అనగనగా అమెరికా-9 (కేంపస్ జాబ్ ! పాపం వినోద్ కలలు..)

– డా|| కె.గీత

కాలేజీ క్యాంపస్..

ఎమ్మెస్ చెయ్యడానికి అమెరికా యూనివర్శిటీ నుంచి ఆమోదం వచ్చింది వినోద్‌కి. అమెరికాలో చదివే చదువు కన్నా అక్కడ ఎంత బాగా ఎంజాయ్ చెయ్యచ్చో బాగా ఊహించుకోవడం మొదలెట్టాడు. కాలేజీ వెబ్ సైటులో అమెరికాలో చదువు కోవడమంటే ఏవిటో ఉన్న వీడియో చూసి ఉబ్బితబ్బిబ్బయ్యాడు. అత్యాధునిక క్లాసు రూములు, బ్రహ్మాండమైన బిల్డింగులు, ప్రపంచవ్యాప్తంగా చుట్టూ రకరకాల ప్రజలు, ముఖ్యంగా రకరకాల రంగుల్లో అమ్మాయిలు.
“తీసుకున్న బ్యాంకు లోనుతో మొదట రెండు సెమిస్టర్లు మాత్రమే పూర్తిగా పంపగలను. మిగతా సెమిస్టర్లకి సగమే ఏదో రకంగా సర్దగలను. నువ్వు మిగతాది చూసుకోగలననుకుంటే వెళ్లు.” అన్నాడు తండ్రి.
కాలేజీ వెబ్ సైటులో “కేంపస్ జాబ్స్” అన్న పదం గుర్తుకొచ్చి అతి ధైర్యంగా చూపొకటి విసిరేడు వినోద్.
“నీకేంటి లేరా! అమెరికా వెళ్లిపోతున్నావు ఇంచక్కా చదువుతూనే ఉద్యోగం, చదువు కాగానే ఉద్యోగం.. నీ పంట పండింది” అన్నారు స్నేహితులు.
“వెళ్లగానే చదువుతో పాటూ పార్ట్ టైం ఉద్యోగం, చేతి నిండా డబ్బు, ఇండియాలో లాగా అమ్మానాన్నల అజమాయిషీ లేని జీవితం. ఓహ్! ఎంత బావుంది ఊహించుకుంటేనే” అనుకున్నాడు వినోద్.
కలలు కనడంతోనే సగం కాలం గడిచిపోయేది. మొత్తానికి కలలు కన్న రోజు రానే వచ్చింది.
అమెరికా ఎయిర్ పోర్టులో అమ్మ పెట్టిన పచ్చళ్లన్నీ నిర్దాక్షిణ్యంగా ఇమ్మిగ్రేషను వాళ్లు చెత్తబుట్టలో పడేసారు.
“అమెరికాలో హాయిగా బర్గర్లుండగా ఈ పచ్చళ్లెందుకో” అని మనస్సులో ఆవిడ పాక్ చేసినప్పుడే విసుక్కున్నాడు వినోద్. తత్సంబధిత కష్టం నాలుగు రోజులు బ్రెడ్డు ముక్కలు, పచ్చి కాయగూరలు తింటే గానీ అర్థం కాలేదు.
ఇక కాలేజీలోకి అడుగుపెట్టాకా ఏ విషయానికైనా ఎవరినడిగినా కాలేజీ వెబ్ సైటుకెళ్లి చూసుకోమనే వారేగానీ స్వయంగా వివరాలు చెప్పేవారు కరువయ్యారు. మొత్తానికి స్టూడెంట్ సర్వీసెస్ అపాయింట్‌మెంటు తీసుకుని ఓ గంటన్నర లైనులో నిలబడి వివరం సేకరించేడు.
కనిపెట్టిన విషయమేంటంటే మొదటి సెమిస్టరు పూర్తయ్యేవరకు “కాంపస్ జాబ్ ” అవకాశం లేదు. అదికూడా “తగిన” యూనిట్లు పూర్తి అయితేనే.
మొదటి సెమిష్టరు పూర్తవడం కోసం కళ్లు కాయలు కాయడం, పండి రాలిపోవడం అవుతున్న దశలో మొదటి సెమిస్టరులో సరైన మార్కులు రాని కారణం చేత, సదరు “తగిన” యూనిట్లు పూర్తవ్వని కారణంగా జాబు అవకాశం మళ్లీ సెమిస్టరుకి వాయిదా పడింది వినోదుకి.
ఇక్కడేదో ఎంజాయ్ చేద్దామనుకున్న తనకి అసలా పదానికి అర్థం కూడా తెలిసేటట్లు లేదు క్లాసుల్లో ఇచ్చే హోం వర్కులు, వారం వారం పరీక్షలతో. హోం వర్కుల బాధ చెప్పనలవి కాదు. దించిన తల ఎత్తకుండా రీసెర్చి చేసినట్లు పేపర్లు టైపు కొడుతూనే ఉండాలి.
ముచ్చటగా మూడో సెమిస్టరులో స్టూడెంట్ సర్వీసు సెంటర్లో వారానికి 10 గంటల ఉద్యోగం దొరికింది. హమ్మయ్య! అని నిట్టూర్చుకున్నంత సేపు నిలవలేదు సంతోషం. గంటకి వాళ్లిచ్చే జీతం 10 డాలర్లని తెలియగానే మతి పోయింది వినోదుకి “కేంపస్ జాబ్ ” వినోదమంతా పోయింది.
వారానికి వందంటే, నెలకు నాలుగు వందలు, సెమిస్టరుకి మహా అయితే 12 వందలు డాలర్లు. ఇక్కడ సినిమాలు, షికార్లు ఎలాగూ లేవు అసలు తిండి తినడానికి సంపాదించిన డబ్బుల్లో సగం పోతాయి.
అసలు ఫీజు 12 వేల డాలర్లు. ఇంటి నుంచి నాన్న సగమే పంపితే మిగతా ఫీజెక్కడి నుంచి వస్తుంది? ఫీజుకి మళ్లీ అక్కడే ఏదో లాగా “లోను” పెట్టమని ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు.
“కేంపస్ జాబ్” మీద పెట్టుకున్న ధీమా కొంప ముంచింది కదా. తనకు తెలిసిన ఒకళ్లిద్దరు ఇండియన్ స్నేహితులతో మొరపెట్టుకున్నాడు.
“అబ్బాయ్, నీకొక్కడికే కాదు. ఇది నీలా వచ్చిన అందరికీ సమస్యే. తెలిసిన రెస్టారెంటులో వీకెండ్లు సర్వర్ కమ్ క్లీనర్ ఉద్యోగాలు దొరుకుతాయి, సిగ్గు పడకుండా చేరిపో. అలా నువ్వు మరి కాస్త సంపాదించొచ్చు.” అని ఒకరు..
“ఇక్కడ నువ్వు ఎలా సంపాదిస్తున్నావో ముఖ్యం కాదు, అసలు సంపాదించడం ముఖ్యం. ఇక్కడ ఇంత కంటే మరో మార్గం లేదు రా బాబాయ్” అనొకరు..
“ఇండియా నించి ఎవరడిగినా అన్ని ఉద్యోగాలకీ ఒకటే పేరు చెప్పవోయ్ -‘కేంపస్ జాబ్’ ” అనొకళ్ళు సలహా ఇచ్చేరు…

డా|| కె.గీత

 http://www.andhraprabha.com/columns/geetha-madhavi-about-campus-jobs-in-us/5436.html

First Published: 04 Nov 2013
ప్రకటనలు
This entry was posted in అనగనగా అమెరికా(ఆంధ్ర ప్రభ కాలం) and tagged , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s