అనగనగా అమెరికా-2(గుడి – షెడ్డు)

అనగనగా అమెరికా-2

గుడి – షెడ్డు

 

 

సుబ్బారావు బాబాయికి దైవభక్తి ఎక్కువ. మొదటిసారి అమెరికాకి ఆర్నెల్లు ఉండే విజిటింగు పేరెంటుగా వచ్చారు.
“అమ్మాయ్! వినాయకుణ్ణి, వేంకటేశ్వరుణ్ణీ, శివుణ్ణీ, సాయిబాబాని….అంటూ ఒక దండకం చదివి, ఇండియాలో రోజుకొక్కరినైనా దర్శించే అలవాటు నాకు. ఇక్కడికొచ్చేక రాత్రీ, పగలూ తెలియనట్లే ఏ దేవుడికేరోజో కూడా మర్చిపోయాను. పాప ప్రక్షాళన కోసమైనా ఒక్కసారి ఏదో ఒక గుడికి తీసుకెళ్లమ్మా.” అన్నారు.
బాబాయి నాకు బీరకాయ పీచు బాబాయైనా, ఆయన్ను గుళ్ళూ గోపురాలు తిప్పవలసిన బాబాయి కొడుకు నాసిక్ (అదేలెండి వాడు తర్వాత నాస్తిక్ అని మార్చుకున్నాడు) బొత్తిగా ఇలాంటివి పడనివ్వడు. అందువల్ల నాకు తప్పలేదు.
“అదేం భాగ్యం బాబాయ్! ఈ శనివారం రెడీగా ఉండండి.” అన్నాను.
“ముందు శివాలయానికా, విష్ణాలయానికా” అన్నారు.
“మీరే చూద్దురు గాని” అని “సకలేశ్వరాలయం” అన్న బోర్డు ఉన్న చోట కారు పార్కు చేసేను.
“గుడన్నావు, ఏదో షెడ్డు దగ్గరికి తీసుకొచ్చేవేంటి?” అన్నారు.
“ఇక్కడి గుళ్లన్నీ ఇలాగే ఉంటాయి బాబాయ్, ఎక్కడో ఒక్కటి మన దేవాలయాల్లా కడతారంతే.”
“అయ్యో, పాపం దేవుడికి గుడన్నా లేదే దిక్కుమాలిన అమెరికాలో, అయినా బొత్తిగా ఈ షెడ్లేవిటి?” అని  బాధపడ్డారు బాబాయ్. మూసి ఉన్న గాజు తలుపులు సందేహంగా తెరుస్తూ “గుడే సుమీ ఇది. నువ్వంటూ ఉన్నా బయటి నుంచి ఏమీ కనబడక సందేహం వచ్చింది.” అంటూ తలుపు తీస్తూనే వరసగా ఒకరి పక్కనొకరు గణపతి, ఆంజనేయుడు, పూరీ స్వామి, కలకత్తా కాళిక, వేంకటేశ్వరుడు… ఇలా… షెడ్డు నిండా దేవుళ్లని చూసి ఇక బాబాయి ఆనందం చెప్పనలవి కాదు.
కానీ ఆయనకొక సందేహం వచ్చింది. “అమ్మాయ్, ఏ వరుసలో ఈ దేవుళ్లని ఉంచేరంటావ్….”అన్నారు.
ఒక్క నిమిషం ఆలోచించి, సమాధానం తెలీదంటే బావోదని “బహుశా: విగ్రహానికున్న భక్త జనం డిమాండ్‌ని బట్టి పెట్టి ఉంటారు బాబాయ్” తెలివిగా అన్నాను.
“అయినా ఇదేం వరసమ్మాయ్, గణపతి పక్కన జగన్నాధుడేంటి? ఆంజనేయుడి పక్కన కాళికేమిటి? బొత్తిగా ఉత్తర దక్షిణాలు లేకుండా……ఎంత డిమాండుంటే మాత్రం… “అని బాబాయేదో చెప్పబోతూంటే”
పక్క నించి ఆరేడేళ్ల పాప “మమ్మీ, ఎలిఫేంట్ గాడ్, మంకీ గాడ్ ఇక్కడున్నారు..” అని అరిచింది.
“రామ, రామ..”అని చెంపలు వాయించుకున్నారు బాబాయ్.
“హూ ఈజ్ రామా? విచ్ యానిమల్ గాడ్ ఈజ్ హి” అందా పిల్ల చప్పున.
ఆయన ఈ సారి “కృష్ణ, కృష్ణ” అని అక్కణ్ణించి తప్పించుకుని మరో చివరకు వెళ్లిపోయేరు.
అక్కడున్న చిన్న చిన్న వినాయక విగ్రహాల్ని ఎవరైనా పట్టుకెళ్లమని రాసి ఉన్న బోర్డు చూసి “ఈ ఊర్లో నిమజ్జనం అంటే ఇదన్నమాట. “నీ” విగ్రహం, “మా” జనానికి. అని కొత్త అర్థం చెప్పాడు.”
అంతలోనే ఏదో గుర్తుకొచ్చినట్లు “అమ్మాయ్, అన్నట్లు మీ ఆయనకి దైవ భక్తి మెండే కదా నాకింకా గుర్తుంది, మీ వీసా సమయంలో ఆయన వీసా దేవుడి గుడి చుట్టూ నూటా 108 X 108 ప్రదక్షిణలు చేసి 108కి ఎవరో కాల్ చేసేరు కాబట్టి బతికి బయటపడ్డాడు అంటూ 108 శతకం చదవడం మొదలుపెట్టేడు.
“ఆయనకిప్పుడంత సమయం లేదు బాబాయ్. ఎప్పుడూ ఆ రిలీజూ, ఈ రిలీజూ అని కంప్యూటరు చుట్టూ ప్రదక్షిణలే.. లేకపోతే మనతో వచ్చేవారు. వచ్చినా పదండి.. పదండి అంటూ పదినిమిషాల్లో పరుగెత్తిస్తారు” అన్నాను.
గుళ్లో కెళితే ఉన్న ఇరవై విగ్రహాలకీ సరిగ్గా మూడేసి లెంపలు ఒక్కోచోటా లెక్కగా వాయించుకుని బయట పడే సరికి పదినిమిషాలకంటే ఎక్కువ పట్టదు మాకు. ఇక ఇక్కడ బాబాయి సంగతి చూడాలి. గంటైనా రారే! షెడ్డంతా కలయ దిరుగుతూ ఒక్కో విగ్రహం ముందూ నిల్చుని, లెంపలు వాయించుకుని, గుంజీళ్లు తీసీ, ఆత్మ ప్రదక్షిణలు చేసీ, దండకాలు చదువుతూ ఆనంద పరవశంలో మునిగి తేలుతూ బాబాయుండగా నేను అక్కడే కాస్త దూరంగా చతికిల బడ్డాను.
మా నాసిక్ గాడు నిజంగా నాస్తికుడో బాబాయి ధాటికి తట్టుకోలేక అలా వేషం మొదలెట్టాడో అని సందేహం వచ్చింది నాకు.
“అయ్యిందా బాబాయ్” అన్నాను నా వైపే వస్తున్న బాబాయ్ వైపు రిలీఫ్ గా చూసి.
ఎక్కడైందీ, ఒక చిన్న బ్రేక్ కోసం వచ్చానంతే, ఇండియాలో ఆర్భాటపు గోపురాల కట్టడాల కంటే ఈ షెడ్లే నయం, దేవుళ్లంతా ఒక్క చోటే గుంపుగా ఉండి నా లాంటి వాళ్లకు సకల వేళల్లోనూ ఉచిత దర్శన భాగ్యం కలగజేస్తున్నారు. ఇండియాలోలా ఒక్కో గుడి ఒక్కో చోట ఉండి క్యూలలో తొక్కుకునీ, తోసుకునీ దైవ దర్శనం కోసం అల్లల్లాడాల్సిన అగత్యం లేదు, అదుగో హారతి ఇస్తున్నారు” మహదానందంగా అంటూ పరుగెత్తారు బాబాయ్…
-డా|| కె.గీత
ప్రకటనలు
This entry was posted in అనగనగా అమెరికా(ఆంధ్ర ప్రభ కాలం). Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s