నా కళ్ళతో అమెరికా- 25 (ఉత్తర కాలిఫోర్నియా యాత్ర (క్రిసెంట్ సిటీ, రెడ్ వుడ్ ఫారెస్ట్, ఓరెగాన్) రోజు – 4)

ఉత్తర కాలిఫోర్నియా యాత్ర (క్రిసెంట్ సిటీ, రెడ్ వుడ్ ఫారెస్ట్, ఓరెగాన్) రోజు – 4

Dr.K.Geetha

Dr.K.Geetha

రాత్రి బాగా ఆలస్యమైనా ఇవేళ ఉదయానే ఆహ్లాదంగా మెలకువ వచ్చింది నాకు. దానికి కారణం ఆ రోజు మా ప్రయాణం లో కాలిఫోర్నియా దాటి ఉత్తరాన ఉన్న మరో రాష్ట్రం లోకి వెళ్తాం. అమెరికా లో ఇతర రాష్ట్రాలు ఎలా ఉంటాయో చూడాలన్న కుతూహలమూ, ఆసక్తీ  నా ఆహ్లాదానికి కారణాలన్న  మాట.

ప్రయాణం : ఇవేళ మేం ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఎత్తైన రెడ్ వుడ్ అటవీ వృక్ష ప్రాంతాన్ని సందర్శిస్తూ ముందుకు ప్రయాణించి సాయంత్రానికి పక్క రాష్ట్రం లోని క్లామత్ ఫాల్స్ అనే ఊరు లో మా బసకు చేరాలి. ఇవేళ దారిలో  కనబడ్డ విశేషాల దగ్గర కావాలనిపించినంత సేపు ఆగుతూ వెళ్లడమే కానీ, ఇతరత్రా ముందస్తు ప్లానులేమీ లేవు. యురేకా నుంచి వెనక్కి వెళ్లిపోవలసిన మేం మనసు మార్చుకుని మరో రెండ్రోజులు మా ప్రయణాన్ని కొనసాగించాం కదా!

రెడ్ వుడ్ ఫారెస్ట్ : అర్కాటా నుంచి బయలుదేరిన 20 మైళ్ల దగ్గర్నుంచీ కొన్ని వందల మైళ్ల మేరా మొత్తం “రెడ్ వుడ్ ఫారెస్ట్” అని పిలుస్తారు. అన్ని వైపులకీ విస్తరించి ఉన్న ఆ అటవీ ప్రదేశం లో ఉన్న సమయం లో ఎటు వెళ్లి ఏం చెయ్యాలో మొదట అర్థం కాలేదు మాకు. అందుకని ముందుగా కనిపించిన “ఇన్ ఫర్ మేషన్ సెంటర్ ” లోకి దారి తీసాం.

మంచి వేసవి రోజులైనా ఇక్కడి వేడిమి పెద్దగా ఉండదు కాబట్టి సగం, దట్టమైన అటవీ ప్రాంతం కావడం వల్ల మరి సగం చలి పెట్టడం మొదలు పెట్టింది. ఆ చోటు అసలు దారి నుంచి పక్కకు మరో చిన్న దారి లోకి మళ్లి ఉంది. తీరా ఆ సెంటర్ లో మాలాగే వివరాల కోసం నిలబడ్డ వారి లైను బయట వరకూ ఉంది. ఇక అందులో నిలబడితే కనీసం గంట తర్వాత కానీ బయట పడలేం. అందుకని నేను కొంచెం వేగంగా ఆలోచించి,  అక్కడ లైను నించి బయటకు వస్తున్న మొదటి వారిని గుమ్మం బయట పలకరించి నా చేతిలో ఉన్న మేప్ లో చూడాల్సిన ప్రదేశాల వివరాలు పెన్నుతో గుర్తు పెట్టుకున్నాను. ఆ చుట్టు పక్కల కార్లలో వెళ్లేందుకే కాకుండా, సైకిళ్ల పైన, నడిచి వెళ్లే ట్రెక్కింగు త్రోవలు కూడా ఉన్నాయి. ఇక కార్లలో వెళ్తూ చూడవలసినవి అన్ని వైపులకీ విస్తరించి ఉన్నాయి. అయితే మేం ఉత్తరానికి వెళ్లాల్సి ఉన్నందు వల్ల ఆ దిక్కుగా కనిపించిన విశేషాల్ని చూసుకుంటూ ముందుకు బయలు దేరాం.

దాదాపు మరో పదిమైళ్లు రాగానే దారి మరలా లోపలికి విడిపోతుంది. పక్క  దారిలో ముఖ్యమైన విశేషాలు ఉన్నందున అటు దారి తీసాం. అక్కడ మరొక ఇన్ ఫర్మేషన్ సెంటర్ కనిపించింది. అక్కడ జనం కాస్త తక్కువగా ఉన్నారు. ఇక్కడ వీళ్లు వచ్చిన వాళ్లని గ్రూపులుగా విభజించి వివరాలు చెప్తున్నారు. అందులో మేమూ చేరి విన్నాం. అక్కడి నుంచి  దాదాపు పది మైళ్ల లోపులో చూడవలసిన వృక్షాలున్నాయి. మేప్ తీసుకుని వరసలో ఉన్న మొదటి వృక్షానికి చేరుకున్నాం.

              కారు పార్కింగు నించి బయటకు ఏమీ కనిపించలేదు. లోపలికి పదడుగులు వెయ్యగానే కనిపించింది. అది ప్రపంచంలో కెల్లా  ఎత్తైన వృక్షం. దాని ఎత్తు 370 అడుగులు. 1500 సం.ల వయస్సు కలిగినది.  దాని ముందు  బల్ల స్టేజీ లాంటి చప్టా కట్టి ఉంది. అక్కడి నిల్చుని ఫోటోలు తీసుకోవచ్చు. ఇది అయిదంతస్థుల భవంతి కన్నా, స్టేట్యూ ఆఫ్ లిబర్టీ కన్నా ఎత్తైన వృక్షం. ఆ చుట్టుపక్కల చాలా ఎత్తెన వృక్షాలుండడం వల్ల మామూలు కొమ్మలతో ఉన్న చిన్నపాటి వృక్షాలన్నీ నాచు మొక్కలటో నిండి దెయ్యాల చెట్లలా భలే తమాషాగా ఉన్నాయి. సంవత్సరం పొడవునా ఎప్పుడూ వీటికి సరిగా ఎండ తగలదన్నమాట.

                 అక్కడి నుంచి మరో జంట చెట్లు, మరో చెట్టు, మరో చెట్టు ఇలా దారిలో ఎన్ని చూసినా తనివి తీరదే. ఇలా రెడ్ వుడ్ విశేషాలు చూసుకుంటూ ముందుకెళ్లాం. ప్రతీ చెట్టూ ఏదో ఒక నిశ్శబ్ద గాథని చెవిలో చెప్తున్నట్టనిపించింది. మానుని తడిమి, ఆకాశం లోకి ఎదిగిన చిటారు ఆకులకు వీడ్కోలు చెప్పి కనబడ్డ ప్రతి వృక్షాన్నీ పలకరించి నడుస్తున్నపుడు నాకింత వరకు తెలియని నా ఆజన్మాంత మిత్రులతో కరచాలనం చేసినట్టనిపించింది. క్లామత్ అనే ప్రదేశానికి చేరుకున్నాం. అక్కడ దిగువన క్లామత్ నది ప్రవహిస్తూంది. అది  నిజానికి పెద్ద నదేం కాదు. ఇక్కడ నదులని చెప్పబడేవి పెద్ద కాలువలు మాత్రమే. మన నదులతో పోలిస్తే ఇవి చాలా చిన్నవి.

         నది మీద బ్రిడ్జి గుండా కారు వెళ్లే చోట ఏదో రోడ్డు పని నడుస్తూ ఉండడం వల్ల సరిగ్గా అరగంట ట్రాఫిక్ జాం అయ్యింది. బ్రిడ్జికి ఇరుపక్కలా ఇత్తడి రంగులో ఉన్న పెద్ద పెద్ద ఎలుగు బంటి బొమ్మలు పిల్లల్ని బాగా ఆకర్షించాయి. మరి పది పన్నెండు మైళ్లు ముందుకెళ్లగానే “Trees of Mistery ” అనే చోటు కనిపించింది. ఎంట్రెన్సులోనే చాలా అట్టహాసం గా పెద్ద దున్నపోతు, దాని పక్కనే నిలబడ్డ “పాల్ ” అనే 30 అడుగుల పెద్ద బొమ్మ ఉన్నాయి. ఎక్కడా ఖాళీ లేకుండా కార్లు నిండి పోయి ఉన్నాయి. ఆ బొమ్మ ఎవరైనా అడిగిన ప్రశ్నలకు తల, ముఖమూ కదుపుతూ జవాబులివ్వడం విశేషం. అదో పెద్ద ఎట్రాక్షనైపోయింది పిల్లలకు. నిజానికి అక్కడ రెడ్ వుడ్ చెట్ల ని పై నుంచి చూపించే “రోప్ వే” ఉంది. బాగా విసురు చలిలో అక్కడ ఉన్న పెద్ద లైనులో గంట సేపు నిలబడ్డాం. కానీ టిక్కెట్టు తీసుకోవడానికి ఇంకా రెండు గంటలు పట్టేటట్లు ఉంది. అప్పటికే భోజనాల సమయం కావచ్చింది. ఇక ఆ ప్రయత్నాన్ని విరమించుకుని కారెక్కాం. ఇలా ముందు రిజర్వేషన్లు లేకుండా జనం రద్దీగా ఉన్న ప్రాంతాలలో ఆగడం వృథా అని అర్థం అయిపోయింది.

https://plus.google.com/photos/104256037410703377895/albums/5936716421764881345?banner=pwa&authkey=COqn_Lf3jqTcvgE

క్రిసెంట్ సిటీ : ఒంటి గంట ప్రాంతానికి  క్రిసెంట్ సిటీ చేరేం.   కాలిఫోర్నియా రాష్ట్ర సరిహద్దు పట్టణమది. ఇక అక్కడి నుంచి పూర్తి అరణ్య మార్గం గుండా వెళ్లాల్సిందే. అయిటే ఈ సిటీ సముద్రం ఒడ్డున ఉండి. అసలే మబ్బు, మంచు ఇక సముద్రం తోడయ్యి ఇంకాస్త మబ్బు ముంంచింది. పీజా తిని త్వరగా మధ్యాహ్న భోజనం ముగించాం. ఇక్కడ ఇన్ ఫర్ మేషన్ సెంటర్ కి వెళ్లి సరైన రహదారిని పట్టుకున్నాం. మేం పక్క రాష్ట్రానికి వెళ్తూ దారిలో ఫారెస్టు చూద్దామని నిర్ణయించుకున్నాం.

           ఆ ఊరికి చుట్టూ ఒక యాభై, అరవై మైళ్ళ వ్యాసార్థంలో ఒక రింగు లా తిరిగి చూడాల్సినవి చూడమని మేప్ ఇచ్చి చెప్పారు వాళ్లు. మేం మరలా వచ్చిన దారినే కొంత దూరం వెనక్కి వెళ్లి దారి మళ్లాల్సి వచ్చింది. అయితేనేం మాకున్న సమయంలో పిల్లలు ఆడుకొందుకు చక్కని ప్రదేశం కోసం వెతుకుతూ ముందుకెళ్లాం. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో అదృష్టం  కొద్దీ చక్కని నును వెచ్చని ఎండ తళుక్కున మెరుస్తూ ముందుకొచ్చింది. అంతలో నాకు దూరం గా పలుచని నది, మనుషులు కనిపించారు.

జెడ్డా స్మిత్ రెడ్ వుడ్ పార్క్ : ఇక అక్కడి నుంచి కనబడ్డ మొదటి టర్నింగు తీసుకుని లోపలికి వెళ్లాం. అయితే అది అక్కడ ఉన్న కాంపు గ్రౌండ్ ని ఆనుకుని ఉండి గంట ఆగడానికైనా ఒక రోజు టిక్కెట్టు తీసుకోవలిసిందే. $15 డాలర్లు. ఇంతకీ ఆ ప్రదేశం  పేరు “జెడ్డా స్మిత్ రెడ్ వుడ్ పార్క్” నది పేరు స్మిత్ రివర్. లోపల మంచి కాంపింగ్ గ్రౌండ్స్,  దిగువకి కొంత దూరం వెళితే నది ఒడ్డు. అక్కడ విశాలంగా నది ఒడ్డున సముద్రం ఒడ్డున మకాం పెట్టినట్లు దాదాపు వంద మంది జనం ఎండ గొడుగులు, భోజన సామగ్రి, అయిసు బాక్సులు వేసుకుని చక్కగా సేద తీరుతున్నారు. కొందరు పిల్లలు చక్కగా ఈత కొట్టేస్తున్నారు. పెద్దగా లోతు ఉన్నట్లు లేదు.  రాళ్లు స్పష్టంగా నీళ్లలోంచి కనిపిస్తున్న స్వచ్ఛమైన నీరు అందంగా ప్రవహిస్తూంది. కాళ్లూ ముంచే సరికి ఎప్పటిలానే గడ్డ కట్టే చల్లగా ఉన్నాయి నీళ్లు.

             అయినా పిల్లలకి చలీ, పులీ లేనట్లు చక్కగా నీళ్లలోకి దిగి ఆట మొదలు పెట్టారు. నింగీ, నేలా కలిసే చోట ఆకుపచ్చని ఇంద్రధనుస్సు విరిసినట్లు ఒడ్డునంతా కనుచూపు మేర ఎత్తైన వృక్షాలు. అందులో ఎక్కదో దారి వెతుక్కుంటూ హడావిడిగా పరుగెడుతున్న పిల్ల నది. చక్కని నును వెచ్చ దనానికి బోల్డు మురిసి పోయి హాయిగా ఒడ్డున ఎండ లో చతికిలబడ్డాం. గంట దాటినా అక్కడి నుంచి కదలాలనిపించలేదు. నీళ్లు కొంచెం వెచ్చగా మన దగ్గర్లా ఉండి ఉంటేనా! స్వర్గమే ఇక ఈ ప్రదేశం అనిపించింది. తప్పని సరిగా ముందుకు కదలాసి ఉండి తిరిగి కారెక్కాం. పార్కు అని పిలబడే ఆ కాంపు గ్రౌండంతా ఒక రౌండ్ కొట్టి, కారు పైన టాప్ లోనుంచి ఓపెన్ గా నిలబడి అల్లరి చేసి పిల్లలతో నేనూ మమేకమై కేరింతలు కొట్టేను. తలెత్తి వృక్షాల్ని మెడ విరిగేదాకా చూడడం ఒక గొప్ప అనుభూతి.

              ఇక రహదారి మీదకి వచ్చాక కాలిఫోర్నియా దాటి వెళ్లే సిగ్నల్ బోర్డు కోసం చాలా నిశితంగా చూస్తూ ప్రయాణం మొదలు పెట్టాం. అదంతా ఘాట్ రోడ్డు కావడం వల్ల వేగం లో దాటి వెళ్లిపోయేమంటే మరలా తిరిగి వెనక్కి అక్కడెక్కడా కారు తిప్పే అవకాశం ఉండొచ్చు, ఉంచక పోవచ్చు. అయితే బోర్డరు కంటే ముందు ఒక టన్నెల్ వస్తుందని మేప్ లో చూసేను. క్రిసెంట్ సిటీ దాటిందగ్గర్నించీ ఇక సెల్ ఫోనులో సిగ్నల్స్ లేవు. ఇలా ప్రింటెడ్ మేప్ లో దారి పట్టుకుని వెళ్ల వలసిందే. మొత్తానికి మరో గంటలో మేం దాటాల్సిన “కోలియర్ టన్నెల్ ” వచ్చింది. ఆ మలుపుకు ముందే ఒక చక్కని రెస్ట్ ఏరియా కూడా ఉంది.

ఓరెగాన్ : కాస్సేఫు ఆగి అటు ఇటూ అడుగులేసి టన్నెల్ గుండా అటు వెళ్లిన అయిదు మైళ్ల లోనే “వెల్ కం టూ ఓరెగాన్ ” అనే బోర్డు కనిపించింది. దానికి వ్యతిరేక దిశలో మరో పావు మైలు కివతల “వెల్ కం టు కాలిఫోర్నియా ” అనే బోర్డు ఉంది. నేను ఈ మధ్య పావు మైలు ఎవరిదై ఉంటుందంటావ్ అన్నాను. “మనది మాత్రం కాదు” అని నవ్వి వాళ్లకి ఉండాల్సిన కంచెలేవో ఉండే ఉంటాయ్, ఇది రోడ్డు కాబట్టి అటూ, ఇటూ వెళ్లే వాహనాల వాళ్లకి కనిపించడం కోసం  ఇంతంత దూరం లో బోర్డులు  పెట్టారు అన్నాడు సత్య.  నిజంగానే అనుకున్నంత డిఫెరెంట్ గానూ ఉందా రాష్ట్రం. మొదట గా పెట్రోలు పంపు కనబడింది. అక్కడ మనుషులే పెట్రోలు కొట్టడం ఇండియా నుంచి వచ్చాక మొదటి సారి చూసాను.

             ఇక షాపుల పేర్ల దగ్గర్నించీ, ఇళ్లూ, రోడ్ల దగ్గర్నించీ కాలిఫోర్నియాకు, దీనికీ పోలికే లేదు. నగరం నుంచి సిసలైన పల్లెటూరికి వచ్చి పడ్డట్లుంది ఈ రాష్త్రం. అంతే కాకుండా చిన్న చిన్న వ్యవసాయ క్షేత్రాలు, చిన్న చిన్న ప్లాట్లు కనిపించాయి. కాలిఫోర్నియా అంతా ఎక్కడకు వెళ్లినా పెద్ద పెద్ద కంపెనీల చేతుల్లో తప్ప చిన్నా చితకా రైతుల చేతుల్లో ఏమీ ఉన్నట్లు కనిపించదు. అలాగే ఒకదానొకొకటి కట్టినట్లున్న గుండ్రని ఇనుప రింగులతో మనుషులే  ముందుకు నడపాల్సిన ఒక విధమైన డ్రిప్ ఇరిగేషన్ కనిపించింది. “పోన్లే వీళ్లయినా మనుషులకు విలువనిస్తున్నారన్నమాట.” అనిపించింది.

                  కాస్సేపట్లోనే రోడ్డు పక్కన “ఓరెగాన్ కేవ్స్” అనే బోర్డు కనిపించింది. ఇక సత్య వైపు చూసేసరికి అప్పటికే అయిదు కావస్తూన్నా కారు పక్కకు తిప్పేడు. రోడ్డుని ఆనుకుని ఉన్న ఇన్ ఫర్మేషన్ సెంటర్ నాలుగింటికే కట్టేస్తామని బోర్డు కనిపించింది. ఇక తప్పనిసరిగా లోపలికి 20 మైళ్లు డ్రైవ్ చేస్తే గానీ వివరాలేవీ తెలీవు. అయినా వెళ్లి చూద్దామని ముందుకు బయలుదేరేం. సన్నని రోడ్డు కావడం వల్ల దాదాపు నలభై అయిదు నిమిషాలు పట్టింది అక్కడికి చేరడానికి. పూర్తి గా చిన్న కొండల్ని దాటూకుంటూ ప్రయానం చెయ్యవలిసి వచ్చింది. అప్పటికే పిల్లలు బాగా అలిసి పోయారు. అయినా కారు పార్కింగు నించి కొంచెం లోపలికి నడిచేం. కానీ ఆ రోజు మాకు ఎక్కడా అదృష్టం కలిసి రానట్లు మేం వెళ్లే సరికి  ఆ రోజు లో ఆఖరి ట్రిప్పుకి టిక్కెట్లు అయ్యిపోయాయి. అదీ గాక ఆ గుహల్లో మెట్లు బాగా ఎత్తుగా ఉంటాయి కాబట్టి ఈ 5 సం. రాల కంటే చిన్న పిల్లలు నిషేధం.

ఎటూ మేం వెళ్లాడానికి లేదన్న మాట. అక్కడికి 20 మైళ్ల దూరం లో ఉన్న రోడ్డు మలుపులో ఆఫీసు కనీసం 5 గంటల వరకూ తెరిచి ఉండి ఈ విషయం అక్కడే తెలిసి ఉంటే ఇంత దూరం వచ్చే వాళ్లమే కాదు కదా, అని తిట్టుకున్నాం. గుహల్లో లోపలికి వెళ్లలేకపోతేనేం. అక్కడ ఉన్న గిఫ్త్ సెంటర్ లో తిరిగేం. బహుమతులేవో కొనుక్కున్నాం. చుట్టూ ఉన్న చక్కని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కాస్సేపు సేద తీరేం.

రాత్రి భోజనానికి “మెడ్ ఫర్డ్” అనే ఊరులో ఆగేం. అక్కడ ఉన్న ఇండియన్ రెస్టారెంటుకి వెళ్లి మధ్యస్తమైన రుచితో ఉన్న పదార్థాల్ని ఆవురావురుమని తిన్నాం. అక్కడి నుంచి ఇంకా మరో రెండు గంటల ప్రయాణం లో మా బస ఉంది. వేసవి పొద్దు కాబట్టి 8.30 అయినా ఇంకా  వెలుతురు గా ఉండడంతో భోజనం తర్వాత హుషారుగా బయలుదేరాం. అయితే నిజానికి మాకు దూరాభారం నిజంగా ప్రయాణం చేసే వరకూ తెలియ లేదు కానీ. అసలు మెడ్ ఫర్డు లో హోటలు బుక్ చేసుకోవలిసంది. కానీ రూట్ సరిగా అర్థం కాక మరెక్కడో బుక్ చేసేం. మొత్తానికి క్లామత్ ఫాల్స్ అనే ఊర్లో మా హోటల్ కు రాత్రి 10.30 కి చేరేం. పిల్లలు అపటికే నిద్రపోయి వేళ్లాడి పోయేరు. మంచి ఖరీదైన హోటల్ అయినా రూము కాలిపోర్నియాలో మామూలు సాదా సీదా హోటల్ లో ఉన్నట్లుంది. ఇతర ఎమినిటీస్ బానే ఉన్నాయి కానీ. ఎలాగైనా కాలిఫోర్నియా బాగా ధనిక రాష్ట్రం అని ఆ రోజు మా ప్రయాణం తర్వాత అనిపించింది.

 ఇక మర్నాడు అసలు మేం చూడాలనుకున్న క్రేటర్ లేక్ చూసేసి ఇక అదే రోజు వెనక్కు వెళ్లిపోదామని అనుకున్నాం. అందరికీ ఇంటి మీద ధ్యాస మళ్లేసింది. అప్పటికి నిర్విరామంగా 4 రోజుల నుండి తిరుగుతున్నామేమో ఒక్క సారి నిద్ర పోతే ఎక్కడున్నామో తెలియనంత నిద్ర పట్టింది. కలల్లో మబ్బు కొండలు, చల్లని నీటి ప్రవాహాలు, ఎత్తైన ఆకాశ వృక్షాల్ని నెమరు వేసుకుంటూ మర్నాడు లోకి అడుగు పెట్టాం.

– కె.గీత

http://vihanga.com/?p=10166

Published in Vihanga in November, 2013

 

ప్రకటనలు
This entry was posted in నా కళ్లతో అమెరికా(Travelog) and tagged , , , , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s