నా కళ్లతో అమెరికా-11(శేక్రమెంటో)

 
శేక్రమెంటో(SACRAMENTO)

Dr K.Geeta

శేక్రమెంటో కాలిఫోర్నియాకు రాజధాని.  ఉత్తర కాలిఫోర్నియాలో “గోల్డ్ రష్” సమయంలో మొట్ట మొదటి సెటిల్ మెంట్లు ప్రారంభమైన నగరం. రవాణాకు అత్యంత అనువైన ప్రదేశం. రెండు నదుల సంగమమై , సారవంతమైన ప్రదేశం.  ఇతర రాష్ట్రాలకు రైలు సౌకర్యం ఉన్న  ప్రధాన నగరం. టెలీగ్రాఫ్ ప్రపంచంలో ప్రవేశించక ముందు 1860 ప్రాంతంలో గుర్రాల మీద టపా అందజేసే PONY EXPRESS కు పశ్చిమ తీరంలో ప్రధాన ప్రదేశం. 

మా ఊరి నుంచి నూటిరవై మైళ్ల దూరం. మహా అయితే రెండు గంటలు పడుతుంది. మా ఊరి నుంచి లేక్ తాహోకు గానీ, ఉత్తరం గా మౌంట్ శాస్తా కు గానీ సులభంగా వెళ్లాలంటే తప్పనిసరిగా ఈ నగరం మీంచి వెళ్లవలసిందే. మేం ఇంత వరకు ఏడెనిమిది సార్లు అటుగా వెళ్లి ఉంటాం.  మొన్నీ మధ్య కూడా ఒక ఆదివారం మధ్యాహ్నం శేక్రమెంటో అసెంబ్లీని ఆనుకుని ఉన్న DownTown ప్రధాన రహదారి మీదుగా వెళ్లాం. నిర్మానుష్యంగా, కర్ఫ్యూలా ఉన్న రాజధానీ నగరపు రోడ్లని చూసి ఆశ్చర్యం వేసింది. ఎత్తైన ఆకాశ హర్మ్యాలు, ఒక వైపు గొప్ప గంభీరంగా అసెంబ్లీ,   మరో వైపు ఆకాశానికి పసుపు రంగు వంతెన  వేసి నట్లున్న  Tower Bridge. రాష్ట్రంలో ఆరవ పెద్ద నగరమైనా కనీసం మా చుట్టుపక్కల ఉన్న పాటి సందడైనా  లేదు.   అయితే అక్కడికి కూత వేటు దూరంలో ఉన్న Old Sacramento మాత్రం ఎప్పుడూ జనం తో కళకళ్లాడుతూ ఉంటుంది.
   ప్రత్యేకించి మాకు శేక్రమెంటో  పాత నగరమంటే చాలా ఇష్టం. మంచి సందడిగా ఉండడమే కాకుండా  దాదాపు నూటేభై సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో అదే  రూపంలో తీర్చిదిద్దబడి  సందర్శకులను విశేషంగా ఆకర్షించే ప్రదేశమది.  అయితే ఇక్కడ స్ట్రీట్ పార్కింగులు దొరకడం కష్టం. ఒక చివరగా ఉన్న paid parking Garage  లో ఖరీదు ఎక్కువైనా పార్కింగు దొరుకుతుంది. ఆ రెండు వీధుల్లో  ఉన్న దుకాణాలు, భోజనం హోటళ్లు, విశేషాలు నెమ్మదిగా చూస్తూ అలా తిరగడానికే చాలా సమయం పడుతుంది. ఇక శేక్రమెంటో లో  ఉన్న విశేషాలు చూడడానికి,  పూర్తిగా ఆస్వాదించడానికి  మూణ్ణాలుగు  రోజులు పూర్తిగా పడుతుంది. మేం అయితే ప్రతీ సారీ అటు పనిబడ్డప్పుడల్లా అక్కడ ఆగే కార్యక్రమం తప్పని సరిగా పెట్టుకుని  ఒకోసారి ఒక్కోటి చూసుకుంటూ వచ్చాం.
మేం మొదటి సారి వెళ్లినప్పుడు పాత నగరం లోని  గుర్రబ్బండి ఎక్కాం. టిక్కెట్టు కుటుంబానికి 10 డాలర్లైనా, రెండు వీధుల్లో అలా అలా తిరిగి పదిహేనిరవై  నిమిషాల్లో తిరిగొచ్చేసినా అది గొప్ప ఠీవిగా, దర్జాగా ఉంటుంది. ఇక గుర్రాలైతే చాలా ఎత్తుగా, బలంగా ఉండి మంచి మేలిమి జాతి అశ్వాలంటే ఏమిటో తెలియజేసేవిగా  ఉంటాయి. అయినా నేనింత వరకూ అదే మొదటి సారి అంత ఆరోగ్య కరమైన గుర్రాలను చూడడం. చాలా ఆశ్చర్యమేసింది వాటిని చూసి నాకు.
నదీ విహారం:  శేక్రమెంటో రెండు నదుల సంగమమని చెప్పేను కదా –
అందులో మొదటిది శేక్రమెంటో నది. శేక్రమెంటో  కు ఉత్తరంగా 400 మైళ్లు ముందు క్లెమేత్ పర్వతాల్లో పుట్టి, శేక్రమెంటో  మీదుగా ప్రవహించి, శాన్ ఫ్రాన్సిస్కో కు ముందు సముద్రంలో కలుస్తుంది. ఇక రెండోదైన అమెరికన్ నది north west గా ప్రవహిస్తూ వచ్చి శేక్రమెంటో  దగ్గర శేక్రమెంటో  నదిలో కలుస్తుంది. ఒకప్పుడు ఈ నదుల వల్ల ఎంత అనర్థం జరిగేదో దాని వల్లే పాత నగరం ఎన్ని మార్పులకు గురయ్యిందో వివరించే ముందు ఇప్పటి ఆహ్లాదమైన వాతావరణం గురించి చెప్తాను. శేక్రమెంటో రివర్ క్రూయిజ్ లు అనేక రకాల సర్వీసులు నడుపుతూ ఉంటాయి. అందులో సందర్శకులకు కాస్త అందుబాటు ధరలో తక్కువ సమయంలో నదీ విహారం చెయ్యగలిగిన  Sight Seeing టూర్  ఎంచుకున్నాం మేం. టిక్కెట్టు మనిషికి 20 డాలర్లు. మధ్యాహ్నం మూడు నుంచి దాదాపు గంటన్నర పాటు నదీ విహారం.
కిందంతా Dining పైన Open deck లో సీటింగ్.   దారిలో నది పొడవుకీ కనబడే  విశేషాలన్నీ వివరిస్తూ ఉంటారు.  అయితే నదీ విహారం లో పిల్లలకు నచ్చేది ఈ సమయంలో శేక్రమెంటో నది మీదుగా ఉన్న రైలు, రోడ్డు బ్రిడ్జి రెండుగా విడి పోయి కింద వెళ్తున్న నౌకలకు దారినిస్తుంది. అది దాదాపు అరగంట కార్యక్రమం. మొదటి సారి చూడడమేమో పిల్లలు బాగా కేరింతలు కొట్టేరు. ఇక అమెరికన్ నది,  శేక్రమెంటో నదితో కలిసే ప్రదేశం నుంచి కొద్దిగా ముందుకు వెళ్లి,  మరల వెనక్కి మరలు తాము. నదీ సంగమాన్ని ప్రవాహంలో ప్రవేశించి,  ప్రత్యక్షంగా చూడడం చాలా బావుంటుంది.
 

ఈ స్లైడ్ ప్రదర్శన కోసం జావాస్క్రిప్ట్ అవసరం.

Old Sacramento Historic Tour:  పాత నగరాన్ని ఇప్పుడు ఇలా నిర్మించినా నదుల వరదల వల్ల విపరీతంగా నష్ట పోతున్న   ఈ ప్రాంతాన్ని,  కాపాడుకోవడానికి అప్పటి ప్రజలు ఏం చేసారో ప్రత్యక్షంగా చూపిస్తూ వివరించే టూర్ అది. అందరికీ టిక్కెట్లు దొరక్క పోవడం వల్ల నేనొక్కదాన్నే వెళ్ళేను. అయితే పదేళ్ల లోపు పిల్లలు వెళ్ళే టూరు కాదది కూడా.  టిక్కెట్టు 15 డాలర్లు చెల్లించి లైనులో నిలబడ్డ వాళ్లకి విసురుకొందుకు కాగితపు పంకాలిచ్చింది గైడు.  అంతే కాకుండా ఆవిడ మాటలు వినిపించడానికి తలా ఒక రేడియో సెట్టూ, హెడ్ ఫోన్సు ఇచ్చారు. ఎదురుగా కనిపిస్తున్న ఒక బిల్డింగు గరాజ్  లోనికి తాళం తీసి తీసుకెళ్ళారు. లోపలికి అడుగు పెట్టగానే గుప్పుమనే పాత కాలపు మట్టి వాసన.   అదెంత ఘాటుగా ఉందంటే అక్కడ ఉన్నంత సేపు దగ్గుతూనే ఉన్నారు చాలా మంది (నాతో సహా). నిజంగానే వందేళ్ల నాటి చరిత్రలోకి ప్రవేశించినట్లయ్యింది.  అక్కడ కూర్చో బెట్టి ఇరవై నిమిషాలు వీడియో చూపించారు. అదొక్కటే బాలేదు ఈ టూరులో. ఆ వీడియోని బయటే చూపించి లోపలికి తీసుకెళ్లొచ్చు నిజానికి.  అయితే చూపించిన విశేషాలు చాలా గొప్పవి. పాత నగరమే ఒకప్పటి శేక్రమెంటో. అయితే 1860 ప్రాంతంలో వచ్చిన ఘోరమైన వరద వల్ల నదీ తీరాన్ని ఆనుకుని ఉన్న ఈ నగరంలో ముఖ్యంగా ఆ రెండు వీధుల్లో అన్ని భవంతులు మొదటి అంతస్థు వరకు మునిగిపోయాయట. అయితే ఇక్కడవన్నీ చెక్క కట్టడాలు కావడం వల్ల  నానిపోయిన అంతస్థుల్ని రెండున్నర మైళ్ల మేర  జాక్ లతో 9 అడుగులు పైకి లేపి కింద గరాజుల్ని వదిలి వేసారట.
అలాంటి గరాజుల్లో రెండిటిని మాత్రం ఇప్పటికీ సంరక్షిస్తూ వచ్చారు. అందులో ఒక దాంట్లో ఇప్పుడు మేం  ప్రవేశించాం. మేం లోపల నడుస్తూంటే పైన రోడ్ల మీద సైడ్ వాక్  ల మీద మనుషులు నడుస్తూన్న శబ్దాలు వినిపిస్తున్నాయి. పైన  అంతస్తులన్నీ కింద  చెక్క స్తంభాల నిలబెట్టి ఉంచారు.లోపలంతా మట్టి, పురాతత్వ పరిశోధనకు తవ్వకాలు జరిపినట్లు ఉంది. నడవడానికి చెక్కలు పరిచారు.  ఈ మట్టి లో దొరికిన వస్తువుల  అవశేషాల్ని   అక్కడక్కడా ప్రదర్శనకు ఉంచారు. అవన్నీ చూస్తూ అప్పటి పరిస్థితుల్ని ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది.  ఇలా అంతస్తుల్ని పైకి లేపడానికి సుమారు 15 స.రాలు శ్రమించారట. అందులో నమోదైన మరణం ఒకటే ఉన్నప్పటికీ, నమోదు కాని వెన్నో అని గైడు చెప్పింది.  ఈ దేశం లో విపత్తులు వస్తే అదీ అప్పటి పరిస్థితుల్లో  తట్టుకోవడం చాలా కష్టం. ఆరుబయట ఒక్క రాత్రి కూడా గడపలేని చలి వాతావరణం ఉంటుంది సంవత్సరం లో చాలా అధిక భాగం. అక్కడ తిరుగు తున్నంత సేపూ   కనిపిస్తూన్న మట్టి వెనుక కనబడని కథలెన్నో తరచి చూసి మనసు విహ్వలమైంది.  మళ్లా బయటికి రాగానే కళ్లు కాస్సేఫు వెల్తురుకి అలవాటు పడలేక పోయాయి.  బయటికి తీసుకొచ్చి రెండు రోడ్లకి ఆవలగా మరో భవంతి లోకి తీసుకెళ్లారు.  అది బయటి నుంచి కలకత్తా లో ఉన్న పాత అపార్టుమెంటు  భవంతి లా ఉంది.   అక్కాడా ఇలాగే గరాజులోకి ప్రవేశించి,  తిరిగి చూసొచ్చాం.  ఈ టూరులో నా వొంటికి గత చరిత్ర తాలూకు ధూళి వాసన అంటుకుంది. ఇక బయటికొచ్చి అలా ఆ పాత నగరపు రెండు వీధుల్లో తిరుగుతూ ఉంటే ఎక్కడో పద్ధెనిమిదో శతాబ్దంలో  తిరుగాడుతున్నట్టే     అనిపించింది.
అక్కడ జోస్  క్రాబ్ షాక్  రెస్టారంట్లో Fried Crabs  మా సత్యకు ఇష్టమైన డిష్. అయితే  అన్ని టేబుళ్లకు మధ్య తుక్కు వేసుకోవడానికి   ఇనప బక్కెట్టు  సగం బయటికి కనబడేటట్టు పెట్టి ఉంటుంది.  తుక్కు వేయడానికి వీళ్లకు ఇంత కంటే  ఏమీ దొరకలేదా అని నవ్వు వచ్చింది.  అక్కడ ఒక పీత ఖరీదు 20 డాలర్ల పైనే ఉన్నా, spicy  అని ఆర్డరు  చేస్తే అచ్చు మన దగ్గరి కారప్పొడిలో వేయించిన పీతలు తెచ్చిచ్చారు.  ఆ రెస్టారంట్ బాగా రష్ గా ఉండి, భోజనం ఈ చుట్టుపక్కల మరెక్కడా లేనంత చాలా రుచికరం గా ఉంటుంది.
ఇక నదీ తీరాన్నానుకుని ఉన్న రైలు పట్టాల పక్కనే వాక్ వే  మీంచి  “Tower Bridge” మీదకు నడిచి వెళ్లొచ్చు.  శేక్రమెంటో లో వాతావరణం సాధారణం గా పగటి పూట వెచ్చగానే  ఉంటుంది. ఎప్పుడైనా చలి, పులి లేకుండా రహదారుల మీద నడవొచ్చు. అక్కడినుంచి రెండు వీధులు  దాటితే ఆధునిక  Down Town, ఎదురుగా  నది కావల వొడ్డున పిరమిడ్ ఆకారం లో కట్టిన కొత్త Ziggurat – California Department of General Services Building  కనిపిస్తాయి.  పాత కొత్తల, విభిన్న కలయికతో ఆ పసుపు రంగు వంతెన మీంచి కింద పారే నదిని చూస్తూ ఎన్ని గంటలైనా గడపాలని అనిపిస్తుంది. వంతెనకి ఆ రంగు ఉండడం చాలా తమాషాగా, అందంగా ఉంటుంది.
California State Capitol Building:  శేక్రమెంటో   Down Town ప్రధాన రహదారికి కు ఒక చివర California State Capitol Building , మరో   చివర Tower Bridge ఒకటే పెద్ద రోడ్డుకు  అటు ఇటూ  అందంగా కనిపిస్తూ ఉంటాయి.   ఈ చివర ఉన్న California State Capitol Building సర్కిల్  చుట్టూ ఉన్న గడ్డి మీద తలవాల్చి  ఎదురుగా ఎత్తైన గోపురంతో  తెల్లగా మెరిసే హర్మ్యాన్ని చూడడం గొప్ప అనుభూతి.  ధీర గంభీరంగా, చక్కని ఆకృతిలో పద్ధెనిమిదో శతాబ్దపు నవ్య సంప్రదాయ (neo classic)  పద్ధతిలో  1874 లో కట్టబడిందా భవంతి.
వెనక కింద అంతస్థులో కాలిఫోర్నియా లోని అన్ని కౌంటీల వివరాలు  గాజు అద్దాల వెనక ప్రత్యక్షమవుతాయి.  అవన్నీ ఉన్న వరండాల  లో నుంచి లోపలికి వెళితే ఏదో ఒక పెద్ద మ్యూజియం లోకి ప్రవేశించి నట్లు, ఎక్కడ చూసినా అద్భుతంగా  తీర్చి దిద్దిన, గొప్ప ఖరీదైన దారు శిల్ప  కళతో,  చిత్రకళతో మిరుమిట్లు గొలిపే ఎత్తైన గుండ్రని శిఖరం తో ఒకప్పటి రాజాంత:పురంలోకి ప్రవేశించినట్లు   ఉంటుంది. మధ్య హాలులో   ఇసబెల్లా మహారాణి కొలంబస్ కు నవ్య ప్రపంచావిష్కరణకు అనుమతి జారీ చేస్తున్న సందర్భపు గొప్ప శిల్పం ఉంటుంది.    కొన్ని గదులు సందర్శకుల కోసం తెరిచి ఉంచారు.  అక్కడ ఉన్న చెక్క వస్తువు ఒక్కొక్కటి  కొన్ని వందల, వేల డాలర్ల ఖరీదు చేస్తుంది. చివరికి లిఫ్టు కూడా తీర్చి దిద్దబడిన,  కళా మయమైన పనితనం ఉట్టిపడుతూ ఉంటుంది.
రెండో  అంతస్తులో ఒక గదిలో ప్రవేశించగానే   అసెంబ్లీ గాలరీ లోకి ప్రవేశిస్తాం.   తల  పైకెత్తి చూస్తే   వేళ్లాడే అద్భుత షాండ్లియర్లు,   కిందకు చూస్తే  విశాలమైన,   అత్యంత విలువైన, ప్రజా ప్రతినిథుల సింహాసనాల అర్థ వలయాలు. వీటన్నిటి   నడుమ చూపు  నిలిపి ఆ పెద్ద హాలులో నిల్చోవడమే అద్భుతంగా అనిపించింది.  ప్రజా ధనం ఇలా ముద్దలు ముద్దలు గా ఆ భవంతిలో ఒక విధంగా వృధా అయ్యిందని కూడా అనిపించింది. కానీ వీళ్లు ఈ భవంతిని గొప్ప కళా ఖండంగా చూడాలనుకున్నారు. అంతే –
Sutter Fort: ఇక  అక్కడినుంచి కొద్దిగా ముందుకు  దాదాపు మైలు దూరం ఉత్తరంగా  వెళ్ళగానే చుట్టూ ఉన్న అధునాతనమైన వీధులతో  సంబంధం లేకుండా మన దగ్గర పాత కాలపు దివాణం లాంటి  కట్టడం చూపరులను ఆకర్షిస్తుంది.  అదే ప్రఖ్యాతి గాంచిన  Sutter Fort. గొప్ప దార్శనికుడైన  john Sutter Sr,  స్విట్జర్ లాండ్ నుంచి   వచ్చి ఇక్క డ దీనిని 1839 లో నిర్మించాడట.  గేటు దాటి లోపలికి అడుగుపెట్టగానే  ఇక్కడ  వ్యవసాయం, వ్యాపారం  చేసి పెద్ద సంస్థానాన్ని నడిపిన John Sutter , అనుచరులు అక్కడే తిరుగాడుతూ కనిపిస్తున్న అనుభూతి.  విశాలమైన ఆవరణలో మధ్యలో సట్టెర్ నివసించిన ప్రదేశం,  చుట్టూ నిర్మించబడిన గదుల వరసలు.   ఆ కట్టడం అమెరికా లో ఉన్నది కాకుండా మన దగ్గర ఉన్న భ్రాంతి కలిగింది నాకైతే.   ఒకప్పుడు మన దగ్గర ఉన్న దివాణాల భవంతున్నీ ఇలా సంరక్షించి ఉంటే మనకి వందల, వేల  కొలదీ స్మృతులు సజీవంగా ఉండేవి.   అక్కడ ఉన్న ప్రతి గదిలోనూ ఒకప్పుడు ఏవేమి ఉండేవో ఇంచు మించు అదే పద్ధతిలో ఇప్పటికీ సర్ది ఉంచడం అత్యంత విశేషం.  గేటు లోపల ఎదురుగా జోడెడ్ల బండి ( బహుశా: గుర్రాలు కట్టి ఉంటారు ఇక్కడ) ,  బండి చివర వేలాడే లాంతరు,   వంట  సామగ్రి తో చెట్టు  కింద ఎవరో ప్రయాణీకులు  ఆ రోజుకి అక్కడ నివాసం ఉన్నట్లు కనిపించాయి.   అవన్నీ చూస్తే నా చిన్నప్పుడు మా వీధిలో ఇలా బండ్లు వెళుతున్నపుడు బండి తోలేవాడికి కనిపించకుండా వెనక బండికున్న బలమైన కర్రల కొసలుపట్టుకుని  మా వీథి  దాటేంత   వరకు కాళ్లు మడత పెట్టి  వేళ్లాడుతూ  నవ్వుకుంటూ వెళ్లడం    జ్ఞాపకం  వచ్చింది. అప్పుడప్పుడూ బండి వాళ్లు చూసి కొరడాని వెనక్కి ఝళిపించడమూ,  కంగారులో కింద మట్టి రోడ్డు మీద పడి మోకాళ్లు చెక్కుకు పోవడమూ జరిగేవి.  అయినా మానే వాళ్లం కాదు.
మొదటి గదిలో చేతి మగ్గం తో చిన్న చిన్న కాళ్లు తుడుచుకునే పట్టాల తయారీని వివరిస్తూ,  వచ్చిన చిన్న పిల్లలు స్వయంగా నేయడానికి అనుమతిస్తున్నారు. వరు కు అది చాలా నచ్చింది.
గది గది లోనూ అప్పటి పాత్రలు, వస్తు విశేషాలు,  పనిముట్లు,  ఉద్యోగస్తుల నివాసాలు  ప్రదర్శనకు ఉంచారు.  అన్నీ మనల్ని కిందటి శతాబ్దంలోకి తీసుకెళ్తాయి.  ఇవన్నీ ఇలా పునరుద్ధరించడంలో తీసుకున్న శ్రద్ధ బాగా కనిపిస్తుంది అడుగడుగునా.
 Sutter  అడుగు పెట్టిన వేళా విశేషమేమో  గానీ  త్వరలోనే ఆ చుట్టు పక్కల  బంగారం కనిపెట్టబడడం  ప్రపంచ వ్యాప్తంగా మనుషులు  వచ్చి చేరడం చకచకా జరిగిపోయాయి.   ఇవేళ అమెరికా పశ్చిమ తీరంలో ఇంత పెద్ద రాష్త్రం ఏర్పడడానికి దోహదమయ్యాయి.   మొత్తం సంస్థానానికి మధ్యలో ఉన్న కట్టడం సట్టెర్ నివాసం.  అది ఎత్తైన పునాది మీద మన దగ్గర పాత కాలపు ఇళ్ల పద్ధతిలో మధ్య హాలు అటూ ఇటూ చిన్న గదులు,  మళ్ళీ ఒక హాలు అటూ ఇటూ రెండు గదుల తో కట్టబడింది. అక్కడ ఆయన పడక గది, రాత గది, కార్యాలయం అన్నీ యధాతథం గా  ఉన్నాయి. అయితే పాపం  ఆయన మాత్రం చివర్లో వరుస నష్టాలతో బీద వాడిగా బాధలు అనుభవించాడట. సట్టెర్ జీవిత విశేషాలు వివరిస్తూ అక్కడొక  పెద్ద గదిలో మనకు 20 నిమిషాలు వీడియో చూపిస్తారు.   వరు చాలా ఉత్సాహంగా అన్నీ చూసింది.  ఇప్పుడిప్పుడే  తనకు చరిత్ర గురించిన వివరాలు  తెలుసు కోవడం పట్ల ఆసక్తి కలుగుతోంది.
నాకెందుకో చరిత్ర, భౌగోళిక విశేషాలు చాలా అబ్బురంగా అనిపిస్తాయి. వరుకి నాకు గ్లోబు, మేప్ లంటే  చాలా ఇష్టం. తీరిక దొరికితే వాటిని పరికిస్తూ ఉంటాం.
ఇక ఇలాంటి చారిత్రక ప్రదేశాల కు వెళితే ఎవరికైనా అప్పటి పరిస్థితుల అవగాహన ఆవాహనై మనశ్శరీరాలు  అక్కడక్కడే రోజుల తరబడి తిరుగాడుతాయి.    Sutter మరణించి 132 సంవత్సరాలు కావస్తూన్నా  ఇవేళ కూడా సందర్శకులు ఆయనను తల్చుకోగలుగుతున్నారంటే కారణం ఈ  శేక్రమెంటో నగరపు తొలి నిర్మాణమైన  ఈ కట్టడమే కదా అనిపిస్తుంది.   అంతే గాక ఈ చుట్టు పక్కల బంగారం కనిపెట్టబడినప్పుడు  మొట్ట మొదటి బంగారు గనుల తవ్వకపు పరిశ్రమ ” Sutter Mill”  ప్రారంభించిన  ఘనత కూడా ఆయనకే  దక్కుతుంది.
అయితే ఆయన కోసం తమ శ్రమని ధారపోసిన ఎందరో స్థానిక ఆటవికుల చరిత్రలు ఎక్కడా లిఖించబడి ఉండకపోవడం చరిత్రకు సామాన్యమైనా నా మనస్సుకి బాధని తెప్పించాయి. అంతే కదా-  సామాన్యుల కథల సంగతి అలా ఉంచి కనీసం పేర్లు కూడా మిగలవు చరిత్రలో. అనిపించింది.
శేక్రమెంటో నుంచి ప్రధాన వాహన సౌకర్యాలన్నీ అందుబాటు లో ఉండడం,  దగ్గర్లో బంగారం  తవ్వకాలు, అన్వేషణలు సాగడం వల్ల ఆ ప్రాంతంలో ధనవంతులు అధికంగా ఉండేవారట ఆ శతాబ్దంలో.   ప్రపంచ వ్యాప్తంగా జనం ఇక్కడికి డబ్బు సంపాదనకై వచ్చి పడడం అలా వచ్చిన వారి నిత్యావసరాలకు ఉపయోగపడే అనేక  వ్యాపారాలు బాగుపడడం ఇలా ఒక దానికొకటి ముడి పడి ఈ ప్రాంతం మధ్య కాలిఫోర్నియాలో బాగా అభివృద్ధి చెందింది.  అయితే ఇప్పటి కాలంలో సిలికాన్ వేలీ బాగా అభివృద్ధి చెందడంతో శాన్ ఫ్రాన్సిస్కో కు దక్షిణ ప్రాంతం  బాగా జన సమ్మర్దమైంది.  కాలానుగుణం గా ప్రదేశాలకు నాగరికతలు చరిత్రలో వచ్చి పోతుంటాయి, మార్పుకి లోనవుతూంటాయనడానికి ఇలాంటివన్నీ ప్రత్యక్ష ఉదాహరణలు.
పాత కొత్తల మేలు కలయిక శేక్రమెంటో. స్పానిష్ భాష లో పవిత్రమైందని అర్థం స్ఫురించేటట్లు ఈ ప్రాంతానికి   Gabriel Moraga అనే స్పానిష్ నావికుడు  పేరు పెట్టినప్పటి  నుంచి ఇది  శేక్రమెంటో అయ్యింది.  ఇప్పుడు పేరు మార్చాల్సి వస్తే అత్యంత సుందరమైనదని పేరు పెట్టొచ్చు.
——————–
ప్రకటనలు
This entry was posted in నా కళ్లతో అమెరికా(Travelog) and tagged , , , , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s