అనగనగా అమెరికా-5 (డాలరూ-రూపాయి)

డాలరూ-రూపాయి

“అయ్య బాబోయ్ డాలరుకి అరవై రూపాయిలే” దాదాపు అరిచినంత పనిచేసింది అమ్మమ్మ.
ఏ మాట కామాటే చెప్పుకోవాలి, ఆవిడకి డెబ్భై అయిదేళ్లొచ్చినా దిట్టంగా తిరుగుతూంది. నా చిన్నప్పటి అదలాయింపు కూడా ఇంకా పోలేదు.
వచ్చినప్పట్నించీ “ఒరే బడుద్ధాయిలూ, తెలుగులో ఏడవండ్రా, చూసి నడవండ్రా, మీ తిళ్లు పాడుగానూ” అని పిల్లల్ని రకరకాలుగా అదిలించటం మొదలు పెట్టింది.
“చారులోకి కర్వేపాకు లేకపోతేనేం, ఏం మునిగి పోదులే, అరవై రూపాయలు పెట్టి కరివేపాకు కొనక్కర లేదు” అని రెసిపీలు మార్చేసింది.
“అర్థ రూపాయికి అరచెయ్యంత ఇడ్డెను ఇచ్చేవారు. ఒక ఇడ్లీ రొండొందల రూపాయిలా!
ఇదేం పాడు కాలమో డబ్బుని నీళ్లలాగ ఖర్చు పెట్టేస్తున్నారు ఈ మాయ దేశమొచ్చి” అని ముక్కు చీదింది.
ఇంటద్దె ఎంతో తెల్సుకుని “హయ్యో రాత!- ఈ అద్దెకి సొంత ఇల్లే వచ్చేది ఇండియాలో” అని నెత్తి కొట్టుకుంది.
బాత్రూముల్లో కాగితాలు చూసి “ఖర్మ, చివరికి అమెరికా వచ్చి సంపాయించిందంతా తుడిచి పారెయ్యడానికి ఖర్చుపెడుతున్నారు.”అని నోట్ల కట్టని చింపి చెత్తబుట్టలో వేస్తున్నట్లు విలవిల్లాడింది.
అమ్మమ్మ చేత  ప్రతీదీ ఇలా డాలరుని రూపాయిల్లో మార్చి చూడడాన్ని మానిపించేదెలా?  అని “అమ్మమ్మా, ఇప్పుడు ఇండియాలో ఒక రూపాయెంతో ఇక్కడ డాలరు అలాగన్న మాట, ఈ దేశంలో వచ్చే డబ్బుల్ని మనం ఇండియాను డబ్బులతో మార్చి చూడకూడదు. ఇప్పుడు ఇక్కడ అయిదువేల డాలర్లు నెల జీతమనుకో అన్నీ పోను ఏ పదిహేనొందలో మిగులుతాయి. అదే ఇండియాలో పదివేలు సంపాదించే వాడికి నెలకో వెయ్యి మిగలడం కూడా కష్టం. అంతెందుకు మన దేశంలో ఇప్పుడు వంద మారిస్తే ఎన్ని వస్తువులొస్తాయి? ఇక్కడ వందకి ఎన్ని వస్తాయో చూసుకుంటే ఈ దేశమే మేలనిపిస్తుంది” అని ఎంతచెప్పినా కాలిక్యులేటరు కంటే వేగంగా పని చేసే అమ్మమ్మ బుర్ర మాత్రం తర్జుమా చిట్టా తీసి అందర్నీ దులపడం మాత్రం మానలేదు.
“మీ ఆయన జీతమెంత, నీ జీతమెంత? ఎంత ఖర్చు పెడుతున్నారు?” అని లెక్కలేసిందో రోజు.
ఎందుకైనా మంచిది తను బాధ పడకుండా ఉంటుందని ఆదాయం కొంచెం ఎక్కువ, ఖర్చు కొంచెం తక్కువ చెప్పేసరికి, “పిల్లల డే కేర్‌కి నీ జీతమంతా ఖర్చు చేస్తే నీకా ఉద్యోగం ఎందుకు? రాత్రి పన్నెండింటిదాకా చేస్తున్న మీ ఉద్యోగాలకి వచ్చే జీతం సరైనదేనా?” లాంటి లాపాయింట్లు లాగింది.
తనను ఒప్పించి గెలవడం అసాధ్యమని అమ్మ ఎందుకు మొత్తుకుంటుందో అర్థమైంది. అంతే కాకుండా “ఏడ్చినట్టుంది నీ తెలివి, ఇంత దూరం వచ్చి మీరు చేస్తున్న సంసారం ఇదన్న మాట, కనీసం ఆదాయం ఎనిమిది, ఖర్చు రెండూ ఉండాలి కానీ ఇదెక్కడి పనికిమాలిన తెలివి!” అని తిట్టిపోసింది.
“అమ్మమ్మా, ఇవి మీ రోజులు కావు, ఇది మన దేశమూ కాదు” అనేసరికి “మరా మాత్రానికి ఇంత దూరం రావడమెందుకంటా” అని నోరు మూయించింది.
ఆర్నెల్లు ఉన్నా మనశ్శాంతిగా లేదు పాపం. ప్రతీ దానికీ ఇలా లెక్కలు వేసుకుని బాధ పడ్తూనే ఉంది. ఏం కొనివ్వ బోయినా “నాకొద్దమ్మా, ఇండియాలో ఇంత కంటే చవగ్గా అన్నీ దొరుకుతున్నాయి”అని చెప్పి ఏవీ కొననివ్వలేదు.
తననలా ఫ్లైటు ఎక్కించి ఇంటికొస్తూంటే చివరిగా తను నా చెయ్యి పట్టుకుని అన్న మాటలు మరలా వినబడ్డట్లయ్యింది. “అమ్మడూ! రూపాయలూ, డాలర్లు నాకు అర్థం కాకపోయినా నష్టం లేదు. కానీ పగలూ  రాత్రీ పరుగెడుతున్న మీ జీవితాలకి అర్థం మాత్రం మీకు తెలుస్తే చాలు.”
…………..
Published: 02 Oct 2013
ప్రకటనలు
This entry was posted in అనగనగా అమెరికా(ఆంధ్ర ప్రభ కాలం). Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s