కాత్యాయనీ విద్మహే గారితో డా||కె.గీత ఇంటర్వ్యూ

మన కథ ప్రతీ తరానికీ చెప్పుకుంటూ పోవాలి

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కాత్యాయనీ విద్మహే గారితో  డా||కె.గీత ఇంటర్వ్యూ

Interview-2

కాత్యాయనీ విద్మహే గార్ని తలుచుకుంటే మొట్ట మొదట నేను 90 లలో చూసిన బొమ్మూరు తెలుగు విశ్వవిద్యాలయం సభలు జ్ఞాపకం వస్తాయి. స్త్రీ వాద కవిత్వమ్మీద ఆ రోజు ఆమె అనర్గళంగా ఇచ్చిన గంటన్నర ఉపన్యాసాన్ని ఇప్పటికీ మర్చిపోలేను. కానీ అప్పటికీ, ఇప్పటికీ ఏమీ మార్పు లేదు. ఈ రోజు ఇంటర్వ్యూ కోసం వాళ్లింటికెళ్ళినపుడు అచ్చు అలానే ఉన్నారావిడ. అదే చక్కని నవ్వు, ఆప్యాయమైన పలకరింపు. నిన్న సాహిత్య అకాడెమీ అవార్డు రావడం, ఆ సమయానికి మా ఇంటికి దగ్గరలో ఆవిడ ఇక్కడే అమెరికా లో ఉండడం గొప్ప సంతోషకరమైన విషయం. కిరణ్ ప్రభ గారు ఫోన్ చేసి ఇంటర్వ్యూ చెయ్యగలరా? అనడిగినప్పుడు సంతోషంగా ఒప్పుకున్నాను.

ఇంటర్వ్యూ అనేవో ప్రశ్నలు రాసుకెళ్లినా ఒక్కటీ అడగబుద్ధి కాలేదు నాకు. స్వేచ్ఛగా ఆవిడ మహోధృత ప్రవాహంలా, త్వరితంగా మాట్లాడుతూంటే మంత్రముగ్ధురాలిగా చూస్తూ కూర్చున్నానంతే. సహజంగా ఉపాధ్యాయురాలు, వక్త కాబట్టి అని అనుకోవడానికి మాత్రమే కాకుండా, ఏ విషయానికైనా సరైన భూమిక తెలిసిన గొప్ప వ్యక్తి ఆమె. పేదరికాన్ని, పోరాటాల్ని, వివక్షనూ ప్రత్యక్షంగా అనుభవించకపోయినా వర్గ స్వభావాన్ని, సంఘర్షణను, అణచివేత రూపాలను, తాత్విక నేపధ్యాన్నీ  అర్థం చేసుకోవడం వల్ల,  స్పందించడం వల్ల కలిగిన జ్ఞానాన్ని ప్రత్యక్షంగా ఆ వెలుగుముఖం లో చూసాను. ప్రాచీన, అర్వాచీన సాహిత్యాలకి ఆర్థిక, రాజకీయ కారణాల్ని అన్వేషించడం, విశ్లేషించడం వారి సహజ విమర్శనా ధోరణి. ప్రతీ రచననీ తాను నిలబడదల్చుకున్న వర్గం వైపు నించి పరిశీలించడం, విశ్లేషించడం వల్ల విమర్శ కు  కాత్యాయని గార్ని సాహిత్య అకాడెమీ  ఎన్నుకోవడం ఆశ్చర్యకరమేమీ కాదు. చక్కని నవ్వు కళ్లతో తన జీవితంలో తనను అడుగడుగునా ప్రభావితం చేసిన సంఘటనలు చెప్తూన్నపుడు  కనిపిస్తూన్న ఉత్తేజానందం, ఎక్కడా మాటలకు తడుముకోకుండా ఒక దాని తర్వాతొకటి చకచకా కదలి పోతున్న దృశ్యాల, జ్ఞాపక చిత్రాల ఒరవడి. కాత్యాయని గారు మాట్లాడుతుంటే ఎదురుగా గెడ్డం కింద చెయ్యేసుకుని కూర్చుని వింటున్నపుడు జలపాతానికి చేరే ముందటి నదీ ప్రవాహపు నీళ్ల ఉధృతంలో చేతులు పెట్టి కూచున్నపుడు, రాళ్లకు తగులుతున్న అలల హోరు చెవులకు తగులుతున్న పారవశ్యం. జలపాతానికి ఎదురు నిలిచినట్లు, కాలానికి ఎదురు నిలిచిన స్త్రీ మూర్తుల గాధలు వింటున్నపుడు శరీరంలో అణువణువునా ధైర్యం స్ఫూర్తిగా మారే గొప్ప బలం.

పదిరోజుల మొదటి మనవడిని ఒళ్లో ఎత్తుకున్నప్పటి సంతోషంతో సమానంగా,  ఊహించకుండా, ఆశించకుండా,  ముందు అసలేమీ అర్థం కాకుండా ఉండే హఠాత్ ఆనందం- ఈ అవార్డని భావించే కాత్యాయని గారు తనకు ఎంత మంది స్నేహితులున్నారో ఇప్పుడర్థమైందన్నారు. ఆవిడ మాటల్లోనే తన సాహిత్య ప్రస్థానం ఇది- 

నేను పుట్టింది 1955, నవంబరు3. మైలవరం ప్రకాశం జిల్లా. మా నాన్న రామకోటి శాస్త్రి, అమ్మ ఇందిరా దేవి.  మా నాన్నకి  కాలాతీత వ్యక్తులు రాసిన పి.శ్రీదేవి మంచి మిత్రురాలు. నాకు ఆ నవల చాలా ఇష్టం. ఏడాది పిల్ల గా ఉన్నప్పుడే గుడివాడలో ఆమె మా ఇంటికి వస్తుండేదట. ఆ రకంగా ఆవిడని చాలా సార్లు చూడడం వల్ల నాకు ఆ పసితనంలోనే సాహిత్యగాలులు సోకాయనుకుంటాను. నా మొదటి పుట్టిన రోజుకి ఆవిడ ఇచ్చిన బహుమతి కంచం ఇప్పటికీ మా ఇంట్లో ఉంది. మా నాన్న ఫస్ట్ పోస్టింగ్ ఉస్మానియా యూనివర్సిటీ, వరంగల్  ఆర్ట్స్ కాలేజీ లో. వరంగల్ లో మా మొదటి అడుగు కాళోజీ ఇంట్లో. వాళ్లింటి ఎదురుగానే అద్దెకి ఇల్లు ఏర్పాటు చేసారు. మేం దిగుతూనే వాళ్లింట్లోనే స్నానాలు, భోజనాలు కానిచ్చి అప్పుడు మా ఇంటికెళ్లేం.  నాన్నకు ఉన్న సాహిత్యాభిలాష, సాహిత్య మిత్రులు, వాతావరణం నాకు సాహిత్యం పట్ల ఆసక్తి కలిగించాయనుకుంటా.

 

చిన్నప్పుడు చదివిన పుస్తకాల గురించి-

నాకు ఆరో తరగతి నించీ సాహిత్యం చదవడం అలవాటయ్యింది. ఎండా కాలంలో ఏం చెయ్యాలో తోచేది కాదు. ఇంట్లో ఉన్న మా నాన్న పుస్తకాలు  అధిక భాగం ప్రాచీన కవిత్వం. మొదట మా పుస్తకాల బీరువా లో కనబడ్డ నవల “వేయిపడగలు”. ఆరో తరగతి లో చదవడం వల్ల సగం సగమే అర్థమయ్యింది. అయితే అందులో అరుంధతి, ధర్మారావుల దాంపత్యం, గిరిక, ధర్మారావుల అన్నా చెల్లెళ్ల సంబంధం నాకు నచ్చింది. అందులో  చర్చ లు ఉన్నప్పుడల్లా పేజీలు తిప్పసేదాన్ని. నిజానికి పంక్చుయేషన్ కూడా సరిగా  తెలీదు నాకు. అందులోనూ గ్రాంధికం. ఒక చోట “కంది కుంకుమ రాసినట్టుంది సుమా!” అని ఉంటుంది. ఈ కంది కుంకుమేంటి?  పెసర కుంకుమ, కంది కుంకుమ అని కూడా ఉంటాయి కాబోలని అనుకునేదాన్ని.

తర్వాత మా పక్కింటి మాలతి గారి ఇంట్లో డిటెక్టివ్ నవలలు బాగా చదివేదాన్ని. మా అమ్మ పత్రికల్లో సీరియల్స్ చదివేది. కొలిపాక రమామణి రాసిన”ఏటి వొడ్డున నీటి పూలు” నేను చదివిన మొదటి సీరియల్. దాన్లో చదువుకున్న అమ్మాయిల మధ్య స్నేహం నాకు బాగా నచ్చేది. అలాగే బియ్యే పాసవ్వాలి అని అనుకునేదాన్ని. రంగనాయకమ్మ “స్వీట్ హోమ్” నవల కూడా సీరియల్ గా అప్పుడే చదివాను. కొత్త సంస్కారాల పట్ల ఆకర్షణ అప్పుడే కలిగింది. అలా నవలలు చదవడం నాకొక వ్యామోహమయ్యింది. అద్దె నవలలు కూడా మా అమ్మ కోసం తెచ్చినవి మేమూ చదివేవాళ్లం.  10, 12 తరగతుల్లయాక బి.య్యే లో సాహిత్యం తీసుకోవాలని ఎంతో ఆసక్తి అందుకే కలిగిందనుకుంటా.

చిన్న నాటి సాహిత్య సంఘాలు-

తెలంగాణా ఉద్యమ కాలంలో  ఎక్కువ ఖాళీ సమయం దొరికేది మాకు. అప్పుడు మేం “వాణీ బాలానంద సంఘం” పెట్టుకున్నాం. ఏడో తరగతి నాటికే వ్యాస రచన, వక్తృత్వం బాగా అలవాటయ్యాయి నాకు. అలాగే ఒక లిఖిత పత్రిక “మనో వాణి” అని రెండు మూడు నెల్లకోసారి చొ.ప్పున తెచ్చేవాళ్లం. అది మా నాన్న ప్రోద్బలం వల్లనే. చుట్టూ ఉన్న పిల్లల్ని చేరదీసి రెగ్యులర్ గా కల్చరల్ ప్రోగ్రాములు చేసేవాళ్ళం. నేనే దానికి ప్రెసిడెంటుగా ఉండేదాన్ని. ఒకసారి D.E.O  ని కూడా పిలిచి పబ్లిక్ గార్డెన్ హాల్లో మీటింగు పెట్టేం.

మీ నాన్న గారి గురించి చెప్పండి-

మా నాన్నకు  ఆంధ్ర విశ్వవిద్యాలయం లో చదువుకునే రోజుల్లోనూ, గుడివాడ లో ఉద్యోగం చేసేటప్పుడూ  నాటకాలు వేయడం, వేయించడం అభిరుచిగా ఉండేది. కన్యాశుల్కం నాటకంలో అగ్నిహోత్రావధాన్లు పాత్రకి ఆయనకి ఉత్తమ నటుడి అవార్డు కూడా వచ్చిందట. త్రిపురనేని మధుసూదన రావు, చలసాని ప్రసాద్, సత్యమూర్తి వీళ్ళంతా  నాన్నకు విద్యార్థులు.

వరంగల్ నివాసిగా తెలంగాణా అనుభవాల గురించి చెప్పండి-

మేం తొమ్మిదవ తరగతిలో ఉండగా 1969 లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం వచ్చింది. మమ్మల్ని కాలేజీ విద్యార్ధులు వచ్చి బాయికేట్ చేయించినప్పుడు, మేమూ నినాదాలు చేస్తూ వాళ్లతో తిరుగుతూన్నపుడు మమ్మల్నందర్నీ వాన్ ఎక్కించి, అరెస్ట్ చేసి కోర్టుకి తీసుకెళ్లేరు. అందరం చిన్న పిల్లలం. కోర్టులో జడ్జీ మమ్మల్ని మందలించి పంపేసాడు.

ఇక ఆర్ట్స్ కాలేజిలో  నేను పనిచేసే రోజుల్లో క్లాసు పాఠాలుగా క్లాసికల్ పొయెట్రీ తో బాటు  వట్టికోట ఆళ్వారు స్వామి రాసిన “ప్రజల మనిషి” ఉండేది. ఒక పక్క తెలంగాణా ఉద్యమాన్ని ప్రత్యక్షంగా చూస్తూ,  అందులో తెలంగాణా చరిత్రని చదవడం గొప్ప అనుభవం.  అలాగే సుంకర వాసిరెడ్డి రాసిన “మా భూమి” నాటకం. మొత్తం తెలంగాణా ఉద్యమం బాగా అర్థం చేసుకోవడం కోసం అనేక పుస్తకాలు చదివాను.

సాహిత్యం తర్వాత ఇష్టమైన విషయాలు-

నాకు సాహిత్యం తర్వాత ఎకనామిక్స్, పొలిటికల్ సైన్సు, హిస్టరీ చాలా ఇష్టం. కానీ ఆ రెండింటి సంబంధం లేకపోతే తెలుగు సాహిత్యం నాకు బాగా అర్థమయ్యి ఉండేది కాదు.

సాహిత్యం యొక్క సామాజిక నేపధ్యం తెలుసుకోవడానికి ఈ సబ్జెక్టులు బాగా ఉపకరించాయి. బియ్యే లో నేను చదువుకున్న పొలిటికల్ థాట్ నా జీవితంలో పెద్ద మార్పు, పెద్ద వెలుతురు. మార్క్స్ గురించి విన్నదీ, తెలుసుకున్నదీ అప్పుడే. ఆ సబ్జెక్టు చెప్పిన లెక్చరర్ వెంకటేశ్వర్లు గారి ఇంపాక్ట్ బాగా ఉండేది.

 

ఆర్ట్స్ కాలేజీ ఉద్యోగం –

ఎమ్మే కాగానే  ఆర్ట్స్ కాలేజీ లో పార్ట్ టైం లెక్చరర్ గా చేరడమే నా జీవితం లో టర్నింగ్ పాయింట్. అది అప్పటికి మంచి రాడికల్ స్టూడెంట్ సెంటర్. అక్కడే యూరోపియన్ హిస్టరీ, అర్థ శాస్త్ర మౌలిక సూత్రాలు వంటివన్నీ  చదివాను. మాకు బియ్యేలో పొలిటికల్ సైన్సు చెప్పిన లెక్చరర్ వెంకటేశ్వర్లు గారు ఆ కాలేజీ లో లెక్చరర్.  మా స్టేఫ్ రూం ఒక పెద్ద ఎడ్యుకేషన్ సెంటర్ లాగా ఉండేది. నిరంతరం పుస్తకాలు, అరుణ తార, సృజన పత్రికలు వంటివి  చదివి చర్చలు చేస్తూ ఉండేవాళ్లం. తమిళం మొ.న దేశ భాషల నించే  కాకుండా, ఆఫ్రికన్ నవలల వంటి అనువాద నవలలు కూడా చదివే వాళ్లం. అక్కడి వాతావరణం నా దృక్పథాన్ని పూర్తిగా మార్చి వేసింది. అందుకే నాకు ఆర్ట్స్ కాలేజీ అంటే నాకు గొప్ప ప్రేమ.

మీ విద్యార్థుల గురించి-

ఆ కాలేజీ లో పిల్లల నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఎన్ వేణు గోపాల్, సారయ్య( తర్వాత ఎమ్మెల్యే), కుమార్ చాలా గుర్తుపెట్టుకోదగిన విద్యార్థులు నాకు. ఆ రోజుల్లో విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటున్నా చదువు పట్ల కూడా బాగా ఆసక్తి కనబరచేవారు. అప్పటి విద్యార్థి నాయకులు ఇప్పటిలా కాలేజీ కి పోకుండా కేవలం బయట రాజకీయాలు చేసేవారు కాదు. నిజానికి క్లాసులో వడ్డేపల్లి రౌడీలు, ఏబీవీపీ, రాడికల్ స్టూడెంట్స్ అని భాగాలుగా ఉండే వారు. కాలేజీ ఎదురుగా సారా వేలం పాటలు ఆపుజెయ్యమని సామాజిక బాధ్యతల్ని గుర్తుచేసేవారు. న్యాయాన్యాయాల వివేచన గురించి మమ్మల్ని ప్రశ్నించేవారు. నేను స్టూడెంట్ మాగజైన్ ఎడ్వయిజరీ బోర్డు లో ఉండేదాన్ని. అక్కడ కేవలం పాఠం చెప్పడం మాత్రమే కాదు, మన నించి  మనం నేర్చుకోవటం, మనల్ని మనం మార్చుకోవటం గా రోజులు గడిచేవి. అక్కడి  పిల్లలు మట్టి నించి వచ్చిన వాళ్లు. వాళ్ల జీవితానుభవం ముందు  భద్రతాయుతమైన జీవితం గడిపే నేనెంత అనిపించేది.

జ్యోతిరాణి, శోభల తో కలిసి మీరు చేసిన రచనల గురించి-

ఆర్ట్స్ కాలేజీలో ఉండగా మా భూమి పాఠం చెప్పిన ప్రేరణ నుండి అయిలమ్మని చూసొద్దామని జ్యోతిరాణి, నీరజ, నేను వెళ్లి, ఆమెతో మాట్లాడి వచ్చాం. అదొక మర్చిపోలేని ఆనుభవం. జ్యోతిరాణి నాకు రెండో తరగతి నించి క్లాస్ మేట్. శోభ నాకు ఎమ్మే లో సీనియర్. ఆర్ట్స్ కాలేజీ లో అంతా ఒక్కసారే ఉద్యోగాల్లో చేరాం. పాఠం చెప్పడమే కాకుండా సమాజంలోకి కూడా వెళ్ళడం అవసరం అనిపించేది మాకు. “రాబందులు-రామచిలుకలు” నవల పాఠం చెప్తున్నపుడు పంచాయితీ రాజ్ సిస్టం గురించి చదివి శోభ తో చర్చించేదాన్ని. ఇద్దరం కలిసి వ్యాసాలు రాసాం. పుస్తకంగా వచ్చిన  తర్వాత సి.వి సుబ్బారావు దానిపై రివ్యూ రాసారు.

ఇక నేను, జ్యోతిరాణి కలిసి “మా భూమి” నాటకమ్మీద రాసిన “వ్యవసాయ సంబంధాలు” అని వ్యాసం ఎకనామిక్స్ సెమినార్ లో సబ్ మిట్  చేసాం. ఆర్.ఎస్ రావు గారు దానిని బాగా మెచ్చుకున్నారు. ఇలా సాహిత్యశాస్త్ర విద్యార్థులు, సమాజశాస్త్ర విద్యార్థులు కలిసి అధ్యయనం చెయ్యటం మాతోనే మొదలు. ఇలా మేం సమాజానికి, సాహిత్యానికి హద్దులు చెరిపేసాం.

1982 లో స్త్రీవాదం పై  నా దృష్టి సాగింది. అంతర్జాతీయ మహిళా దశాబ్ది సందర్భంగా ప్రతీ యూనివర్శిటీ లో ఉమన్ స్టడీస్ ప్రారంభమవుతున్న రోజులు. మేం ముగ్గురం “స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ” మొదలు పెట్టాం. ఇప్పటికీ దాని మీద పని చేస్తూనే ఉన్నాం. అందులో ముఖ్యంగా స్త్రీల వైపు నించి పరిశోధన చెయ్యడం, పేపర్లు ఎక్కడ సబ్ మిట్ చేసినా స్త్రీల గురించే రాయడం మాలో మేము చేసుకున్న శపథాలు. అలా 85 లో మొదటగా భారతంలో స్త్రీల పాత్రల మీద పేపర్ రాసేను. వివక్షలను ప్రశ్నించే విధంగా మన చుట్టూ వాతావరణమే మనల్ని మారుస్తుంది. మేం స్వయంగా కాలేజీలో ఇన్విజిలేషన్ వంటి సమస్యల మీద మొదట పోరాటం ప్రారంభించాం.  అలా ఫైర్ బ్రాండ్సని పేరు పొందినా మొత్తానికి సాధించాం.

మార్క్సిజం ప్రభావం-

నాకు మార్కిజం వంటబట్టింది ఆర్ట్స్ కాలేజీ లోనే. జ్యోతిరాణి, శోభ, నేను  ఉమన్ పాయింట్ నించి రాయడమే   కాకుండా మార్కిస్టు దృక్పథం తో పనిచేసే వాళ్లం. రైతాంగ ఉద్యమంలో స్త్రీలకు జరిగిన అన్యాయాల గురించి ప్రశ్నించే రచనలు చేసేం. అధ్యయన రంగంలో పనిచేస్తూనే సమాజంలో కూడా తిరిగేం. ఫాక్ట్ ఫైండింగ్ కమిటీలకు, కౌన్సిలింగులకు హాజరయ్యేం.

వి.వి తో అనుబంధం-

మార్క్సిజాన్ని సాహిత్యానికి అనుబంధంగా  చూడడం వరవరరావు గారి నుంచి  కలిగిన స్ఫూర్తి.  నేను రాసిన ప్రతి వ్యాసమూ ఆయన తో చర్చించే దాన్ని. ఆయన  సూచనలు చేసేవారు. ఒక రోజు నాన్నతో వి.వి మాట్లాడుతూ యూనివర్శిటీలో కొ.కు వాజ్మయ సూచిక తయారు చేస్తే బావుంటుందని అన్నారు.  అప్పటికే విశ్వనాథ మీద ప్రాజెక్టు నడుస్తూంది. అప్పటికే నేను లెక్చరర్ గా ఉన్నాను కాబట్టి నాన్న నన్ను, వి.వి తో కలిసి  కొ.కు ప్రాజెక్టు లో పని చెయ్యమన్నారు. నేను బుచ్చిబాబు “చివరకు మిగిలేది” గురించి సుప్రసన్న గారి దగ్గర రీసెర్చి చేస్తున్నాను అప్పటికి. బుచ్చిబాబు రచనల సూచిక తయారు చెయ్యాలని లైబ్రరీలన్నీ తిరుగుతున్నాను. ఆ సందర్భంలో కొ.కు రచనల విజ్ఞాన సూచిక కూడా తయారు చేసాను. వి.వి, టంకశాల అశోక్, చలసాని ప్రసాద్ మొ.న ఎందరో సూచనలతో, సవరణతో తర్వాతి కాలంలో నేను అచ్చు వేసాను. ఈ పుస్తకాన్ని విజయవాడ లో అచ్చు వేస్తున్న కాలంలో తరచు విజయవాడ వెళ్లినపుడు కరుణ గారింట్లో ఉండేదానిని.జగన్ నాకు బాగా సహాయం చేసేవారు. వాళ్ళింట్లో కమ్యూన్ వాతావరణం కూడా నాకెన్నో కొత్త అనుభవాల్ని ఇచ్చింది. కొండపల్లి కోటేశ్వరమ్మ గారు అక్కడే బాగా పరిచయమయ్యారు. ఆవిడ అనుభవాలు వినడం గొప్ప అనుభూతి.

 90 లలో వాతావరణం-

85 లో క్లాసు రూము బహిరంగ సభలా ఉండేది. నిజానికి మంచి విద్యార్థి ఉద్యమాలు ఉంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు పదునుగా, బాధ్యతగా ఉంటారు. ఇక 86, 87 లలో ఆర్ట్స్ కాలేజీ నుంచి యూనివర్శిటీ కి వచ్చాను. 90 వరకు అక్కడ పనిచేసి మరలా ఆర్ట్స్ కాలేజీకి వెళ్లే సరికి అంతా నిశ్శబ్దం. అంతకు ముందంతా వున్న  రగిలే పర్వతాల్లాంటి విద్యార్థులు లేరు. ఉత్తేజకరమైన వాతావరణం లేదు. ఒకటే నిస్తేజం. నాకు చాలా దిగులేసింది. సంఘాలన్నిటి మీదా బాన్ ఉండేది. రాజ్యం ఎంత పకడ్బందీగా మనుషుల్ని నిర్వీర్యం చేస్తుందో మొదటి సారి ప్రత్యక్షంగా అర్థమయ్యింది.

 

స్త్రీవాదం పట్ల మీ  దృష్టి మొదలవడానికి కారణం-

82 నించీ  స్త్రీవాద  అధ్యయనం చేస్తున్నా కదా. 1987 లో రాజోలు లో జరిగిన సాహిత్య సభలో మొదటగా కొండేపూడి నిర్మల, ఘంటశాల నిర్మల, సత్యవతి మొ.న వాళ్ల ను కలిసాను. అప్పటికే ఓల్గా రచనలు చాలా చదివేను. 90 నించీ స్త్రీవాదులతో దగ్గర సంబంధాలు ఏర్పడ్డాయి. మార్క్సిజం పట్ల అవగాహన ఉండడం వల్ల స్త్రీ వాద సమస్యల పట్ల బాగా దృష్టి మళ్లించాను. స్త్రీల కోణం నించి ప్రాచీన సాహిత్యం చదవడం అప్పటికే ప్రారంభించాను.  90 ల నించి  ప్రత్యేకంగా స్త్రీవాదాన్ని చదివేదాన్ని. 1993 లో వచ్చిన ” నీలి మేఘాలు” మీద ఎన్నో సభల్లో విశ్లేషణ  చేసాను. ఫెమినిజం లోకి అడుగుపెట్టాక స్త్రీల ప్రతి రచననీ చదవడం, ప్రతి రచననీ స్త్రీల కోణం నించి చదవడం అలవాటు చేసుకున్నాను. “పురాణేతిహాసాల్లో స్త్రీల  పాత్రలు” అలా రాసిందే. ఇరావతీ కార్వే ని చదవక ముందే “భారతంలో భార్యా భర్తల సంబంధాలు” వ్యాసం  రాసాను.

నా అభిప్రాయంలో ఫెమినిజమ్మీద విశ్లేషణ కు ఒక్క ఫెమినిజమే చదివితే సరిపోదు. ఏ సబ్జెక్టయినా స్త్రీల కోణం నించి చూడాలి. “ప్రతీ రచయితా తను తన వర్గానికి ఎన్నుకోబడని ప్రతినిధిని అనుకుని, బాధ్యత వహించాలి ” అని కొ.కు అంటారు. నాకది చాలా నచ్చిన మాట. అలా నేను స్త్రీలు, పేదల పక్షాన నిలబడాలని అనుకున్నాను. ఒక రకంగా ఫెమినిస్ట్ అధ్యయనం  లేకపోతే క్లాసికల్ లిటరేచర్ లో ఇంత లోతుకు పరిశోధన చేసేదాన్ని కాదు. అంతే కాదు-మార్క్సిజం, ఫెమినిజం అసమానతల్ని వ్యతిరేకించాలన్న ఉద్బోధన చేస్తాయి. అలాగే దళిత ఉద్యమం, తెలంగాణా ఉద్యమం వైపు నేను మొగ్గుచూపాను.

 

 యూనివర్శిటీ  ఉపాధ్యాయురాలిగా  స్త్రీ వాద అధ్యయనం, పరిశోధనకు తోడ్పాటు-

యూనివర్శిటీ  అధ్యయనాలలో ఉమన్ పాయింటాఫ్ వ్యూని ప్రవేశ పెట్టాం. సిలబస్ లో ఫెమినిజం థియరీ, ప్రాచీన సాహిత్యాన్ని   స్త్రీల కోణం నించి చదవడం, మోడ్రన్ స్త్రీ రచనల అధ్యయనం ప్రవేశ పెట్టాం. అసలు ఫెమినిజం అమెరికా లో పుట్టినదో, ఈ రోజుల్లోనూ పుట్టినదో కాదు. ప్రాచీన కాలం నించీ అణచి వేయ బడ్డ వర్గాలు తమ ధిక్కారాన్ని ఎప్పుడూ వ్యక్తపరుస్తూనే ఉన్నారు. ప్రాచీన సాహిత్యంలో ఎందరో స్త్రీ వాదులున్నారు. కాకపోతే మనం దాన్ని సరిగ్గా చూసి,  గ్రహించలేదు ఎప్పుడూ. గాంధారి గురించి చదివితే ఎన్నో మిథ్స్ ని బద్దలు కొట్టొచ్చు. “స్త్రీకి స్త్రీ శత్రువు” అనేది తప్పని గాంధారి కోడళ్ల గురించి పడిన  వేదన  తెలిస్తే అర్థమవుతుంది. లైంగికత మీద, మాతృత్వం గురించిన  పెద్ద ఆలోచన రేకెత్తించే మంచన కేయూర బాహు చరిత్ర లోని   “నిపుణిక కథ” ఒక కనువిప్పు. ఈ కథ స్త్రీని నమ్మొద్దని చెప్పడం కోసం చెప్పబడింది. కానీ  స్త్రీకి ఉన్న వేదనని సరిగ్గా గుర్తింపజేసేదది.  లేబర్ రూం కవితనూ, ఈ కథ నూ పక్కపక్కన బెట్టి అధ్యయనం చెయ్యొచ్చు. ఈ తరం విద్యార్థులకు స్త్రీల సాహిత్యాన్ని, స్త్రీ వాద దృక్పథాన్నీఅధ్యయనం చేసే అలవాటు, అభ్యాసం చేయించాలని ఒక సెమినార్ చేసాం. ఆ సెమినార్ లో  మాతృత్వం గురించి పాజిటివ్ అధ్యయనానికి  నీ “ద్రవభాష”  లోని కవితల్ని తీసుకున్నాం. కథాకావ్యాలను కూడా సరైన దృష్టి తో చదవడానికి ఫెమినిజం బాగా ఉపకరించింది. స్త్రీవాదం వచ్చి మన కుటుంబాల్ని పాడుచేసిందని వాపోయే వాళ్ళు “కుటుంబాల్ని  పాడుచేసే లక్షణం కుటుంబం లోనే ఉందని గ్రహించాలి.”


రాసిన పుస్తకాల గురించి-

1994లో  “మహిళా జన జీవన సమస్యలు- మూలాల అన్వేషణ” జ్యోతిరాణి, శోభ లతో కలిసి రాసినది. “ప్రాచీన సాహిత్యం- స్త్రీవాద దృక్పధం” 1994-95 లలో ప్రచురించిన నా  మొదటి పుస్తకం.

2005 లో “జండర్ స్పృహ -ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రతిఫలనాలు”, “కన్యాశుల్కం- సామాజిక సంబంధాలు”, 2006 లో”ఆధునిక తెలుగు సాహిత్యం- స్త్రీవాద భూమిక”, 2007 లో జ్యోతిరాణి తో కలిసి రాసిన “జండర్ సమానత దిశగా సమాజం- సాహిత్యం” , 2010 లో ఇప్పుడు అకాడమీ బహుమతి పొందిన “సాహిత్యాకాశంలో సగం-స్త్రీల కవిత్వం-కథ-అస్తిత్వ చైతన్యం”. ఇవన్నీ కాక వాజ్మయ సూచికలు, అనేక వ్యాసాలు, “ప్రాచీన సాహిత్యం- మరో చూపు” ఈ మధ్య రాసిన పుస్తకం. మొన్నే అక్టోబరు 28 న  ఆవిష్కరించిన పుస్తకం “తెలంగాణా సాహిత్య అస్తిత్వ చైతన్యం”.

ఇప్పుడు అకాడమీ బహుమతి పొందిన “సాహిత్యాకాశంలో సగం-స్త్రీల కవిత్వం-కథ-అస్తిత్వ చైతన్యం” గురించి చెప్తారా

ఈ పుస్తకం 1982 నించీ స్త్రీల రచనల పై నేను రాసిన వ్యాసాల సంకలనం.” స్త్రీల సాహిత్యం ఎందుకు చదవాలి? ఎలా చదవాలి? స్త్రీల సాహిత్యం చదవడం వల్ల వచ్చే సామాజిక, సాహిత్య ప్రయోజానాలు ఏవిటి?”అని చర్చించే సిద్ధాంత వ్యాసాలు కూడా ఇందులో ఉన్నాయి. తెలంగాణా విప్లవోద్యమంలో స్త్రీలు రాసిన కథల పై విశ్లేషణలు ఉన్నాయి.  కవిత్వం, కథల మీద విశ్లేషణలు ఉన్నాయి. మొత్తంగా స్త్రీల రచనల మీద అధ్యయనానికి అవసరమైన సైద్ధాంతిక వ్యాసాలున్నాయి. తెలుగు రచయిత్రులకు సంబంధించిన పుస్తకం కాబట్టి ఈ అవార్డు తెలుగు రచయిత్రులందరిదీ.

మీ విమర్శ కు , విశ్లేషణ కు ప్రోద్బలం ఇచ్చిన విషయాలు-

ఒక విధంగా త్రిపురనేని మధుసూధన రావు గారి ఉపన్యాసాలు కారణం అనుకుంటా. సాహిత్యం ఒక రాజకీయమని అర్థం చేసుకోవడానికి శాకుంతలం గురించి ఆయన చేసిన ఉపన్యాసాలు పరోక్షంగా దోహదం చేసాయి. స్త్రీ వాద విశ్లేషణలో అటువంటి ఆలోచనా ధోరణి నే తర్వాత నేను అవలంబించాను.

సాహిత్య ప్రస్థానంలో కుటుంబ సభ్యుల తోడ్పాటు –

మా అమ్మా, నాన్నా నన్ను, మా చెల్లెళ్ళు మైథిలి, శ్రీ గౌరి లను అన్ని విషయాల లోను బాగా ప్రోత్సహించేవారు. మాకు సామాజిక జీవితం, సాధికారత ఉండాలని అనుకునే వారు. ముగ్గురం పీ.హెచ్ డి లు చేసాం. పెద్ద చెల్లెలు జువాలజీ, చిన్న చెల్లెలు ఫిజిక్సు, నేను తెలుగు. అకడమిక్ గా పని చేసేటప్పుడు మా అందరి పిల్లల్నీ మా అమ్మ, నాన్న పెంచారు. 76 లో నేను ఎమ్మే ఫైనలియర్ చదువుతున్నపుడే గుండవల్లి వెంకటేశ్వర్లు గారి తో నా వివాహం అయ్యింది. వృత్తి రీత్యా  డాక్టరు. ఈయనకూ కవిత్వం చదవడం అలవాటు ఉంది. మా అమ్మాయి అంజన. నా లాగా  సాహిత్యం మా చెల్లెలు కూతురు విష్ణు ప్రియ  అంది పుచ్చుకుంది. తను ఇంగ్లీషులో కవిత్వం, ఫీచర్స్ రాస్తుంది. పిల్లంతా నన్ను “ఆమ్మా శ్రీ” అని పిలుస్తారు. అవార్డు వచ్చినప్పుడు మా అమ్మా, నాన్న ఇప్పుడు ఉండి ఉంటే ఎంతో బావుండుననిపించింది.

 

ఇప్పటి విమర్శ గురించి-

విమర్శ కు బాగా శ్రమ చెయ్యాలి. మనకు ఏ ముక్క కు ఆ ముక్క చూడడం బాగా అలవాటయ్యిపోయింది. పూర్వాపరాలు ఆలోచించడం, హోలిస్టిక్ అప్రోచ్ తగ్గిందనిపిస్తూంది. సీరియస్ గా ఒక పుస్తకం చూడడం అంటే దాని వెనక సామాజిక సంబంధాన్ని చూడగలగాలి.  విమర్శ జోలికి ఎవరూ పోకపోవడానికి ఇమీడియేట్ గుర్తింపు లేకపోవడం కూడా కారణం. యూనివర్శిటీ లు విమర్శ పట్ల బాధ్యత వహించాలని నా ఉద్దేశ్యం. వి.వి, మృణాళిని, వేణుగోపాల్ , పాణి, ఓల్గా, చూపు కాత్యాయని మంచి ఎనాలిసిస్ చేస్తారు. నా ఉద్దేశ్యంలో విమర్శ అంటే బాగా డెప్త్, ఫిలాసఫీ ఉండాలి. విమర్శ పాఠకుల కూ, రచయిత కూ సహాయం చేసే విధంగా ఉండాలి.

 

కవిత్వం పట్ల ఆసక్తి –

మొదట్లో కవిత్వం కంటే నాకు కథలు, నవలలు చదవడం మీదే బాగా ఆసక్తి ఉండేది. స్త్రీవాదం మొదలయ్యేకనే కవిత్వం మీద ప్రేమ కలిగింది.

 

విమర్శ కాకుండా రాసిన ఇతర రచనల గురించి-

కవితలు  ఈ మధ్య పది వరకూ రాసేను.  చిన్నపుడెప్పుడో ఒక కథ రాసేను, ఆ తర్వాత కథలు రాయలేదు. చాలా కదిలిపోయినప్పుడూ, నాలో మధన పడ్డప్పుడే రాయగలను. కానీ ఎప్పటికైనా  నాకు నవల రాయాలని ఉంది.

భవిష్యత్ రచనలు-

మా బామ్మ గురించి రాయాలని ఉంది. అప్పటి బ్రాహ్మణ అగ్రహార  స్త్రీల జీవితాల గురించి రాయాలి.  రంగవల్లి లాంటి స్త్రీల జీవితాల గురించి కూడా రాయాలని ఉంది. స్త్రీలు ఎలా ఉద్యమాల్లోకి వచ్చారు? ఎలా స్ట్రగులయ్యారనేది రాయాలి.

స్త్రీల సాహిత్యమ్మీద ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నా. స్త్రీలు ఫెమినిస్టులే  కానవసరం  లేదు. అసలు స్త్రీలు ఎందుకు రాసేరో చూడాలి. 1950 వరకు చూస్తే అయిదారు వందల మంది రచయిత్రుల రచనలు లభ్యమయ్యాయి.

చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే స్త్రీల చరిత్ర లేదు. మన  చరిత్రలు మనం వెతుక్కోవల్సిన అవసరం ఉంది. ఏడు తరాల నవల లో  లాగా మనం మన కథ ప్రతీ తరానికీ చెప్పుకుంటూ పోవాలి. అప్పుడే మన మూలాలు మనం ఎప్పటికైనా పట్టుకోగలం. మన కథలు విఫల కథలైనా ఎప్పటికైనా విజయం మన స్వంతమవుతుంది. 50ల తర్వాత నించి 75 వరకూ ఉమెన్ రైటర్స్ గురించిన ప్రాజెక్టు చేస్తున్నాం. తెలుగులో “స్త్రీల సాహిత్య విమర్శ” మీద నా విద్యార్థిని తో పీహెచ్ డీ చేయించినప్పుడు దాదాపు ఆరు వందల మంది ఏదో ఒక విమర్శ రాసిన స్త్రీలున్నారని తేలింది. “స్త్రీల సాహిత్య చరిత్ర” అనే పెద్ద ప్రాజెక్టు భవిష్యత్ ప్రణాళిక.

…………………….

-డా||కె.గీత

http://www.koumudi.net/Monthly/2014/january/jan_2014_katyayani.pdf

ప్రకటనలు
This entry was posted in సాహిత్య వ్యాసాలు and tagged , , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s