నా కళ్లతో అమెరికా-6 (మౌంటెన్ వ్యూ)

మౌంటెన్ వ్యూ

మన స్వంత ఊరి గురించి చెప్పకుండా ఎన్ని చెప్పినా ఏదో వెలితిగా ఉంటుంది. అయినా ఇది చూడదగ్గ ప్రదేశాల్లో ఒకటి కూడానూ- అందుకే ఈ నెల మా ఊరు మౌంటెన్ వ్యూ(Mountain View) గురించి చెప్తాను వినండి. సత్య నా కంటే 45 రోజుల ముందే వచ్చాడు ఇక్కడికి. తను వెళ్లినప్పటి నుంచి మౌంటెన్ వ్యూ ని గూగుల్ మేప్స్ లో ఎన్ని సార్లు చూసి ఉంటానో నాకే లెక్క తెలీదు. రాగానే సత్య తన ఆఫీసు గురించేదో చెప్పబోతే అవును- మీ ఆఫీసు ఒక Dead End రోడ్ లో ఉంటుందని ఠకీమని చెప్పేను.

Dr K.Geeta

Dr K.Geeta

ఇక దగ్గర్లో ఏమేమి రోడ్లున్నాయో అన్నీ కంఠతా పట్టేసాను. అయితే పైనించి చూసేది వేరు, ఇక్కడికొచ్చి చూసేది వేరు. ఎటు చూసినా చక్కని పూల చెట్లతో, విశాలమైన రోడ్లతో అందమైన ఊరు మౌంటెన్ వ్యూ. ముందు చెప్పినట్టుగానే ఇక్కడి  నుంచి ఎటు చూసినా పర్వతాలే కనిపించడం వల్ల ఈ ఊరికి ఈ పేరు వచ్చిందట. మౌంటెన్ వ్యూ ఉత్తర కాలిఫోర్నియా లో శాంతా క్లారా కౌంటీ లోని ఊరు. సిలికాన్ వాలీ గా పిలువబడే శాంతా క్లారా వాలీ లో ప్రధాన నగరమైన శానోజే కు పది మైళ్లదూరంలో, ప్రపంచ ప్రఖ్యాత నగరమైన శాన్ ఫ్రాన్సిస్కో కు నలభై మైళ్ల దూరంలోనూ ఉంటుంది మౌంటెన్ వ్యూ. అమెరికాలో ని ఇతర ప్రాంతాలతో పోలిస్తే సిలికాన్ వాలీ మంచి జనసమ్మర్దమైన (ఇండియా అంత కాదు లెండి!) ప్రాంతం. అంతకు అంతా బాగా ఖరీదైన ప్రాంతమూ. “Cost of living” బాగా ఎక్కువ.

మాకు దక్షిణంగా ఎప్పుడూ ముదురాకుపచ్చని చిరునవ్వులతో లాస్ ఆల్టోస్ హిల్స్, ఉత్తరంగా లోనికి చొచ్చుకొచ్చిన నీలి సముద్రం ఆవలగా నున్నని తలంతో మిల్పిటాస్ కొండలు కనిపిస్తూ ఉంటాయి. బే కి పక్కగా  నాసా  పరిశోధన కేంద్రం ఉంది.  అతి పెద్ద ఇనుప  ఇగ్లూ ల లాంటి కట్టడాలు, అక్కడికి వచ్చి పోయేందుకు ఆగి ఉన్న  విమానాలు తప్ప పైకి అసలేమీ కనిపించని ఒక పెద్ద రహస్యం లా ఉంటుందది. మా ఇల్లు ఈ పరిశోధనా కేంద్రానికి వెళ్లే దారి లో అరమైలు దూరం లో ఉంటుంది. మౌంటెన్ వ్యూ కి పడమటి భాగం లో పాలో ఆల్టో, తూర్పున సన్నీవేల్ అనే ఊర్లు ఉంటాయి. అన్నీ నచ్చడం వల్ల, వాతావరణమూ అనుకూలించడం వల్ల మౌంటెన్ వ్యూ లో ఉంటున్నాం. మేం ఇక్కడి కొచ్చినప్పటి నుంచి రెండిళ్లు మారేం. ఇది మా మూడో ఇల్లు.  మొదటి  ఇల్లు పడమటి కొసన, రెండో ఇల్లు తూర్పు కొసనా ఉండేవి( ఇప్పుడు ఉత్తరం!) అందువల్ల ఊర్లోని అన్ని ప్రాంతాలు బాగా పరిచయమయ్యాయి. అదీ గాక నాకు అన్నీ చూడాలి, తెలుసు కోవాలనే జిజ్ఞాస ఎక్కువ కావడం వల్ల అన్ని ప్రాంతాలకూ తిరిగి చూస్తూ ఉంటాను.

నేను వచ్చిన మర్నాడు సత్య నాకు ఊరు చూపిస్తానని మొదట చూపించినవి మౌంటెన్ వ్యూ Walmart కాంప్లెక్స్, నడిచి వెళ్లగలిగిన  రింగ్ స్ట్రార్ఫ్ పార్కు,  లైబ్రరీ. ఇవన్నిటికీ ఇప్పటికి మరో వందసార్ల కు పైనే వెళ్లినా ఆ రోజు  తన చెయ్యి పట్టుకుని అబ్బురంగా అటు ఇటూ చూస్తూ, చలికి వణకడం ఇంకా గుర్తుంది. శుభ్రమైన రోడ్లు, ఇంట్లోకి అడుగు పెడుతూనే మెత్తటి కార్పెట్టు, తళత్తళ్లాడే నును వెచ్చని ఎండ ఇవన్నీ మౌంటెన్ వ్యూ ఇచ్చిన అపురూపమైన తొలి అమెరికా జ్ఞాపకాలు. నేను వచ్చిన సంవత్సరం ఈ నాలుగు సంవత్సరాల కన్న కాస్త వెచ్చగానే ఉంది వేసవి. అంటే బయట స్వెట్టరు లేకుండా తిరగగలిగేలా. మేం ప్రతి వారాంతం బయట గడిపే వాళ్లం. పొద్దుటే కాస్త వండుకుని ఏదైనా పార్కుకి వెళ్లి సాయంత్రం వరకూ గడిపి వచ్చే వాళ్లం. ఒక చిన్న పాటి టెంట్ కొన్నాము కూడా. (ఇప్పుడైతే ఓపెన్ ఎయిర్ బార్బెక్యూ లు చేస్తామనుకోండి). బయట అంతా కలిసి డిస్క్ ఆడుకోవడమూ, ఒక్కళ్ల కొకళ్లం జారబడి పుస్తకాలు చదూకోవడం, చెట్లనీ, పుట్లనీ చూస్తూ పార్కు చుట్టూ నడవడం మాకు బాగా ఇష్టమైన పన్లు. ఇక్కడ చలి కాలం వస్తే ఇళ్లలోనే కూర్చోవాల్సిందే. అందుకే వెచ్చగా ఉండే రోజుల్లో ఇలాంటి చోట్ల ఎండకు హాయిగా తిరిగే జనాన్ని చూస్తే ఇక్కడెవరూ వారాంతాల్లో ఇళ్లల్లో ఉండరేమో అనిపిస్తుంది. అమెరికా లో కాలిఫోర్నియా అంటే “sunshine” అని పేరు. మిగతా చోట్ల తో పోలిస్తే  సంవత్సరం పొడవునా ఇక్కడ సమతుల్యమైన వాతవరణం ఉంటుందంటారు. అది నిజమే. భరించలేని ఎండ కానీ, మంచు కురిసే దారుణమైన చలి కానీ ఉండదిక్కడ.

 షోర్ లైన్

మౌంటెన్ వ్యూలో  వాతావరణం సంవత్సరం పొడవునా చల్లగానే ఉంటుంది. గట్టిగా ఎండ కాసి వేడిగా ఉన్న రోజులు సంవత్సరం లో ఒక వారం ఉంటాయేమో. అప్పుడు కూడా ఉక్క పెట్టే ఎండ కేవలం ఒకే ఒక సంవత్సరంలో ఉంది. సీజన్ మారినప్పుడల్లా రంగుల వస్త్రాలు మార్చే చెట్లు భలే మనోహరంగా ఉంటాయి. చాలా మంది మౌంటెన్ వ్యూ అనగానే షోర్ లైన్ గురించి చెబుతారు. షోర్ లైన్ బొలేవార్డ్ ( “షోర్ లైన్ బలేవాడు” అని మా వరు అయిదేళ్లప్పుడు అంటూండేది. మేమిప్పటికీ అలానే అంటాం.) మీదుగా ఉత్తరాన అంచు వరకు వెళ్లి పోతే షోర్లైన్ పార్కు, లేక్ వస్తాయి. గేటు నించి లోపలికి వెళ్లే లోగా కుడివైపు గాలి పటాలు ఎగరేసుకునే చోటు ( మా పిల్లల ఫేవరెట్ ప్లేస్). ఎడమ వైపు గోల్ఫ్ కోర్ట్స్ కనిపిస్తాయి. అక్కడికొచ్చేసరికి ఎత్తైన గడ్డి కొండ మీద వున్నట్టు ఎదురుగా ఆకాశం తప్ప ఏమీ కనిపించదు.

ఇక అక్కడ మౌంటెన్ వ్యూ లో కెల్లా పురాతన నివాసమైన  Rengstroff House గంభీరంగా కనిపిస్తుంది. 12 గదులతో నాలుగువేల చదరపు అడుగులలో నిర్మించబడిన ఈ భవంతి విక్టోరియన్, ఇటాలియన్ ఆర్కిటెక్చర్ తో కనువిందు చేస్తుంది.  వారంలో మూడు రోజులు సందర్శనకు అనుమతిస్తారు. ఇక్కడ ఖరీదైన వివాహాలు, విందులు, ఆర్ట్ ఎగ్జిబిషన్లు  మొ.న వెన్నో జరుగుతాయి.  రింగ్స్ట్రాఫ్  1850 ప్రాంతం లో సాధారణ కార్మికుని గా అమెరికాకు  వచ్చి మౌంటెన్ వ్యూ చుట్టుపక్కల వందల ఎకరాల భూమికి జమీందారు  అయ్యాడట. ఇప్పుడు అత్యంత ఖరీదైన ప్రాంతాలైన ఇవన్నీ ఒకప్పుడు ఆయన పండ్ల తోటలు, పంట భూములు. ఈ ఊర్లోని  పాఠశాలల నిర్మాణానికి,  అభివృద్ధికి  ఆయన ఎనలేని కృషి, ఆర్థిక సహాయం అందించాడట. ఆయన జ్ఞాపకార్థం ఈ ఊర్లో ఆయన పేరు తోనే ఒక రోడ్డు, పెద్ద పార్కు ఉంటాయి.

దాటి వెళితే 50 ఎకరాలలో మానవ నిర్మితమైన చల్లని నిర్మాలిన్యమైన విశాల ఉప్పునీటి సరస్సు ఎదురుగా ఆహ్వానమిస్తుంది. దగ్గర్లోని సముద్రపు కాలువ నించి ఎప్పటికప్పుడు నీటిని భర్తీ చేస్తూ ఉంటారట. దాదాపు మైలున్నర చుట్టు కొలత కలిగిన సరస్సు చుట్టూ ఎందరో విహారాలకు వస్తూంటారు. నడుస్తూ సైకిళ్ల మీద తిరుగుతూ కొందరు, నీటిలో బోటింగ్ మొదలైనవి ఆస్వాదిస్తూ మరి కొందరు, అక్కడక్కడా బంధుమిత్ర జనానీకంతో గుమిగూడి  విందు లారగిస్తూ మరికొందరు  కనిపిస్తారు. సెలవు దినాలలో ఇక్కడ పార్కింగు దొరకడమే కష్టంగా ఉంటుంది. ఈ సరస్సు అరుదుగా కనిపించే వలస పక్షుల విడిది  కూడా.  ఎప్పుడూ నీటి బాతుల గలగలలు మంద్రమైన కెరటాల తో బాటూ వినిపిస్తూనే ఉంటాయి. దాదాపు30 అడుగుల లోతైన సరస్సు లో తిరిగేందుకు 17 డాలర్లు తక్కువ గాకుండా ఖర్చు పెట్ట వలసి వచ్చినా ఇదొక అద్భుత అనుభవం అని అనిపించకమానదు. అందరూ నీటిని చూస్తే నేను నీటి లోని ఆకాశాన్ని చూస్తాను. తళుక్కున మెరిసే ఎండ,  నీటి లో మెరిసి మాయ మయ్యే మబ్బులు, పరుగెత్తే పడవతో బాటూ పోటీ పడే ఆకాశాన్ని చిలికి నట్టున్న తెల్లని నురుగు… గమ్మత్తైన దృశ్యాలెన్నో కనిపిస్తాయి.

ఇక్కడి నించి కను చూపు మేర దూరం లో నే గూగుల్ ప్రధాన నిలయం  ఉంది. అదే గాకుండా మౌంటెన్ వ్యూ లోనే  Symantec వంటి ప్రపంచ వ్యాప్త కంపెనీల ప్రధాన నిలయాలున్నాయి.   సిలికాన్ వేలి లో మొట్ట మొదటి సెమీ కండక్టర్  కంపెనీ కూడా ఇక్కడే స్థాపించబడింది. ఇక ఆపిల్, ఫేస్ బుక్ మొదలైన వెన్నో ప్రపంచ ప్రసిద్ధ పెద్ద కంపెనీలు కూతవేటు దూరం లో  ఉన్న ఊర్లలోనే ఉన్నాయి.

ఈ స్లైడ్ ప్రదర్శన కోసం జావాస్క్రిప్ట్ అవసరం.

స్టీవెన్స్ క్రీక్ ట్రైల్

మాకు అత్యంత ఇష్టమైన ’స్టీవెన్స్ క్రీక్’ ను ఆనుకుని ఉన్న బైసికల్ trail మౌంటెన్ వ్యూ ను ఉత్తరం నించి దక్షిణం గా రెండు భాగాలుగా విడదీస్తూ ఉంటుంది. Trail నానుకుని ఉన్న క్రీక్ గల గలలు, అంత కంటె గట్టిగా సముద్రపు హోరులా వినిపింఛే ఫ్రీవేల మీద కార్ల రొద వింటూ సన్నని కాలి రోడ్ల మీద అట్నించిటు వరకు పరుగెడుతూ, సైకిళ్లు తొక్కుతూ కనిపించే వారు నిత్యం ఎందరో. మేం ఎటో ఒక వైపు నడవడం మొదలెట్టి మళ్లీ ఇంటి కొచ్చేసరికి రెండు గంటలు పడుతుంది. సైకిళ్ళయితే ఆ మూల నించి ఈ మూలకు గంట పడుతుంది. అక్కడ దారి పక్క కనిపించే రకరకాల అడవి తీగలు, రంగు రంగుల పూలు, గజి బిజిగా అల్లుకున్న తీగల మధ్య, చిక్కని ఆకుల చెట్లు నడుమ నించి అక్కడక్కడా ప్రసరించే లేత కిరణాలు, చెర్రీ పళ్లలా తోచే అడవి తుప్ప కాయలు అన్నిటినీ మించి ఆహ్లాదంగా మేం చెప్పుకునే కబుర్లు, గొడవ పెట్టు కున్నప్పుడు మా మధ్య గోడై నిలిచే నిశ్శబ్దపు జాడలు ఒక్కటేమిటి అన్నీ అక్కడ నిక్షిప్తమై ఉన్నాయి.

మా వరుకు ఆ ట్రైల్ అంటే మహా ఇష్టం. అక్కడికి వెళ్తున్నామంటే “నేనూ వస్తా” అని రెడీ అయిపోతుంది. కాస్సేపు సైకిల్ తొక్కిన తర్వాత సైకిల్నీ,  తననీ మోసుకొచ్చే వాళ్లం మొదట్లో. ఇప్పుడిక మా కంటే ముందెళ్లి, వేగంగా వెనక్కి  వచ్చేస్తుంది. ట్రైల్ కు ఉత్తారాంతంలో కనిపించే పెద్ద సరస్సుల వంటి నీటి  చెలమలు గూడబాతుల నిలయాలు. అక్కడ పర్మిషన్ తో సంవత్సరం లో కొన్ని రోజులు వేటాడొచ్చట. చేపలు పట్టొచ్చట. అక్కడి దుమ్ము రేగే గట్ల మీద మట్టిలోకి వెళ్లినప్పుడల్లా వరు సంతోషంగా చెప్పులు విప్పి వళ్లంతా రంగు వేసుకున్నట్టు మట్టి పూసుకుంటుంది. ఇక్కడెక్కడా అలాంటి అవకాశం రాదు. అవన్నీ చూస్తే  చిన్నప్పటి మా ఊరు, పెద్దవాళ్లు వద్దన్నా చెరువు చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యడం జ్ఞాపకం వస్తాయి. కానీ ఇక్కడెక్కడా నీళ్లలో అడుగు పెట్టే సాహసం చెయ్యలేనంత చల్లగా ఉంటాయి నీళ్లు. అదొక్కటే కాస్త నిరుత్సాహంగా అనిపిస్తుంది. కనీసం దోసిలితో పట్టుకోలేని, కాళ్లు ముంచి ప్రశాంతంగా అరగంట గడప లేని ఇంతటి జల ధార ఎందుకు అనిపిస్తుంది.

ఇక్కడి  నుంచి  చూడదగ్గ ప్రదేశాలు చాలా దగ్గర్లోనే ఉంటాయి. కాలిఫోర్నియా కు సరిగ్గా మధ్యన ఉండడం వల్ల రాష్ట్రం మొత్తం తిరగడానికి అనువుగా ఉంటుంది.  ఇండియన్ కమ్యూనిటీలు అధికంగా ఉండే కూపర్టీనో, ఫ్రీమౌంట్ వంటివి పది, పదిహేను మైళ్ల దూరమే.

మేం ఒక సారి శాంఫ్రాన్సిస్కో లో బస చేద్దామని ఎకానమీ హోటల్ కోసం ఇంటర్నెట్టు లో వెతికితే మాకు రిజల్టు మౌంటెన్ వ్యూ లో వచ్చింది. కాబట్టి ఇక్కడ బస చేసి చుట్టు పక్కల తిరిగి రావొచ్చు.

మా ఊరిలో ఇండియన్ సూపర్ మార్కెట్టు ఉండడం వల్ల మాకు ఇక్కడ వండుకుని తినడానికి మొదట్నించీ ఇబ్బంది ఏమీ అనిపించలేదు. కాకపోతే కాస్త ఖరీదు ఎక్కువ ఉంటాయంతే. అయితే ఏవి ఎక్కడ చవకగా, నాణ్యమైనవి దొరుకుతాయో నాలుగు రోజులు పరిశోధన చేస్తే సులువుగా తెలుసుకోవచ్చు.  ఇక ఇండియన్ రెస్టారెంట్లు మా ఊరిలో అరడజను వరకు ఉన్నాయి. కాస్త వెరైటీ  ఫుడ్ తినాలంటే పక్కనే ఉన్న సన్నీవేల్, శాంతా క్లారాలకు వెళ్లి రావడం పెద్ద కష్టమూ కాదు. ఇక అచ్చంగా మన సరుకులే కావాలంటే తప్ప ఇతరత్రా ఇక్కడి వెరైటీ కాయగూరలు, మాంస విశేషాలకు ఇక్కడి సూపర్ మార్కెట్ల చైన్ల లో ప్రసిద్ధి చెందిన సేఫ్ వే, లక్కీ వంటివి ఉండనే ఉన్నాయి. మందులు కావాలంటే సూపర్ మార్కెట్లలా ఉన్న ఫార్మసీలకు వెళ్లాలి గానీ,  మైలుకొక మందు (లిక్కర్) షాపు మాత్రం తప్పని సరిగా ఉంటుంది. దాదాపు ఎనభైవేల మంది నివసించే ఈ ఊరికి రెండు  హైస్కూళ్లు, రెండు మిడిల్ స్కూళ్లు, ఏడు ఎలిమెంటరీ స్కూళ్లు ఉన్నాయి.అన్నీ గవర్నమెంటువే.  ప్రైవేటు స్కూళ్లు కూడా అక్కడక్కడా ఉంటాయి. కానీ ప్రభుత్వ పాఠశాలలు  మంచి ఫెసిలిటీస్ తో, నాణ్యతా ప్రమాణాలతో ఉంటాయి. పైగా KG నుంచి 12 వరకు ఫీజు ఉండదు. పుస్తకాలు కూడా ఉచితంగా ఇస్తారు. మంచి స్టాండర్డు తో నడిచే గవర్న్ మెంటు బళ్లకే దాదాపు 99% జనం మొగ్గు చూపుతారు.

లైబ్రరీ

మన సెంట్రల్  లైబ్రరీల కంటే పెద్దదైనవి ఇక్కడి సిటీ లైబ్రరీలు. అసలు మనకు అక్కడ ఉండే ఎటువంటి లైబ్రరీ లతోనూ పోల్చలేనివి ఇక్కడి లైబ్రరీలు. రెండస్థులతో పిల్లలకు,యువకులకు, పెద్దలకు, పరిశోధకులకు, ప్రత్యేకమైన విభాగాలతో ఉన్న అద్భుతమైన  ఈ లైబ్రరీ అంటే మా ఇంటిల్లి పాదికీ విపరీతమైన ఇష్టం. ఇక్కడ ఉచిత మెంబర్ షిప్పు తో బాటూ కంప్యూటర్లు, ఇంటర్నెట్టు వాడుకకు ఉచితంగా అందిస్తారు. వారానికోసారైనా ఇక్కడికి రాక పోతే ఏదో వెలితిగా ఉంటుంది. అసలు దుమ్మూ ధూళి బొత్తిగా కనబడక పోవడం విశేషం. అన్నీ కొత్త పుస్తకాలలా ఎలా ఉంచుతారో అని ఆశ్చర్యం వేస్తుంది.

ఇక్కడి DVD ల లో ప్రపంచ వ్యాప్తపు గొప్ప సినిమాలన్నీ  వుంటాయి. మొదటి రెండు సంవత్సరాల్లో దాదాపు అన్నీ  చూసేసేం. ఇక పుస్తకాలు సరే సరి. ఎక్కడ మొదలెట్టాలో తెలీదు. అక్కడ గుమ్మంలోకి వెళ్లేంత వరకే మేమంతా కలిసి ఉండేది. మళ్లీ చివరగా ఎక్కడ కలుసుకోవాలో చెప్పుకుని ఎవరి విభాగాలకు వాళ్లం వెళ్లి పుస్తకాల్లో తలదూర్చి సమయాన్ని మైమర్చి పోయిన రోజులెన్నో. చిత్రంగా మా పిల్లలకూ పుస్తకాలంటే ప్రాణం.  పుస్తకం చేతికిస్తే మంచినీళ్లు కూడా అడగరు. అక్కడ బేబీస్ సెక్షన్ చిన్న చిన్న కుర్చీలతో చిట్టి చేతుల ముద్రలున్న పజిల్స్, బొమ్మల పుస్తకాల కువకువలతో  భలే ముద్దుగా ఉంటుంది. అంతకు ముందు లైబ్రరీకి వెళ్లినప్పుడల్లా ఆ సెక్షన్ కు వెళ్లలేక పోతున్నాననే బాధ ఉండేది. నా బుల్లినేస్తం సిరివెన్నెల ఇప్పుడా బాధని పూర్తిగా తీర్చేసింది. మేం అస్తమాటూ వెళ్లి నచ్చినంతసేపు  ఆడుకుంటాం అక్కడే. పజిల్సన్నీ చిందర వందర చేసి మళ్ళీ ఏమీ ఎరగనట్టు సర్దేసి వచ్చేస్తాం. అంతలోనే రేక్స్ నడుమ పరుగెట్టే పాపాయి నవ్వులతో నిశ్శబ్దపు గ్రంథాలయం ప్రతిధ్వనిస్తుంది.

పిల్లలకు story reading, summer reading,meet the Author ఒకటేమిటి  ఎన్నో కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ వాలంటీరుగా పని చేయడానికి నమోదు చేయించుకున్న మూడు నెలల వరకు అవకాశమే రాదు. అంత ఇష్టంగా, అంకిత భావంతో  ఇక్కడ  అందరూ పనిచేస్తుంటారు.

డౌన్ టౌన్

మా ఇంటి నుంచి సరిగ్గా పావుమైలు దూరం దక్షిణం గా నడిస్తే డౌన్ టౌన్ వస్తుంది. ఎన్నో డౌన్ టౌన్ లు చూసినా ఇంత అందమైనది కనిపించలేదింతవరకు. అటు “ El camino Real”రోడ్డు నుంచి ఇటు  ”Central Express way” వరకు బహుశా మైలున్నర దూరం ఒకటే రోడ్డు ఈ డౌన్ టౌన్.  ఈ చివర నుంచుని చూస్తే ఒకటే పొడవైన తిన్నని  రోడ్డు మధ్యన  అడ్డు నిలబడ్డట్టున్న పచ్చని పర్వతం. నిజానికి ఆ పర్వతం అక్కడి నుంచి మరో అయిదారు మైళ్లు దూరం లో ఎక్కడో ఉంటుంది.

ఇక్కడ సంవత్సరానికి వేసవి లో ఒకట్రెండు సార్లు జరిగే Arts & Wine ఫెస్టివల్ మంచి సర్దాగా ఉండే జాతర. నిజానికి పక్కనే ఉన్న సన్నీవేల్ ఊర్లో ఇంత కంటె పెద్దదే జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకటే రోడ్డు పొడవునా జరగడం వల్ల తప్పిపోయే సమస్య ఉండదు. ఆ రెండ్రోజులు రోడ్లమీద కళాకారుల ప్రదర్శనలతోనూ, రకరకాల తినుబండారాలతోనూ, మద్య విశేషాలతోనూ డౌన్ టౌన్ కళకళ్లాడుతూ ఉంటుంది. పిల్లలకూ ఏవేవో చిన్న చిన్న సర్దా ఏర్పాట్లు ఉంటాయి. ఇక్కడ ఎటు వంటి భేషజం లేకుండా అందరూ రోడ్ల పక్కన కూచుని,నిల్చునీ తింటారు.(రోడ్లు అత్యంత శుభ్రంగా, ఆరోగ్యకరంగా  ఎప్పుడు ఉండడంవల్ల)  ఇక చిత్రకారుల ప్రదర్శనలు బాగా ఆకట్టుకుంటాయి. అయితే ఇక్కడ కళలను, మద్యాన్ని ఒక చోట ప్రదర్శించడం లోని అంతరార్థమేమిటో నాకు బోధపడలేదు.

ఫార్మర్స్ మార్కెట్

సెంట్రల్ ఎక్స్ ప్రెస్ వే వైపు మౌంటెన్ వ్యూ ప్రధాన “రైల్వే& బస్ స్టేషన్” ఉంది. అయితే మనలా కాకుండా బయటికి ఎంత దూరం నించైనా కనబడే ఓపెన్ స్టేషన్లు ఇవి. పట్టాల పక్కగా వారానికోసారి ఆదివారం పొద్దుట పూట జరిగే Farmers Market ఒక చిన్న సైజు సంతలా జనాలతో కళకళ్లాడుతూ ఉంటుంది. ఇక్కడ కనిపించే మంచి పూలగుత్తుల  పలకరింపులు,రకరకాల పళ్ళ సువాసనలు నాకు చాలా ఇష్టం. ఇక్కడ దొరికే పళ్ళు కొనే ముందు రుచి చూడడానికి దుకాణం వాళ్లే Fruit Tasting కి ఇవ్వడం విశేషం. వచ్చే పోయే రైళ్లకు చేతులూపడం, పల్లెటూరి సంప్రదాయపు  బ్రెడ్డు కొనుక్కోవడానికి లైన్లో నిలబడ్డం, తేనె స్ట్రాలు కొనుక్కుని చివరంటా జుమకడం, పూల మొక్కల చుట్టూ ప్రదక్షిణలు చెయ్యడం ఒకటేమిటి అన్నీ మాంచి సరదా పుట్టించే సెలవు దినపు వ్యాపకాలు.

అక్కడి నుంచి పట్టాలు దాటి ఉత్తరం వైపుగా నాలుగడుగులు వేయగానే రోడ్డు మూలగా మట్టితో కట్టినట్లున్న ఒక పాత బంగాళా పెంకుల ఇల్లు కనిపిస్తుంది. అది  ”Historic Adobe Building”. 1934 లో నిర్మించబడిన ఈ కట్టడం మీటింగు హాలు గానూ, డాన్స్ హాల్ గానూ ఉండేదట. ఇది 1987 లో కూలిపోవడం వల్ల మూతబడినా, పాత కాలపు కట్టడాల్ని సంరంక్షించే ప్రయత్నం లో భాగంగా పునరుద్ధరించి 2001 నుంచి సందర్శకులకు అందుబాటులో ఉంచారు. లోపల 100 మంది కూర్చోగలిగిన హాలుతో ఇప్పుడు కూడా  ఫంక్షను హాలు గా ఉంది. అయితే బయటికి మాత్రం మొదట ఎలా కట్టబడిందో ఇప్పటికీ అదే రూపం తో కనబడేటట్లు ఉంచడం విశేషం.

ఇక కాస్త ముందుకు రాగానే  పెద్ద గోడ మీద అద్భుతమైన పెయింటింగ్ అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. పెయింటింగ్ పక్కనే ఉన్న నెరుడా కవితను, అసలా పెయింటింగ్ లోని చక్కటి భావాన్ని నేను ప్రతి సారీ పరికించకుండా ముందుకు రాను. ఆ గోడనానుకుని ఉన్న షాపు యజమాని అక్కడి ఫార్మర్స్ మార్కెట్ కు కిందటి సంవత్సరం అధ్యక్షుడట. కిందటేడాది ఉత్సవాలకు ఫార్మర్స్ అందరూ కలిసి డబ్బు పోగు చేసి ఇలా పెయింటింగ్ ఏదైనా కావాలని ఎవరో యూనివర్శిటీ యువ కళాకారులతో  బేరం కుదుర్చుకున్నారట. వేసిన చిత్రకారుల  బృందం  పేర్లు అక్కడ ఉన్నాయి. అయితే ఆలా  నెరుడా కవితకు రూపం ఇవ్వాలన్న ఆలోచనకు రూపకల్పన చేసిన  యువబృందాన్ని అభినందించాల్సిందే.

ఆ కవిత ఇదీ-

All leaves are this leaf,

all petals, this flower

in a lie of abundance.

All fruit is the same,

the trees are only one tree

and one flower sustains all the earth.

(“Unity,” from Manual Metaphysics

by Pablo Neruda; trans. by Ben Belitt)

కంప్యూటర్ హిస్టరీ మ్యూజియం

2000 సంవత్సరాల కంపూటర్ చరిత్ర- ఆవిష్కరణ నినాదం తో జనవరి, 2011 న కొత్తగా ప్రదర్శన ప్రారంభించిన CHM(Computer History museum) మౌంటెన్ వ్యూ లో North Shore line road  లో ఉంది. ఉదయం పది గంటలకు వెళితే సాయంత్రం అయిదు ఎలా అవుతుందో తెలియదు మనకు. మేం వెళ్లింది శనివారం కావడం తో జనం దాదాపు వంద మంది వరకు ఉన్నారు. 2000 సంవత్సరాల క్రితపు అబాకస్ లతో ప్రారంభమైన గణన క్రమంగా ఇప్పటి కంప్యూటర్ లకు ఎలా మార్గదర్శకమైందో తెలియపరిచే మ్యూజియం అది. పదకొండు గంటల వేళ గైడు వచ్చి  ముఖ్యమైన పరిణామాల గురించి గంట పాటూ తిప్పి చూపించాడు. ఈ శతాబ్దపు ప్రారంభంలో జనాభా లెక్కల కోసం ఉపయోగించిన “పంచింగ్” సిస్టం ను తెలియజేసే కార్డులు మాకందరికీ ఉచితం గా అందజేసాడు. ఇక అన్నిటి కంటే అత్యంత అబ్బురపరిచేది Charles Babbage రూపకల్పన చేసీ జీవిత కాలంలో రూపొందించలేక పోయినDifference Engine-2 ఇక్కడ మనకు ఎలా పని చేస్తుందో ప్రత్యక్షంగా వివరంగా చూపిస్తారు. దాదాపు పది అడుగుల పొడవు, ఎత్తు కలిగిన ఆ పరికరానికి మొత్తం 8000 పనిముట్లు వాడడం విశేషం.

అలాగే మధ్యాహ్నం కంప్యూటర్ అభివృద్ధి  ప్రదర్శన కూడా సందర్శకులను బాగ ఆకట్టుకుంటుంది. మొత్తం 20 విభాగాలలో ప్రదర్శన, వీడియో షోలు, పరికరాల విశేషాలను చదవడం ఇలా నడుస్తూ రోజంతా చాలా ఆసక్తిదాయకంగా గడిపేయవచ్చు. మనిషి ఆలోచనలను, ఊహలను శక్తి రూపాలుగా మార్చడం అబ్బురపరుస్తుంది మనల్ని. మొదట యంత్ర శక్తి,తరువాత విద్యుత్, ఆ తరువాత విద్యుదయస్కాంత, క్రమంగా కంప్యూటర్ యుగంగా ఎలా పరిణామం చెందిందో మనం ఇక్కడ చూస్తాం. మారిన యుగాలలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఊహలకు రూపం ఇచ్చి  పరికరాలు ఎలా తయారు చెయ్యొచ్చో ప్రస్ఫుటమవుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. పదేళ్ల వయసు పైబడిన పిల్లల దగ్గర్నించీ తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉన్న వారెవరికైనా ఇది బాగా నచ్చే ప్రదేశం. నాకైతే ప్రతి విభాగం లోకి అడుగుపెట్టినప్పుడు ఏదో ఒక టైం మెషీన్ ఎక్కి దిగుతున్న అనుభూతి కలిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరికీ మానవ మేథస్సుకు” జోహార్ ” అనిపించకమానదు.

బెర్లిన్ గోడ

జర్మనీ లోని బెర్లిన్ గోడ పగులగొట్టి ఐక్యతను సాధించిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు గోడ పలకలు బహుమతిగా పంపబడ్డాయి. ఐక్యతా ప్రయత్నాలలో అమెరికా చేసిన కృషికి గుర్తుగా ఆ గోడ పలకల్ని దేశం మొత్తం మీద 50 ప్రదేశాలలో  ప్రదర్శనకు ఉంచింది. ఆ ప్రదేశాలలో  ఒకటి మా మౌంటెన్ వ్యూ  లో ఉంది. నేను ఒక రోజు పనిగట్టుకుని గూగుల్ లో చూసి పిల్లలని బడి నుంచి తీసుకుని వస్తూ అటు వెళ్లాను. bay కు దగ్గరగా గూగుల్ ఆఫీసులవీ దాటి  వెళ్లేక Marine way లో ఉంటుందది. తీరా అడ్రసు చుట్టు పక్కలే ఎన్ని రౌండ్లు కొట్టినా కనిపించలేదు. బిల్డింగు లోపలేమో అనుకోవడానికి వీలు లేదు. Online లో అది బయటే ఉన్నట్లు కనిపిస్తోంది. చివరికి నిరాశాగా వెనుతిరిగే సమయంలో పార్కింగ్ లాట్ లో వెనకగా ఒక మూలన చిన్న మెష్ ల మధ్య ఎవరూ పట్టించుకోని చోట ఉంది. రెండు నిలువెత్తు పలకల  మీద ఎవరివో, ఎప్పటివో  రంగు రాతలు  కూడా ఉన్నాయి. నా వరకు నేను అక్కడ చాలా ఉద్విగ్నంగా అనుభూతి చెందాను. అక్కడి గోడల్ని చూపులతో తడిమితే ఎన్నో మాటలు చెబుతాయి. ఎన్ని ప్రాణాలో బలైన దుష్కర సంఘటనలు కళ్ల ముందు మెదులుతాయి. కానీ ఇక్కడ ఇప్పుడవి ఎవరికీ పట్టకుండా ఒంటరి జ్ఞాపకాలుగా చలిలో వణుకుతూ ఇక్కడ నిలబడ్డాయి. అన్నిటినీ ఎంతో గొప్పగా సంరక్షించే అమెరికా లో ఇవెందుకిలా ఈ మూలన ఉన్నాయో అర్థం కాలేదు. మేం ఫోటో తీసుకుందామనుకున్నా దాని ముందే ఒక కారు పార్కు చేసి ఉంది. అదృష్టం కొద్దీ వాళ్లు ఆ కారు తీసేయడం వల్ల కాస్సేపటి తర్వాతైనా ఫోటోలు తీసుకోగలిగేం.

ఒక వసంత కాలంలో అప్పుడప్పుడే పచ్చని చిగుర్లు వేసే సమయంలో నాకొకరోజు దూరంగా లాస్ ఆల్టోస్ కొండల  లో ముదురాకు పచ్చని ఒక కొండ మధ్య లేతాకుపచ్చని అందమైన ప్రదేశం కనిపించింది. అదేమిటో చూపించమని సత్యను అడిగితే పాపం కాదన్లేక ఆ వారాంతంలో  ఆ దృశ్యం కనిపించిన వైపు డ్రైవ్ చేస్తూ తీసుకెళ్లాడు. అయితే కొండని పట్టుకోగలిగేం కానీ ఆ పచ్చని గడ్డి తోట లాంటి చోటకు వెళ్లలేకపోయేం. దగ్గరకు వెళ్లేక అక్కడంతా ఇళ్ల కాలనీ మీదుగా ఆ తర్వాత  పైకి దారిలేదని బోర్డు దర్శనమిచ్చాయి. మరోసారిలాగే దూరంగా నునుపైన కొండ మీద మంచు టోపీ కనబడేసరికి అటువైపు నా మనస్సు పోయింది. ఆ ప్రదేశం పేరు Mount Hamilton. అక్కడ ఒక ప్లానిటోరియం కూడా ఉందట. గూగుల్ బాబాయిని సంప్రదించకుండా మంచు కనిపించిన దిక్కుగా దారి వెతుక్కుంటూ దాదాపు 20 మైళ్లు వెళ్లాం. అయితే అక్కడి నుంచి ఇంకా అయిదారు మైళ్లు కొండ మీదకు వెళ్లేదారి మంచు కురుస్తున్నందువల్ల మూసి వేయబడినది వెళ్లేందుకు వీలు లేదని గార్డులు  చెప్పడంతో వెనుతిరగాల్సి  వచ్చింది. దారి పొడవునా పర్వత వంపు రహదారుల్లో సరదా నవ్వుల ప్రయాణాన్ని ఆస్వాదించాం. మొత్తానికి అక్కడి వెళ్లలేక పోతేనేం ఇంటి  నుంచే అనుదినమూ అద్భుతదృశ్యమేదో ఒకటి  సాక్షాత్కరిస్తుంటే!!

……………

(Published in May, 2012 Vihanga)

http://vihanga.com/?p=3442

ప్రకటనలు
This entry was posted in నా కళ్లతో అమెరికా(Travelog) and tagged , , , , , . Bookmark the permalink.

6 Responses to నా కళ్లతో అమెరికా-6 (మౌంటెన్ వ్యూ)

 1. kalageeta అంటున్నారు:

  Ramesh garu, Thanks andi-

 2. sunkara Ramesh అంటున్నారు:

  geeta garu ,I read your American life experience,wonderful

 3. kalageeta అంటున్నారు:

  Thanks Sujatha garu- Are you in Bay Area? Varu is the short form of Varudhini-

 4. sujatam అంటున్నారు:

  Hi Geeta garu

  I like your documentation. Very nice. I wish I could make it one day. What is Varu’s full name ?

 5. kalageeta అంటున్నారు:

  Murthy garu,
  Post appude chadivesera! Thanks andi- Maroka post ku strength vaccesindi-

 6. NS Murty అంటున్నారు:

  రెండు నిలువెత్తు పలకల మీద ఎవరివో, ఎప్పటివో రంగు రాతలు కూడా ఉన్నాయి. నా వరకు నేను అక్కడ చాలా ఉద్విగ్నంగా అనుభూతి చెందాను. అక్కడి గోడల్ని చూపులతో తడిమితే ఎన్నో మాటలు చెబుతాయి. ఎన్ని ప్రాణాలో బలైన దుష్కర సంఘటనలు కళ్ల ముందు మెదులుతాయి. కానీ ఇక్కడ ఇప్పుడవి ఎవరికీ పట్టకుండా ఒంటరి జ్ఞాపకాలుగా చలిలో వణుకుతూ ఇక్కడ నిలబడ్డాయి….
  This is very touching and poetic Geeta garu. Thank you also for the lovely poem of Neruda.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s