అనగనగా అమెరికా-8(ప్లేడేటు…)

First Published: 25 Oct 2013
– డా|| కె.గీత

ప్లేడేటు..

“ప్లేడేటు” అంటే ఏవిటమ్మాయ్, పాప పొద్దుట్నించీ ఒకటే కలవరిస్తూంది. అమ్మ రాగానే ప్లేడేటుంది నాకు అని” అంది పిన్ని.
నేను చెప్పిన సమాధానం విని దీర్ఘంగా నిట్టూర్చింది.
పార్కులో ప్లేడేటులో పిల్లలు హుషారుగా గడుపుతున్నారు.
“ఏవిటేవిటో, వింత వింత పేర్లు ఈ అమెరికా వాళ్లకి. అంతా చేసి ఏవిట్రా అంటే  పిల్లలు కలిసి ఆడుకోవడం. ఇదొక పేద్ద “డేటు”, దానికింత కష్టమూ” అని సాగదీసింది పిన్ని. నీకు గుర్తుందో, లేదో మీ చిన్నప్పుడు బడి నించి వచ్చీ రాగానే పుస్తకాలు ఇంట్లో గిరాటు వేసేసి నువ్వూ, మీ అన్నా వీథిలోకి పరుగెత్తేవారు. మీ అమ్మ ఒకటే అరిచేది. హోంవర్కులో అంటూ. ఇక మా చిన్నఫ్ఫుడు…హూ.. ఎందుకులే… ఆ రోజులు ఇక మళ్లా రావు ఈ భూమ్మీద” అని నిట్టూర్చింది.
ఇంతలో పాపతో బాటూ ఆడుకుంటున్న క్లాసుమేటు వాళ్లమ్మ వచ్చి అడిగింది. “వచ్చే వారం ఇదే సమయానికి మీకు మరో ప్లేడేటు వీలవుతుందా?”
నేను ఒక్క నిమిషం ఆలోచించడం చూసి, ఒక పని చేద్దాం వీలైతే వారం మధ్యలో ఫోనులో మాట్లాడుకుందాం. లేదంటే ఈ-మెయిల్‌లో పెడతాను. అన్నట్లు ట్రేసీ కూడా వస్తుందేమో అడుగుతాను. ఆ… ముఖ్యంగా నేను రావడానికి కుదరదు, వీళ్ళ నాన్న వస్తాడు. ఆ రోజు పిల్లల డ్యూటీ అతనిది”
ఆవిడటు వెళ్లగానే మూతి ముప్ఫై వంకర్లు తిప్పింది పిన్ని. “ఇదేం చోద్యమే, పిల్లల డేటేమిటీ, ఇలా అపాయింట్ మెంట్లు తీసుకోవడమేమిటీ… మరీ చోద్యంగా పిల్లల్ని పార్కుకి తీసుకెళ్లడానికి మొగుడితో వంతులేవిటీ…ఏమో బాబూ…కలికాలమంతా ఈ పనికిమాలిన దేశంలోనే ఉన్నట్లుంది”.
పిన్నీ! ఈ దేశంలో ఇవన్నీ సర్వ సాధారణం. మన దగ్గర్లా పిల్లలు స్వేచ్ఛగా ఆడుకోగలిగే వాతావరణం, సంస్కృతి ఇక్కడెక్కడున్నాయి? ఎవరి ఇళ్లలో వాళ్లు ఇతరుల్ని తమ జీవితాల్లోకి జొరబడనివ్వకుండా “ప్రైవసీ” పేరుతో మనుషుల మధ్య సహజ బంధాలకు దూరమై పోయి బతుకుతున్నాం ఇక్కడంతా. ఎవరింటికీ మన ఊళ్లోలా పోయి ఇంటి బెల్లు కొట్టడానికి లేదు. అసలు తలుపులు బార్లా తెరుచుకోవడానికి లేదు. ఇంక అపాయింట్ల ప్లేడేట్లు తప్ప పిల్లలకి మరో దిక్కేముంది చెప్పు. ఇంకా నయం, ఇదైనా కనిపెట్టారు వీళ్లు” అని నేనూ నిట్టూర్చాను.
“ఏడ్చినట్టుంది నీ తెలివి, ప్లేడేటులో ఏం ఉందో నాకు తెలీదు గానీ ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులకి డే కేర్ ఖర్చులు మిగలట్లా, లాభం లేకుండా అమెరికా వాడు ఏం పనీ చెయ్యడే తల్లీ” అని ఏదో కనిపెట్టేసినట్లు ముఖం పెట్టి అంది పిన్ని.
అటుగా వస్తూ కుక్క పిల్లలతో నడిచే వాళ్లు ఒకరినొకరు పలకరించుకుంటూ మాట్లాడుకుంటుంటే కుక్కపిల్లలూ కుయ్..కుయ్ మని ఒకదాని చుట్టు మరొకటి తిరుగుతున్నాయి.
“హూ… కుక్కపిల్లలకీ డేటే కామోసు.” అని తల అడ్డంగా ఊపింది పిన్ని.
వస్తూన్నప్పుడు కారులో “అమ్మమ్మా! పార్కులో నీకు నచ్చిందా.” అనడిగింది పాపాయి.
“బావుందమ్మా, నీకు?”
చాలా బావుంది, మరి. అమ్మమ్మా! మళ్లీ మనం వచ్చే వారం వస్తున్నాం కదా! అప్పుడు మా ఫ్రెండు వాళ్ల గ్రాండ్ పా వస్తున్నాడు. నీకు కావాలంటే నువ్వూ ప్లేడేటు పెట్టుకోవచ్చు. బోరు కొట్టకుండా ఉంటుంది నీకు” అన్న పాప ముద్దు మాటలు విని “రామ-రామ” అని లెంపలు వేసుకుంటూ “ఇంకోసారి నన్ను ఈ దిక్కుమాలిన డేట్లకి పంపకే తల్లీ” అంది పిన్ని.

డా|| కె.గీత
ప్రకటనలు
This entry was posted in అనగనగా అమెరికా(ఆంధ్ర ప్రభ కాలం) and tagged , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s