అనగనగా అమెరికా-11(అమెరికా విరగబాటు..)

 
– డా|| కె.గీత
అత్తయ్య అమెరికా వచ్చి నెల రోజులైంది. ఇంట్లో ఇండియా నించి వచ్చిన చుట్టాలు ఉన్నారంటే ప్రతీ వారమూ తప్పని సరి ప్రోగ్రాములే.
అయితే ప్రతీ వారమూ పెద్ద వాళ్ల ఇష్టం ప్రకారం ఏ ఇండియన్ కల్చరల్ ప్రోగ్రాముకో తీసుకెళితే పిల్లలు గోల పెట్టేస్తారు. అందుకే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఒక వారం పెద్ద వాళ్ల ఇష్టమొచ్చిన చోటుకి, మరో వారం పిల్లలు అడిగిన చోటుకి తీసుకెళ్లాలి.
ఆ వీకెండ్  పిల్లల వంతు. “శాన్‌ఫ్రాన్సిస్కో నేచురల్ హిస్టరీ మ్యూజియం”  ప్రోగ్రాం అన్నారు వాళ్లు.
“ఒక పక్క చల్లని చలి. వర్షం కూడా పడుతూంది ఇప్పుడు బయటికెందుకర్రా” అని అత్తయ్య ససేమిరా రానని మొరాయించినా పిల్లలు తెలివిగా “అందుకే కదా నాన్నమ్మా! మనం వెళ్తూన్నది హిస్టరీ మ్యూజియంకి. అది పూర్తిగా ఇండోర్ మ్యూజియం. బయట తిరిగే పని ఉండదు” అని పట్టుబట్టడంతో తప్పని సరిగా వచ్చింది పాపం.
పెద్ద షెడ్డులో మ్యూజియం అంతా రెండస్థుల్లో ఉంది. ఎటు చూసినా గాజు గోళాకారాలు పేర్చినట్లు విభాగాలతో అందంగా ఉంది.
గుమ్మంలోనే “డైనోసార్” స్కెలిటన్ చూసి “రామ, రామ – ఈ బొమికలన్నీ ఎక్కడి తవ్వి తెచ్చారో ఏమో! దగ్గరికెళ్లకండి” అని విసుక్కుంది. ఎదురుగా ఉన్న నీళ్లలో చేపలు చూసి, “ఇదీ విడ్డూరమే” అని సణిగింది.
ఇక మనిషి పుట్టు పూర్వోత్తరాలకు సంబంధించిన గదిలోకి రానని బయట కూర్చుండి పోయి ఆంజనేయ దండకం జపించడం మొదలెట్టింది.
రకరకాల పక్షుల గుడ్ల సైజుల్ని చూసి “ఇవేం తింటాయో గానీ, ఆ గుడ్డు చూడు దాని తలకాయ కంటే పెద్దదుంది” అంది. నక్షత్రశాలలోంచి బయటికొచ్చి “ఇంకోసారి తీసుకెళ్లకండమ్మా, మీకు పుణ్యముంటుంది. కళ్లు తిరిగేయి నిజంగా” అంది. ఇదంతా చూస్తూ సహనం పట్టలేకుండా ఉన్నారు పిల్లలు. నేనొక పక్క నించి “శాంతంగా ఉండమని” పిల్లలకు సైగ చేస్తూ ఉన్నాను.
సతత హరితారణ్యాల గాజు గదిలోకి వెళ్లి మేం అంతా శీతాకోకచిలుకలు, పచ్చని చెట్లు చూసి అబ్బురపడిపోతూండగా “మా ఊరు రండర్రా, మీకు ఇంత కంటే బ్రహ్మాండమైన చెట్లూ చేమలు చూపిస్తాను, అయినా అమెరికా వాడు అమెరికా వాడే- చూసేరా! మొక్కలు కూడా వాడు చెప్పినట్లు అద్దాల గదిలో చచ్చినట్లు మొలుస్తున్నాయి. అందుకే ప్రపంచాన్ని గడగడలాడించేస్తున్నాడు.” అంది.
మళ్లీ అంత లోనే “వాడెవడో గెడ్డపాడు దొరకలేదని ఆప్ఘనిస్తానమంతా కుళ్లబొడిచీసేరు. మాట వినని దేశాధ్యక్షుల్ని ఉరి తీసి పారీసేరు. అమ్మో! ఎన్నెన్ని విన్నామూ, ఎన్నెన్ని కళ్లారా చూసేమూ.. “అని తన టీవీ పరిజ్ఞానమంతా ఒలకపోసింది.”
అప్పటి దాకా ఇదంతా తమాషాగా వింటున్న పిల్లలు అత్తయ్యకున్న లోకజ్ఞానానికి విస్తు పోయేరు.
“అయినా నాకు తెలీకడుగుతాను. అమ్మాయ్, మీలా చదూకున్నోళ్లంతా ఈ దేశానికొచ్చి ఇక్కడి స్థితిగతులు బాగుచెయ్యడం వల్లనే కదా ఈ అమెరికా వాడీకీ విరగబాటు” అంది. అత్తయ్య తెలిసి అడిగినా తెలీక అడిగినా సమాధానం చెప్పలేని ప్రశ్నకు గతుక్కుమని గప్‌చిప్ మని ఊరుకున్నాను.
-డా|| కె.గీత
ప్రకటనలు
This entry was posted in అనగనగా అమెరికా(ఆంధ్ర ప్రభ కాలం) and tagged , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s