నా కళ్లతో అమెరికా-9 (శాండియాగో )

శాండియాగో (Sandiego)

Dr K.Geeta

Dr K.Geeta

 

కాలిఫోర్నియాకు దక్షిణపు కొసన ఉండి,  రాష్ట్రంలో రెండవ  పెద్ద నగరం శాండియాగో. లాస్ ఏంజిల్స్ నుంచి 120 మైళ్ల దూరంలోనూ, మా ఊరి నుంచి దాదాపు 470 మైళ్ల దూరం లోనూ ఉంటుంది.  ఇక్కడి నుంచి ఎనిమిది, తొమ్మిది గంటలు ఏకబిగిన ప్రయాణమన్నమాట. అది కూడా ఇక్కడ అత్యంత వేగవంతమైన ఫ్రీవే ల వల్ల. లేకపోతే ఇంకా ఎక్కువ సేపు పడుతుంది.  చుట్టూ కొండలతో సముద్రం లోపలికి చొచ్చుకుని వచ్చిన తీరాలకు  ఇరువైపులా  విస్తరించి ఉన్న అందమైన, విశాలమైన నగరం  శాండియాగో.

చారిత్రాత్మకమైన నగరం.  అమెరికా సంయుక్త రాష్ట్రాల పశ్చిమ తీరం లో మొట్టమొదటి యూరోపియన్ సెటిల్ మెంట్లు 1542 లో ఈ ప్రాంతంలోనే మొదలయ్యాయి. ఈ ప్రాంతం అప్పటి నించి దాదాపు నాలుగు వందల సంవత్సరాలు స్పెయిన్ ఆధీనం లో ఉండడం వల్ల ఈ ప్రాంతపు వాసులంతా ఇప్పుడు స్పానిష్ భాషనే అత్యధికంగా మాట్లాడుతారు.   ఇక ఇక్కడ ఒకప్పుడు ఉండే ఆటవిక జాతులు క్రమంగా అంతరించిపోవడం వల్ల ఇప్పుడు ఆయా జాతుల భాష, సంస్కృతి కనుమరుగైపోయాయి. కాలిఫోర్నియా రాష్ట్రం లో చాలా మంది ప్రజలు స్పానిష్ భాష మాట్లాడేవాళ్లే. ఈ ప్రాంతం 1821 లో మెక్సికోలో భాగమైనా, తిరిగి మెక్సికో అమెరికా యుద్ధం  వల్ల 1850 లో  అమెరికా సంయుక్త రాష్ట్రాలలో భాగమైంది. ఇది గొప్ప నౌకాశ్రయం కూడా. ఇక్కడి నుంచి మెక్సికో దేశం కూతవేటు దూరంలో ఉండడం వల్ల ఇక్కడి నుంచి ఆ దేశానికి డే టూర్లు కూడా నడపబడుతూ ఉంటాయి. ఇక ఇరు దేశాల సరిహద్దు  15 మైళ్ళ పరిధిలో ఈ నగరం లో భాగంగా ఉండడం వల్ల ప్రతీ రోజూ జరిగే ఇరు దేశాల రాకపోకలు, ఎగుమతి దిగుమతులతో సరిహద్దు ప్రాంతం రద్దీ గా ఉంటుంది.  మొదటి ప్రపంచ యుద్ధ కాలం నించీ ఈ నగరం యుద్ధ నౌకలకు, వాయుదళాలకు కేంద్రమైంది.  పశ్చిమ తీరపు ప్రధాన నౌకా కేంద్రం ఇది.

మేం ఆ దగ్గర్లో అన్నీ చూడాలంటే కనీసం  మూడు రోజులు కావాలి కాబట్టి ఒక లాంగ్ వీకెండ్ బయలుదేరాం.  మా ఇంటి నుంచి యథావిధిగా  కొండలు దాటి,  కోనలు దాటి,  ప్రీవేలు దాటి మంచి రష్ ట్రాఫిక్ ఉన్న ఒక శుక్రవారం రాత్రి  తొమ్మిది గంటలకు  శాండియాగో కు దాదాపు ముప్ఫై మైళ్ల దూరం లో ఉన్న  కార్ల్స్ బాద్  లోని మా బసకు చేరుకున్నాం.  మర్నాడు అదే ఊర్లో ఉన్న Lego Land చూసేందుకు కేటాయించినందువల్ల అక్కడ ఆ రాత్రికి విడిది చేసాం. పిల్లల స్కూల్స్ అయ్యాక బయలుదేరినందు వల్ల త్వర త్వరగా బసకు చేరుకోవాలని  దారిలో ఎక్కడా ఆట్టే ఆగకుండా  వచ్చేసాం. తీరా వచ్చేసరికి ఆకలి నకనకలాడుతోంది. పక్కనే అదే రోడ్డు లో ఏదో రెస్టారెంట్లు కనబడితే అటు నడిచేం. అయితే ఇక్కడ తొమ్మిదింటికి దాదాపుగా అన్ని హోటళ్లు మూసేస్తారు. మేం వెళ్లిన ప్రతీ చోటా ఇదే బోర్డు వేళ్లాడుతోంది. మళ్లీ వెనక్కి నడిచి వచ్చి కారు తీసుకుని మళ్లీ ఫ్రీవే ఎక్కి 24 గంటల రెస్టారెంటు ఒకటి కనిపెట్టి పది గంటల వేళకు మొత్తానికి  తిన్నాం. అది కూడా డ్రైవ్ థ్రూ లో మాత్రమే ఓపెన్ ఉంది. కార్లోనే పిల్లలు ఆదరా బాదరా ఎవరి పొట్లాలు వాళ్లు విప్పుకుని తింటుంటే నవ్వు, బాధ రెండు  వచ్చాయి నాకు. ఇక అప్పటి నుంచీ రాత్రి తొమ్మిది దాటితే భోజనం ముందే పకడ్బందీ గా ఏర్పాటు చేసుకోవడం మొదలు పెట్టాం.

మేం శాండియాగో లో నాలుగింటిని  చూసేందుకు ప్లాన్ చేసుకున్నాం.   శాండియాగో లో ప్రఖ్యాతి చెందిన Lego Land,  Sea World, Zoo మరియు Safari.
లెగో లాండ్:  చల్లని వేసవి ఉదయపు ఆహ్లాదం లో మేం లెగో లాండ్  లోకి ప్రవేశించాం. అది నిజానికి 8 సంవత్సరాల లోపు పిల్లలకు అనిపించే థీం పార్కు. కానీ పార్కు లోని చిన్న చిన్న లెగో లతో నిర్మించిన  మరుగుజ్జు నగరాల అద్భుత కట్టడాల కళాఖండాలు చూసి తీరవలసిందే.  టిక్కెట్టు ఒక్కొక్కరికి పెద్ద వారికి 72, చిన్న పిల్లలకు 62 డాలర్లు.  లోపలికి వెళుతూనే బాగా చిన్న పిల్లల ప్రాంతాలలో ఆగకుండా వరు వయసు attractions లోకి వెళ్లాం.  వరు మొదటగా గో కార్టింగ్ కు వెళ్లొచ్చింది. వాళ్లు వచ్చేటప్పుడు మరో అయిదు డాలర్లు పుచ్చుకుని ఉత్తుత్తి డ్రైవింగ్ లైసెన్సు కూడా ఇచ్చేరు. ఇక రేపట్నించి నేను కారు డ్రైవ్ చెయ్యొచ్చు అని గొప్పగా చెప్పింది మా వరు. సిరి ఇంకా ఆడేంత పెద్దది కాదు. కోమల్ ఆడడానికేమీ లేవు. ఇక బాగా ఉత్సాహంగా పరుగెడుతున్నది మా వరు ఒక్కతే.

అయితే ఇక్కడ ఉన్న చిన్న చిన్న రోలర్ కోస్టర్ల వంటివి పెద్దగా భయపడాల్సినవి కాకపోవడం తో నేనూ పిల్లలతో ఉత్సాహంగా అన్నీ ఎక్కి దిగాను. ఆ మాత్రానికే నేను కళ్లు మూసుకోవడం చూసి పిల్లలు ఒకటే నవ్వులు. ఒక గంట పాటు పార్కు లో అన్ని గొప్ప నగరాల , గొప్ప ప్రదేశాల  ప్రతిరూపాలూ చూపించే  బోట్ ప్రయాణం బావుంటుంది. చక్కని కళాకృతులన్నీ లెగోలతో తయారు చేసి ఉండడమే ఈ పార్కు ప్రత్యేకత. వాటి డిజైనింగుకి చాలా సమయం, నేర్పు అవసరం. నా వరకు నాకు ఈ పార్కు బాగా నచ్చింది. మరీ పరుగులూ ఉరుకులూ, భయపడడాలూ, తల తిప్పడాలు లేకుండా కాస్త ప్రశాంతంగా, సరదాగా గడిచింది.
ఒక చోట పుర్తిగా లెగో లతో తయారు చేసిన కారు చూడడానికి నిజమనిపించేంత సహజంగా ఉంటుంది. పార్కు లోని  ప్రధాన విశేష ఆకృతులన్నీ కనిపించే పడవ ప్రయాణం లో ప్రపంచంలోని అద్భుతాలైన తాజ్ మహల్, ఈఫిల్ టవర్ వంటివే కాకుండా ఇక్కడి గొప్ప విశేషాలైన Mount Rushmore వంటివి కూడా ఉండడం విశేషం. అంతే కాకుండా నీళ్ల మధ్య నిర్మించిన న్యూయార్క్ నగరపు నమూనా అద్భుతంగా ఉంటుంది.  ఇక అదే విధంగా నిర్మించిన శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ వెగాస్ వంటి నగరాల నమూనాలు కూడా అత్యద్భుతంగా ఉంటాయి. ఆ కళా రూపాలు చూడడానికి నిజానికి ఆ టిక్కెట్టు అంత పెట్టొచ్చు. నిజానికి డెబ్భై పై చిలుకు రైడ్స్, ఎట్రాక్షన్సు ఉన్నాయి ఇక్కడ కూడా. ఈజిఫ్టు దేవాలయాన్ని, గుహలను ప్రతిబింబించే ప్రాంతం నిజం అనిపించేలా ఉంటుంది.

పిల్లలకు సీ ఆక్వేరియం కలిపిన టిక్కెట్లు కొన్నందు వల్ల పరుగున వెళ్ళి వచ్చేసే ముందు ఒక గంట లో చూసి తిరిగొచ్చేసేరు . ముఖ్యంగా సిరి ని ఒళ్లో కూచోబెట్టుకుని స్థిమితంగా నడిచే రైడ్లు ఉండడం వల్ల చిన్న పాప తో మాకు ఇబ్బంది అవలేదు. మేం మధ్యాహ్నం పీజా తింటూ ఉంటే మీదకు ఉరుకుతూందని,  చివరి గట్టి అంచు బ్రెడ్డు ముక్క ఒకటి చేతికిచ్చేం. అదే మొదటి సారి అలా గట్టి ఘనాహారాన్ని ఇవ్వడం.  ఇచ్చిన ముక్కని పట్టుకుని  మేం తింటున్నంత సేపు చీకుతూనే ఉంది.  బాగా నవ్వుకున్నాం అది చూసి. ఆ మర్నాటి నుంచి  మేం శాండియాగో లోని విశేషాలు చూడాలనుకున్నాం  కాబట్టి ఆ రోజు ఉదయమే అక్కడి రూం ఖాళీ చేసేసాం. లెగో లాండ్ నించి తిన్నగా శాండియాగో సీ వరల్డ్ కు దగ్గరగా ఉన్న కొత్త హోటల్ కు చేరుకున్నాం. పర్వత ప్రాంతాల్ని చెక్కి నిర్మించినట్లు ఆ చుట్టు పక్కల ఊరు చాలా రమణీయంగా ఉంది. మేం ఉన్న చోటు నించి ఎక్కడికి వెళ్లాలన్నా ఒక కొండ దిగి మరో కొండ ఎక్క వలసిందే. మా బస అన్నిటికీ పైన up hill  లో ఉంది. ఉదయం మేం బయటికి బ్రేక్ ఫాస్టుకి రాగానే చుట్టూ ఎగువన చక్కని యూకలిప్టస్ చెట్లు అలల్లా వీస్తూన్న చక్కని హాయైన గాలి. ఇక హోటల్ లోని ఫ్రీ బ్రేక్  ఫాస్టు ఆఫర్ గురించి చెప్పుకోవాలి. జనం ఎక్కువ ఉండడం వల్ల స్విమ్మింగ్ పూల్ దగ్గర సర్వ్ చేసారు హోటల్ వాళ్లు. ఏవో కొన్ని మఫిన్లు, గుండ్రటి చిన్న బేగెల్సు , ఆరంజి రసం. మొదట రోజు బాగానే తిన్నారు పిల్లలు. మేమున్న  మూడు రోజులూ అదే. ఇక గోల గోల పెట్టేసారు పిల్లలు. ఇప్పటికీ మఫిన్లు తినమంటే బాబోయ్ అనేస్తున్నారు. పైగా చాలా ఖరీదు కూడా ఆ హోటల్ కి.

ఈ స్లైడ్ ప్రదర్శన కోసం జావాస్క్రిప్ట్ అవసరం.


సీవరల్డ్: ఇక రెండవ రోజు సీవరల్డ్. మేం శాండియాగో లోని ముఖ్యమైన మూడు విశేషాలైన  సీవరల్డ్, జూ పార్కు, జూ సఫారి పార్కు  కలిపిన టిక్కెట్టు  కొన్నాము.  అది $135 పెద్దలకి, $105 పిల్లలకి.  ఎలాగూ మేం అందులో అన్నీ చూడాలనుకున్నాము కాబట్టి. ఒక్క సీ వరల్డ్ చూడాలనుకునేవారు అదొక్కటీ కొనుక్కోవచ్చు. ఇక దక్షిణ కాలిఫోర్నియా వాసులకి సీజన్ టిక్కెట్లు వేరేగా లభిస్తాయి. కేవలం యాత్రికులకి వేరే. వరసగా లాస్ ఏంజిల్స్, శాండియాగో రెండు నగరాలూ దర్శించే వారికి అన్ని పార్కులూ కలిపిన టిక్కెట్లు కూడా అమ్ముతారు. టిక్కెట్లు కొనడం బానే ఉంటుంది. వరస పెట్టి చూడడమే కష్టం. అయినా నగరం ఒక్కోసారి చొప్పున పెట్టుకున్నా రెండు మూడు రోజులు ఒక్కోసారి చొప్పున ప్లాన్ చేసుకుంటే నిదానంగా అన్నీ చూడొచ్చు.

సముద్ర తీరపు జల చరాల  విన్యాసాలు ప్రదర్శించే ప్రసిద్ధి చెందిన థీం పార్కు ఇది. నీళ్లు చిమ్మే షో లు, రైడ్లు  ఎక్కువగా ఉండడం వల్ల వేసవి లో ఇక్కడికి వెళ్తే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఉదయం నించి సాయంత్రం వరకు పడుతుంది. మేం లోపలికి వెళుతూనే గుండ్రంగా అతి నెమ్మదిగా తిరుగుతూ దాదాపు పది తాడిచెట్ల ఎత్తుకు తీసుకెళుతుంది లిఫ్ట్ లాగా ఉన్న ఆ రైడ్. పైగా చుట్టూ ఉన్న సీట్లలో కూర్చో వచ్చు కూడా. అక్కడి నుంచి వంద మైళ్ల విస్తీర్ణం వరకూ అన్నీ కనిపించడం విశేషం. నిజానికి రైడ్ లాగా కాకుండా ఒక గొప్ప అద్భుతంలాగా అనిపించింది నాకు. నెమ్మదిగా భూమి నుంచి విడి వడి గాల్లోకి చెట్ల మీదుగా,  అలా అలా భవంతుల మీదుగా పక్కనే కను చూపులో ఎగిసి పడే సముద్రం మీదుగా కళ్ల ముందు విస్తరించే అత్యద్భుత దృశ్యం కను విందు చేస్తుంది. పైకి వెళ్లగానే మొత్తం ప్రపంచం  చిన్న మరుగుజ్జు రూపాలై, బొమ్మరిల్లై  మోకరిల్లిన అనుభూతి. అంతలోనే నేలకు దిగొచ్చి మళ్లీ ప్రకృతి లో లీనమయ్యే సమానత్వం. అదే అత్యంత వేగంగా తిరిగితేనో, కేవలం క్షణాల్లో వచ్చేస్తేనో ఈ అనుభూతి ఉండదు. పైకి వెళ్లి రావడం దాదాపు  అరగంట పైనే పడుతుంది. అందుకే బావుంటుంది. ఇంతకీ దీని పేరు sky tower.

మేం షోలన్నీ ముందుగా కవర్ చేసుకుని చివరగా రైడ్లకు వచ్చేం. అక్కడికీ కొన్ని చోట్ల చాలా పెద్ద లైన్ల లో గంట పాటు నిలబడవలసి వచ్చింది. కొన్నిటికి ప్రధాన గేటు వద్ద ఇంకాస్త అధికంగా డబ్బు చెల్లించి Fast pass  లోపలికి వచ్చే ముందే తీసుకోవచ్చు.  దాదాపు పది వరకూ షోలు, పది వరకు రైడ్లు, పదిహేను వరకూ ఎగ్ఝిబిట్ లు ఉంటాయి. కానీ లైన్ల వల్ల కొన్నే చూడగలుగుతాం. రైడ్లకు Fast Pass  ఎక్కువ జనం ఉన్న రోజుల్లో బాగా పనికి వస్తుంది.
షోలన్నీ అద్భుతంగా ఉంటాయి. షార్కు చేపలు, డాల్ఫిన్లు , సీ లయన్లు, సీల్ లు మనిషి శిక్షణకు తల వంచి చెప్పినట్టల్లా చెయ్యడం ఆశ్చర్య చకితుల్ని చేస్తుంది.  మేం వెళ్లిన రోజున కాస్త ఎండగానే ఉండడం వల్ల షోల లో మేం బాగా నీళ్ళు చిమ్మే ముందు వరుసల్లో కూర్చునే వాళ్లం సరదాకి. చివరి షో లో మధ్యాహ్నం అలా నీళ్లు చిమ్ముతూ వేల్ చేప తొట్టె దగ్గరకు వచ్చి ఒక్క ఊదు ఊదగానే నా ఒళ్ళో పాపాయి బాగా భయపడి కిళ్లు పెట్టి ఏడవడం ప్రారంభించింది.
ఇక సముద్రపు పాయ లోపలికి చొచ్చుకు వచ్చిన తీరాన్ని వీళ్లు చాలా తెలివిగా గొప్ప షోగా మార్చుకున్నారు. మనుషులు పడవల్లో వచ్చి గొప్ప గొప్ప విన్యాసాలు చేసే ప్రాంతంగా దానిని మలుచుకున్నారు. అవన్నీ వేటికవే అనితరసాధ్యాలు గా అనిపించేలా ఉండడం విశేషం.

ఇక అక్కడి జల చరాలతో దగ్గరగా గడిపే అవకాశం, వాటికి తినిపించే అవకాశం  వేటికవే బాగా డబ్బు చెల్లించే టిక్కెట్ల ద్వారా లభిస్తాయి. కానీ మొదటి సారి పార్కుని దర్శించే వారు ముందు అసలు టిక్కెట్టు లోని భాగమైనవి చూసేసరికే సమయం అయిపోతుంది.  మధ్యలో భోజనాలకు పార్కులోని పరిమిత  రెస్టారెంట్లలో పనికొచ్చే రెండు ఫూటలకూ కలిపిన భోజన టిక్కెట్ల ద్వారా చెయ్యొచ్చు. కానీ రాత్రి ఎనిమిది, తొమ్మిది వరకూ అందులోని చాలా తెరిచి ఉండవు. కాబట్టి రాత్రి పార్కు కట్టేసే వరకూ ఉండాలనుకునే వారు రాత్రి భోజనాలు మధ్యలో ఏ ఏడు గంటలకో కానిస్తే మంచిది.
షోలు వేటికవే అత్యద్భుతంగా ఉన్నాయి.    ప్రాంగణమంతా ఆవరించుకున్న లేత నీలం రంగు సముద్రమై మెరిసే పెద్ద పెద్ద  నీళ్ల తొట్టెలు,  అందులో ధైర్యంగా విహరిస్తూ ఇది తమ సామ్రాజ్యమని గర్వంగా చాటుకునే జలచరాలు, జేబుల్లో నుంచి నిమిషానికి కాస్త ఆహారాన్ని అందిస్తూ వాటి విన్యాసాలకు కారకులైన గొప్ప శిక్షకులు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తారు. నీళ్లు లేని ప్రాంగణాల్లో కుక్కపిల్లల షో కూడా ఉండడం విశేషం.
మేం షోలన్నీ చూస్తూ మధ్య లో సముద్రం మీదుగా ఉన్న రోప్ వే కు వెళ్దామనుకున్నాం. కానీ రోప్ వే అంత పొడవూ ఉన్న లైన్ లో కష్టమనిపించి విరమించుకుని రైడ్ల వద్దకు వచ్చాం.

రైడ్లన్నీ అయ్యాక ఇక చీకటి పడిపోతుందనగా మాకు రోప్ వే అవకాశం వచ్చింది. ఇక రైడ్ల లో పార్కు కల్లా అత్యంత ఎత్తైన, క్లిష్టమైన దానికి నన్ను తీసుకు వెళ్లారు. ముందు వీళ్లు ముగ్గురూ వెళ్లొచ్చి అసలేమీ భయం లేదు, చాలా సిపుల్ అంటే ఏమోనని ఎక్కేసాను. తీరా అది బయటకు కనిపించని మలుపులెన్నో తిప్పి తిప్పి ఒక పెద్ద జలపాతం మీంచి కిందకు తోసేస్తుంది. ఇక చూసుకోండి. నేను కళ్లు తెరిస్తే ఒట్టు. గట్టిగా అరుస్తూనే ఉన్నాను. అంతా అయిదుపది నిమిషాలే అయినా కళ్లు తిరిగిపోయాయి నిజంగా.
రాత్రి పార్కు మూసేసే వరకు అక్కడే ఉన్నాం. అది వేసవి కావడంతో పార్కు లో రాత్రి ప్రత్యేకమైన అయిదు నిమిషాలపాటూ జరిగే బాణసంచా కార్యక్రమం కూడా చూసి ఆనందించాం.

జూ:  మర్నాడు ప్రసిద్ధి చెందిన  శాండియాగో జూ ను చూడడానికి వెళ్లాం. నిజానికి మాకు టిక్కెట్లు జూ, సఫారీ రెండిటికీ ఉన్నాయి. అయితే జూ ఒక చోట.  సఫారీ మరో చోట ఉండడం వల్ల రెండు రోజులు కేటాయించాం. జూ, సఫారీ  అంటే ఏముంది? ఎప్పుడూ చూసే పులులూ , సింహాలే కదా అనుకుంటాం పెద్ద వాళ్లం.  జూ అంటే ఏమిటో పిల్లల్ని అడగాలి. గొప్ప సరదా, గొప్ప విచిత్రం, గొప్ప విశేషం, ఎన్ని సార్లు చూసినా మళ్లీ చూడాలనే ఉత్సాహం.  అవన్నీ చూస్తే మనకూ ఉత్సాహం రాకేమవుతుంది? నేనూ పిల్లలతో చిన్న పిల్లనైపోయి బాగా ఆనందించాను. జంతువుల విశేషాల్ని పిల్లలు చెబుతూంటే ఏమీ తెలీనట్లు వింటూ వచ్చాను. ఇక మా వరు ని చూడాలి తనకే అన్నీ తెలిసిన ఆరిందాలా మనకు వివరాలు చెప్తూ ఉంటుంది ఏం చూసినా.

నాకు బాగా నచ్చిందేమిటంటే మన జూల్లాగా మైళ్లకు మైళ్లు నడిపించేసి, ఎక్కడో ఒక జంతువు మన అదృష్టం కొలదీ కనబడక పోతుందా అని ఎదురు చూపులు కాకుండా దగ్గర వాటికి నడిచి వెళ్లడం,  దూరం వాటికి రోప్ వే లో వెళ్ళడం వంటి ఏర్పాట్లు ఉన్నాయి. పైగా ఈ జూ నగరం నడి బొడ్డున ఉన్న కొండ మీద ఉండడం  మరో విశేషం.  మేం జూ లోపల అంతా తిప్పి చూపించే బస్సులో లోపల తిరుగుతూ ఉంటే ఒక చోట రోడ్డుకు దిగువగా వాహనాలు వెళుతూ కనిపించాయి.  అంతే కాకుండా గేటు దగ్గర్నించీ అదేదో చిక్కని అరణ్యం లోకి ప్రవేశించినట్లు తీగలు, మొక్కలు అలుముకున్న అరణ్యపు ఆవరణ అత్యద్భుతంగా, నడుస్తూంటే చల్లగా ఉంటుంది. మంచు ఎలుగులూ, అరుదైన పాండాలు మొ||న  ప్రపంచ వ్యాప్తంగా ఉండే జంతువులలో చాలా అక్కడ చూసేం. మధ్య మధ్య పాటలు, మేజిక్ షో లు బయటే ఒక్కో చోట  గుంపు  మధ్య లో జరుగుతూ ఉంటాయి. అన్నీ చూసేసిన పిల్లలకు రంగుల రాట్నం వంటి ఆటలూ ఉన్నాయి.  మేం జూని తక్కువ అంచనా వేసి ఒక పూట లో బయటకు వచ్చేస్తామని అనుకున్నాం. కానీ జూ మూసేసే వరకూ అక్కడే సమయాన్ని మైమరిచి పోయి ఉండి పోయాం. నాకు, పిల్లలకు బాగా నచ్చిందా ప్రదేశం.   వృక్షాలలో, తీగెలలో,  పక్షులలో, జంతువులలో మొత్తం ప్రకృతిలో మేమూ భాగస్వాములమై తిరిగాం.

ఎంతైనా ఒకప్పుడు ఆది మానవులుగా మనమూ అలా చెట్లతో, పుట్లతో, జంతువులతో కలిసి సహజీవనం చేసాం కదా! బహుశా: ఆ దగ్గర తనం ఎక్కడో స్ఫురించి, ఎందుకో బాగా ఆనందాన్నిస్తుంది. అయితే  అలా అవి దీనంగా ఊచల వెనక, తమవైన గూళ్ల కారాగారాల్లో ఉంటే దిగులేసింది. దు:ఖమూ వచ్చింది. కానీ అక్కడ జంతువులను, పశు పక్ష్యాదులను  పంజరాల్లో బంధించారనుకుంటే పొరబాటే. నిజానికి అంతరించి పోతున్న జాతుల పరిరక్షణ, పరిశోధన మొ||న  ప్రాజెక్టులు కూడా  నడుస్తున్నాయి అక్కడ. ప్రతి పనిలోనూ ఉన్న మంచి, చెడుల లాగే ఇదీనూ అని సరి పెట్టుకున్నాను.
మధ్యాహ్నం అక్కడి  రెండు మూడంతస్థుల  Tree house  restaurant   లో ఆరామంగా కూర్చుని భోజనాలు కానిచ్చేం. బిల్లు బాగా అయినా ఆ  అమెరికన్ రెస్టారెంటులో భోజనం రుచిగానే ఉంది. నిలువెత్తు చెట్లు, వాటి మధ్య అరణ్యపు  విచిత్రమైన  అరుపులు, చిక్కని తీగలు, నీటి తుంపరలతో సాయంత్రమై పోయింది. చివరగా మేము ఆ రోజుకి ప్రత్యేకించిన డ్రాగన్ షోకి వెళ్లాం. ఆసియా ఖండపు విశిష్ట విన్యాసాల కదంబం అది. అత్యద్భుతమైన విన్యాసాలతో కళాకారులు తమ ప్రావీణ్యాన్ని చాటుకున్నారు.  గంట సేపు ఊపిరి బిగబట్టి చూసేరందరూ.  ఎక్కడైనా వాళ్లు కాస్త అదుపు తప్పితే మొత్తం ప్రదర్శన రసాభాస అయ్యిఉండేది. అవలీలగా వాళ్లు ప్రదర్శించిన విన్యాసాలు  స్మృతి పథంలో చెరగని ముద్రలుగా నిలిచి పోయాయి. చుట్టూ అంతా మంది ఉన్నా చెరగని ఏకాగ్రతతో వాళ్లు విన్యాసాలు ప్రదర్శించడం విశేషం.
చివరగా అన్ని చోట్ల ప్రదర్శనలు ఇచ్చిన కళాకారుల ఊరేగింపు జరుగుతుంది. వారితో ఫోటోలు, సంతకాలు, మాట్లాడే కార్యక్రమం కూడా ఉంటుంది. ఇదొకటి బాగా నచ్చింది నాకు. అక్కడి కళాకారులు ప్రసిద్ధి చెందిన వారు కాకపోయినా వారికి తగిన ప్రాధాన్యాత, గుర్తింపు ఇచ్చే ఇలాంటి కార్యక్రం నిర్వాహకులు ఏర్పాటు చెయ్యడం ప్రశంసనీయం.

జూ అనేసరికి అందరూ సాయంత్రానికి అలిసి పోయి వేళ్లాడిపోతారు. కాని మేం ఈ చివరి షోల వల్ల ఉత్సాహంగా బయటకు వచ్చాం. బయటకు రాగానే మా వరు మళ్లీ ఎప్పుడు వద్దాం అని అడిగిందంటే ఎంత గొప్పగా ఉందో ఊహించుకోవచ్చు. నేను “మళ్లీ  శాండియాగో వచ్చినప్పుడు” అని సమాధానం చెప్పాను.

సఫారీ: ఇక మర్నాడు సఫారీ. ముందు రోజూ జూ నే, ఇప్పుడూ జూ యే నా అని సత్య గొణిగినా సాయంత్రానికి “ఇదీ చూడవలసిందే” అని అన్నాడు. జూకి, దీనికి ఎక్కడా పోలికా, సంబంధం లేదు.  ఇది ఊరి నించి దాదాపు 20 మైళ్ల దూరంలో బాగా వేడిగా ఉండే ప్రాంతం లో ఉంది. ఈ సఫారీని నిర్వాహకులు ఆఫ్రికన్ సఫారీ తో పోల్చినందుకు ఆ ప్రాంతం  లో అంత వేడిగానూ ఉందెందుకో. జూలో జంతువులు పరిమిత ప్రదేశం లో ఉంటాయి. ఇక్కడ జంతువులు స్వేచ్ఛగా మైళ్లకు మైళ్లలో విహరిస్తూ ఉంటాయి.  మేం గేటు దగ్గర మేప్ పట్టుకుని ముందుగానే ఎంచుకున్న సఫారీ బస్ స్టేషన్ కు చేరుకున్నాం. గంట సేపటి బస్ ప్రయాణం లో మేం నడవాల్సిన పని లేకుండా అక్కడక్కడా ఆగుతూ కనిపిస్తూన్న జంతువులని, వాటి స్వేచ్ఛా జీవిత  విధానాన్ని చూసేం.

ఆఫ్రికా లో నైరోబీ లోని  Cango  fishing village replica  ని మనం అక్కడ చూడొచ్చు.
అక్కడక్కడా పై నించి చల్ల నీటి spriklers మరింత చల్లగా. చెక్క వంతెనలు, జనప నార తాళ్లు…. చివరికి బాత్రూములు కూడా అరణ్యం లో ఎక్కడో ఒక Tree house లోకి వెళుతున్నట్లు.   కాస్త ఎండ ఎక్కువగానే ఉన్నందు వల్ల పిల్లలు దాహం అనే వారు అస్తమాటూ. జూ లో ఎన్ని సర్లైనా  నింపుకునే కూల్ డ్రింకు ఒకటి కొన్నాం. దాంతో ఎప్పుడంటే అప్పుడు మళ్ళొక డాలర్ చెల్లించి తెచ్చుకోవచ్చు.

చిలుకలు, జింకలు మొదలైన వాటికి పిల్లలతో ఆహారం పెట్టించే కార్యక్రమం పిల్లలకు చాలా ఆసక్తిదాయకంగా, ఆనందంగా ఉంటుంది. వాళ్లు గేటు దగ్గర 25 సెంట్లు పెట్టి గుప్పెడూ గింజలో, రసమో  కొనాలి.  పిల్లల్ని అవి ఉన్న ప్రాంతంలోకి శిక్షకులు తీసుకు వెళతారు. పిల్లలు లోపలికి వెళ్లగానే బిల బిల మంటూ వచ్చి చిలుకలైతే పిల్లల భుజాల మీద వాలి,  జింకలు దగ్గరగా వచ్చి అరచేతిని మూచూస్తూ ఆత్రంగా తింటాయవి. వరు చిలుకల  మధ్య మరో రామ చిలుకలా ఆనందంగా ఆడింది.  తల మీద, భుజమ్మీద పరిచయంగా వాలి అవి తింటూంటే తన మొహం లోని సంతోషం నాకింకా గుర్తుంది.  ఇక జింకల దగ్గర చతికిల బడి కబుర్లు చెప్పడం మొదలు పెట్టింది.  అందుకే మేం ఈ కార్యక్రమం చివరికి పెట్టాం. ఇలా బైఠాయిస్తుందనే.

సఫారీ పార్కులో బెలూన్ రైడ్ గొప్ప ఆకర్షణ. తక్కువ ఖరీదుతో రైడ్ చేసే అవకాశం అక్కడ ఉంది. కానీ మేం వెళ్లిన రోజు మా దురదృష్టం కొద్దీ గాలి అధికంగా ఉండడం వల్ల మా వరకు వంతు వచ్చాక రైడ్ ని నిలిపి వేసారు. మాకు సాయంత్రం లోగా మళ్లీ అవకాశం రాలేదు.

తిరిగొచ్చేక మళ్లా మేం నడుస్తూ చూడాల్సినవేవో చూసేందుకు బయలుదేరాం.  తర్వాత మంచి ఎండలో పిల్లలకు ఒక చోట ఉన్న నీళ్లు తడిపే చిన్న స్ప్రింక్లర్స్  దగ్గర మరో గంటన్నర గడిపేం.   వరు వెళ్లి తడిసి ముద్దయి ఆట  మొదలు పెట్టింది.  పిల్లలు చాలా మంది వరకూ ఇదే ఆట.
అక్కడ నాలుగు గంటల వేళకు ‘చీతా రన్ ” ఉండడం వల్ల మేం అక్కడే బైఠాయించాం. ఒక పావు మైలు ప్రాంతంలో   చుట్టూ కట్టి ఉన్న  ప్రదేశం లో ఒక చివర చిరుతను వదిలేస్తారు. అది పరుగెత్తి వచ్చి ఈ  మూల ఉన్న శిక్షకుని వద్దకు వెళుతుంది. దాని కోసం చుట్టూ వందల కొలదీ  జనం మధ్యగా వారితో బాటూ ఆసక్తిగా చాలా సేపు నిలబడి మేమూ చూసేం. చిరుతని మామూలుగా చూడడమే విశేషం!  ఇక పరుగెడుతూ. చాలా బావుంది చూడడానికి. ఎక్కడో కాస్త భయంగా.

సాయంత్రం ఆఫ్రికన్ ఆచార వ్యవహారాల్ని ప్రతిబింబించే నృత్యాలు, విన్యాసాల ప్రదర్శనలు చూసేం.   నిన్నటి  ఆసియా  కళాకారులు, ఇవేళ్టి ఆఫ్రికా ఖండపు  కళాకారులు  ఎవరికి వారే గొప్ప విన్యాసాల్ని ప్రదర్శించేరు.  అయితే నిన్నట్లా కాకుండా   పొద్దుపోక ముందే పార్కు నించి బయటకు వచ్చేసాం. ఒక పూట చాలు సఫారీ చూడడానికి అని అనిపించింది. కానీ మధ్యాహ్నం నించి ఇతర ప్రదర్శనలన్నీ మిస్సయ్యి ఉండే వాళ్లం అలా చేస్తే.

శాండియాగో ప్రయాణం గొప్ప మరపురాని ప్రయాణం.  మేం వెనక్కు వచ్చేసే రోజు జూలై 4. సముద్ర తీరం నించి డ్రైవ్  చేసుకుంటూ మామూలుగా 8 గంటల్లో ఇంటికి రావాల్సింది పన్నెండు గంటల తరవాత వచ్చాం. సముద్ర తీరాల్లో  శాండియాగో  నించి సాన్ ఫ్రాన్ సిస్కో వరకు ఇసక వేస్తే రాల నంత మంది జనం కళకళ్లాడుతూ  ఉన్నారు.  లాస్ ఏంజిల్స్  పరిసర ప్రాంతాల్లో మేం కాస్సేపు ఇసుకలో ఆడుకోవడానికి ఒక చోట ఆగేం.   అరగంటే ఉన్నా 15 డాలర్లు పార్కింగు చెల్లించాల్సి వచ్చింది. అప్పుడు  కూడా పార్కింగు కోసం ఎంతో కష్టపడ్డాం. అయితేనేం ఇంటికి ఆనందంగా  వచ్చేం.

……………

(http://vihanga.com/?p=4455)

Published in  July,2012 by విహంగ
ప్రకటనలు
This entry was posted in నా కళ్లతో అమెరికా(Travelog) and tagged , , , , . Bookmark the permalink.

4 Responses to నా కళ్లతో అమెరికా-9 (శాండియాగో )

 1. kalageeta అంటున్నారు:

  Thanks Suma garu-

 2. suma అంటున్నారు:

  చాలా బాగా వ్రాశారు

 3. kalageeta అంటున్నారు:

  avunandi- thanks for your comment-

 4. the tree అంటున్నారు:

  చక్కగా వివరంగా రాశారండి,ఫోటోలు బాగున్నాయ్, రెండు బ్లాగులు మీవేనా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s