నా కళ్లతో అమెరికా-7( లేక్ తాహో)

                                       లేక్ తాహో

జీవితంలో మొదటిసారి మంచును చూడడం ఒక అందమైన స్వప్నం. ఒక గొప్ప అనుభూతి. ఎడతెరిపిలేని సంబరం. ఇవన్నీ కలగలిసిన ప్రదేశం  లేక్ తాహో(Lake Tahoe).  మా ఊరి నుంచి ఈశాన్య దిక్కుగా దాదాపు 220 మైళ్లు దూరం లో ఉంది.  తాహో అనే పదానికి ఇక్కడి స్థానిక వాషో  భాషలో  సరస్సు అని అర్థం.

సియర్రా నెవాడా పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 6225 అడుగుల ఎత్తున, 1645 అడుగుల లోతుతో 71 మైళ్ల విస్తీర్ణం లో  విస్తరించి ఉన్న గొప్ప మంచి నీటి సరస్సు ఇది. సముద్రమట్టానికి అంత ఎత్తులో Alpine Lake కాబట్టి అత్యంత పరిశుభ్రమైన, స్వచ్ఛమైన జలాలతో అలరారుతూ ఉంటుంది. సరస్సు కాబట్టి ఈ ప్రాంతం  వేసవి విడిది మాత్రమే అనుకుంటే పొరబాటే.  ఈ చుట్టుపక్కల  శీతాకాలంలో మంచు బాగా కురవడం వల్ల సరస్సు చుట్టూ ఉన్న పర్వత శ్రేణుల్లో స్కీయింగ్ వంటి క్రీడల కోసం వేసవి కంటే అధికంగా విహారయాత్రికులు వస్తూ ఉంటారు.

ప్రయాణం

అమెరికా లో ఫిబ్రవరి 2 Groud Hog Day  రోజున ఇంకా శీతాకాలం ఎన్ని వారాలుంటుందో చెపుతారు. ఆ తతంగమంతా ఒక జానపద కథలా ఉంటుంది. మా వరు స్కూలు నించి ఇంటికొచ్చి వఅమ్మా! గ్రౌండ్ హాగ్ లోపలికి పారిపోయింది. అంటే వింటర్ ఇంకా ఆరు వారాలుంటుందనో , లేదా అది నీడను చూస్తోంది కాబట్టి  ఎర్లీ స్ప్రింగనోవ  ఉత్సాహంగా చెబుతుంది. ప్రధానంగా  పెన్సిల్వేనియా రాష్ట్రం లో ఇదొక పెద్ద సంబరంగా జరుపుతారు ప్రతీ ఏడాదీ. దానిని ప్రాతిపదికగా తీసుకుని ఇతర చోట్ల కూడా శీతాకాలపు సమయాన్ని  ప్రకృతి బద్ధంగా అంచనా వేస్తారు.  ఆ సంవత్సరం ఇంకా శీతాకాలం ఆరు వారాలుండడం తో మేం మంచు బానే ఉండి ఉంటుందని బయలుదేరాం.

మా ఊరి నుంచి లేక్ తాహో దాదాపు నాలుగున్నర, అయిదు గంటలు పడుతుంది. సగం దారిలో కాలిఫోర్నియా రాజధానీ నగరం శేక్రెమెంటో ఉంటుంది. అది దాటుకునే వెళ్లాలి. అయినా మేము దారిలో అన్నీ చూసుకుంటూ వెళ్లడం కదా ఎప్పుడూ. అదీగాక వింటర్ బ్రేక్ సెలవుల్లో  శుక్రవారం సాయంత్రం  బయలుదేరాం. బాగా రష్ ట్రాఫిక్ లో మాకు శేక్రమెంటో చేరేసరికే చీకటి పడిపోయింది. మేం ఆ రాత్రికి అక్కడే బస చేసి మర్నాడు ఉదయం వెళ్లాల్సి వచ్చింది.  దారిలో బాగా మంచు ఉంటే ఇక్కడి  నిబంధనల ప్రకారం కార్ల టైర్లకు చైన్లు పెట్టాలి. ఎందుకైనా మంచిదని ఇంటి నుంచి బయలుదేరే ముందే చైన్లు కొన్నాం. బాగా మంచు తుఫానులు వచ్చేటప్పుడు చెయిన్లు బిగించేందుకు మనుషులుంటారట.  అలవాటు లేని మంచులో కష్టాలు పడడం కంటే అలా వారి సాయం తీసుకుని డబ్బు చెల్లించడమే ఉత్తమమని ఆన్ లైన్ లో చదివేం. వీళ్లను వచైన్ మంకీవ లంటారట. చక్కని రహదారి చుట్టూ అద్భుతమైన కొండలు. మాంచి మెరిసే ఎండ కాస్తోంది. చైన్ మంకీ లు కాదు కదా మామూలు మంకీలు కూడా లేవు.

కొండల మలుపుల్లోంచి ఎక్కి దిగుతోంది మా కారు. అసలు మంచు లేదేమో అని నిస్పృహ మొదలైంది మాకు. మేం ఇంకా నలభై మైళ్ల దూరం లో ఉన్నామనగా రోడ్ల పక్కన హఠాత్తుగా ఉప్పు చల్లినట్టు మంచు గుట్టలుగా కనిపించింది. కానీ రంగు మాసి పోయి కాయ దేరిపోయినట్లు కనిపిస్తోంది. అయినా  సంతోషం పట్టలేక మొదట కనిపించిన స్పాట్ లోనే ఆగి తనివితీరా గడ్డకట్టిన మంచు ఉండలు చేత్తో ముట్టుకుని పరవశించి పోయాం. ఇక అక్కడి నుంచీ దారి పొడవునా చెట్ల మొదళ్లు, ఇళ్ల పైకప్పులు అంతా పాల నురుగు లాంటి  మంచుతో కప్పబడి ఉన్నాయి . అంతకు ముందే రెండ్రోజుల క్రితం బాగా మంచు కురిసిందట. కురిసేటప్పుడు దూదిపింజలా మెత్తగా ఉంటుందట. కానీ ఇప్పుడు గట్టిగా ఘనీభవించిపోయింది. పొరబాటున తన్నుకుని గానీ, జారి గానీ పడితే రాయి కంటే గట్టిదెబ్బ తగులుతుంది.

మేం వెళ్ళేసరికి మధ్యాహ్నం భోజనాల వేళ దాటిపోవస్తోంది. ఊరి మొదట్లోనే కనిపించిన Indian Restaurant కి వెళ్లాం. అంత గొప్పగా ఏమీ లేదు. అయినా ఆవురావురుమని తిన్నారు పిల్లలు. ఆ రోజంతా మొత్తం ఊరు Explore  చెయ్యడం తో సరిపోయింది. ఇక్కడ ప్రధానం గా అందరూ మంచు కొండల మీద క్రీడలు, విన్యాసాలలో ఒక్క సారైనా పాల్గొనడానికి హెవెన్లీకి వెళతారు. అదీ గాక ప్రధాన రహదారికి పక్కనే ఊరికి నడిబొడ్డున ఉంది. లేక్ తహో రెండు ఊర్లుగా ఉంటుంది. ఒకటి ఉత్తర, రెండు దక్షిణ. మేం ఉన్న దక్షిణం వైపే ఇవన్నీ ఉన్నాయి.  ఇక ఊరు మధ్యనించే పక్క రాష్ట్రం Nevada ప్రారంభమవుతుంది. అక్కడ కాలిఫోర్నియాలో ఉన్న కొన్ని restrictions లేవు. ఆ జంక్షను లోనే అటు వైపు పెద్ద పెద్ద Casino లు నడుస్తూ ఉంటాయి.  South Lake Tahoe ఊరంతా కలిపి ఒకటే పెద్ద రహదారి పక్కనే అయిదారు మైళ్ల దూరం లో విస్తరించినట్టు ఉంటుంది. ఇది  ప్రధానంగా టూరిస్టు ప్రదేశం.

ఈ స్లైడ్ ప్రదర్శన కోసం జావాస్క్రిప్ట్ అవసరం.

లేక్ వ్యూ

మేం లేక్ వ్యూ ఉన్న హోటల్ లో బస చేసాం.  బయటంతా తెల్లటి మంచు మాత్రమే కనిపిస్తూ ఉన్నా మంచి ఎండగా ఉన్నందు వల్లో ఏమో గొప్ప చలిగా అయితే లేదు. మా బాల్కనీ లో కూడా మంచు పేరుకుని పోయి ఉంది. కానీ ఎదురుగా తాయిలం పెట్టి తినొద్దన్నట్టు గా ఆ  బాల్కనీ ఏదో రిపైర్ కోసమని గ్లాస్ డోర్స్ లాక్ చేసారు హోటల్ వాళ్లు. ఎదురుగా విశాలమైన చల్లని ప్రశాంత సరస్సు. ఒడ్డును ఒరుసుకుని ఉన్న ఇసుకను కప్పిపెడుతూ మంచు. చిత్రంగా సరస్సు లోని నీళ్లు గడ్డ కట్టలేదు. అక్కడ నిలబడి అద్దాల బయట కనబడుతున్న దృశ్యంలోకి నిశ్శబ్దంగా ప్రవేశించాను. జీవితంలో మొదటి సారి అత్యద్భుతాన్ని చూస్తున్న ఒక గొప్ప ఆనందం హృదయం నిండా. వఅమ్మా! దా! బయటికి వెళ్దాంవఅని వరు వచ్చి నా చెయ్యి పట్టుకుని లాగే వరకు తల  తిప్పలేక పోయాను.  వష్ష్! ఉండమ్మా! మమ్మీని అలా చూస్తున్నపుడు డిస్టర్బ్ చెయ్యకూడదు.  ఒక మంచి కవితని మిస్ అవుతాం మనం వ అని సత్య అంటూ ఉంటే వరు వఎప్పుడూ  Poems ఏంటి  డాడీ! ఆడుకుందాం బయటవ అని గోల చేసింది.

రూం లో సామాన్లు పడేసి ఎదురుగా రోడ్డు దాటితే ఉన్న ఒడ్డుకు పరుగులెత్తాం. సాయంత్రపు ఎండ ఏటవాలుగా పడ్తోంది. గేట్ దగ్గర్నించీ సరస్సు వరకూ గడ్డ కట్టిన మంచు తివాచీ. వరు మంచు మీద పడుకుని కాళ్లూ చేతులూ గుండ్రంగా కదపడం (Snow Angels) మొదలు పెట్టింది. అత్యంత పెద్ద  సరస్సు కంటికి విందు చేస్తూ ఎదురుగా అత్యద్భుతంగా.  నీటి ఒడ్డున ఒక రెండడుగుల మేర మంచు లేదు చిత్రంగా. గేట్ దగ్గర్నించీ నీటి వరకు మంచు లో అడుగులో అడుగులేసుకుంటూ నీటి వరకు వెళ్లి నీళ్లను చేతితో తడిమే వరకు లోపల ఉరక లేసే గొప్ప ఆనందం. ఎందుకో ఆనందాతిరేకంతో ఆనంద బాష్పాలు నా కళ్ల నిండా. సంధ్య వాలుతూండగా గాలి బాగా చల్లగా అయిపోతూండడం తో సరస్సునొదిలి వచ్చెయ్య వలసి వచ్చింది.

కాసినో

ఆ సాయంత్రం ఊరు లోని ఒక పేరెన్నిక గన్న  Casino లోనికి చూసేందుకడుగు పెట్టాం. అక్కడ కొన్ని విభాగాల్లోకి పిల్లలతో కలిసి ఎక్కడా ఆగడానికి అనుమతించరు. అత్యంత అధునాతన మైన రిసార్ట్ కం కాసినో అది. మధ్య నడిచే హాలులో ధగ ధగ లాడే దుకాణాలు అక్కడక్కడా  ATM మెషీన్లు. అదొక మెషీన్ల జాదూ జూద ప్రపంచం. అక్కడ మన తెలివి తేటలని మించే మెషీన్ల మోళీ తో డబ్బు మారకం వేగంగా జరిగిపోతుంది. క్షణాలలో బికారులయ్యే వారి సంఖ్యే అధికంగా ఉన్నా, మనుషులు చాలా విచిత్రంగా అక్కడే చివరి క్షణం వరకూ అదృష్టం తలుపు తట్టక పోతుందా అని వేచి ఉంటారు. పెద్ద పెద్ద డబ్బాలలాంటి మిషన్ల ముందు పొగ ఊదుకుంటూ ఆడుకుంటూ కూర్చునే జనం మధ్యలోంచి నడుస్తూ ఉంటే కొన్ని చోట్ల పేక  ఆడే టేబుళ్ల మధ్య దీర్ఘంగా, నిశ్శబ్దంగా తలూపుతూ కొందరు, మధ్య మధ్య పానీయాలు, తినే టేబుళ్ల దగ్గర గోల గోలగా కొందరు. వాటిన్నిటినీ మించిన వేగవంతమైన మ్యూజిక్ వింటూ  అటూ ఇటూ ఇవన్నీ విచిత్రంగా చూస్తూ ఊరికే వ్యాహ్యాళి కి వచ్చిన మా లాంటి మనుషులు కొందరు. వెరసి ధగధగా మెరిసే మాయా ప్రపంచపు కింద అంతస్థు లో పిల్లల విభాగానికి వెళ్ళాం. అక్కడా ఇంతే కాకపోతే పిల్లల మెషిన్లు. పొగ, మద్యం వంటివి ఉండవు. అంటే తేడా. కాస్సేపు ఏదో గడిపి నట్టే గడిపి బయట పడేసరికి తొమ్మిదయ్యింది.

చీకటి పడేసరికి బయట త్వరగా బాగా చల్లగా అయిపోయింది. దానికి తోడు రివ్వున గాలొకటి. మేం కాసినో లో  తినే సాహసం కూడా చెయ్యలేదు. కాసినో చుట్టు పక్కల మాత్రం చీకట్లో ధగద్ధగమానంగా వెలిగిపోతున్నాయి రోడ్లు. మనుషులు చక్కగా తయారయ్యి రాత్రి వినోదాలకు అటూ ఇటూ తిరుగుతున్నారు. ఆ చుట్టు పక్కల ప్రధాన రహదారి జనం తోనూ, వచ్చే పోయే వాహనాల తోనూ రద్దీ గా ఉంది. ప్రయాణాలలో మేం గమనించిన మరో అంశం ఏమిటంటే రాత్రి ఎనిమిది దాటితే ఎక్కడా భోజనం దొరకదు. ఏవైనా 24 hours  రెస్టారెంట్లు వెతుక్కోవాలి. అవి కూడా ఎక్కడో ఒకటో  రెండో ఉంటాయి. అదృష్టం కొద్దీ పీజాహట్ తీసి ఉంది. ఇప్పుడు మా ఇంటిల్లి పాదిమీ ఇండియన్ ఫుడ్ కాక తినగలిగిన మరొక పుడ్ పీజా. అందునా మా వరుకు చీజ్ పీజా అంటే మహా ఇష్టం.  అందుకే కారులోంచి మేం రెస్టారెంట్లు వెతికేటప్పుడెప్పుడూ ‘అదుగో పీజా’ అని మొదట చూపిస్తూ ఉంటుంది.

హెవెన్లీ & స్కీ

ఇక మర్నాడు ఉదయానే మేం హెవెన్లీ గండోలా రైడ్ కు వెళ్లాలని కోట్లు, సరంజామాతో బయలుదేరాం. జంక్షనులో ఉన్న హెవెన్లీ ఆఫీసులో టిక్కెట్లు అమ్ముతారు. టిక్కెట్ల కోసం లైన్ చాలా పెద్దదిగా ఉండడం తో మాకు గంట పట్టింది. గండోలా అంటే ప్రధానం గా కొండ మీద ice park వరకు lift up.  టిక్కెట్టు మనిషికి 35 డాలర్లు. అయితే  ఇక స్కీయింగ్ చెయ్యాలనుకుంటే  మళ్లీ అక్కడి నుంచి పైకి  lift లకు, స్కీ సరంజామా అంటే బూట్లు, బల్లలు, హెల్మెట్లు వగైరాలకు వేరే,  ఇక స్కీ నేర్చుకుండే   మాటైతే ఆ క్లాసులు ఇలా అన్నిటికీ మనిషికి ఎలా లేదన్నా అయిదారు వందల డాలర్ల  పైనే ఖర్చు అవుతుంది. అయినా లెక్కలేని జనం. ఇక లైన్లోనే చాలా సమయమూ వృథా అయిపోతుంది. మేం రెండో సారి వెళ్లినప్పుడు స్కీ ఎక్విప్ మెంట్ కోసం వీళ్లు రెండు గంటలు లైన్లో నిలబడాల్సి వచ్చింది. మొదటి సారి కేవలం చూసొద్దామని వెళ్లాం. మా రోప్ వే కొండ పైకి వెళుతుంటే కిందే వెనక్కి పోతూ ఉన్న మంచు చెట్లు. ఎదురుగా విశాలమైన తెల్లని కొండల మధ్య అతి పెద్ద నీటి  తివాచీ, ఒడ్డున ధవళ పుష్పాల తోరణం లా ఒరుసుకుంటూ మంచు.  ఆ అద్భుత దృశ్యాన్ని చూడడానికైనా ఆ రైడ్ కు అంత డబ్బు ఇవ్వవచ్చు ననిపించింది.

మొదట కొంత దూరం రాగానే ఒక చోట లిఫ్ట్ లో దిగి చుట్టూ చూసుకుని మళ్ళీ  వచ్చే  మరో లిఫ్ట్  పట్టుకుని పై  level కు వెళ్లొచ్చు. మేం అలా మొదటి స్టాప్ లో ఆగి మంచుతో ఒక అరగంట మా పిల్లలతో మమేకమై మేమూ చిన్నపిల్లలమై బాగా ఆడుకున్నాం. రైలింగ్స్ వెనక మంచులో  కొంచెం చెయ్యి చాస్తే రాత్రే కురిసిన మెత్తటి మంచు చేతులకు మెత్తగా తగులుతుంది. ఒకట్రెండు వరుసల్లో ఒకదానిమీదొకటి బట్టలు, స్వెట్టరు, ఆపైన తడవని కోటు తో బాటు మంచుకే ప్రత్యేకించిన పాంట్లు, గ్లోవ్స్ టోపీ పెట్టుకుంటే తప్ప అలా రోజంతా మంచు తో చెలగాటమాడడం అసాధ్యం. గ్లోవ్స్ వీలైతే మరో జత ఎక్స్ ట్రా పట్టుకెళ్లడం మంచిది. పొరబాటున ఒక చేతిది పిల్లలు పడేస్తే ఇక మంచులోచెయ్యి పెట్టడం కష్టం. మళ్లీ మళ్ళీ ఎన్ని సార్లో మంచు ని చూసినా జీవితం లో తొలి అనుభవాలెప్పుడూ ఆపాతమధురాద్భుతాలుగా ఉండి పోతాయి.

ఇక గండోలా లో పై వరకు వెళ్లేక ఒక వైపు స్కీ ట్రైనింగ్, మరో వైపు స్కీ వాళ్లు మాత్రమే వెళ్లగలిగిన లిఫ్ట్ లు, రెస్టారెంట్ కాంప్లెక్స్, మరో వైపు చిన్నపిల్లలకు  Tubing మొ. నవి ఉంటాయి. ఎటు చూసినా ఎత్తు పల్లాలుగా ఉండి చుట్టూ జారే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ మంచు పూర్తిగా లేని రోజుల్లో Artifical మంచు ని కురిపించి మరీ  resort ని నడుపుతారట. అన్ని వైపులా కోలాహలంగా ఉంది. ఇంచు మించు ఒకే లాంటి  వస్త్రధారణతో, కళ్లకు మంచు కళ్లద్దాలతో ఉన్న వీరిలో ఎవెరెవరో గుర్తు పట్టడం కష్టమే. అక్కడ పెద్ద వాళ్లకే  గంతులెయ్యాలనిపిస్తూంటే ఇక పిల్లల సంగతి చెప్పాలా! మా కోమల్, వరు లు ఆకలి అని కూడా అనకుండా సాయంత్రం వరకు ఆడుతూనే ఉన్నారు. ్టమమ్మీ! నువ్వూరా” అనెన్ని సార్లు పిలిచినా నేను వీళ్లలా జారే సాహసం చెయ్యలేక పోయాను. చిన్నప్పుడు వీళ్ల కంటే హుషారుగా చాలా సునాయాసంగా అన్నీ చేసేసేదాన్ని కదా! అని నవ్వుకున్నాను. అలా మంచులో చతికిల బడి అన్నీ పరికించడమూ బావుంది. ఒక రోజంతా మంచు తోనే ఆడుకుని, పరవశించి కనుచూపులతోనూ, కర స్పర్శ తోనూ ఆస్వాదించి పులకరించిపోయాను. కానీ ఎక్కువ సమయం అలా మంచులో గడపడం వలన  చల్లదనానికి కాళ్లు మొత్తం మర్నాడు విపరీతంగా నొప్పిని తెప్పించాయి.

ఇక రెండో సారి వెళ్లినపుడు వీళ్లు ముగ్గురూ రోజల్లా స్కీ ట్రైనింగ్ తోనూ, స్కీ చేస్తూనూ ఉండిపోయారు. వరు ను పిల్లల స్కీ ట్రైనింగ్ వేరే అని వాళ్లతోనే తీసుకెళ్లేరు. ఇక కోమల్ ఐస్ స్నో బోర్డింగ్, సత్య స్కీ ట్రైనింగ్ లోనూ జాయిన్ అయ్యారు. అన్నీ తలా ఒక చోట. నా పని సిరినెత్తుకుని ఇవన్నీ తిరుగుతూ ఉండడమన్న మాట. అయితే నేనూ, మా సిరి మంచులో బాగా ఆడుకున్నాం. కానీ  ఆ పిల్ల కాస్సేపు ఉండి ఇక చల్లదనం భరించలేక బాగా ఏడుపు మొదలెట్టింది. విధి లేక రెస్టారెంట్ లోపల వెచ్చదనం లోనే మధ్యాహ్నమంతా ఉండాల్సి వచ్చింది నేను. ఒక రోజులోనో, రెండ్రోజుల్లోనో స్కీయింగ్ నిజంగా పూర్తిగా నేర్చుకోలేక పోయినా ఒక గొప్ప సాహసానుభవం కోసమైనా స్కీ చెయ్యొచ్చు. లైన్లలో పూర్తిగా సమయం వృథా అవకుండా ఉదయం త్వరగా వస్తే మంచిది.  సాయంత్రం అయిదింటికే కొండ మీద పార్కులన్నీ మూసి వేస్తారు. చలి కూడా బాగా మొదలైపోతుంది. ఉదయం ఎలాగూ ఆలస్యంగా రావడం తో సాయంత్రం మేం చివరి నిమిషం వరకు గడిపి వచ్చేం.

స్నో మొబిల్ & స్లెడ్డింగ్

మర్నాడు తిరిగి వెళుతూ ఊరికి వచ్చే మొదట్లో మలుపులో ఉన్న మంచు స్కూటర్ (Snow Mobile) ల మీద ఎక్కి తిరిగేందుకు ఆగాం. గంటకు పది డాలర్లు. మామూలు స్కూటర్ల లాగే ఉన్నా మంచులో అదెక్కడ కింద పడుతుందో అని భయం వేసింది. నిజానికి చుట్టూ చైన్లతో నడవడం వల్ల పడదు. కానీ బండి బాగా జారిపోతున్నట్లు అనిపిస్తూంది. అంతే-

ఆ పక్కనే ఉన్న స్లెడ్డింగ్ కు పరుగుతీసారు పిల్లలు. చిన్న స్లెడ్ బోర్డ్ లతో దాదాపు 100 మీటర్ల దూరం ఎత్తు నించి పల్లంగా జారుకుంటూ రావొచ్చు. దానికి గంటకు  10 డాలర్లు మామూలే. మధ్యాహ్నం వేళైపోతున్నా ఎవరూ కదలకుండా ఆడుతూనే ఉన్నారు. లోపలికి వెళ్లాలంటే తప్పని సరిగా స్లెడ్ బోర్డ్ కొనుక్కుని వెళ్లాల్సిందే. అందుకే నాకూ ఒకటి కొనాల్సి వచ్చింది. నేను తాపీగా అ బోర్డు తిరగేసి ఒక చోట కూర్చున్నాను.  వీళ్లని చూస్తూ ఫోటోలు, వీడియోలు చూస్తూ గడిపాను.  ఆకాశం తళత్తళా మెరుస్తూంది. వెల్తురు  పరదా గాలిలో ఆరేసినట్లు కిరణాలు మంచులో  ప్రతిబింబించి కళ్లల్లోకి సూటిగా పడ్తున్నాయి. చెట్లు నిస్సహాయంగా నిల్చుని ఉన్నాయి. చుట్టూ పర్వత శ్రేణి. అవన్నీ మంచు తోపీలు, మంచు పూల  దుస్తులు  ధరించి ఏవో నిశ్శబ్దపు దివ్య గానాలాలపిస్తూన్నట్లున్నాయి.  అక్కడ మంచు మీద మేను వాల్చి,  కళ్లు మూసుకుని తెరిస్తే నేను, ఆకాశం, మేఘాలు, గాలి, వెల్తురు, శరీరపు చల్లదనం. ఈ క్షణం చాలు జీవితానికి అనిపించే అద్భుత అనుభూతి.  ఆ ఒక్క క్షణం గాలిలో గిరికీలు కొట్టి నేల వాలిన పావురపు అనుభూతి. జీవితం లోని గొప్ప అనుభూతులన్నీ ఆ క్షణం లో నా చుట్టూ పరిభ్రమిస్తున్న భ్రాంతి.

దారి పొడవుకీ వెను తిరిగి చూపించే గొప్ప అనుభూతి ఆ ప్రయాణం.  లేక్ తహో చూసొచ్చిన వారెవరికైనా   ”ఆహా! లేక్ తహో!” అనిపించకమానదు.

                                                                                                      

– డా|| కె.గీత

                                           *****

Published in May,2012 by విహంగ

 

ప్రకటనలు
This entry was posted in నా కళ్లతో అమెరికా(Travelog) and tagged , . Bookmark the permalink.

2 Responses to నా కళ్లతో అమెరికా-7( లేక్ తాహో)

  1. kalageeta అంటున్నారు:

    Avunandi-

  2. Phaneendra అంటున్నారు:

    Is it the same Lake Tahoe mentioned in Mario Puzo’s Godfather?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s