నా కళ్లతో అమెరికా- 21 (మోడెస్టో) (Modesto)

మోడెస్టో (Modesto)

DrK.Geetaగత నాలుగు సంవత్సరాల రిసెషన్ ప్రభావంతో ఈ చుట్టుపక్కల దెబ్బ తిన్న అమెరికన్ కుటుంబాలు చాలా వరకు మాడెస్టో చుట్టుపక్కలకి నివాసం వెళ్లిపోయారట. ఉద్యోగాలు లేకపోయినా శాన్ ఫ్రాన్ సిస్కో, శానోజే చుట్టుపక్కల సిలికాన్ వేలీ లో ఇళ్ల అద్దెలు మాత్రం తగ్గకపోయే సరికి టెక్నికల్ క్వాలిఫికేషన్ లేని సామాన్య జనానీకం కనీస ఇంటి ఖర్చు తగ్గించుకోవడం కోసం ఇలా వందల మైళ్ల దూరానికి వెళ్లడం అనివార్యమైందని విశ్లేషకుల అంచనా. మా పిల్లల స్కూల్లో క్లాస్ మేట్ల తల్లిదండ్రులు మాకు తెలిసిన వాళ్లు కొందరు ఇలా సంక్షోభం లో చిక్కుకున్నవారయ్యారు.

      సిలికాన్ వేలీ నుంచి దాదాపు వంద మైళ్ల దూరంలో ఉంది మోడెస్టో. తక్కువ అద్దెలకు మంచి పెద్ద ఇళ్లు దొరుకుతాయని అందరూ చెబ్తూ ఉంటారు. అదీ గాక మోడెస్టో కాలిఫోర్నియాలో చెప్పుకోదగిన వ్యవసాయ ఉత్పత్తి కేంద్రం. ఈ చుట్టు పక్కల పళ్లు, పాలు, చీజ్, ఆల్మండ్లు మొ.న నట్స్, గుడ్లు, మాంసం వంటి వాటికి సంబంధించిన ప్రాసెసింగ్ కంపెనీలు ఉన్నాయి. వైనరీస్, వ్యవసాయ పనిముట్ల స్టీల్ కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే ఆ కంపెనీలలో ప్రధాన భాగం పని యంత్రాలతో నడుస్తాయి కాబట్టి దాదాపు 3 లక్షల మంది నివసించే ఈ నగరం లో ఉద్యోగావకాశాలు కేవలం పాతిక వేల లోపే ఉండడంవల్ల ఇక్కడి నిరుద్యోగం శాతం అమెరికాలో ఏ ఇతర నగరం కంటే ఎక్కువగా నమోదయ్యింది.

ప్రయాణం: ఆ ఊరిని, అక్కడి పరిస్థితుల్ని చూసిరావాలని అనుకున్నదే తడవు ఒక ఆదివారం ఉదయమే బయలుదేరాం. అయితే అక్కడ పిల్లలకు ఆసక్తి కరమైన విషయాలు మా ఐటినరీ లో చేర్చడం వల్ల మేం రాత్రి 9 వరకు ఆ చుట్టు పక్కలే గడిపేం.
మా ఊరి నుంచి రెండుమూడు ఫ్రీవేలు దాటి దాదాపు గంటన్నర, రెండు గంటలు ప్రయాణం. ట్రాఫిక్ ఉన్న రోజుల్లో ఇంకాస్త సమయం కూడా పట్టొచ్చు. కొందరు అక్కడినుంచి రోజూ బే-ఏరియాకి ఉద్యోగరీత్యా కూడా వస్తూ ఉంటారట.
మోడెస్టో కాలిఫోర్నియా సెంట్రల్ వేలీ లో ఉంది. అటు కాలిఫోర్నియా ప్రధాన నగరమైన శేక్రమెంటోకి 70 మైళ్లు దక్షిణం గానూ, ఇటు తీర ప్రాంతానికి వంద మైళ్ల తూర్పుగానూ, యూసోమిటీ వంటి యాత్రా స్థలాలకు 60 మైళ్ల దూరంలోనూ ఉంది. శేక్రమెంటో నుంచి, తీర ప్రాంతం ఓక్లాండ్ నుంచి మరొక వ్యవసాయ ఉత్పత్తి కేంద్రం బేకర్స్ ఫీల్డు కి రైలు మార్గం మోడెస్టో గుండానే పోతుంది కాబట్టి ఆ చుట్టు పక్కల పనిచేసేవాళ్లకు రవాణా సౌకర్యం కూడా ఈ నగరం నుంచి ఉంది.

హిలేమార్ ఛీజ్ ఫాక్టరీ: మా ఇంటి నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి దాదాపు పదకొండు గంటలకు మా ప్రయాణం లో మొదటి స్టాప్ హిలేమార్ ఛీజ్ ఫాక్టరీకి చేరుకున్నాం.
హిలేమార్ మోడస్టో దాటి మరి 15,20 మైళ్ల దూరంలో ఉంటుంది. దారిలో ట్రేసీ అనే ఊరి దగ్గర్నించి నగర వాతావరణం నించి దూరంగా వెళ్లినట్లయ్యి విశాలమైన మట్టి మైదానాలు దర్శన మిస్తూంటాయి. ఆ దగ్గర్లో ఏవియేషన్ అకాడమీ కూడా ఉంది. ఆ చుట్టుపక్కల నేల బారు తోటల కూరగాయల, పళ్ల పెంపకం, పద్ధతి లో పెంచిన ఆల్మండ్ తోటలు, మధ్య మధ్య పశువుల గడ్డి పంటలు తప్ప ఇతరత్రా పచ్చదనం ఏమీ లేక వాతావరణం లో బాగా వేడిమి ఉన్నట్లు అనిపించింది. దారిలో కనిపించిన చెర్రీ పళ్ల దుకాణం దగ్గర ఆగి పళ్లు కొనుక్కుని బాగా దాహం అయినట్లయ్యి అక్కడే నిలబడి పళ్లన్నీ తినేసాం.
వరు కు ఛీజ్ ఫాక్టరీ చూపించాలని హిలేమార్ ఛీజ్ ఫాక్టరీని మొదట ఎంచుకున్నాం. దగ్గర్లో వందలాది ఆవులు పెద్ద పెద్ద షెడ్లలో క్రమపద్ధతిలో దాణా మేస్తూ కనిపించాయి. అక్కడికి వెళ్లేవరకు అదొక పెద్ద కార్పోరేట్ ఫాక్టరీ అని తెలీదు మాకు. కారు తలుపు తియ్యగానే వేడి గాలితో బాటూ విపరీతమైన దుర్గంధం. అది మన దేశం లో లాగా అలవాటైన పశువుల వాసన కాదు. పాలు విరిగిపోయిన భయంకరమైన దుర్గంధం. వరు ఒక్క పరుగున మళ్లీ కారెక్కి ముక్కు మూసుకు కూచుంది. ఆ వాసనకి అర్థం మేం లోపలికి వెళ్లాక అక్కడి గైడు చెప్పాక అర్థమైంది.

ఆ ఫాక్టరీ లో భాగంగా ఆ ఆవరణలో పాలల్లో సారమంతా వాడేశాక, మిగులు నీళ్లని అక్కడ చెరువులలో నిల్వ ఉంచి వాటిని వాడుక నీళ్లగా మరలా వాడతారట. అదీ సంగతి.
పెద్ద ఫాక్టరీ ముందు భాగం లో ఎంట్రెన్సులో గిఫ్టు షాపు, కాఫీ హౌస్, ఐస్ క్రీం షాపు ఉన్నాయి. గిఫ్ట్ షాపు లో అనేక రకాల ఛీజ్ లు కేజీ ముక్కల సైజు నించీ అమ్ముతున్నారు.
అక్కడే గాజు అద్దాలలో పాలు తియ్యడం దగ్గర్నించీ ఛీజ్ తయారీ వరకు వీడియో తో బాటూ డెమో చూపించే ఏర్పాటు ఉంది. ప్రతీ రోజూ ఉదయం పూట గైడెడ్ టూర్ ఉంటుంది. మేం వెళ్లేసరికి ఆ టూర్ మొదలు కావడంతో ఆ హాలు పైకి పరుగున వెళ్లి మిగతా వారితో కలిసాం. స్కూలు పని దినాల్లో చుట్టుపక్కల నుంచి వచ్చే పిల్లలకి అక్కడ ఈ టూరుతో బాటూ ఐస్ క్రీం తయారీ కూడా నేర్పిస్తారట. మేం వెళ్లినది ఆదివారం కావడం తో మాతో బాటూ మరో ఆయిదారుగురు మాత్రమే ఉన్నారు టూరులో. అయినా వరు అన్నీ శ్రద్ధగా వింది. మొదటి ఎగ్జిబిట్ లో ఆవులకు పాలు యంత్రాలతో తియ్యడమనేది బహు ఆసక్తి కరంగా అనిపించింది.

ఇక్కడి ఆవులు రోజుకి నాలుగైదు సార్లు పాలిస్తాయట. యంత్ర సహాయం తో సంపూర్తిగా పాలని ఎక్కడా వృథా కాకుండా, సమయాభావం కలగకుండా పదినిమిషాలలో తీస్తారట. ఇక ఆవులకి తీసుకునే జాగ్రత్తలు, అక్కడ పనిచేసే మామూలు సిబ్బంది దగ్గర్నించీ, డాక్టర్ల వరకూ వేసుకునే రకరకాల కోట్లు, టోపీలు మనం కూడా వేసుకుని ఫోటోలు తీసుకోవచ్చు.

ఇక పాల నుంచి వచ్చే ఉత్పత్తుల వివరం పెద్ద గాధ. పాలని విరగ గొట్టి ఛీజ్ తయారుచేసేక, మిగిలిన పలచటి పాలని పొడిగా చేసి పిల్లల పాలపొడిగానూ, బేకరీ ప్రోడక్టుగానూ, చాక్లెట్ల తయారీ లోనూ, మందులపరిశ్రమలోనూ వాడుతారట. ఇక్కడి నుంచి చైనా మొ.న దేశాలకు ఆ ప్రొడక్టులన్నీ ఎగుమతి అవుతాయట. ఛీజ్ ఫాక్టరీ గ్రూపులలో అమెరికాలో ఉన్న ఇతర గ్రూపులన్నిటిలో ఈ గ్రూపు పెద్దదట. అమెరికాలో ఇతరత్రా బ్రాంచీలు ఉన్నా ఒక్కచోటే కేంద్రీకరింపబడిన పెద్ద ఛీజ్ ఉత్పత్తి కేంద్రమది. అంతా చూసేక అద్దాలలో నుంచి పెద్ద పెద్ద గొట్టాల ద్వారా వచ్చి దాదాపు వందకేజీల ఛీజ్ అచ్చులు తయారయ్యే కార్యక్రమం అక్కడ నిరంతరం జరుగుతూ ఉన్నది మనం చూసే అవకాశం ఉంది. అంత పెద్ద ఫాక్టరీ లో అద్దాల లోపల పనిచేసేవాళ్లు ఇద్దరో, ముగ్గురో మాత్రమే ఉన్నారు. ఈ దేశం లో మేన్ పవర్ కి ఎక్కువ ఖర్చు, యంత్ర శక్తికి తక్కువ ఖర్చు కావడం వల్లననుకుంటా మనుషులకు ఎక్కడా పెద్దగా పని కనిపించదు. ఉపాధి సౌకర్యాలూ కరువైపోయి కనిపించాయి.
ఇక అక్కడి నుంచీ పశువుల పెంపక కార్యక్రమం దూరంనుంచే చూసి బయలుదేరాం. అక్కడ పెట్టే పశువుల దాణాలో ఉన్నపోషక పదార్థాలు మన దేశంలోమనుషులకు కూడా ఎన్నడూ దొరకవు. వాటి పరిశుభ్రత, చివరగా పశు వ్యర్థాలని బయోగాస్ ఉత్పత్తికి, వంటచెరకుగా, భూసారాన్ని పెంచే ఎరువుగా నర్సరీ లకు అమ్మకం వరకు మనకు రోడ్డుపై నిలబడితే ప్రతీ సెక్షనూ కారులో నుంచే కనిపిస్తాయి.
అంత పెద్ద కార్యక్రమంలోనూ ఎక్కడా పిట్ట మనిషి జాడ మాత్రం కనిపించలేదు. పశువులు వాటికవే అక్కడక్కడే ఆయా సెక్షన్లలో బుద్ధిగా తిరుగాడుతున్నాయి. ఒకరిద్దరు మనుషులు పనివేళల్లో మాత్రం వచ్చి వెళతారనుకుంటా. అవన్నీ చూస్తే కొన్నాళ్ళకు యంత్రాలు మనుషుల పైన దండయాత్ర చేసే కల్పిత కథలు నిజమే అని భ్రాంతి కలిగింది నాకు.

https://picasaweb.google.com/104256037410703377895/NaaKallathoAmerica21Modesto?feat=flashalbum#5891440934063886610

“బుల్ డోజర్” బిల్డింగు: అక్కడి నుంచి దగ్గర్లో ఉన్న మరొక చిన్న విశేషం “బుల్ డోజర్” బిల్డింగు చూసేం. అది బుల్ డోజర్ కంపెనీ ఆఫీసు. బయటి నుంచి బుల్డోజర్ మోడల్ లోనే కట్టిన చిన్న నిర్మాణం. ఆన్ లైన్ లో అదేదో గొప్ప విశేషమని రాస్తే అక్కడికి వెళ్లి తీరా దానిని చూసి నవ్వుకున్నాం. పైగా ఆదివారం కావడంతో లోనికి ప్రవేశం కూడా లేదు.

మధ్యాహ్నం భోజనసమయానికి తిరిగి మోడస్టోకి చేరుకున్నాం.
జాన్స్ ఇంక్రెడిబుల్ పీజా: పిల్లల కోసమే ఉన్న ప్లే ప్లేస్- జాన్స్ ఇంక్రెడిబుల్ పీజా కు చేరుకున్నాం. మొత్తం ఇండోర్ లో ఉన్న థీం పార్కులాంటిదది. అంతే కాకుండా అక్కడ బఫే టిక్కెట్టుతో మనకు నచ్చిన పీజాలు, పాస్తాలు మొ.నవి ఎంత కావాలన్నా అక్కడున్నంతసేపు తినొచ్చు. దాదాపు పది రకాల పీజాల వెరైటీలు, కొన్ని పాస్తా నూడుల్సు, రెండు, మూడు రకాల పాస్తా సాస్ లు, పదిరవై రకాల పచ్చి కాయకూరలు, ఆకుకూరలు, కేకులు, పై ల వంటి నాలుగైదు రకాల డిసర్ట్ లు, ఐస్క్రీము. డ్రింక్స్ లు విడిగా టిక్కెట్టు తీసుకోవాలి.
మంచి ఆకలి మీద వెళ్లిన మేము వేడి వేడి పీజా ముక్కలను ఆదరా బాదరా తిన్నాం. అయితే అక్కడ ప్రతి మనిషికీ భోజనం టిక్కెట్టు కొనుకుంటే తప్ప ప్రవేశంలేదు. అది తప్పని సరి కాబట్టి భోజనాలకే అక్కడికి వెళ్తే ఇవన్నీ కలిసి వస్తాయి. పార్కు టిక్కెట్టు వేరే కొనుక్కోవాలి. దానితో అక్కడున్నవన్నీ ఎక్కి దిగొచ్చు. సిరి, వరులకు సరిగ్గా సరిపోయే ప్రదేశమది. ఎంచక్కగా ఆడుకోవడానికి, రోజంతా సమయం గడపడానికి చాలా బావుంది పిల్లలకి.
వరుతో బాటూ అన్నీ చూస్తూ అటుగా వెళ్లాడు సత్య. ఇక సిరి వంతు నాది. ఆ బుజ్జిపాప ఆటే వేరు. కొత్తగా పరుగు వచ్చింది తనకి. అందులోనూ అక్కడొక బంతి కనిపించింది. ఇక దానిని ఎటు కనబడితే అటు తన్నుతూ మనుషులమధ్య నుంచి అతి వేగంగా తప్పించుకుంటూ బంతి వెనకే పరుగు తీసింది. తన వెనకే నేను. సాయంత్రం వరకూ అదే మా ఆట.
మధ్యలో కాస్సేపు ఊరు చూసొద్దామని చేతిలో రిటన్ స్టాంపు వేయించుకుని బయటకు వెళ్లాం. నిజానికి అక్కడికీ, ఇక్కడికీ ఇళ్ళు కట్టే విధానం లో కానీ, వీధుల, కాలనీల తీరుగానీ ఏమీ తేడా లేదు.

చెట్టూ చేమా తక్కువగా ఉన్నందు వల్ల కనుచూపు మేర స్పష్టంగా కనిపిస్తూంది. రోడ్లపై ఏవేవో పరిశ్రమలు ఉన్నా ఎక్కడా గాలిలో కాలుష్యం ఉన్నట్లు అనిపించలేదు. అవన్నీ పళ్ల, విత్తనాల పరిశ్రమలుకావడం వల్లనో ఏమో.
డౌన్ టౌన్ వైపుగా వెళ్లాం.

మెక్ హెన్రీ మేన్షన్: అక్కడ తప్పని సరిగా చూసి రావాలనుకున్న మెక్ హెన్రీ మేన్షన్ ని చూడడానికి వెళ్లాం. రాబర్ట్ మెక్ హెన్రీ అనే స్థానిక భూస్వామి 1827- 1890 ప్రాంతంలో ఇక్కడ నిర్మించుకున్న గొప్ప భవంతి అది. అయితే మధ్యలో 1923-1972 వరకు ఈ భవంతిని అపార్టుమెంట్సుగా మార్చి వేసారు. అయితే తిరిగి ఈ భవంతిని అప్పటి సంస్కృతీ చిహ్నంగా భద్రపరచడం కోసం ఇటీవలికాలంలో దానిని అప్పటి రూపానికి తీసుకు వచ్చి ఉచితంగా సందర్శనకు అందుబాటులో ఉంచారు. అది ఇక్కడ మౌంటెన్వ్యూ లో ఉన్న రింగ్ స్ట్రాఫ్ బిల్డింగు వంటిదే.

కొంచెం పెద్దది కాకపోతే. బయటి నుంచి తెల్లని సౌధం, చుట్టూ చెట్లతో చుట్టుకుని ఉన్న ప్రాంగణం తో అద్భుతంగా ఠీవిగా నిలబడి ఉంది. మెట్లపై అడుగు పెట్టగానే ఎప్పటివో, ఎవరివో జ్ఞాపకాలు తట్టినట్లయ్యాయి. మాతో ఒక గైడు ఉండి ప్రధాన ద్వారపు తాళం తీసింది. ఎత్తైన నగిషీల తలుపులు, విక్టీరియా కాలం నాటి కార్పెట్టు, గోడలకు లతలు అంటించినట్లున్న వాల్ పేపర్లు…లోనికి ఆహ్వానించాయి.

ముందు వరండాకు ఇటూ, అటూ రెండు గదులు, మధ్యలో మెట్ల వరుస, వెనక మరో వరండా నుంచి వెనక్కి భోజనాల గది, వంటిల్లు. మొదటి గదిలో అప్పట్లో నివసించిన తొలి తరపు ఫోటోలు ఉన్నాయి.
తల వెండ్రుకలతో తయారు చేసిన ఎన్నో చిత్ర విశేషాలు గోడలకు వేళ్లాడుతూ ఆ భవంతిలో ఉండడం విశేషం. అన్నిటికన్నా తలవెంట్రుకలతో తయారుచేసిన బోనసాయ్ వృక్షపు చిత్రపటం లోని కళా నైపుణ్యం గొప్ప అబ్బుర పరిచింది.
గది గదికొక వేడి నెగడు (fire place). అతిథుల గదిగా భావించబడే మొదటి గదిలో పొడవాటి నెమలి ఒకటి టేబుల్ ను ఆనుకుని పైన కూర్చుని, నిజం నెమలిని తలపింపచేస్తూ ఉంది.
ఖరీదైన సోఫాలు, గోడలకు అందమైన నిలువెత్తు యూరోపియన్ చిత్రపటాలు. వరండా నించి వెలుగు మెట్ల సందులో ఉన్న విశేషం చూపించింది గైడ్.

అది అప్పటి కాలంలో సజీవమై విరాజిల్లిన అమెరికన్ ఇండియన్ తల అక్కడ మొలిచినట్లున్న కళారూపం. దానితో పాటుగా వారి జీవన విధానం లో భాగమైన పక్షి ఈకలు.. అవన్నీ ఇంటిలో ఇలా ఒక కార్నెర్ లో వుంచితే మంచిదని ఆ నాటి ధనవంతులు నమ్మే వారట. డబ్బులున్న వాళ్ల కేమిటి మనుషులందరికీ నమ్మకాలు ఏ దేశం లోనైనా ఒక్కటే అనిపించింది నాకు.

భోజనాల గదిలో వెండి సెట్లు, బంగారు పూత పోసిన స్పూనులు. ఇక అక్కడ వాడిన చెక్క నగిషీల బల్లలు, కుర్చీల ఖరీదు ఎంత ఉంటుందో లెక్కే లేదు. ఈ భవంతిని మరలా ఇలా పునర్నిర్మించే కార్యక్రమంలో భాగంగా ఇందులో ఒకప్పటి యథాతథమైన సామగ్రిని దాయాదుల నుండి సేకరించి వారసులు అందజేసారట. ఇక వంటింటి లో పొగ పైకి రాని కట్టెల పొయ్యిలు ఇప్పటి ఆధునిక అమెరికను కరెంటు పొయ్యిల మాదిరిగానే ఎక్కడా మంట కనబడకుండా ఉన్నాయి. మాంసాన్ని ఖీమా చేసేందుకు ఉపయోగించే చిన్న మర లాంటి సాధనం నుంచి చిన్న కత్తి వరకు అప్పటి కాలాన్ని ప్రతిబింబించే అనేక పనిముట్లు గోడలకి తగిలించి ఉన్నాయి.

ఇక అక్కడి నుంచి మెట్లపైన ఉన్న గదులన్నీ పడకగదులు, అతిథి గదులు. ఇలాంటి ప్రతీ పాత కాలపు భవంతులలో మంచాల పొడవు తక్కువగా ఉండడం గమనించేరా? అంది గైడు. ఆ కాలం లో మనుషులలో ఎత్తు ఎక్కువగా ఉండేవారు వేళ్లమీద లెక్కపెట్టగలిగేవారే. తెలుసా మీకు అనడిగింది. అయిదడుగులలో ఉండేవారు గత శతాబ్దిలో బాగా తగ్గిపోయారు కదూ అని నవ్వింది.
పిల్లల గదిలో పాత బట్టలతో అల్లిన బొమ్మ భలే ఉంది కదూ మమ్మీ అంది వరు. నా కెందుకో పాలకుర్తి సోమన గొడగూచి బొమ్మపొత్తికలతో ఆడుకొన్న వర్ణన గుర్తుకొచ్చింది. అద్దాల తలుపుల చిన్న షెల్ఫు లోపల బొమ్మ ఇనుప రైలు, ఆట సామాన్లు.
అల్లిక సామాను తో, సాయంకాలపు విశ్రాంతి వాయిద్యాలతో నిండిన ఆ పక్క గదిలో ఒక పక్కగా మూగగా పడి ఉన్న టెలీఫోను, టైపు మెషీన్లు పూర్తిగా ఇత్తడితో చేసినవి, తళుక్కున మెరుస్తూ. అల్లారు ముద్దుగా పెరిగిన ఆ ఇంటి పదేళ్ల బాలిక అనుకోని విధంగా అగ్నిప్రమాదంలో అసువులు బాసిందట. ఆ అమ్మాయి చిత్ర పటాలు కన్నీళ్ల గురుతులై వేళ్లాడుతూ ఆగదిలో కనిపించాయి. నిజానికి అక్కడ ఉన్నవస్తువులను వాడిన ప్రతి ఒక్కమనిషి ఇప్పుడు సజీవంగా ఎక్కడా భౌతిక ప్రపంచంలో లేకపోయినప్పటికీ నాకెందుకో ఆ విషాదం బాగా బాధని తెప్పించింది. బరువైన గుండెతో బయటకి వచ్చేను.
భవంతికి పక్క భాగంలో గుర్రాలు లేని గుర్రపు బగ్గీ ఒకటి నిలబడి ఉంది, అప్పటి దర్పపు దర్పణంగా.
అక్కడి నుంచి గిఫ్ట్ షాపులో ఏమైనా కొందామని వరు నన్ను లాక్కువెళ్లింది. అవన్నీ అప్పటి కాలాన్ని ప్రతిబింబించేవే కానీ బాగా ఖరీదైనవి. చిన్న పింగాణి టీ సెట్టు నలభై డాలర్లు. వదిలి రాబుద్ధి కాలేదు.
బయటికొచ్చి మరలా తిరిగి జాన్స్ పీజా ప్లేస్ కు వచ్చి ఏడైనా, ఎనిమిదైనా వరుకు తనివి తీరడం లేదు. ఇంకాస్సేపాగి ఇంటికి వెళ్దామంటుంది. కానీ మేం వంద మైళ్లు మరలా తిరిగి డ్రైవ్ చేసుకెళ్ళాలి ఇంటికి. ఇక తప్పనిసరిగా బయలుదేరదీసాం.

బెర్రీ పికింగు: ఆ చుట్టుపక్కల యాభై మైళ్ల రేడియస్ లో చెర్రీలు, స్ట్రా బెర్రీ లాంటి ఫ్రూట్ పికింగ్ చెయ్యొచ్చు. కానీ అటువంటివాటికి ప్రత్యేకంగా ఒక రోజంతా కేటాయించాలి.
అయితే ఈ ప్రయాణం లో మాకు వీలు కలగలేదు కానీ, ముందో సారి మరోచోట బెర్రీ పికింగు అనుభవం ఇక్కడ చెప్పాలి.
మేం వచ్చిన కొత్తలో ఒక ఆదివారం తెలిసిన మిత్రులు స్ట్రాబెర్రీ పికింగుకి వెళ్దామని బయలుదేరదీసారు మమ్మల్ని.

ఫ్రూట్ పికింగు లో తలా ఒక టిక్కెట్టు కొనుక్కుని పళ్ల సేకరణ మొదలుపెట్టాలి. టిక్కెట్టు కొనుక్కున్న వాళ్లకి ఒక్కొక్క ఖాళీ బుట్ట ఇస్తారు. పికింగులో అక్కడ తినగలిగినన్ని పళ్లు ఉచితంగా తినొచ్చు. కానీ బుట్ట నింపుకుని బయటికి వచ్చేటప్పుడు ఆ తూకానికి డబ్బు కట్టి పళ్లు తెచ్చుకోవాలి. మేం స్ట్రా బెర్రీలు తిందామని సరదాపడి గేట్ దగ్గర వరకు వెళ్లి లైనులో టిక్కెట్టు తీసుకునే వేళకి తెలిసినదేమిటంటే స్ట్రా బెర్రీలు కాకుండా అక్కడున్నవి రాస్బెర్రీలని. సరే ఏం చేస్తాం? ఏదో బెర్రిల్లే, అనుకుని లోపలికివెళ్లాం. ఇంతకీ మాకు అప్పటికి రాస్ బెర్రీలంటే ఏమిటో తెలీదు. రాస్ బెర్రీలంటే స్ట్రాబెర్రీ లంత పెద్దవి ఉంటాయనుకుంటే, తీరా అవి అతిచిన్న తుప్ప బెర్రీల్లాంటి ఎరుపు రంగు పుల్లని బెర్రీలు.

పైగా నెత్తి మాడ్చే ఎండ. తుప్పల్లోకి దూరి కొయ్యడం మాట అటుంచి, తీరా కోసాక ఇంటికి పట్టుకెళ్లి ఎవరు తినాలో అర్థం కాలేదు. కానీ అక్కడి వరకూ వెళ్లి బుట్ట లో కాసిన్ని కోసుకుని బయటకు రాలేని నామోషీ. అక్కడ తినడానికి ప్రయత్నించి నాలుగైదు కంటే తినలేక ఊరుకున్నాం. ఇక తలా ఒక బుట్ట కొన్నాక ఇంటికి వచ్చి గ్లాసు బెర్రీ లకు సోలెడు పంచదార పోసి జ్యూస్ చెయ్యడానికి ప్రయత్నించాం. అదీ తాగలేక స్టౌ మీద పెట్టి సాయంత్రం వరకు మరిగించి దానిని రాస్బెర్రీ జాము చేసాం. అయితే బ్రెడ్డుకు ఎంతో రాసుకుని త్వరగా తినలేక మరో వారం, పది రోజులు అవస్థపడి బయట పారబోసేం. అదంతా తల్చుకుని ఇప్పుడు దారిలో బాగా నవ్వుకున్నాం. కానీ అప్పుడు భలే ఏడుపొచ్చింది. వచ్చిన కొత్తలో జరిగిన వింత అనుభవంగా మిగిలినప్పటికీ.
అప్పట్నించీ ఫ్రూట్ పికింగుకి ఎవరు రమ్మన్నా ఇదే గుర్తు వస్తుంది. నిజానికి అలా పిక్ చెయ్యడానికి వెళ్లడం ఏదో పిల్లలకి ఆటవిడుపుగా ఉండడం కోసమే గానీ అదేమంత లాభసాటి బేరం కాదు. అంత కంటే షాపులో డైరక్టుగా కొనుక్కుంటే అంత కంటే తక్కువ ఖరీదుకే వస్తాయి.

ఇక సామాన్య జీవితం చూడాలనుకుని మోడెస్టో కి బయలుదేరిన నాకు ఆశాభంగమే మిగిలింది. ఎంత దూరం వెళ్లినా పట్టణానికి, పల్లెకు తేడా లేని, అసలు ఎటు వంటి జీవితమూ పైకి కనబడని అమెరికా జీవనంలో ఏమి కనబడుతుంది? అయితే మరీ గాఢమైన పట్టణ వాతావరణం నుంచి విసిరేసినట్టున్న పట్టణ వాతావరణం చూడడానికి అలా కొంత దూరం ప్రయాణించొచ్చు. కోడి పెట్టలు చూడాలనుకున్నా ఫార్మ్ కో, పెట్ జూ లకో వెళ్ళి చూడాలసిన ఇక్కడి పిల్లలకు అవన్నీ చూపించాలనుకుంటే వెళ్లొచ్చు. …………………..

………….

Published in July , 2013 by VIHANGA

http://vihanga.com/?p=9259

 

ప్రకటనలు
This entry was posted in నా కళ్లతో అమెరికా(Travelog) and tagged , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s