అనగనగా అమెరికా-14 (హాపీ హాలోవీన్)

– డా|| కె.గీత
ఇండియా నుంచి వస్తున్న భార్యని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్ పోర్టుకెళ్లాడు భర్త.
“అయ్యో అదేమిటీ! అక్కడ బస్టాపులో నిలబడ్డ అతనికి నుదురు పగిలి పోయి రక్తం కారుతోంది. ఆపండి. ఆపండి..” అని అరిచింది భార్య.
భర్త గట్టిగా నవ్వడం చూసి వొళ్లు మండింది. “ఏవిటా పిచ్చి నవ్వు?! రెండేళ్ల బట్టీ అమెరికాలో ఉండి మానవత్వం మరిచిపోయేరన్న మాట” అంది.
“నేను నవ్వుతున్నది నీ అజ్ఞానం చూసి” అన్నాడు భర్త.
కొరకొరా చూస్తున్న చూపుని పట్టించుకోకుండా “అవును మరి. అజ్ఞానమే. ఇక్కడ ఈ సీజన్‌లో ఏం జరుతుందో ఆన్ లైనులో గూగుల్ చేసో, వికీలో చదివో తెలుసుకోమన్నాను కదా. అసలేమీ తెలుసుకోలేదన్నమాట. ఇది ఇక్కడి పండుగ. అలా నెత్తి పగిలినట్లు, మెదడు చిట్లినట్లు, ఎముకలు కనిపిస్తున్నట్లు, రకరకాల వేషాలు వేసుకునే దెయ్యాల పండుగ” అని గొప్పగా అన్నాడు.
“అక్కడ గూగుల్ చెయ్యడానికీ… అదేదో చదివి అజ్ఞానాలు మాపుకోవడానికీ కరెంటు ఉండి ఛస్తేగా. కంప్యూటర్, ఇంటర్నెట్టూ ఉంటే సరిపోతుందేమిటీ…” రాగం తీసింది భార్య.
అదేమీ విననట్టు చెప్తూనే ఉన్నాడతను “ఇంకా ఇప్పుడేమిటీ రాత్రికి చూడు ఇళ్ల ముందు స్మశానాల సెట్టింగులు, దెయ్యాల వేషాలేసుకుని తిరగడాలు, పిల్లలందరూ మంత్ర గాళ్ల వేషాలేసుకుని ఇంటింటికీ తిరిగి ‘ట్రిక్ ఆర్ ట్రీట్’ చెయ్యడాలు” నువ్వు చూడాల్సిందే అని తెగ నవ్వుకుంటూ అన్నాడు.
ఇంటికి చేరంగానే అపార్ట్‌మెంటులో పక్కిళ్ల తలుపుల దగ్గర ముక్కు, కళ్లు చెక్కి ఉన్న పెద్ద ఎర్ర గుమ్మడికాయల్ని, తలుపులకి పట్టించిన బూజుల్ని చూడగానే “శుభమా అని అమెరికాలో అడుగుపెడితే, పోయి పోయి ఈ దిక్కుమాలిన దిష్టి గుమ్మడికాయ ఎదురొచ్చిందేమిటండీ” అని విసుక్కుంది భార్య.
“మధ్యాహ్నం బాగా నిద్రపోయి సాయంత్రానికి మెలకువగా ఉండు, అలా బయటికి తీసుకెళతాను, హాలోవీన్ సంగతి చూద్దువు గాని” అని ఆఫీసుకెళ్లిపోయాడు భర్త.
సాయంత్రం చీకటి పడగానే పక్క పక్క వీధుల్లో ఇళ్ల అలంకరణలు చూపిస్తూ కనబడ్డ ఇళ్ల దగ్గర ఉన్న దెయ్యాల బొమ్మల దగ్గర భార్యని తనకి ఫోటోలు తియ్యమంటూ, “అంతా” తిప్పి చూపించేడు.
ఎవరెవరో పిల్లలు ప్రతీ ఇంటి దగ్గరా నిలబడి ‘గొయ్యో’ మని అరవడం, ఆ ఇంటి వాళ్లు కాసిన్ని చాక్లెట్లు వాళ్ల చేతిలోని సంచీలోనో, గుమ్మడికాయ బుర్రల్లాంటి వాటిల్లోనో వేస్తున్నారు.
ఎక్కడ చూసినా ఒకళ్లకొకళ్లు “హాపీ హాలోవీన్” అని చెప్పుకుంటున్నారు.
“ఏవండీ, పూర్వకాలం మన దసరా పండగలో పిల్లలు ఇలాగే ఇల్లిల్లూ తిరిగే వారంట, అలాగే లేదూ ఇక్కడ కూడా”.అంది భార్య.
“మన దేశానికీ ఈ, దేశానికీ పోలిక పెడతావేమిటి? ఈ దేశపు పద్ధతులే వేరు” అని గొప్పలు పోయాడు భర్త.
“ఇన్నాళ్ల తర్వాత కనిపించానని కూడా లేదీ మనిషికి” అని లోపల్లోపలే తిట్టుకుంది భార్య.
అర్థరాత్రి బాత్రూముకి లేచేడు భర్త. సరిగ్గా రెండడుగులు వేసాడో లేదో కర్టెన్ చాటు నించి ఒక తెల్లని చెయ్యి బయటికి వచ్చింది. “బేర్”మని గట్టిగా కేక వేసి కళ్లు తిరిగి పడ్డాడు.
తిరిగి కళ్లు తెరిచేసరికి “జెట్లాగ్ వల్ల నిద్ర పట్టక అటూ ఇటూ తిరుగుతుండగా, మీరు లేచారు. ఊరికే మీకు “హాపీ హాలోవీన్” చేద్దామని…..” అని అంటున్న భార్య వైపు చూసి నీరసంగా “హాపీ హాలోవీన్” అని నెత్తికొట్టుకున్నాడు.
డా|| కె.గీత
First Published: 13 Dec 2013
ప్రకటనలు
This entry was posted in అనగనగా అమెరికా(ఆంధ్ర ప్రభ కాలం) and tagged , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s