నా కళ్లతో అమెరికా-5 లాస్ ఏంజిల్స్ (రెండవ భాగం)

లాస్ ఏంజిల్స్  (రెండవ  భాగం)

Dr K.Geeta

 

ఉదయానే నిద్రలేచి ముందు రెండ్రోజుల మా యూనివర్సల్ స్టూడియోస్, హాలీవుడ్, సిటీ టూర్, గ్రిఫిత్ అబ్జర్వేటరీల గురించి గుర్తుచేసుకుని కాసేపు కబుర్లు చెప్పుకున్నాం. హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ ఫ్రీ అదేమిటో చూద్దామని ఆఫీసు దగ్గరకెళ్లాం.  కాసిన్ని మఫిన్లు, బ్రెడ్ స్లైసులు- నిట్టూర్చి కాస్త ఆపిల్ జ్యూస్, కొంచెం పాలు లేని కాఫీ తెచ్చుకుని అయ్యిందనిపించాం. ఇప్పుడైతే రూం బుక్ చేసుకునే ముందు “కాంటినెంటల్ బ్రేక్ ఫాస్ట్” అని ఉంటేనే వెళ్తున్నాం గానీ అప్పుడు కొత్త కదా-అయినా అది కూడా పెద్ద గొప్పేం కాదు-  స్క్రాంబుల్డ్ ఎగ్స్, బేకన్, సాసేజ్లు వంటివి అదనంగా ఉంటాయి కానీ ఇడ్లీలు, దోసెలు ఉండవుగా . నేనైతే ఎప్పుడూ నంజడమే, ఏదో తిన్నాననిపించడమే.

డిస్నీలాండ్
ఇక  లాస్ ఏంజిల్స్ టూర్ లో మరో ఘట్టం మేం రెండోసారి వెళ్లినప్పటి నించి  మొదలు పెడతాను.  ఈ సారి ముందుగా డిస్నీలాండ్ ప్లాన్ చేసుకున్నాం. డిస్నీలాండ్ నగరానికి దక్షిణంగా Anaheim లో ఉంటుంది.  మంచి ట్రాఫిక్ సమయం లో యూనివర్సల్ స్టూడియోస్ నుంచి డిస్నీలాండ్ కు వెళ్లాలంటే సమయం అంతా రోడ్డు మీదే వృథా అయిపోతుంది. అందుకే బస ఎక్కడికక్కడ దగ్గరగా ఏర్పాటు చేసుకోవడం మంచిది.  మెయిన్ గేటు నించి రెండు, మూడు సిగ్నల్స్ దూరం లోనే మేం హోటల్ తీసుకున్నాం.
అయినా డిస్నీలాండ్ కారు పార్కింగు ఎక్కడో అర్థం కాలేదు. నిజానికి అసలు పార్కింగ్ అని ఉన్నది ఏదో కారణాల వల్ల మూసి ఉంది. అలాగని మెయిన్ గేటు దగ్గర డ్రాప్ ఇన్ తప్ప పార్కింగు లేదు. రోడ్లపై ఉన్న డైరక్షన్లు పట్టుకుని మూడు సార్లు అక్కడక్కడే రౌండ్లు కొట్టాం. అయినా లాభం లేక పోయింది. ఇక నేను మెయిన్ గేటు దగ్గర దిగి సెక్యూరిటీని అడిగితే వాళ్లు కాగితం మీద గీసి ఇచ్చారు. అదెక్కడో మరో చోట. ఇలాంటివి  GPS లో, గూగుల్ లో ఉండవు. డిస్నీలాండ్ అఫీషియల్ వెబ్ సైట్ లోనూ ఇన్ ఫర్మేషన్ లేదు. బాగా ఇబ్బంది పడ్డాం. ఆ పార్కింగు నించి మళ్లా షటిల్స్ ఎక్కడానికి కొంత దూరం నడవాలి. నాకు 8 వ నెల నిండుతూంది. అయినా హుషారుగా బయలు దేరాను. మా అమ్మ ఉందిగా నాతో అన్న ధీమాతో. షటిల్ దిగాక ఇంక నాకు నడిచే ఓపిక పోయింది. బయటే Electric Convenience Vehicle (ECV) (ఎలక్ట్రిక్ వీల్ ఛైర్ ) ఒకటి అద్దెకి తీసుకున్నాం. నా సమస్య తీరింది.  కాకపోతే ఒక దానికి ఆ రోజుకి అద్దె 50 డాలర్లు. నేను దానికి “స్కూటర్” అని పేరు పెట్టుకున్నాను.
డిస్నీ లాండ్ రెండు రకాల థీం పార్కులుగా ఉంటుంది. ఒకటి పూర్తిగా చిన్న పిల్లల కోసం Disney land park, రెండు పెద్ద పిల్లలకి, పెద్ద వాళ్లకి Disney California Adventure park. రెండు పార్కుల లోను కలిపి 85కు మించిన Attractions, Rides ఉన్నాయి. అన్నిటినీ చూడడం బహుశా రెండు రోజులలో కూడా సాధ్యం కాదు. వీటితో పాటూ షోలు, పెరేడ్లు కూడా ఉంటాయి. పైగా సెలవుల్లో బోల్డు జనం. ప్రతి దానికీ పెద్ద లైన్లు. ఈ పెద్ద లైన్లు తప్పించుకోవడానికి fast pass సర్వీసులుంటాయి. కానీ ఒక సారి అది తీసుకుని ఒక చోటికి వెళితే ఆ కార్యక్రమం మొదలయ్యే వరకు ఇంకొకటి ఇవ్వరు. ఇలా రోజు మొత్తం మీద ఆ fast pass  సర్వీసుని మహా అయితే 3,4 సార్ల కంటే ఎక్కువ ఉపయోగించుకోలేం. ఇక ఒక రోజులో 2 పార్కులు ప్లాన్ చేసుకుంటే ఏమి చూస్తున్నామో మనకే అర్థం కాదు. అయితే మొదటిసారి చూసొచ్చి, మరో సారి ప్లాన్ చేసుకోవాలి. లేదా కొన్ని మాత్రమే ముందే నిర్ణయించుకుని చూడాలి. లేదా ఒక రోజు ఒక పార్కు, మరో రోజు మరో పార్కు పెట్టుకోవాలి. ఇక మేమెం చేసేమో చెప్తాను.  తర్జనభర్జనలు  లేకుండా చిన్న పిల్లల పార్కుకే వెళ్లాల్సిందని మా వరు మారాం చేసింది. అసలు వచ్చిందే ఆ పిల్ల కోసం కాబట్టి ముందటు దారి తీసాం. లోపలికి నడిచే కొలదీ ఒక దాని తర్వాత ఒకటి ఎట్రాక్షన్స్ వస్తూనే ఉంటాయి. పొద్దుటే పార్కింగు ప్రహసనంతో ఓ గంట ఆలస్యంగా వచ్చాం అసలే. ఏదో రంగుల రాట్నం, మరేదో గుహలోనుంచి వెళ్లే రైలు లైన్లలో నిలబడి బయటకు వచ్చేసరికే పదకొండు అయ్యింది. నేను వీళ్లతో దేనికీ వెళ్లలేను కాబట్టి( పైగా నా దగ్గర ఒక riding scooter) ఉంది కాబట్టి వీళ్ల కోసం fast pass లు తేవడం పనిగా పెట్టుకున్నాను. మెషిన్ దగ్గరకు వెళ్లి టిక్కెట్టు  చూపిస్తే next pass వస్తుంది. అయితే ఏ attraction కు వెళ్దామనుకుంటామో అక్కడే తీసుకోవాలి. నేను చక చకా స్కూటర్ మీద  వెళ్లి వీళ్లలో ఎవరెవరు వెళ్తానంటే వాళ్లకు పాస్ లు తెచ్చేదాన్ని. అంతే కాకుండా అసలు ఇలా బాగా బిజీ అయిపోయి అసలెవరూ టైముకి తిండీ తిప్పలు తినలేదు. ఇక నేనే వెళ్ళి కొని తెచ్చి పెట్టాను. సగం రోజు తర్వాత మొదటి పార్కు ఇంకా 50%  చూడకుండానే మరో పార్కుకి వెళ్ళాల్సొచ్చింది. మళ్లీ అక్కడ కూడా లైన్లలో నిలబడాల్సిందే. అయితే మధ్యలో మళ్ళీ మొదటి పార్కులో షోల కోసం అటూ, మళ్ళీ ఇక్కడ rides కోసం ఇటూ నడిచి, నడిచి బాగా అలిసి పోయారు పాపం. మధ్య చాలా దూరాలు నడవాలి. సాయంత్రానికి అందరికీ ఓపికలు అయ్యిపోయాయి. ఇక చీకటి పడే సమయానికి రెండో పార్కులో ఏదో “World of Color fountains” అనే లేజర్ ఫౌన్ టైన్ షో కోసం అడ్డదారులన్నీ మూసి వేసారు. ఇక ఆ మూల చిక్కుకున్న వాళ్లకి ఈ మూలకి రావాలంటే పార్కు అంతా చుట్టి రావడం ఒక్కటే తప్ప మరో మార్గం లేదు. పోనీ ఆ ప్రోగ్రాం ఏదో చూద్దామంటే ముందుగా టిక్కెట్లు తీసుకుని ప్రోగ్రాం కు రెండు గంటల ముందే వెళ్ళి కూచోవాలి. నిజానికి అది ఓపెన్ ఎయిర్లోనే జరుగుతూన్నా చుట్టూ మూగిన జనం వల్ల ఏమీ సరిగా  కనబడలేదు. నేను ఎక్కువ సేపు నిలబడలేక కనిపించిన మేరే చూసేను. అయితే రోజంతా అలాంటి ఒక స్కూటర్ అద్దెకు తీసుకోకపోతే నా పని ఒక గంట లోనే అయ్యిపోయేది.
అన్నిటిలోకీ చెప్పుకోదగినది, అద్భుతమనిపించేదీ రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో జరిగే పెద్ద Fire works. ఇవి జూలై4 న బయట జరిగే వాటికంటే చాలా పెద్దవి, ఇంకా రకరకాల వెరైటీలు కలిగినవి. అది జూన్ నెల, పైగా మంచి వెచ్చగా ఉండే రోజులు కాబట్టి అలా రాత్రి 9.30 వరకు బయట తిరగగలిగేం. అయినా లాస్ ఏంజిల్స్ లో ఇక్కడ మా కంటే కొంచెం వెచ్చగానే ఉంటుంది.
డిస్నీలాండ్ ఒక కలల ప్రపంచానికి ప్రతిరూపం. వాల్ట్ డిస్నీ కలల సాక్షాత్కారం. 1955 లో ప్రారంభించబడి మొదట 7 నెలలలోనే మిలియన్ మందిని రప్పించగలిగిన  ప్రతిభ గలిగినది.  1966 లోనే వాల్ట్ డిస్నీ మరణించినా ఆయన కలలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. అదీ చెప్పుకోదగిన విషయం. ఏదైనా ప్రారంభించడం కంటే దానిని కొనసాగించడం చాల కష్టమైన పని. వాళ్ల అదృష్టం కొలదీ ఆ రెండో పని  బాగా జరుగుతూండడం వల్ల ఇప్పటికీ డిస్నీలాండ్ ప్రపంచం లో ఎన్నదగిన గొప్ప పార్కుగా ఉంది. పార్కులో అడుగు పెడుతూనే Main Street లోంచి దూరంగా కలల కోట దర్శన మిస్తుంది. పార్కులో ఎక్కడ చూసినా ఎటు చూసినా పిల్లలకు అన్నీ నిజమనిపించే భ్రాంతి కలిగేలా చాలా గొప్పగా, అందంగా తీర్చి దిద్ది ఉంటాయి. ఇక రాకుమారిణుల వేషధారణల్లో ఉన్న అమ్మాయిలు అటూ ఇటూ తిరుగుతూ చిన్న పిల్లల దగ్గర కెళ్లి కబుర్లు చెబుతూ, చెప్పిస్తూ ఫోటోలకు సహకరిస్తూ ఉంటారు. ఆ అమ్మాయిలు నిజంగానే చిదిమితే పాలుగారే బుగ్గలతో అందంగా ఉండడం విశేషం. నాకు ఆ కేరెక్టర్ల పేర్లు కూడా పెద్దగా తెలీదు. కానీ మా వరు అదుగో జాస్మిన్ , స్నో వైట్, ఏరియల్, సిండ్రెల్లా, రెపాంజల్, అరోరా…  ఇదుగో అంటూ రకరకాల princess ల పేర్లు చెబుతూ తెగ ఆనందపడిపోయింది.
మధ్యలో ఉన్న rides, attractions మాట అలా ఉంచితే అసలా సెట్టింగ్స్ వెనక ఉన్న కళా హృదయాలకు నమోవాకాలర్పించ వచ్చు. ఇక మిక్కీ మౌస్, స్పాంజి బాబ్, డొనాల్డ్ డక్, ఆలీస్ ఇన్ ద వండెర్లాండ్ లాంటి టూన్ కేరెక్టర్ల వెంటపడని చిన్నపిల్లలుండరంటే అతిశయోక్తి కాదేమో. కానీ ప్రతి రాకుమారి కథా చివరకు ఒక రాజకుమారుడితో పెళ్లితో ముగుస్తుంది. ఇప్పటి కాలానికి సరిపడే కలలు కావు అవి. అందుకే నిర్వాహకులు తెలివిగా Star wars దగ్గర్నించి నిన్న మొన్నటి Toy story , Finding Nemo మొ.న సినిమాల థీంస్ వరకూ అన్నిటినీ ప్రదర్శనల లో భాగం చేశారు. ఇలాంటి చోట్లకి వెళితే అసలు సమయం తెలీదు. పెద్దవాళ్లం త్వరగా అలిసి పోతాం కానీ పిల్లలకు అక్కడి నుంచి రావాలనిపించదు. అసలింత పెద్ద పార్కు, ఇన్ని ఆకర్షణలు చాలా ఎక్కువేమో అనికూడా అనిపిస్తుంది.
ఇక రెండో పార్కు లో అతి పెద్ద రొలర్ కోస్టర్, జెయింట్ వీల్ వంటివే గాక  పైకి కనిపించని వెన్నో థ్రిల్ రైడ్స్ వంటివి ఉన్నాయి.  పెద్ద లైన్ల లో నిలబడి వీటన్నిటి వెంటా సందర్శకులు పరుగులు తీస్తూనే ఉంటారు. అయితే లైన్లకు ముందే Wait time బోర్డులు ఉంటాయి. అది చూసుకుని ప్లాన్ చేసుకోవచ్చు.
ఒక రోజుకి వంద డాలర్ల పై చిలుకు టిక్కెట్టు పెట్టుకుని వచ్చినా తినడానికి మళ్లీ భారీగా ఖర్చుపెట్టవలసిందే. అయినా జనం. కిటకిటలాడుతూ బోల్డు మంది జనం. ఇక్కడ సాధారణం గా అంత మంది జనం ఎక్కడా కనిపించరు. కొందరు అలా జనం సందడి చూడడం కోసమే వస్తారా అనిపిస్తుంది. ఇక India నుంచి ఎవరి తరఫు వాళ్లొచ్చినా తప్పని సరిగా లాస్ ఏంజిల్స్  ప్రయాణం పెట్టక మానరు ఎవ్వరూ. అదృష్టం కొద్దీ ఆ ప్రయాణం లో మా అమ్మ మాతో ఉండడం వల్ల  ఇద్దరం కబుర్లు బాగా చెప్పుకునే వాళ్లం. చిన్నచిన్న పిల్లలు అక్కడ మొక్క జొన్న పొత్తులతో పాటు అమ్ముతున్న పెద్ద పెద్ద టర్కీ కాళ్లు చేత్తో పట్టుకుని చకచకా అయిసుప్రూటు తిన్నంత సునాయాసం గా లాగించేస్తూంటారు.
అయితే హడావిడిగా పరుగెత్తే మనుషులు తప్ప వాళ్లని తాపీగా నాలా గమనించే వారెవరూ ఉండరనుకుంటా. మా చిన్నతనం లో giant wheel ఎక్కించారు మమ్మల్ని. ఒక్కొక్కళ్లం ఒక్కో తొట్టెలో కూచున్నాం. నేను భయపడ్తూనే ఎక్కాను. అది సరిగ్గా పై వరకూ వెళ్లి అక్కడ ఏదో ప్రాబ్లెం వల్ల చాలా సేపు ఆగి పోయింది. ఇక నా అరుపులు చూడాలి. కిందకు దించే వరకూ గోల గోల పెట్టేసాను. ఇప్పటికీ అలా కాళ్లు గాలిలో వేలాడ దీసి ఆధారం లేకుండా ఉన్న తొట్టె లోంచి అమాంతం కిందకు పడిపోతున్నట్టు కలలు వస్తాయి నాకు. వీళ్లు ఇలా తలకిందులుగా తిరుగుతున్న రోలర్ కోస్టర్లలో ఎలా ధైర్యంగా ఎక్కేస్తున్నారో అనిపించింది. మా కోమల్ కు, వరుకు అస్సలు ఏదీ భయం ఉండదు. అన్నిటికీ తయారు. ఇక సత్య సరే సరి. నేను వట్టి మనిషిని కాదు కాబట్టి అదృష్టం కొలదీ తప్పించుకున్నాను ఈ సారికి.
మొత్తానికి ఒక మంచి అనుభూతి అందరికీ. మళ్లీ వచ్చినప్పుడు అన్నీ పూర్తిగా చూద్దాం. అని చెప్పుకున్నారు వీళ్లల్లో వీళ్లే. మా అమ్మని అంత హుషారుగా అన్నిటిలో  participate  చేయడం ఈ మధ్య కాలంలో చూళ్లేదు నేను. పిల్లలతో చక్కగా  హాయిగా నవ్వుతూ అన్నిటికీ తను attend అవుతూంటే నాకు ఎంతో ముచ్చటగా, సంతృప్తిగా అనిపించింది. మా నాన్న గారు అమెరికా చూడాలని ఎన్నో కలలు కన్నారు. కానీ అవన్నీ నెరవేరక ముందే కాలం చేసారు. నాకు ఇక్కడికొచ్చినప్పటి నుంచీ అదే బాధగా ఉండేది. “అయ్యో! ఇప్పుడు నేనిక్కడ ఉన్నాను కానీ ఆయన కల నెరవేర్చ లేక పోయానే”  అని. అయినా మాతో మా అమ్మ ఉన్నంత సేపూ ఆయన కూడా నడుస్తూ అన్నీ చూస్తున్న భ్రాంతి కలిగింది నాకు ప్రతి చోటా.  అమెరికా ఆయన లాంటి వాళ్ల ప్రపంచం. బంధనాలు లేని స్వేచ్ఛా ప్రపంచం.
డిస్నీలాండ్ నుంచి తిరిగి మా బసకు వచ్చే సరికి రాత్రి పది దాటింది. అంతా బాగా అలిసి పోయి ఎక్కడి వాళ్లక్కడ పడి నిద్ర పోయారు.

ఈ స్లైడ్ ప్రదర్శన కోసం జావాస్క్రిప్ట్ అవసరం.


తిరుగు ప్రయాణం
లాస్ ఏంజిల్స్  ప్రయాణంలో చాలా చాలా ఆహ్లాదకరమైనది హైవే 1 మీద నుంచి వచ్చే తిరుగు ప్రయాణం. మేం మొదటిసారి దారిలో Danish Town “Solvang” ను చూడాలని అటు మీదుగా  వచ్చేం. ఇక అప్పటి నుంచీ ఎప్పుడటు వెళ్లినా తిరిగొచ్చేటప్పుడు ఇలానే వస్తాం. నిజానికీ రోడ్డు నుంచి వస్తే మరో 70 మైళ్లు ఎక్కువ ప్రయాణం చేయాలి. కానీ అలా చేసామని కూడా అనిపించదు మనకు. ఎందుకంటే మలుపుకోసారి ఆత్మీయంగా పలకరిస్తూ బృహత్సముద్రుడు మన వెంటే వస్తూ ఉంటాడు మరి! లాస్ ఏంజిల్స్  ఉత్తర భాగమైన శాన్ ఫెర్నాండో వాలీ మీదుగా హైవే 1 మీదకు ప్రవేశించాం.
వెంచురా
అరవై మైళ్లు ప్రయాణించామో లేదో ఎదురుగా విశాలమైన అద్భుత దృశ్యం. మబ్బు కమ్మిన పదకొండు గంటల వేళ కారు అద్దాల నిశ్శబ్దం లోకి దూసుకు వస్తున్నట్టు ప్రతిధ్వనిస్తూన్న అలల భీకర స్వరూపం. ఒడ్డున కనుచూపు మేర అందంగా పరుచుకుని ఉన్న ఇసుక  కంబళీ.  ఆకాశం అమాంతంగా విరుచుకు పడుతుందేమోనన్నట్లు పరుగులు తీస్తూన్న కారు మబ్బులు. ఆ ఊరి పేరు “Ventura”.  “వానైనా, వరదైనా తప్పని సరిగా ఆగి తీరాల్సిందే “అని నేను పట్టుబట్టడం తో exit తీసుకున్నాం. అక్కడ RV park(పార్కింగు) లోనికెళితే $10 టిక్కెట్టు తీసుకోవాలి. అక్కడి నుంచి మాత్రమే సముద్రం ఒడ్డుకు దారి ఉంది. తీరా మేం ఆగేసరికి వాన సూదులు జల్లిస్తున్నట్లు పడ్డం మొదలైంది. ఇక ఆగి, కొండ మీంచి కిందకు వెళ్లే ప్రయత్నం మానుకుని పైనించే ఫోటోలతో సరిపెట్టుకున్నాం. కారు మలుపు తిరుగుతూన్నా నేనింకా ఆశగా అటే చూడడం గమనించి ” మరో సారి తప్పుకుండా వెళ్దాం” అన్నాడు సత్య. ఇప్పుడిక్కడ మాంఛి వెచ్చని మన వేసవి ఉంటేనా అనుకున్నాను. అమాంతంగా సముద్రాన్ని కౌగలించుకోనూ! ఇసుకలో పడుకుని ఆకాశాన్ని అపురూపంగా చూసుకోనూ! వెనక్కి తిరిగి మా అమ్మ వైపు చూసేను. తను కూడా అదే తన్మయత్వంతో చూస్తూ “మబ్బులు, సముద్రం, ఆకాశం అన్నీ ఒక్కసారిగా ఎలా నృత్యం చేస్తున్నట్లున్నాయో!”  అంది. “నాకైతే ఆ మబ్బులు “black sheep” లాగా ఉన్నాయి ” అంది వరు. మూడో తరం కవయిత్రి మరి! అందరం నవ్వుతూ వెంచురా కి వీడ్కోలు పలికేం.

శాంతా బార్బరా
శాన్ ఫెర్నాండో వాలీ నుంచి దాదాపు 90 మైళ్ల దూరంలో ఉంటుంది Santa Barbara. మేం మొదటి సారి Lunch break కోసం అన్నట్లు సముద్రం ఒడ్డున restaurants చూద్దామని వెళ్లాం. అప్పటి నుంచీ ప్రతిసారీ ఆ ఊరి బీచ్ రోడ్లో కాస్సేపు ఆగకుండా రాం. హార్బర్ వైపున్న వెస్ట్ బీచ్ నుంచి అటు ఈస్ట్ బీచ్ వరకు దాదాపు మైలు పాటు రోడ్డునానుకుని ఉన్న కాలిబాట మీద ఎవరికి వాళ్లే తొక్కుకునే ఫామిలీ రిక్షాలు, సైకిళ్లు అద్దెకు  దొరుకుతాయి. మేం ఈ సారి వెళ్లినపుడు పిల్లలు అదేదో ఎక్కాల్సిందేనని పేచీ పెట్టడం తో ఒక గంటకు 35 డాలర్లు చెల్లించాం.  అమ్మ, నేను వెనక కూచున్నాం. ముందు సీట్ల వాళ్లు తొక్కాలి. ముందు పది నిమిషాలు బాగా హుషారుగానే నడిపారు వీళ్లు. ఆ తర్వాత ఇక సరదా అయిపోయి మొహాలు వేళ్లాడదీసారు. మేం బాగా నవ్వుకున్నాం.
ఇక నీళ్లలోకి వెళ్లి ఆడతానని వరు ఒకటే పరుగులు. బీచ్ చూసిందంటే ఎంత చలైనా ఆడతానని పేచీ పెడుతుంది. మధ్యాహ్నం భోజనానికి సముద్రం లోకి వంతెనలా సాగి ఉన్న కట్టడం మీద restaurants ల లో ఒక seafood రెస్టారంట్ కు వెళ్లాం. ఆవురావురుమని బ్రెడ్లు ఆదరా బాదరాగా పిల్లలు తింటూ ఉంటే మా అమ్మ అంది. ” వీళ్లకిలా రోజూ ఇంత టైము వరకు భోజనం పెట్టకుండా ఉంటే నిన్ను ఏడిపించకుండా అన్నం తింటారు.” అని. అది అక్షరాలా సత్యం. ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు తప్ప వీళ్లకు అస్సలు తిండి ధ్యాస ఉండదు.
మేం శాంతా బార్బరాకు చేరుకునేటప్పటికి అదృష్టం కొద్దీ మంచి ఎండ వచ్చింది. కానీ బీచ్ లోకి వెళ్లి కాళ్లు ముంచేటంత ఎండైతే కాదు. వెల్తురు నురగల్ని అద్దుకుని కెరటాలతో మురిపిస్తూన్న సాగర తీరాన్ని తనివి తీరా చూస్తూ భోజనాలు కానిచ్చేం. సీగల్ పక్షులు ఒక్కొక్కటిగా  వాలి పైకి లేస్తూ అలలకి రెక్కలతో వీవెనలు వీస్తున్నట్లున్నాయి.
అక్కడి నుంచి Down town కు వెళ్లేందుకు కేవలం 25 సెంట్ల టిక్కెట్టు తో electric shuttle బస్సులు తిరుగుతాయి. బీచ్ రోడ్ లో Visitor Center కు ఎదురుగా ఉన్న కార్ పార్కింగ్ నానుకుని ఆ రోజు Art Exhibition జరుగుతూంది. మొత్తం రోడ్డు పక్కనంతా రంగుల హరివిల్లు కనువిందు చేసింది. ఇలాంటి ఎగ్జిబిషన్స్ మా పిల్లలకు మహా ఇష్టం. బొమ్మలు గీయడమంటే అందరికీ ఇంట్రస్టే. ఇక అక్కడి నుంచి వీళ్లని కదల్చడానికి చాలా కష్ట పడాల్సి వచ్చింది. మేం రాత్రి లోగా ఇల్లు చేరాలంటే ఇక అప్పటికైనా బయలుదేరక తప్పదు మరి. అక్కడి నుంచి ఇంకా దాదాపు 300 మైళ్లు వెళ్లాలి మేం. లాస్ ఏంజిల్స్  నుంచి వచ్చేటప్పుడు ఒక రోజంతా ఉండగలిగిన మంచి సముద్ర తీర ప్రదేశం శాంతా బార్బరా.

సోల్వాంగ్
అక్కడి నుంచి దాదాపు 40 మెళ్ల దూరం లో ఉన్న Solvang ప్రధాన రహదారి నుంచి  కొంచెం లోపలికి మరో రహదారి  మీదుగా అరగంట  వెళ్లాల్సి వచ్చినా, చూడదగ్గ ప్రదేశం. అదొక అందమైన డానిష్ టౌన్. చూడచక్కని రంగులు ఒకేలాంటి కట్టడ నిర్మాణాలు వీరి ప్రత్యేకత. డానిష్ కట్టడాలలో మంచి ఆర్కిటెక్చర్ కనువిందు చేస్తుంది. ఇక్కడ డానిష్ సంస్కృతిని ప్రతిబింబించే విశేషాలెన్నో చూడవచ్చు. కొంత మంది వారి ప్రాంతీయ వస్త్ర ధారణ లోనే కనిపిస్తారు. డానిష్ చాకొలెట్లు, ఐస్ క్రీములు ఒకటేమిటి సమస్తం వారి ప్రత్యేక సంస్కృతిని తెలియజేసేవే. ఒక పాత కాలపు విండ్ మిల్ ఇప్పటికీ అలానే  ఉంది.

పిస్మో బీచ్
తిరిగి మేం హైవే 101 మీదకు వచ్చే సరికి బాగా వర్షం పడి వెల్సినట్లుంది. రోడ్ల మలుపుల్లో  ఆకాశపు సాయంత్రపు వెలుగులు మెరిసి మాయమవుతున్నాయి. రోడ్డుకి దిగువగా దూరంగా సముద్రం కనిపిస్తూ, కవ్విస్తూ ఉంది. సోల్వాంగ్ నుంచి దాదాపు 55 మైళ్ల దూరం లో Pismo Beach ఉంది. అక్కడి నుంచి హైవే 101 inland మీదుగా వెళ్లిపోతుంది. సముద్రపు ఒడ్డున హైవే 1 గా ముందుకు కొనసాగుతుంది. మేం వెళ్లాల్సింది 101 మీద. అయితే కనీసం అరగంటైనా పిస్మో బీచ్ లో గడుపుదామని ఊరు లోనికి కారు తిప్పి బీచ్ రోడ్ కు చేరుకున్నాం. ఎదురుగా కొంత దూరం సముద్రం లోకి నిర్మంచబడిన బ్రిడ్జి వెనకగా ప్రకాశించే సంజె నారింజ ఆకాశం, ఒడ్డున ఇసుక మీద తడి ఆరని ఎగిసి పడే అలల నురుగుల పారాణి. ఎత్తు నుంచి కింద కేరింతలు కొడుతూ ఒడ్డున గిరికీలు కొడ్తున్న సీగల్ పక్షులతో బాటూ పరుగెత్తే చిన్నపిల్లలు, చలి గాలి లోనూ పరిమిత వస్త్ర ధారులై తిరుగుతున్న జనం. బ్రిడ్జ్ దిగామంటే ఇక అక్కడే చీకటి పడిపోతుంది. తప్పని సరై అరగంట మాత్రమే గడిపి వెనుతిరిగాం. నాకెందుకో యూసోమిటీ లో బ్రైడల్ వైల్ జలపాతం దగ్గర్నించి వెనక్కి రావడానికి బెంగ పడ్డట్టే ఇక్కడ కూడా అనిపించింది. అద్భుత దృశ్యం నించి కళ్లు మరల్చినా మనస్సు మరల్చుకోలేక పోయాను.
………………….

Published in March,2012 by విహంగ

http://vihanga.com/?p=3418

ప్రకటనలు
This entry was posted in నా కళ్లతో అమెరికా(Travelog) and tagged , , , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s