడ్డు దాటి పెట్రోల్ పంపు లోకి వెళ్తే అక్కడ రెస్ట్ రూం లాక్, మళ్లీ కొంత దూరం ముందుకి ప్రయాణించి, వెనక్కి వచ్చి ఒక అరగంట తర్వాత ఒక SubWay(రెస్టారెంట్) లోనికెళ్లి మేమేమీ కొనడం లేదు, కానీ రెస్ట్ రూం కావాలని అడిగితే పాపం కౌంటర్ లో అమ్మాయి ఒప్పుకుంది.

Universal studios

Universal studios

ఇంకో సారి మా అమ్మ వచ్చినపుడు ఇంట్లో టిఫిన్ తినే టైము మాకు ఇవ్వలేదు సత్య. (అఫ్కోర్స్! అసలు తయారయ్యే టైము కూడా ఇవ్వడం లేదిప్పుడు. నేను ముఖానికి కాస్త ఫేర్& లవ్లీ, పౌడరు రాసుకోవడం లాంటివి కూడా కార్లోకెక్కాకే చేసుకోవాలి. అందుకే మేమెక్కడికెళ్లినా గంటకొకళ్ల్లం చొప్పున డ్రైవింగు మార్చుకుందామనేది మా ఒప్పందం. కానీ నేను తయారవ్వడం కోసం మొదటి గంట ఎప్పుడూ సత్యే డ్రైవ్ చేస్తాడు. ఆ గంటలో నేనూ కాస్త తీరుబడిగా తయారవుతానన్న మాట!) బాగా ఆకలేస్తోంది అందరికీ.  తెచ్చుకున్న టిఫిన్ తినడానికి మళ్లీ గిల్ రాయ్ లోనికి పోనిచ్చాం. ముందు సారి రెస్ట్ రూం అనుభవం తో ఇలా కాదని  ఊరు లో ఒక పబ్లిక్ పార్కు వెతికి పట్టుకున్నాం ఈసారి. అక్కడైతే తప్పని సరిగా రెస్ట్ రూంస్ ఉంటాయి. అదీ గాక పార్కులో తినేందుకు బల్లలు, పిల్లలు బోరై పోకుండా ఆడుకోవడానికి అనువుగా ఉయ్యాలలు, జారుడుబల్లలు వగైరా ఉంటాయి. అలా మేము ప్రతీసారీ గిల్ రాయ్ దరిదాపులకు వచ్చేసరికి ఆగి ఓ గంట ఆ చుట్టు పక్కలే గడిపేస్తాం.

101 ఫ్రీవే మీద నుంచి గిల్ రాయ్ మీదుగా I-5 ఇంటర స్టేట్ హైవే మీదకు వెళ్లే దారిలో నాకైతే నచ్చేది రోడ్ల పక్కనే ఉన్న వందలాది ఎకరాల కూరగాయలు, పళ్ల తోటలు. రోడ్లకటూ ఇటూ స్టాల్స్ లో ఆగి  తాజా పళ్లు కొనుక్కుని తినడం భలే సరదా మాకు. బెర్రీల కాలంలో ఇక్కడ స్ట్రా బెర్రీలు, బ్లూ బెర్రీలు, రాస్ బెర్రీలు మొ.న రకరకాల బెర్రీలు దొరుకుతాయి. ఎన్ని పళ్లు తిన్నా మన శీతాఫలాలు, మాంఛి మామిడి పళ్లు తినక జీవితం వృథానే అనుకోండి. మరేం చేస్తాం రోంలో  ఉన్నపుడు రోం పళ్లే తినమన్నారు పెద్దలు! మేం వెళ్లిన కాలంలో నారింజలు, Persimmon ల కాలం. పెర్సిమోన్ లు ఇప్పుడు నా ఫేవరెట్ ఫ్రూట్ ఇక్కడ. చూడడానికి టమాటాలా ఉండి లోపల గుజ్జు బాగా పండితే మంచి తియ్యగా ఉండి ఒక రకమైన ముంజికాయ టేస్టు ఉంటుంది. కాయలు ముగ్గడానికి వారాల తరబడి పడుతుంది. పచ్చి కాయ అస్సలు తినలేం. ఒక రకమైన జీడితో వగరు గా ఉంటుంది.

Universal studios

Universal studios

ఇక I-5 మీదకు ప్రవేశించిన గంటలో మొదటి రెస్ట్ ఏరియా వచ్చింది. పేరుకి రెస్ట్ ఏరియానే గానీ అదో పెద్ద పార్కులా ఉంటుంది. అప్పటి నుంచి మేం తప్పని సరిగా ప్రతి రెస్ట్ ఏరియా లోనూ ఆగుతాం. ఇక్కడ ప్రధానం గా రెస్ట్ రూంస్ ఉంటాయి అయితే చుట్టూ గార్డెన్ లో పిల్లలు ఆడుకోవడానికి, కుక్క పిల్లల్ని తిప్పడానికి ప్రత్యేకించి ప్రాంతాలు,  భోజనాలు చెయ్యడానికి అనువుగా షెడ్లు, బల్లలు ఉన్నాయక్కడ. అక్కడి వెండింగ్ మెషీన్ల లో ఐస్ క్రీం మా వరుకి కొని తీరవలసిందే ఎప్పుడూ.  కాఫీ, టీలు కూడా ఆ మెషీన్లోనే కొనుక్కోవచ్చు.

ఒకవైపు ఫ్రీవే మీద వేగంగా వెళ్లే వాహనాలు, మరో వైపు కనుచూపు మేర విశాలంగా పరిచినట్లున్న ఎండు గడ్డి నేల మీదకు విల్లులా వంగిన ఆకాశం. నేను కాలి బాట మీద పచార్లు చేస్తూంటే సత్య, వరు టాగ్ ఆడుతున్నారు. మా అమ్మ తో వచ్చినపుడు మా సిరి వెన్నెల కడుపులో ఎనిమిదో నెల పాపాయిగా ఉంది. మా అమ్మ  వెచ్చని చేతుల్లో చెయ్యి వేసి పార్కు చుట్టూ నెమ్మదిగా పచార్లు చేసాను. అప్పుడు కాస్త ఎండగా ఉన్నా, చుట్టూ చెట్లు లేక బల్ల పరుపు నేల మీద గాలి హోరు బాగా తెలుస్తూ ఉంది.

మేం ప్రతీసారీ భోజనాలు కానిచ్చి కాస్సేపు అక్కడే రిలాక్స్ అవుతాం.

అక్కడి నుంచి లాస్ ఏంజిల్స్ దగ్గరకు వచ్చే వరకూ I-5 మీద ప్రయాణం చేస్తున్నంతసేపూ చుట్టూ దృశ్యం లో మార్పేమీ ఉండదు. కనుచూపు మేరలో ఏమీ కనిపించదు ఒకే లాంటి ఎండు గడ్డి ఎడారి లాంటి నేలలు తప్ప. రెండో రెస్ట్ ఏరియా మరో 60 మైళ్ల లో ఉంది కానీ అది ఎప్పుడూ మూసి ఉంటుంది ఎందుకో. ఇక్కడ ఫ్రీవేలకు మన దగ్గర్లా రోడ్లనానుకుని దుకాణాలు, హోటళ్లు ఏవీ ఉండవు. మధ్య మధ్యలో సైన్ బోర్డులు కనిపించినపుడు Exit లు తీసుకుని ఫ్రీవే మీంచి బయటకు కనుచూపు మేర ప్రయాణం చేయాలి. Santa Clarita సమీపానికి వచ్చేసరికి రోడ్డు  కొండలు ఎక్కుతూ దిగుతూ దూరంగా ఒక మహాద్భుతం దాగున్నట్టు వేగంగా జారుకుంటూ వంపులు తిరుగుతుంది.  ఇక శాన్ ఫెర్నాండో వేలీ సమీపానికి వచ్చేసరికి నగరం మొదలవుతుంది. హాలీవుడ్ సందర్శించాలనుకునే వారు నగరానికి ఉత్తరంగా ఉన్న ప్రాంతంలో బస చేయడం మంచిది. కాస్త చవకగానూ దాదాపు 10 మైళ్ల దూరంలోనూ మంచి హోటళ్లు దొరుకుతాయి. మా మొదటి బస సిలేమార్ లో. సాయంత్రం 4 గంటలకు చేరుకున్నాం. అప్పటికే మొదటి సారి లాంగ్ డ్రైవ్ తో బాగా అలిసి పోయాం. దారి పొడవునా పక్క పక్కనే పొడవాటి ట్రక్కులు పక్కనుంచి వెళుతుంటే గాలికి కదిలే కారు వాటి వైపు ఎట్రాక్ట్ అయిపోతున్న గగుర్పాటు. ఏకకాలంలో మొండిగా ఎదురీది, వేగం పెంచి అధిగమించే ధెర్యం, ఏదో గొప్ప విజయం సాధించిన అనుభూతి కలిగాయి ఆ మొదటి సారి డ్రెవింగులో. ఒకోసారి రెండు వైపులా ట్రక్కులుంటాయి మధ్యలో నుంచి వెళుతుంటే అసలు మనం ప్రయాణిస్తున్నామా లేదా అవే మనల్ని ముందుకు తీసుకెళున్నాయా అనిపిస్తుంది. ఏదేమైనా భలే కొత్త అనుభూతి నాకు. చలి ఇక్కడ కూడా మా ఊరి లాగే ఉంది. ఏమీ తేడా లేదు. పైగా శీతాకాలపు పొద్దు. బయటకు వెళ్లాలనిపించక రూం లోనే రెస్టు తీసుకున్నాం. ఇక రాత్రి భోజనానికి ఇంటి నుంచి తెచ్చుకున్న కాసిన్ని రోటీలతో సరిపెట్టుకున్నాం. కాసిన్ని ఉప్పులు, పప్పులు కూడా తెచ్చాను కానీ మళ్లీ ఆ రెండ్రోజుల్లో వండే తీరికా, ఓపికా కుదరలేదు. ఇక ఇప్పుడు సరే సరి. ప్రయాణం మొదలైన దగ్గర్నించీ బయట తినడమే. మెక్ డోనాల్డ్స్ బ్రేక్ ఫాస్టులు, రక రకాల అమెరికన్ రెస్టారెంట్ల లంచ్ లు, డిన్నర్లు. అందువల్ల బిల్లు బాగా పేలినా కారులో ఓ నాలుగు బేగ్ లు తగ్గుతాయి అని సత్య సంతోషం.

యూనివర్సల్ స్టూడియో

Universal studios

Universal studios

మొదటి రోజు హాలీవుడ్ లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత  యూనివర్సల్ స్టూడీయోస్ సందర్శనకు వెళ్లాం. అయిదింటికే లేపి గేటు తెరిచేసరికి అక్కడుండాలని హడావిడి పెట్టేడు సత్య. కార్ ని జురాసిక్ పార్కింగులో పెట్టి లోనికి ప్రవేశిద్దుము కదా- ఏదో న్యూయార్క్ లో ఉన్నట్టు(బోల్డు సినిమాల్లో చూసాను లెండి) ఒక పెద్ద వీధి లోనికి ప్రవేశించాము. బైట హోర్డింగులు, అద్దాల షాపులు, సినిమా థియేటర్లు ఇంకా ఎన్నో ఉన్నాయి. అప్పటికే మాలా వచ్చిన జనం అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు. అసలు ఎంట్రన్సు గేట్ వరకు చూస్తూ, ఫోటోలు తీసుకుంటూ నడీచే సరికి గంట పట్టింది. టిక్కెట్లు బాగా ఖరీదే మనిషికి 77 డాలర్లు. గేటు బయట ఇంకా పొద్దుటే పొగ మంచుగా ఉంది. Universal Studios అని తిరిగే గ్లోబు పొగలు చిమ్ముతూ ఆహ్వానం పలికింది. టిక్కెట్ట్ కౌంటరు నించి గేటు వరకు రెడ్ కార్పెట్ పరిచి ఉంటుంది. గేటు లోపలికి అడుగు పెట్టగానే డైరక్టరు, లైట్ బాయ్, కేమెరా మేన్ విగ్రహం చాలా ఆకట్టుకుంటుంది. ఒక్కటి కూడా వదిలి పెట్టకుండా అన్ని ఎట్రాక్షన్స్  చూడాలన్నది సత్య తపన. అలా అనే గేటు దగ్గరే మొదటిదైన  House of Horrors లోనికి తీసుకు పోయారు. నాకిలాంటివి పరమ భయం. అస్సలు నచ్చవు. కానీ ఇందులోనుంచి బయటకు తీసుకెళ్ళేటపుడు ఒక హాలు లోకి వస్తాం. అక్కడ కనిపించిన అగ్నిపర్వతం విస్ఫోటనం, చందమామ ఉదయం బాగా నచ్చాయి నాకు.

ఇక అసలు స్టూడియో టూర్ కి వెళ్లాకే ఏవైనా అని ప్లాన్ చేసుకున్నాం. అప్పటికే పెద్ద లైను ఉంది. లైను లో శీతాకాలం కాబట్టి  వేడి పొగలు అక్కడక్కడా నునువెచ్చగా ఉన్నాయి. వరు అక్కడే నుంచుంటానని పేచీ. మా వంతు ఒక గంట తర్వాత రానే వచ్చింది. టూర్ కి మొదట అయిదు, పది నిమిషాలూ ఏవో షెడ్లు చూపిస్తూ అందులో జరిగిన, జరుగుతున్న షూటింగుల గురించి చెప్పడం మొదలు పెట్టాడు మా మూడు పెట్టెల బస్సులోని గైడు. “అయిపోయామురా, ఏమీ లేనట్టుందిక్కడ” అన్నాడు సత్య. తర్వాత ఒకటొకటిగా ఏక్షన్ సీనులు ఎలా తీస్తారో ఒక్కొక్కటిగా చూపించడం మొదలు పెట్టారు. కార్లు పైకి లేచి పడిపోవడం , బాంబింగ్ సీన్ మళ్లీ మామూలుగా అన్నీ లోపలికి పోవడం సినిమా సెట్లున్న వీధుల్లోనుంచి వెళ్తుండగా కౌబాయ్ పేలుళ్లు, ఫైటింగ్ సీన్, Jaws సినిమా లోని చేప సెట్ అన్నీ వేటికవి విభిన్నంగా ఉన్నాయి. ఒక గుహ లోనికి తీసుకెళ్లి భూకంపం సీను చవి చూపిస్తారు. అయితే అన్నీ బస్సు లోనించే. ఎక్కడా దిగేది ఉండదు. నాకు అన్నిటికంటే బాగా నచ్చింది వరద, వర్షం  సీను. మనం చూస్తూండగానే చుట్టూ వాన కురుస్తూ పెద్ద వరద వచ్చి పడుతుంది. మనం గగుర్పాటు చెందేంత వరకు నీరొచ్చి వెళ్లి పోతుంది. చివరగా విమానం తునాతునకలైపోయిన సీను చూసేం. టూర్ గంట సేపు మంత్ర ముగ్ధుల్లా కూచున్నాం. అంత నేచురల్ గా చూపించగలిగిన టెక్నాలజీ చాలా అద్భుతంగా అనిపించింది.

Universal studios

Universal studios

మధ్యాహ్నం భోజనానికి All day Eat Pass ఒకటి 20 $ కు అమ్ముతారు. అది చాలా బెస్టు. ఎన్ని సార్లు కావాలన్నా తినొచ్చు రోజంతా, రాత్రి వరకు. ఎవరి చేతికి టాగ్ ఉందో వాళ్లే వెళ్ళి తెచ్చుకోవాలి, అదీ గాక పెద్ద లైనులు. అదీ ఒక అనుభవమే. Upper lot  లో ఉన్న attractions టైమింగ్సు  కుదరక lower lot లోనికెళ్లాం. దాదాపు నాలుగైదు పెద్ద ఎస్కలేటర్లు దిగి వెళ్లాలక్కడికి అదే కేవలం మెట్లు ఉంటే అక్కడికే చుక్కలు కనిపిస్తాయి ఎక్కి దిగే సరికి. ఒకే ఒక్క ride కు నేను వెళ్లేను. బాగా కళ్ళు తిరుగుతుంటే గట్టిగా కళ్ళు ముసుకుని కూచున్నాను. కొన్నిటికి వరు ఎత్తు సరిపోక పోవడం వల్ల నేను, వరు బైటే ఉండి పోయాం. సత్య దాదాపు అన్నిటినీ చూసొచ్చాడు. మళ్లాసారి వెళ్ళినపుడు మా అమ్మని కూడా అన్నిటికీ తీసుకెళ్ళేడు కోమల్. ఈ సారి నేనొక్కదాన్నే ఆకాశం కేసి, వచ్చి పోయే జనాల్ని చుస్తూ కూచున్నాను. నేను కేవలం షోలకు మాత్రమే వస్తానని మొండికేసాను. ఒక 4D షో కి  వెళ్లాం. ఇంతకీ 4D అని చెప్పి 3D సినిమాలో చిన్న చిన్న ఎఫెక్టులు ప్రత్యక్షం గా మనకు కలిగే ఏర్పాటు చేస్తారు. ఉదాహరణకి కుర్చీలు కదలడం, నీళ్లు ముందు సీట్ల లోంచి జల్లులు కురిపించడం వంటివి. వరు అయితే రెండు సార్లు మళ్లా అదే షో కి లాక్కెళ్లింది. ఒక తమాషా ఏమిటంటే మేం షో లోనికివెళ్ళే ముందు ప్రతీ దానికి వెయిటింగ్ పీరియడ్ లో కొంత చీకటిగా ఉన్న Introduction ఉంటుంది. అలాంటి చోట్ల వెనక వరుసలో ఉండి వింటున్న సమయంలో ఒక ఇద్దరు జంట గట్టిగా వాటేసుకుని ముద్దు పెట్టుకోవడాన్ని చూసింది వరు. బాగా చిన్న పిల్ల కావడం తో చూపు తిప్పకుండా వాళ్లనే చూడడం మొదలెట్టింది. ఇక్కడ పట్ట పగలు, రోడ్లపై కూడా అలాంటి దృశ్యాలు సర్వ సాధారణం. ఆ పిల్ల అప్పుడు చూసిన చూపు మాత్రం ఎప్పుడూ మర్చి పోలేను. నేను ముందుకు తల తిప్పించడానికి ప్రయతిస్తున్న కొలదీ వెనక్కి చూడడం. హాల్లోంచి ఉన్న చోటులోంచి కదిలేందుకు వీలు లేదు. అదీ అమెరికా సంగతి!

“Water World”  షో చివరి బాచ్ కు వెళ్లాం. వాటర్ వరల్డ్ సినిమా థీం live show అది. ఆ సినిమా లో సముద్రం లోపల డబ్బా రేకుల నివాసపు సెట్టు లో జరిగే ఫైటింగు, బాంబింగ్, చివరకు చిన్న ఫ్లైట్ వచ్చి పడ్డడం తో సహా జరిగే సన్నివేశాలు పెద్ద సెట్ లో చాలా బావుంటుంది. పిల్లలకు, పెద్దలకు అందరికీ నచ్చుతుంది. ముందు వరుసల్లో కూచుంటే మాత్రం బాగా తడిసి పోతాం.

రాత్రి వరకూ ఎలా గడిపామో తెలీదు అటు ఇటూ తిరుగుతూ. కానీ అన్నీ ఒక సారైనా చూసేందుకు పూర్తిగా ఒక రోజు పడుతుంది. రెండో సారి మేం వెళ్లినపుడు ఎందుకో టూర్ లో కూడా ఎక్కువ ఎట్రాక్షన్లు లేవు. బహుశా: వారాంతం కాకపోవడం వల్లననుకుంటా. ఏదేమైనా యూనివర్సల్ స్టూడియోస్ ఒకసారి తప్పని సరిగా చూడదగ్గ ప్రదేశం.

లాస్ ఏంజిల్స్ సిటీ టూర్

Hollywood Boleward

Hollywood Boleward

మర్నాడు మేం డిస్నీలాండ్ వర్సెస్ సిటీ టూర్ అనుకుని నేను సిటీ టూర్ కి వెళ్దామని పట్టుబట్టడం తో డీస్నీలాండ్ ను మరోసారి వచ్చినప్పటికి వాయిదా వేశాం. మేం ఇండియా లో ఉన్నపుడు ఏ నగరానికి వెళ్లినా city tour తప్పక పెట్టుకునే వాళ్లం. అందువల్ల హడావిడిగా అన్నీ చూసినా కనీసం సిటీ  పరిసరాలు తెలుస్తాయి కదా!

డౌన్ టౌన్ లోని Kodak Theater దగ్గర్లో ఉన్న ఒక city tour center దగ్గర కు ఉదయానే చేరుకున్నాం. అది రెండు పూటల టూర్. మనిషికి 55 డాలర్లు చెల్లించాం.  బస్సు అన్న సమయానికి అటు ఇటూగా రానే వచ్చింది. మమ్మల్ని ఒక డ్రైవర్ కం గైడ్ రిసీవ్ చేసుకున్నాడు. మాతో పాటూ ఉదయం మరో నలుగురైదురు కన్నా ఎక్కువ లేరు. అయిదు నిమిషాల్లో బస్సు ఫ్రీవే ఎక్కింది. ఇక బయట చూసేందుకేముంది? దూరంగా కనిపించే ఎత్తైన డౌన్ టౌన్ బిల్డింగులు తప్ప- బస్సు తిన్నగా బీచ్ రోడ్ లోకి వెళ్లింది.

Merina Del Ray harbour  ని బస్సు లోనించే చూడమన్నాడు. ఇది the world’s largest man-made pleasure boat harbor అని చెప్పేడు.  అక్కడి  నుంచి కనబడే Venice అనే ప్రాంతానికి తీసుకెళ్లేడు. ప్రతి వీథికీ ఒక కాలువ ఉండడం వల్ల ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందట. ఇక బీచ్ రోడ్ కి కొంత దూరం లో పార్కింగు లో ఆపి నడిచెళ్లి అరగంట లో వచ్చెయ్యమన్నాడు. అచ్చం మన ఇండియా లోని బట్టల బజార్ వీధిలా ఉంది. ఒడ్డున పొడవుగా బీచ్ ని ఆనుకుని ఉన్న వీధిలో los Angeles ప్రింట్ ఉన్న t-shirt లు, చెప్పులు మొదలైనవి చూడడానికి చవక రకమైనా ఖరీదు ఎక్కువే ఉన్నాయి. ఇక బీచ్ రోడ్ లో పక్యాత వాలీ బాల్ కోర్ట్ లో ఎన్ని సినిమాలు తీసేరో చెప్పేడు. అక్కడ అప్పుడు కూడా ఎవరో ఆడుతున్నారు. వరు బాత్రూం అని పేచీ పెడితే తీసుకెళ్లేను. India నుంచి వచ్చేక అంత వరస్ట్ గా ఉన్న బాత్రూములు మళ్లా ఎక్కడా చూడలేదు నేను. మళ్లీ ఇదుగో ఇక్కడ చూసేను. ఇక్కడ ఎక్కడా బాత్రూముల్లో నీళ్లు పొయ్యరు. మరి ఇక్కడేమిటో విభిన్నంగా ఉంది.

Disney Concert Hall

Disney Concert Hall

ఇక బీచ్ రోడ్డులో ఇసుకలో నడుద్దా మంటే చల్లని చలి. అయినా ఎందుకో పరిశుభ్రంగా లేదు ఆ ప్రాంతమంతా నాచు కొట్టుకు వచ్చి.

ఇక మళ్ళీ డ్రైవ్ పాస్ట్ లో Bay WAtch సీరియల్ తీసిన చోటు, Disney Concert Hall చూపించేడు. అక్కడి నుంచి తర్వాత మజిలీ ఫామస్ స్పానిష్ మార్కెట్ ఉన్న El Pueblo de Los Angeles Historic Park దగ్గర. ఇది  మొట్ట మొదట లాసేంజిల్స్ ప్రాంతానికి మెక్సికో నించి 1781 లో వలస వచ్చిన పదకొండు కుటుంబాలు  నివసించిన ప్రాంతం. మేం అక్కడ native Indian స్టైల్ లో ఉన్న టోపీ, వరు కి బాటరీ తో నడిస్తూ అరిచే కుక్క బొమ్మ కొన్నాం. ఆ బజార్ లో అలా దగ్గర దగ్గరగా ఉన్న దుకాణాల మధ్య తిరుగుతూ ఉంటే నాకు మొదటిసారి అమెరికా లో హైదరాబాద్ జనరల్ బజార్, ఢిల్లీ లోనూ, కలకత్తా లోనూ, ముంబయ్, మద్రాస్ ల లోనూ ఉన్న రకరకాల బజార్ లు అన్నీ గుర్తు కొచ్చేయి. ఆ ప్రాంతాలు రద్దీగా ఉంటాయి. ఇక్కడ ఖాళీగా ఉంది అదే తేడా.

El Paublo State historic park market

El Paublo State historic park market

భోజనాల సమయానికి మళ్ళీ వెనక్కి మొదలైన చోటికే వచ్చాం. ఒక గంట లో కనిపించమన్నాడు. మేం శనివారం కావడం తో దగ్గర్లోనే పార్కింగు లో ఉన్న మా కారు దగ్గరికి వెళ్లి, అక్కడే కూర్చుని తెచ్చుకున్న పళ్లూ, బిస్కట్లతో సరిపెట్టుకున్నాం. ఇక వరు మేగీ తేనే తెచ్చాను.

ఇక మధ్యాహ్నం టూర్ మా టూర్ ఆఫీసు దగ్గరే మొదలైంది. రోడ్డు పక్కన నడిచే పేవ్ మెంటు మీద ఉన్న స్టార్ లు, వాటి దగ్గర్లో ఉన్న చేతి ముద్రలు చూపే కార్యక్రమం  Hollywood walk of fame  అన్న మాట. నిజానికి పొద్దున్నంతా అదే పేవ్ మెంటు మీద అటూ ఇటూ నడిచినా అవేమిటో కిందకు తల వంచి చూడలేదు మేం.  ఇప్పుడు గైడు పుణ్యమా అని మళ్లీ ఒక రౌండ్ కొట్టేం రోడ్ల పక్కనే.

బాగా రద్దీగా ఉంది జనంతో ఆ ప్రాంతం. బయటి నించే Chinese theater, Kodak Theater  చూపించేడు. కొడాక్ థియేటర్ లోపలికి వెళ్లి చూడాలంటే మళ్లీ ఒక్కొక్కరికి $15 డాలర్లు టిక్కెట్టు తీసుకోవాలి. ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్, ఎమ్మీ అవార్డుల వంటి ఎన్నో ప్రతిష్టాత్మక బహుమతి ప్రదాన నిలయం ఇది. Grauman’s Chinese Theatre  బాగా ఖరీదైన సినిమా ప్రిమియర్ షోలకు, సినీ ప్రముఖులకే పరిమితమైన V.I.P స్థాయి థియేటర్. అయితే మామూలు జనం ఒక టూర్ గా లోపల చూడొచ్చు (టిక్కెట్టు మామూలే). బయటంతా కొందరు రకరకాల సినిమా కేరెక్టర్ల వేషాలతో వచ్చి ఫోటోలు తీయించుకున్న వారి దగ్గర డబ్బు వసూలు చేస్తున్నారు. వరు అడుగో Spider man ఇడిగో Bat man  అంటూ వాళ్ల వెనక నడిచింది కాసేపు.

Hollywood walk of fame

Hollywood walk of fame

ఇక మధ్యాహ్నం టూర్ మొత్తం సినీతారల నివాసమైన Beverly hills చుట్టు పక్కలే సాగింది. కేవలం గేట్లు మాత్రమే కనిపిస్తూన్న అనేక ఇళ్లు చూపించి అవేవో సినిమాల్లో ప్రసిద్ధ నటులవని బస్సులో నుంచే చూపించి చెప్పడం ప్రారంభించాడు మా గైడు. మాకు అప్పటికి అతను చెప్పిన ఒక్క పేరు కూడా తెలీదు. పైగా మాకు తెలిసిన పేర్లు ఒక్కటి కూడా వినబడకపోవడం తో టూర్ బాగా బోర్ గా ఉండి, నిద్రొచ్చేయడం మొదలైంది. ఇక డ్రైవర్ పక్కన రికార్డర్లో మ్యూజిక్ పెట్టుకుని పాట పాడడం మొదలెట్టాడు. ఒక పక్కన డ్రైవ్ చేస్తూ, గైడు గా అన్నీ చెపుతూ మధ్యలో పాట. మంచి కళాకారుడతను.

3.30 కల్లా మల్లా మమ్మల్ని మరలా వెనక్కు Hollywood Boulevard కు తీసుకొచ్చి పడేసాడు. అసలేం చూశామో అర్థం కాలేదు మాకు. ఇక అమెరికా లో city tour బస్సులు ఎక్కకూడదని నిర్ణయించుకున్నాం. అంత కంటే గూగుల్ లో ప్రాంతాలు, అడ్రసులు చూసుకుని, మా కారు లో వెళ్లి ఉంటే డబ్బులూ మిగిలేవి, నచ్చినవీ చూడగలిగే వాళ్లం.

నిజానికి జనసమ్మర్దం తో నిండి ఉన్న అన్ని మహా నగరాల్లాగే లాస్ ఏంజిల్స్ కూడా పారిశుద్ధ్య లోపంతో ఉంది. ఏదో ఒక రకమైన డస్టుతో నిండి ఉండి, ఎందుకో అందమైన నగరం అనిపించలేదు. అమెరికా లోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ సంవత్సరం పొడవునా వెచ్చని, సమతుల్యమైన  వాతావరణం ఉండడం వల్ల “హాలీవుడ్” ఏర్పడిందనుకుంటా.

పైకి కనిపించే భవంతుల నగర అంతర్భాగంలో ఎందరు కలల హర్మ్యాల్ని నిర్మించుకున్నారో! . హాలీవుడ్ బొలేవార్డ్ లో తిరిగే ఎందరో కళాకారులు నాకు ఇప్పటికీ జ్ఞప్తికి వస్తూ ఉన్నారు. లాస్ ఏంజిల్స్ కళల, కలల నిలయం. దానికి బహిర్ సౌందర్యం ఉందదు. అదొక ఆశల నిలయం. తిరిగే భూగోళం చుట్టూ ఉన్న అయస్కాంత వలయం. ఇక్కడికి చేరుకున్న వారిలో ఎవరో ఒకరు నక్షత్రాలై నేల పైన తమ చేతి ముద్రల్ని బహూకరిస్తూనే ఉన్నారు. తమదైన ఒక ముద్ర కోసం మిలియన్ల పోటీ జరుగుతూనే ఉంది. ఆ ప్రయత్నంలో ముందుకు దూసుకెళ్ళే వారెందరో! ఇసుకై రాలి పోయే వారెందరో! నగరం లో తిరిగే మనుష్యుల్ని చూస్తే ఒక రకమైన వేదన కలిగింది. వీరందరి ఆశలు నెరవేర్చు భగవంతుడా అని మనసులోనే ప్రార్థించాను.

గ్రిఫిత్ అబ్జర్వేటరీ

Griffith Observatory

Griffith Observatory

ఇక అక్కడి  నుంచి మా అంతట మేమే Griffith Observatory  చూసేందుకెళ్ళాం. హాలీవుడ్ బొలేవార్డ్ నుంచి దాదాపు అయిదు మైళ్ల దూరంలో హిల్లీ ఏరియా లో ఉంటుందది. పైకి వెళ్లే రోడ్దు కుడా చాలా చిన్నది. పైగా రోడ్డు పక్కనే పార్కు చేసి ఉన్న వాహనాలు. మాకు లక్కీగా పైన Observatory దగ్గర్లోనే పార్కింగు దొరికింది. కొండ మీద ఆ బిల్డింగు మూడు గోపురాల్తో  ఏకాకిగా గాలికి అడ్డం నిలబడి  అద్భుతంగా సాక్షాత్కరించింది. లాసేంజిల్స్ మొత్తం లో నాకు బాగా నచ్చిన ప్రదేశం అది. మేం వెళ్లేసరికి అయిదు కావస్తోంది. లోపల పైన అబ్జర్వేటరీ, ప్లానేటోరియం, కింద పిల్లలకు ఎగ్జిబిట్స్ ఉంటాయి. గ్రహాల్ని వాటి సైజుని బట్టి వరుసలో గాల్లో వేలాడ దీసిన ఎగ్జిబిట్ వరు తలెత్తి అలా చూస్తూనే ఉంది.  ఆ రోజు అక్కడి నుంచి 200 కాంతి సంవత్సరాల దూరం లో ఉన్న నక్షత్రాల్ని అక్కడి అతి పెద్ద Tele scope నుంచి చూసేందుకు అవకాశం ఉంది. బాగా వణికిస్తూన్న చలిలో Open air లో లైను లో గంటన్నర పైనే అందుకు నిలబడవలసి వచ్చినా మొదటి సారి అంత పెద్ద టెలీస్కోపు ను చూడడం,  అందులో నుంచి మనకు తెలీని విశ్వాన్ని చూడడం గొప్ప అనుభూతి. కానీ నిజానికి అక్కడే ఉన్న టీవీ స్క్రీన్ మీద కనిపించినంత స్పష్టం గా మనం చూసిన చోట కనిపించదు. అయినా చిన్నతనం నించి నాకు అదొక గొప్ప ఫాంటసీ.

చిన్నప్పుడు ఖగోళ శాస్త్రానికి సంబంధించిన “ఆకాశం ” పుస్తకం, అందులోని గ్రహాలు, నక్షత్రాలు, విశ్వ వింతలు చదివి వాటిని వేసవిలో ఆరుబయట పడుకున్నప్పుడల్లా పోల్చుకోవడానికి ప్రయత్నించి, ఎప్పటికైనా ఒక పెద్ద టెలీస్కోపు సంపాదించి అలా అన్నీ చూడాలని అనుకునేదాన్ని. ఆ కల ఇన్నాళ్లకు నెరవేరింది. అలా అక్కడ దాదాపు 4,5 గంటలు గడిపేసాం. అక్కడ పై నుంచి రాత్రి పూట ఆకాశం లోని నక్షత్రాలతో బాటూ కింద వెలుగుతూ కనిపించే లాసేంజిల్స్ నగర సౌందర్య దృశ్యం చూసి తీరవలసిందే.

Los Angeles View from Griffith Observatory

Los Angeles View from Griffith Observatory

అక్కడ నిలబడి ఆలోచిస్తే జీవితం ఎంత విచిత్రమైందో అనిపించింది. ఎక్కడ మొదలైంది నా ప్రయాణం? ఎన్ని తీరాలు దాటింది? ఈ నగరాన్ని ఇలా నా కళ్లతో చూడగలనని కలలోనైనా అనుకున్నానా? జీవితం ప్రసాదించిన అరుదైన వరం కాకపోతే! అయినా పైన కనిపించే విశాల విశ్వం ముందు మనమెంత?ఈ గగనపు అంచుల్లో నిలబడి ఎలుగెత్తి అరవాలని ఉంది. ఓ మహా నగరమా! నేను నిన్ను వీక్షిస్తున్నాను. నువ్వు ప్రేమగా పంచిన అనుభూతుల్ని నాతో భూగోళపు మరో వైపుకి తీసుకెళ్తున్నాను.

సంతోషంగా నిద్రించానారోజు.

నగర విశేషాలు ఇక్కడితో అయిపోలేదు వచ్చే సంచిక కోసం ఎదురుచూడడం మరిచిపోకండేం!

(వచ్చే సంచికలో లాస్ ఏంజిల్స్ -రెండవ భాగం)

………………………………………………

(http://vihanga.com/?p=2828)

ప్రకటనలు
This entry was posted in నా కళ్లతో అమెరికా(Travelog) and tagged , , . Bookmark the permalink.

8 Responses to నా కళ్లతో అమెరికా-4 (లాస్ ఏంజిల్స్-మొదటి భాగం)

 1. kalageeta అంటున్నారు:

  Vineela garu, Thanks a lot for your comment. I get lots of energy and encouragement when I see a comment.

 2. vineela అంటున్నారు:

  చాల బాగుందండి మీ యాత్ర విశేషాలు..నేను మొదటి సారి విసిటింగ్ కి లాస్ ఆంజెల్స్ వచ్చినప్పుడు ఎంత బాగుందో, ఇండియా లాంటి వెదర్ అది ఇది అనుకున్న..యూనివర్సల్ లో వాటర్ వరల్డ్ షో నాకు బాగా నచ్చింది..ఇంకా ష్రెక్, మమ్మీ చాల థ్రిల్లింగ్ గ వుంటాయి. ఇప్పుడు మాత్రం మా ఇంటికి వచ్చిన వాళ్ళని చాల సార్లు తీసుకొని వెళ్లి చాల బోర్ వచేసింది..గ్రిఫ్ఫిత్ పార్క్ చాల మంచి ఛాయస్. మరో విశ్వం కనిపిస్తుంది కళ్ళెదురు గా..మీరు అన్నట్టు గ ఏమి గొప్ప గ అనిపించడం లేదు ఇపుడు ఇక్కడ వుండటం మొదలెట్టాక..ఎపుడు ట్రాఫ్ఫిక్..జనాలు ఎవరకి ఎప్పుడు టైం వుండదు ఏంటో..అండ్ పొల్యుషన్..దూరపు కొండలు నునుపు అన్నట్టు బయట నుండి చూసి వెళ్తే పర్లేదు హాలీవుడ్..అందులో అవకాశం కోసం ఎందరు కష్టపడుతున్నారో ..బెవెర్లి హిల్స్ చూడడానికి ఎంత బాగున్నా పక్కనే స్లం ఏరియా చూసాక మల్లి అటు పోవాలి అనిపించదు. బె ఏరియా లో పచ్చదనం ఎక్కువ అనుకుంటాను..ఈ సారి వెళ్ళేటప్పుడు మీ పాత టప లు చదివి వెళ్తే ఏవి చూడాలో తెలుస్తుంది..ధన్యవాదాలు..ఇలాగె మరిన్ని అనుభవాలు మాతో పంచుకోండి..

 3. kalageeta అంటున్నారు:

  Vanaja@ Vanaja garu- nenu ekkada ela feel ayyano ala rastunnanu- antenandi-
  miku a vakyalu naccinanduku chala santruptiga, santhosham ga undi.
  Murthy@ Murthy garu- Miku naa rachanalu naccinaduku chala dhanyavadalu-

 4. vanajavanamali అంటున్నారు:

  గీత గారు..రెండు చోట్ల నా హృదయం ద్రవించింది.
  పైకి కనిపించే భవంతుల నగర అంతర్భాగంలో ఎందరు కలల హర్మ్యాల్ని నిర్మించుకున్నారో! . హాలీవుడ్ బొలేవార్డ్ లో తిరిగే ఎందరో కళాకారులు నాకు ఇప్పటికీ జ్ఞప్తికి వస్తూ ఉన్నారు. లాస్ ఏంజిల్స్ కళల, కలల నిలయం. దానికి బహిర్ సౌందర్యం ఉందదు. అదొక ఆశల నిలయం. తిరిగే భూగోళం చుట్టూ ఉన్న అయస్కాంత వలయం. ఇక్కడికి చేరుకున్న వారిలో ఎవరో ఒకరు నక్షత్రాలై నేల పైన తమ చేతి ముద్రల్ని బహూకరిస్తూనే ఉన్నారు. తమదైన ఒక ముద్ర కోసం మిలియన్ల పోటీ జరుగుతూనే ఉంది. ఆ ప్రయత్నంలో ముందుకు దూసుకెళ్ళే వారెందరో! ఇసుకై రాలి పోయే వారెందరో! నగరం లో తిరిగే మనుష్యుల్ని చూస్తే ఒక రకమైన వేదన కలిగింది. వీరందరి ఆశలు నెరవేర్చు భగవంతుడా అని మనసులోనే ప్రార్థించాను.
  &
  అక్కడ నిలబడి ఆలోచిస్తే జీవితం ఎంత విచిత్రమైందో అనిపించింది. ఎక్కడ మొదలైంది నా ప్రయాణం? ఎన్ని తీరాలు దాటింది? ఈ నగరాన్ని ఇలా నా కళ్లతో చూడగలనని కలలోనైనా అనుకున్నానా? జీవితం ప్రసాదించిన అరుదైన వరం కాకపోతే! అయినా పైన కనిపించే విశాల విశ్వం ముందు మనమెంత?ఈ గగనపు అంచుల్లో నిలబడి ఎలుగెత్తి అరవాలని ఉంది. ఓ మహా నగరమా! నేను నిన్ను వీక్షిస్తున్నాను. నువ్వు ప్రేమగా పంచిన అనుభూతుల్ని నాతో భూగోళపు మరో వైపుకి తీసుకెళ్తున్నాను.

  ఎంత చక్కని భావావిష్కారం. నాకు మీ టూర్ విశేషాల కన్నా మీ స్పందన బాగా నచ్చింది. .ఎంత ఫీల్!!!! గ్రేట్..

 5. kandurinmurthy అంటున్నారు:

  మీరు మీ లాస్ ఏంజిల్స్ పర్యటనను చాల చక్కగా వివరించారు. సాన్ హోసే లోని కమ్యూనికేషన్ హిల్ లో మా అమ్మాయి వుంటుంది. అక్కడకు వెళ్ళినప్పుడు, మమ్మల్ని LA కు తీసుకెళ్ళారు. కాని మీలాగా కారులో కాదు. కారులు వెళ్తే దారిపొడుగునా అన్ని చూసి ఆనందించ వచ్చు. మళ్లీ మాకు అక్కడికి వచ్చిన అనుభూతి కలిగింది. ఇలాగే వ్రాస్తువుండండి

 6. kalageeta అంటున్నారు:

  Madhuri@ Thanks Madhuri garu-Mi photos chala bavunnayi. Nenu kuda car lo numchi ilane Photolu tistuntanu.
  Manchu@ avunandi- Mountain View nunchi- Griffith chala mandiki teliyadu. Naakilantivi baga istam. Vetiki pattukuni mari chuse daka nidra radu.
  Manchupallaki! enta manchi peru enchukunnaru!! mi blog anta adbhutamganu umdi-

 7. manchupallakee అంటున్నారు:

  Sunnyvale/San Jose nundi vellaaraaa…
  Griffith Observatory tappa anni cover chesaam kaanee… pai photolu chusaaka Griffith Observatory elaa miss ayyaanaa anipistundi.

 8. Madhavi Kavuri అంటున్నారు:

  chaalaa baaga chepparandee…..
  mallee maa LA tour gurtuchesaaru
  meeku telusaa memu kooda vachina first lo long drive vellindi L.A. ne
  adi kooda rental car lo and oke week lo rendu sarlu vellalsi vachindi
  first time iddaram and 2nd time relatives vaste vallatho……. inka driving enta alavaataipoindi aa tarvata……

  appudu car aapakunda 90 speed lo teesina pics ae ivi : http://yoursmaddy.blogspot.com/2010/01/blog-post.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s