నా కళ్లతో అమెరికా-20 (శానోజే)

శానోజే (Sanjose)

Dr.K.Geetha

Dr.K.Geetha

శానోజే కాలిఫోర్నియాలో మూడవ పెద్ద నగరం. మొత్తం అమెరికాలో పదవ పెద్ద నగరం. మేప్ లో పరిధులు చూస్తే అక్కడక్కడ కాగితమ్ముక్కలు తెచ్చిఅతికించిన డైనోసార్ లా ఉంటుంది. మా ఇంటినుంచి పది పన్నెండు మైళ్ల దూరం లో నుంచి సిటీ ప్రారంభమవుతుంది. నగరమంటే ఎప్పుడూ చెత్తతోదుర్గంధంతో, కోలాహలంగా జనపు తొక్కిసలాట తో మన దగ్గర నగరంలాగా ఊహించుకుంటే పొరబాటే. అసలు ఎక్కడ నగరం మొదలవుతుందో కూడాతెలీకుండా ఉంటాయిక్కడి నగరాలు.

         మొదట్లో వరుని తీసుకుని పిల్లల మ్యూజియం, టెక్ మ్యూజియం చూడడానికి ఒకటి రెండు సార్లు వెళ్లినా ప్రత్యేకించి నగరంలో ఎక్కువసేపు ఉండలేదు. మాకోమల్ ఇక్కడికి వచ్చినప్పటినుంచీ శానోజే స్టేట్ యూనివర్శిటి లో ఉన్న ఏరో స్పేస్ ఇంజనీరింగ్ చెయ్యాలని కలలు కన్నాడు.(నెరవేర్చుకున్నాడు కూడా లెండి). ఇక వాడి కాలేజీ గురించిన సమాచారం తెలుసుకోవడం దగ్గర్నుంచీ అప్పుడప్పుడూ వాణ్నిదిగబెట్టడం వరకూ లెక్కలేనన్ని సార్లు నగరం లోతిరుగుతూనే ఉన్నాను. ఎప్పుడూ ట్రాఫిక్ జాములతో రద్దీగా ఉండే పాముల్లాంటి మెలికల ఫ్రీవేలు, ప్రధాన నగరం లో పెద్ద పెద్ద ఆకాశహర్మ్యాలు, ఎటుచూసినా ఎక్కువగా భారతీయులు కనిపించే నగరం శానోజే.

                        ఒకప్పుడు సముద్ర వ్యాపార నగరంగా శాన్ ఫ్రాన్సిస్కో వెలుగులు విరజిమ్ముతున్న వేళ శానోజే వ్యవసాయ క్షేత్రంగా అలరారింది. వ్యవసాయ క్షేత్రంపారిశ్రామిక క్షేత్రంగా మారడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఒకప్పుడు ఆహార ఉత్పత్తి సంబంధిత రసాయనాలు, పనిముట్ల పరిశ్రమల్లో పెద్దదైన FDC వంటివిఇక్కడే స్థాపించబడ్డాయి. క్రమంగా అవి భారీ యంత్ర ఉత్పత్తిని ప్రారంభించి ఫైర్ ట్రక్కు ల వంటి నిర్మాణాల్ని చేపట్టాయి. ఇక రెండవప్రపంచ యుద్ధకాలంలోయుద్ధ ట్యాంకుల నిర్మాణం అంతా ఇక్కడే జరిగింది. ఇప్పటికీ FDC కంపెనీ వ్యవసాయ సంబంధిత భారీయంత్రోత్పత్తి కి ప్రఖ్యాతి చెందినప్పటికీ చివరికి ఫుడ్ప్రాసెసింగ్, తత్సంబంధిత రసాయనాల కంపెనీగామిగిలింది.

                ఇక కంప్యూటర్ రంగం ప్రారంభమైన 1945 ప్రాంతంలో మొదట IBM ఇక్కడే ప్రారంభించబడింది. ఇక అక్కడి నుంచి తిరుగులేని కంప్యూటర్ హార్డ్ వేర్, సాఫ్ట్వేర్ ప్రధానకేంద్రం గా ఈ నగరం నానాటికీ అభివృద్ధి చెందుతూ వచ్చింది. అమెరికా మొత్తంలోనే ఇక్కడ సగటు మనిషి కనీసవేతనం ఎక్కువ. అదేవిధంగాకనీస వ్యయం కూడా ఎక్కువే. ఈ నగరంలోనూ, చుట్టుపక్కలా ఉన్నంత ఇంటి అద్దెలు అమెరికాలో మరెక్కడా ఉండవంటే అతిశయోక్తికాదు.

శానోజే డౌంటౌన్ :

శానోజే డౌంటౌన్ కి ఎప్పుడు వెళ్లినా పెద్ద సమస్య గా అనిపించేవి పార్కింగు, అస్తమాటూ అడ్డు తగిలే అడుగుకొక సిగ్నలు. ఆదరిదాపుల్లో ఎక్కడా ఫ్రీ పార్కింగు ఉండదు. శాన్ ఫ్రాన్ సిస్కో తో పోలిస్తే కాస్త చవక అయినప్పటికీ పార్కింగుకి డబ్బులు పొయ్యాలంటే మనసుఉస్సూరుమంటుంది. డౌంటౌన్ మొత్తం పాత కొత్తల మేలు కలయికగా ఉంటుంది. ఒక పక్క ఆకాశ హర్మ్యాలు, అందమైన కట్టడాలు కనిపిస్తూంటే మరో పక్కఆ చుట్టు పక్కల ఇళ్లు మాత్రం ఎప్పుడూ మార్పుకి నోచుకోనివిగా ఉంటాయి. అక్కడ రోడ్లపై నడిచే మనుషుల్లో హడావిడిగా కాలేజీలకి, ఆఫీసులకి పరుగెత్తేమనుషులతో పాటూ
మాసిన బట్టలు, జుత్తుతో, ఆకలితో, ఆగ్రహంతో తిరిగే మనుషులు కూడా బాగా కనిపిస్తారు. క్రైం రేట్ కూడా ఎక్కువగా ఉన్న డౌన్ టౌన్ ప్రాంతంలో ఇళ్లుతక్కువ సదుపాయాలతో, కాస్త చవకగా దొరుకుతాయి.

చిల్డ్రన్ డిస్కవరీ మ్యూజియం :

మేం మొట్ట మొదట చూసిన చిల్డ్రన్ డిస్కవరీ మ్యూజియం నించి మొదలు పెడతాను. 6$ టిక్కెట్టుతో 6,7సంవత్సరాల లోపు పిల్లలతో రోజంతా గడప గలిగే మంచి ప్రదేశం ఈ మ్యూజియం. పేరు కావడానికి మ్యూజియమే గానీ అక్కడ ఉన్న ఎగ్జిబిట్లన్నీ పిల్లలుఆడుకోవడానికి బాగా ఉత్సాహం చూపించేవే. అదీగాక ఎగ్జిబిట్లన్నీ ఏదో ఉబుసుపోక ఆడేవి కాకుండా వెనుక పిల్లలలో సైన్సు పరిజ్ఞానం, రక్షణ వలయాలపరిచయం, సంస్కృతి పరిరక్షణకు సంబంధించినవి అయ్యి ఉండడం విశేషం. ఎంట్రెన్సులోనే కనిపించే ఫైర్ ట్రక్, అంబులెన్సు పిల్లలకు పైకి ఎక్కి వాటినినిజంగా నడుపుతున్నామన్న ఆనందాన్ని కలగజేస్తాయి. అంతే కాకుండా వాటి పట్ల పిల్లలకు మంచి అవగాహన కూడా కలుగుతుంది. అలాగే ట్రాఫిక్గురించి అవగాహన కలిగించే ఎగ్జిబిట్ కూడా పిల్లల్ని ఆకట్టుకుంటుంది. ఇక ఎగిరే నీళ్లలో రకరకాల రంగుల బంతులతో ఆడడం, పెద్ద నీటి బుడగల్నితయారు చెయ్యడం, ఆర్ట్ ప్లేస్, మొక్కజొన్న గడ్డితో బొమ్మలు తయారుచెయ్యడం, ఫేస్ పెయింటింగ్, మార్కెట్ ప్లేస్, సీక్రెట్ ఆఫ్ సర్కిల్స్ లో మేథ్, సైన్స్,ఇంజనీరీంగ్ లలో సర్కిల్స్ కు ఉన్న ప్రాధాన్యతను వివరించే ఎగ్జిబిట్లు.. ఒకటేమిటి పిల్లలని మనం ఇంట్లో ఏవైతే చెయ్యనివ్వమో అవన్నీ స్వేచ్ఛగా చెయ్యచ్చువాళ్లక్కడ. అన్ని ఎగ్జిబిట్లు పిల్లలు మహదానందంగా ఎక్కి తొక్కడం, ఇష్టమొచ్చినట్లు ఆపరేట్ చెయ్యడం చూస్తే ఇలాంటి చోటొకటి మనకూ లేదే అని ఈర్ష్యకలుగుతుంది. అయినా వరుతో బాటూ ఉత్సాహంగా నేనూ చిన్న పిల్లనై పోయి బాగా ఆనందించేను. పెద్ద పిల్లతో బాటు వచ్చే చిన్ని తమ్ముళ్లూ, చెళ్లెళ్లకూఆడుకునే ప్రదేశం ఉండడం విశేషం ఇక్కడ. మా వరు మూడవతరగతి వరకూ ఇదే ఇష్టమైన ప్రదేశం అని చెప్పేది.

టెక్ మ్యూజియం :

టెక్ మ్యూజియం నాకు బాగా నచ్చే గొప్ప మ్యూజియం. కాకపోతే ఇక్కడ మెంబరు షిప్పు కూడా తీసుకోవాలి. అందువల్ల కాస్తటిక్కెట్టు ఎక్కువ. అయినా మాకు ఎంత బాగా నచ్చేసిందంటే మొదట సారి చూసి ఏకంగా సంవత్సర మెంబరు షిప్పు తీసేసుకున్నాం. ముఖ్యంగా ఇక్కడఉన్న డూం థియేటర్ ఒక గొప్ప అద్భుతం. ఇప్పటికి పది సార్లు చూసినా మళ్లీ వెళ్లాలనిపిస్తుంది నాకు. తలపై మొత్తం అర్థ గోళాకారం లో సినిమా ని చూడడంఒక అద్భుత అనుభూతి. నిజానికి మానవ కన్ను అంత పెద్ద తెరని ఒక్కసారి చూడగలగడం అసాధ్యమైనప్పటికీ కొంత సేపటికి అలవాటు అయ్యి బాగావినోదంగా ఉంటుంది. సినిమా ప్రారంభం కాకముందు తెర వెనుక నిర్మాణమంతా కంటికి కనిపింపజేయడమే కాక సొంపైన సంగీతం వినడం మరొక విశేషం.ఈ ధియేటర్ లో కేవలం ఎడ్యుకేషన్ కి సంబంధించిన, చిన్న నిడివి కల సినిమాలు మాత్రమే ప్రదర్శితమవుతూ ఉంటాయి. ఇక బాగా అడ్వాన్స్డ్ టెక్నాలజీతోనిర్మించడం వల్ల మనకు అత్యద్భుతమైన దృశ్య, శ్రవ్య అనుభూతి కలిగుతుందనడం అతిశయోక్తి కాదు.

నాల్గవతరగతి నుంచీ పెద్ద పిల్లలకు సైన్సు అవగాహన కలిగించే చక్కని ప్రదేశం ఈ మ్యూజియం. ఇక్కడ ఫిజిక్సు, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంజనీరింగ్ విభాగాలుఅన్నీ చూడడానికి ఒక రోజు మొత్తం పడుతుంది. రోబో హాండ్ గీసి ఇచ్చే ముఖ చిత్రపటం ఒక గొప్ప ఆవిష్కరణ. కంప్యూటర్ విభాగంలో చిప్ తయారీకిసంబంధించిన సమాచారం, బయాలజీ లో DNA కి సంబంధించిన విజ్ఞానం చాలా ఆసక్తి కలిగిస్తాయి. టెక్ మ్యూజియం మొత్తం మూడు అంతస్థులుగాఉంటుంది. పైన చెప్పినవన్నీ పై అంతస్థులో ఉంటాయి. అన్నిటి కంటే దిగువన చిన్న పిల్లల కోసం విభాగం ఉంటుంది. ఇక్కడ ఆస్ట్రానమీకి సంబంధించినవిభాగం బాగా ఆసక్తిదాయకంగా ఉంటుంది. ఇక్కడ వీడియో షో ను ప్రతీ సారీ వరు, నేను మిస్ అవ్వకుండా చూస్తాం. మధ్య అంతస్థులో థియేటర్,రెస్టారెంటు వంట్ ఇవే గాక ఎప్పటికప్పుడు మారే థీం ఎగ్జిబిషన్సు ప్రత్యేక టిక్కెట్టుతో జరుగుతాయి. ఇక్కడ 2001 నుంచీ ప్రతీ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సైన్సు లో కొత్త ఆవిష్కరణలకు టెక్ అవార్డులు ప్రదానం చేస్తున్నారు. ఆసక్తి ఉన్న వారెవరైనా అప్లై చేసుకోవచ్చు.

హాపీ హాలో పార్క్ & జూ:

బుజ్జి బుజ్జి పిల్లల దగ్గర్నించి పదేళ్ల పిల్లల వరకూ హాయిగా ఇష్టంగా తిరుగుతూ చూసే ప్రదేశం Happy Hallow Park & Zoo.
మేం ఏదో ఒక పూట లో అయిపోతుంది చిన్నపిల్లలది కదా అనుకున్నాం. కానీ ఉదయమనగా వెళ్లిన వాళ్లం సాయంత్రం వరకూ తిరుగుతూనే ఉన్నాం. అయితే ఊరికే మైళ్లకు మైళ్లు నడిచి ఎక్కడో ఒక్క జంతువుని చూడడం కాకుండా చిన్న జూ అయినా బోలెడన్ని జంతువులుంటాయి. ఇక మొత్తం పార్కుతక్కువ స్థలంలో ఉన్నా ఒక కొండ మీద ప్రతి మలుపు కి ఒక్కొక్క వైవిధ్యమైన విభాగాలు ఉంటాయి. ఉదయం వెళ్తూనే వరు రైడ్ల వైపు పరుగు తీసింది. సిరి,నేను పచ్చికలో చతికిల బడి చక్కగాఆడుకోవడం మొదలు పెట్టాం. మధ్యాహ్నం జూ పార్కుని నిశితంగా చూస్తూ గడిపి సాయంత్రానికి పార్కుకి మరొకఎంట్రెన్సు వైపు బ్రిడ్జి కనిపిస్తే అటు వైపుగా నడిచేం. ఆహ్లాదంగా ఏటవాలుగా ఎండ పడ్తున్న సాయంత్రపు వేళ మేం బాగా అలిసిపోయి ఉన్నా బ్రిడ్జి ఆ చివరినిదాటి మరొక కొండ పైకి వెళ్లి తీరాలనిపించేంత అందంగా ఉందా బ్రిడ్జి. ఇంకేం- ఎక్కడ లేని ఓపిక వచ్చేసింది మాకు. పచ్చని అరణ్య లతల కింద దిగువనెక్కడోకనిపించకుండా వినిపించే నీటి గలగలల సుందర సంగీతం. పక్క కొండ వరకూ వెళ్లితే మరొక కార్ల పార్కింగు వస్తుంది. కాస్సేపు కూచుని వెనక్కి తిరిగివచ్చాం. పార్కు చిన్న పిల్లలతో మరలా మరలా చూడదగినది.

వించెస్టర్ మిస్టరీ హౌస్:

బాల్ రూం వంటి ఒకటో రెండో తప్పిస్తే మొత్తం 160 చిన్న చిన్న గదులతో ఇప్పటికీ ఒక పెద్ద రహస్యంలా మిగిలిపోయిన గొప్ప భవంతిWinchester Mistery house. మేం ఎప్పటి నుంచో చూడాలనుకుని వాయిదా వేసిన వాటిల్లో ఇదొకటి. ముఖ్యకారణం ఎంట్రెన్సు టిక్కెట్టు $33 డాలర్లు కావడమే. నిజానికి ఈభవంతి చూసొచ్చాక కూడా ఆ టిక్కెట్టు చాలా ఎక్కువ అనిపించింది. బహుశా: ఆ భవంతిని ఇప్పటికీ చెక్కుచెదరకుండా నిలబెట్టి ఉంచడానికి ఎక్కువ ఖర్చుఅవుతుందనుకుంటాను. అందుకే అంత టిక్కెట్టు పెట్టి ఉంటారు.
1884 లో శారా వించెస్టర్ అనే ఒక మిలియనీర్ ఒకామె భర్త, కూతురు చనిపోయిన విషాదాన్ని మోస్తూ అమెరికా తూర్పు తీరం నుంచి పడమటి తీరానికొచ్చిందట. ఇక్కడదాదాపు 150 ఎకరాలు కొని ఇక్కడ అప్పటికే ఉన్న పాత వ్యవవసాయ కట్టడాన్ని కూల్చి వేసి ఈ భవంతి నిర్మాణాన్ని మొదలు పెట్టిందట. ఇక అప్పటి నుంచి 38సం.రాలపాటూ 1922 లో మరణించే వరకూ భవంతిని 600 వందల సార్లు మార్చి కడుతూనే ఉంది. కారణం ఇప్పటికీ ఎవరికీ తెలియని రహస్యంగా మిగిలిపోయింది. 4అడుగుల 10 ” మాత్రమే పొడవున్నదట ఆమె. అందుకే అక్కడ ఉన్న గుమ్మాలన్నీ అతిపొట్టిగా ఉంటాయి. ఆ రోజుల్లోనే అత్యంత ఖరీదైన $1500 డాలర్ల కిటికీ దగ్గర్నించీ $2కిటికీ వరకూ ఉన్నాయి ఈ భవంతిలో. ఇక నిర్మాణానికోసం వాడిన కలప, సామగ్రి కొన్ని సార్లు విదేశాల నుంచి దిగుమతి అయ్యాయి.

                 కాస్త జాగ్రత్తగా చూసుకోక పోతే ఎటు వెళ్తున్నామో తెలీక ఖచ్చితంగా తప్పిపోతాం ఈ భవంతిలో. అలా తమాషాగా గుమ్మం కాని చోట గుమ్మంలా భ్రమింపజేసే అలమారలు, ఒకగది నుంచి మరో గదికి ఇరుకైన వసారాలు, మెరిసే రంగుల గాజు అద్దాల కిటికీలు అడుగడుగునా కనిపిస్తాయి. అక్కడున్న సాలెగూడు ను పోలిన కిటికీల ఊచల వైవిధ్యం,భవంతి అంతా 13 అంకె చుట్టూ పరిభ్రమించడాన్ని బట్టి స్థానికులు ఆమెను ఒక మంత్రగత్తెలా భావించేవారట. అక్కడ నిర్మాణం జరుగుతున్నంత సేపు చుట్టు పక్కల వారికిరోజుకి $ 3 డాలర్ల మంచి జీతంతో పనులు పుష్కలంగా లభించేవట. గుర్రపు బగ్గీ లోని కూర్చున్నట్లున్న ఒకే ఒక్క ఫోటో తప్ప మరెక్కడా ఆమె ఫోటో లభించక పోవడం విచిత్రంఅంటారు. తన దగ్గరున్న మిలియన్ల సొమ్ముని, తన కంపెనీ వాటా వల్ల లభించే నెలసరి ఆదాయాన్నంతా ఇలా ఆమె ఈ భవంతి నిర్మాణానికి ఉపయోగించింది. ఆమె ఇలా తనుబ్రతికి ఉన్నంతకాలం భవంతి నిర్మాణాన్ని చేస్తూ ఉండకపోకే తన కుటుంబంలాగే త్వరగా మరణిస్తుందని ప్రేతాత్మలు చెప్పడం వల్ల ఇదంతా చేసిందని కథ ఒకటి ప్రచారం లో ఉంది.

              ఈ భవంతిని చూసొచ్చాక ఏం చెయ్యకూడదో అర్థం అవుతుంది. జీవిత కాలంలో ఆమె సంపాదించిన అనేక గొప్ప వస్తువులన్నీ ఆమె తదనంతరం ఎటు పోయాయో ఎవరికీతెలియదు. ఏదో ఎవరికీ తెలియని ఆలోచనతో కట్టిన ఈ భవంతి ని 1964 లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుని దీనిని జాతీయ నిర్మాణాలలో ఒకటిగా చేసి, సంరక్షిస్తూంది. మొత్తం160 ఎకరాలలో కేవలం నాలుగున్నర ఎకరాలు మాత్రమే మిగిలిందిప్పుడు.
నా వరకూ నాకు ఆ చెక్క గోడల్ని తడుముతూ అలా గది నుంచి గదికి గంట సేపు తిరుగుతూంటే ఒక నిర్వికార భావన కలిగింది. ఎప్పుడూ ఒక్క అతిథి కూడా రాని ఆ ఇంట్లో40 అతిథి గదులను, ఎన్నడూ వాడాని బాల్ రూం లను ఎందుకు నిర్మించిందీమె అనిపించింది. డబ్బును ఏం చేసుకోవాలో తెలియక ధనవంతులంతా ఇలా ఏదో ఒక పిచ్చి పనిచేస్తారని కూడా అనిపించింది. కనీసం తన ఆస్తిలో 50% ఇతరుల సంతోషం కోసం వదిలి వేసుంటే ఎంత బావుండేదనిపించింది. ఆ భవంతిలో ఆమె చనిపోయేసరికి ఇంకా చాలగదుల పని అసంపూర్తిగా మిగిలిపోయింది. వాటిని ఇప్పటికీ అలానే వదిలి వేయడం గమనిస్తే ఆ భవంతి పట్ల తదనంతరపు మనుషులకి ఆమెకున్న ఆసక్తి లేదనిఅర్థమవుతుంది.
ఇక భవంతిలో గదులన్నీ చాలా చిన్న చిన్నవి. ఇక్కడ పూర్వ కాలపు భవంతులనబడే వాటిల్లో ఇలా గదులు చిన్నవిగా ఉండడానికి కారణం బహుశా చలి ప్రాంతం కాబట్టి వేడిబయటికిపోకుండా అనుకుంతా. మన దేశంలో పెద్ద పెద్ద రాజ భవంతులతో పోలిస్తే ఇవి చాలా చిన్నవైనప్పటికీ ప్రధానం గా గదులు అతి చిన్నవిగా కట్టడానికి కారణం అదిఅయ్యి ఉంటుందని అనిపించింది.
ఆ భవంతిలో ఆమె గది గదికీ తిరగడానికి, ఒకో రోజు ఒక్కో గదిలో నిద్రించడానికి రోజులు గడిచిపోయి ఉంటాయి. ఇప్పుడు దాని వెనక ఎన్ని కథలున్నా ఆమె మనస్సులోనిఒంటరి తన్నాన్ని ఈ విధంగా ఎడతెగని నిర్మాణంతో భర్తీ చేసుకుందని అనిపించక మానదు.

హెరిటేజ్ రోజ్ గార్డెన్:

నగరం మధ్యలో ఒక అందమైన పూల తోట Heritage Rose Garden . ఇక్కడ దాదాపు నాలుగు వేల గులాబీ మొక్కల్ని వాలంటీర్లు పెంచి,పోషిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. 1995 లో ప్రారంభమైన గులాబీ పెంపకం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఇక్కడ పూలని ఎవరూ కోయవద్దని బోర్డులుంటాయి. ఇదే మనదేశమైతే కంచె కట్టినా పూలన్నీ మాయ మవుతాయి. ఇక్కడ అవన్నీ చెట్టుకి పూసి అక్కడే రాలిపోవలసిందే. ఈ ఫూల తోట మంచి సువాసనతో, విరబూసిన వేల పుష్పాలచిర్నవ్వులతో భలే అందంగా ఉంటుంది. గులాబీ మొక్కలు మొక్కల్లా కాకుండా చెట్లలా అనిపిస్తాయి. ఇక ఇక్కడ 3000 వెరైటీ గులాబీలున్నాయి. అతిపెద్ద గులాబీదగ్గర్నుంచీ అతి చిన్న గులాబీ వరకూ చూడొచ్చు.

              అయితే దీనిని ఆనుకుని ఉన్న ” sister plaza” అనే చిన్న చోట ఇండియన్ ఫ్లాగ్ ఉండడం చూసి ఆశ్చర్య పోతూ అటు నడిచాం మేం. అది ప్రపంచ వ్యాప్తంగా సానోజే తోఅనుబంధంగా ఉన్న 7 sister city ప్రోగ్రాముల్లో పూనే కూడా ఒకటి అని గుర్తుగా కేటాయించిన చోటు. అక్కడ చిన్న పాటి ఛత్రపతి శివాజీ విగ్రహం కూడా ఉంది.
రివర్ ట్రైల్ : ఇక నగరం మధ్యలో దాదాపు రెండున్నర మైళ్ల పాటు చిన్న కాలువ ని ఆనుకుని సాగే “రివర్ ట్రైల్” (River Trail) Mountain View లో షోర్ లైన్ ట్రైల్ లాగామంచి బైకింగ్ ట్రైల్. రివర్ అన్న పేరు చూసి నది అని ఊహించుకుని వెళతాం. కానీ అక్కడ అతి చిన్న కాలువని చూసి పేరుతో సంబంధం లేదనుకుని నవ్వుకున్నాం. ఆ చుట్టుపక్కల గడ్ది భలే బావుంది. ఎత్తైన ఒత్తు గడ్డి లో పిల్లలు చాలా సేపు పరుగులు తీసారు. ఒకటి రెండు నీటి బాతులు కనబడగానే కేరింతలు కొట్టారు. నగరం లో ఉంటూనే అంతలోనేఎక్కడో నదీ తీరాన ఉన్నట్లు భ్రమింప జేస్తాయి ఇక్కడి ట్రైల్స్. అలా కొంత భాగాన్ని ముఖ్యంగా జలాశయాల పరీవాహక ప్రాంతాన్ని ఇలా సంరక్షించడం ఆరోగ్యానికి, పర్యావరణానికి ఎంత మంచిదో కదా అనిపిస్తుంది.

మౌంట్ హామిల్టన్ & లిక్ అబ్జర్వేటరీ: (Mount Hamilton & Lick Observatory)

                 సిలికాన్ వేలీ అంతా కనుచూపు మేర కనిపింపజేసే Mount Hamilton 4,196 అడుగుల ఎత్తైనది. శానోజే నగర శివార్లని ఆనుకుని మరొక పది మైళ్లలో ఉంటుంది. ఒకశీతాకాలం ఇంటి నుంచి బయటికి రాగానే దూరంగా మౌంట్ హామిల్టన్ మంచు టోపీ ధరించి అందంగా చిర్నవ్వులు చిందించడం మొదలుపెట్టింది. వెనువెంటనే బయలుదేరేంసందర్శనకి. అయితే సరిగ్గా 15 మైళ్ల కివతల మంచు వల్ల పర్వత శిఖరపు దారి మూసుకు పోయినందు వల్ల ప్రభుత్వ రహదారి కాపలాదార్లు మమ్మల్ని ఇంటి దారి పట్టించారు.

              ఇలా లాభం లేదని వసంత కాలం వరకు ఆగి మళ్లీ వెళ్లాం. ఈ సారి మంచు ఉండదు. అయినా ఆ శిఖరాగ్రాన్ని ఒక సారి పలకరించిరావాలని ప్రయత్నం. శానోజే ఎవర్ గ్రీన్ప్రాంతాన్ని దాటి చిన్న పాటి కొండని మొదట ఎక్కుతాం. నిజంగా ఎప్పుడూ పచ్చగా ఉంటుంది కాబట్టి ఆ పేరు వచ్చిందనిపించేటట్లు చుట్టు చెట్లూచేమలతో ఎప్పుడూపచ్చదనంతో అలరారుతూ ఉంటుందా రహదారి. మొదటి పర్వతం ఎక్కుతున్నప్పుడే అందమైన గొప్ప భవంతులేవో కనిపిస్తూంటాయి. చిన్న రహదారి నానుకుని నగరం పైకివంపులుతిరుగుతూ ప్రయాణం సాగుతూ ఉంటే మనస్సుకి భలే ఆహ్లాదం చుట్టుకుంది. ఇక ఆ కొండ దాటాక ఎక్కడా పెట్రోలు కానీ, భోజనం కానీ ఉండదు. తర్వాత వచ్చేపర్వతాన్ని పట్టుకుని వంపుల ఘాట్ రోడ్దు ప్రారంభమవుతుంది. అయితే అన్ని మలుపుల రహదారిని ఇప్పటి వరకు నేనెక్కడా చూడలేదు. దాదాపు 400 మలుపులుఉన్నాయని పైన గైడు చెప్పింది. అడుగడుక్కీ వంపు తిరిగే రోడ్లు ఒకప్పుడు గుర్రాల రాకపోకలకోసం నిర్మించబడినవట.

                    మౌంట్ హేమిల్టన్ దగ్గరికి వెళ్లాలంటే ముందు ఒక పర్వత శ్రేణిని దాటాల్సి ఉంటుంది. మధ్య కొంత భాగం మనకు నగరం కనిపించదు. కానీ ప్రతి చోటి నుంచీ పైన ఉన్నఅబ్జర్వేటరీ కనిపిస్తూనే ఉంటుంది. ఇదిగో వచ్చేసాం అనుకుంటాం కానీ మళ్లీ మలుపుల రహదారే కనిపిస్తుంది ఎదుట. ఆ చిన్న రహదారిలో అలా ప్రయాణిస్తూ దిగువ కనిపించేఅందమైన దృశ్యాలను చూస్తూ వెళ్లడానికైనా అక్కడికి వెళ్లొచ్చనిపిస్తుంది. పైన అబ్జర్వేటరీ గా పిలువ బడేది నిజానికి ప్రపంచంలో రెండవ అతి పెద్ద టెలీస్కోప్ ఉన్న ప్రదేశం.ఇదిగాక ఇక్కడ ఉన్న 120 అంగుళాల C. Donald Shane reflecting telescope పూర్తిగా లేసర్ టెకాలజీని ఉపయోగించుకుని పనిచేస్తుంది. దీనిద్వారా పొందగలిగినఛాయా ఛిత్రాలు స్పేస్ టెలీస్కోపుతో తీసిన వాటితో సమానమైన పరిపూర్ణతని కలిగి ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ఇక Atomated Planet finder టెలీస్కోపు ఇంకానిర్మాణం లో ఉంది. అది తనకు తానుగా విశ్వాంతరాళంలో దాగున్న గ్రహాల జాడలను వెలికి తీస్తుంది. మరో రెండు మూడు చిన్న టెలీస్కోపులు కూడా ఉన్నాయక్కడ.

జేంస్ లిక్ :

ఇక లిక్ అబ్జర్వేటరీ ని స్థాపించిన ఆసామీ కథ లోకి వస్తే మొదట పియానోలు తయారు చేసి అమ్మే వడ్రంగి వ్యాపారిగా ప్రారంభమైన జేంస్ లిక్ జీవితం ముందుఎన్నో దేశాలు మారినా గోల్డ్ రష్ సమయంలో కాలిఫోర్నియాకు తన యాభయ్యవయేట అడుగు పెట్టడం తో మలుపు తిరిగింది. అప్పటికే పుష్కలంగా డబ్బుతో అడుగు పెట్టినజేంస్ మొదట ఇక్కడ చాక్లెట్టు కంపెనీ ని ప్రారంభించాడు. తోటలు కొని ఎస్టేట్లు నడిపినా, అతిపెద్ద ఫ్లోర్ మిల్లు నడిపినా, మైనింగు మొదలైనవి చేసినా చివరికి రియల్ ఎస్టేట్వ్యాపారం ప్రారంభించి కనబడ్డ ప్రదేశాలన్నీ కొనడం ప్రారంభించాడట. లేక్ తాహో, లాస్ ఏంజిల్స్, సానోజే ఇలా ఇప్పటి నగరాల చుట్టుపక్కల వందల ఎకరాల పంటభూములేకాకుండా, కాటలీనా ద్వీపం మొత్తం కొన్నాడంటే అతని ఆస్తిని ఊహించుకోవచ్చు.

                చివరి దశలో శాన్ ఫ్రాన్ సిస్కో డౌన్ టౌన్ లో అతిపెద్ద విగ్రహం పెట్దామనుకున్నాడట, ఈజిప్టులోని పిరమిడ్లని పోలిన కట్టడాల ఆలోచన కూడా వచ్చిందట. అయితే అప్పటికాలిఫోర్నియా అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షుని చొరవ వల్ల తన పేరుతో భూమిపై అతిపెద్ద టెలీస్కోపుతో అబ్జర్వేటరీని నిర్మించతలపెట్టాడట. అందుకోసం తన ఆస్తిలో అత్యధికభాగాన్ని ధారపోసాడట. అలా ఇక్కడ లిక్ అబ్జర్వేటరీ అంకురార్పణ జరిగింది. కానీ అబ్జర్వేటరీ పని మొదలుపెట్టేసరికే ఆయన మరణించినా 1885 లో నిర్మాణం పూర్తయ్యాకఅబ్జర్వేటరీ కింది భాగం లో ఆయనకి సమాధి నిర్మాణం చేసారట.

                1888 నాటికి భూమిపై అతిపెద్ద టెలీస్కోపు ఇక్కడ అవతరించింది. విద్యుత్తు, ఎలక్రాలిక్స్,కంప్యూటర్స్ లాంటివి లేని రోజుల్లో పూర్తిగా యంత్ర శక్తిని వినియోగించుకునిపనిచేయగలిగిన టెలీస్కోపుని, అతి పెద్ద డోముని మనం చూడొచ్చు. 1980 ప్రాంతంలో శానోజే నగర పాలక సంస్థ వీధి దీపాలుగా తక్కువ పీడనంతో లేత కాంతిని వెదజల్లేసోడియం దీపాల్ని ప్రవేశపెట్టిందట. ఇందువల్ల రాత్రి పూట మౌంట్ హేమిల్టన్ పై జరిగే పరిశోధనలకి కాంతి విక్షేపణం కలగకుండా ఉంటుంది. అందుకు గౌరవార్థంగా “ఆస్టరాయిడ్ 6216″ కి “శానోజే” అని నామకరణం చేసారట.

ఫ్లీ మార్కెట్ (Flea Market):

        శానోజే లో మన ఊళ్లలో సగటు తీర్థాల వంటి, రద్దీ బజార్ల వంటి, పాత బస్తీ ఎగ్జిబిషన్ వంటి ఒక ప్రత్యేక స్థలం ఈ ఫ్లీ మార్కెట్.అమెరికాలో ఇటువంటిదొకటి కనబడడం బహుశా: భలే అరుదు. అక్కడ మనకు అమెరికా కనిపించదు లాటిన్ అమెరికా కనిపిస్తుంది. చవక రకపు వస్తువులు, తినుబండారపుదుకాణాలు, పెద్దగా వినిపించే స్పానిష్ పాటలు ఇక్కడ సాధారణం. చిన్న పిన్నీసుల దగ్గర్నించీ, కార్పెట్ల వరకూ ఇక్కడ అమ్ముతారు. ఈ చుట్టుపక్కల సామాన్యుల జీవితాన్నిఅతి దగ్గర్నించి చూడడానికైనా ఇక్కడికి వెళ్లి తీరాలి. నా వరకూ నాకు చాలా ఇష్టం. నిజమైన మనుషుల మధ్య ఉన్నట్లు భావన కలుగుతుంది. ఇక్కడ తిరిగే మనుషులకు మనదేశం లోని సామాన్య జీవితాలతో పోలికలుంటాయి. వీళ్లకు డబ్బుని దాచుకోవడం తెలియదు, సంపాదించిన దాన్ని విలాసంగా ఎప్పటికప్పుడు ఖర్చుచెయ్యడం మాత్రమే తెల్సుఅని అనిపిస్తుంది వీళ్ల వేషధారణ, జల్సా గా కొనుక్కుని తిరగడం చూస్తే. అందుకే కల్మషం కూడా ఉండదేమో అనిపించకా మానదు.
శానోజే లో ఇంకా తిరిగి చూడ వలసినవి ఎన్నో ఉన్నాయి. అవన్నీ చూడడానికి మూణ్ణాలుగు రోజులు కూడా సరిపోవు.
మా ఇంటి నుంచి పది మైళ్ల దూరం లో ఈ నగరం ఉంది కాబట్టి మా ఊరు ఈ నగరానికి అర్బన్ ఏరియా వంటిదని చెప్పొచ్చు. కాబట్టి మా స్వంత నగర సందర్శనకు స్వాగతంఅని చెప్పాలని మనస్సు ఉవ్విళ్లూరుతూంది.

– కె. గీత

Published in June , 2013 by VIHANGA

( http://vihanga.com/?p=8918)

ప్రకటనలు
This entry was posted in నా కళ్లతో అమెరికా(Travelog) and tagged . Bookmark the permalink.

One Response to నా కళ్లతో అమెరికా-20 (శానోజే)

  1. satyaprasad అంటున్నారు:

    చాలా బాగుందండి, కళ్ళకు కట్టినట్టు వర్ణించారు.ఇండియా లో కూర్చుని అమెరికా కలలు కనే కళ్ళకు నిజంగా సినిమా చూపించారు. థాంక్యు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s