నా కళ్లతో అమెరికా-24 (ఉత్తర కాలిఫోర్నియా యాత్ర-రోజు-3 (ఫోర్ట్ బ్రాగ్ – లెగ్గెట్- మేయర్స్ ఫ్లాట్-యురేకా))

ఉత్తర కాలిఫోర్నియా యాత్ర-రోజు-3 (ఫోర్ట్ బ్రాగ్ – లెగ్గెట్- మేయర్స్ ఫ్లాట్-యురేకా)

Dr.K.Geetha

Dr.K.Geetha

యూకై నుండి ఆ రోజు బయలుదేరి మేం మరలా సముద్ర తీర పట్టణమైన ఫోర్ట్ బ్రాగ్ మీదుగా, రెడ్ ఉడ్

అటవీ ప్రాంతమైన మేయర్స్ ఫ్లాట్ మీదుగా ప్రయాణించి, దారిలో విశేషాలు చూసుకుంటూ చివరగా యురేకా కు చేరి, అక్కడికి దగ్గర్లో ఉన్న మా రాత్రి బస “అర్కాటా ” కు చేరాలి.

మధ్యలో ఆగేవి ఎక్కువ ఉన్నందువల్ల ఒక రోజుకంటే ఎక్కువ పట్టే ప్రయాణమది. కానీ మేం తిరిగి ఈ

దారిలో రాం. ముందసలు యురేకా ప్రాంతం నుంచి వెనక్కి తిరిగి వచ్చిన దారినే వచ్చేయాలనుకున్నాం.

కానీ అక్కడిదాకా వెళ్లి, అక్కడి నుంచి పక్క రాష్ట్రమైన ఓరగాన్ సరిహద్దుల్లో ఉన్న క్రేటర్ లేక్

చూడకుండా వెనక్కి రావడం వృథా అని దారిలో టూరిజం సెంటర్ల లో దొరికిన సమాచారాన్ని బట్టి నిర్ణయించుకుని మర్నాటి నుంచి మరో రెండు రోజులకి మా ప్రయాణాన్ని పొడిగించాం. అప్పటికప్పుడు తర్వాతి రోజులకి రిజర్వేషన్ చేయించాం.

ఇక ఆ రోజు మా మొదటి సందర్శన ప్రదేశమైన ఫోర్ట్ బ్రాగ్ యూకై నుంచి దాదాపు 60 మైళ్ల దూరంలో

ఉంది.

ప్రయాణం: ఎప్పటిలానే మంచి హోటల్ లో ఉన్నందువల్ల ఉదయం మంచి బ్రేక్ ఫాస్టు తిని స్థిమితంగా

బయలుదేరే అవకాశం లేదు మాకు. బ్రేక్ ఫాస్ట్ హడావిడిగా ముగించి అప్పటికే తెమలడం

లేటవడం తో పది గంటలకు ప్రయాణం మొదలు పెట్టాం. దారిలో “విల్లెట్ “ అనే ఊరిలో “రెడ్ ఉడ్ ఫారెస్ట్

ముఖ ద్వారం” అని అటవీ స్వాగత తోరణాలు కూడా కనిపించాయి.

అక్కడి నుంచి మరలా పర్వత ప్రాంతం ప్రారంభమవుతుంది. మళ్లీ వంపుల రహదారి మీద

ప్రయాణం. అది బహుశా: వరసగా మూడు రోజుల్లో నాలుగవ సారి మా ప్రయాణం లో మరలా సముద్రం ఒడ్డుకు ప్రయాణించడం.

ఫోర్ట్ బ్రాగ్: సరిగ్గా ఫోర్ట్ బ్రాగ్ కు చేరేసరికి మధ్యాహ్నం 12 అయ్యింది. ఘాట్ రోడ్డు లోప్రయాణం అనుకున్న కంటే ఎప్పుడూ ఆలస్యం కావడం మామూలే కదా!.

ఇంతకీ ఫోర్ట్ బ్రాగ్ లో ఫోర్ట్ ఏమీ ఉండదు. ఆ ఊరు అందమైన సముద్ర తీరానికి ప్రసిద్ధి. ముఖ్యంగా అక్కడి గ్లాస్ బీచ్ అనే చోటు చూడాలని వచ్చాం. కారు పార్కింగు ప్రదేశం అంటూ ఏమీ లేదు ఆ బీచ్ కి.

ఎక్కడైనా రోడ్డు మీదనే పార్కు చేయాలి. రెండు రౌండ్లు కొట్టే వరకు మాకు పార్కింగ్ దొరక లేదు.

మొత్తానికి ఒక స్పాట్ సంపాదించాం. గ్లాస్ బీచ్ రోడ్డు మీద నుంచి కనిపించేటట్టు ఉండదు.

మా కారు పార్కు చేసిన దగ్గర్నించి కొంత దూరం ఇసుక లోపలికి నడిచి వెళ్లాలి. అక్కడ బీచ్ లో తళతళా మెరిసే అద్దాల ముక్కలు అధికంగా ఉండడం తో దానిని గ్లాస్ బీచ్ అంటారట. అయితే అక్కడ అన్ని అద్దాలముక్కలు ఉండడానికి కారణం ఒకప్పుడు ఆ బీచ్ ను వ్యర్థ పదార్థాలు, ముఖ్యంగా గాజు సామాన్లు పారవేయడానికి ఉపయోగించే వారట. క్రమేపీ అవన్నీ నిషేధించినా ఇప్పటికీ అద్దాలు ఒడ్డున రాళ్లల్లోభాగమై ఆ బీచ్ కు ఆ పేరు వచ్చింది.

https://plus.google.com/photos/104256037410703377895/albums/5925919781676787489?banner=pwa&authkey=CJXLqpjvoLLiyQE

సముద్రం ఒడ్డున పెద్ద పెద్ద బండ రాళ్లు ఉన్నాయి. నీళ్లు కాళ్లకి తగిలే ప్రదేశం లో మొత్తం రాళ్లతో నిండి ఉంది సముద్ర తీరం. సరిగ్గా ఎండ నడి నెత్తికి చేరిందేమో, భలే అందంగా తళుక్కున కాంతి కిరణాలని ప్రతిఫలింపజేస్తూ మెరిసి పోతూంది సముద్ర తీరం. గాజు ముక్కలంటేకాళ్లల్లోకి గుచ్చుకోవూ! అనుకున్నాను.. కానీ అక్కడ ఉన్న గాజు ముక్కలేవీ గాజుల్లా కాకుండాఅంచులు సాఫీగా చెక్కి ఉన్న రాళ్ల లా ఉన్నాయి.

ఇక నాచు ఆ రాళ్లమీద కి కొట్టుకి వచ్చి బాగా ఈగలు ముసురుతూ ఉన్నాయి.

అయినా అక్కడి స్వచ్ఛమైన అలల్ని చూడగానే ఎవరికైనా నీళ్లవైపు పరుగెత్తాలనిపిస్తుంది.

కాస్సేపు నీళ్లలో కాళ్లు ముంచి వచ్చి, ఇక తర్వాతంతా మంచి రంగు రంగుల గాజు ముక్కల్ని, గుండ్రని చిన్న రాళ్లని ఏరుతూ కూర్చున్నాం.

అక్కడే ఇంకాస్త సముద్రం వైపు ముందుకి సాగి ఉన్న పెద్ద రాళ్ల మీదుగా నడిస్తే భీకరమైన

కెరటాల్తో ప్రత్యక్షమైందొక గొప్ప ఎగిసిపడే అలల దృశ్యం. ఆలల నురుగులో పసుపు రంగు ఏదో భాస్వరాన్ని తెచ్చి అలల మీద చల్లినట్లు. అక్కడ బ్రహ్మాండమైన లోతు ఉంటుందని చూడగానే అర్థమవుతూంది. రాళ్లని కోస్తూ, బ్రిడ్జ్ ల్లాగా అట్నించి ఇటుకి ప్రవహిస్తున్న అలల్ని చూస్తూ, రాళ్ల మీంచి రాళ్ల మీదికి దాటుతూ, పెద్ద రాయెక్కి ఫోటోలు తీసుకుంటూ గడిపేం.

నిజానికది పిల్లలు ఆడుకోవడానికి అనువైన బీచ్ కాదు. కానీ విభిన్నమైన సముద్ర తీరాన్ని చూడడానికి తప్పని సరిగా ఆ ప్రదేశానికి వెళ్లాలని చూడగానే అనిపించింది. గంటన్నర పాటు మైమరిచి ఉండి పోయాం. ప్రతీ కొస నుంచి ఒక కొత్త దృశ్యం కనిపింపజేసే అద్భుత సముద్ర సౌందర్యం కళ్లని వెంటాడుతూ ఉండగా బయటికి వచ్చేం.

అక్కడే దగ్గర్లో ఉన్న రెస్టారెంట్లో భోజనం కానిచ్చాం. అక్కడి ప్రత్యేకమైన బ్రెడ్డు భలే రుచిగా

ఉంది. ఊరు దాటుతూ ఉండగా రోడ్డు వారనే మంచి తెల్లటి, మెత్తటి ఇసుక సముద్ర తీరం కనిపించి మురిపించింది.

కానీ అది మరోసారికి వాయిదా వేసుకుని ముందుకు బయలుదేరాం.

అక్కడి నుంచి మరలా అడవి ముంగిట్లోకి ప్రయాణం చేస్తూ మేం మేయర్స్ ఫ్లాట్ అనే చోట ఉన్న “డ్రైవ్ థ్రూ ట్రీ” ని చూడడానికి వెళ్లాలి.

లెగ్గెట్ : అయితే దారిలో లెగ్గెట్ అనే ప్రాంతం దగ్గర మరో డ్రైవ్ థ్రూ ట్రీ ఉందని ముందుగా అక్కడికి ప్రయాణమయ్యాం.

సరిగ్గా సాయంత్రం 4 గంటలకు అక్కడికి చేరేం. అయితే అక్కడ ఉన్న ఆ చెట్టు ని చూడడానికి కార్ల వరుస బాగా పెద్దగా ఉంది.

టిక్కెట్టు తీసుకోవలసిన చోట దాదాపు గంట పడుతుందని చెప్పేరు. అయినా సరేనని వరుసలోకి వెళ్లేం.

కారు లో ఒకళ్లం ఉండి మరొకళ్లం బయట కు తిరుగుతూ లైన్ లో బోరెత్తకుండా చక్కగా చుట్టుపక్కలంతా నడిచి చూసేం.

పొడవైన రెడ్ వుడ్ వృక్షాల గుబురుల నడుమ తనొక్కతే ధీర గంభీరంగా భలే అందంగా నిలబడి ఉందా వృక్షం.

చెట్టుకు దరిదాపుల్లో మాత్రం మరే వృక్షమూ లేకుండా కార్లు చెట్టు మధ్య నించి అట్నించి ఇటుకు వెళ్లేందుకు చెట్టు మొదలుని మధ్యలో చెక్కి మధ్య చిన్న బాటను నిర్మించారు. ఆ పక్కనే చిన్న కొలను.

అటు తీరం లో మరలా వృక్షాలు. భలే అందంగా గొప్ప ప్రశాంతంగా ఉందక్కడ.

చెట్టు ఎత్తు 315 అడుగులు, చుట్టు కొలత 21 అడుగులు, వయస్సు 2400 సంవత్సరాలు. మధ్య 6 అడుగుల వెడల్పున సొరంగమన్నమాట.

బిలబిల్లాడుతూ జనం ఉండడం వల్ల ఆ ప్రాంతం మరింత వన్నెతో కనిపించిందనిపించింది.

చెట్టు లో నుంచి మన కారుని నడుపుకుంటూ మరో వైపు కు వెళ్లేందుకు

అక్కడ $5 డాలర్లు రుసుము చెల్లించాలి. ప్రతీ ఒక్కరూ కారు ని లోపలికి తీసుకు వెళ్లే ముందు , బయటికి వచ్చే టప్పుడు ఫొటోలు తీసుకుంటున్నందు వల్ల బాగా ఆలస్యమవుతూంది. సరిగ్గా గంట లో మా వంతు వచ్చింది. పురాతనమైన వృక్షాన్ని తడిమినప్పుడు మనసు ప్రాచీన కాలం లోకి వెళ్లిపోయింది.

ఈ వృక్షం ఇక్కడ నాటుకున్నపుడు దానికి తెలుసా తన జీవిత కాలం ఇంత సుదీర్ఘమైందని! ఆకాశం

లోకి ఎదుగుతున్న ప్రతీసారీ నేల మీద విస్తరిస్తూన్న కాండం తనకే ఒక ప్రత్యేకమైనదని తనకు తెలుసా!

గమ్మత్తు ఆలోచనలతో వృక్ష రాజాన్ని నేను డ్రెవ్ చేస్తూ దాటాను. ఆదొక గొప్ప అనుభూతి.

ఇక అక్కడి నుండి మంచి ఎర్ర చందనపు సువాసన వచ్చే చిన్న ఆభరణాల పెట్టెని, సెంటుని కొని

తెచ్చాను. ఆ పెట్టెని తెరిచినప్పుడల్లా ఈ జ్ఞాపకాలు ఇప్పటికీ గాఢంగా అల్లుకుంటూంటాయి.

అయిదు గంటల ప్రాంతంలో అక్కడి నుంచి ముందుకి ప్రయాణం ప్రారంభించాం.

కన్ ఫ్యూజన్ హిల్: లెగ్గెట్ దాటి సరిగ్గా 5 మైళ్లు వచ్చామో లేదో అక్కడేదో చిన్న పిల్లల ఆట ప్రదేశముందని బోర్డు కనిపించింది.

ఇక ఆలోచించకుండా అటు దారితీసాం.

మాకు ఎక్కువ సమయం లేకున్నా కొంచెమైనా చూసి వెళ్దామని

అనుకున్నాం. ఇంతకీ ఆ ప్రదేశం పేరు “కన్ ఫ్యూజన్ హిల్’”.

అక్కడ శాంతా క్రూజ్ లో “మిస్టరీ స్పాట్ ” లాంటి మిస్టరీ హౌస్ చూసాం. చిన్న పిల్లల అప్ హిల్ బొమ్మ రైలు ని ఎక్కాం.

చిన్న కొండ మీద కట్టిన ప్రకృతి సిద్ధమైన థీం పార్కు లాంటిదది. కొండ మీద పాత కాలపు పనిముట్లు, పాత

ఇంజన్లు చూసేం. చెట్ల మధ్య బొమ్మ రైలు ప్రయాణం ఒక అల్లిబిల్లి జ్ఞాపకం. ఫిల్లలకు బాగా నచ్చింది. సంతోషం తో

కేరింతలు కొట్టేరు.

భూమ్యాకర్షణకు ఎదురీదే సాహసోపేతమైన “మిస్టరీ హౌస్“ లో వరు పిల్లి మొగ్గలు వేసింది.

బాగా ఎంజాయ్ చేసింది.

మేయర్స్ ఫ్లాట్ : 7 గంటలకు అక్కడి నుంచి బయలుదేరేం. వేసవి పొద్దు కావడం వల్ల వెలుతురు 9 గంటల వరకు

ఉండడం తో హాయిగా బయట తిరగగలుగుతున్నాం. అప్పటికీ చక్కగా 4 గంటల వేళ వెల్తురులా ఉంది.

అందుకే ఇంకా చూడాలసినవన్నీ ఇంకా తెరిచే ఉంటయన్న అశాభవం తో మొత్తానీకి ఉదయం నించీ మేం

చూడాలనుకున్న మేయర్స్ ఫ్లాట్ కి 7.15 కి చేరేం.

లక్కీగా అది తెరిచే ఉంది. 6 డాలర్లు టిక్కెట్టు తీసుకుని లోపలికి పోనిచ్చాం.

ఈ డ్రెవ్ థ్రూ ట్రీ ని వీళ్లు కావాలని చెక్కినట్లు కాకుండా కాండం రెండుగా చీలిపోయినట్లు ఉంది. ఇది ఇంతకు ముందు వృక్షాని కంటే బాగా పురాతనమైనది.

వయస్సు 5000 సం.రాలు, ఎత్తు 275 అడుగులు, చుట్టుకొలత 64 అడుగులు. బాగా వృద్ధ వృక్ష రాజం. నిజానికి అది ఎప్పుడో పడిపోబోతుండగా చుట్టూ తాళ్ళతో నిలబెట్టారు.

దాదాపుగా వృక్ష జీవితం అయ్యిపోయినట్లే. చెట్టు లోపలికి వెళ్లి చూస్తే మధ్య అంతా ఖాళీగా పైన ఆకాశం కనిపిస్తూంది.

చుట్టూ దట్టంగా అలుముకున్న చెట్లు. అక్కడితో పోలిస్తే చిన్న ప్రదేశమిది.

కానీ ఇక్కడ ఇంకా చాలా చెట్ల విశేషాలున్నాయి. చెట్ల కాండాలనే ఇళ్లలా చెక్కిన

బుజ్జి బుజ్జి ఇళ్లున్నాయి. చెట్టు కాండం మీద కారు వెళ్లే దారి, చెట్ల కాండం లోంచి నేల లోకి దిగే చిన్న గది ఇక్కడి మరిన్ని విశేషాలు.

పొద్దుట్నించీ అలసటెరుగకుండా ఉత్సాహంగా పిల్లలూ, మేమూ ఏకబిగిన తిరుగుతూనే ఉన్నాం. బహుశా: అన్నీ ప్రకృతి అందాలు కావడం వల్లననుకుంటా.

చెట్ల మధ్య కి, పచ్చని ప్రదేశాలకి వెళ్తే గొప్ప ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకో.

కాస్సేపు పిల్లలు చెట్ల ఇళ్లలో బాగా ఆడుకున్నారు.

ఇక 8 గంటల ప్రాంతంలో యురేకాకు బయలుదేరేం. మరలా సముద్ర ప్రాంతానికి వస్తున్నామేమో చల్లగా చలి ఆవరించింది.

అయితే రహదారి మెలికల్లా లేదు. సముద్రం మరలా కనిపించే ప్రదేశం లో దట్టంగా పొగ మంచు పట్టి అదేదో సముద్ర తీరం

లో డార్జిలింగుకి వెళ్తున్నంత అందంగా ఉందా సాయంత్రం. దారిలో ఫార్చ్యునా అనే ఊరిలో అక్కడి ప్రత్యేకమైన ఆపిల్ సైడర్

ఫాక్టరీ గురించి ఎక్కడో చదివి మధ్యలో కారు అటు తిప్పాము.

అడ్రసు యథావిధిగా గూగుల్ పిన్ని తప్పు చెప్పింది.

(ఈ మధ్య గూగుల్ లేడీ వాయిస్ తో అడ్రస్ లు చెప్తూంది. అందుకే “గూగుల్ బాబాయ్” అనడం మానేసి, “గూగుల్ పిన్ని” అనడం మొదలుపెట్టాడు సత్య!!)

మొత్తానికి ఎవరినో కనుక్కుని ఒక అరగంట గిరికీలు కొట్టి, అడ్రసుకి వెళ్లాం.

చిన్న షెడ్డులో ఇంటి గరాజులా ఉన్న ప్రదేశమది. బయట కాగితమ్మీద చేతి రాతతో “ఆగస్టు నించి దుకాణం తెరుస్తాం” అని రాసి ఉంది.

అయినా మా పిచ్చి గానీ ఆపిల్ లు లేని ఈ సీజన్ లో ఆపిల్ సైడర్ ఎలా తయారు చేస్తారో చూద్దామని ఎలా వచ్చామో అనుకుని నవ్వుకున్నాం.

యురేకా: మరలా రహదారిని పట్టుకుని యురేకా ను 9 గంటలకు చేరుకున్నాం. మేం వెనక ప్రయాణించి వచ్చిన

దాదాపు 200 మైళ్ల సముద్ర తీర ప్రాంతాల్లో ఈ ఊరు బాగా పెద్దది. ఇది సిటీ. కౌంటీ ప్రధాన నగరం.

రోడ్లకిరుప్రక్కలా బోల్డు రెస్టారెంట్లతో, చారిత్రాత్మక మైన డౌన్ టౌన్ తో ఉన్న ఈ ఊరు రాత్రి పొద్దు

పోయే సమయం కంటే ముందు రావాల్సిందని అనిపించింది. అయినా అక్కడి సంధ్య వేళ ఆ ఊరిలో

చూడాల్సిన “ కార్సన్ మేన్షన్” ని చూసెందుకెళ్లేం. నిజానికి ఏ సమయం లో వచ్చినా అక్కడ ఆ భవంతి

లోపలికి ప్రత్యేకులకి తప్ప ప్రవేశం లేదు.

కానీ సరిగ్గా దీపాల వేళేమో, బయటి నుంచి చూడడానికి గొప్ప అద్భుతంగా ఉందది. చిన్నప్పటి పాశ్చాత్య కథల్లోని దివ్య భవంతి కళ్లెదుట ప్రత్యక్షమైనట్లనిపించింది.

అక్కాడా వేళ ఏదో ప్రత్యేక కార్యక్రమం జరుగుతున్నట్లుంది. అన్ని గదులూ వెలుగుతూ బయటి సంధ్య కాంతిని వెనక్కి నెడుతూ ఒక వైపు, సంధ్య వెలుగు లో లేత ఆకుపచ్చ రంగులో భవంతి తన పగటి అందాన్ని ఒలకపోస్తూ మరో వైపు కనిపించింది.

నాకు అక్కడే కాస్సేపు గడపాలని ఎంతగానో అనిపించింది. అప్పటికే రాత్రి తొమ్మిదయ్యి తిరిగి తిరిగి అలిసి పోయి ఉన్నామేమో ఇక 5 నిమిషాల్లో అక్కడి నుంచి కదలాల్సి వచ్చింది. తెరిచి ఉన్న రెస్టారెంట్ కనబడ్డ మొదటి చోటునే భోజనం చేసి, యురేకాకు జంట నగరమైన అర్కాటా లోని మా బసకు రాత్రి 10 గంటలకు చేరుకున్నాం.

పిల్లలు స్విమ్మింగు పూల్ కి, హాట్ జకూజీ కి వెళ్దామని పేచీ పెట్టారు. ఎంత ఓపికో పిల్లలకి. ఇక లేని ఓపికల్తో వెచ్చని

నీళ్లలోకి దూకాం. అలసటంతా పోయి బోల్డు ఉత్సాహం వచ్చింది, చల్లని బయట వాతావరణం లో వెలుగుతూ

పొగలు చిమ్ముతున్న వేడి నీటి జలకాలు పూర్తి చేయగానే.

అలా మా ప్రయాణం లో మూడవ రోజున బోలెడన్ని జ్ఞాపకాల్ని ఒడిసి పట్టుకుని మరో రోజు లోకి ఆనందంగా అడుగుపెట్టాం.*

-డా. కె.గీత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

http://vihanga.com/?p=10030

Published in Vihanga in  October , 2013
ప్రకటనలు
This entry was posted in నా కళ్లతో అమెరికా(Travelog) and tagged , , , , , , , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s