నా మనసులో వెంటనే వేగంగా నడిచే స్ప్లెండర్ మీద ఈయన చుట్టూ చేతులేసి ఆనందంగా సినిమాకి వెళుతున్న సీన్ కదలాడింది.
‘హమ్మయ్య – ఇన్నాళ్ళకి తీరిందీ కోరిక’ పక్కింటి వాళ్ళ కారు మనసుని కొద్దిగా నొప్పిస్తున్నా అంత స్టేజీకి అప్పుడే వెళ్ళలేం కాబట్టి మనసుని శాంత పరచుకుని ‘ఎప్పుడెళ్దాం?’ అన్నాను.
‘దేనికి?’ అన్నారీయన ఏదో ఆలోచిస్తూ.
‘బండి తెచ్చుకోవడానికండీ – ఇంకేంటి ఆలోచన’ అని కేలండరు అందుకుని ‘రేపు చాలా మంచిది. వెళ్ళి బండి తీసుకుని ఏకంగా అట్నించటే ఏదైనా సిన్మాకెళ్ళొచ్చేద్దాం’ అన్నాను ఆశగా చూస్తూ.
‘సిన్మాకా? ఉహు – రేపు కుదర్దు. మరెప్పుడైనా చూద్దాం’ అని ఇంకా పరధ్యానంగా ఉన్న ఈయన్ని కుదిపి ‘ఏమైంది? – ఉన్నట్టుండి హుషారంతా మాయమైంది’ అన్నాను.
‘ఆ…ఆహాహా… ఏం లేదోయ్ లోన్‌కి ఇన్స్టాల్మెంట్లు ఎంత పడ్తాయో, అవి పోగా మిగతా శాలరీని ఎలా ఎడ్జస్టుమెంటు చేయాలో…’ ఇంకేదో అనబోతుండగా
‘మీరెప్పుడూ ఇంతే. సరదాగా ఏదో ఓ వస్తువు అమర్చుకోబోతే డబ్బు లెక్కలు తీసి సంతోషాన్ని సగం తగ్గించేస్తారు. ఈ నెల నించి నేనో రెండు వేల ఉద్యోగంలో చేరుతున్నాను కదా – అదే అడ్జెస్టు అవుతుంది లెద్దురూ – ముందు రేపటి సంగతి ఆలోచించండి‘ అన్నాను.
ఈయనోసారి తల విదిల్చి ‘ఏమిటోనోయ్ ఏం కొనాలన్నా భయం వేస్తూంది’ అన్నారు.
‘చాలా బావుందండీ మీ వరస మొన్నటికి మొన్న నేనేదో ముచ్చటపడి ఇన్‌స్టాల్‌మెంటులో కుట్టుమిషను కొనుక్కుంటే ఇవేళ్టి వరకూ అటు చూసి నిట్టూరుస్తూనే వున్నారు నేనేదో బంగారం కొనేసుకున్నట్టు. అయినా అన్నిటికీ ఇంత వెనకడుగూ ముందడుగూ పనికిరాదు’ నిరసనగా అన్నాను ఈ లోనెక్కడ రిజెక్టు చేస్తారో ఈ పిరికి మహాశయుడు అని తిట్టుకుంటూ.
సిటీ లిమిట్స్ నించి పదిహేను కిలోమీటర్ల దూరంలో హైవే మీదున్న కాలనీలో వుంటున్నాం మేం. ఇక్కడైతే అద్దె తక్కువని ఆలోచించేరుగానీ ఆఫీసు నించి ముప్పయి కిలోమీటర్లని చూళ్ళేదు.
రోజూ మూడు బస్సులు మారి ‘దేవుడోమని’ ఇంటికి రాత్రి పదింటికో, పదకొండింటికో వచ్చి పడ్తారు. మళ్ళీ ఉదయం ఏడు గంటలకే ఉరుకులు పరుగులు. పెళ్ళయి ఏడాదిన్నర అయ్యిందన్న మాటేగానీ ఏ రోజూ మూరెడు మల్లెపూలు తేలేదు. ఏమైనా అంటే ఇంత రాత్రిపూట పూల కొట్లు లేవంటారు లేదా పూల కోసం దూరం నడిస్తే బస్సులు పోయి ఇంకా లేటు రావాల్సి ఉంటుందని బెదిరిస్తారు. నాతో పాటు కొత్త కాపురం పెట్టించడానికొచ్చిన మా అమ్మమ్మ ఈయన్ని ఆఫీసుకెళ్ళనిచ్చి వారం రోజులు నాకు గీతోపదేశం చేసింది.
‘ఒసేయ్ పెళ్ళయిన మొదటి ఏడాదీ రెండేళ్ళే ఏ మొగుడైనా పెళ్ళాం మాట వినేది. పిల్లాజెల్లా కలిగేక ఇక నువ్వు కన్పడవు. కాబట్టి ఇంతలోనే నీకు కావల్సిన ఇంటి సామగ్రి అంతా నెలనెలా కొన్పించుకో. నీ మీద మోజుతో ఉన్నప్పుడే అప్పయినా సప్పయినా అన్నీ అమర్చి పెడ్తాడు. ఆ నిషాలో డబ్బుల్లెక్క చూసుకోరు మగాళ్ళు. ఒకసారి లెక్కలు చూసుకోవడం మొదలెడితే ఇక అంతే. ఆలోచించుకో.’ అదే విధంగా నేను గోముగా అడిగి ఇన్నాళ్ళూ నెగ్గుకొచ్చేను. ఈయన ఏమనుకున్నారో ఏమో చేస్తూనే వచ్చారు. నేనడిగేవి గొంతెమ్మ కోరికలు కాకపోవడం వల్లనని అనుకుంటూ ఉంటాను. అయినా నేనేమీ ఈయన తాహతుకు మించి ఏనాడూ అడగలేదు. లేకపోతే ఎక్కడ అమరేవి? తాతయ్యలాగ ఈయనేం బిజినెస్ మేగ్నెట్ కాదు కన్పడ్డవల్లా కొనివ్వటానికి.
‘ఏవిటీ. బండేదీ’ అన్నాను వెనక్కి చూస్తూ వారం లోనే రిటన్ ఇచ్చేసారా అనుకుంటూ.
‘బండినిక మీదట స్టాండులో పెట్టడానికి మాట్లాడేను’ అన్నారు కాళ్ళు కడుక్కుంటూ.
‘ఏ స్టాండు? ఎందుకు?’
‘ఇలా చూడు అప్పూ! మనమా మధ్యతరగతి వాళ్ళం. రోజూ అంతలేసి పెట్రోలు తగలేసుకుని ఆఫీసునించి ఇంటికి ఇంటి నించి ఆఫీసుకి తిరగడం కష్టం. కాబట్టి నాకో బ్రహ్మాండమైన అయిడియా వచ్చింది. సిటీ లిమిట్స్ వరకూ బండిమీద రావడం సబబు సరైన బస్సు సౌకర్యం లేదు కాబట్టి. ఆ తర్వాత డైరెక్టు బస్సులు రాత్రి పన్నెండు వరకూ బోలెడు. అదీగాక ఈ వారం నించీ అబ్జర్వ్ చేస్తున్నా. ఉదయం చాలా మంది ఇక్కణ్ణించి బస్సులో వెళ్ళి జంక్షన్లో ఓ కిళ్ళీ బడ్డి వెనక చిన్న స్థలంలో చెట్టు చుట్టూ పార్క్ చేసుకున్న బండ్లు తీసుకుని వెళుతున్నారు. ఈవేళ నేనూ కనుక్కున్నా. అక్కడ ఆ ఆసామి నెలకు బండికి ఏభై తీసుకుని రాత్రంతా బండ్లు కాపలా కాస్తాడు. ఎలాగూ నెలంతా ఈ పదిహేను కి.మీ. రానుపోను బండిమీద తిరగడం కంటే అదెంతో చీప్. పైగా రాత్రుళ్ళు హైవే మీద బండిపై రావడం సేఫ్ కూడా కాదు ఏమంటావ్’ అన్నారు. చివరి వాక్యం నా మీద బాగా పనిచేసింది.
‘నిజమే, ఒద్దులెండి’ అన్నాను సాలోచనగా.
‘వారానికోరోజు అంటే శనివారం సాయంత్రం మాత్రం పొద్దుపోకుండా వచ్చేస్తాను కాబట్టి బండి మీద ఒచ్చేస్తాలే’ అన్నారు నా గెడ్డం పుచ్చుకుని నేనేదో బాధపడ్తున్నాననుకుని.
ఎలాగూ వారంలో ఆదివారం తప్పించి మిగతా రోజులు ఈయన నన్నెక్కడికీ తీసుకెళ్ళరు కాబట్టి ‘సరే – సరే ఇందులో బాధేముంది? రండి భోం చేద్దాం’ అన్నాను.
మర్నాడు మళ్ళీ దిగాలు మొహమేసుకుని వచ్చారు. ‘ఏం కొంప మునిగిందిరా ఈ పెద్దమనిషితో’ అనుకుంటూండగానే ‘బండక్కడ పెట్టడం వల్ల మరో ప్రాబ్లెమ్ వచ్చిందోయ్’ అని తల విదిలించారు.
‘పోలీసోళ్ళు తీసేయమన్నారా’ వెటకారంగా ముఖం పెట్టి అన్నాను.
‘లేదు లేదు. ఆ స్థలం ఆ కాపలా ఆయనదే. అదికాదు. పొద్దుట నే వెళ్ళేసరికి నా బండి నిండా పక్షులు రెట్టలేసాయి‘
నాకు నవ్వాగలేదు.
‘చాలా బావుంది మీ వరస. మరి మిగతా వాళ్ళ బళ్ళు పాతవైపోయి మీ బండి బావుందని పావనం చేసుంటాయి’ అన్నాను.
మళ్ళీ ఈయన ముఖం చూసి ‘ఇలా ప్రతీ విషయానికీ ఇంత ఆలోచనైతే ఎలా?’ అన్నాను ఈసారి ఈయన బండి కవర్ గురించి ఆలోచించడం మొదలెట్టారని అర్థమై.
హఠాత్తుగా ‘ఓ పని చేయవోయ్, బండికి ప్లాస్టిక్ సంచులు కొని నువ్వే నీ మిషను మీద కుట్టరాదూ – తక్కువ ఖరీదులో అవుతుంది. పైగా పక్షులు ఎంతగా పాడు చేసినా సులభంగా ఉతుక్కోవచ్చు’ అన్నారు.
అనడమేవిటి, మర్నాట్నించి ఏదీ బండి కవరండం మొదలెట్టారు.
ఇంతలో రెండ్రోజుల్లో వెనకింటి సుభద్ర బజారుకెళుతూ ‘అపర్ణా! ఇంట్లో ఎంతసేపు కూచుంటావ్, రారాదూ అలా షాపింగ్ కెళ్ళొద్దాం’ అనగానే నా బండి కవరు ప్లాను చెప్పేను.
ఆవిడ ఆశ్చర్యంగా చూస్తూ ‘ఇలాంటి ఆలోచన నాకు రాలేదు సుమా, ఈయన బోల్డు డబ్బు తగలేసి కవరు కొన్నారు. మనమెళ్ళే దారిలో ఎక్కడైనా సంచులు కొనొచ్చులే, రా’ అంది.
ఇరవై అయిదు రూపాయలు పెట్టి ఓ అయిదు సంచులు తెచ్చి శుభ్రంగా ఉతికి ఆరేసి, తుడిచి కత్తిరించుదామనుకోగానే బండి సైజు ఎంత? అనే ప్రశ్న వచ్చింది.
అదే చెప్పానీయన రాగానే.
‘ఊ, రేపేగా ఆదివారం. ఇవేళ తెస్తాలే. సోమవారం నే వెళ్ళేసరికి రెడీ చెయ్యి‘ అన్నారు మిషను వైపు చూస్తూ పొట్ట తడుముకుంటూ.
ఏ మాటకామాటే చెప్పుకోవాలి. కొనడం కొనేసినా ఏ వస్తువు బాగా ఉపయోగించకపోయినా ఈయన తదేకంగా అటే చూస్తూ చిన్న బాధగా పొట్ట తడుముకోవడం చూసినప్పుడు మాత్రం నాకు ఒళ్ళు మండుకొస్తుంది.
ఆదివారమంతా కష్టపడి బండి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి, ముప్పయి కొలతలు తీసుకుని ‘కవరు రెడీ’ అన్నాను.
ఈయన బండికి తొడిగి చూసి ‘థాంక్సోయ్’ అని నా వైపు చూసి ప్రేమగా తల నిమిరి ‘అయ్యో కష్ట పెట్టేనా?’ అన్నారు.
ఆ మాత్రానికే కరిగిపోయి ‘ఇక ఇండస్ట్రీ పెట్టేయొచ్చు నేను, ఏవంటారు?’ అన్నాను.
నెత్తిమీదొకటి చిన్నగా మొట్టి ‘అంత లేదులే నీకు’ అని ‘మరి ఈ కవరు ఎలా పట్టుకెళ్ళను?” అన్నారు.
క్రితం పండక్కి చీరల దుకాణం వాళ్ళు ఇచ్చిన గట్టి పాలిథిన్ పెద్ద కవరొకటి పరుపు కింద నించి తీసిచ్చేను బండి వెనక లాక్డ్ హేండిల్‌కి తగిలించుకోమని.
కవరుకి ఒక పక్క ఈయన పేరులో మొదటి అక్షరం ‘కె’ అని కుట్టేను. కవరు లోంచి అది బయటకు కన్పిస్తుండగా వీథి మలుపు తిరిగేరీయన. ఇక రోజుకోసారి నేను ఆ కవరు సంగతి ఎత్తి ‘ఎలా ఉందనడం’ ఈయన ‘బావుంద’ని మెచ్చుకోవడం మామూలైంది. తర్వాత ఆదివారం ఇంటికి బండి తేగానే శుభ్రంగా ఉతికి పెట్టి ఇచ్చేను.
‘మా ఆఫీసు వాళ్ళంతా అడుగుతున్నారోయ్ ఈ కవరెక్కడ కొన్నానని’ అని గర్వంగా ఈయన చెప్తుంటే మిషను కొన్నాక నేను చేసిన గొప్ప వెంచర్ అదే కావడం వల్ల నేను పొందుతూన్న ఆనందం కంటే ఈయనకే ఎక్కువ సంతోషంగా వుండడం గమనించి మరింత ఆనందపడ్డాను.
శనివారం సాయంత్రం స్కూలు నించి వచ్చి ఇంటి తాళం తీసి ఉండడం చూసి ఆనందపడ్డాను.
ఈయనప్పుడే వచ్చేసారన్నమాట అనుకుంటూ ‘ఏంటి సార్ కమలాకర్ గారూ! ఇవేళ గంట ముందే వచ్చేసేరు’ హుషారుగా అన్నాను.
మంచమ్మీద బోర్లా పడుకుని దిగులు పడ్తున్న పొజిషన్లో ఉన్న ఈయన్ని చూసి ‘ఏదో మునిగింది’ అనుకున్నాను. దాదాపు గంట బతిమలాడగా ‘నేనోటి చెప్తాను. నువ్వేం బాధ పడకేం’ అన్నారు తను బాగా బాధ పడ్తూ.
జ్వరం వచ్చినట్లున్న మనిషిని చూసి ‘ఏమైంది?’ అన్నాను నుదుటి మీద చేయి వేసి.
‘నాకేం కాలేదు… మరి… మరి… నువ్వు కుట్టిన కవరు పాలిథిన్ సంచి తెగి ఎక్కడో పడిపోయింది…’ ఇంకా వాక్యం పూర్తి చెయ్యకుండానే విసురుగా లేచి ‘ఏం అంత నిర్లక్ష్యం’ అన్నాను.
‘అది కాదోయ్. నీకు బత్తాయి రసం ఇష్టమని ఓ రెండు డజన్ల పళ్ళు కొని ఆ కవరులోనే వేసి వెనక పెట్టుకున్నాను. దారిలో ఎక్కడో…’ అని నీళ్ళు మింగి ‘ఇంటికొచ్చేసరికి కవరు లేదు’ అన్నారు.
‘హయ్యయ్యో… కవరు కాక రెండు డజన్ల బత్తాయిలు పోయాయన్న మాట’ అన్నాను నెత్తి కొట్టుకుంటూ.
నాకు చిన్నప్పట్నించి బత్తాయి రసమంటే ప్రాణం. కవరు పోతే పోయింది, ఇంకొకటి కుట్టొచ్చు. బత్తాయిలు పోయాయంటే… అని బాధ మొదలైంది నాకు.
అదే ఆయన్తో అంటే ‘వెధవ బత్తాయిలు కాదు. నువ్వు ప్రేమతో కష్టపడి కుట్టిచ్చిన కవరు పోయిందని బాధ పడ్తున్నా’ అని ఆయన నెత్తి మీద చెయ్యేసుకు పడుకున్నారు.
‘మరేంటి ఇలా పడుకున్నారు? వెతుకుదాం పదండి’ అన్నాను.
‘ఎక్కడికి? ఇప్పటి వరకూ ఉంటాయా’ అన్నారు.
‘అది కాదు కింద బత్తాయిలు పైన కవరు పెట్టేనన్నారుగా. పైగా పొద్దుపోతూంది. ఎవరూ కాయలు చూడరు. చూసినా కవరుని తీసి పక్కన పడేసి కాయలు పట్టుకు పోతారు. పోనీ ఆ కవరైనా దొరుకుతుంది, బై చాన్స్ బత్తాయిలు. పై పాలీథిన్ కవర్ బ్లూ కలర్ కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేస్తాను నడవండి నడవండి’ అని బైటికి నడిచాను.
ఏమనుకున్నారో ఏమో మౌనంగా బండితీసారు. మేం ఆ సాయంసంధ్యవేళ దారంతా కవరు వెతుక్కుంటూ పదిహేను కిలోమీటర్లు వెళ్ళేం. అక్కడ పెట్రోలు పోయించుకుని వెనక్కి మళ్ళుతూ ‘చెప్పేను కదా అప్పూ! ఎవరో పట్టుకు పోయుంటారు. ఈ సన్నటి వెల్తురు తగ్గేలోగా ఇంటికెళ్ళాలి పద’ అన్నారు. నేను దారంతా ఆలోచిస్తూనే ఉన్నాను. దారంతా ఇళ్ళు లేవు రోడుకటూ ఇటూ పచ్చని చెట్లు తప్ప. ‘ఈ కవరు అంత ఆకర్షణీయంగా కన్పించకపోయినా ఎవరు తీసుకెళ్ళుంటారబ్బా! లోకంలో మరీ ఇంత కక్కుర్తి మనుషులుంటారు కాబోలు…’
దారంతా ఈయన నన్ను సముదాయిస్తూ ‘అయినా తప్పు నాదేలే. బరువుని కాయలేని కవరులో ఇలాంటివి పెట్టడం…’ ఈయన మాటలు నాకు విన్పడడం లేదు. బత్తాయిలు కింద పడి ఎటైనా దొర్లితే హైవేమీద వెనక నించి వచ్చే ఏదైనా వెహికిల్ కింద పడి ఒక్కటో రెండో పచ్చడి కావాలి కదా. అలాంటి మరకలేమైనా ఉండి ఉన్న చుట్టుపక్కల వెతికితే రోడ్డుకిరుప్రక్కల్లో ఎక్కడైనా పొదల్లో నా కవరు ఉండి ఉండొచ్చు అని నేను ఓ జేమ్స్ బాండ్ లెవెల్లో ఆలోచించడం మొదలెట్టి బండి వెనక కూర్చుని రోడ్డునే తీక్షణంగా అటూ ఇటూ చూస్తూ ఉన్నాను.
తిరిగి మా ఇంటి వీధి మలుపుకొచ్చేం. అప్పటికిక పూర్తిగా చీకటైంది. నిరాశగా ఇల్లు చేరేం. ఆ బాధని మర్చిపోవడానికి రాత్రంతా ఇద్దరం ఒకరికొకరు సమాధానాలు చెప్పుకున్నాం. ఓదార్చుకున్నాం. హఠాత్తుగా తెల్లారుఝామున దిగ్గున లేచి ఈయన్ను నిద్రలేపాను. ‘ఏవండీ! నిన్న మనం వెళ్ళిన పెట్రోలు బంకు పక్కన కవరు పడివుంది’ అన్నాను. ఈయన దిగ్గున అదాటుగా లేచి ‘అవునా!’అని ‘నీకెలా తెలుసు’ అన్నారు మళ్ళీ ఆలోచనగా గడ్డం మీద గీరుకుని.
‘కల్లో కన్పించింది’ అంటున్న నా నుదుటి మీద చెయ్యేసి చూసేరీయన.
‘నిజంగా నండీ. తెల్లారుఝామున వచ్చిన కలలు నిజమవుతాయట’ అన్నాను.
‘ఊ – సర్లే, పడుకో పడుకో’ అని అనునయించి మళ్ళీ నిద్రపుచ్చేరు నన్ను.
ఆదివారం ఉదయం కదా! తొమ్మిది గంటలకి లేచేం మళ్ళీ.
‘ఏవండీ… నా కల్లో…’ అని చెప్పబోతుండగా ‘అపర్ణా! మరీ చిన్న పిల్లలా మాట్లాడకు’ అన్నారీయన కాస్త విసుగ్గా.
నాకు వెంటనే కళ్ళ నీళ్ళొచ్చేసాయి. ‘అంతేలే’ అన్నాను.
వెంటనే ‘అది కాదోయ్. నాకు మాత్రం బాధగా లేదా చెప్పు. నిజానికి నీకంటే నాకే ఎక్కువ బాధగా ఉంది. అంత ప్రేమగా కుట్టిన కవరు నా నిర్లక్ష్యం వల్ల పోయిందని’ అంటూ ‘ఇప్పుడేమంటావు?’ అన్నారు నా కళ్ళు తుడిచి.
‘మళ్ళీ వెళ్దాం’ స్థిరంగా అన్నాను.
‘పెట్రోలు…’ అనేదో చెప్పబోతుండగా ‘మీకు నాకంటే డబ్బెక్కువై పోయిందన్న మాట’ అనేసాను.
ఇక ఏం చేయలేక బండెక్కి ‘కూచో’ అన్నారు.
పెట్రోలు బంకు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసినా కవరు దొరకలేదు. నేనిక ఈయన ముఖంలోకి చూళ్ళేక పోయేను.
‘ఇంకోసారెప్పుడూ నీ మాట వినను. నే చెప్పిన మాటే నువ్వు వినాలి సరేనా?’ తీక్షణంగా బండి వెనక్కి తిప్పేరీయన.
ఇక ఏం మాట్లాడకుండా ఊరుకున్నాను. ఈయనకి కోపం వచ్చినపుడు నేనేం మాట్లాడినా ఇంకాస్త గయ్యిమంటారు.
నిరాశగా వీథి మలుపు తిరుగుతుండగా వీథి మొదట్లోని కిరాణా షాపాయన బైటికొచ్చి చప్పున మమ్మల్ని పిలవడం గమనించి ఈయన్ని తట్టేను.
‘ఒక్క నిమిషం’ అని లోపలికెళ్లి చేతిలో నీలం రంగు పాలీథిన్ కవరుతో బైటికొచ్చి ‘నిన్న సాయంత్రం కమలాకర్ గారి బండి వెనక ఈ కవర్ తెగి మా షాపు ముందు పడిపోయిందట. మా అబ్బాయి కొట్లో ఉండి గబుక్కున తెచ్చి లోపల పెట్టేడు. నేను రాత్రి వచ్చి చూసి మా వాణ్ణి మందలించేను. సారీ… తీసుకోండి’ అనిచ్చేడు.
ఆనందంగా మేం ఒకళ్ళ మొహాలు ఒకళ్ళం చూసుకున్నాం. ఇంటికెళ్ళగానే ఈయన బండికి కవరు తొడిగి మురిపెంగా చూసుకుంటుండగా, నేను బత్తాయిలు రెండు డజన్లు ఉన్నాయో లేదో లెక్కపెట్టడం చూసి నెత్తిమీద మొట్టడానికి చెయ్యి పైకెత్తేరీయన.
|
– కె.గీత
http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/prema-kavaru-poyindi—ke-gita
ప్రకటనలు
గీత గారి గీత బాగుండి పోయిన కారుకవరు మళ్ళీ దొరికింది!సంసారంలోని సరిగమలను హాస్యస్ఫోరకంగా రసవత్తరంగా కథలా చెప్పారు!
థాంక్సండీ-
గీత గారు,
ప్రేమ కవరు పోయినా, మురిపెం టపా స్టాంపు మిగిలింది ! మళ్ళీ కల నిజమాయె పోయిన కవరు తిరిగొచ్చే !!
మంచి కథనం ! కీప్ ఇట్ అప్ !
చీర్స్
జిలేబి