నా కళ్లతో అమెరికా-16(లాస్ వేగాస్)

లాస్ వేగాస్ 

Dr.K.Geetha

Dr.K.Geetha

లాస్ వేగాస్ ప్రపంచ ప్రఖ్యాతమైన గాంబ్లింగ్ నగరం. కాలిఫోర్నియాకు ఆనుకుని ఉన్న నేవాడా రాష్ట్రం లో ఉంది.  కాలిఫోర్నియాలో ఉండే చాలా నిబంధనలు అక్కడ లేనందువల్ల అక్కడ చాలా స్వేచ్ఛగా జూదం, వ్యభిచారం, డ్రగ్స్ వంటివి నడుస్తూ ఉంటాయి. ఇక్కడ జూదం ఆడేందుకు అమెరికా మొత్తం మీద నుంచి జనం కుప్పలు తెప్పెలుగా వస్తూ ఉంటారు.  కొందరు వినోదం కోసం, కొందరు అలవాటుగా, మరి కొందరు ఏమీ తోచక, మరి కొందరు సులభంగా డబ్బు సంపాదన అనే అపోహతో ఇలా రకరకాలుగా అక్కడకు చేరుతుంటారు. ఇక మా లాంటి వాళ్లు అసలక్కడ అంత గొప్ప ఏముందో చూడడానికి వెళ్తూ ఉంటారు.
ఇలా వచ్చి ఇక్కడ జూదం ఆడడానికోసమై కొందరు జీతం లో నుంచి ప్రతి నెలా కొంత సొమ్మును  దాచి మరీ వచ్చి వినోదిస్తారట.
ఇక ఇక్క డి కాసినోల గురించి చెప్పనవసరం లేదు. సందర్శకుల్ని  ఆకర్షించడానికి అత్యాధునికమైనవెన్నో వింతలు, విచిత్రాలు కనిపింపజేస్తాయవి.
వెరసి చాలా మంది మాటల్లో జీవితం లో ఒక  సారైనా చూడవలసిన గొప్ప నగరం.
మరదేవిటో చూడాలి కదా-

నగర సాక్షాత్కారం:

డెత్ వాలీ నుంచి సరాసరి రాత్రి పదకొండింటికి లాస్ వేగాస్ లో అడుగుపెట్టాం. దాదాపు పదిమైళ్ల దూరం నుంచే ధధగధలాడుతూ ఎడారి మధ్య మెరిసే లైట్లతో విశాలమైన గొప్ప మహా నగరం సాక్షాత్కరించింది.
లాస్ వేగాస్ రాత్రి నగరం.  రాత్రికే ఉన్న ప్రత్యేకించిన అద్భుత సౌందర్యాన్ని మేనలదుకున్న నగరం.  విశ్రాంతికి, ఆనందానికి, ఆహ్లాదానికి చిరునామా.   భూమి మీద రాత్రుళ్లు లేకుంటే జీవనాలు ఎంత అసంపూర్ణం గా ఉండేవో.  అటువంటి రాత్రుళ్లని పరిపూర్ణ దేదీప్యమానం చేసే ప్రత్యక్ష భూలోక స్వర్గం లాస్ వెగాస్.
నగరానికి పది మైళ్ల ముందు నించే వీధి దీపాలు రోడ్ల మధ్య దేదీప్య మానం గా ఉన్నాయి. నగరం లోని గొప్ప గొప్ప కాసినోల లోని విలాసవంతమైన ఏర్పాట్ల వల్ల కళ్లు జిగేల్మనిపించేలా నగరమంతా ఏదో పండుగ వాతావరణం లాగా రకరకాల లైట్ల ఆకారాలు, ఆకాశం లో కను చూపు మేర ప్రకాశవంతమైన వెల్తురు మాత్రమే కనిపిస్తూంది.  ఎంత కేవలం కృత్రిమ సౌందర్యమైనా నగరం మొత్తం ఇలా ధగధగలాడుతూ కనిపించడం చూడడానికి భలే బావుంటుంది.  అదేవిటో భూలోక స్వర్గం లోకి అడుగుపెట్టినట్లు- నిజమే మరి- అక్కడ డబ్బును విలాసం గా ఖర్చుపెట్టేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి.
మేం పెట్టే బేడా హోటల్ లో పడలేసి బయటకు బయలు దేరేం. చిన్న పిల్లలతో  బయట తిరిగే ప్రదేశం కాదనీ, కేవలం పద్ధెనిమిదేళ్లు నిండిన వాళ్లు మాత్రమే వెళ్లగలిగిన ప్రదేశమనీ వగైరా రివ్యూలేవో ఆన్ లైన్ లో చదివి కొంత జంకుతూనే పిల్లల్ని బయటకు తీసుకెళ్లేం. అయితే అక్కడి ప్రతి ప్రదేశం లోనూ పిల్లల్ని తీసుకుని తిరుగుతున్న వాళ్లు ఎంతో మంది కనబడ్డారు.

మామూలుగానే ఈ దేశంలో అన్ని ప్రాంతాల లోనూ మనుషులు చిన్న చిన్న బట్టలు వేసుకుని అర్థ నగ్నంగా తిరగడం, పబ్లిక్ ప్లేసెస్ లో ముద్దులు, కౌగిలింతలు వంటివి ప్రదర్శించడం మామూలే. నగ్నత్వాన్ని చూసీ చూసీ క్రమంగా పట్టించుకోని స్థితికి వచ్చేస్తాం.

ఇక నగ్నత్వమనే సహజత్వానికి అలవాటు పడిన ప్రదేశాల్లో పిల్లల్నించి మనం దాచేదీ, కొత్తగా కాపాడేదీ ఏముంటుంది గనక? ఆరుబయట తిరుగుతున్నపుడు అందునా ఇలాంటి ప్రదేశానికి వచ్చినపుడింక తప్పని సరి.
అయితే  పిల్లల కోసం ప్రత్యేకంగా కేసినోలు   కొన్ని నిబంధనలు పాటించడం ముదావహం. ఇక్కడ పిల్లల్ని కాసినోల లోపల  పెద్దవారి జూదపు ప్రదేశాలలో  ప్రవేశించడానికి అనుమతినివ్వరు. పిల్లలకు ప్రత్యేకించిన విభాగాలకు, అక్కడున్న కాసినోల లో ప్రత్యేకమైన ఆకర్షణను చూడడానికి ఎవరైనా వెళ్ళొచ్చు.

ఇక పిల్లలకే ప్రత్యేకమైన సర్కస్ సర్కస్ వంటి కాసినోలు, షోలు, ఎంటర్ టైన్ మెంట్లు  ఉండనే ఉన్నాయి.

https://picasaweb.google.com/104256037410703377895/NaaKallatoAmerica16LasVegas?authkey=Gv1sRgCOXHuZvBqcq0oAE&feat=flashalbum#5825009903786844418

స్ట్రాటో స్పియర్ :

ముందుగా మేం Stratosphere   అనే కాసినో కం హోటల్ కి వెళ్లాం. అక్కడ ఆ కాసినోకి ఉన్న 113 అంతస్థుల ఎత్తు నించి మొత్తం నగరాన్ని చూడగలిగే అవకాశం  ఉండడం ఒక ప్రత్యేక విశేషం. అమెరికా మొత్తం మీదే ఇదే  ఎత్తైన observation Deck అట అది.  అక్కడికి వెళ్లడానికి వెళ్లే లోగా విపరీతమైన మేకప్పులు, రకరకాల ఎబ్బెట్టుగా కనిపించే వస్త్ర ధారణలతో  ఉన్న కిటకిటలాడే వరండాలు, లిఫ్ట్లు మధ్య నుంచి వెళ్లడం తప్పని సరి.  ఇక మధ్య కనబడే మెషీన్ల దగ్గర ఎక్కడా పిల్లలతో ఆగడం నిషిద్ధం. ఎక్కడికక్కడ మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. అసలదేమిటో ఆడి చూడాలంటే పిల్లలని వదిలి రావాల్సిందే.
ముందుగా మేం టవర్ చూసేందుకెళ్లాం. దానికి ప్రత్యేకంగా 20 డాలర్ల వరకు టిక్కెట్టు ఉంటుంది.  అయితే 113 అంతస్థులు పైకి లిఫ్ట్ వెళ్లడానికి ఒక నిమిషం కంటే తక్కువే పట్టడం విశేషం. అసలు మనం ప్రయాణిస్తున్నామన్న స్పృహ కలగనంత వేగంగా వెళ్లే అత్యాధునికమైన లిఫ్ట్ అది.  చివరి అంతస్థులో మొత్తం చుట్టూ అద్దాలు బిగించి ఉన్న రివాల్వింగ్ రెస్టారంట్ కం అబ్సర్వేషన్ డెక్ ఉంటుంది.  దానికి ఒక పక్కగా బయటికి వెళ్లే దారి కూడా ఉంటూంది.  అయితే బాగా విసురుగా గాలి ఉండడం వల్ల అంత ఎత్తులో బయట గడపడం ఆహ్లాదంగా అనిపించలేదు. పైకి వెళ్లగానే ఆ అద్భుత దృశ్యాన్ని చూసి ఎవరైనా కేరింతలు కొట్టక మానరు. ఒక దేదీప్యమైన గెలాక్సీ లోని నక్షత్రాలన్నిటినీ వంద అంతస్థుల పై  నించి చూస్తున్నట్లు అనిపిస్తుంది.

మొత్తం నగరం లోని తళుకులన్నీ అత్యాధునికంగా సాష్టాంగ ప్రమాణం చేస్తున్నట్లు  గోచరిస్తాయి.  మేం మాకు తెలీకుండానే దాదాపు గంట సేపు అక్కడే గడిపేసాం.  వాలుగా ఉన్న అద్దం మీద కూర్చుంటే కింద చీమ తలకాయల్లా నడిచెళ్లే మనుషులు, బొమ్మ కార్ల లా భ్రమింప జేసే కార్లు, బొమ్మరిళ్ల ప్రమాణంలో ఉన్న పెద్ద పెద్ద భవంతులు భలే తమాషాగా కనిపిస్తాయి. ఇక   అంత ఎత్తు లో ఉన్నామన్న విషయం మాత్రం తలతిప్పి వేస్తుంది. అక్కడి నుండి కిందికి దుమికే free fall  ఉందని ఉత్సాహంగా గంతులేసారు పిల్లలూ, తనూ.  అయితే నా అదృష్టం కొలదీ ఆ రైడ్ పనిచెయ్యట్లేదని చెప్పారు వాళ్లు.  వీళ్లకి నిరుత్సాహంగా అనిపించినా నేను తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను.  అంత ఎత్తు నుంచి చూడడమే భయంగా అనిపిస్తుంటే  ఏకంగా దూకడమే.  ఎన్ని తాళ్లు కట్టినా “అదేం సరదా”  రైడ్ అని నాకు భలే విసుగనిపించింది.

మేం సమయాభావం వల్ల ఒకటి రెండు మాత్రమే చూడాలని నిర్ణయించుకున్నాం.  ఇక షాపింగు మాల్ లు,  ATM మెషీన్లకు కొదవ లేదు.  అలా అన్ని విద్యుద్దీపాలు అలా ఒక రాత్రి లో వెలిగించడానికయ్యే ఖర్చుతో ప్రపంచం లో చాలా దేశాలలో ఆకలిని తీర్చొచ్చనుకుంటా. అత్యాధునికమైన ఇలాంటి కేసినోలు మనుషుల్ని ఎటు తీసుకెళ్తున్నాయి?   అనిపించకమానదు.  ధనం, విలాసం, విచ్చలవిడితనానికి ప్రోత్సాహం లాంటివన్నీ  ఇచ్చే  ఈ కాసినోలు ఇచ్చే  డబ్బు బాగా సంపాదించినవాళ్లు మరింత సంపాదించడానికి  కట్టినవి, నడుపుతున్నవీ .  అందులో డబ్బు సంపాదించడం మాట అలా ఉంచి పోగొట్టుకునే వారు మాత్రం సగటు మధ్య తరగతి మనుషులే.
విలాసం అనేది మనిషి లోని ఒక ఆశా పార్శ్వం. ఈ దేశం లో సరిగ్గా అలాంటి ఒక పార్శ్వాన్ని సొమ్ము చేసుకునే నగరమే లాస్ వెగాస్.  చాలా మందిని ఏ నగరం ఇష్టమని అడిగితే తడుముకోకుండా లాస్ వెగాస్ అని చెప్తారు.  మనుషుల్లోని ఏవో తెలీని  బలహీన  కోణాల్ని సంతృప్తి పరిచేవెన్నో అక్కడుండమే కారణం.
నిజానికి అక్కడ ఇలా కృత్రిమత్వమే లేకపోతే పచ్చని చెట్టు లేని దుర్భర ఎడారి అదంతా.

Las Vegas Strip:

అర్థరాత్రి దాటిపోయినా కనురెప్పల మీద నిద్ర రావడం లేదెవరికీ. తెల్లారగట్ల మాకు నిద్రొచ్చే వరకూ  బయట తిరుగుతూనే ఉన్నాం.  స్ట్రాటో స్పియర్   లో పిల్లలతో వెళ్లగలిగిన ప్రదేశాలు ఇంకేమీ లేక పోవడం వల్ల  బయటికి గంట లో వచ్చి ఊరికే షాపింగ్ సెంటర్లు, రోడ్ల వెంబడి విచిత్ర వేషాలతో తిరిగే మనుషులు, ధగ ధగా మెరిసే లైట్లు,  భవంతులు చూస్తూ తిరిగాం.

దక్షిణ లాస్ వెగాస్ బొలేవార్డ్  లోని  నాలుగున్నర మైళ్ల ప్రాంతాన్ని  “Las Vegas Strip” అని పిలుస్తారు.  ఇక్కడే ప్రపంచంలోనే పెద్దవైన మొదటి 15 హోటళ్లు ఉన్నాయి. అందులో అన్నిటి కంటే పెద్దది  8000 గదులు కలది. విచిత్రం ఏమిటంటే  అంత పెద్ద హోటళ్లైనా అతి తక్కువ ధరకు రూములు కూడా దొరుకుతాయి. సెలవులు, వారాంతాలు కాని సమయం లో ఈ హోటళ్లలో మూడో వంతు ధరకు రూములు దొరుకుతాయి. ఒకో చోట ఒక మనిషి ఉండడానికి 25 డాలర్లకు కూడా ఉంటాయి.  నిజానికి ఆ ధర వాళ్లకేమీ లాభదాయకం కాదు. కానీ అన్ని హోటళ్లకు స్వంత కాసినీలు, బార్లు ఉంటాయి. గది అద్దెకు తీసుకున్న వాళ్లు అక్కడ కాసినోల లోనూ, బార్ల లోనూ పెట్టే ఖర్చు తో వాళ్లకు లాభాలు వస్తాయట.
ఇక  “సర్కస్ సర్కస్” కాసినో లో పిల్లల కోసం ప్రత్యేక రైడ్లు, షోల తో పాటు సంవత్సరం  పొడవునా ఉండే సర్కస్ షో ఉంటుంది.  అతి పెద్ద హోటల్,  కాసినో వెనీషియన్  బయట  అసలు యూరప్ వెనీస్ ను తలపించే విధంగా, బోట్ షికారు, వంతెనల కింద నుంచి కాలువల్లో ప్రయాణం మొ.వి ఉంటాయి. ఇక్కడ కాసినోల బయట సందర్శకుల్ని విశేషంగా ఆకర్షించే రకరకాల మోడల్స్లో ఎంట్రెన్సులు ఉండడం విశేషం. అతి పెద్ద గిటార్, అతి పెద్ద వాటర్ ఫౌంటెన్లు,  నిత్యం రగిలే అగ్ని పర్వతం , ఈఫిల్ టవర్,  న్యూయార్క్ సిటీ,  స్టాట్యూ అఫ్ లిబర్టీ మొ.న ఎన్నో ఆకర్షణలు నిలువెత్తు లైట్ల అలంకరణలతో  వెలుగుతూ జనాన్ని విపరీతం గా ఆకర్షిస్తాయి. ఇన్ని కాసినోలు లాభాలతో నడుస్తున్నాయంటేనే ఇక్కడ జూదం మొ.న వ్యాపారాలు ఎంత జోరుగా జరుగుతున్నాయో ఊహించుకోవచ్చు.

అసలా మెషీన్లు ఎలా పని చేస్తాయో వాటిలో వ్యామోహం ఏం ఉందో చూడడానికి మేం ఇక్కడ సాహసం చెయ్యలేదు. కానీ ఆ అనుభవం రీనో అనే మరో ఊర్లో కలిగింది.  ఆ విషయం మరో సారి చెప్తాను. అలా లాస్ వెగాస్ వెళ్లి జూదం ఆడకుండా వచ్చిన వాళ్లం మేమేనేమో. అయినా పిల్లలతో సర్దాగా, హాయిగా  గడప గలిగేం.  కంటికి ఇంపు నిచ్చే లైట్ల కాంతిని చూస్తూ  గడిపేం.
నా వరకూ నాకు లాస్ వేగాస్ లో ఇంక ఇంత కంటే ఆనందం మరేదీ కనిపించలేదు.
రాత్రంతా బయటే తిరగడం వల్ల ఉదయానే ఎవ్వరం లేవలేక పోయాం.  దాదాపు మధ్యాహ్నం సమయం లో భోజనాలు కానిచ్చి పగటి వీధుల్ని అలా కారులోనే చుట్టుముట్టేం. రాత్రి చూసిన సౌందర్య మంతా మాయమై వెల్వెల బోతున్నట్లు కనిపించింది లాస్ వెగాస్.  రాత్రి అలిసి సొలసి పగటి పూట మాలాగే బద్ధకంగా నిద్రలేచినట్లు అప్పుడప్పుడే బయటకు వస్తున్న పల్చని జనం.
అసలిది అదే నగరమా అనేంత తేడా కనిపించింది. ఎవరో ఈ నగరాన్ని రాత్రి కోసం ముస్తాబు చేసి పగటి పూట అప్పటికప్పుడు ఊరు వదిలి వెళ్లిపోయినట్లు, అంత వరకూ అందమైన నగరం ఏదో శాపానికి గురైనట్లు అనిపించింది.

హూవర్ డ్యాం:

 ఇక మేం పగటి పూట దగ్గర్లో ఉన్న హూవర్ డ్యాం చూడడానికి పెట్టుకున్నందువల్ల మరలా ఇండోర్ కాసినోల లో గడప దల్చుకోలేదు.  లాస్ వేగాస్ నుంచి ఇంకాస్త తూర్పు  దిక్కుకి వెళ్తే వస్తుంది హూవర్ డ్యాం. చాలా సినిమాల్లో మేం ఈ డ్యాం ను ఇప్పటికే చూసి ఉన్నాం. చాలా హాలీవుడ్ సినిమాల్లో విలన్ ఒక చెయ్యి పట్టుకుని మనిషిని వేలాడ దీసి ఈ డ్యాం పై నుంచి కిందకు పడెయ్యడం చూసేం.  ఇక నిన్నా మొన్నటి ‘Trasnformers”  సినిమా లో డ్యాం సీన్లన్నీ ఇక్కడ తీసినవే.
ప్రతీ సంవత్సరం మిలియను మంది ఈ డ్యామును సందర్శిస్తారట.

హ్యూవర్ డ్యాం నెవాడా, ఆరిజోనా రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న Black canyon  కొండల్లో కొలరెడో  నది మీద 1931, 36 ల మధ్య నిర్మించబడింది.
ఫ్రీవే మీద నుంచి డ్యాం కు వెళ్లే పక్క తోవలో రద్దీ ట్రాఫిక్ ఉండడం, వాహనాల చెకింగుల వల్ల పది  నిమిషాల్లో వెళ్లే దారి లో అరగంట పైనే పట్టింది.  దూరం నుంచి ఇక అసలు డ్యాం ను ఆనుకుని ఉన్న రోడ్ బ్రిడ్జ్ ఒక పక్కగా అద్భుతంగా రెండు కొండల మధ్య  ఆకాశాన్ని రెండు ముక్కలు చేసి ఊగులాడని  తిన్నని తాళ్ల వంతెనతో కట్టినట్లు  తల ఎత్తి చూస్తే గొప్ప ఎత్తులో గంభీరంగా కనిపిస్తుంది. పార్కింగు కూడా కొండను దొలిచి కట్టినట్లు ఉంటుంది. అక్కడి నుండి నడిచే చిన్న రహదారి  కొండ లోపలికి ఒక పక్కగా ఉంటుంది.  డ్యాం కు నడిచి వెళ్లే మార్గంలో డ్యాం కట్టే నిర్మాణ సమయం లో అసువులు బాసిన 112 మందికి నివాళి ఉంటుంది.  అందులో ఆస్కార్ హాన్సన్ మెమోరియల్ దగ్గర ” వాళ్లు ఎడారిని పుష్పింపజేయడానికి మరణించారు” అనే వాక్యాలు కన్నీళ్లు తెప్పిస్తాయి.  డ్యాం మీదకు నడిచి వెళ్లి చూడనిస్తారు. అంచు చివరికి వెళ్లి చూస్తే ఇంత  వరకు ఎన్నడూ చూడని లోతైన కట్టడం 726 అడుగుల దిగువన చూడగనే కళ్లు గిర్రున తిరిగినట్లవుతుంది.   దిగువన ఎక్కడో పవర్ స్టేషన్ కనిపిస్తూంటూంది. ఈ డ్యాం వల్ల ఏర్ఫడ్డ మానవ నిర్మిత సరస్సు “Lake Mead”  అమెరికాలో నే పెద్ద రిజర్వాయర్. “లేక్ మీడ్ ” డ్యాం కు మరో వైపు ముదురు నీలం రంగులో కనిపిస్తూ ఉంటూంది.

ఒక పట్టాన ఆ ప్రదేశాన్ని వదిలి రాలేని గొప్ప సౌందర్యం ఉంటుందక్కడ  ఎటు తల తిప్పినా.  పర్వతాలు, నదీజలాలు, ప్రకృతీ,  మానవ నిర్మిత అద్భుతాలు వరసగా సాక్షాత్కరించి  అబ్బుర పరుస్తాయి. రద్దీ బాగా ఉండడం వల్ల అదెక్కడో ఇండియాలో ఉన్న భ్రాంతి కలుగుతుంది.
హెలీకాప్టర్ రైడ్:  తిరిగొస్తూ మొదటి మలుపులో ఉన్న హెలీకాప్టర్ రైడ్ కు వెళ్లాం. ఖరీదు కాస్త ఎక్కువే అయినా,  పది, పదిహేను నిమిషాలే తిప్పి చూపించినా హెలీకాప్టర్ ఇంత వరకు ఎక్కని వారికి గొప్ప సాహస అనుభవం. హెలీకాప్టర్ లో నుంచి కింద కొండల మీద పక్షిలా గిరికీలు కొట్టి, కొలరెడో నదీ అలల మీద తూనీగలా అల్లల్లాడి, ఆనకట్ట కటూ ఇటూ వంపులు తిరిగి,  ఆకాశం లోకి ఎగిరి దుమికీ,  అద్భుత విన్యాసాలెన్నో ప్రత్యక్షం గా అనుభూతించి చప్పున తిరిగి, నేల వాలే గొప్ప ప్రయాణం.

అందులో ఉన్నంత సేపు ఏదేదో అరుస్తూనే ఉన్నాను సంతోషం  పట్టలేక.  ఏదో రెక్కలొచ్చిన గొప్ప అనుభూతి. చిన్న గాజు పక్షి హృదయం లో దాక్కుని భూమ్మీదున్నవన్నీ వీక్షిస్తున్న అనుభూతి.  భలే అనిపించింది  నిజంగా. మరపురాని గొప్ప అనుభవం అది నాకు. అప్పటి వరకూ హృదయం మాటున ఎప్పటి నుండో దాగుండి, గాలివాటున గిరికీలు కొట్టే పక్షి పై కలిగిన అసూయంతా ఆ క్షణం తర్వాత మాయమైంది.
డ్యాం ను అన్ని వైపుల్నించీ చూసిన అనుభూతి మనస్సులో సజీవంగా ఉండిపోయింది.
సాయం సంధ్య వెలుగులు ఉండంగానే మేం తర్వాతి బసకు చేరుకోవాల్సి ఉండడం వల్ల లాస్ వేగాస్ కు సెలవు తీసుకుని ఆరిజోనా రాష్ట్రం  వైపు ప్రయాణం సాగించాం. వేల నక్షత్రాలు  భళ్లున మెరిసే దేదీప్యమానమైన నగరాన్ని,  గొప్ప జలావేశం తో ఎగిసిపడే హూవర్ డ్యాం ను వదిలి.

                                                                                                                   – డా.కె.గీత

Published in February , 2013 VIHANGA

– ( http://vihanga.com/?p=7011)

ప్రకటనలు
This entry was posted in నా కళ్లతో అమెరికా(Travelog) and tagged , , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s