నెలంత పరుగు

ఫ్లైట్ కొరియా మీదుగా శాన్ ఫ్రాన్ సిస్కో కి వస్తూంది. నాకు మెలకువ వచ్చేసరికి చీకటిని చీల్చుకుని వెల్తురు రేఖలు -కింద కనిపిస్తున్న మబ్బుల దొంతరల మీదుగా ప్రశాంతమైన ఆకాశం చివర సన్నగా. కింద భూమి ఉందో, సముద్రం ఉందో. ముప్ఫై వేల అడుగుల ఎత్తున శర వేగంగా వెళ్తున్నామని తెలీని లోహ విహంగం లో. కనిపిస్తున్నది ఉదయమా, సాయంత్రమా! లెక్క ప్రకారం కాలంలో వెనక్కి ప్రయాణిస్తున్నాం. అంటే రాత్రిని వెనక్కి తిప్పి సాయంత్రాన్ని చీల్చుకుని మధ్యాహ్నపు వెల్తురు ని ముందే ధరించి ఉదయం పదకొండు గంటలకు దిగాలి.  కానీ నాకెందుకో కనిపించే తొలి వెల్తురు ఉదయమని తోచింది. ఎలా గుర్తు పట్టాలి? పక్షులు నిద్ర లేపడం లేదు. సాయంత్రపు గూళ్లకి చేరడం లేదు. ఉదయమా, సాయంత్రమా!

ఇండియా 5 సంవత్సరాల తర్వాత వెళ్లాను అంతులేని ఆనందంతో.  నా వాళ్లనుకున్న, నేను ఇంత కాలం కోల్పోయిన మిత్రుల్ని కలవాలి. ఎక్స్పైర్ అయ్యిపోయిన బేంక్ అకౌంట్లు, మెచ్యూర్ అయ్యిన FD, బూం కాలం నాటి నష్ట పోయిన ఇల్లు, ఎల్ ఐ సీలు, హౌసింగు లోన్లు  వగైరా ఈతి బాధల పనులు గబ గబా చక్క బెట్టుకుని కనీసం ఒక్కో రోజు ఒక్కో మిత్రులతో గడపాలి. మొదటి రోజు జెట్ లాగ్ లేదు, గాడిద గుడ్డు లేదు. అన్నిటినీ అధిగమించాలి. మొండి పట్టుదల. రాత్రి రెండు గంటలకు ఇల్లు చేరినా మళ్ళీ అయిదున్నరకే మెలకువ వచ్చింది. ఏదో మధ్యాహ్నం నిద్ర పోయినట్లు. మేడ పైన గది ముందు ఆహ్లాదపు ప్రదేశం లో వెచ్చని సూర్య కిరణాల తో బాటూ కాలనీ గుళ్లో నుంచి అలవాటు తప్పిన  భక్తి పాటల జోర్.  గాలిలో తెరలుగా లేస్తున్న దుమ్ముతో మసక బారిన ఉదయం. చుట్టూ కనుచూపు మేర అపార్ట్ మెంట్లు మూసేసిన వీధులు. చుట్టూ ఏవేవో శబ్దాల గందరగోళం. ఎన్నో గొంతులు ఒక్క సారిగా మాట్లాడుతూ ఏదీ అర్థం కాని స్థితి.  బలవంతపు మెలకువ తో బయటికి పరుగు. అయిదేళ్ల నాటి అరుదుగా ఆటో వచ్చే రోడ్డు ఇప్పుడు దాటడమే కష్టమైన వాహనాలు.  సందు మలుపులోనే పళ్ల దుకాణాలు, బేంక్, ATM, టిఫిన్ బండ్లు.  వెళ్లిన మొదటి చోటు చెప్పుల దుకాణం. జనవరి నెలలో ఇక్కడి బూట్లు, సాక్సులు మూలకి నెట్టి చెప్పులేసుకునే వరకు పాదాల్లో పట్టిన చెమట్లు.
సాయంత్రమే సిటీ ఆ మూల నించి మరో మూలకు ఒక తప్పనిసరి ప్రయాణం. ఇంటికి ఫోన్ చేస్తే వచ్చే కాబ్ మినిమం రెండు వందల యాభై అని తెలీక ఆటోకి మినిమం 300 వందల చెల్లింపు.  ఎక్కడ ఎవర్ని గుద్దుకుంటారో  తెలీని ఆత్రపు మనుషుల పద్మ వ్యూహం ట్రాఫిక్.  చిత్రంగా అందులో డ్రైవ్ చేస్తే ఏమీ అనిపించదు. అలల లో అలలా. మరో వాహనమ్మీద ఉంటే ఇంతే సంగతులు. సముద్రపు ఉవ్వెత్తు కెరటాల్లో చిక్కుకుని ఊపిరాడని పరిస్థితి. ఆ రాత్రి కళ్లు మండుతున్న పదకొండు గంటల వేళ దాదాపు కళ్లు తిరిగి పడ్డ శరీరం. ఇదే నెల రోజుల పరిస్థితీ అవుతుందని కలలో కూడా ఊహించలేదు. కలవాలనుకున్న లిస్టు పదులు దాటిపోతూంది. సమయం గడిచిపోతూంది. ఒక పక్క ఎవరి దగ్గరా ఉండకుండా బాగా పేచీ పెడ్తున్న పాపాయి. వెళ్లగానే రెండో రోజే వాంతుల్తో హాస్పిటల్ కు దారి పట్టించిన పెద్దమ్మాయి. రోజూ మోషన్స్ తో చిక్కి శల్య మవుతున్న చిన్నమ్మాయి. గాలిలో దుమ్ముని పీల్చి పీల్చి ఎలర్జీ తో ఒక పట్టాన తెరిపిన పడని హఠాత్తు జలుబు తో భారమైన గొంతుక. రోజు మార్చి రోజు ఏదో ఒక జ్వరం మాత్ర మింగాల్సిన పరిస్థితి అందరికీ.
అదృష్టం కొలదీ జరిగిన చుట్టాల, మిత్రుల పెళ్లిళ్లు రెండిటి  లో కలవాల్సిన లిస్టు తగ్గిన ఆనందం.
అప్పటికప్పుడు అనుకుని ఉద్యోగ మిత్రులతో బసేరా దండయాత్ర. డబ్బుకి వెరవని విందు భోజనంలో మిత్రుల కళ్లల్లో ఆనందం, మాటల్లో ప్రవహించిన ఎడబాటు. అయిదారుగురు  మాత్రమే మిస్సయిన పార్టీలో ప్రవహించిన పదేళ్ల నా పగటి జీవనం తాలూకు తీపి జ్ఞాపకాలు. కబుర్లు, అల్లరి. మిత్రులారా! భూగోళానికవతల ఏదైతే  నేను కోల్పోయానని వ్యధాకాలం వెళ్లబుచ్చుతున్నానో అదంతా ఈ నిమిషం తర్వాత పునరావృతి కానివ్వనందుకు మనసారా కృతజ్ఞతలు. మనసంతా నిండిన సంతృప్తికి తార్కాణం హాయైన నిద్ర- బడ్జెట్టు రెండింతలైందనే దిగులు బసేరాలోనే వదిలేసి.

మూడవ వారంలో జరగాల్సిన “శతాబ్ది వెన్నెల” ఆవిష్కరణకు ఇంకా ఆహ్వానాలు పంపలేదు. తెలిసిన ఫోన్ నంబర్లన్నీ మారిపోయిన పరిస్థితి. ఎలా కనిపెట్టాలి? మిత్రులు ఒకరిద్దర్ని అర్జంటుగా కలిసి అడ్రసులు, ఫోన్ నంబర్లు సంపాదించడం, ఆహ్వానాలు పోస్ట్ చెయ్యడం, నిమిషం తీరిక లేకుండా ఫోన్ లు చెయ్యడం.
ఇక ఈతి బాధల్లోకి వస్తే -మొదటి వారమంతా బాంకు పన్లు. పది సార్లు వెళ్లినా అవ్వని ఒక్క పనీ. వృథా అవుతున్న సమయం- తిప్పట, అలసట. ఇంటిలోనూ గడపక, బయటా గడపక తిరుగుడు. కనిపించని ఎండ మొహం మాడుస్తూ ఒక పక్క, దగ్గు రూపంలో ఊపిరి తిత్తుల్లో నిండు తున్న రోడ్ల పైని దుమ్ము మరో పక్క. పిల్లల ఏడుపు, అనారోగ్యాలు. మూడ్రోజులైనా రాని ఇంటర్నెట్టు. వచ్చినా అయిదు నిమిషాల కు పైగా కంప్యూటర్ ముందు కూర్చోనివ్వని పనులు. రెండవ వారమంతా  పండగ సెలబ్రేషను  అనుకున్నదంతా కలై పోయి ఒక్క రోజుతో సరిపెట్టుకోవలసిన  పరిస్థితి.  రాత్రి నిద్ర కళ్లు మండిస్తున్నా వాకిట్లో భోగి ముగ్గు పెట్టేంతవరకూ నిద్రపోని అస్థిమితపు మనస్సు. నిప్పులు కంట్లో కురుస్తున్నట్లు తెల్లారగట్ల మెలకువ, గొప్ప చలి లేని భోగి ఉదయం అద్భుతంగా ఆకాశానికెగిసిన భోగి మంట- ఇంటి ముందు వాకిట్లో వాలిన తోకచుక్కై. ముచ్చటగా పిల్లలకు నలుగులు. పిల్లల ఏడుపుల మధ్య పెద్దవాళ్ల కౄరపు నవ్వులు. మచ్చుకో మగ్గు వేపాకు నీళ్లు కలుపుకుని సంప్రదాయం పోనివ్వని భోగి స్నానాలు. ముద్దపప్పు, పచ్చిపులుసు, కలగూర, బొబ్బట్లు ఎన్ని సంక్రాంతి వంటకాలైనా తెమలని వంటింటి పనులు. అలసట, నిస్సత్తువ పండగ పేరు చెప్పి కూర్చోనివ్వని ఆడవాళ్ల పనులు. ఆగకుండా మోగే టీవీ సీరియళ్ల ముందు మగాళ్ల  పళ్లికిలింపులు.  ఏదో ఒక దండగ మారి సినిమా లో విశ్రాంతి నుంచి  పట్టిన హాయైన కునుకు మనసుకీ, శరీరానికీ విశ్రాంతిగా.

వీసా ఆఫీసు చుట్టూ రోజుల తరబడి ప్రదక్షిణలు. స్టాంపింగు అయ్యిపోయిన పాస్ పోర్టులు తీసుకోవడానికి కూడా ఒక రోజంతా లైను లో, ఎండలో నిలబడాల్సిన దారుణమైన దుస్థితి. కొరియర్ ఆప్షన్ పెట్టుకోలేదని వాపోయి ఏం ప్రయోజనం!

వరసగా నాలుగు రోజులు పుట్టిన ఊరు చుట్టూ గడపాలన్న ఆశ. అక్కడా ఇదే దుస్థితి. పట్టుమని ఒక గంట ఎవరితో మనసు విప్పి స్థిమితంగా మాట్లాడలేని తుర్రుమని పిట్టై ఎగిరి పోతున్న కాలం. జుట్టు తెల్లబడి, లావై పోయి గుర్తు పట్టలేని చిన్నప్పటి స్నేహితురాలు, నా కోసమే పనిగట్టుకుని కాసిన్ని పళ్లూ ఫలహారాలు తెచ్చిన మిత్రులు, కేన్సర్ తో చిక్కి శల్యమైన ఎదురింటి అత్తయ్యగారు, ఎప్పుడూ ఊడవని వీధులు, వీధులపైనే ప్రవహిస్తున్న మురికి కాలువలు, అయిదో, పదో మెట్లు మిగిలిన చెరువు, ముళ్ల కంపలు మొలిచిన మంచి నీళ్ల నుయ్యి, మనుషుల జాడ లేని మధ్యాహ్నపు శివాలయం, కొమ్మల్లేని మోడైన కొంగల్రావి చెట్టు, నాకు తెలిసిన ఇళ్లన్నీ మాయమయ్యి మొలిచిన పెద్ద భవంతులు.  వీధికో ఆసుపత్రి, గుడి,  ప్రైవేటు బడి.  ప్రబలుతున్న రోగాలు, ముదురుతున్న భక్తి.  అడుగడుగునా ఎవరెవరో బంధువులు. ఎక్కడా సజావుగా లేని జీవితాలు.  ప్రపంచీకరణ పుణ్యాన మనిషికో సెల్ ఫోను తో చుట్టూ పోటీ ప్రపంచం లో గెలిచిన కొద్ది మంది మీద కసితో బతకలేక, వ్యసనాలతో బతుకీడుస్తున్న మనుషులు.  విపరీతంగా పెరిగిపోయిన నిత్యావసర ధరలు. వంద రూపాయలకు రాని డజను అరటి పళ్లు! అన్నిటికన్నా ముఖ్యంగా పల్లెటూళ్లో కొనుక్కుని తాగుతున్న మంచి నీళ్లు. నీళ్ల ఖర్చు కైనా సంపాదించుకోవాల్సిన పరిస్థితి. కుటుంబ సభ్యుల మధ్య అబద్ధపు ఆర్థిక వివాదాలు, తగాదాలు. డబ్బు విరిచేస్తున్న కుటుంబాలు. ఏవేవో వ్యథల గాథలు. కల్మషం గాలితో బాటూ మనుషుల్లోనూ తెట్టు తెట్టులాగా.
నీళ్లు, గాలి మార్పు కి కొత్త అనారోగ్యాలు. దేవుళ్లకు సమయం కొంత, మనుషులకు కొంత. గుళ్లు, పూజలు, వ్రతాలు మనస్సంతా  ఆక్రమించిన ఏదో ఆలోచనలతో. ఎందుకో అస్థిమితం. భగవంతుడా! నువ్వనే వాడివి ఉంటే   ప్రపంచమంతా శాంతినివ్వు. అందరికీ మనశ్శాంతి నివ్వు. అంతే. ఇంత కంటే నాకే కోరికా లేదు. ఆలకించాడా భగవంతుడు! ఏమో –

ఊరు తర్వాత ఊరు. ఎందర్నో కలవాలన్న ఆతృత. మళ్ళీ నేను ఇలా సజీవంగా చూడలేననుకున్న కాలం చెల్లుతున్న వాళ్లని తప్పనిసరిగా చూడాలన్న గట్టి తలంపు. వందల కిలోమీటర్లు ప్రయాణం. బడలికని అధిగమించి. నీరసాల్ని దాటుకుని. కొద్ది పాటి సంతోషం. మనసంతా నిండిన సంతృప్తి. మొహాలు చూడగలిగాను. నాన్నమ్మ వెచ్చని చేతులు తడిమి, తన బోసి నోటి ముద్దుల్ని అందుకోగలిగాను. (ఫిబ్రవరి, 4 న నేనిక్కడికి వచ్చేక తను మరణించింది).  పక్షవాతం తో మంచం పట్టిన చిన్నత్త తల నిమర గలిగేను.   అంతా మంచి జరుగుతుందని, భయపడొద్దని వెన్ను నిమిరేను. విశాఖ సముద్రాన్ని కాళ్లు ముంచి, కళ్ల నిండా నింపుకోగలిగేను. మిత్రురాలి చెయ్యి పట్టుకుని కైలాస గిరి మీద నడవ గలిగేను. బాదం మిల్కు తాగుతూ బాల్కనీ లోంచి హోరు కెరటాల సముద్రపుటలల్ని మరో మిత్రురాలి కళ్లల్లో చూడగలిగేను. నా కోసం కలవరిస్తున్న ఒకరిద్దర్ని కనీసం కలవ గలిగేను. గురువుగారి పాదాల్ని స్పృశించగలిగేను. మొట్ట మొదటి కవిత్వపు తొలి రోజుల్ని నెమరేసుకుంటూ అరగంట బొమ్మూరు తెలుగు విశ్వ విద్యాలంలో స్థిమితంగా కబుర్లు చెప్పగలిగేను. కాకినాడ లో చిన్నప్పటి మా పక్కింటి పాపాయి డాక్టరైన  పెద్దరికపు నవ్వుని హత్తుకోగలిగేను. అన్నవరం లో ప్రశాంతంగా ప్రవహించే పంపా నది సొగసుని, రుచి తగ్గినా ఇష్టమైన ప్రసాదం, మెట్ల పక్క దేవ గన్నేరు పూల పరిమళాన్ని  ఆస్వాదించగలిగేను. మా ఊళ్లో చిర కాల మిత్రులతో కాస్సేపు కాలం లో కొట్టుకు పోతూ కబుర్లు చెప్పగలిగేను. ఎవరూ లేని మా ఇంట్లో అందరూ ఉన్న చిన్నప్పటి జ్ఞాపకాల పుస్తకాల అరలు తడిమి, సన్నజాజి పందిరితో కబుర్లు చెప్పి,  శృతి లేని వీణని మీటి, అన్నీ కొత్తైన స్విచ్ బోర్డుల్ని ఆర్పి, వెలిగించి క్షణానికోసారి పోయే కరెంటు తో కుస్తీ పట్టైనా ప్రశాంతంగా ఒక రాత్రి నిద్రపోగలిగేను.
ఇంటికొచ్చేక సమయం మిగిలినప్పుడల్లా నాకున్న ఆస్తీ పాస్తీ అరలలో పుస్తకాలుగా ప్రత్యక్షమైన గంపెడు ఆనందాన్ని  గుండె నింపుకుంటూ.
వస్తూనే మూడవ వారపు ఆవిష్కరణ పనులు కొన్ని స్వయంగా కొన్ని మిత్రుల సహాయం ద్వారా. నాకున్న కొద్ది పాటి మిత్రులే సహాయం చెయ్యకపోతే పనుల భారం లో నడుం భూమి లోకి కుంగి పోయేదేమో-చివరి నిమిషంలో దగ్గు, ఆయాసాల్తో ఫోను మాట్లాడ లేక వీడ్కోలు తీసుకోకుండానే వచ్చేసిన ఈ  మిత్రురాలి కృతఘ్నతను క్షమిస్తారు కదూ!

నాకు చూసి తీరాలనిపించిన మిత్రులందరికీ పలకరింపు ఫోను ఆహ్వానాలు. కలవని లైన్లు, కలిసినా ఎక్కువ సేపు మాట్లాడ లేని పరిస్థితులు, చివరి రోజు వరకూ దొరకని నంబర్లు- మొత్తానికి పిలిచిన వంద పై చిలుకు లో కనీసం 50 మందిని కలుస్తానన్న ధీమా. ప్రపంచం మారింది, మనుషుల మధ్య ప్రేమాభిమానాలు పోయాయి, ఎవరూ కలుసుకోలేక పోతున్నారు… ఇవన్నీ పచ్చి నిజాలని అర్థమైన మొదటి రోజు ఆవిష్కరణ రోజు. అయిదేళ్ల తర్వాత వచ్చిన నన్ను చూడడానికైనా నేను మిత్రులని అనుకున్న వాళ్లెందుకు రాలేదు? బహుశా: ఆదివారం ఉదయం కాబట్టి, మరేదో పనిబడింది కాబట్టి, ఇంట్లో ఎవరికో వంట్లో బాగో లేదు కాబట్టి….మనసు పరి పరి విధాల ఆలోచించింది కానీ నా పట్ల ప్రేమ లేదు కాబట్టి అని అంగీకరించడం లేదెందుకో. అనుకున్న వాళ్లలో సగం పైగా రాలేదు. అయిదారుగురు కర్టెసీ సేక్ మెసేజ్ లు పెట్టారు.  అయినా కొందరు వచ్చారు. నన్ను నన్నుగా ప్రేమించే వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్లొచ్చారు. గొప్ప గర్వానందం. నేను వాళ్లని చూడాలనుకున్నాను, వాళ్లూ నన్ను చూడాలనుకున్నారు. అంతే. ఎంత ఆనందం! నా కోసమే సభ వొప్పుకుని నా కవిత్వాన్ని నలుగురికి వినిపించేందుకు నన్ను చిన్నపిల్లగానే చూసే నా కుటుంబ సభ్యుల్లాంటి అయిదుగురు మంచి మాటల్తో ఆశీర్వదించారు. ఇంత గందరగోళపు ప్రపంచంలో ఆదివారపు ఉదయాన్ని నాకోసం త్యాగం చేసిన ఆ నాటి సభలో నలభై తొమ్మిది మందికి ఏమిచ్చి ఋణం తీర్చుకోను నా శతాబ్ది వెన్నెల తప్ప.
నాలుగో వారం తిరుపతి మొక్కులు, దర్శనాలు, కల్యాణాలు, గంటల తరబడి వేచి చూపు లో నిజంగా కనిపించే దైవ దర్శనం. ఒకప్పటి ఆహ్లాద వాతావరణపు జాడ లేని భక్తుల రద్దీ. ఆధునికత పేరుతో ఐడీలు, తనిఖీలు చేసినంత గొప్పగా జనాన్ని అదుపు చెయ్యలేని విఫలత. గుడి గుమ్మం ముందు రద్దీ తోపులాట.
ఫ్లైటు లో కనిపిస్తున్న సంధ్య వెలుగుని నేను ఎప్పుడూ సంధ్యని ఒప్పుకోను.  అది ఉదయమే. ఎప్పుడూ ఉదయమే. రాత్రిని చీల్చుకుని బయట పడే ఉదయమే.    ఓటముల గట్టెక్కిన కన్నీరు, గెలుపుల సంతోషపు పులకరింత, అనారోగ్యమైనా తిరగ గలిగిన ఓపిక, ఒక్క సారైనా మనస్సుని స్పందింప చేసిన కొద్ది క్షణాలు. కలలా వచ్చి మాయమై పోయి, కలో మెలుకువో తెలీని ఆకాశ మార్గం లో మబ్బుల  కెరటాల మధ్య కనిపించని నారదుని జాడ.
శాన్ ఫ్రాన్ సిస్కో చల్లగా ఆహ్వానం పలికింది. చిన్న చిన్న కస్టమ్స్  ఇబ్బందులు, ప్రయాణపు తలతిప్పుతో కళ్ళు తిరిగి పడ్డ పెద్దమ్మాయి, దించితే ఏడ్చే చిన్నమ్మాయి…..కంటి నిండా పొరలై కమ్ముకున్న దు:ఖం. ఆకాశం లోని ప్రశాంత ఉదయం భూమి పై లేక పోవడం గుర్తుకొచ్చి. మానవ మాత్రులం -నిబంధనలు, సమయం, పరుగు తప్ప ప్రేమ కరువై పోతున్న జీవులం. నేను మాత్రం ఏం చేసాను! ఫోను లో కనీసం సంవత్సరానికోసారైనా మాట్లాడే మనుషుల్ని కలవకుండానే వచ్చేసాను.  అమ్మ ఒడిలో కనీసం కాస్సేపైనా నిద్రపోకుండానే ప్రయాణమయ్యాను. ఎట్నించి ఎటుకో భూగోళమంతా చుట్టి ప్రయాస పడి, ఆయాస పడి వచ్చాను. అంతే-
నెల రోజులు వెళ్లకుండా ఉండి ఉంటే చాలా తెలిసేవి కావు. అసలు  అవి తెలుసుకోకుండా ఉంటే బావుండేదేమో!
అయినా గొప్ప ఆశ. ఒక సరికొత్త ప్రేమ పరిచయం లాగా నూతనోత్సాహం.  చీకటిని చీల్చుకుని ముందుకే ప్రయాణించాలన్న గొప్ప తపన. కాలం లో వెనక్కి ప్రయాణిస్తున్నా ముందుకే అని కళ్లని నమ్మించుకుంటున్న గొప్ప ఆశ.  అయినా కాలం లో వెనక్కి ప్రయాణించి రాత్రి తర్వాత సాయంత్రాన్ని అందుకోగలుగుతున్నపుడు  చిన్నప్పటి ఆప్యాయతల్ని తిరిగి తెచ్చుకోలేక పోతున్నానెందుకు?*

–  డా.కె.గీత

Published in March , 2013 by VIHANGA

(http://vihanga.com/?p=7663)

ప్రకటనలు
This entry was posted in స్వగతం and tagged . Bookmark the permalink.

2 Responses to నెలంత పరుగు

  1. kalageeta అంటున్నారు:

    థాంక్స్ అండీ-
    మరి ఇంకెందుకు ఆలస్యం-

  2. amarendra అంటున్నారు:

    baavunnaayi mee asaaniraasalu ..sesha prasnalu samaadhaanam ivvalenu gaanee naa anubhavaalu panchukogalanu

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s