సంవత్సరాదికి సిలికానాంధ్రానందన అష్టావధానం – సమీక్ష

సిలికానాంధ్ర నందన నామ సంవత్సర ఉగాది ఉత్సవాలలో భాగంగా సన్నీవేల్ హిందూ దేవాలయపు ప్రాంగణంలో ఆద్యంతం రసవత్తరంగా, అత్యంత ఆసక్తిదాయకంగా, వినోద భరితంగా అష్టావధానం సాగింది. ఇందులో అవధానులైన గురుశిష్యులు డా. కడిమిళ్ల వరప్రసాద్, శ్రీ కోట లక్ష్మీ నరసింహం గార్లు తమ అసమాన పాండిత్య ప్రతిభా పాటవాలతో సభికులందరినీ రెండు గంటల పాటు మంత్ర ముగ్థుల్ని చేసారు. ఈ కార్యక్రమంలో శ్రీ రావు తల్లాప్రగడ “నిషిద్ధాక్షరి”, శ్రీ పుల్లెల శ్యాం “సమస్యా పూరణం”, డా|| కె.గీత “దత్తపది”, శ్రీ శివచరణ్ గుండా “వర్ణన”, శ్రీ వంశీ ప్రఖ్యా “వ్యస్తాక్షరి”, శ్రీ మృత్యుంజయుడు తాటిపామల “పురాణ పఠనం”, శ్రీమతి శాంతి కూచిభొట్ల “ఆశువు”, శ్రీ మధు ప్రఖ్యా “అప్రస్తుత ప్రసంగం” విభాగాలకు పృచ్ఛకులుగా వ్యవహరించారు. సభకు కౌముది పత్రికాధిపతి, సుకవి అయిన శ్రీ కిరణ్ ప్రభ గారు అధ్యక్షత వహించారు.

దాసోహం గురుదేవానాం

ఉత్తమ జ్ఞాన దాయిదాం..

అంటూ గురు స్తుతి తో ప్రారంభించి

అమెరికా ఖండమందున అడుగు పెట్టి

పుట్టినింటిని మరువని పూజ్యులార

అమల సిలికాను వాలీ మహాంధ్రులార

మాన్యమతులార మీకు నమస్సులయ్య

అంటూ సభ్యులకు నమస్సులందజేసి అవధానులు అవధానాన్ని ప్రారంభించారు.

అవధానం లోని విభాగ వివరణలు ఇక్కడ ఉన్న వారికి వివరించనక్కర లేదు గానీ, ఇండియాలోనైతే వివరించాలని ప్రవాసాంధ్రుల పాండిత్యాన్ని మెచ్చుకున్నారు.

Siliconandhra Ugadi Astavadhanam-2012

Siliconandhra Ugadi Astavadhanam-2012

ముందుగా “హర్మ్యంబందున హాయిగా తిరిగిరే ఆ పార్వతీ కృష్ణులున్” అన్న శ్యాం పుల్లెల సమస్యకు పాదములోని ప్రాస క్లిష్టతను క్షణ మాత్రము లో జయించి నాలుగు ఆవృతాల్లో పద్యాన్ని అవలీలగా పూరించారు అవధానులు. ఇక్కడ పార్వతీ కృష్ణులను పేర్లు గల జంట అని అర్థం చేసుకొనమని వారి వివరణ.

ధర్మ్యంబైన వివాహ పద్ధతిని మోదస్ఫూర్తి గావించి నై

ష్క ర్మ్యంబావల బెట్టి జంట గను సౌఖ్యంబందగా గోరి ఏ

మార్మ్యంబన్నది లేక దంపతులు ప్రేమన్ బొందిరా పై నభో

హర్మ్యంబందున హాయిగా తిరిగిరే ఆ పార్వతీ కృష్ణులున్

ఇక విజేత మన:స్థితిని వర్ణించమన్న శివ గుండా గార్కి సమాధానంగా-

సీతన్ గాంచిన నాడు మారుతికి రోచిస్సెట్లు వర్ధిల్లెనో

జేతన్ చేయగ ఫల్గుణుండు హరినే చిత్తాన ఎట్లాడెనో

బ్రాతిన్ చంద్రుని పైని కాలిడిన ఆర్ముస్ట్రాంగు చందాన సం

ప్రీతిన్ మాటల లోన చెప్పుటకునై వీలౌనె జేతల్ ఘనుల్

అనే శార్దూల పద్యాన్ని చెప్పారు. ఇక్కడ మొదటి మూడు పాదాలు మూడు యుగాల ప్రతీకలు కావడం విశేషం.

దత్తపది గా ఎలుగు, ఋషభం, వానరం, జంబుకం పదాలతో భర్త ను ప్రశంసించే చంపకమాల పద్యం చెప్పమని డా||కె.గీత అడిగిన వెంటనే సభలో కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. అయినా అవధానులు చెక్కుచెదరకుండా కరకు జంతునామాలను కరుణామృత పదాలుగా మలచి పద్యాన్ని పూరించడం విశేషం. ఎలుగెత్తి పిలుచుట అనే అర్థం లో ఎలుగు, నిజంబు కదా అన్నచోట జంబుక శబ్దము, “వాన” రమ్మనుచు లో వానరము, శ్రేష్టతా వాచకంగా ఋషభ శబ్దాన్ని కనిపింపజేసి సభ్యులను మెప్పించారు అవధానులు.

ఎలుగును విన్న చాలును ద్రవించును నా హృదయమ్ము మెత్తగా

జలజల జారి పోవును నిజంబుకదా నను నమ్ము మయ్య నీ

పలుకుల వాన రమ్మనుచు పాటలు పాడుచు నుండె పూర్వ స

త్ఫలమున జేసి భర్తృఋషభమ్మును నిన్ గొని ధన్యనైతినే

ఇక మధ్య మధ్య కడు చమత్కార వంతంగా సాగిన మధు ప్రఖ్యా అప్రస్తుత ప్రసంగం మొత్తం అవధానం లోనే విశిష్టమైన అంశం.

ఉదాహరణకి రామచిలకలు జామకాయలు కొడతాయి

భామ చిలకలు గుండెకాయను కొడతాయి

మరి చిలుకలు అని తమలపాకులకెలా పేరు వచ్చింది?,

“హిమశీతోష్ణ ప్రేత భోజనం” అనగా ఫ్రిజ్జులోంచి తీసి మైక్రో ఓవెన్ లో వేడి చేసిన భోజనం ఎప్పుడైనా తిన్నారా? వంటివి చెప్పుకోవచ్చు.

దానికి అవధానులు సవరణగా చెప్పిన ‘పునరుజ్జీవిత భోజనం’ అనే మాట సభ్యుల్ని బాగా ఆకట్టుకుంది.

అలాగే “ఈ నలుగుర్నీ నువ్వు చూడు, ఆ నలుగుర్నీ నేను చూస్తా అని మీరు కూడబలుక్కుంటారా” అన్న ప్రశ్నకు ఆ ఛాన్సే నాకు వస్తే ఈ ఏడుగుర్నీ నువ్వు చూడు ఆ ఒక్కణ్ణీ నేను చూసుకుంటా అని అవధాని చమత్కరించడం అందరికీ బాగా నవ్వు తెప్పించింది. మొత్తం అప్రస్తుతమంతా చక్కని తెలుగు పదాలతో, ప్రాసయుక్తంగా సాగడం చెప్పుకోదగిన గొప్ప విషయం.

అత్యంత క్లిష్టమైన పదాలతో కూడిన పద్యపాదాన్నెనుకుని అవధానులను తికమక పెట్టిన ఘనత వంశీ ప్రఖ్యా వ్యస్తాక్షరికే చెల్లుతుంది. మొత్తం పదహారు అక్షరాలను మధ్య మధ్య అందిస్తూ చివరకు ఇచ్చిన పద్య పాదం ఇదీ-

ష్వక్షత పల్కుల్ క్లైబ్యమడచు శ్మశ్రు శోభల్గాదు

(అర్ధం: విద్వాంసుల మంచి మాటలు పిరికితనాన్ని (మగటిమి లేని తనాన్ని) పోగొడతాయి. మీసాలు, గడ్డాలవంటి అలంకరణలు కాదు. )

నిషిద్ధాక్షరిని రావు తల్లాప్రగడ అత్యంత నైపుణ్యం తో నిర్వహించారు.

అయినా అవధాని అత్యంత అద్భుతంగా చాకచక్యంతో పూరించడం విశేషం. విజయవాడ కనకదుర్గమ్మ ను వర్ణించమన్న సమస్యకు వివరణగా చెప్పిన పద్యం ఇదీ- ఇక్కడ “కరివాక” అంటే కృష్ణకు ఒడ్డున ఉన్న నగరం విజయవాడ అని వివరణ ఇచ్చారు.

ప్రతీ పదం లోనూ అడ్డు తగిలే నిషిద్ధమైన అక్షరాలను తప్పించుకుంటూ కొత్త పదబంధాలను సృష్టించుకుంటూ చదరంగం లా సాగిన నిషిద్ధాక్షరి సభ్యులను బాగా ఆకట్టుకుంది.

శ్రీతో వేడ్కల్ రావే

ఆ తల్లిన్ జూడ నౌర యాకలి వోదా

ప్రీతిన్ గూర్పన్ దన్వీ

ఖ్యాతిన్ గరివాకనున్నయమ్మా రమ్మా

“పురాణ పురాణ పఠనం” విభాగానికి పృచ్ఛకత్వం వహించిన మృత్యుంజయుడు తాటిపామల అడిగిన

కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో

తలపన్నేరక యున్న దాననొ యశోదాదేవి గానో పర

స్థలమో బాలకుడెంత ఈతని ముఖస్థం బై… .. అన్న పద్యం లోక ప్రసిద్ధి చెందిన పోతన భాగవతం లోనిదనీ, మన్నుతిన్న బాలకృష్ణుని గాంచి ఆశ్చర్య చకితురాలైన యశోదను వర్ణించిన సందర్భమనీ వెనువెంటనే అవధాని వివరించారు.

ఒకటి గొని, రెంటి నిశ్చలయుక్తి జేర్చి,

మూటి నాల్గింట గడు వశ్యములుగ జేసి,

యేనిటిని గెల్చి, యారింటిని నెరిగి, యేడు

విడిచి వర్తించువాడు వివేక ధనుడు

అన్న మహాభారతం లోని తిక్కన పద్య సారాంశాన్ని తెలియజేసారు.

ఏ వేదంబుల్ పఠించె లూత భుజగంబే శాస్త్రముల్సూచె… శ్రీ కాళహస్తీశ్వరా! అన్న ధూర్జటి శ్రీ కాళహస్తీశ్వర శతకం లోని పద్యార్థము వివరించారు.

చివరగా-

అంబనవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికా…ననుం కృపజూడు భారతీ! -అని ఎర్రన చేసిన సరస్వతీ స్తుతిని వివరిస్తూ పురాణ విభాగాన్ని పరిపూర్ణం చేసారు అవధానులు.

ఆశువు విభాగంలో శాంతికూచిభొట్ల ఇప్పటి కాలానికి సంబంధించి ముఖ్యంగా భారత దేశపు పరిస్థితులను, అమెరికా లోని తెలుగు వారి జీవన పరిస్థితులను పోల్చి చెప్పమనడం సభికులను ఆసక్తిదాయకులను చేసింది.

కర్మభూమి లో కర్మలు సక్రమంగా చేయటం మానేశారు. భోగభూమి లో ఉండి కూడా అందరూ స్వకర్మలు సక్రమంగా చేస్తున్నారు.రెంటినీ అన్వయిస్తూ చెప్పమన్న సందర్భంలోని పద్యం ఇదీ-

భోగభూమి కర్మభూమిగా మారెనే

కర్మభూమి నాటి ఘనత బాసె

వైపరీత్యమిదియె వలదన్న ఆగునా

కలియుగంబు గాని కలిగెనిట్లు…

అమెరికాలో మీరు మొదటిసారిగా కాలు మోపినప్పటి మీ మనోభావాలు? అన్న ప్రశ్నకు సమాధానమిది-

హద్దులు దాటి వచ్చితిమహర్నిశలా విపరీతమయ్యె గో

ర్ముద్దలు మాని భోజనము స్పూనులతో గ్రహియించి ఫ్లైటులో

సద్దుకుపోయి వచ్చితిమి చక్కగ మిమ్ముల గాంచియుంట మా

సుద్దులు మీరు వింట మనసుల్ వికసించెను నాటినాటికిన్

పూర్వపు రోజుల్లో అక్షర లక్షలు ఇచ్చి సత్కరించేవారు.నేడు SMS, Texting లు చేయటానికి అక్షరానికి ఖర్చు పైసా మాత్రమే అని టీవీ లలో వ్యాపార ప్రకటనలు చేస్తున్నారు. దాని వల్ల దుష్ట సమాసాలలో భ్రష్టు పట్టిన భాషా వైభవం గురించి చెప్పమన్నపుడు అవధానులు ఇలా చెప్పారు-

పైస ఖర్చుతోడ భావంబులందింప

సెల్లు ఫోను చేయు చిత్రమేమొ

సెల్లులేని నాడు చెదరునే గుండెయే

సెల్లులేని నాడు దిల్లులేదు -అని మళ్లీ

సెల్లు లేక జేబు చిల్లు లేదు -అని చమత్కరించారు.

ఉత్తరాలు కరువైన ఈ రోజుల్లో పోస్టుమాను దు స్స్తితిని వర్ణిస్తూ చెప్పమన్న పద్యం ఇది-

ఉత్తరాలు లేక ఉత్త సంచీ తోడ

వీథి వెంట తిరిగు వెర్రివాడు

నేటి పోస్టుమాను నీతికి నిలువెత్తు

అద్దమౌనుగాదె అతివ చూడు!

చివరగా నాలుగు ఆవృతాల తర్వాత అన్ని పద్యాలనూ ధారణ చేసి సభ్యులచే శభాష్ అనిపించుకున్నారు.

సభాధ్యక్షులు కిరణ్ ప్రభ గారు చెప్పినట్లు “క్లిష్ట తరమైన అవధాన ప్రక్రియ లో ఆటంకాలను అధిగమిస్తూ, అవరోధాలను దాటుకుంటూ” అత్యంత ఆసక్తి దాయకంగా, హాస్యస్ఫోరకంగా, ఆద్యంతం తమ పాండిత్య ప్రతిభతో, అద్భుత ధారణతో దిగ్విజయం గావించి-

హలం బట్టి బంగారం

కలం బట్టి సంస్కారం

గళం ఎత్తి గాంధర్వం

సాధించిన జాతి మనది…

శిశువులైన పశువులైన

నాగులైన నరులైన

తలయూచే సంగీతం

వినిపించిన జాతి మనది

కత్తికంటె పదునైనది

కలమంటూ చాటిచెప్పి

సాహిత్యం సౌహిత్యం

కలబోసిన జాతిమనది

అచ్చరలే మచ్చరింప

నటరాజే పరవశింప

అడుగడిగున ఒడుపుచూపి

నర్తించిన జాతిమనది

పైడిజరీ పట్టుబట్ట

అగ్గిపెట్టెలో అమర్చి

పనితనమున పసచూపిన

జాణలున్న జాతిమనది

స్వతంత్రతా సమరంలో

స్వరాజ్యాన్ని సాధించి

అహింసయే ఆయుధమని

చాటించిన జాతిమనది

ఆ జాతికి మన పిల్లలు

వారసులై ఎదగాలి

భరతమాత కన్నులలో

దివ్వెలుగా వెలగాలి

వారంతా అట్టివారు

అవుతారని ఆశిస్తాం

వారంతా గొప్పవారు

కావాలని కాంక్షిస్తాం

క్రమశిక్షణ మార్గంలో

నడవాలని శాసిస్తాం

ఆశిస్తాం శాశిస్తాం

సెలవిస్తే వెళ్ళొస్తాం

అని సభను ముగించారు.

మధు ప్రఖ్యా గారు ప్రశంసించినట్లు వీరిరువురినీ చూస్తే నాలుగు చేతుల సరస్వతి ప్రత్యక్షమైనట్లనిపించి నమోవాకాలర్పించాలనిపిస్తుంది అందరికి.

……………………..

(Published in Sujana Ranjani Apr-2012)

 http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/apr12/ashtavadhanam.html

అవధానంలో నేనడిగిన దత్తపదికి నా పూరణ-

ఎలుగతడౌర కౌగిలి బిగించిన వేళల వెల్గు చూడగన్

తలనెటు తిప్పుమన్నటులె తిప్పు హరున్ ఋషభమ్ము చూడన

ప్పుల బతుకునిట్లీదగ తపం చెడ జంబుకమైనతండ్కలన్

ఇలను రమారమున్ గొలుచు డింభక వానరమెంతదృష్టన్నేన్

– డా || కె. గీత

ప్రకటనలు
This entry was posted in సాహిత్య వ్యాసాలు and tagged , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s