నా కళ్లతో అమెరికా-10(కాటలీనా ద్వీపం)

కాటలీనా ద్వీపం (SANTA CATALINA ISLAND)

Dr K.Geeta

ఒకోసారి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నవి చాలా విజయవంతం అవుతాయి.  కాటలీనా ద్వీపానికి మా ప్రయాణం కూడా అలాంటిదే.
కాటలీనా దక్షిణ కాలిఫోర్నియాలో ని ఛానెల్  ద్వీపాలుగా  ప్రసిద్ధి గాంచిన ఎనిమిదింటిలో ఒకటి. మిగతా వాటి కంటే భిన్నంగా జనాభా లో బాగా అభివృద్ధి చెంది, మంచి సందర్శన  వసతులతో  ఖరీదైనదీ  ద్వీపం. 22 మైళ్ల పొడవు, 8 మైళ్ల  వెడల్పు కలిగిన ఈ ద్వీపం లాస్ ఏంజిల్స్ కౌంటీకి చెందినది.  లాస్ ఏంజిల్స్ నుంచి ఇది 22 మైళ్ల దూరం లో ఉంటుంది. ఈ దీవికి క్రీ.పూ 7000  సం.రాల నుంచీ చరిత్ర ఉన్నా 1919 లో William Wrigley, Jr ఈ దీవిపై  మోజుపడి  మొత్తం ద్వీపాన్ని కొని,  బాగా అభివృద్ధి చెందించడం కోసం తన యావదాస్తినీ ధార పోసాడట.  ద్వీపాన్ని అబివృద్ధి చెందించాలంటే ముందుగా ప్రయాణ  సౌకర్యాల్ని అభివృద్ధి చెందించాలని మొదట గుర్తించిన ఆయన 1500 వందల మంది పట్టగలిగిన  పెద్ద స్టీం ఓడలనే  వినియోగించాడట.   ఆయన ముచ్చటపడి నిర్మించుకున్న భవంతి ఇంకా అక్కడే  ఉండడం విశేషం. 1929 లో Gaint Casino  నిర్మాణం తోనూ ,  లాస్ ఏంజిల్స్ నుండి     కాటలీనా కు Swimming Champion ships  నిర్వహించడం మొ.లైన  కార్యక్రమాల ద్వారా అప్పటిలో జనాన్ని బాగా విశేషంగా  ఆకట్టుకున్నాడాయన. ఆయనే ఈ ద్వీపానికి ఒక విధంగా  పితామహుడని చెప్తూ ఉంటారు.

ప్రయాణం: ముందు వారం వరకు  ఈ జూలై నాలుగుకి  ఎక్కడికీ వెళ్లొద్దనుకున్నాం. హఠాత్తుగా నాలుగు రోజులు ఎటైనా వెళ్లొస్తేనేం అనిపించింది. అనుకున్నదే తడవుగా ప్రయాణానికి చకచకా ఏర్పాట్లు జరిగి పోయాయి. అయితే కోమల్ కు వేసవి సెమిస్టర్  మొదలవ్వడం  తో  చిన్న వాళ్లిద్దరినీ తీసుకుని ఈ సారి శనివారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరాం. ఈ ద్వీపం లాస్ ఏంజిల్స్ కౌంటీ  లోనిదని చెప్పేను కదా. SanPedro, Long beach, Dana Point  తీరాల నించి ఫెర్రీ  ల నుంచి బోట్ ని తీసుకుని వెళ్లాలని internet  లో చదివేం. మా ఊరి నించి మొదటగా వచ్చే తీరం SanPedro  కాబట్టి అక్కడ   ఎక్కాలని నిర్ణయించుకున్నాం. మేం ఆదివారం నుంచి రెండు రోజులు కాటలీనా లో హోటల్ బుక్ చేసుకున్నాం. అయితే బోట్ మాత్రం ఉదయం 10.45 కే బుక్ చేసుకున్నాం. మధ్యాహ్నం వరకు ద్వీపంలో ఎటైనా తిరిగి హోటల్ లో  సాయంత్రం చెకిన్ అవుదామని. అయితే San Pedro  మాకు దగ్గరేమీ కాదు, దాదాపు నాలుగు వందల మైళ్లు. కాబట్టి శనివారం అంతా ప్రయాణానికి పెట్టుకున్నాం.  ఆ రోజు తీరం లో మరో హోటల్ లో సేద తీరి ఉదయమే ప్రయాణమవుదామని  ప్లాన్. ఇంటి నుంచి ఈ సారి ఏమీ వండుకునే కార్యక్రమం పెట్టుకోకుండా, అలాగని  హర్రీ బర్రీ లేకుండా (మొట్ట మొదటి సారి ఇలా!! ) స్థిమితంగా పదిగంటలకి బయలుదేరాం.  దారిలో ఎక్కడా రెస్ట్ ఏరియాలో గంటకోసారి ఆగి ఆటలు పెట్టుకోలేదు.   ఎందుకంటే మా సిరి వెన్నెల తో ఒక ప్రాబ్లం ఉంది. ఇక్కడ పిల్లలు కార్ సీట్లలో ఎవరికి వాళ్లు కూర్చోవాలి కదా. అయితే మేం ఆగి నప్పుడు పాపాయిని తీసేమంటే ఇక అందులో కూర్చోవడానికి మనతో చుక్కలు లెక్కపెట్టిస్తుంది. అంతే కాకుండా డ్రైవరు సీట్లోకి చక చకా వెళ్లిపోయి స్టీరింగు తిప్పేస్తూ కొంటె నవ్వులు నవ్వుతుంది. ఇక ఆ సీట్లో నించి తీస్తే ఏమవుతుందో చెప్పాలా!  అందుకే మేం ప్రయాణించిన ఆరు గంటల్లో రెండు సార్లు మాత్రమే  బ్రేక్ లు తీసుకున్నాం. అప్పుడు ఏదో కాస్సేపు అటు ఇటూ నడిపించి మళ్లీ (కష్టమ్మీద) పాపాయిని కారు సీట్లో కూర్చోబెట్టేం.
చివర్లో బాగా పేచీ పెట్టింది పాపం. ఇక మా వరు అయితే అన్నయ్య వస్తే ఇలా చేసే వాళ్లం, అలా చేసే వాళ్లం, ఇప్పుడు నాకు ఏమీ తోచట్లేదు  అని ఒకటే గోల పెట్టింది. చేసేదేమీ లేక బాగా నిద్ర పోయింది ప్రయాణమంతా.  ఇలా లాంగ్ జర్నీలు పిల్లలకు మహా బోరు పాపం. మేమిద్దరం  డ్రైవింగుని, చుట్టూ కనిపించే దృశ్యాలని ఎంజాయ్ చేస్తూ, కబుర్లు చెప్పుకుంటూ  అసలు ప్రయాణించి నట్లే లేకుండా ఎంత దూరాలైనా ప్రయాణాలు చేసేస్తాం.

Wood Land hills :  సాయంత్రం సమయం ఉంటే మళ్లీ ఒకసారి   లాస్ ఏంజిల్స్ డౌన్ టౌన్ కి వెళ్దాం అనుకున్నాం.  అయితే మేం హోటల్ ను ఈ సారి  Wood Land hills  అనే ఊరులో  తీసుకున్నాం.  అక్కడి నించి  లాస్ ఏంజిల్స్ డౌన్ టౌన్ చాలా దూరం. అప్పటికే బాగా అలిసి పోయాం. ఇక వెళ్లొచ్చే  ఓపిక లేక హోటల్ లో చెకిన్  అయిపోయాం.
అమెరికా లో మొదటి సారి ఆ హోటల్ లో  14 వ అంతస్థులో ఉన్నాం. ఇక్కడ హోటళ్లు సాధారణం గా ఒకటి రెండు అంతస్థుల కంటే ఎక్కువ ఉండవు. అయితే ఆ ఏరియాలో అలా కట్టేందుకు పర్మిషన్ ఉందనుకుంటా. సిటీ సబర్బన్ కాబట్టి.  అయితే అక్కడ హోటల్ కు స్వంత పార్కింగు లేదు. కౌంటీ  పార్కింగు తప్ప. అక్కడ మనం పార్కు చేసుకోవాలంటే  8 డాలర్లు. వేలెట్ పార్కింగు 10 డాలర్లు.   ఇలా ఎక్కడా లేదు ఇంత వరకు. ఎక్కువ రుసుము చెల్లించినా వేలెట్  బెస్ట్  అనిపించింది.  అయిదు నిమిషాల్లో కారు ఎప్పటి కప్పుడు తెచ్చిస్తారు.
రాత్రి భోజన సమయం ఇట్టే  అయ్యిపోయింది.  శనివారం టిఫిన్ కోసం దగ్గర్లోని Indian Restaurant  కు వెళ్లాం. వాళ్లు మా తర్వాత వచ్చిన తెల్ల వాళ్లకి ముందు ఆర్డర్లు తీసుకుని, మా దగ్గరకి ఆలస్యంగా వచ్చేరు.  మేం తెలుగు లో ఆ విషయం చెప్పుకుని కొంచెం అసహనంగా ఫీల్ అయ్యాం.  పిల్లలకి బాగా ఆకలి వేస్తోందసలే.  అయినా ఆర్డరు కోసం వచ్చినపుడు నవ్వుతూ మామూలుగానే చెప్పేం  కొంచెం మా ఆర్డరు త్వరగా తెమ్మని.  అయితే  మా ఆర్డర్లు తీసుకున్న వాళ్లంతా తెలుగు వాళ్లని మాకు తర్వాత తెల్సింది. వాళ్లు మా మాటలు  విన్నారో  ఏమో తెలీదు కానీ వెంట వెంటనే ఆర్డరు తేవడమే కాదు.
మా హోటల్ తరఫున ట్రీట్ అని చెప్పి ఒకట్రెండు ఐటమ్సు,   లస్సీ ఫ్రీగా పట్టుకొచ్చి మాకు రాచ మర్యాద చేసేరు. ఫుడ్ కూడా బానే ఉంది.  నేను  చివరగా ఇంక కడుపు పట్టక లస్సీ వదిలేయ వలిసి వచ్చింది.  మా సిరి కి ఇప్పుడు రెండేళ్లు రాబోతున్నాయి.  మేం ఏమి తింటే అది  తినడం అలవాటు చేసుకుంది కాబట్టి ఈ ప్రయాణం లో మాకు ఎక్కడా తన భోజనం ప్రాబ్లం కాలేదు. కాకపోతే పెట్టడం కాస్త ఆలస్యం అయ్యి  మనమేదో  మాటల్లో ఉండి నోటి దగ్గర చెయ్యి పెడితే చెయ్యి కొరికేస్తుంది.
తెల్లవారి ఆరుగంటలకే అలారం మ్రోగింది తూర్పున సూరీడు త్వరపడి వాడి కిరణాల  బాణాల్ని ఎక్కుపెట్టబోతున్నాడు. పధ్నాలుగవ  అంతస్థు  లోంచి కింద బొమ్మరిళ్లలా  ఉన్న షాపింగు కాంప్లెక్సులు, బొమ్మ కార్లలా ఉన్న కారు పార్కింగులు… ఎదురుగా మబ్బు మంచు వీడని  wood land hills,  మా గదికి ఒక వైపు  మొత్తం ఆవరించి ఉన్న అద్దాల గోడ తెర పక్కకు తీయగానే  కనిపించిన అద్భుత దృశ్యమది.  తన్మయంగా కిటికీ లోంచి బయటకు చూస్తూ కాలం గడిపాను. పక్షి శరీరం ధరించి గాలి వాటున పైకి లేచి పర్వత శిఖరాల్ని స్పృశించి, సూర్య కిరణాలతో దోబూచు లాడి… ఉదయపు ఆహ్లాదాన్ని మేనలదుకుని  అలా గిరికీలు కొడ్తూండగా సత్య ఎప్పుడు లేచి వచ్చాడో తనూ నా వెనక నిలబడి అలా మైమరిచి చూస్తూ ఉన్నాడు.  ఇక ఇద్దరం జంట పక్షులమయ్యామని వేరే చెప్పాలా!!

ఈ స్లైడ్ ప్రదర్శన కోసం జావాస్క్రిప్ట్ అవసరం.

శాన్ పేద్రో  నుంచి  కాటలీనా: అనుకున్న సమయానికి San Pedro Ship Terminal  కు చేరుకున్నాం (అది చిన్న ఫెర్రీ కాదు).  అతి పెద్ద షిప్ యార్డ్ లో కాటలినా కు ప్రత్యేకించిన  టెర్మినల్ అది.  లోపలకు అడుగు పెట్టిన దగ్గర్నించి,   baggage restrictions  వరకు అన్నీ flight  లో లాగే ఉన్నాయి. టిక్కెట్లు ముందే online లో  బుక్  చేసుకొంటే  మనక్కావలసిన సమయానికి సీట్ దొరుకుతుంది. అయితే టిక్కెట్టు బాగా ఎక్కువ. రానూ పోనూ పెద్ద వాళ్లకు 72 డాలర్లు, పిల్లలకు 57 డాలర్లు.   2 సంవత్సరాల లోపు వాళ్లకు అయిదు డాలర్లు. బోర్డింగు పాసులు తీసుకున్నాక దాదాపు గంట సేపు లైను లో నిలబడ్డాం. బోట్ లో మా  బాగ్గేజ్,   బేబీ కార్ట్   వేరే చోట వాళ్లే పెడతారు.  ఇక కింద deck కాకుండా మూడు అంతస్తులు గా కూర్చునే ప్రదేశాలు  ఉన్న ఆ పెద్ద బోట్ లో కింద మొదటి అంతస్తులో కూర్చున్నాం మేం.  అది పూర్తిగా గాజు అద్దాలతో క్లోజ్డ్ గా ఉంది చలిగాలి తగలకుండా.   మధ్యలో  ఎప్పుడు కావాలంటే అప్పుడు  పైకి వెళ్లి రావొచ్చు. సీట్లు అంతస్తుకి దాదాపు అరవై, డెబ్భై  పై చిలుకే ఉన్నాయి.
అయితే flight లోలా కాకుండా restaurant  లోలా ఎదురు బొదురుగా సీట్లు, టేబుల్సు ఉండడం వల్ల తిరగడానికి చక్కగా  విశాలంగా ఉంది. రెండస్థుల్లో  చిన్న బార్ లు కూడా ఉన్నాయి. చాలా మంది ఆ గ్లాసులతో ఆనందాన్ని పొందుతూ ఉన్నారు.  బోట్ షిప్ యార్డ్ వదిలే వరకు  నెమ్మదిగా వెళ్లి, సముద్రం  లోకి అడుగు పెట్టగానే ఒక్క సారిగా వేగం అందుకుంది.  మధ్యలో  ఉన్నట్టుండి ఒక్క సారిగా పెద్ద అల ఒకటి ఎత్తి పడేసింది. ఇక మళ్లా  నాకు మామూలుగా సీ సిక్ నెస్  పట్టుకుంది. అయితే కాస్సేపట్లోనే సముద్రం ప్రశాంత మవడం తో కాస్త కుదుట పడ్డాను.  మేం మధ్యలో పైకి వెళ్లొచ్చేం.  మబ్బు పట్టిన ఆకాశం, విసురుగా వీస్తూ మనుషుల్ని పక్కకు నెట్టేస్తున్న విసురుగాలి ఒక్క సారిగా చుట్టుముట్టాయి.  అయితే బాగా వణికించే చలి లేదు.  చల్లని నీటి తుంపర్లు అంత ఎత్తుకి ఎగిసి పడ్తూ ఉన్నాయి.  బోట్ బయట అలా  పాపాయి తో నిలబడ్డం కష్టమనిపించి చాలా సేపు కూర్చునే ఉన్నాను నేను. సత్య, వరు పైకంటా వెళ్లి ఎక్కువ సేపు గడిపి వచ్చేరు. తర్వాత నేను  వెళ్లేను.  ఇలా.. పిల్లల్ని మార్చుకుని ఇద్దరం ఒకరి తర్వాత ఒకరం వెళ్లొచ్చేం.  నేను అయిదు నిమిషాల్లో  కిందకు పరుగెత్తుకు రావడం చూసి వరు ఒకటే నవ్వులు.
కాస్సేపట్లో  ఎదురుగా మబ్బు చెదిరిన ఆకాశాన్నించి   అప్పుడే   ఉద్భవించి నట్లు హఠాత్తుగా  గొప్ప  పర్వత శ్రేణి సముద్రానికి అడ్డుగా నిలబడి కనిపించింది.  నేనింత వరకు మరోలా ఊహించుకున్నాను.  కాటలీనా ఏదో ఒక చిన్న ద్వీపమనీ,  చెయ్యి చాస్తే  ఎక్క గలిగిన చిన్న కొండ అనీ అనుకున్నాను.   ఎదురుగా ధీర గంభీరంగా ఉన్న పర్వతశ్రేణి ని చూస్తే అవతల మళ్లా  మహా సముద్రం  ఉందని ఎవరూ అనుకోరు. గట్టిగా ఒక గంట ప్రయాణం చెయ్యకుండా కాటలీనాకు చేరుకున్నాం.
కాటలీనా: మేం దిగుతున్న తీర పట్టణం పేరు Avalon. ద్వీపానికి రెండవ తీరం మరో మూలగా two harbors అని ఉందట.  అది చిన్న గ్రామం మాత్రమే. ఇక మిగతా ద్వీపమంతా దుర్భేద్యమైన పర్వతాలు, నీటికి లొంగని కోసు రాళ్ల తీరాలు.   Avalon  మీద అడుగు పెడ్తూనే అదేదో  ఎక్కడో  మరో అద్భుత ప్రదేశానికి వెళ్లినట్లు ఉంది వాతావరణం.  చక్కగా వెచ్చగా.  టెర్మినల్ నుంచి తెల్లని ఇసుక తీరానే ఉన్న Walk Way  మీదుగా తిరానే నడిస్తే  అయిదు నిమిషాల్లో  ఉంది మా బస.  ఓహ్.. అది మాకు చాలా సంతోషకరం గా అనిపించింది.  మేం సాయంత్రం చెకిన్  అవ్వాల్సి ఉంది.  అయితే మా చేతిలో ఉన్న సామగ్రి అక్కడ ఉంచే  వీలుండడం వల్ల హోటల్ వాళ్లకి అప్పగించి బయట పడ్డాం.  బాగా ఆకలి వెయ్యడంతో తీరంలో ఉన్న ఒక ఫుడ్ స్టాల్ కు వెళ్లి నాకిష్టమైన బ్రెడ్ బౌల్, సత్యకిష్ట మైన  ష్రింప్ తీసుకున్నాం.  మా వరు యధావిధిగా ముక్కు మూసుకుని మాకు కాస్త దూరంగా కూర్చుని  చీజ్ సేండ్ విచ్ తినడం మొదలు పెట్టింది.   నేను బాగా చల్లగా ఉంటుందేమో అని కోట్లు తెచ్చాను కానీ పెటేలున పేలే మంచి ఎండ కాస్తోంది.
పక్కనే ఉన్న తెల్లని ఇసుకలో ఆడదామని వరు పేచీ మొదలు పెట్టింది. ఆ ఇసుక లో  లోపలకు చిన్నగా విస్తరించిన చిన్న అలల  తీరంలో పిల్లలకేమిటి నాకే ఆడాలనిపించింది.
గోల్ఫ్ కార్టు: అయితే ముందుగా అక్కడ గోల్ఫ్ కార్ట్  రైడ్  కు వెళ్లాలని  అనుకున్నాం.   ఆ ఐలాండ్  లో మాములు   కార్లు కాకుండా  గోల్ఫ్ కార్టు (మన భాషలో చెప్పాలంటే నాలుగు చక్రాల ఆటోలు)  మాత్రమే allow  చేస్తారు. అక్కడ ఇలా విహారానికి వచ్చిన వారికి ద్వీపంలో నిర్దేశించిన కొంత దూరం వరకు ఇలా గోల్ఫ్ కార్టులో   గంటకు 40 డాలర్ల  చొప్పున అద్దె చెల్లించి తిరిగే అవకాశం ఉంది.  మేము  ఒక గంటకు  తీసుకున్నాం. కొంచెం తమాషాగా  ఉన్నా త్వరగానే  ఇద్దరం ఎలా డ్రైవ్ చెయ్యాలో నేర్చుకున్నాం.
వాళ్లు నిర్దేశించిన రూట్లలో తప్ప మరో రూటుకి, రోడ్డుకి  వెళ్లకూడదు. ఆ రూట్ అలా టౌన్ మీద నుంచి పర్వతాలలోనికి వెళుతుంది.  మేం గోల్ఫ్ కోర్ట్స్ దాటి,   బొటానికల్ గార్డెన్స్  రోడ్లో వెళ్లి అక్కడ నుండి కొండ చరియల్లో ఉన్న ఇళ్ల మీదుగా ఉన్న చిన్నరోడ్ల  మీదుగా ,  అక్కడక్కడా రోడ్ల అంచుల్లో   కార్టు ఆపుకుని కింద  కనిపిస్తున్న అందమైన సముద్ర తీరాన్ని ఫోటోలు తీసుకుంటూ ముందుకు సాగేం. చుట్టూ ఉన్న పర్వత మలుపుల్లోంచి విశాలంగా  పర్చుకుని ఉన్న  తెల్లని ఇసుక తీరాన్ని ఒరుసుకుంటున్న అలల  నీలి రంగు దృశ్యం చూసి తీర వలసిందే. మధ్యలో చిన్న వరుస చుక్కల్లా అందగా ఊగులాడే బోట్లు,  అక్కడక్కడా సముద్రంలో తోక చుక్కల్లా ప్రయాణిస్తూన్న మర  పడవలు.
ఒక వైపు కనుచూపు మేర గొప్ప మహా సముద్రం, ఇటువైపు  ఉత్కృష్ట   పర్వతశ్రేణి  మధ్య దేనినైనా సాధించి తీరగల గొప్ప ధైర్యం ఉన్న ప్రాణులం మనం.   దారిలో జిప్  లైన్ లో మనుషులు జారి కేరింతలు కొడుతూ ఒక పరవతం మీంచి మరో పర్వతానికి గాలిలో తీగె నంటి పెట్టుకుని జారుతూ కనిపించారు.  మానవ నిర్మిత అద్భుతాలలో ఒకటైన కాసినో తీరాన గుండ్రటి రాయిలా కనిపిస్తూంది.   అంతా బానే ఉన్నా  మా మొత్తం కార్ట్ ప్రయాణం లో ఒక చిన్న అపశృతి కూడా ఎదురైంది. ఒక మలుపులో మా కార్ట్ ఆపబోయి మా కంటే ముందు ఆగి ఉన్న కార్టును అనుకోకుండా  వెనక నించి గుద్దేసాడు సత్య.  అయితే  అదృష్ట వశాత్తూ  వాళ్లా కార్టు లోయ వైపు కాకుండా,   రోడ్డు వైపు వెళ్లింది. పైగా ఎవరికీ ఏమీ కాలేదు. ఇక  కిందకు రాగానే ఇక కూత వేటు దూరం లో కార్టు ఇచ్చే ప్రదేశం ఉందనగా మేం వెళ్ళకూడని రోడ్డులోకి మలుపు తిరిగేసాం. వెంటనే అక్కడ కాపలా పోలీసు పరుగెత్తుకొచ్చి వార్నింగు ఇచ్చేడు. మంచి పోలీసు వచ్చేడు కాబట్టి సరిపోయింది,  లేకుంటే ఫైను పడేది మాకు.
ఇక గంటన్నర తర్వాత 54 డాలర్లు చెల్లించి కార్టును షాపు వాళ్లకు అప్పగించి బతుకు జీవుడా అని బయట పడ్డాం.   తర్వాత నవ్వు వచ్చినా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు భలే భయం వేస్తుంది.
సముద్ర తీరం: అప్పటికే   సాయంత్రం కావస్తూండడం తో హోటల్కు వెళ్లి బట్టలు మార్చుకుని చిన్న  వాక్ వే  దాటి  సముద్ర తీరంలో ఆటకు దిగేం.  నీళ్లు యధావిధిగా చల్లగానే ఉన్నాయి.  అయినా పిల్లలు నీళ్లలో మునిగి తెగ ఆట మొదలెట్టేరు.  సత్య ఇద్దరినీ చెరో రెక్కా పట్టుకుని నీళ్లలో ఆడిస్తూంటే నాకు మా డేడీ  జ్ఞాపకం వచ్చేరు.   నేను,  మా చెల్లి  చిన్నప్పుడు ఆయన రెండు చేతుల మీదా అలాగే రంగుల రాట్నం అని చెప్పి వేళ్లఆడుతూ చుట్టూ తిరిగే వాళ్లం.   నేను మెత్తటి ఇసుకలో సేద తీరుతూ కూర్చున్నాను.
ఆ రోజు పౌర్ణమి. రాత్రి వెన్నెల దగద్ధగమానంగా పరవతమ్మీద వెలుగుతోంది.  అదెవ్వరికీ పట్టనట్టు పెద్ద పాటలు వినిపిస్తోన్న తీరం వెంబడి  బార్లలో కోలాహలంగా జనం తిరుగుతూ ఉన్నారు.   మేం దగ్గర్లోని మెక్సికన్ రెస్టారంట్ కు వెళ్లి మంచి రుచికరమైన భోజనం చేసి వచ్చి కాస్సేపు తీరంలోనూ, కాస్సేపు హోటల్ ఆవరణలో ఉన్న fire place లో  కూచున్నాం.    వరు అయిసు క్రీము కోసం పేచీ పెడితే, వాళ్లు మళ్లా మరో వైపు నడిచెళ్లేరు.  నేను, సిరి వెలుగుతున్న లైట్ల కాంతిలో నలుపు దుస్తుల్ని ధరించిన అలల్ని చూస్తూ కూచున్నాం కాసేపు.  అలల మీద పడి లేస్తూన్న బోట్లని,   రాత్రికి ప్రత్యేకించి పైకి లేచిన నీటి మట్టాన్ని ఆశ్చర్యంగా పరికించింది సిరి.  అలల మీద వెన్నెల మరకల్ని చూస్తూ మేమిద్దరం ఏవో బుజ్జాయి కబుర్లు చెప్పుకున్నాం. మధ్య మధ్యలో  అన్నీ అర్థం, అయినట్లు ఊ.. ఊ.. అంటూ తలూపింది పాపాయి.
మర్నాడు: ఇక మర్నాడు మేం ఒక Water Attraction, ఒక  Land Attraction చూడాలని ప్లాన్ చేసుకున్నాం.
మర్నాడు ఉదయానే  అలారం మోగగానే లేచి హోటల్ వాకిటికొచ్చి ఎదురుగా సముద్రాన్ని పరికించి వచ్చాను.  అప్పటికే ఒడ్డున కూర్చునే స్థలంలో  ఇసుక పార్కులా ఉన్న చోట తువ్వాళ్లు, షీట్లు పరిచి ఉన్నాయి.  రోజంతా ఎండలో సేద తీరడం ఇక్కడి వారి హాబీ.   రాత్రి నీటి మట్టం అంతా తగ్గిపోయి మరలా మామూలుగా ఇసుక తీరంతో చిర్నవ్వులు రువ్వుతోంది సముద్రం ఏమీ ఎరగనట్టు.  నవ్వుకుని కళ్ల నిండా సముద్రపు నీలి రంగుని తనివితీరా అద్దుకుని తిరిగొచ్చాను.   పిల్లల్ని లేపి, తయారు చేసి  హోటల్ లోని బ్రేక్ఫాస్టుకి  తీసుకేళ్లే సరికి తొమ్మిదిన్నర,  పది కావొచ్చింది. ఇప్పటి వరకు మేం ఉన్న అన్ని హోటళ్ల లోకి ఖరీదైన హోటల్ ఇది. అయినా బ్రేక్ ఫాస్టు అసలు చెప్పుకోదగ్గట్టైనా  లేదు.   చల్లని ఉడకబెట్టిన గుడ్లు, మామూలు పళ్ల ముక్కలు, గట్టి బ్రెడ్డు.  అయితే starbucks కాఫీ ని సర్వ్ చేయడం బాగా నచ్చింది.  పొద్దుటే నేనన్సలు ఎప్పుడూ కాఫీ, టీలు తాగను. అలాంటిది  మంచి నురగలు కక్కే Capacino చూడగానే తాగాలనిపించింది.  స్థిమితంగా fire place  దగ్గర కూచుని టిఫిన్ కానిచ్చి నెమ్మదిగా బయటికొచ్చేం.
semi submersible : ఒడ్డునే రెండడుగుల్లో ఉన్న వాటర్ టూర్ల  దగ్గరికి వచ్చాం. అది గంట పాటు సాగే ఒక సెమీ సబ్మెర్సిబుల్  టూర్.  టిక్కెట్టు పెద్ద వాళ్లకు 36 డాలర్లు,పిల్లలకు $27. అంత కంటే తక్కువ ఖరీదులో glass bottom బోట్ టూర్ కూడా ఉంది.  కానీ అది కేవలం నిలబడి చిన్న అద్దాలలోంచి చూసేదని బొమ్మలో చూసి ఇది తీసుకున్నాం.  అయితే ఇలాంటి ఏ టూర్ కైనా Santa Catalina Island Company  టూర్ ల వారి దగ్గరే కొనుక్కొంటే మిగతా ఏ టూర్ కెళ్లినా మరో దానికి 15% తగ్గింపు నిస్తూంటారు.    ఆ విషయం తెలీక మొదట మేం కనబడ్డ వేరే కంపెనీ దగ్గర టిక్కెట్లు కొని  వెళ్లిపోయాం. నేను ఈ టూర్ కి పెద్దగా ఆసక్తి చూపలేదు ముందు. అయిన semi submersible  అంటే పెద్దగా మజా ఏముంతుంది!  నీటిలో మహా అయితే పది పదిహేనడుగుల లోతులో  ఏంచూస్తాం అనుకున్నాను.   అయితే నా అంచనా తప్పని అర్థం అయ్యింది.
సరిగ్గా  బోట్ బయలు దేరిన పదినిమిషాల్లో బిల బిల లాడుతూ గుంపులుగా తిరుగుతూన్న చేపల ప్రపంచంలోనికి అడుగు పెట్టాం.  విచిత్రం గా ఒక రకానికి చెందినవన్నీ ఒక వరుసలోనూ, వాటి పైన మరో వరుసలో మరో రకం , వీటి కిందుగా మరో గుంపు  అలా చక్కగా వేటి దారికేవీ అడ్డు రాకుండా చెప్పుకున్నట్లు వెళుతున్నాయి.  ఎండ బాగా తళుక్కున మెరుస్తూంది పదడుగుల లోతులో. నీళ్లు  పై నుంచి మేం  బొట్ ఎక్కే ముందు  గాఢంగా కనిపించాయి.  అయితే ప్రయాణం చేస్తున్నప్పుడు నీళ్లు  పారదర్శకంగా   స్వచ్ఛంగా ఉన్నాయి.
కిటికీ పక్కన నీటి  బుడగలు  లేపుతూ చిన్నగా శబ్దం చేస్తూ నీళ్లని కోసుకుంటూ ముందుకు పోతూంది సబ్ మెరీన్.   ఏదో ఆక్వేరియంలోకి ప్రవేశించినట్లు తప్ప సముద్రం లో ఉన్న భావన కలగ లేదు.  అయితే హఠాత్తుగా ఒక అద్భుత దృశ్యం  కనిపించింది.  కిటికీని  ఒరుసుకుంటూ ఆకుల చెట్లు నీటి  కదలికతో సమానంగా అందంగా  కదలాడుతూ  ప్రత్యక్షమయ్యాయి. ఎక్కడి నుంచో కొట్టుకుని వచ్చి  అవక్కడ తేలుతున్నాయేమో అనుకున్నాను.  అయినా మా గైడు  ని  అడిగాను. అయితే అక్కడ లోతు దాదాపు   నలభై అడుగుల వరకు ఉంటుందని ఆ చెట్లు అంత లోతు నించి అక్కడ సముద్రం లో మొలిచి,  ఆ తీరానికి ప్రత్యేకించిన వృక్షాలనీ చెప్పుకొచ్చేడు.    కొంత  కిందికి చూడడానికి ప్రయత్నిస్తే  నిజమే వాటి మొదలెక్కడ ఉందో తెలీనంత లోతు వరకు ఆకుల కొమ్మలు కనిపిస్తూ ఉన్నాయి.  బంగారు పసుపు వర్ణం  తో మొత్తం వృక్షాలన్నీ  మెరిసి పోతుంటే  ఏదో దేవలోకానికొచ్చినట్లు భ్రాంతి కలిగింది.  ఆకులు దాదాపు  మూణ్ణాలుగు అడుగుల పొడవు,  అడుగు వెడల్పూ ఉండి,  చిన్న చిన్న గుండ్రని  నీటి బిందువుల చుక్కల మెరుపుల్తో అద్భుతంగా ఉన్నాయి.
వాటి ఆకుల మధ్య నుంచి వయ్యారాలు పోతూ పరుగులు పెడ్తూన్న మీన  శ్రేణులు. ఇక మనసు అక్కడ ఆగుతుందా  జలకన్య అయి  నీటిలోకి దుమకదూ!  ఎప్పుడు గంట గడిచిందో తెలీదు. పిల్లల్ని, నేను కూచున్న సబ్ మెరీన్  ప్రపంచాన్ని మర్చి పోయి సముద్రపు అందంలో మునిగి ఆ చెట్లలో పరకాయ ప్రవేశించి, చేపల్ని సుతారం గా తడిమి,  నీళ్లల్లో ఏట వాలుగా పడ్తూన్న సూర్య కిరణాలతో స్నానించి అక్కడక్కడే తిరుగాడుతూ ఉన్నాను.  ఇక మరో అయిదు, పది నిమిషాల్లో తీరం చేరుతామనగా అందర్నీ పైకి వచ్చి   బయటి  నుంచి కూడా ప్రయాణాన్ని ఆస్వాదించమని పిలిచారు పడవ వాళ్లు. అందరికంటే చివరన వీడ లేక వీడలేక బయటి కడుగు పెట్టాను.  పైకి వచ్చి చూస్తే అసలా లోతున అంత సుందర ప్రదేశం ఉందని కూడా తెలీనంత నర్మ గంభీరంగా ఉంది సముద్రం.
అన్నీ చాలా ఖరీదే: ఇక అక్కడి నుంచి బయటకు వచ్చేసరికి ఒంటి గంట కావస్తూంది.  లేటుగా టిఫిన్ తినడం వల్ల ఎవరికీ పెద్దగా ఆకలి లేదు అయినా తినాలి కాబట్టి  ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పిల్లలకు ఏదో స్ట్రా  బెర్రీ ఫన్నెల్ కేకు, మేమేదో స్నాక్ తిన్నాం. సత్య, వరు వెళ్లి అవన్నీ తెచ్చే లోగా నేను, సిరి పక్కనే చెట్టు  కింద చప్టా మీద కూచున్నాం.  దగ్గర్లో ఒకతను కూచుని ఎవరినో చూసి నవ్వి నాతో చెప్పాడు ఆవిడకు వాళ్లాయన మీద ఎంత పెత్తనమో అని.   నేనూ చిన్నగా నవ్వి అతని వైపు చూడగానే చేతిలో తింటున్న డ్రైప్రూట్  మిక్స్ లోంచి కాసిన్నితీసుకోమని చెయ్యి చాపాడు.  అతనక్కడ ఏడు సంవత్సరాలనించి  ఉంటున్నాడట.  అక్కడ painting  వర్కు లేవో చేస్తుంటాననీ,  ఈ ద్వీపంలో సామాన్యుల బతుకు చాలా కష్టమనీ చెప్పుకొచ్చేడు.  “అన్నీ చాలా ఖరీదే.” చివరికి కొనుక్కు తిందామంటే ఫుడ్ కూడా అందుబాటులో లేని ధర  అనీ  చెప్పాడు.  ఇక వాళ్లకు బోట్ టిక్కెట్లు అంత ఖరీదు ఉంటే మెయిన్  లాండ్ కు  ఎలా వెళతారని అడిగాను.  ఇంతలో వచ్చిన అతని సహచరిని అడిగి చెప్పాడు. వాళ్లకు సంవత్సరానికి ఒకటి  చొప్పున కొంత తగ్గింపుతో సీజను టిక్కెట్టు ఉంటుందని.  అయినా అది కూడా ఖరీదే.   వాళ్లని చూస్తే బొత్తిగా డబ్బులు లేనట్టున్నారు.  సత్య రాగానే పరిచయం చేసుకుని వాళ్లు “వెళ్లొస్తామని”  సెలవు తీసుకున్నారు.
వాళ్లు చెప్పింది అక్షరాలా నిజం. పూర్తిగా టూరిస్టు ప్రదేశం గా ఉన్న ఈ ద్వీపం లో avalon  తప్ప మరే ప్రదేశమూ నివాస యోగ్యం కాలేదిప్పటి వరకు.  avalon  తీర ప్రాంతం నుంచి కనుచూపు మేరలో ఉన్న ఇళ్లన్నీ అక్కడ టూరిజం వల్ల  జీవిస్తున్న వాళ్లవే.    ఇలా టూరిజం మాత్రమే ఆధారమైన ప్రాంతాల్లో ప్రయాణీకులు డబ్బుకు వెరవకుండా ఖర్చుపెడతారు కాబట్టి వ్యాపారస్తులు అధిక ధరలతో లాభాలు చేసుకుంటారు. అది ఇలా అక్కడి నివాసస్తుల పాలిటి భూతం అవుతుంది పాపం! ఒకప్పుడు ఇక్కడ మంచి నీళ్ల కొరత వచ్చి ద్వీపమంతా దాదాపు ఖాళీ అయిన పరిస్థితి కూడా వచ్చిందట.  మరోసారి అగ్ని ప్రమాదం వచ్చి మొత్తం నగరం ధ్వంసమైందట.
మధ్యాహ్నం ద్వీపం లోపల ఉన్న ఎత్తైన ప్రదేశం లో ఉన్న  ఎయిర్ పోర్టు వరకు వెళ్లొచ్చే టూర్ కి టిక్కెట్లు తీసుకున్నాం.  మాకు ఉన్న సమయం లో అదొక్కటే  వీలవుతుంది  కాబట్టి అది కూడా దాదాపు రెండున్నర గంటల  టూరు.
కాసినో టూర్ : మధ్యలో అక్కడి నుంచి కాసినో టూర్ కు వెళ్లాం.  144 అడుగుల ఎత్తైన  గుండ్రని  భవంతి అది.  అందులో ఒక పెద్ద థియేటర్ ఆ పైన ఒక పెద్ద బాల్ రూం ఉన్నాయి. ఇంత వరకు నేను చూసిన గుండ్రని కట్టడాలు, బాల్ రూమ్స్   అన్నిటి కంటే ఇదే పెద్దది.  కాసినో అనే పదానికి ఇటాలియన్ భాష లో ఉన్న సరియైన అర్థం Entertainment అట.  ఆ అర్థం  ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. అంతే గానీ జూదం ఆడే ఇప్పటి కాసినో కాదది.  అన్నికంటే కింద కాసినో మ్యూజియం కూడా ఉంది.  మేం రెండు గంటల సమయానికి టూర్ కు టిక్కెట్లు తీసుకున్నాం.  మొత్తం అరగంట టూర్ కు 5 డాలర్లు టిక్కెట్టు.   లోపల హాల్ లో నుంచి థియేటర్ లోనికి తీసుకెళ్లి కొన్ని ట్రైలర్లు,  కాసినోకు  సంబంధించిన చరిత్ర వీడియో కూడా మనకు చూపిస్తారు.  హాల్లో  గోడలకు వేసున్న అందమైన పెయింటింగులు,   బంగారు పొడితో వేసిన  నక్షత్రాల  సీలింగు   అన్నిటి గురించి వివిరంగా   చెప్పింది  గైడ్.
అక్కడి నుంచి నాలుగు అంతస్తులు ఎక్కి పైకి  తీసుకెళ్లి గుండ్రని ఎత్తైన హాలులో  ఉన్న బాల్ రూం లోకి అడుగు పెట్టగానే చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది.  నునుపైన చెక్క గదిలో  విశాలమైన ప్రదేశంలో  ఎన్నో కార్యక్రమాలు  జరుగుతాయట.   బయట ఆనుకుని ఉన్న వరండాలోంచి మూడు  పక్కలా సముద్రం కనిపిస్తూంటుంది. అంత ఎత్తు  నించి సముద్రాన్ని చూడడం చాలా సరదాగా ఉంటుంది.  చూసిన వారెవ్వరికైనా ఆ కట్టడం  నచ్చకుండా ఉండదు.
తప్పు టూరు:  అయితే కాస్త సమయం ఉండడం తో హోటలుకి  వెళ్లి తిరిగొచ్చి హడావిడిగా   ఒక బస్సు డ్రైవరు బాగా  పెద్దామె “రండి త్వరగా”  అని పిలవగానే నేను టిక్కెట్లు  ఆమె  చేతిలో పెట్టడం ఆమె ఒక చిన్న ముక్క తుంపుకుని మిగతావి నా చేతిలో పెట్టడం జరిగిపోయాయి.    అనుకున్న సమయానికి ఒక పావుగంట ముందే బస్సు బయలుదేరి పోయింది. మేం ముందు రోజు గోల్ఫ్ కార్ట్ వేసుకుని ఎక్కడెక్కడైతే తిరిగామో సరిగ్గా అవే స్థలాలకు మళ్లీ వెళ్లింది మా బస్సు.   చివరగా సరిగ్గా గంట లో మళ్లీ బస్టాపుకు వచ్చేసాం.  ఇదేమిటి ఎయిర్ పోర్టు చూడలేదు  సరి కదా గంట లో వచ్చేసామని ఆమెను అడిగితే అసలు మీరే  టూరు వాళ్లు?  అని అప్పుడడిగింది  చల్లగా. టిక్కెట్లు చూపిస్తే   ఇది కేవలం ఊరంతా చూపించే టూరు,   మీరు నా బస్సెందుకెక్కారు అంది. అదేమిటి  పరుగున వచ్చి ఎక్కమంటే  ఇదే మా బస్సని ఎక్కామని , పైగా టిక్కెట్లు చూపిస్తూ టూర్ పేరు కూడా అడిగాననీ ఆమె అవునని  తలూపడం వల్లే ఎక్కాననీ గుర్తు చేసాను.
సర్లే వెళ్లి అక్కడ  కౌంటర్లో మాట్లాడుకోండని  వెళ్లి పోయిందామె.   దేవుడో  మని  కౌంటర్  వాళ్లనడిగితే  మేం ఎక్కాల్సిన బస్సు ఎప్పుడో వెళ్లిపో వడమే కాక  ఇక ఆ రోజుకి ద్వీపం చూపించే  ఏ టూరూ లేదని చెప్పాడు.   ఇక మా టిక్కెట్టు డబ్బుల  విషయం అడిగితే “కొంత” ఏమైనా ఇవ్వగలను అన్నాడు.  నేను కొంచెం వాదనకు దిగాను. ఇలా టూరుకై వచ్చిన మా లాంటి వాళ్లు తప్పు  బస్సు ఎక్కుతూంటే డ్రెవరైనా టిక్కెట్టు చూసినప్పుడు చెప్పాలి కదా.    తప్పు వాళ్లది కాబట్టి మమ్మల్ని  ఏదో రకంగా మరో టూరుకు పంపాల్సిందే,  లేదా  పూర్తిగా రిఫండ్   ఇవ్వాలని  పట్టుబట్టాను.  అతను మేనేజరు తో కాస్సేపు  ఫోనులో మాట్లాడి  ఏమనుకున్నాడో  ఏమో మొత్తం  రిఫండిచ్చి  పంపించాడు.   డబ్బులు తిరిగి వచ్చినా సమయం అంతా వృధా అయ్యిపోయింది మాకు.   మరో చోటేదో జీపు టూరని,  టాక్సీ  టూరనీ  చూసి  అక్కడకు వెళ్లాం  తర్వాత.   అయితే అప్పటికే చీకటి  కావస్తూండడంతో  అన్ని టూర్లు  క్లోజ్  అయ్యాయి. మర్నాడు ఉదయం 10.45 కి మేం  తిరిగి వెళ్లాల్సిన బోట్.  ఇక త్వరగా  ఆలోచించి ముందు బోట్ వాళ్లకి  ఫోన్ చేసి మా టిక్కెట్టును   మర్నాడు సాయంత్రం 6.45 కు చివరి ట్రిప్  కు మార్చాము.
అదనంగా టిక్కెట్టుకి మరో అయిదు డాలర్ల చొప్పున కట్టించుకుని వాళ్లు మార్చి ఇచ్చారు.  ఇక కావలసింది మాకు మర్నాడు హోటల్.  మా హోటల్ వాళ్లను అడిగితే జూలై నాలుగుకి అన్నీ బుక్కయ్యాయి రూమును extend చెయ్యలేమన్నారు.  సరే కనీసం ఉదయం మేం ఖాళీ చేసేసినా సామాను పెట్టుకోవడానికి ఒప్పించి,  ఆన్ లైను లో  మా టెర్మినల్ కు 60, 70 మైళ్లు ఇంటి కెళ్లే దారిలో బుక్ చేసాం.
సినిమా: అయితే ప్లాను ఇలా ఒకచోట చిన్న మలుపు తిరగడం,  మా తిరుగు ప్రయాణం కొన్ని గంటలు ముందుకు నడవడం  వల్ల మాకు ఇంకాస్త ఎక్కువ సమయం ద్వీపం మీద గడిపే అవకాశం వచ్చింది.  ఆ సాయంత్రం  ఆ కాసినో  లోని సినిమా హాలులో పిల్లల సినిమా Brave కు వెళ్లాం.  సిరి పుట్టేక ఇదే మొదటి  సారి సినిమాకు వెళ్లడం.  హాలులో చీకటయ్యే వరకు బాగానే ఉంది. సినిమా ప్రారంభం కాగానే ఎవరో  కొట్టినట్టు ఏడవడం మొదలు పెట్టింది.   కాస్సేపటి వరకు బయట గుమ్మం దగ్గర నాకు డ్యూటీ వేసింది.  తర్వాత నెమ్మదిగా ఏడుపు ఆపి సినిమా వైపు చూడడం మొదలు పెట్టింది.  నేను మొదట్లో కాస్సేపు  చివరి సీటు లోను, క్రమంగా మా వరుసకి వచ్చి కూర్చున్నాను. అయినా కియ్యి కయ్యి మనకుండా బాగానే ఊరుకుంది. సినిమా అయిపోగానే హెయ్య్ అని చప్పట్లు కొట్టింది.
రాత్రి నీళ్లని ఒరుసుకునే ఒడ్డు వెంబడి  కాలిబాట మీద నడుచుకుంటూ పది  నిమిషాల్లో హోటల్ కు చేరుకున్నాం.
మర్నాడు  ఇక నిన్నట్లా  టైము వృథా కాకూడదని ఉదయానే మిగిలిన చెయ్యవలసినవి, చూడవలసినవి  లిస్టులు రాసుకున్నాం.  అందులో మొదటిది కాసినో లోని మ్యూజియం సందర్శన.  పైగా అవి ముందు కాసినో టూరు తో వచ్చిన ఫ్రీ టిక్కెట్లు కూడానూ.  ఉదయం తొమ్మిది గంటలకల్లా రూము ఖాళీ చేసేసి అక్కడికి చేరుకున్నాం. అలా ఆ కాసినో చుట్టూ  దాదాపు  అయిదారు సార్లు తిరిగాం. మంచి అద్భుతమైన చిత్రాల గోడలున్న ముందు వరండా లోకి చేరుకున్నాం. మ్యూజియం దిగువన ఉంది.  కానీ మూసి ఉంది.  అక్కడ థియేటర్ వాళ్లని అడిగితే సరిగ్గా వాళ్లకూ తెలీదట మ్యూజియం వేళపాళలు. కాస్సేపు అక్కడే  తచ్చాడుతూ ఆలోచిస్తూండే సరికి  మ్యూజియం తెరిచేరు. చాలా చిన్న మ్యూజియం అది. నాలుగు గదులున్నాయేమో.
Inland tour: పది గంట కల్లా మళ్లీ టూర్ బస్సుల  టిక్కెట్టు కౌంటరు దగ్గర కొచ్చి 11.45 కి ఉన్న మొదటి టూరు కి టిక్కెట్లు తీసుకున్నాం. ఇది ఇంకాస్త ఖరీదైనది. మనిషికి $77 డాలర్లు.
ఇది ద్వీపాంతర్భాగాన్ని సమగ్రం గా చూపించే Inland tour.  దాదాపు 3.30 గంటలు పడుతుంది తిరిగి రావడానికి.  ఇంతలో మా వరు వచ్చినప్పటి నించి మినీ గోల్ఫ్ ఆడదామని  పేచీ పెడ్తూండడం, పైగా అది బస్టాండుని ఆనుకుని అదే ఆవరణలో  ఉండడం వల్ల  దానికి టిక్కెట్లు తీసుకుని అటు నడిచేం.   సిరి అస్సలు ఆడనివ్వకుండా  పేచీ పెట్టింది.   వీళ్లిద్దరూ ఆడుతూ కాలాన్ని మర్చిపోయారు.   సరిగ్గా బస్సు బయలు దేరే అయిదు నిమిషాల ముందు ఏదో స్నాక్సు కొనుక్కుని బస్సులోకి ఎక్కేం.  బస్సు నెమ్మదిగా ఊరునించి దూరంగా మలుపుల దారుల్లోంచి కొండల్ని  అధిరోహించడం మొదలు పెట్టింది.  నిన్న టూరు తప్పిపోవడం వల్ల ద్వీపపు అటు చివరను చూసే అవకాశం ఇవాళ కలిగింది.  అలా ఎంత దూరం వెళ్ళినా రాళ్లు, తుప్పలు, చిన్న చిన్న పొట్టి చెట్లు ఉన్న ఒక విధమైన ఎడారి లాంటి ద్వీపమిది.  మన జడల బర్రె ను పోలిన bisons  ఉన్నాయి అక్కడ. మధ్య దారిలో  గద్దల్ని, నక్కలను సంరక్షించే చిన్న ప్రాజెక్టులను కూడా చూసేం.   దాదాపు గంటన్నర తర్వాత   ద్వీపానికి అటు చివరకు చేరుకున్నాం.
ఎత్తైన కొండ మీంచి దగ్గరగా Little harbors, దూరంగా  Two harbors అనే తీరాలు కనిపిస్తూన్నయి.  లిటిల్ హార్బర్స్ లో  మంచి తెల్లని ఒడ్డున ఎగిసి పడ్తూన్న స్వచ్ఛమైన నీలి కెరటాలు.   ఇక మేం నిలబడ్డ చోటు నించి అంచుకి వెళితే  దాదాపు రెండు వందల అదుగుల దిగువన రాళ్లని అవిశ్రాంతంగా విసిరి కొడుతూ కోసేస్తూన్న భీకర మైన అలలు.  ఆ ద్వీపపు అంచు మీద నిలబడి చూస్తే  కనుచూపు మేర ఆకాశం, చుట్టూ సముద్రం. ఒళ్ళు గగుర్పొడిచే అనుభూతి.  సముద్రానికి మధ్య ఇంతటి గంభీరంగా నిల్చున్న ఈ రాతి శిలలు, సముద్రాంతర్భాగం లో ఇంకెంత లోతుకు విస్తరించి ఉన్నాయో.
ఎయిర్ పోర్ట్ : దుమ్ము రేపే రోడ్లని దాటుకునీ, దాటుకునీ బస్సు అవిశ్రాంతంగా ముందుకు ప్రయాణించి  చివరగా Airport in the sky  అని ప్రసిద్ధి గాంచిన కాటలీనా ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది.  ఎత్తైన ప్రదేశం లో ఉండడం వల్ల దానికా పేరు వచ్చిందట.   ఛార్టర్  విమానాలు  ఆగగలిన చిన్న విమానాశ్రయం అది.    అక్కడ మాకు అరగంట భోజన సమయం ఇవ్వడం తో కాస్త  లైట్ గా  స్నాక్స్   తిని ఫోటోలు తీసుకునే  సరికి సమయం అయిపోయింది.
తిరుగు ప్రయాణం వెళ్లినంత సేపు పట్టలేదు.  అంతా దిగువకి రావడం వల్లనే అనుకుంటా. తిరిగొచ్చే సరికి నాలుగున్నర కావస్తూంది. మాంచి ఆకలి మీద ఉన్నామేమో take out తీసుకుని బీచ్ లో కూర్చుని ఆదరా బాదరా తిన్నాం.  ఇంకా బోట్ కు సమయం మిగలడం తో కాస్త షాపింగ్ కూడా చేసాం.   మేం ఎక్కడికెళ్లినా సావనీర్ గా పెన్నీ  మీద ముద్రించే సావనీర్ ను తీసుకుని వస్తాం. మిషన్ లో పెన్నీ తో బాటూ అర్థ డాలరు వేస్తే అక్కడ ప్రత్యేకించిన బొమ్మతో  ఓవల్ షెప్ లో ముద్రించి  బయటకు పంపిస్తుంది.   అయితే ఇక్కడెక్కడా పెన్నీ సావనీర్ల  మెషిన్లు లేకపోవడం  వల్ల మనిషికో సావనీర్ కొని మొత్తానికి ఓ వంద డాలర్లు అవగొట్టాం.

తిరిగి వెనక్కి వస్తూన్నపుడు  సముద్రాన్ని రెండు గా చీలుస్తూ మా బోట్ ముందుకెళ్తుంటే, సాయంత్రపు నారింజ కాంతి లో, పర్వత శిఖరాల మునిగిన మబ్బుల తోపీలు  విదిల్చి కాటలీనా వీడ్కోలు పలికింది.  నాకు వచ్చేటప్పుడు కూడా సముద్ర ప్రయాణపు వికారం  ఒక వైపు,  తెలీని బెంగ మరో వైపు కమ్మింది. ద్వీపాన్నొదిలి రాలేక రాలేక  వచ్చాను. ఇలాంటి బెంగ వల్లే బహుశా:  ఆ ద్వీపాన్ని కొనేసుంటాడు William Wrigley.(గొప్ప ధనికుడు కూడా కాబట్టి)
Main land  చూడంగానే  “ఫైనల్లీ, మూడు రోజుల తర్వాత” అంది సంతోషం గా  వరు,  ఏదో సముద్రం లో తప్పి పోయినట్లు.  ఇక ఇంటికి మర్నాడు సాయంత్రానికి చేరుకున్నాక “హోం స్వీట్ హోం- అబ్బ మళ్లా ఇంటికొచ్చాం ” అని తెగ సంబర పడిపోయింది.  నాకు మళ్లీ  కాటలీనా కు ఎప్పుడెళ్తామా అనిపించింది.
……………………

(http://vihanga.com/?p=4721)

 

ప్రకటనలు
This entry was posted in నా కళ్లతో అమెరికా(Travelog) and tagged , , , , , , , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s