అనగనగా అమెరికా-4(ఇండియన్ అమ్మ- అమెరికా అమ్మ)

ఇండియన్ అమ్మ- అమెరికా అమ్మ

“అమ్మా! ఇది ఇండియా కాదు, అమెరికా – నువ్వు చేసిందల్లా తినడానికీ, నువ్వుచెప్పిందల్లా వినడానికీ” అన్న మాటలు వినలేక చస్తున్నాను, ఇదంతా నా నెత్తి మీద రాత” వాపోయింది అమెరికా వచ్చి పదేళ్లయిన ఒక ఇండియన్ అమ్మ.
“అమెరికాలో అయితే పిల్లలకి వండి పెట్టే బాధ ఉండదు, వంటింటి గోల ఉండదు, ఇదంతా నా నెత్తి మీద రాత” అని నిట్టూర్చింది ఏటికేడాదీ వీసా కోసం ఎదురుచూస్తున్న ఒక అమెరికా కలల ఇండియన్ అమ్మ.
మనుషుల  మాటల్ని రహస్యంగా వినడం మొదలు పెట్టిన గ్రహాంతర వాసులైన ఏలియన్సుకి మొదటగా ఈ ఇద్దరి మాటలు వినబడ్డాయి. ఒక గమ్మత్తు చేసి చూడాలనుకుని ఏదో సినిమాలో చూపించినట్లు ఒకరి శరీరాల్లోకి మరొకరి ఆత్మను పంపించాలనుకున్నారు. అయితే వాళ్లు రోజంతా ఏం చేస్తారో ముందు గమనించాలని అనుకున్నారు.
అమెరికా అమ్మ తెల్లారకుండా లేచి పరుగున పిల్లలిద్దరికీ స్నానాలు పానాలు చూసి వాళ్లని స్కూల్లో దింపే సమయానికి, ఇండియాలో అమ్మకు పనమ్మాయి పనికి నాగా పెట్టడంతో పని తప్పలేదు, గుడ్డిలో మెల్లగా  స్కూలుకి పిల్లలు బస్సులో వెళ్లేరు. ఆవిడకూ, ఈవిడకూ మధ్యాహ్నం వరకూ వంట సరేసరి. గిన్నెలు కడగడమూ తప్పలేదు. ఆవిడ డిష్ వాషర్‌లో పేరిస్తే, ఈవిడ గిన్నెలు స్టాండులో బోర్లించింది. అంతే తేడా. ఆవిడ పిల్లలకోసం మరలా స్కూలుకి పరుగెత్తితే, ఈవిడ బస్టాపుకి పరుగెత్తింది. అటు ఆమె పిల్లల్ని కుమానుకి (చైనీస్ మేథ్ ట్యూషను) తీసుకెళితే, ఇటు ఈమె ప్రైవేటుకు దిగబెట్టింది. కార్పెట్టుకి వాక్యూం పెట్టడం, ఇళ్లూ వాకిళ్లూ తుడుచుకోవడం, ఆన్ లైనులో చాటింగు కాలక్షేపం, టీవీలో సీరియళ్ల సాయంత్రం….
భూమికిటూ, అటూ పనులన్నీ ఒకే విధంగా గడిచి పోతున్నాయి. అక్కడ భూమికటూ ఇటూ మెడలు తిప్పిచూస్తున్న ఏలియన్సుకి మెడల్లో వైర్లు బయటికొచ్చేలా వచ్చాయి. కానీ వీళ్లకు విసుగూ విరామం లేదా అనిపించింది. తక్షణం వారి నిరాశల్ని తీర్చాలనుకున్నాయి ఏలియన్సు.
ఆ రాత్రికి భూమ్మీదున్న అమ్మలిద్దరికీ ఒక గమ్మత్తైన కల వచ్చింది. అమెరికా అమ్మ ఇండియా అమ్మగానూ, ఇండియా అమ్మ అమెరికా అమ్మగానూ ప్రదేశాలు మారిపోయారు. అయితే యథావిధిగా క్షణం తీరిక లేని పనితోనే పొద్దుట్నించి సాయంత్రం వరకూ ఇద్దరికీ  గడిచిపోయింది. పని అలవాటైన శరీరాలు కాబట్టీ, ప్రాంతాలు మారినా పనేమీ కొత్తగా అనిపించలేదు వాళ్ళకి.
ఇండియన్ అమ్మగా మారిన అమెరికా అమ్మకి ఎంగిళ్ల కంచాలపై వాలుతున్న ఈగలు చూడగానే “అయ్యబాబోయ్, ఇంత కంటే నా ఇల్లు మేలు” అనిపించింది. పనివాళ్లనే కాన్సెప్టు లేని అమెరికా జీవనంలో ఇల్లాలిగా ఒక రోజంతా చాకిరీ చేసిన ఇండియన్ అమ్మ “అమ్మ బాబోయ్, ఇండియాలో నా జీవితమే మేలు, ఒకరోజు కాకపోతే ఒకరోజైనా పనమ్మాయి వస్తుంది” అని అనుకుంది. అయితే మనసులో ఎలా అనిపించినా బాధ్యతలు విస్మరించకుండా చడీ చప్పుడు లేకుండా చేసుకెళ్లిపోయారు పనులన్నీ. ఇద్దరికీ రాత్రి మిగిలిన అన్నంలో వేడన్నం కలుపుకు తినడమూ తప్పలేదు, మధ్యాహ్నం కళ్లు మూతలు పడ్తూన్నా పిల్లల కోసం పరుగెత్తకా తప్పలేదు.
పరకాయ ప్రవేశం చేసిన ఆత్మలు కొత్తదనానికి ఉక్కిరి బిక్కిరి అయిపోతాయనుకున్న ఏలియన్సుకి భలే ఆశ్చర్యం వేసింది. పైగా వాళ్ల మాటలిలా వినిపించాయి.
“అమ్మా! ఇది ఇండియా కాదు, అమెరికా- నువ్వు చేసిందల్లా తినడానికీ, నువ్వు చెప్పిందల్లా వినడానికీ” అన్న మాటలు వినలేక ఛస్తున్నాను. ఇదంతా నా నెత్తి మీద రాత.”
“అమెరికాలో  అయితే పిల్లలకి వండి పెట్టే బాధ ఉండదు, వంటింటి గోల ఉండదు, ఇదంతా నా నెత్తి మీద రాత”” అని నిట్టూర్పూ మామూలుగానే వినబడ్డాయి. ఇదేమీ అర్థం కాక ఆ ఏలియన్లు తలమీది ఏంటెనాలు పీక్కున్నాయి.
ఆత్మలు మార్చినా డైలాగు మారలేదేమిటి? వేరే జీవితంలో ఉన్నా ఇద్దరూ పాత పాత్రల స్వభావంతో ఎలా ఆలోచిస్తున్నారు? ప్రదేశాలు మారినా ఈ ఆడవాళ్ల ఆలోచనల్లో పిసరంత మార్పు కూడా రాలేదేమిటి? పైగా అన్ని సమస్యలకూ ఒక గొప్ప పరిష్కారమన్నట్టు ఈ నెత్తి మీద రాతేమిటి? వగైరా చిక్కు ప్రశ్నలతో గిలగిలా కొట్టుకున్నాయి. ఎంత ఆలోచించినా ఆ మగ ఏలియన్లకి అర్థం కాక ఒక  ఏలియన్ అమ్మ దగ్గరికెళ్లీ కథ చెప్పాయి.
దానికి ఆ ఏలియన్ అమ్మ “గ్రహాంతరాళాల్లో ఉన్నా నాకు జంజాటాలు తప్పనట్లు ఇండియన్ అమ్మయితే ఏంటి, అమెరికన్ అమ్మయితే ఏంటి, ఇదంతా మా నెత్తి మీద రాత”  అని నిట్టూర్చింది.
డా|| కె.గీత
ప్రకటనలు
This entry was posted in అనగనగా అమెరికా(ఆంధ్ర ప్రభ కాలం). Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s