అనగనగా అమెరికా-6 (లక్ష కళార్చన)

లక్ష కళార్చన

 
– డా|| కె.గీత
“ఏవండీ, ఈ వారం గుళ్లో లక్ష కళార్చన జరుగుతూంది. మీరూ వస్తారా?” స్కూలు బయట హడావిడిగా అందావిడ.
“వివరాలూ…” అనేదో నేను అనబోతే “అవన్నీ అక్కడే తెలుస్తాయి లెండి. మీరూ వచ్చెయ్యండి.” అని క్షణంలో మాయమై పోయింది.
సహస్ర పుష్పార్చన, ఫలార్చన ఇలా ఏదో ట్రెండు మారినప్పుడల్లా కొత్తవి వస్తూ,పోతూ ఉంటాయి.  కానీ ఇదేదో విచిత్రంగా ఉందే! సహస్రాలు పోయి శత సహస్రాలు వచ్చాయన్న మాట.
“పైగా ఈ కళార్చనేవిటో! చూస్తే పోలా” అనుకుని ఆ శనివారం వీలుకాకపోయినా వీలు చూసుకుని బయలుదేరాను.
గుడి పార్కింగు ఎక్కడా ఖాళీ లేకుండా బాగా రద్దీగా ఉంది. నన్ను రమ్మన్నావిడ బయటే కలిసింది.
గుడికి ఆనుకుని ఉన్న పెద్ద స్టేజీ ఉన్న హాలు వైపు నడుస్తున్న అందరితో బాటూ నడిచేం. గుమ్మం దగ్గర్నించీ పట్టు చీరలు, పట్టు పంచెలు, పూల మాలల తోరణాలు ఏదో పెద్ద పెళ్లి జరుగుతున్నట్లుగా ఉంది.  స్టేజీ పైన అట్టహాసంగా మెరిసే అక్షరాలతో  “లక్ష కళార్చన” అని రాసి ఉంది.
అందరూ చప్పట్లు కొడుతూంటే, మేమూ కొట్టేం. ఒక పట్టుపంచె స్టేజీ మీద నుంచి “అందరికీ లక్ష పాదాభివందనాలు” అనగానే మరలా చప్పట్లు.
18వ శతాబ్దపు తెలుగులో లక్ష కళార్చన ఆలోచనెలా వచ్చినదీ, దానిని ఇంత వరకూ తీసుకు రావడానికి ఎలా కష్ట పడినదీ వివరణ పూర్తయ్యింది.
అది కాగానే స్టేజీ మీదకు పది మందిని పిలిచి సన్మానాలు చెయ్యడం మొదలు పెట్టారు. ఒక్కొక్కరి పేరు ముందు వజ్రాలూ, వైఢూర్యాలు అని వినిపిస్తుంటే నా కూడా వచ్చిన పెద్ద మనిషి నా చెవి కొరకడం మొదలుపెట్టింది. “ఏవండీ, ఈ గోల లో సరిగా అర్థం కాలేదు వజ్రానికి, వైఢూర్యానికీ తర్వాత ఆయనేమంటున్నాడండీ”. “అర్చకులు” అన్నాను. అయినా అర్థం కాలేదన్నట్లున్న నా వేపు చూసింది.
బహుశా: దానర్థం “ఈ కార్యక్రమానికి స్పాన్సరర్లు వారనుకుంటా” అన్నాను.
ఇంతా చేసి ఇంకా మాకు “లక్ష కళార్చన” ఏవిటో బోధ పడలేదు. చివరికి మా నిరీక్షణం ఫలించి లక్ష కళార్చనలో పాల్గొనేవారిని స్టేజీ పైకి రమ్మని అనౌన్సుమెంటు వినిపించింది. మొత్తం వంద  మంది వరకు చేరారు. వీళ్లంతా వీళ్లకు వచ్చిన కళా ప్రదర్శన ఒక్క సారే మొదలెట్టి సరిగ్గా అరగంటలో ఆపుతారు. అని వినిపించింది.
“ఇదేమిటండీ? వంద మంది కూడా లేకుండా… లక్ష …”అనబోతున్న ఆమెను అటు తిప్పి చూపించాను.
అక్కడొక తెర మీద ఏ దేశంలో ఎంత మంది ఈ కార్యక్రమంలో ఇదే సమయంలో పాల్గొంటున్నారో వివరాలు వస్తున్నాయి.
అందులో పాట కారులూ, ఆట కారులే కాదు, పాక శాస్త్ర ప్రవీణులూ వారి పెనమూ, దీసె పిండితో హాజరయ్యారు.
అయితే వీళ్లందరికీ రెండు రూల్సున్నాయి. ఒకటీ, వీళ్లంతా భగవన్నామ స్మరణ మనస్సులో చేస్తూ వాళ్ల కళని ప్రదర్శించాలి. రెండు, ఒకరి కళ మరొకరిని డిస్టర్బ్ చెయ్యకూడాదు. అంటే గొంతు ఉపయోగించాల్సిన వాళ్లు వినీ వినిపించకుండా ప్రదర్శించాలి. మిగతా వారంతా నిశ్శబ్దంగానూను.
సరిగ్గా అరగంటలో లక్ష కళార్చన ముగిసింది. వాళ్లేం చేసారో కన్నా అక్కడ ఆ కార్యక్రమం ఎంత గొప్పదో తెలియజేసేవారెక్కువున్నారు. ఇంతలో ఒకాయన అరిచాడు.
“అయ్యో! నా పర్సు ఎవరో కొట్టేసారండీ”. మరెవ్వరో అరిచారు “చోర కళార్చన”.
ప్రపంచవ్యాప్తంగా ఇందులో పాల్గొన్న వారందరినీ గిన్నీసు బుక్కులో ఎక్కించడం జరుగుతుందని వెనక స్టేజీ పై నుంచి వినబడుతూంది.
స్టేజీ దిగిన వాళ్ల చేతుల్లో ఒక్కో సీడీ ఉంది.
“ఏవండీ ఇందులో ఏవుంది? మీకేనా సీడీలు, అందరికీ ఇస్తున్నారా?” అని  అడిగిన నా పక్కనామెకు “ఇది- భగవన్నామస్మరణ సీడీ అండీ. ఇంటి దగ్గర వినేందుకు. పైగా మేం ఇందులో పాల్గొందుకు పదేసి డాలర్లు కట్టాం. ఈ సీడీ ఫ్రీ అని ముందే చెప్పారు.” అంది.
మాతో పాటూ ఉన్న ఇండియా నుంచి కొత్తగా  వచ్చినట్లున్న ఒకామె “ఏవండీ లక్ష పదులంటే పది లక్షల డాలర్లు… అంటే రూపాయల్లో….అని గుండె మీద చెయ్యి వేసుకుంది.”
…………….
ప్రకటనలు
This entry was posted in అనగనగా అమెరికా(ఆంధ్ర ప్రభ కాలం). Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s