డాయీ పాపాయీ

వాళ్లిద్దరూ
ఈ ప్రపంచంలో ఇప్పుడే కొత్తగా ఉద్భవించినట్లు వాళ్ల ప్రపంచంలో వాళ్లుంటారు
చెట్టు కాండాన్ని కరచుకున్న తొండపిల్లలా
ఆ పిల్ల ఎప్పుడూ “డాయీ ” ని పట్టుకునే ఉంటుంది
పిల్లకు డాయీ లోకం
డాడీకి పాపాయి ప్రాణం
ఉన్నట్లుండి పిల్లని గుండెకు హత్తుకుని
ముద్దుల వర్షం కురిపిస్తూ
నిలువెత్తు వానలో పూల చెట్టు కింద నిలబడ్డట్లు
హర్షాతిరేకంతో మురిసి పోతుంటాడా నాన్న
అమ్మ కడుపు నించి పుట్టలేదా పిల్ల
నాన్న పొట్ట చీల్చుకుని ఉద్భవించినట్లుంది
పాల గ్లాసునీ, నీళ్ల గ్లాసునీ నాన్న పట్టుకుంటే తప్ప తాగదు
ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే అతడు
పాపాయితో గల గలా కబుర్లు చెబుతాడు
పాపాయి వచ్చీ రాని ఊసులేవో బాగా అర్థమైనట్లు
తల పంకిస్తూ పిల్ల తలనిమురుతాడు
ఎప్పుడూ వెనక్కి చూడని వాడు
ఆఫీసుకెళ్తూ
తలుపు జేరేస్తూ
రోజూ మళ్లొక్కసారి వెనక్కి వచ్చి పాపాయిని చూసుకుంటాడు
నాన్న గుండెపై నిద్రించే
పసిదానికి నిద్రాభంగం కాకూడదని
మడత కుర్చీలోనే కునికి పాట్లు పడతాడు
“డాయీ” అని పిల్చినప్పుడల్లా “అమ్మా పాపాయి”
అని గబుక్కున పరుగెత్తుకెచ్చే అతడు
పిల్లకాలువల్ని ఎత్తుకుని ఉప్పొంగిన నదీ ప్రవాహంలా
నాన్న భుజమ్మీద ఆనందంగా ఒరిగే పాపాయి
నదీ కెరటాల్ని కప్పుకుని స్థిమితంగా నిద్రోయే పిల్లకాలువలా
కనిపిస్తారు
పాపాయికి జ్వరం వచ్చినప్పుడు పొద్దుటికి లంఖణాలు చేసినట్లు
పీక్కుపోయిన నాన్న ముఖం
చిర చిరలాడే ఎండలో నెర్రెలు చాచిన నేలలా కళ్లలో దు:ఖ జీరలు
పిల్ల కి నయమయ్యేంత వరకు బాధతో గర గరలాడే నాన్న గొంతు
పాపాయికి అర్థమైనట్లు ఆత్రంగా నాన్న భుజాన్ని అల్లుకుని
చెవులు చీకుతుంది
పిల్ల బాధ నాన్నకు ప్రాణ సంకటమయ్యినట్లు
తనలో తను గొణుగుతూ పిల్లని హత్తుకుని ప్రార్థిస్తూంటాడు
అంతలోనే అంతా నయమయ్యి హుషారు వచ్చిందంటే
బువ్వాలాటలు
బూచాటలు
ఏనుగాటలు
వీళ్లే కనిపెట్టినట్లు
గొప్ప ఉత్సాహంతో నవ్వులు వినిపిస్తూంటాయి
వాళ్లిద్దరి సంతోషాలు ఇల్లంతా ఇంద్ర ధనుస్సులై దేదీప్యమానం చేస్తాయి
నక్షత్రాలు బిలా బిలా పక్షులై రెక్కలారుస్తూ
ఇంట్లో వాలతాయి
చురుకైన పాపాయి కళ్లే
నాన్న పెదవులై మెరుపై మెరిసినట్లు
నాన్న ప్రేమంతా
స్పర్శై గుండెల్లో పులకింతై మొలిచినట్లురెండే మాటలు
ఇంట్లో ప్రతిధ్వనిస్తూంటాయి
డాయీ- పాపాయీ

…………….

-K.Geeta

Published by Saaranga (17/04/2013)

http://www.saarangabooks.com/magazine/2013/04/17/%E0%B0%A1%E0%B0%BE%E0%B0%AF%E0%B1%80-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%AA%E0%B0%BE%E0%B0%AF%E0%B1%80/

ప్రకటనలు
This entry was posted in కవితలు and tagged , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s