నా కళ్లతో అమెరికా-17(గ్రాండ్ కెన్యన్)

గ్రాండ్ కెన్యన్

కొన్ని ప్రదేశాలు, దృశ్యాలు కళ్లతో చూసే కంటే చిత్రాలలో చూస్తే బావుంటాయి. కొన్ని బొమ్మలలో, వీడియోలలో ఎక్కడ చూసినా తీరా నిజంగా చూసేసరికి విభ్రమాశ్చర్యానందాలకు గురవుతాం. సరిగ్గా ఈ రెండో కోవకు చెందిందే గ్రాండ్ కెన్యన్. ఒకప్పుడు తాజ్ మహల్ దగ్గర కలిగిన అద్భుత అనుభూతి. నేను చిన్నతనం నించీ లక్ష సార్లు చిత్రాలలో చూసుంటాను తాజ్ ని.  కానీ నిజంగా కళ్లతో చూసినప్పటి ఆ మహా స్వరూపాన్ని జన్మలో మర్చిపోలేను. ఆ గొప్ప అనుభూతిని ఏ నిమిషమూ కళ్ల ముందు నుంచి తీసేయలేను.

ఇక గ్రాండ్ కెన్యన్ అరిజోనా రాష్ట్రం లో మా ఇంటి  నుంచి దాదాపు 900 మైళ్ల దూరం లో ఉంది. ఏకబిగిన ప్రయాణం చేసినా పదిహేను గంటలు పడుతుంది. లాస్ వేగాస్ నుంచి మరో అయిదారు గంటలు పడుతుంది. మేం మా అత్త గారు వాళ్లు వచ్చినప్పుడు అవన్నీ చుట్టి వద్దామని బయలుదేరాం.

ప్రయాణం: లాస్ వేగాస్ నుంచి ఉదయమే బయలుదేరాం. ఒకే రోజు వెళ్లి మరలా తిరిగి రాత్రికి ప్రయాణం చెయ్యలేం కాబట్టి Grand Canyon దగ్గర్లో ఆ రాత్రికి బస చేయాలని నిర్ణయించుకున్నాం.  అయితే యూసోమిటీ లాగే గ్రాండ్ కెన్యన్ లో కూడా గ్రాండ్ కెన్యన్ విలేజ్ అని చెప్పబడే ఆ చుట్టుపక్కల మాకు బస దొరక లేదు. అందుకని అక్కడి  నుంచి వెనక్కి వచ్చే దారిలో Kingman అనే ఊరిలో హోటల్ బుక్ చేసుకున్నాం.

లాస్ వేగాస్ నుంచి పూర్తిగా ఆరిజోనా ఎడారి  లోపలికి వెళ్లే ఆ దారిలో కాసినో లు తప్ప మనుషులకు వేరే జీవనాధారమే కనిపించలేదు. ఎక్కడా పచ్చదనం కానీ, పంటల జాడ కానీ లేవు. ఇక చిన్న చిన్న ఊర్లు ఎక్కడో నూటేభై మైళ్ల కొకటి కూడా లేనంత తక్కువ గా ఉన్నాయి. ఒక రకమైన ఎర్ర మట్టి, ఉసూరుమంటూ బద్ధకంగా మెలికల పాము ముడుచుకుని పడుకున్నట్టు రోడ్లు, విసురు గాలికి ఊడి ఊగుతున్న చెక్క కట్టడాలు.

మేం కొత్తగా పెద్ద కారు కొనుక్కుని  ప్రపంచమంతా చుట్టి రావాలన్నంత ఉత్సాహం తో డ్రైవ్ చేసుకుంటూ పోతున్నాం. కానీ మాతో ఉన్న పెద్ద వాళ్లకు మాత్రం చిర్రెత్తుకొచ్చినట్లుంది. అమెరికా అని చెప్పి ఏదో సర్దా పడి వస్తే ఎంత సేపు చూసినా తరగని ఈ ఎడారి ఏమిట్రా భగవంతుడా అన్నట్లు…అసలు బయట కనబడేవేవీ చూడకుండా గుర్రు పెట్టి నిద్ర పోతూ కనిపించారు ఎప్పుడూ.    ఇక పిల్లలు ఎక్కడ కారు ఆపుతారా కిందకు దుముకుదాం అని పైకి చెప్పలేక అలా నిశ్శబ్దంగా కిటికీల్లోంచి బయటికి చూస్తూ ఉన్నారు.

ఏరియా 51మధ్యాహ్నం వరకూ ప్రయాణం చేసినా ఒక్క తినే చోటూ కనిపించదే. చివరికి ఒక పెట్రోలు పంపులో ఉన్న చిన్న దుకాణం లో ఏవో చిల్లర మల్లర కొనుక్కు తినాల్సి వచ్చింది. ఒక చోట దారి పక్కకు తిరిగిన చోట అమెరికా లో ఈ ఎడారిలో  ఎక్కడో రహస్యంగా ఉందని చెప్పబడే ప్రయోగ శాల “ఏరియా 51” కు ఇట్నించే వెళ్లాలని సరదా హోర్డింగులు కనిపించాయి.  అక్కడ జంక్షన్లో పిట్ట మనిషి లేని  రెస్ట్ రూముల దగ్గర దిగే సరికి మధ్యాహ్నం పూట విసురు చలిగాలి. మొత్తం ఇనుప కట్టడాలు.  చల్లని నీళ్లు. అక్కడ ఏమీ పనిచెయ్యక పోయినా పేపర్ రోల్స్ ఉండడం విశేషం. మా వరు బాత్రూముకి వెళ్లిందంటే గంట సేపు చెయ్యి కడక్కుండా బయటకు రాదు. అలాంటిది ఒక్క పరుగున వచ్చేసి కారెక్కింది. చుట్టూ కనుచూపు మేరలో  దగ్గర్లో ఏదో పెట్రోలు పంపు తప్ప ఏమీ లేదు. అక్కడి నుండి దాదపు ఇటు పది మైళ్లు, అటు పదిమైళ్లు రోడ్డు మాత్రమే  కనిపిస్తున్న స్పష్టమైన ద్ర్శ్యం. చుట్టూ నేలకు, పైని ఆకాశానికి మధ్య గోధుమ రంగు దాల్చిన దిగంతం.  మా కారుని దాటుకుని ఒకటో రెండో అటుగా వెళ్ళిన వాహనాల చప్పుడు తప్ప ఏమీ వినిపించని నిశ్శబ్దం. అలాంటి చోట కారు ఆగిపోతే అన్న ఊహ కే భయం వేసింది నాకు. త్వరత్వరగా  కారెక్కాం. ఆ సాయంత్రం లోగా మేం గ్రాండ్ కెన్యన్ వెళ్లాల్సి ఉంది.

ఇంకా వందలాది మైళ్లు ముందుకి వెళ్లాలి. కింగ్ మేన్  చేరుకునే సరికి మూడున్నరైంది. సమయాభావం వల్ల పెట్రోలు కొట్టించుకుని ఇక హోటలుకి వెళ్లకుండా  గ్రాండ్ కెన్యన్ వైపు కారుని పోనిచ్చాం. దారిలో విలియమ్స్  నుంచి ఇక పూర్తిగా ఘాట్ రోడ్డు ప్రారంభమైంది. అయినా పెద్దగా చెట్టూ పుట్టా లేదు.  కొండలు ఎక్కడమే పర్యంతంగా ఉంది.

https://picasaweb.google.com/104256037410703377895/NaaKallathoAmerica17GrandCanyon?authkey=Gv1sRgCKfUponBkqv4qQE&feat=flashalbum#5847103632070413698

గట్టి రాతి కొండలు. ఒక రకమైన ఎరుపు రంగు దుస్తులు వేసుకున్నట్లున్న అందమైన నేల.  గ్రాండ్ కెన్యన్ విజిటింగ్ సెంటర్ కు మేం చేరేసరికి అయిదు కావచ్చింది.  అదృష్టం కొద్దీ మేం వెళ్లింది వేసవి కావడం వల్ల ఆ రోజు సన్ సెట్ ఎనిమిదిన్నరకి. పార్కు లోకి కారు ప్రవేశించడానికి $25 రుసుము చెల్లించాలి. సౌత్ రిం గా పిలువ బడే దక్షిణ ప్రాంతంలో టూరిజం డెవలప్ చేసిన ప్రాంతాన్ని  గ్రాండ్ కెన్యన్ విలేజ్ అని పిలుస్తారు.  అక్కణ్ణించి దాదాపు 17 వ్యూయింగ్ పాయింట్లు ఉంటాయి.  మొదట్లో ఒకట్రెండు కారు పార్కు చేసుకుని కొంత దూరం నడవాల్సినవి. చివరగా వచ్చే స్టాపు లో నుంచి ఫ్రీ బస్సు టూర్ ఉంటుందని తెలిసి మేం అటుగా దారితీసాం. అసలు అక్కడి నుంచి పైవేటు వాహనాలని అనుమతించరు. వాళ్ళు పంపే బస్సులో వెళ్లడం ఒక్కటే మార్గం. అయితే అనుకోకుండా మబ్బు మూయడం మొదలెట్టింది. పైగా దగ్గర్లో పార్కింగు దొరకలేదు. కారుని పార్కు చేసుకుని బయటికి అడుగు పెట్టేసరికి చేతులు కొంకర్లు పోయేలా చలి గాలి వీయడం మొదలైంది.   వేసవిలోనే ఇలా ఉంటే ఇక శీతాకాలపు పరిస్థితి ఇక ఎలా ఉంటుందో అనిపించింది. మేం వేసవి కదా అని పెద్దగా కోట్లు గట్రా వేసుకోలేదు. బస్సు ప్రతి పాయింట్ లోనూ రెండు నిమిషాల చొప్పున ఆగుతూ మరలా బయలుదేరుతుంది. క్షణాల్లో దిగి అటూ ఇటూ చూసి తిరిగి ఎక్కేస్తూ ఉండాలి.

ఒక రెప్పపాటు ప్రయాణంలా ఆ సాయంత్రం చలిగాలిని మహోధృత పర్వత లోయల్లో ఇరుక్కున్న మనస్సు అవలీలగా అధిగమించేసింది. మొదటి స్టాప్ లో బస్సు ఇలా దిగగానే “నాకు రెక్కలు ఉండి ఎగరగలిగితే ఎంత బావుణ్ణు” అన్నాడు మా కోమల్ అప్రయత్నంగా.   ఎప్పుడూ నిశ్శబ్దంగా అన్నీ పరికించే సత్య నిగూఢంగా అటే చూస్తూ స్థాణువులా ఉండిపోవడాన్ని గమనించేను. ఇక నా పరిస్థితి చెప్పాలా? దిగువనెక్కడో రేఖా మాత్రంగా పారుతున్న  కొలరెడో వంపుల వయ్యారాలు ఆ పైన ఒక్కో మెట్టూ ఆకాశానికి ఎక్కడానికన్నట్లు ఒకప్పటి నదీ జలాల్తో  చేతులు కలిపి గాలి కళ్లగంతలాడినట్లు స్పష్టమైన రేఖల ఆనవాళ్లు. భూమీ ఆకాశం పోటీలు పడే చోటికి ఎదిగిన భూకంప ప్రభావ మహోన్నత పర్వత శిలా శిఖరాలు.  ఇవన్నీ శిఖరమ్మీంచి కిందకు కనిపించే దృశ్యాలైనప్పుడు వెల్లువయ్యే మనస్సుని విహంగం అనడం కంటే ఉత్తుంగ తరంగం అంటే బావుంటుందేమో!

సహజ సిద్ధమైన రాళ్లలో ఇంత సౌందర్యం ఉంటుందని నేనెప్పుడూ ఊహించలేదు. జీవితంలో ఒక్కసారైనా గ్రాండ్ కెన్యన్ చూసి తీరాల్సిందే అనిపించక మానదు ఎవరికైనా.

ఇంకా అక్కడ నుండి మరో  వైపుగా ప్రయాణించి ఉత్తర ప్రాంతం నుంచి కూడా గ్రాండ్ కెన్యన్ని దర్శించొచ్చట. అంతే కాకుండా దిగువ కొలరెడో లో రివర్ రాఫ్టింగ్ కూడా కొంత పరిమిత పర్మిషన్ తో  చెయ్యొచ్చు. ఇంకా ఔత్సాహికులు కొండలు అధిరోహించడం, లోయలు చుట్టి రావడం కూడా చేస్తూ ఉంటారట.

మొత్తం 277 మైళ్ల పొడవు, 18 మైళ్ల వెడల్పు కలిగిన  గ్రాండ్ కెన్యన్  అంతా ఒక రోజు లో చూడడం సాధ్యమయ్యే పని కాదు. అయినా ఎక్కడా చెట్లు లేకపోవడం వల్ల కనుచూపు మేర కనిపించేది బహుశా: పది మైళ్లయినా ఉంటుంది. వంపులు తిరిగి ఉన్నందువల్ల గొప్ప దృశ్యం కనబడే ప్రతి మలుపు లోనూ బస్సు ఆపుతారు.

మా అదృష్టం కొలదీ బస్సు ఇలా బయలుదేరి రెండు మూడు మలుపులు తిరగగానే  మబ్బు వీడి  ఒక సంధ్య వెలుగు కాస్సేపు ప్రకాశించింది.  నారింజ రంగు కాంతి వెదజల్లుతూ ఒక గొప్ప వెలుగు లోయంతా ప్రసరించింది. అందులో అప్పుడే  భూమి నుంచి ఉద్భవించిన కణ కణ మండే కాషాయ రంగు అగ్నిశిఖల్ని ఒళ్లంతా అడ్డంగా విభూతి రేఖల్లా రాసుకున్నట్లు మెరిసే మహోగ్ర పర్వత శిఖరాలతో గ్రాండ్ కెన్యన్ సాక్షాత్కరించింది. ఆ దృశ్యం చూడగానే హోరు మంటూ ముసిరిన జన్మాంతర జ్ఞాపకాలు గుండెని పిండినట్లయ్యి  కంట నీరు అప్రయత్నంగా కమ్మింది. ఆ మహో లోయలోకి అమాంతంగా రెక్కలు సాచుకుని దూకాలనిపించింది. అలాగే కొండ దిగువన మురిపిస్తున్న కొలరెడో పరవళ్లని ఇంచు మించు స్పృశిస్తూ ముక్కు కొనకు నదీ కెరటాలని తగిలించుకుని పర్వత రేఖల్ని ఒక్కోటిగా తడుముతూ లెక్కలేనన్ని మలుపుల్లో గిరికీల ఆనందతాండవం చేసి ఆకాశం లోకి దూసుకెళ్లి ఆ అద్భుత శిఖరాన్ని దర్శించాలనిపించింది.

ఒక్కోసారి మనసంతా అల్లకల్లోలంగా ఏవేవో పదాలు స్ఫురిస్తున్నా నోటమాట రాని ఒక మౌనం చుట్టుకుంటుంది. గ్రాండ్ కెన్యన్ చూస్తున్నంతసేపు అదే పరిస్థితి. చుట్టూ ఎవరెవరో ఏదేదో ప్రశ్నలు వేస్తున్నా, పిల్లలు అదేమిటి, ఇదేమిటి అనడుగుతున్నా, చంటి పిల్ల కేర్ మని ఏడుస్తున్నా శరీరం మాత్రమే అక్కడ మిగతా వారితో కట్టెలా తిరుగుతూ ఉంటుంది. మనసు వారందరి మధ్య నుంచి విడిపడి మరెక్కడో సంచరిస్తూ ఉంటుంది.

ఆ లోయలో ఒకప్పుడు నివసించిన గిరిజనుల మౌన సాక్ష్యంగా మిగిలిన ధాన్యాగారాల గురించి,  డ్యాం నిర్మాణం వల్ల రూపు మారిన నదీ పరీవాహ ప్రాంతాల గురించి, గిరిజనులు పోరాడి గెల్చుకున్న హక్కుల గురించి, పంటలతో అలరారే నదీ పరీవాహ ప్రాంతాలు రాతి తీరాలలో మునిగి పోయిన ఆకలి దు:ఖం గురించి ఎక్కడెక్కడో చదివిన దు:ఖమో, లేదా కనిపించే అందమైన దృశ్య పారవశ్యపు  పులకింతో తెలీదు గానీ అక్కడ తిరిగినంత సేపు నిశ్శబ్దం ఆవరించింది నన్ను.

“మళ్లీ ఇక్కడికి వచ్చి కనీసం మూడు రోజులైనా ఉండాలి ” అన్నాడు సత్య. అప్రయత్నంగా తలూపాను. అవును గ్రాండ్ కెన్యన్ ఒక్కసారి చూస్తే ఎవరికీ తనివి తీరదు.

చీకటి ముసురుతూండగా వెనుతిరిగి ప్రయాణమయ్యాం. విలేజ్ సెంటర్ దాటి రోడ్డు మలుపు తిరగగానే ఇంకేమీ కనిపించదు. ఆ వెనుక అంతటి మహా లోయ ఉందని కూడా తెలీదు. కాస్సేపు కళ్లు మూసుకుని అదే మన:స్థితి లో ఉండడం చూసి సత్య డ్రెవింగ్ నేను చేస్తానని తీసుకున్నాడు. తిరిగి కింగ్స్ మేన్ కి మరో మూడు గంటల్లో వచ్చేసేం. రాత్రి భోజనాలు గా కాసిన్ని పళ్లతో, బిస్కెట్లతో సరిపెట్టుకున్నాం.

ఇక అప్పుడు గుర్తొచ్చింది. ఆ మర్నాడు సాయంత్రానికి తప్పనిసరిగా ఇల్లు చేరాలన్న విషయం. ఆ మర్నాడు కోమల్ కి పరీక్ష  ఉంది.

మర్నాడు ఉదయం మేమందరం ఆరిజోనా కి వీడ్కోలు చెప్పి కాలిఫోర్నియాకు బయలుదేరాం. నేను గ్రాండ్ కెన్యన్ దిక్కుగా ఓ సారి చేయూపి వీడ్కోలు తీసుకున్నాను. ఆకాశంలో ప్రకాశవంతమైన వెల్తురు మీంచి నా వీడ్కోలు హస్తాన్ని తాకి బయలుదేరిన గాలి ఎప్పటికైనా ఆ లోయల్లో గిరికీలు కొట్టి మరలా నన్ను చేరుతుందనే నమ్మకంతో.

ఆ రోజు ఆదివారం కావడం వల్లనూ, మేం మధ్య మధ్య ఆగుతూ రావడం వల్లనూ, మరలా లాస్ వేగాస్ ను చుడ్తూ రావడం వల్లనూ, విపరీతమైన ట్రాఫిక జాముల వలనా మేం రావాల్సిన దానికన్నా మరో తొమ్మిది గంటలు ఆలస్యంగా అంటే 900 వందల మైళ్లు దాటి ఇల్లు తెల్లారగట్ల నాలుగింటికి చేరుకున్నాం. దాదాపు రాత్రి పన్నెండూ దాటాక నేను డ్రైవింగ్ మొదలు పెట్టాను. నిద్ర కళ్ల మీద పడ్తున్న ఆ చీకట్లో రహదారి కనబడని కనురెప్ప మూతలు ఒకో క్షణం. అంతలోనే కారు లో నిద్రపోతున్న వాళ్లందర్నీ సురక్షితంగా చేర్చాల్సిన బాధ్యత మేల్కొలిపే ఉలికిపాటు. చివరి గంట డ్రైవ్ చెయ్యలేక ఫ్రీవే పక్కనే ఆపుకుని  నిద్రపోదామనిపించింది. సత్య కాస్సేపు పడుకుని ఇక తను డ్రైవింగ్ తీసుకున్నాడు. ఒకే రోజులో దాదాపు 20 గంటలు డ్రైవ్ చేసి  విపరీతంగా అలిసి పోయినా ఆ డ్రెవ్ మాకు గొప్ప ఛాలెంజ్ గా మిగిలిపోయింది. తెల్లారి ఏడు గంటలకే పరీక్షకు వెళ్లాల్సిన కోమల్ ఇక నిద్రపోకుండా పుస్తకాలు ముందేసుకుని కూర్చున్నాడు. ఇక మా పరిస్థితి మాకే తెలీదు మంచంమీద పడింతర్వాత మర్నాడు పదిగంటలయ్యినా లేవలేకపోయాం.  ఎర్రటి నా కళ్లు చూసి బాగా నవ్వడం మొదలు పెట్టింది వరు. అద్దంలో నా ముఖం చూసుకుని నేనూ సంతోషించేను. గ్రాండ్ కెన్యన్ అందమైన ఎరుపు దనాన్ని నా కళ్లల్లో అదుముకుని వచ్చినందుకు.

………….

Published in March , 2013 by VIHANGA

(http://vihanga.com/?p=7400)

ప్రకటనలు
This entry was posted in నా కళ్లతో అమెరికా(Travelog) and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s