నా కళ్లతో అమెరికా-22 (ఉత్తర కాలిఫోర్నియా యాత్ర) రోజు-1

Dr K.Geeta

ఉత్తర కాలిఫోర్నియా యాత్ర(రోజు-1)
ఫెయిర్ ఫీల్డు-శాంత రోసా
ప్రతీ సారీ ఒక ఊరని అనుకుని, ఆ చుట్టుపక్కల ఏముందో చూసి రావడం మేం రివాజుగా చేసే పని. కానీ ఈ సారి నాకు ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఒక రూట్ అని పెట్టుకుని వరసగా రోజూ కొంత మేర ప్రయాణం చేస్తూ దారిలో ముఖ్యమైన విశేషాలు చూస్తూ వెళితే ఎలా ఉంటుందని. ఐడియా రావడమే  తరవాయి, సత్యకూ, పిల్లలకూ సెలవులు వచ్చే జూలై 4 ఇక్కడ ఇండిపెండెన్స్ డే వారం లో ప్లాను చేసాను. మొత్తం ప్రయాణం దాదాపు పన్నెండు,పదమూడు వందల మైళ్లు. ఇంత వరకు చూడని ఉత్తర కాలిఫోర్నియాలో సముద్ర తీరం లో అధిక భాగం ప్రయాణం. రోజూ పగలల్లా ప్రయాణం చేస్తూ రాత్రికి ఒక ఊరిలో ఆగడమన్నమాట. అయితే చిన్నపిల్లలతో వెళ్తున్నాం కాబట్టి ముందే ఏ ఊర్లో ఆగాలో నిర్ణయించుకుని అక్కడ రూము రిజర్వేషన్లు అన్నీ చేసుకున్నాం. అయితే రూట్ లో ఎక్కడన్నా ఇంకా చూడాల్సినవి ఉంటే చివరగా మరి రెండు రోజులు ప్రయాణాన్ని పొడిగించాలని అనుకున్నాం. వాటికి అప్పటికప్పుడు రిజర్వేషన్లు వీలు వెంబడి చేయాలని అనుకున్నాం.

             కాలిఫోర్నియా పశ్చిమ తీరమంతా పసిఫిక్ సముద్ర తీరమని ముందే చెప్పుకున్నాం కదా! అందులో మేం ఇంచు మించు మధ్య కాలిఫోర్నియా సముద్ర తీరం లో ఉంటామన్నమాట. దక్షిణ భాగం లో సముద్ర తీరం లో అన్ని ఊళ్లూ చుట్టేయడం అయ్యిపోయింది కానీ శాన్ ఫ్రాన్సిస్కో నించి ఉత్తర తీరం లో పాయింట్ రేయాస్ వరకూ మాత్రమే ఇంతకు ముందు వెళ్లొచ్చాం. ఇంకా దాదాపు మరో 300 మైళ్ల పొడవునా క్రిసెంట్ సిటీ వరకూ ఉన్న సముద్ర తీర ప్రాంతాన్ని సందర్శించనే లేదు. అది ఈ యాత్రలో మొదటి ప్రాముఖ్యత గా పెట్టుకున్నాం. సముద్ర తీరం లో ఎక్కడ మాత్రం ఏం ఉంటుంది అని ప్రశ్న ఎవరికైనా రావొచ్చు. సముద్ర తీరాల్ని జాగ్రత్తగా చూస్తే లో ఒక ప్రాంతానికి, మరొక ప్రాంతానికి ఎక్కడా పోలికేఉండదు. నా వరకూ నాకు దేనికది ప్రత్యేకమైన విశేషంగా తోస్తుంది పైగా ఎంతకీ తనివి తీరదు. అదేదో తీరని గత జన్మపు బంధంలాగా వెంటాడే స్మృతులు.

                   ఇక  మేం పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి కేవలం మాకు నచ్చినవే అయితే వాళ్లకు బోరెత్తి పోతుంది కాబట్టి కనీసం రోజులో వెళ్లే చోటుల్లో ఒక ప్రదేశమైనా పిల్లలకు ఆసక్తి దాయకంగా ముఖ్యంగా మా వరుకు వయసు వాళ్లకు నచ్చే ప్రదేశాలు ఈ యాత్రలో ఉండాలని అనుకున్నాం.

                  అన్ని ప్రయాణాల్లాగే ప్లానింగ్ నించి అన్ని పన్లూ నా పైనబడ్డాయి. చివరి నిమిషంలో ప్లాన్ చేస్తే మేం వెళ్లే ప్రాంతంలో ఎక్కడా టిక్కెట్లు దొరకవు కాబట్టి ఇంకా 20 రోజుల ముందే టిక్కెట్లు  బుక్ చేయడం మొదలు పెట్టాను. ఆన్ లైన్ లో రిజర్వేషన్ల సమయంలోనే డబ్బులు కట్టేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ నెల క్రెడిట్ కార్డు బిల్లు పది పేజీలొచ్చింది.
ఇక సత్య ప్రతీ రోజూ ఇంటికి రావడం తోనే ఎంతవరకూ వచ్చాయి ఏర్పాట్లని అడగడం, ఏదో ఇంట్లో పెళ్లి చేస్తున్నట్లు ” ఆ ..అవుతున్నాయమని” నేను సమాధానం చెప్పడం.

           “ఇదిగో ఇలా మనం ఏ ఉరు వెళ్తున్నామో కాగితమ్మీద రాసుకొస్తే కుదరదు. ఈ సారి నాకు అంతా ఆన్ లైన్  సమాచారం కావాలి. మనం వెళ్లే మేప్, రూట్లు.. అన్నీ నా సెల్ ఫోన్ ఆన్ చెయ్యగానే నాకు కనపడాలి.” అని ఓ కొత్త పని కూడా అప్పగించాడు నాకు. “పనులు చెయ్యడంలో జిడ్డయినా పనులు అప్పగించడం లో మాత్రం మహా చురుకు” అనుకుంటూ

                అన్ని చోట్లా మనకి సెల్ ఫోన్ సిగ్నల్ ఉంటుందా? అని నేను అనబోతే “ఇది. అమెరికా. ఏమనుకుంటున్నావో” అన్నాడు.(అయితే ప్రయాణం లో దాదాపు 50% సెల్ ఫోను సిగ్నల్స్ లేని చోట ప్రయాణించడం వల్ల అదృష్టం కొలదీ కారు లోని కాగితం మేప్ సాయంతో ప్రయాణం చెయ్యగలిగేం. అలా సిగ్నల్ పోయినప్పుడల్లా డప్పాలు కొట్టిన సత్య ముఖం, విజేత గా వెలిగిపోతున్న నా ముఖం చూడాలి!)
“సరే. తనకంత ధీమా ఉన్నపుడు మనకేమని మొత్తం కష్టపడి ఆన్ లైన్ లో తనకి మేప్ సేవ్ చేసిచ్చాను.”
మేం వెళ్లే రూట్, ఎక్కడెక్కడ ఎప్పుడు ఆగుతాం వగైరా వివరాలు అందులో ఉంటాయన్నమాట.

ప్రయాణం: మొదటి రోజు మా యాత్రలో మొదటి విహార ప్రదేశం ఫెయిర్ ఫిల్డు లో ఉన్న ” జెల్లీ బీన్ చాక్లెట్ ఫేక్టరీ” అని చెప్పగానే ఎప్పుడు ముందు రోజు వరకూ ఏమీ సర్దుకోని  వరు రెండు రోజుల ముందే తన బేగ్గు సర్ది తీసుకొచ్చి హాల్లో పెట్టింది. పైగా ఎప్పుడెళ్తున్నాం అని పది సార్లు అడిగింది. అంతే కాకుండా “ఐ కాంట్ వెయిట్ టు సీ జెల్లీ బీన్ ఫేక్టరీ” అని తెగ మురిసిపోయింది.

                  జూలై నాలుగున బయలుదేరుదామనుకున్న వాళ్లం ఆ రోజు ఈ ఫేక్టరీ తెరిచినా  సిబ్బంది సెలవులో ఉంటారు కాబట్టి చూసేందుకేమీ ఉండదని, ముందు రోజే బయలుదేరాం.
తీరా అక్కడ వరకు వెళ్లాక ఫాక్టరీ మూసి ఉండి, చూసేందుకేమీ లేదంటే మా వరు తో ఇంకేమైనా ఉందా?
ఫెయిర్ ఫీల్డు మా ఇంటి నుంచి 80 మైళ్ల దూరం లో ఉంటుంది. మహా అయితే గంటన్నర, రెండు గంటల్లో వెళ్లిపోవచ్చు. అయినా ఉదయం ఫాక్టరీ తెరిచే వేళ కల్లా అక్కడ ఉండాలని వరు పట్టుబట్టడం తో ఇంట్లోంచి ఎనిమిది కల్లా బయలుదేరాం.

                   అందుకోసం పిల్లల్ని 6 గంటలకే లేపాలని నేను చూసేసరికి వరు ఎప్పుడు లేచిందో స్నానం చేసేసి రెడీగా ఉంది. ఆ పిల్ల ఆతృత కు నవ్వు వచ్చినా, పిల్లలకు ఈ వయసులో ఇలా చాక్లెట్లు, బిస్కెట్లు మొ.న వాటి పట్ల ఉండే ఇష్టం పెద్దయ్యాక ఉండదు కదా! అనిపించింది.
సరిగ్గా అరగంట లో కారు లో నేను వెనక సీట్ల వైపు తిరిగి చూసేసరికి వరు, సిరి హాయిగా నిద్రపోతూ కనిపించారు.
ఉదయం చాలా ఆహ్లాదంగా ఉంది. తొలి రవి కిరణాలు పర్చుకుంటూండగా మేం మా పక్క వాహనాలని దాటుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ మబ్బుల రహదారుల్ని మా నవ్వులతో తొలగించుకుంటూ మా యాత్రలో మొదటి రోజులోకి అడుగుపెట్టాం. స్వతహాగా మా ఇద్దరికీ ఇతర ప్రాంతాలు తిరిగి చూడడం అంటే ఇష్టం కావడం వల్ల ప్రయాణమనేసరికి బోల్డు ఉత్సాహం వచ్చేస్తుంది మాకు.

https://picasaweb.google.com/104256037410703377895/NaaKallathoAmerica22?feat=flashalbum#5902608350318494946

ఫెయిర్ ఫీల్డు-జెల్లీ బీన్ ఫాక్టరీ: సరిగ్గా పదిగంటలకల్లా  ఫెయిర్ ఫీల్డు లోని జెల్లీ బెల్లీ లేన్ లోని జెల్లీ బీన్ ఫాక్టరీకి వెళ్లాం. అయితే పిల్లలందరికీ వేసవి సెలవులు కావడం వల్లా, తొమ్మిది గంటలకే ఫాక్టరీ తెరవడం వల్ల ఎంట్రన్సులో ఫాక్టరీ విసిటింగ్ క్యూ పెద్దదిగానే ఉంది. మేం క్యూలో దాదాపు అరగంట నిలబడ్డాం. బ్యాచ్ ల వారీ గా  ఫాక్టరీ టూరుకి గైడ్లతో పంపడం వల్ల, మేం వేచి చూడాల్సి వచ్చింది. ఫాక్టరీ టూరు కి టిక్కెట్టు ఏమీ ఉండదు.ఇక మా కంటే ముందు బ్యాచ్ సరిగ్గా మా ముందు వరకూ వచ్చి, మమ్మల్ని ఆపేయడం వరుకి భలే బాధాకరమైపోయింది. అయితే అది మరిపించడం కోసం సత్యని అక్కడే లైను లో ఉంచి, పక్కనే జెల్లీ బీన్ ఫ్రీ సేంపుల్స్ అన్న కౌంటర్ దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్లేను. ఒక్కొక్కరికి మూడు ఫ్లేవర్ల బిళ్లలు రెండేసి చొ||న ఉచితంగా టేస్టు చెయ్యనిస్తారు.

             ఇంతకీ జెల్లీ బీను లంటే తియ్యటి కోటింగుతో  పెద్ద గుగ్గిళ్ల సైజు లో ఉండి, చిక్కుడు విత్తనం ఆకారం లో ఉన్న సాగే పిండి ఉండల్లాంటివి.
టేస్టింగులో కొన్ని ఫ్లేవర్లు భయంకరంగా ఉన్నాయి. కానీ  అలా ముఖం పెడితే వరు “నాకు నచ్చేది నీకు నచ్చదంటావని గోల చేస్తుంది” కాబట్టి “ఒహో చాలా బావున్నాయన్నాను.”
ఇక ఫాక్టరీ టూరుకి మరో అరగంట లో మా వంతు వచ్చింది.

                    ఇక తమాషా ఏమిటంటే ఫాక్టరీ అంతా కింద షెడ్డు లాంటి  పేద్ద హాలు లో సెక్షన్ల వారీ గా ఉంటుంది. పైన చుట్టూ గాజు అద్దాలు కట్టిన వరండా లాంటి దాంట్లోంచి కొన్నివీడియాల ద్వారానూ, కొన్ని ప్రత్యక్షంగా చూస్తూనూ నడవాలన్నమాట. అంతే కానీ స్వయంగా దగ్గరికెళ్లి చూసేదేమీ ఉండదు. ముందు పిండి ఉడికించి బిళ్లలుగా తయారు చేసే యూనిట్ ఎందుకో చూపించలేదు. అదంత అందమైన ప్రక్రియ కాకపోవడం వల్లనేమో. ఇక అందమైన బిళ్లలు తయారై బెల్టు మీద నుంచి వచ్చే దగ్గర్నించి, రంగుల కోటింగ్ వేయడం, పంచదార కోటింగ్ తో వాటిని మరికాస్త లావైన బిళ్లలుగా మార్చడం వగైరా వరసగా చూపించే వీడియో ప్రదర్శనలు, ఈ చాక్లెట్ల చరిత్ర, మధ్య మధ్యలో మనిషికొక్కటి చొప్పున రుచి చూపించే కొత్త ఫ్లేవర్ బిళ్లతో దాదాపు 20,30  నిమిషాలు బావుంది టూర్. మేం తిరిగి కింది కొచ్చేసరికి ఈ సారి లైను మరింత పెరిగింది. కింద గిఫ్ట్ షాపు లో మరొక అరగంట పైనే గడిపేం.  అక్కడ ‘బెల్లీ ఫ్లాప్స్ ‘ చాలా ఫేమస్ అని ఎక్కడో చదివి, అదేమిటో అనుకున్నాను. మామూలుగా అక్కడ అమ్మే ప్రతి బిళ్ల మీద ఆ కంపెనీ పేరు ముద్రింపబడి ఉంటుంది. ఒక క్రమ పద్ధతి లో లేని రూపంలో ఉన్న బిళ్లల పైన ముద్ర వెయ్యకుండా విడిగా పెద్ద పేక్ లు కట్టి, మామూలు కంటే తక్కువ రేటు కి అమ్ముతారు.  అవే బెల్లీ ఫ్లాప్స్. అది కాకుండా మెత్తటి పంచదార ముద్ద బిళ్లల్లాంటి ఫడ్జ్ ల దగ్గర వరు మరికాస్సేపు అతుక్కుపోయింది. ఇలా మధ్యాహ్నం భోజనాల సమయం వరకు ఫెయిర్ ఫీల్డు లోనే గడిపేసాం.

శాంత రోసా-సఫారీ వెస్ట్: అక్కడి  నుండి మధ్యాహ్నం మూడు గంటలకల్లా మేం శాంత రోసా లోని “సఫారీ వెస్ట్” అనే ఆఫ్రికన్ సఫారీకి వెళ్లవలసి ఉంది.

               శాంత రోసా ఫెయిర్ ఫీల్డు నుంచి దాదాపు యాభై మైళ్ల దూరం లో ఉంటుంది. మహా అయితే గంటలో వెళ్లిపోవచ్చు. కానీ మేం వెళ్లేది చిన్నపాటి రోడ్లలో. కాబట్టి రెండు గంటలు పట్టింది. ఇంతకు ముందు చూసిన నాపా వేలీ, కలిస్తోగా ల మీంచే ఈ ప్రదేశానికి వెళ్లాం. ఈ సఫారీ వెస్ట్ కావడానికి శాంత రోసా కౌంటీ లోకి వస్తూంది కానీ,  కలిస్తోగా పెట్రిఫైడ్ ఫారెస్టు నుంచి మరో అయిదారు మైళ్ల దూరం లో ఉందంతే.  మళ్లీ మేం నాపా వెళ్లినప్పటి జ్ణాపకాల్ని నెమరువేసుకుంటూ కలిస్తోగా డౌన్ టౌన్ కోసం  పక్కకు దారి తీసుకుని భోజనం చెయ్యడానికి ఆగాం. ఈ సారి ఒక ఇటాలియన్ రెస్టారెంటుకి వెళ్లాం. సాధారణం గా ఎక్కడో ఒకటి తప్ప కొత్త రెస్టారెంట్లలో భోజనం రుచిగా ఉండదు. కానీ చాలా విచిత్రంగా ఆర్డరు చేసిన వన్నీ చాలా రుచికరంగా ( ఇతర దేశపు రుచులలో) ఉన్నాయి. రవియోలీ అనబడే ఒక రకపు పాస్తా, పీజా, మేక్& చీజ్  అర్డరు చేసాం. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే వాళ్లే స్వంతంగా తయారుచేసిన ఒక రకమైన గార్లిక్ బ్రెడ్ కాంప్లిమెంటరీగా సర్వ్ చేసారు. మరేదో అక్కడ స్థిమితంగా భోజనం కోసం ఒక గంట గడిపేం.
సఫారీ వెస్ట్ కి అనుకున్న విధంగా రెండున్నర కల్లా చేరిపోయాం.

                  ఎండ బాగా తీక్షణం గా ఉంది. మరీ మన దగ్గర ఉండే పొగల వేడైతే కాదు కానీ కారులో కూర్చుంటే మాత్రం బాగా చెమటలు పడుతున్నాయి. అద్దాలు దించితే బయట కూడా ఏమీ చల్లగా లేదు. అందుకే అక్కడ ఆఫ్రికన్ సఫారీ నడపగలుగుతున్నారనిపించింది. ఆఫ్రికన్ సఫారీ థీం తో నడుపుతున్న ఆఫ్రికా జంతువులకే ప్రత్యేకమైన జూ అది. అక్కడ ఆ వాతావరణం లో గడిపేందుకు కాటేజ్ లు కూడా ఉన్నాయి.

                అన్ సీజన్ లో అయితే తప్పనిసరిగా అక్కడ రెండు రోజులు బుక్ చేసుకోవాలి. కానీ ఇలా వేసవి సీజన్ లో ఒక్క రోజుక్కూడా అద్దెకు తీసుకోవచ్చు.  పిల్లలతో సరదాగా ఉంటుందని మేం ఆ రాత్రికి అక్కడే ట్రీ హౌస్ ల మాదిరి ఉన్న టెంట్ హౌస్ లలో ఉండడానికి బుక్ చేసుకున్నాం. ఖరీదు చాలా ఎక్కువ. ఒక రోజుకి $300 డాలర్లు పైబడి. అయినా ఇలాంటివి ఎప్పుడూ లగ్జరీలే. ఒకసారి చూడాలనుకుంటే డబ్బులు పెట్టక తప్పదు. ఎంట్రన్సు నించి అయిదు, పదినిమిషాలు నడిచే వ్యవధిలో కొద్దిగా చిన్న గుట్ట మీదకి ఉన్న చివ్వరి కాటేజీ మాది. మేం ఆఫీసులో చెకిన్ కాగానే సాదరంగా మమ్మల్ని జీపులో ఎక్కించుకుని తీసుకెళ్లి మా బసకుచేర్చారు. మా బేగ్గులు మోయడానికి సహాయం చేసాడు జీపు డ్రైవర్.  బహుశా: అప్పుడు మేం టిప్ ఇవ్వాలనుకుంటా. ఇక్కడ అలాంటివి అలవాటు లేక ఏమనుకుంటాడో అని మేం డబ్బులేం ఇవ్వలేదు. అయితే దాని ప్రభావం వచ్చేటప్పుడు కనబడింది. గది ఖాళీ చేసే సమయంలో జీపు కోసం ఆఫీసుకు వెళ్లి అడిగితే కౌంటర్ లో ముందు రోజు నాటి డ్రైవరే ఉండి ‘పొద్దుట ఖాళీ ని బట్టి చూస్తాం’ అని పట్టించుకోనట్లు జవాబిచ్చాడు.

                 ఇక బస గురించి చెప్పాలంటే, చుట్టూ టార్పాలిన్ గుడ్డతో పెద్ద మంచె మీద కట్టిన విశాలమైన గది. ఫర్నిచర్ మంచి  హోటల్ గదిలోలాగే ఉంది. బాత్రూం తో సహా అడవిలో మొలిచిన ఇంద్ర భవనానికి గోడలు ఒలిచేసి ఖాకీ గుడ్డ చుట్టబెట్టినట్లు ఉంది. చిన్న సరస్సు కనబడే బాల్కనీ. మా వరు సంతోషానికి అవధులు లేవు. వావ్, భలే బావుందని తెగ సంబరపడింది. అయితే ఇక్కడ ఫోను, ఇంటర్నెట్టు, టీవీ వంటి సదుపాయాలు ఉండవు. నిజంగా అడవిలో ఉన్న భ్రాంతి కోసమనుకుంటాను. చివరికి సెల్ ఫోను లో సిగ్నల్ కూడా లేదు.

                 ఉదయం నించీ ప్రయాణం చేసి ఉన్నామేమో హాయిగా మంచాల మీద నడుం వాల్చేం. అయితే ఆ రోజు ఆఖరి టూరైన 4 గంటల టూర్ కే మా సఫారీ బుక్ చేసుకున్నందు వల్ల మరలా అరగంట లో గబగబా లేచి రెడీ అయ్యాం. అసలు టూర్ బయలుదేరే ఎంట్రన్సు దగ్గిరికి తీసుకు వెళ్లే జీపు మూడున్నరకే సిద్ధంగా ఉంది బయట. తలుపులకు తాళం వేద్దామని చూద్దుము కదా. తాళాలు లేవు, మేళాలు లేవు. కనీసం గడియ కూడా లేదు. అలా వదిలేసి వెళ్లిపోవడమే. లాప్ టాప్ వంటివి దైవాధీనానికి వదిలేసి బయలుదేరాం.

             కానీ నాలుగుంపావు వరకూ బేచ్ ల వారీగా ఒక్కో జీపుకి 8 మంది చొప్పున ఎక్కిస్తూ చివరగా అప్పటి వరకూ లిస్టు చదివిన పెద్దాయన తన జీపు లో మమ్మల్ని ఎక్కించుకున్నాడు. జీపు పైన ఎక్కి కూచునే అవకాశం కూడా ఉంది కానీ సిరి అప్పటికే  జోగుతూ ఉండడంతో నేను కిందనే ఉండిపోయాను.  వరు, సత్య తో పాటూ జీపు పైనెక్కి కూచుంది. అదే ఈ ప్రయాణం లో అత్యంత “బెస్ట్ పార్ట్ “అని కూడా చెప్పింది. ఎండ గానే ఉన్నా కొంచెం తీక్షణత తగ్గింది.

                టూరు  మొత్తం  రెండున్నర గంటలు. అందులో అరగంట వాకింగ్ టూర్. పేరుకి వాకింగ్ టూరే కానీ నిజానికి దూరం నడిచేదేమీ ఉండదు. అక్కడక్కడే ఉన్న పక్షుల డెన్ లోకి, మంకీలు, ఒక చీతా వంటివి చూడడానికి నడిపిస్తారు. అక్కడ ఉన్న దాదాపు వంద పై చిలుకు పెలికాన్ పక్షుల్ని బంధించకుండా స్వేచ్ఛగా వదిలేయడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.  ఇవి ఎలా ఎగిరిపోకుండా ఉన్నాయి అని గైడుని అడిగాను. “కాస్త నిశితంగా చూడండి వాటి వైపు అన్నాడు”.  అప్పుడు గమనించాను. ప్రతీ పక్షికీ  ఒక రెక్క సగానికి కత్తిరించేసి ఉంది. దానిని వింగ్స్ క్లిప్పింగ్ అంటారట. అలా చెయ్యడం వల్ల అవి ఎగిరిపోకుండా ఉంటాయట.  అప్పటి వరకూ నాలో ఉన్న ఆనందం అంతా పోయింది.  జూలు, పార్కుల పేరుతో ఇలా పక్షుల్ని, జంతువుల్ని  నిర్బంధించడం, వికలాంగుల్ని చెయ్యడం గొప్ప బాధాకరంగా అనిపించింది. అవన్నీ పెద్ద గోల చేస్తూ అటు ఇటూ తిరుగుతూ ఉంటే అదంతా శాపనార్థాలుగా వినిపించాయి నా చెవులకి.
ఇక అలా రెక్కలు కత్తిరించకుండా పెద్ద వైర్ డెన్ లో ఎగిరిపోకుండా ఉంచిన ఉన్న అనేక రకాల పక్షులు- హిమాలయ ప్రాంతపు పావురాలు, ముఖ్యంగా ఎరుపు రంగు కొంగలు, గిజిగాడి గూడువంటి గూడు కట్టే పక్షులు. అవన్నీ కాస్త స్వేచ్చగా తిరుగాడుతున్నట్టే అనిపించినా ఇలా మనుషుల్ని మరే ఇతర ప్రాణులైనా కట్టేస్తే ఎంత దిగులుగా ఉంటామో అలా ఆ ప్రాణులూ ఉన్నట్లు అనిపించింది నాకు.

                  సిరి అక్కడ పక్షుల్ని అదిలిస్తూ, కోతుల్ని చూసి చప్పట్లు కొడుతూ బాగా ఆనందించింది. వరు గైడు చెప్పే ప్రతీ పదాన్ని జాగ్రత్తగా వింటూ అతని వెనుకే తిరుగుతూ ఉంది.

       పది నిమిషాల విరామం తర్వాత జీపు టూరు ప్రారంభమైంది. ముందుగా జిరాఫీల దర్శన. అక్కడి నుంచి  450 ఎకరాల పాటూ విస్తరించిన పార్కు మొత్తం సందర్శన. రోడ్లన్నీ అడవిలా ఉండడం కోసం మట్టి రోడ్లని అలాగే వదిలేసారు. కుదుపులతో అటు ఇటూ జారుతూ జీపు వెళ్తుండడం ఇక్కడ గొప్ప విశేషం కాబట్టి( ఎక్కడాబయట రోడ్లు గతుకులే ఉండవు మరి) వరు గొప్ప సంతోషంతో కేరింతలు కొట్టింది. ఇక దార్లో కొన్ని  అడవి ఆవులు, దున్న ల గుంపులు, దుప్పుల గుంపులగా కనిపించాయి. ఇలా జంతువులు కనబడ్డప్పుడల్లా జీపుని  ఆపి గైడు చెప్పే విశేషాలు వింటూ కాస్సేపు జీపులోనుంచే చూడడం , మరలా ముందుకు కదలడం అలా రెండు గంటల పాటూ గడ్డి కూడా లేని చిన్న గుట్టల మీద ఎక్కి దిగుతూ అదొక సరదా ట్రిప్పుగా గడిచింది.

                తిరిగి మా జీపు మేం బయలుదేరిన ఎంట్రెన్సు దగ్గరికి వచ్చేసరికి ఆరున్నర అయ్యింది. అక్కడే ఉన్న రెస్టారెంటు లో రాత్రి భోజనానికి ముందే రిజర్వు చేసుకున్నాం. ఒక్కొక్కరికి 30 డాలర్ల టిక్కెట్టు.
ఇక్కడ డిన్నరు ఆరుగంటలకే తినేస్తారు కాబట్టి మేం వెళ్లేసరికి స్టార్టర్ల సెషన్ నడుస్తూంది. పచ్చి కాయగూరలు, పళ్లు, చీజ్, కాసిన్ని ఉప్పు బిస్కెట్లు తెచ్చుకున్నాం.
ఇక 7 గంటలకు డిన్నర్లో బ్రెడ్డు, పాస్తా, అప్పటి వరకు మా కుర్చీల మధ్యనే ఉన్న గుండ్రని ఎత్తైన నిప్పుల దాలిమీద కాల్చిన చికెన్, మాంసం.. దానికే 30 డాలర్లు మనిషికి చాలా ఎక్కువనిపించింది.కానీ తప్పని సరి అక్కడ రాత్రి ఉండేవారికి.

                      వేసవి కావడం వల్ల వెల్తురు తొమ్మిది గంటల వరకూ అలానే ఉంటుంది. డిన్నర్ పూర్తి చేసి, ఎనిమిది గంటల ప్రాంతంలో నెమ్మదిగా మా కాటేజ్ వైపు నడవడం మొదలు పెట్టాం. జిరాఫీలు షెడ్లలోకి వెళ్లిపోయాయి. అక్కడక్కడా కొంగలు మాత్రం కనబడుతున్నాయి. మట్టి రోడ్డు మీదుగా నడిచి మరేవో కాటేజీలు దాటి మలుపు తిరగగానే చిన్నపాటి కొలను. ఏదో అందం కోసం తవ్వినదే కానీ అందులో చేపలు కూడా ఉన్నట్లు లేవు. సరస్సు ఒడ్డు మీదుగా గుట్ట పై వరకు నడిచి వస్తే చివరగా ఉన్నది మా కాటేజీ. వస్తూనే లాప్ టాప్ అలానే ఉండడం చూసి ఊపిరి పీల్చుకున్నాను.
అంతలోనే వరు కయ్యిమని అరిచి బాల్కనీ లోకి పరుగెత్తింది. ఏమైందోనని మేం పరుగెత్తాం. తీరా విషయమేమిటంటే పొద్దున్న చాక్లెట్టు ఫాక్టరీ నించి కొని తెచ్చిన చాక్లెట్లకి వందల కొలదీ నల్ల చీమలు పుట్టలుగా పట్టి ఉన్నాయి. అసలు చీమలు, దోమలు లేని ఇళ్లల్లో పెరగడం వల్ల ఇక్కడి పిల్లలకు ఏం చూసినా భయమే.

                   నల్ల చీమలు మంచివే, ఏం చెయ్యవు అని నేను మామూలుగా పాకెట్టుని పట్టుకొచ్చి బాల్కనీలో దులిపి లోపలికి పట్టుకెళ్లాను. అయితే రూమంతా అక్కడక్కడా ఫడ్జ్ పొడి పడడం వల్ల  గదిలో ఎక్కడచూసినా చీమలే.
ఇక చీమల గోల అలా ఉంచితే మామూలుగా పన్నెండైనా పడుకునే అలవాటు లేని మేం నిద్రొచ్చే వరకూ బాల్కనీ లో  తగ్గుతూన్న సంధ్య వెల్తురులో చుట్టూ మారే దృశ్యాల్ని పరికిస్తూ కబుర్లు చెప్పుకుంటూ కూచున్నాం.
పిల్లల కి నేల మీద చిన్న బెడ్లు వేరే ఉన్నా, వరు పడుకోనని పేచీ పెట్టడం తో పది గంటలకి  చీమల గోల తో అంతా ఒకే బెడ్డు మీద ఇరుక్కుని పడుకున్నాం.

              ఇక చీకటి కాగానే కొంగలు, పెలికాన్ లు భయంకరంగా అరవడం మొదలు పెట్టాయి.
మధ్యలో కాస్సేపు సద్దుమణిగినప్పుడూ ఏవో జంతువులు అరుపులు, మరలా తెల్లారగట్ల కొంగల గోల ఇలా రాత్రంతా సరిగ్గా నిద్ర లేక అవస్థ అయ్యింది.
వీటన్నికీ తోడు గడియ లేని తలుపొకటి.

                      మొత్తానికి డబ్బులు బాగా వదుల్చుకున్నా కాస్త గుడ్డి లో మెల్లగా పొద్దుటే బ్రేక్ ఫాస్టు ఫ్రీగా పెట్టారు. కాసిన్ని పళ్లూ, బ్రెడ్డు ముక్కల తో పాటూ మంచి తాజా నారింజ పళ్ల రసం బాగా నచ్చిన విషయం.
ఉదయం సపారీ వెస్ట్  గిఫ్ట్ షాపుకెళ్లి ముందు రోజు చెకిన్ టైము లో మాకిచ్చిన $5 డాలర్ల కూపన్లు మార్చుకుందికి వెళ్లాం. తీరా అక్కడ $25 డాలర్లు పెట్టి ఏమన్నా కొంటే  $5 తగ్గింపట. ఇంకేం, నాకదికావాలి, ఇది కావాలి అని తలా ఒకటి కొనుక్కుని బయట పడ్డాం. అక్కడి నుంచి ఆ రోజంతా మేం మరలా ప్రయాణం చేసి ఎన్నో విశేషాలు చూస్తూ, కొత్త ఊర్లలో సంచరించాల్సి ఉంది.
ఉత్సాహంతో ఆ రోజు మా మొదటి విహార ప్రాంతమైన ఫోర్ట్ రాస్ వైపు ప్రయాణమయ్యాం.
…………………..

Published by VIHANGA in August , 2013

ప్రకటనలు
This entry was posted in నా కళ్లతో అమెరికా(Travelog) and tagged , , , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s