అనగనగా అమెరికా-10(అప్పు టీవీ)

– డా|| కె.గీత
“ఏవండీ ఈ న్యూస్ విన్నారా! తెలంగాణా ప్రకటన వచ్చేసిందట.” అంది పద్మావతి భర్త ఆఫీసు నించి రాగానే.
“అప్పుడే నీకెలా తెలిసి పోయిందోయ్! ఇంకా ఇండియాలో రాత్రి కదా. మీ అన్నయ్య వాళ్లింకా నిద్రపోతూ ఉంటారు కదా! “అన్నాడాయన ఆశ్చర్య పోతూ.
“ఎలా తెలియడవేమిటీ? అప్పు టీవీ గుప్పు మంటూంటేనూ.”
అప్పుడు గుర్తుకు వచ్చింది. ఈ మధ్యనే ఆన్ లైన్‌లో ఇండియన్ న్యూస్ ఛానల్స్ ఫ్రీగా చూపించే UP-TV కంప్యూటర్‌లో ఎలా చూడాలో నేర్చుకుంది. “ముదితల్ నేర్వగరాని విద్య గలదె ముద్దార నేర్పించగన్” అనెవరన్నారో గానీ ఆ మాటని సార్థకం చెయ్యడానికన్నట్లు ఇక నేర్చుకున్నదే తరువాయి, భర్త ఆఫీసుకెళ్ళిన దగ్గర్నించీ, వచ్చే వరకూ ఈ ఆన్ లైన్ ఇండియన్ టీవీ చూడడమే పని. బ్రేకింగ్ న్యూస్‌లన్నీ కంఠతా పట్టి అమెరికాలో ఉన్నా ఇండియన్ న్యూస్ ఏదడిగినా ఠకీమని చెప్పేస్తుంది.
మరి నాలుగు రోజులకి భర్త ఇంటికి వచ్చేసరికి ముక్కు చీదుతూ కనిపించింది.
ఏం మునిగిందోనని గాభరా పడి అడిగే సరికి… “ఇంకా ఏం మునగాలండీ సీమాంధ్రలో ఉద్యమాల మీద ఉద్యమాలు. మా అన్నయ్య వైజాగులో ఉన్నాడా, మా తమ్ముడు తిరపతిలో ఉన్నాడు. ఇదేం బాధో వాళ్లకి.  పిల్ల పుట్టిన రోజని హైదరాబాదులో ఉన్న మా చెల్లి పిలిస్తే వెళ్లడానికి ఎక్కడి నుంచీ దారి లేదట. అంతా రాస్తారోకోలూ, బస్సులు, రైళ్ల బందులట. మొన్నటి దాకా హైదరాబాదు దాటి పోవడానికి ఉండేది కాదు, ఎప్పుడూ బందులే బందులు అని మా చెల్లి గోల పెట్టేది. ఇప్పుడూ సీమాంధ్రలో బందులు.” అంది ఇంకా ముక్కు చీదుతూనే.
ఏవోయ్, మనం భూగోళానికివతల వేల మైళ్ల దూరంలో ఉన్నాం.” అనో “నువ్వా అప్ టీవీ చూడడం మానేయొచ్చు కదా అనో”  అందామనుకున్నాడు. కానీ అలాగంటే ఇంకేమైనా ఉందా. బందులు అక్కడ కాదు, ఇక్కడ కూడా ప్రారంభమవుతాయి.
మరో రోజు “ఏవండి తెల్లారగట్ల మనకి భూకంపమొచ్చిందట.” అంది.
“ఏవిటోయ్ కల గన్నావా, అయినా లేస్తూనే కాస్త మంచి కలలు కనొచ్చు కదా” అన్నాడు.
“కాదండీ. తెల్లారగట్ల ఇండియా నుంచి ఫోన్ చేసారు. కాలిఫోర్నియాలో భూకంపమని ఒకటే ఆంధ్ర దేశమంతా గోలట. అక్కడ టీవీలో వార్త ప్రసారం చేసారట. మనకేమీ ప్రభావం తెలియలేదని చెప్పేనులెండి.”
“ఉండు చూస్తాను” అని  దక్షిణ కాలిఫోర్నియాలో మనకు 300 మైళ్ల దిగువన, కాబట్టి మనకు ప్రభావం ఏమీ లేదు” అని తేల్చాడాయన గూగుల్ చేసి చూసి.
“ఆగండి అప్పు టీవీ పెట్టి చూస్తాను. ఇక్కడ ఏదొచ్చినా ముందు మన వాళ్లకి తెలిసిపోవాల్సిందే. చూసేరా! మన ప్రాంతంలో ఏం జరిగిందో మనకు తెలియదు. అదృష్టం కొద్దీ ఈ ఆన్ లైన్ టీవీ వల్ల నాకూ ఇక్కడి వార్తలు అక్కడి మన ఛానెళ్ల ద్వారా తెలుస్తున్నాయి.” అంది చాలా గర్వంగా.
“ఏవోయ్, ఇక నువ్వు అప్ టీవీ చూడడం మానేయాలి” అన్నాడు భర్త ఒకరోజు. అతని ధైర్యానికి అతనికే ముచ్చట వేస్తూండగా.
“ఎందుకు” అనడిగేలోపలే.. “ఎందుకనుకుంటున్నావా?  అప్ టీవీ ఇక మీదట ఫ్రీ కాదు. నెలకి పది డాలర్లు కట్టాలట. ” అన్నాడు ఒకింత సంతోషాన్ని బయటకు కనబడనివ్వకుండా.
“డాలరు పెట్టి దిక్కుమాలిన కర్వేపాకు కొనుక్కోవాలా?!” అని వచ్చిన కొత్తలో రోజూ బాధపడే పద్మావతి, “ఊ.. అయితే ఏంటట, అమెరికా వచ్చి మూడేళ్లయ్యింది, ఇంకా 10 డాలర్లు నెలకి అంటే కూడా ఏడుపే! కట్టండీ. ” అంది తాపీగా.
భార్య ఆలోచనా సరణిలో మార్పు వచ్చినందుకు బాధ పడాలో, సంతోషపడాలో తెలీక ముందే, “నెలకు పది అంటే సంవత్సరానికి నూటా ఇరవై. అంతలోకే అప్పులపాలయ్యిపోముగా. మొన్న మీ వాళ్లు అడిగితే మీరు కిమ్మనకుండా…” అని దండకం మొదలయ్యింది.
డా|| కె.గీత

First Published: 11 Nov 2013

ప్రకటనలు
This entry was posted in అనగనగా అమెరికా(ఆంధ్ర ప్రభ కాలం) and tagged , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s