నా కళ్లతో అమెరికా-26 (ఉత్తర కాలిఫోర్నియా యాత్ర చివరి రోజు – క్రేటర్ లేక్)

ఉత్తర కాలిఫోర్నియా యాత్ర చివరి రోజు – క్రేటర్ లేక్

Dr.K.Geetha

Dr.K.Geetha

క్లామత్ ఫాల్స్ అనే ఊరికి పేరు లోనే గానీ నిజంగా చుట్టు పక్కల ఫాల్స్ ఏవీ లేవు. మేం కొంచెం తప్పుగా ప్లాన్ చెయ్యడం వల్ల ఇక్కడి నుంచి మేం ఆ రోజు చూడాల్సిన”క్రేటర్ లేక్” చూడడానికి మరలా నిన్న రాత్రి వచ్చిన దారినే వెనక్కి ప్రయాణం చేయాలి. క్రేటర్ లేక్ నుంచి ఇంటికి అదే దారి మీదుగా రావాలి.

ప్రయాణం : క్లామత్ ఫాల్స్ నుంచి క్రేటర్ లేక్ 60 మైళ్ల దూరం లో ఉత్తరంగా ఉంది. అదే రోజు మేం దాదాపు 500 మైళ్లు ప్రయాణించి ఇంటికి వెళ్లిపోవలిసి ఉంది. అయినా స్థిమితంగా నిద్ర లేచాం. హోటల్ రూం ఖాళీ చేసి సామాన్లు సర్దుకుని, అక్కడే బ్రేక్ ఫాస్టు చేసి మేం బయలుదేరే సరికి పది అయ్యింది. ప్రశాంతంగా ప్రయాణం మొదలు పెట్టాం. ఈ లేక్ చాలా బావుంటుందని అంతా చెప్పడమే గానీ ఇంటర్నెట్టు లో ఫోటోలు కూడా చూడలేదు. చక్కగా వెచ్చగా ఉన్న రోజులు కదా. సరస్సు లో బోటింగ్ వగైరా చెయ్యడానికి ఆహ్లాదంగా ఉంటుందనుకున్నాం.

ఊరు దాటగానే రోడ్డుకు ఒక పక్కగా పెద్ద నది కనబడింది. నిజానికి అది నది కాదు, “క్లామత్ లేక్” అని తర్వాత తెలిసింది. ఆ చుట్టుపక్కల చాలా లేక్ లు ఉన్నట్లున్నాయి. దాదాపు ఇరవై మైళ్ళు రాత్రి వచ్చిన దారినే ప్రయాణించేక మలుపు తిరిగి తిన్నగా ఉత్తరానికి ప్రయాణం మొదలుపెట్టాం.  చిన్న చిన్న చెక్క కరెంటు స్తంభాలు, చిన్న మాగాణి పొలాలు, ప్లాట్లు చేసి, గేట్లు కట్టి  ఉన్న చిన్న స్థలాలు చూడగానే మన దేశం గుర్తుకు వచ్చించి. ఇక్కడ ఎక్కడా జనం బయట కనిపించరు అదొక్కటే తేడా. కాలిఫోర్నియా లో ఇలా చిన్న పొలాలు, ఒకరి చేతిలో భూమి ఉండడం బాగా అరుదు. అక్కడంతా వందల ఎకరాలు కంపెనీల చేతుల్లో నడుస్తూ ఉంటాయి. ఓరెగాన్ రాష్ట్రం లో తిరుగుతున్నంత సేపు పల్లెటూళ్లు ఇలా ఉంటాయన్న మాట అమెరికా లో అనిపించింది. ముఖ్యంగా చిన్న వ్యవసాయ భూములు చూసినప్పుడు బాగా ఆనందం వేసింది. మనిషి మనిషిగా ఇంకా ఈ రాష్ట్రం లో బతికున్నందుకు.

రాను రానూ కనుచూపుమేర పర్వతాలు, పంట భూములు. కానీ ఏం పండిస్తున్నారో ఒక పట్టాన అర్థం కాలేదు. అంతా పశువుల కోసం గడ్డి అన్నట్లు ఉంది. కొన్ని కేవలం నిరుపయోగ భూములు అలా కంచె వేసి వదిలేసారంతే. క్రమంగా మా రహదారి ఎత్తైన పైన్ వ్క్షాల బాట పట్టింది. అది చూస్తేనే కొండల లోకి,ఎత్తుకి వెళ్తున్నామని అర్థమయ్యింది. అక్కడంతా శీతాకాలం లో మంచు పడుతుందనుకుంటా. రహదారి పక్కన మంచు కురిసినప్పుడు పైకి కనిపించే విధంగా తెల్లని మార్క్ తో నేలలోకి గుచ్చిన ఇనుప పుల్లలు కనిపిస్తున్నాయి.

Fossil Fumaroles : పర్వతాలు స్వయంగా అధిరోహించినప్పటి ఆహ్లాదంతో చెట్ల మధ్య మెలికలు చుట్టుకున్న రహదారిని చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం చేస్తూండగా దారి పక్కన కార్లు ఆపుకుని జనం దిగి వెళ్తూండడం చూసి మేమూ ఆగాం. ఇక్కడ పర్వతాల మీద ఎక్కడ పడితే అక్కడ కారు ఆపకూడదు “విస్టా పాయింట్”  అని బోర్డు ఉంటే తప్ప. అలాంటి ఒక “వ్యూ” పాయింట్ లో ఆగేమన్నమాట. ఆగి కిందకు చూద్దుము కదా, తమాషాగా అక్కడ రెండు పర్వతాలు భూకంపంలో విడి పోయినట్లు మైళ్ల మేరా భూమి పక్కకి తొలగి పోయి ఉంది. ఎక్కడో దిగువన జలపాతపు హోరు వినిపిస్తూంది. పిల్లలతో ఉన్నాం కనుక ఇక కిందకు వెళ్లే ప్రయత్నాలు చెయ్యలేదు.

అక్కడే మరి కొంచెం ముందుకెళ్లగానే”పాసిల్ పూమరోల్స్” (Fossil Fumaroles)  అనే స్పాట్ వచ్చింది. మనం నిల్చున్న కొండని ఆనుకుని ఎదురుగా ఉన్న పర్వతం మీద నిలువుగా గుహల్లో వేళ్లాడే లాంటి శిలా తోరణాలు మొలిచి ఉన్నాయి. పర్వత ఉపరితలం మీంచి నిలువుగా ఆకాశం లోకి ఎక్కు పెట్టిన బాణాల్లా. గొప్ప అద్భుతంగా ఉన్నాయి చూడడానికి. ఇవి అగ్నిపర్వతాల అసామాన్యత వల్ల దాదాపు 7700 వందల ఏళ్ల కిందట ఏర్పడినవట.

పన్నెండు గంటల కల్లా క్రేటర్ లేక్, రిం విలేజ్ అని రాసున్న బోర్డు దగ్గరికి చేరేం. దానికి మరో పక్కగా “విజిటర్ సెంటర్” అని బోర్డు కనిపించింది.

ముందు ఎప్పుడూ విజిటర్ సెంటర్ కి వెళ్లి వివరాలు కనుక్కోవడం మా ఆనవాయితీ కనుక అటు దారి తీసాం. అక్కడ వాళ్లు మా చేతిలో మేప్ పెట్టి వివరాలు చెప్పేరు.

లేక్ గుండ్రంగా ఉంది. గట్టు చుట్టూ కారు మీద డ్రైవ్ చేసుకుంటూ రౌండ్ చుట్టడానికి 10 మైళ్లు ఉంటుంది. అయితే మధ్యలో వ్యూ పాయింట్లు చూసుకుంటూ, ఆగుతూ రావడానికి రెండు మూడు గంటలు పడుతుంది.  ఇక లేక్ లోకి బోట్ ప్రయాణపు టిక్కెట్లు ఆ రోజుకి ఆఖరు అయిపోయాయి. అయినా ఆ బోట్ ప్రయాణానికి అయిదేళ్ల లోపు పిల్లల్ని తీసుకెళ్లకూడదు. ఇవీ అక్కడ వివరాలు.

మేం కుడి చేతి వైపుగా ప్రయాణం మొదలు పెట్టేం. ఏదో ఒక కొస పట్టుకుని ప్రయాణం వెంటనే మొదలు పెట్టడమే మంచిదని అనుకున్నాం. ఎలాగూ మరలా చివరికి బయలు దేరిన కొసకే వస్తాం.

Vidae Falls : మొదటగా  చిన్ని జలపాతం కనిపించింది. అయినా పైన కొండ మీంది స్వచ్ఛమ్నైన నీళ్లు అలా జాలువారుతుంటే ఎవరి మనస్సు ఉరకలెయ్యకుండా ఉంటుంది!!  కారు దిగి వరు, సత్య అటు పరుగు తీసారు, వాళ్లతో వెళ్తానని పేచీ పెడ్తున్న సిరిని ఆపడం కష్టమై పోయింది నాకు. రోడ్డు వారగా కారు ఆపుకుని రాళ్లమీద పైకి ఎక్కుతూ వెళ్లాలి. నేను చిన్న పాప నెత్తుకుని కిందనే ఆగిపోయేను జలపాతపు శబ్దాన్ని, తళత్తళా మెరుస్తూ రాళ్లని ఒరుసుకుంటున్న నీటి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ. నిజానికి జలపాతపు కొసకు ఎగబ్రాకి, విహంగమై ఆ నీటి మీద జారుడు బల్లలాడాలని అనిపించింది నాకు. ఆ ఫాల్స్ పేరు “Vidae Falls”.

కొంచెం ముందుకు ప్రయాణం చేస్తూ, ఆగుతూ వెళ్తుండగా విశాలమైన దృశ్యం కనిపించింది. అక్కడ పర్వతమ్మీద కనుచూపు మేరా చదునుగా ఉంది.  అక్కడి నుంచి దిగంతపు సొగసులు చెప్పనలవి కాదు. అందులోనూ ఆరోజు ఆకాశం మంచి నీలం రంగు లో అందంగా మెరిసిపోతూంది. కొంచెం ముందుకు వెళ్లగానే రహదారికి ఆనుకుని ఉన్న కొండ రాతి మీద పెద్ద తెల్లని మంచు ఫలకంలాంటిదేదో కనిపించింది. అది మంచని గుర్తించే లోగా ముందుకెళ్లిపోయాం. అయితే నేను ఊరుకుంటానా? తరువాతి టర్నింగ్ పాయింట్ రాగానే కారు వెనక్కి మళ్లించాను అదేమిటో సరిగ్గా చూడాలని. “నిజమే మంచు. కానీ అక్కడ రోడ్డు నిబంధన వల్ల ఆగకూడదు. నిరాశగా ముందుకెళ్లాల్సొచ్చింది. మా ఆశ తీరడానికి ఎంతో సమయం పట్టలేదు. దారి పక్కనంతా ఇక అక్కడి నుంచీ అక్కడొకటీ ఇక్కడొకటి పెళ్లలు గా మంచు కనిపిస్తూనే ఉంది. జూలై నెలలో అక్కడ ఇంకా మంచు కరగకుండా ఉందంటే ఇక చలి కాలం ఇంతే సంగతులన్న మాట.

క్రేటర్ లేక్ : ఇక అసలు లేక్ ను చూసే మొదటి పాయింట్ రానే వచ్చింది. ఈ వాక్యాలు రాస్తుంటే ఇప్పుడు కూడా నా గుండె వేగంగా కొట్టుకుంటూంది. కారు ఆపి దిగి ఎదురుగా కనిపించిన దృశ్యం చూస్తే మతి పోయింది. గొప్ప సంస్కృత భూయిష్టమైన పదాలతో ఛండ భేరుండ పద్యమో, అల్లనల్లన తడుతూ చదవగానే మనసుకు హాయినిచ్చే వచన కవితో కాకుండా,  సృష్టి అద్భుతానికి నిశ్శబ్దంగా  ప్రణమిల్లుతూ బుగ్గను జారిన కన్నీటి చుక్క ఒకటి.  ఇంత వరకు నేను అమెరికా లో చూసిన ఏ ఇతర ప్రాంతం కంటే గొప్ప సౌందర్యంతో ఎదురుగా సాక్షాత్కరించిన అతిపెద్ద, అత్యద్భుత నీలి రంగు సరస్సుని చూడగానే నిశ్సబ్దం ఆవరించింది నన్ను. వేల యుగాల నుంచి తప్పసు చేయగా నా నిరీక్షణ ఫలించి ఈ రోజు ఇక్కడకు రాగలిగానని అనిపించింది. ఆ నీలి రంగు అందం అంతా ఇంతా కాదు. టన్నుల కొద్దీ కాపర్ ఫాస్పేట్ గుమ్మరించినట్లు.   చుత్తూ ఎత్తైన పర్వత శిఖరాల మధ్య  ఆకాశపు రంగుని వెలవెల బోయేట్లు చేస్తూ.

 పిల్లల్ని, సత్యని వదిలేసి గట్టుకి అటు వైపు తిరిగి  దీర్ఘంగా చూస్తూ కూర్చుండిపోయాను. నీటి రంగు ఒక్కటే కాదు, ఏదో ఒక గొప్ప అందం ఉందా సరస్సులో.  జన్మ ధన్యమనే మాటకు అర్థం ఇద్దన్న మాట అనిపించింది.

అక్కడ అడుగు పెట్టిన వారెవ్వరూ ఇక ఎదురుగా తప్ప ఎటూ దృష్టి మరల్చక పోవడం ఆశ్చర్యమేమీ కాదు.

సరస్సు చుట్టూ ఇంకా చుట్టూ మరో పది పన్నెండు వరకు వ్యూ పాయింట్లు ఉన్నాయి. మొదటి సారి చూసిన సంభ్రమం అన్ని చోట్లా మరలా కలగడం మరొక విశేషం.  క్రేట్ర లేక్ అగ్నిపర్వతం పేలగా మధ్య ఏర్పడిన పెద్ద అగాధం లో వర్షపాతం వల్ల, చుట్టూ మంచు కరగడం వల్ల ఏర్పడిన సహజ సిద్ధమైన సరస్సు. అమెరికాలో కెల్లా లోతైన సరస్సు ఇదే.

ఆ సరస్సులో మధ్య గోపురాలు మొలిచినట్లు ద్వీపాలు ఇంకా అందాన్ని తెచ్చిపెడుతున్నాయి.

మేం అక్కడ ఉండగానే లేక్ చుట్టూ తిప్పి చూపించే టూరిజం బస్సు కూడా వచ్చింది. ముందుగానే విజిటింగ్ సెంటర్లో టిక్కెట్టు కొనుక్కుని ఇలా బస్సులో  కూడా తిరిగి చూడొచ్చు. బస్సు వాళ్లకి గైడు సరస్సు చరిత్ర చెప్తూంది.

నేనెప్పుడైనా ఏ చోటైనా నిశ్శబ్దమయ్యిపోయానంటే వెంటనే అర్థం చేసుకున్నట్లు సత్య పిల్లల్ని చూసుకుంటాడు.

అయితే పది నిమిషాలే అనుకున్న మా వ్యవధి గడిచిపోతున్నా నాకు అక్కడి నుంచి కదిలి వెళ్లాలనిపించలేదు. ఈ ప్రపంచంలోకి వచ్చి చూసే సరికి సిరి పాపాయి  సత్యని పరుగులెత్తిస్తూంది. ఆ పిల్లని కాయడమే మహా కష్టంగా ఉందీ మధ్య.  తనతో సమానంగా పరుగెత్తడం కష్టమైపోతూంది మాకు.

https://plus.google.com/photos/104256037410703377895/albums/5947713956612407105?banner=pwa

Mount Scott : దృశ్యం చెరిగిపోకుండా నాలుగు మలుపులు తిరిగేమో లేదో “Mount Scott” కు చేరేం. అది ఎత్తైన శిఖరం అక్కడ. మంచు పేలికలు చుట్టుకున్నట్లు అక్కడక్కడా తెల్లని మంచు పెళ్లలతో ఉందా శిఖరం. ఇక మా ఆనందానికి అంతే లేదు. కారుని చక్కగా అక్కడున్న పార్కింగులో ఆపుకుని పర్వతం మీంచి కొంచెం కిందికి దిగగానే ఉన్న పెద్ద మంచు ప్రాంతం లోకి పరుగులెత్తాం. మంచు ముద్దలు చేసి,  విసిరికొట్టుకుని తనివితీరా ఆడుకున్నాం. భలే ఆహ్లాదంగా గడిచిందా చోట. కానీ గ్లౌస్ గట్రా ఏవీ వేసుకోనందున రెండు నిమిషాల్లో మా చేతి వేళ్లు లాగడం మొదలెట్టాయి. సిరి మంచులో రెండడుగులు వేసి జర్రున పడింది. మేం నవ్వుతూంటే పాపం ఎందుకో అర్థం కాక అయోమయంగా చూసింది.

మేం దిగి వచ్చినది అగ్నిపర్వతమని తిరిగి పైకి వెళ్ళేటప్పుడు అర్థమైంది. అక్కడ మట్టిలో ఉన్న ప్రతి రాయీ విచిత్రంగా ఉంది. గుర్తు కోసం  మూణ్ణాలుగు చిన్న అగ్నిపర్వతపు రాళ్లు ఏరి తెచ్చుకున్నాను.

మేం ఎంతకీ రాక పోవడం చూసి “ఇలాగైతే ఇవేళ ఇంటికి వెళ్లినట్లే” అన్నాడు సత్య. ఉండిపోదాం అని అనిపించింది. కానీ అక్కడ రాత్రికి ఉండే సౌకర్యం కావాలంటే ముందెప్పుదో బుక్ చేసుకోవాల్సినందున కుదరలేదు. లేక్ చుట్టూ అన్ని ప్రదేశాలలో ఆగుతూ చూస్తూ మరలా మరలా సరస్సు కనిపించినంత మేరా అందమైన  దృశ్యాల్ని ఒడిసిపట్టుకుంటూ, కెమెరా లో బంధిస్తూ …ఓహ్!…. అలసట అస్సలు అనిపించలేదు.

చివరగా  బోట్ టూర్  కి జనం వెళ్తున్న ప్రదేశానికి చేరుకున్నాం. కానీ కనుచూపు మేరలో ఎక్కడా బోట్ ఎక్కే ప్రదేశం కనిపించలేదు. ఇంతకీ ఆ ప్రదేశం నిలువుగా కిందకి సరస్సు గట్టు మీంచి ఒక మైలు దిగితే వస్తుందట. అదీ సంగతి. అందుకే గట్టు మీద ఉన్న మాకు ఏమీ కనిపించలేదు.

తిరుగు ప్రయాణం: భోజనానికి బాగా ఆలస్యమైపోయింది. ఎక్కడా ఖాళీ లేకుండా ఉన్నాయి అక్కడ ఉన్న రెండు రెస్టారెంట్లు. అయినా హుషారుగానే ఉన్నారు పిల్లలు.  అక్కడే లైను లో వేచి ఉండి మరో గంట స్థిమితం గా రెస్టారెంటులో గడిపి భోజనం కానిచ్చి బయలు దేరేం.

ఇక తిరుగు ప్రయాణం లో ఎక్కడా ఆగకూడదు అనేది మేం పెట్టుకున్న నియమం. క్రేటర్ సరస్సుని వదిలి రావడానికి బెంగ పట్టుకుంది. అయినా తప్పదుగా జీవితం లో ముందుకు ప్రయాణించడం. ఎక్కడా ఆగకుండా సాయంత్రం అయిదు గంటల సమయానికి ఓరెగాన్ బోర్డరు దాటి మరలా కాలిఫోర్నియాలో వచ్చి పడ్డాం. ఈ సారి వసున్నది హైవే కావడం వల్లననుకుంటా. కాలిఫోర్నియా లోకి అడుగుపెట్టె ముందు ప్రతీ కారునీ సెర్చ్ చేసి మరీ వదులుతున్నారు. ఎంతైనా కాలిఫోర్నియా ధనికుల రాష్ట్రం కదా.  బొత్తిగా నలభై మైళ్లు ప్రయాణించేమో లేదో పక్కా కాలిఫోర్నియా పద్ధతిలో పక్క రాష్ట్రపు  వాసన లేకుండా కనిపించింది ఆ ప్రాంతమంతా.

ఇక వస్తూ వస్తూ మేం ముందు చూసిన “Mount Shasta” మీంచే రావాలి. యాభైమైళ్ల దూరం నించీ మౌంట్ శాస్తా కనువిందు చేయడం మొదలు పెట్టింది. కానీ ఆగేది లేదని తీర్మానించుకుననందు వల్ల రహదారి పక్కనే ఫోటో ఏరియా నించి ఫోటోలు తీసుకుని, కాస్సేపు ఆస్వాదించి ముందుకు వచ్చేసాం. శాస్తా నదినీ, రెడ్డింగ్ ఊరినీ దాటుకుని ఫ్రీవే “I-5″  మీదుగా,  కాలిఫోర్నియా రాజధాని శేక్రెమెంటో మీదుగా ప్రయాణించి రాత్రి పదకొండు గంటలకు మా ఊరు చేరేం. అయిదు రోజుల మరపు రాని  ఉత్తర కాలిఫోర్నియా యాత్ర నుంచి సెలవు తీసుకుంటూ. ….                                                                                                                                     – డా. కె.గీత

http://vihanga.com/?p=10529

Published in Vihanga in December , 2013
ప్రకటనలు
This entry was posted in నా కళ్లతో అమెరికా(Travelog) and tagged , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s