నా కళ్లతో అమెరికా-14( మౌంట్ మడొన్నా)

మౌంట్ మడొన్నా 
ఇక్కడ వేసవి లో చాలా మంది కేంపింగ్ కు వెళ్తూ ఉంటారు. ఉండే కాస్త వెచ్చదనంలోనూ స్వేచ్ఛగా  బయట  తిరగడానికి అనువైన కాలం వేసవి మరి. కాంపింగ్ అంటే అచ్చు మచ్చు ఆరు బయట జీవనమే. టెంట్ ల లో ఎక్కడో జనం సంచరించని అటవీ ప్రదేశాలలో జీవించడమూ, కొండలూ, గుట్టలూ ఎక్కడం, మైళ్ల తరబడి నడవడం, నీళ్లలో ఆడుకోవడం, చేపలు పట్టడం ఒకటేమిటి ప్రకృతి లో లీనమై హాయిగా తనివితీరా పచ్చదనాన్ని ఆస్వాదించడమన్న మాట.  మా ఇద్దరికీ చిన్నప్పుడు చదివిన టాం సాయర్, హకల్ బెరీఫిన్ ల ప్రభావం ఇప్పటికీ పోలేదు. ఇక్కడికొచ్చేక ఇంకాస్త ఎక్కువైంది. హకల్ లాగా చుట్టలు కాల్చుకుంటూ  ద్వీపం లో గడపడం కాకపోయినా కనీసం   కాంపింగైనా చెయ్యాలనే ఆలోచన చేసాం. అయితే ప్రతి సంవత్సరం ఏదో విధమైన అడ్డంకి వస్తూ ఉంది. చిన్న పిల్లలతో ఇప్పట్లో సాధ్యం కాదని వాయిదా వేసుకుంటూ వచ్చాం. అయితే అవకాశం రానే వచ్చిందీసారి.
ప్రయాణం: ఈ వేసవి సెలవుల్లో స్కూల్ కి సెలవులిచ్చే ముందు వారం లో మా వరు గర్ల్స్ స్కౌట్ కాంపింగుకి మూడు రోజులకు  వెళ్తోంది . ఇంకేం మేం కేంపింగుకి ఏర్పాట్లు చేసుకున్నాం. కోమల్ స్నేహితులతో మరో చోటికి ప్లాన్ చేసుకున్నాడు. అయితే సిరి ని తీసుకుని మేమిద్దరమే వెళ్లాల్సి ఉంది.  చిన్న పిల్లతో టెంట్ లలో చాలా కష్టమని కాబిన్ కాంపింగ్ చేద్దాం ఈ సారికి అనుకున్నాం. ఎంత వేసవి అయినా చిక్కటి అడవుల్లో రాత్రి అయ్యే సరికి బాగా చలి పట్టుకుంటుంది. కాబట్టి హీటింగ్ సిస్టం లేకుండా ఉన్న కాబిన్ల లో గడపలేం. ఇలా చిన్న పిల్లతో,  ఉన్న లిమిటేషన్స్ తో  కాంప్ చెయ్యగలిగిన ప్రదేశం కోసం ఆన్ లైన్ లో వెతగ్గా మాకు మౌంట్ మడొన్నా   కనిపించింది.

మా ఊరి నుంచి అరవై మైళ్ల దూరం లో ఉన్న వాట్సన్ విల్ లో ఉందది. సరిగ్గా గంట, గంటన్నర లో వెళ్లిపోవచ్చు.  మౌంట్  మడొన్నా కౌంటీ పార్కులో కాంపింగు  అవకాశం ఉంది కానీ మాకు కావల్సిన ఫెసిలిటీస్ తో లేదు. అందుకే మౌంట్ మడొన్నా సెంటర్ ను ఎంచుకున్నాం. అది ఒక యోగాశ్రం లాంటిది. బాబా హరిదాస్ ఆధ్వర్యంలో  నడిపించబడే యోగా, ధ్యాన  కేంద్రం. అయితే అమెరికాలో ఉంది కాబట్టి చాలా సోఫిస్టికేటేడ్ గా ఉంటుంది. వాళ్ల దగ్గర మంచి హోటల్ రూము లకు తీసిపోని విధంగా ఉండే ఎకామడేషన్  దగ్గర్నుంచి టెంట్లతో  కేంపింగ్ సహా ఉంది. మేం కావాలని ఇండివిడ్యుయల్ కేబిన్ ను ఎంచుకున్నాం. పైగా మేం వెళ్తూన్నది అక్కడ వేసవి ప్రారంభపు సమయంలో జరిగే వారం రోజుల యోగా కార్యక్రమపు బిజీ లో.  అదీ ఒకందుకు మంచిదే.  అసలు ఈ ఆశ్రమం, కార్యక్రమాల  సంగతేమితో కూడా చూద్దామని బయలుదేరాం.   అయితే ఇక్కడ ఫుడ్ మనం వండుకోవడానికి వీలు లేదు అందుకు కూడా ఎకామడేషన్ లో కలిపి చెల్లించి అక్కడే తినాల్సి ఉంటుంది. పూర్తి శాకాహరం మాత్రమే లభ్యమవుతుంది. మేం రెండు రాత్రుళ్లు ఉండడానికి మాకు రిజర్వేషన్ దొరకలేదు.
శుక్ర వారం సాయంత్రం వెళ్లి, శనివారం తిరిగి వచ్చేయాల్సిందే. అప్పటికి సిరి ఇంకా బేబీ ఫుడ్ మాత్రమే తింటున్నందు వల్ల పాపకు కావల్సినవి పేక్ చేసాను. మాకు తినేందుకిక ఏవో ఒకట్రెండు జంతికల పేకెట్ల వంటివి తప్ప ఏమీ పెట్టుకోలేదు.  సాయంత్రం 6 దాటితే అక్కడ డిన్నర్ సమయం అయిపోతుంది కాబట్టి మేం వెళ్లే ముందే వాళ్లు ఫోన్ చేస్తే మా కోసం డిన్నర్  పక్కకు తీసి పెడ్తామన్నారు.
మేం వరు ని గర్ల్స్ స్కౌట్ వాళ్లతో పంపించి బయలుదేరే సరికి నాలుగున్నర అయిపోయింది.  పైగా బాగా ట్రాఫిక్ లో ఇరుక్కున్నాం. అలా గంటన్నర కాదు కదా, రెండు గంటలన్నర పట్టింది మా ప్రయాణం. GPS సరిగ్గా దారి చెప్పకుండా ఇక నాలుగైదు మైళ్లలో వస్తామనగా మరో అడ్డు కొండ ఎక్కించింది.  అసలక్కడ సరైన రోడ్డు కూడా లేదు.  మన దగ్గర రోడ్లు అలా ఉండడం  మామూలే కానీ,  ఇక్కడ ఎంత మారు మూలకెళ్లినా తారు  రోడ్డు లేకుండా ఉండదు.  మొదటి సారి మట్టి రోడ్డు లో చిక్కని అరణ్య మార్గం గుండా ప్రయాణం.   చెట్ల చిక్కదనం వల్ల అప్పటి వరకూ ఉన్న  వెల్తురు మాయమై మా చుట్టూ చీకటి అలుముకుంది.  పైగా కారు రోడ్లకున్న గోతుల వల్ల అటూ ఇటూ ఊగుతూ బాగా తాగిన వాడు పట్టు తప్పి నడుస్తూన్నట్టు  ఊగుతూ, తూలుతూ నడుస్తూంది.  ఇలా అన్నీ హఠాత్తుగా  మారేసరికి వెనక సీట్లో ఉన్న పాపాయి గట్టిగా ఏడుపులంకించుకుంది.  నాకు భలే భయం వేసింది. అసలుకే  దారి తప్పామా? ఈ కొండకు అంతు  ఉందా? ఎటెళ్తున్నాం అనే ఆలోచన్లు పట్టుకున్నాయి.  ఒక పక్క పిల్ల ఏడుపు. ఎక్కడా కారు రివర్సు తీసుకోవడానికి లేదు.ముందుకే వెళ్లాల్సిందే.   చుట్టూ జరుగుతున్నవన్నీ పసిపిల్లలకు కూడా ఎంత బాగా అర్థం అవుతాయో కదా అనిపించింది.  మొత్తం అరవై మైళ్ల ప్రయాణం ఒక ఎత్తు,  ఆ కొండ మీంచి ప్రయాణం మరో ఎత్తు.  సరిగ్గా అరగంట తర్వాత  మళ్లీ మంచి రోడ్డుకి వచ్చి పడ్డాం.  అదేదో అడ్డదారిలా ఉంది.  బతుకు జీవుడా అని బయట పడ్డాం మొత్తానికి.

https://picasaweb.google.com/104256037410703377895/NaaKallathoAmerica14MountMadonna?feat=flashalbum#5813441118761407490
మౌంట్ మడొన్నా సెంటర్: ఇక మరో అయిదు నిమిషాల్లో రోడ్డు మలుపు లోనే మేం మడొన్నా సెంటర్ వచ్చింది.   రోడ్డుకానుకుని ఉన్న ప్రధాన గేటు అసలు పైకి కనిపించక ముందుకెళ్లి మళ్లీ వెనక్కు వచ్చాం.   మన దగ్గర్లా ఆశ్రమాలకు తోరణ స్వాగత స్తంభాలు వగైరాలేమీ లేవు.
పాత బడిన బడి గేటు లా ఉంది అంతే.  లోపలికి వెళ్తూంటే ఎదురుగా ఒక పక్కగా మెట్లపై ఎత్తుగా హనుమాన్ దేవాలయం. రహదారికిటువైపు ఆధ్యాత్మిక కేంద్రం, అటు వైపు కొలను, వాటిని దాటుకుని ప్రధాన కేంద్రం, కెఫే కనిపించాయి.  మేం ప్రధాన కేంద్రానికి వెళ్లి చేతులకి టాగ్స్ వేయించుకున్నాం. మా కేబిన్ తాళాలు తీసుకుని, వివరాలు  చెప్పి కాగితాలు తీసుకున్నాం.  ముందు కేబిన్ కు వెళ్లి, మరలా భోజనానికి వద్దామనుకుని బయటికొచ్చాం.  మా కేబిన్ ప్రధాన ద్వారానికి మరో మైలు దూరం లోఉన్న రెండవ ద్వారం నుంచి వెళితే వస్తుంది.  కాస్సేపు వెతికి,  వాళ్లిచ్చిన మేప్ ని అనుసరించి మొత్తానికి పట్టుకున్నాం.   అయితే అక్కడి నుంచి ఇక్కడికి కాలిబాట కూడా ఉంది.  మేం సరిగ్గా ఆలయం వెనకగా కనిపిస్తూన్న కొండ మీద ఉన్నాము.  మొత్తం ఆశ్రమం 355 ఎకరాల్లో ఉన్న కొండల మీద కట్టబడింది.  కొన్ని కాటేజీలు రోడ్డు  నుంచి దిగువగా  ఉన్న పర్వత పాదప్రాంతం లోను,  కొన్ని రోడ్డుకి సమానం గానూ, కొన్ని ఎగువగాను  ఉన్నాయి.

కేబిన్:  అక్కడ ఉన్న  ఆరేడు  కేబిన్ల  సమూహం లో మాదొకటి. చుట్టూ అడవి, చిక్కని చెట్లు,  కాబిన్ల మధ్య కూడా గడ్డి తో నిండిన  కాలిబాటలు ఉన్నాయి.
అక్కడొకటి అక్కడొకటి  విసిరేసినట్టున్నా యి కేబినులు.   అన్నిటికీ కలిపి బాత్రూములు  మధ్యలో ఒక చోట కట్టి ఉన్నాయి.  తాళం  తీయగానే రెండు మంచాలు మాత్రమే పట్టే చిన్న చెక్క గది దర్శనమిచ్చింది.   ఒక మంచానికిరువైపులా ఇనుప లేంపులు, బాటరీ లైటు, ఒక ఎక్స్ ట్రా దుప్పటి, దిండు అంతే.  ఇక్కడ ఇనుప లేంపుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  ఒక వ్యక్తి పాత ఇనుప సామాన్లతో ఇక్కడున్న లైట్లన్నీ  తయారు చేసి బహూకరించాడట.
ఒక్క సారిగా శరీరం తేలికైనట్లు,  ఇప్పటి వరకూ మాతో ఉన్న అన్ని ప్రాపంచిక ఆర్భాటాలు మాయమై అసలు ప్రపచంలోనికి వచ్చిపడ్డట్లైంది.  సెల్ ఫోను సిగ్నలు కూడా ప్రధాన మందిరం దగ్గరకి వెళ్తేనే ఉంటుంది. ఇక ఇంటర్నెట్టు లేనిదే బతకలేని ప్రపంచం నుంచి అన్నీ కట్టడి చేసే అలాంటి ప్రదేశం లో భలే వింతగా అనిపించింది. వరు మాతో వచ్చి ఉంటే టీవీ, మైక్రో వేవ్ వోవెన్, బాత్రూమూ లేని ఆ ప్రదేశం అసలు నిజంగా ఉండడానికేనా  అని ఉండేది. ఇక వాళ్ల కేంపు ఇంకెలా ఉందో పాపం అని అనిపించింది నాకు.

భోజన శాల: ఇంకా కాస్త వెల్తురు ఉందనగా మేం కిందకు భోజన శాల కు బయలు దేరాం. దాదాపు మనుషులకు సగానికి ఎత్తున పెరిగిన గడ్డి కొండ మీద నుంచి ఉన్న కాలి బాట లో దిగి వెళ్లేం. మా ప్లేట్ల లో పదార్థాలు చూడగానే ఆకలి గప్పున ఆరిపోయింది. నేను ఇండియన్ ఆశ్రమం  కాబట్టి అన్నీ  ఇండియన్ ఫుడ్స్  ఉంటాయనుకున్నాను.  అలాంటి ఛాయలు కూడా లేవు.  ఉడక బెట్టిన, పచ్చి కాయగూరలు, ఒక  లాంటి ఆకుకూరతో చేసిన  ముద్ద లాంటిదీ.  పైగా దేనిలోనూ ఉప్పూ, కారం లేవు. ఇలా ఉప్పూ, కారం లేక పోవడం అమెరికా లో కొత్తేమీ కాదు. కానీ పైన జల్లుకున్నా తినలేకుండా ఉన్నాయవేమిటో. అసలేమీ నోట్లో పెట్టుకోలేని విధంగా, పైగా బయటి అతి చల్లని వాతావరణం వల్ల ఫ్రిజ్ లోనుంచి తీసినట్లు చల్లగా ఉన్నాయి. మా పేర్లు రాసి అక్కడ అలమార లో పెట్టేసేరు. ఇక వీటి తో లాభం లేదనుకుని కనబడ్డ  అరటి పళ్లతో, నారింజలతో కడుపు నింపుకున్నాం. అరటి పండు పచ్చిగా ఉన్నా, నారింజ పుల్లగా ఉన్నా తప్పని సరైందిక.
భజన: పక్కనే హాలులో మధురమైన గొంతుకలతో కలిసి ఆలపిస్తూన్న భజన వినిపిస్తూంది.   చంటి పిల్లతో ఇద్దరం ఒక్క సారి వెళ్లే వీలు లేనందున చెరో సారీ   లోపలికి వెళ్లొచ్చాం. వెళ్లిన వాళ్లకు ఒకో భజన పుస్తకం చేతికి ఇస్తున్నారు.   అందులో ఉన్న దేవతా స్తోత్రాలు ముందు పాడే వాళ్ల వెనక అంతా పాడుతున్నారు.   భారతీయులు నలుగురికన్నా ఎక్కువ లేరక్కడ. అంతా ఇక్కడి  వాళ్లే.
కొందరు ఆనంద పారవశ్యంతో నృత్యం కూడా చేస్తున్నారు. అక్కడ బాబా కనిపించలేదు. వాళ్లిచ్చిన పుస్తకంలో రాముడు, కృష్ణుడు, శివుడు ఇలా  అందరు దేవుళ్లని,  దేవతల్ని స్తుతించే స్తోత్రాలు ఉన్నాయి. అయితే అక్కడ ముందు పాడే గొంతులు అత్యద్భుతంగా ఉన్నాయి. ఆ స్తోత్రాలకు వాళ్లు ఎంచుకున్న రాగమూ అత్యద్భుతంగా ఉంది. బయటి ప్రపంచాన్ని మైమరపింపజేస్తూంది. ఆ శ్లోకాల్లో ఏవీ లేక పోయినా ఇంకాస్సేపు వినాలనిపింపజేస్తోంది. కళ్లు మూసుకుని రాగాలాపనని ఆస్వాదిస్తూ ఉంటే  ఏదో తెలీని ప్రశాంతత అలుముకుంటూంది. భగవంతుడు ఎక్కడో లేదు, ఇలా ప్రవహించే పాటలోనే ఉన్నాడనిపిస్తూ ఉంది. పాట లోనే ప్రపంచ పరవశమంతా దాగి ఉన్నట్లు మధ్య మధ్య భజన ఆపినప్పుడల్లా హాలులో గాఢంగా పర్చుకున్న నిశ్శబ్దం.   పెద్ద హాలు అది. మంచి మైక్ సిస్టం. గెడ్డాలు, జుట్లు పెంచుకుని, సిసలైన హిందుత్వపు పద్ధతిలో ధోవతీలు ధరించి  కొందరు దర్శన మిచ్చారు.   నిజంగా ఇండియా నుంచి వెళ్లిన మా లాంటి వాళ్లం పేంటు చొక్కాలేసుకుని ఉంటే అక్కడ తెల్ల వాళ్లు యోగుల వస్త్రాలు కట్టుకుని ఉన్నారు.
పాపాయి కూడా ఆ హాలు లోకి వస్తానని ఏడుపు పెట్టడం తో గంట కంటే ఎక్కువ సేపు అక్కడ గడప లేక బయటకు వచ్చేం.
అద్భుత దృశ్యం: చీకట్లో దిగువకి కాస్త నడుద్దామని బయటకు వచ్చేం. బయటంతా చిమ్మ చీకటి ఆవరించింది. రహదారి మీద పక్కన నడుస్తున్నదెవరో కూడా గుర్తు పట్టలేని చీకటి.  ఆకాశం కేసి చూడగానే మొదటి సారి ఆకాశం అప్పుడే  భూమ్మీద గొడుగై ప్రత్యక్షమైనట్లు అనిపించింది.  అంతలోనే చక్కని మినుకు మినుకు నక్షత్రాలు కొలని తామరల్లా విచ్చుకున్నాయి.  ఎత్తైన రెడ్ వుడ్ చెట్ల మధ్య నుంచి  రేఖా మాత్రపు చందమామ దేదీప్య మానంగా చక్కని పెదవుల మీద  విరిసిన అందమైన నవ్వులా  కనిపించింది.   రహదారి మలుపుల్లో ఆకాశపు ప్రకాశానికి అడ్డం పడే తపనతో చిక్కని చెట్లు. అద్భుత దృశ్యం లో  చిక్కుపడి చల్లగా ప్రవేశించిన చలిని కూడా ఖాతరు చెయ్యకుండా స్థాణువుల్లా నిల్చుండిపోయాం అక్కడ.

చిన్నప్పుడు కరెంటు పోయినప్పుడూ, అట్లతద్దెకీ వీధుల్లో  ఆడుకున్న ఆటలు జ్ఞాపకం వచ్చాయి. నా నేస్తాలందరూ ఇప్పుడు  ఎక్కడ ఉన్నారో! అందరూ ఇక్కడ హఠాత్తుగా ప్రత్యక్షమై  కలిసి మళ్ళీ ఇక్కడ ఆడుకుంటే బావుణ్ణనిపించింది.  కానీ ఎప్పుడూ ఆకాశం ఇంత ప్రకాశ వంతంగా ఉన్నట్లు, చంద్ర రేఖ ఇంత పెద్దదిగా కనిపించినట్లూ జ్ఞాపకం లేదు.  మేఘాలు లేక పోయినా ఇంత పారదర్శకంగా   ఎప్పుడూ కనిపించినట్లు గుర్తు లేదు. అక్కడే కుంచె తీసుకుని రాత్రి ని చీకట్లోనే చేతి కంది నట్లు అద్దాలనిపించింది. ఫోటోలలో ఆ  దృశ్యాన్ని  ఎంత బంధించినా సరిగా వచ్చిందో లేదో అనుమానమే. ఇంకాస్త ముందుకు వెళితే వేడి నీటి పూల్ ప్రాంగణం ఉంది. బయటి చలికి గాల్లోకి వేడి పొగలు చిమ్ముతూ ఆ ప్రదేశం అక్కడి చిన్న బల్బు వెల్తురులో జనం తో నిండి ఉంది. త్రోవ వెంట ఇంకాస్సేపు తిరగాలని ఉన్నా  సరిగ్గా మా కేబిన్ కు విలోమ దిశలో వెళ్లిపోతున్నందువల్ల వెను తిరగక తప్పలేదు.

రాత్రి పూట నడక: వెనక్కి వచ్చి ప్రధాన భవంతి దాటగానే గుడి పక్క నుంచి నడిస్తే వచ్చే చిన్న ఎత్తు గుట్ట మీద కొంచెం  వెనగ్గా మా కాటేజ్ ఉంది. గుడి దాటి కొలను పక్క మలుపు తిరగ్గానే కొంత మేర మెట్లు ఉంటాయి.  అక్కడి వరకు చిన్న లైట్లు అక్కడక్కడా రహదారినానుకుని ఉన్నాయి.  అవి దాటితే అంతా గడ్డి మధ్య వంపులు తిరిగిన కాలి బాట, చిమ్మ చీకటి.  చంద్రుడి లేత వెలుగు ఆ ప్రదేశం లో పడకుండా పక్కనే త్రోవకు ఒక పక్కగా ఉన్న  చెట్లు మూసేస్తున్నాయి.  ఆకాశం వైపు చూసే అవకాశం లేదు. ఎందుకంటే బ్యాటరీ లైటు వేసుకుని నేల వైపు చూస్తూ నడవాల్సిందే.   కింద అంతా ఎగుడు దిగుడుగా ఉంది. మా ఇద్దరి చేతుల్లోనూ చెరో బాటరీ లైటు ఉన్నాయి. పాపాయి  నిద్రపోతూ ఉండడం తో  తనూ, నేనూ కాస్సేపు మార్చి ఎత్తుకున్నాం.  సరిగ్గా గుట్ట ఎక్కే ముందు ఏదో ఒక విధమైన జంతువు అరుపు దూరం నించి వినిపించింది నాకు.  అంతలో బాట మధ్య ఏదో జర జరా పాకిన అలికిడి.  దగ్గర్లో పక్కనెక్కడా మనుష్య సంచారం లేని భావన.  ఇక చూసుకోండి పరుగు వంటి నా నడక. ఒక చోట బాగా తిన్నగా గుట్ట ఎక్కాల్సి వచ్చింది.  బయట బాగా చలిగా ఉన్నా లోపల కలుగుతున్న ఏదో తెలీని భయపు ఆదుర్దా వల్ల,  గబ గబా నడుస్తున్నందు వల్ల కలుగుతున్న ఆయాసం, చెమట్లు.  సత్య నా నడక చూసి మరి కాస్త భయపెడ్తూ శబ్దాలు చెయ్యడం మొదలు పెట్టాడు.  బహుశా: అరగంట పట్టిందనుకుంటా  మా కాటేజీల్లో మొదటి  కాటేజీ కనబడేసరికి.  ఇక నేను ముందు కాటేజీ లోపలికి పరుగెత్తి తలుపు వేసుకునే సరికి నవ్వు మొదలెట్టాడు సత్య.  కిటికీలు మరీ మంచం వారకు ఉన్నాయి. అమెరికా లో పశ్చిమ ప్రాంతం  అసలే ఎలుగు బంట్ల కు పెట్టింది పేరు.

” ఏదైనా ఎలుగు బంటి వచ్చి ఒక్క గుద్దు గుద్దితే ఈ అద్దాలు  నిలుస్తాయా? తిన్నగా మన నెత్తి మీదకు దుమకదూ. ” లాంటి యథాలాపపు మాటలు పొరబాటున  పైకి అనే సరికి  పడి పడి నవ్వాడు తను.  తలకు అందేటట్లు ఉన్న రూఫ్ మీద చీకట్లో మెరుస్తున్న మిణుగురు లాంటి చిన్న వెల్తురేదో.  చల్లని అద్దాల వెనుక ఏముందో తెలీని పొగ మంచు. లీలగా కనిపిస్తూన్న చిక్కని నల్లని చెట్లు.  అన్నిటికీ మించి బాత్రూం కి  మళ్ళీ బయటికి వెళ్లి,  ఆ గడ్డి లోంచి నడిచి, మరో బిల్డింగుకు వెళ్లడం గొప్ప ఇబ్బంది అయ్యింది నాకు.  సత్య నాకు తోడు రానే రానని భీష్మించాడు.
చిన్నఫ్ఫుడు నేను చీకటంటే భయం లేకుండా చక్కగా  ఇంటి చుట్టూ పెరత్లో తిరిగేసేదాన్నట.  ఇప్పుడేమిటీ అని నవ్వు వచ్చేట్లు లేదెందుకో.  పైకి ఎన్ని కబుర్లు చెప్పినా నిజంగా వాస్తవానికొచ్చేసరికి ఎందుకు భయమేస్తుందో తెలీదు.  పరిస్థితిని ఎనలైజ్ చేసుకుని ధైర్యంగా  ఉండే మన:స్థితి ఒక్కోసారి కల్గదు. అంతే.  నిద్ర పట్టే వరకు గుబులుగా అనిపించింది.


ఉదయపు ఆహ్లాదం:
తెల్లార గట్ల సత్య నన్ను లేపి, “నేను 6 గంటల యోగా సెషన్ కు వెళ్తున్నాను.  నువ్వు 8 గంట కల్లా  లేచి వచ్చేయి”  అని చెప్పేవరకు మెలకువ లేదు. మళ్లీ నిద్ర పట్టింది. పాపాయి లేవడం తో  7.30 ప్రాంతంలో మెలకువ వచ్చింది. సన్నగా కదులుతున్న తెరల మధ్య నుంచి నలువైపులా ఉన్న కిటీకిల్లో నుంచి పచ్చ పచ్చని  మొక్కల నడుమ నుంచి ఏదో దీర్ఘాలోచన చేస్తూ నడుస్తూ మధ్య మధ్య లో ఆగి గడ్డి పెరుకుతున్న జింకల సమూహం కళ్లు తెరుస్తూనే కనిపించింది. చెప్పలేనంత ఆహ్లాదం మనస్సు నిండా.  తెరలు తెరలు గా పక్కకు తప్పుకూంటున్న మంచు తెరలు. చిన్న చెక్క గదిలో మంచం  చుట్టూ చిట్టి అదుగులేస్తూ తిరుగున్న పాపాయి అల్లరి నవ్వులు.  శబ్దానికి బెదరకుండా ఇంకా అక్కడే ఉన్న లేళ్లు. రాత్రికి,  పగటికి తేడా ఏవిటి?  ఈ వెల్తురేనా?   వెల్తురుని చూసి ఆనందించి, చీకటిని చూసి భయపడే దేమిటి?  ఈ కళ్లేనా? ఈ చిత్ర విచిత్రమైన మనస్సేనా?!

నవ్వు వచ్చింది నాకు. గది అద్దాల లోంచి బయటకు ప్రవేశించి ఆనందంగా తిరుగాడింది మనస్సు.  ఒక్కసారిగా రాత్రి తాలూకు పనికిమాలిన భయం పోయి ప్రకృతిలో లీనమై, ఉదయం కొత్తగా ఆనందంగా , ప్రశాంతంగా కనిపించింది. ఎంత బావుంది!  ఒక పక్క  నిజమైన అడవిలో ఉండడం, మరో పక్క  ఆధునికతకి కూత వేటు దూరం లో ఉండడం.  తలుపు తీసుకుని బయటకు వద్దును కదా!  తల్లీ, పిల్లా, ఇల్లూ, చెట్లు, జంతువులు, అడవి తీగలూ, నిశ్శబ్దం అన్నీ ఒక్కటే అక్కడ.  బయట మనుషులెవ్వరి అలికిడీ లేదు ఇప్పుడు కూడా.  బహుశా: ఇతర కాటేజీల వాళ్లు కూడా  అప్పటికే ధ్యాన సమయాలకు వెళ్లిపోయుంటారు.  ఇక్కడికి వచ్చే వాళ్లందరూ సాధారణంగా అందుకే వస్తుంటారని విన్నాను.  బాత్రూముల్లో నీళ్లని వృధా చెయ్యొద్దు,  ఈ ప్రాంతంలో నీళ్ల కొరత ఉందనే బోర్డులున్నాయి. ఇలాంటి బోర్డు అమెరికా లో మొదటి సారి చూస్తున్నాను.  చక్కని పరిశుభ్రమైన  ఆ బాత్రూములు హోటళ్ల కి తీసిపోని విధంగా ఉన్నాయి.  అధునాతనమైన ఆ బాత్రూములు తప్పిస్తే చుట్టూ అంతా అటవీ ప్రదేశపు అనుభూతి. కాస్త మలుపు తిరిగితే ఇంకాస్త ఎగువకి కాలిబాట వెంబడి నడిస్తే ఇంకా కాటేజీలు ఉన్నాయనుకుంటా.

ఉదయపు ఆహ్లాదం లో పాపాయితో ఆడుకుంటూ కాస్సేపు అటు ఇటూ అక్కడక్కడే పచార్లు చేసేను. అన్నట్లు మర్చిపోయాను, నేను త్వరగా తయారై కొండ దిగి వెళ్లాలి అనుకుంటూ ఉండగా సత్యే తిరిగి వచ్చేడు. మొదటి సెషన్ ప్రాణాయామపు పద్ధతులు, తరువాతి సెషన్ అంతా ఆసనాలునట.  అక్కడి వాళ్లందరూ అలవాటుగా అన్నీ చేసుకుని వెళ్లిపోతున్నారట. తనలా కొత్తగా వెళ్లిన వాళ్లకి ఒకాయన కాస్త సహాయం చేస్తున్నా వెళ్లిన వాళ్లకి పుస్తకాలు,  ముద్రలు ఉన్న గైడ్లు ఇచ్చినా తనకి సరిగా బోధపడ లేదని చెప్పేడు.    ఈ రెండు సెషన్లకు విడిగా సెషన్ కు పాతిక డాలర్ల చొప్పున కట్టించుకున్నారట.  రెండో సెషన్ మధ్యలో వచ్చేసేనని చెప్పేడు.

రాత్రి వచ్చిన త్రోవ వెంటే కిందకు దిగి వెళ్లేం. ఈ సారి దారిలో గుబుర్లకవతల టెంట్ కాంపింగు కూడా కనిపించింది.  నాకిక నవ్వాగలేదు. వీళ్లు డైరక్టుగా ఆ గడ్డి మధ్య లోనే రాత్రంతా గడిపేరు.  నేను కాస్సేపు నడవడానికే భయపడ్డాను.  ఆ రోజు శని వారం కావడంతో పగటి పూట చుట్టు పక్కల సిటీల నుంచి వచ్చిన  జనానీకం తో సందడి గా ఉంది.  గుడి లో పూజలు, గంట శబ్దాలు వినబడుతున్నాయి. పైగా ఆ రోజు బాబా హరిదాస్ అక్కడే ఉన్నారు. ఆయన దర్శనార్థం కూడా చాలా మంది భక్తులు వచ్చారని వినికిడి.  కొండ మీంచి దిగుతూంటే కనుచూపు మేరలో చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం. ఇక ప్రధాన భవంతి  నుంచి దూరం గా కనిపించే వేట్సన్ విల్లే అందాలు.  మేఘాలు పరుగెత్తే ఆకాశం అంతా అక్కడే అద్దంలో చూసుకోవడానికి ఆగినట్లు కనుచూపు మేర లో దిగువన కనిపించే మైదానమ్మీద విల్లై వంగింది.

బ్రంచ్ & బాబా దర్శనం: అన్నట్లు ఇక్కడ ఆ రోజు ఉదయం బ్రేక్ ఫాస్టు లేదు. ఆ రోజు ఏకంగా పదకొండింటికి బ్రంచ్  పెడుతున్నారు.  మేం రాత్రి పట్టుకెళ్లిన అరటి పండొకటి చెరి కాస్తా  తినొచ్చాం. పాపాయి ఇంకా  సిరిలాక్ తింటూంది  కాబట్టి సరిపోయింది.   వెళ్తూనే అమెరికన్ భక్తుడొకాయన నన్ను ప్రత్యేకంగా పలకరించి ఇక్కడ ఈ ఆశ్రమం ఉందని మీ ఎరికలో ఉన్నవారికి తెలియజేయండి.  భారతీయులు ఇక్కడ ఆట్టే పాల్గొనడం లేదు, కాస్త మీరు కృషి చెయ్యండంటూ చెప్పాడు. బాబా దర్శనానికి పెద్దగా లైను ఏమీ లేదు. ఇక బాబా ఆ రోజు మౌన వ్రతమట. హాలు మధ్య ప్రధాన ఆసనమ్మీద కూర్చుని ఉన్న  గెడ్డపు సాధువు కాబట్టి ఆయనే బాబా అని సులభంగా గుర్తు పట్టొచ్చు. అందరూ దగ్గర కెళ్ళి అభివందనాలు చేసి  వచ్చి కాస్త ఎడంగా నిశ్శబ్దంగా కూర్చుంటున్నారు. ఆయన మాట్లాడాల్సి వచ్చినపుడు కాగితమ్మీద రాసి చూపిస్తున్నారు. ముఖంలో ఏ భావమూ లేదు.  అందరి వైపూ చూడడం,  తల పంకించడం.  ఇక బ్రంచ్  ప్రారంభమయ్యాక కూడా ఆయన ఎదురుగా పళ్లాలు   తెచ్చుకుని అందరూ అక్కడక్కడా కూర్చుని తింటూ ఉన్నారు.  స్పెషల్ మీల్స్ అది.  ఒక విధమైన వెన్న పోపు పెట్టినట్లున్న అన్నం, ఏదో కొన్ని మెక్సికన్ సాల్సాల వంటివి, ఉడికించిన మొక్క జొన్న కంకులు, పొద్దుతిరుగుడు, బాదం వంటి డ్రైఫ్రూట్ మిక్స్, ఉడికించిన,  పచ్చి కాయగూరలు, కాయగూరల సూప్ వంటిది, పళ్లు, ఇంకేవేవో ఇలాగే  ఎప్పుడూ ఇంత వరకూ బైట ఎక్కడా తినని పదార్థాలు ఉన్నాయి.  మాంచి ఆకలితో ఉన్నామేమో ఆ రైస్  చూడగానే ప్రాణం లేచి వచ్చింది. ఆవురావురుమని తిన్నాము.  చివరగా కాస్త వేడి నీటిలో  జింజర్ టీ  పేకెట్ కలుపుకుని తాగి అయ్యిందనిపించాం.

నేను నా పక్కన కూచున్న ఇద్దరూ అమ్మాయిలతో మాటలు కలిపేను. వాళ్లిద్దరూ అప్పుడు జరుగుతున్న యోగా సెషన్స్ లో పాల్గొనడానికి వచ్చేరు. నిజానికి ఇద్దరికీ చంటి పిల్లలు ఉన్నా వాళ్ల ఆయన్లకి అప్పగించి వచ్చేరట. అందులో ఒకమ్మాయి యోగా instructor  కూడాను.  వాళ్లిద్దరూ ఇక్కడి వాళ్లే. మరొకమ్మాయి భారతీయ సంప్రదాయాల పట్ల మక్కువ ఉన్న అమ్మాయి.  ఈ ఆశ్రమం గురించి విని చాలా దూరం నుంచి రాత్రంతా ప్రయానించి వచ్చేరు వీళ్లు.  మాకు మా ఊరి నుంచే వచ్చిన నార్త్ ఇండియన్ జంట ఒకరు కూడా పరిచయమయ్యారు. వాళ్లు  ప్రతీ ఆర్నెల్లకీ వస్తూ ఉంటారట.  ఈ పూట భజనలు ఏమీ లేవు. అలా నిశ్శబ్దంగా బాబా వైపు చూడడమే.  ఎంత సేపు అలా కూచుంటారు వీళ్లు అనిపించింది.  రాత్రిలా ఇప్పుడు కూడా  కాస్సేపు ఎవరైనా శ్రావ్యంగా పాడితే బావుణ్ణని అనిపించింది.  ఇక్కడ ఒక యోగా కోర్సు నడుపుతున్నారట. ఇక్కడ చదివిన యోగా కోర్సుకి కాలేజీ క్రెడిట్సు కూడా ఉన్నాయట.  అంతా బావుంది కానీ ఆ ఆహారం తినడమే కష్టం అని నాకు అనిపించింది.   సత్య తనకు బాగా నచ్చిందని చెప్పేడు.  అమెరికాలో సాత్విక ఆహారం అంటే ఇలా ఉంటుందన్న మాట అనిపించింది.   మేం బయటకు నడిచి హనుమాన్ దర్శనానికి వెళ్లి  మరలా కిందకు వచ్చి కాస్సేపు ఫౌంటెన్లు ఉన్న పక్కనే గార్డెన్ లో తచ్చాడి, కారులో ఆశ్రమం అంటా ఒక రౌండ్  చుట్టీ…  ఇలా మధ్యాహ్నం ఒంటి గంట వరకూ అక్కడే గడిపి ఇక బయలు దేరాం. నిజానికి గుడి అనో, యోగా ఆశ్రమం కాబట్టి అనో , బాబా పట్ల నమ్మకంతోనో కాకపోయినా హాయిగా మంచి వాతావరణం లో అలా కాంపింగ్ చెయ్యడానికి వెళ్లొచ్చు అక్కడికి. మాకు చాలా నచ్చింది ఆ ప్రదేశం.
అలా సెమీ కాంపింగు తో మా కేంపింగ్ కోరిక కొంత వరకు ఫలించింది.
తిరుగు ప్రయాణం: ఇక అక్కడి నుంచి మరో రెండు మైళ్ల దూరంలో అదే రోడ్డు లో హార్స్ రైడ్ ట్రైనింగని ఏదో బోర్డు కనిపిస్తే వివరాల కోసం వెళ్లాం. ఆశ్రమం నుంచి బయటకు వచ్చేంత వరకు గుడీ, కొండా చూస్తే ఇండియాలో ఉన్నట్లు  అనిపించింది. మరలా ఇక్కడికి రాగానే అమెరికా కు వచ్చి పడ్డట్టయ్యింది.  అది గుర్రాల మీద ఒక పూటంతా అడవి దారుల్లోకి ఎక్కడికో తీసుకెళ్లి గుర్రపు స్వారీ  నేర్పించే కేంద్రం.  పాపాయితో కష్టమని వివరాలు తీసుకుని బయలుదేరేం. మరో రెండు మూడు మైళ్లలో ఉన్న  మౌంట్ మడోన్నా  పార్కు లో నుంచి బయటకు ప్రయాణించేం.  అక్కడా కేంపు సౌకర్యముంది కానీ అసలు ఇలాంటి ఫెసిలిటీస్ ఏమీ లేవు.  పైగా ఇంకాస్త అరణ్యం.  కొండ దిగుతూనే  వాట్సన్ విల్లే ఊరు ఇప్పుడు స్పష్టం గా దిగువన కనిపిస్తూంది. అంతా నిలువుగా పంటలతో వందలాది ఎకరాలు చీలికలు గా విచ్చుకున్న భూమి. మా ఊరికి రైతు బజారుకు  కూరగాయలు ఇక్కడి నుంచే వస్తాయి దాదాపుగా అన్నీ.   దారిలో కనబడ్డ చోట కూరగాయలు చూసుకుంటూ వచ్చేటప్పుడు పూర్తిగా సముద్రపు ఒడ్డు నుంచి ఇంటికి వెళ్దామని బయలు దేరేం.  దారిలో మంచి పెద్ద స్ట్రా బెర్రీలు కొనుక్కుని తిన్నాం. సముద్ర  తీరం నుంచి ప్రయాణం అంటే అంతా చుట్టి వెళ్లడమే.  దగ్గర దారేం కాదు.  అలా గంటన్నర లో ఇంటికి వెళ్లాల్సింది. ఆరేడు గంటలు నెమ్మదిగా ప్రయాణం చేస్తూనే ఉన్నాం.
గర్ల్స్ స్కౌట్ కేంపు:  దారిలో  బీచ్ లో పాపాయిని  కాస్సేపు ఆడుకో నిచ్చి మా వరు కేంపు ప్రాంతానికి నాలుగు గంటలకు వెళ్లేం.  బయటంతా ఆ రోజు కాస్త మబ్బుగా ఉంది. ఇక వీళ్ల కేంపు కి వెళ్లే సరికి ఎత్తైన చిక్కని చెట్ల మధ్య పరుచుకున్న పచ్చని చలి, చెట్ల ఆకులు ఆకాశాన్ని మూసేస్తున్న చీకటి. చుట్టు ఎత్తైన చెట్ల మధ్య పెద్ద పెద్ద నాలుగైదు షెడ్లు ఉన్నాయి.

పిల్లలంతా గోలగోల గా మంటకు బేచ్ ల వారీగా చలి కాగుతూ చుట్టూ ఏవేవో ఆటలు ఆడడం చేస్తున్నారు.  మమ్మల్ని  అక్కడ హఠాత్తుగా చూసి ఆశ్చర్య పోయింది వరు. ఆ పిల్లని చూసి మేం ఆశ్చర్య పోయేం ఎందుకంటే ఎప్పటినించో స్నానం చేయ్యనట్లు మట్టి గొట్టుకుపోయి,  రంగు రంగుల  బాచ్ రిబ్బను నుదుటికి అడ్డంగా కట్టుకుని పట్టుకెళ్లిన కోట్లు అన్నీ వంటి మీద వేసుకుని పొగ కంపు కొడుతూ ఉంది.  నాకు హకల్ బెరీఫిన్ ప్రత్యక్షమయ్యినట్లనిపించి నవ్వు వచ్చింది. వాళ్ల ట్రూపు లీడర్ మమ్మల్ని తీసుకెళ్లి  కాంఫు లో అంతా చూపించింది.  షెడ్దులో కిందన కాసిన్ని షీటు పరుపులు పరిచి ఉన్నాయి. అయినా పిల్లకో పరుపు గొప్పే మరి.  కంబైండ్ బాత్రూములున్నా స్నానం మాత్రం చేసే ఏర్పాట్లు లేవు. అయినా  రెండ్రోజులకు స్నానం అవసరం లేదని  వాల్ల అభిప్రాయమనుకుంటా.  ఇక భోజనాల  షెడ్డు దగ్గర వేళ్లాడుతున్న పళ్లాలు, కవర్ల లో బ్రెడ్డు, చీజ్, వండిన పాత్రల్లో తొంగి చూస్తున్న పాస్తా.  ఏదో అడవిలో హాస్టల్లో ఉన్నట్లు.  మేం మరో గంట ఉండి వెళ్లిపోతూ ఏమైనా తిందో లేదో అని వరుకు   జంతికల పాకెట్టు  కారులో నుంచి తీసి ఇచ్చాను.  ఆవురావురుమని అయిదు నిమిషాల్లో  అక్కడే ఖాళీ చేసేసింది పాపం.  మర్నాటి వరకూ వాళ్లు అక్కడే ఉండాలి. పిల్లని వదిలేసి తిరిగొస్తూంటే మనసెందుకో బాధగా మూలిగింది. అయినా గర్ల్స్ స్కౌట్ కాంపుకి పంపించి నువ్విలా దిగులు పడితే ఎలా అని సత్య అంటూన్నా నేను వెనక్కి తిరిగి చూస్తూనే ఉన్నాను. విధి లేక పిల్లల్ని హాస్టళ్లలో పెట్టి నలిగే తల్లిదండ్రుల కొనకంటి కన్నీళ్లన్నీ నా కళ్ల నిండి జలపాతమైంది మనస్సు. ఇక్కడ పిల్లలు కాలేజీ కి వచ్చే వరకూ బోర్డింగు స్కూళ్లకు పంపే సంస్కృతి ఇంకా విసృతంగా లేక పోవడం ఎంత మంచిదో అనిపిస్తుంది ఒకోసారి.  అయినా ప్రభుత్వ పాఠశాలలకున్న విలువ ఇక్కడ ప్రైవేటు పాఠశాలలకు లేదు.   వస్తూ వస్తూ మళ్లీ  శాంతాక్రూజ్ నుంచి చుట్టుకుని వచ్చాం. దారి పొడవుకీ సముద్రాన్నీ, అటవీ చిక్కదనాల్నీ, మలుపుల అందమైన రహదారుల్నీ పెనవేసుకుంటూ తిరుగు ప్రయాణం చేసాం.
………………….

Published in December , 2012 VIHANGA

(http://vihanga.com/?p=6123)

ప్రకటనలు
This entry was posted in నా కళ్లతో అమెరికా(Travelog) and tagged , , , , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s