అనగనగా అమెరికా-3(దేవుళ్లు – స్కీములు)

దేవుళ్లు – స్కీములు

“ఏవండీ అక్కడి పెద్దాయన మీ తాలూకేనా ! అన్నాడొక పెద్ద మనిషి బిజీగా ఆత్మ ప్రదక్షిణలుచేస్తున్న బాబాయిని చూపించి.
అవునని తలూపే లోగా “ఈ ఫారం నింపి, చెక్కు రాసి ఇవ్వండి” అన్నాడు. చందా ఫారం అది. నేనేదో అనబోతూండగా “ఆయన మిమ్మల్నే చూపించారు, అని ఖంగారేం లేదు, నిదానంగా ఇవ్వండి అదుగో ఆ హుండీలో వేసినా సరే.” అని చూపించాడు. ముందేం అర్థం కాలేదు. ఆయన చూపించిన దిక్కుగా చూసాను.
నాకు “మహా తెలివైన తలకాయ”ని చిన్నపట్నించీ బిరుదు. అందుకే చాలా స్పీడుగా అక్కడ ఏం సన్నివేశం జరిగిందో ఊహించుకుని వరసగా సంఘటనలన్నీ పెర్చేసాను.
హుండీ మీద “చెక్కుల హుండీ” అని అన్ని భాషల్లోనూ రాసి ఉంది. అందులో తెలుగులో రాసి ఉన్న చోట “క” కి కొమ్ము చెరిగి పోయి ఉండడం వల్ల “చెక్కల హుండీ” అని కనిపిస్తూంది. బాబాయ్ బహుశా: కొబ్బరి చెక్కలు వేసేందుకు ” ఆ హుండీ లో” వేయొచ్చా అని అడిగి ఉంటాడు. వాళ్లు మహదానందంగా “అవునని, పేరు చెప్పమని “అడిగి ఉంటారు. నన్ను చూపించి తను పక్క దేవుడి దగ్గర దండకం చదవడానికి వెళ్లుంటాడు.
చందా దగ్గర వరసగా 101, 201, 501, 1001 డాలర్లలో ఏదో ఒకటి సున్నా చుట్టి తీరాలి. ఆ సున్నాలు చూడగానే కళ్లు గిర్రున తిరిగాయి నాకు. అయినా ఇదేమిటని ఆశ్చర్యపోతూ అటుగా వెళ్తున్న పూజారిని అడిగి చూసాను. అతను హిందీ పంతులు. నాకు హిందీ అంతగా రాదు, అతనికి ఇంగ్లీషు అంతగా రాదు. అయినా వచ్చీ రాని ఇంగ్లీషులో “ఈ షెడ్డు  లీజ్ నెక్స్ట్ మంత్” అని గాల్లో పెద్ద సున్నా చుట్టాడు.  ఇలా లాభం లేదని నా లాగే ఫారం చేతబుచ్చుకుని బిక్కమొహమేసుకుని కనబడ్డ ఆసామీని అడిగాను.
“ఈ షెడ్డు అద్దెకి లీజు అయిపోవస్తూందనీ అందుచేత ఈ సారి గుడికి ఏకంగా స్వంతంగా షెడ్డు ఒకటి దగ్గర్లో  కొనే ప్రయత్నంలో ఉన్నారని, అందుకే డొనేషన్లు కలెక్టు చేసే పనిలో ఉన్నారని” సెలవిచ్చాడు.
“అవుననుకోండి, కానీ పదో పరకో అయితే అనుకోవచ్చు. మరీ అన్నీ మూడంకెలే..” అన్నాను నీళ్లు నములుతూ.
“మీరు ఫారం చివర లైను చదవలేదన్నమాట”అన్నాడు.
అందులో గుండె ఆగే విషయమేమిటంటే సున్నా చుట్టే సంఖ్య “ఒన్ టైం డొనేషన్ కాదు” ప్రతీ నెలా కట్టాల్సినది. ఇంతలో ఎనౌన్సుమెంటు వినిపించింది. ఆలయాన్ని కొనాలంటే మిలియన్లతో పని. కాబట్టి వెయ్యేసి మంది నెల నెలా వాళ్లు చెప్పిన నంబరుతో లోనులో భాగస్వాములైతే  వచ్చే నెలలోనే లోను సాంక్షనై పోతుంది కాబట్టి దేవుళ్లని క్షేమంగా స్వంత షెడ్డులోకి మార్చుకోవచ్చట.
ఇంతలో మరో మూల నించి మరొక ఎనౌన్సుమెంటు వినిపించింది. ఇంచు మించు ఇలాంటిదే. కాస్త  కొత్త స్కీము. ఇక్కడ నెల నెలా కట్టక్కర లేదు, కానీ వెయ్యి డాలర్ల పైబడి కట్టిన వాళ్ల పేరుతో ఒక ఇటుక, రెండువేల పైబడి కడితే ఒక పలక, పదివేల పైన కడితే ఒక స్తంభం మన పేరుతో నిలబెడతారట. నాకివన్నీ పూర్తిగా అర్థం అయ్యేలోగా నా వెర్రి ముఖం చూసి ఆ పెద్దమనిషి ఇలా అన్నాడు “మీకొకటి తెలుసా, ఈ ఆలయంలో ఉన్న దేవుళ్లు నిజానికి మూడు గుళ్ల వాళ్లవి. అంతా కలిసి ఒకే చోట అయిదేళ్ల క్రితం లీజుకి తీసుకున్నారు. ఇహ ఇప్పుడు ఎవరికి వారు స్వంత గుళ్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.”
బాబాయ్, హడావుడిగా వచ్చి అమ్మాయ్ “ఇది విన్నావా, పక్క షెడ్లో సాక్షాత్తూ బాబా వారున్నారు. ఇప్పుడే వచ్చేస్తాను, అన్నట్లు నీ చేతిలో చెక్కలు ఆ హుండీలో వేసెయ్యి.” అన్నారు అటు పరుగెడుతూ. నేను “అదికాదు బాబాయ్” అంటూ వెనకే బయటికొచ్చేసరికే బాబాయ్ పక్క తలుపు తీసుకుని మాయం అయిపోయారు. ఎందుకైనా మంచిదని బయటే పచార్లు మొదలెట్టాను.
గోడకున్న పోస్టర్లు చూసి అక్కడ నిలబడ్డం కంటే కారులో కూర్చోవడం మంచిదేమో అనిపించింది. వరసగా పోస్టర్లివీ-
శివశక్తి ఆలయంలో ప్రతీ పదిమంది కలిసి ఒక్కో విగ్రహం పెట్టించడానికి చందా పంచుకోవాలి.
విష్ణు భక్తి ఆలయంలో  ప్రతీ ఒక్కరూ తాము కట్టడమే కాకుండా మరో ముగ్గురితో చందాలు కట్టించాలి. (అదేదో సినిమాలో చిరంజీవికి పక్కా కాపీ)
“అమ్మాయ్, నీకిది తెలుసా! బాబా గుడి త్వరలో మరోచోటికి మారిపోతుందట. పదో పరకో సాయం చెయ్యమనీ, మరెవరికైనా ఇమ్మని మనిషికి పది కాగితాలు ఇచ్చారు. ఇవి సరిపోక పోతే మళ్లా అడిగి తెస్తాను.
ఇంకా గొప్ప విషయం ఏమిటంటే పక్క పక్క వీధుల్లో మరి రెండు, ఈ పక్క ఊరిలో మరి మూణ్ణాలుగు గుళ్లు త్వరలో ప్రారంభం కాబోతున్నాయని వర్సలో నలుగురూ చెప్పుకోవడం విన్నాను. అవన్నీ నేనిక్కడ ఉండగానే జరిగితే బావుణ్ణు” అన్నాడు బాబాయ్ సంతోషబాష్పాలతో.
భక్తి పారవశ్యంతో ఆయన కళ్లు ఒత్తుకుంటూంటే, మరో సారి బాబాయి గుడికని అడిగితే ఏం పనిబడిందని చెప్పాలా ? అని ఆలోచించడం మొదలుపెట్టాను.
-డా|| కె.గీత
Published: 09 Sep 2013
ప్రకటనలు
This entry was posted in అనగనగా అమెరికా(ఆంధ్ర ప్రభ కాలం). Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s