అనగనగా అమెరికా-19(ఎన్నారై సాంస్కృతికోద్ధరణ)

లోపల స్టేజీ మీద రికార్డింగ్ డాన్సు జోరుగా సాగుతూంది.

“మా కజిన్ ఒకమ్మాయి ఇంకేముంది నేను ఫలానీ సంస్థలో “ఎన్నారై సాంస్కృతికోద్ధరణ” చేస్తున్నానని ఫేసుబుక్కులో ఫోటోలు పోస్టు చెయ్యడమూ, ఇండియాలో ఉన్న ఆ పిల్ల పేరెంట్స్ అదేదో చూడాల్సినదని మా అత్తగారికి ఫోను చెయ్యడమూ, ఆవిడ ప్రతీ సారీ వెళ్లారా? అని అడగడమూ…” అని గుక్క తిప్పుకోకుండా మాట్లాడింది ఆవిడ.

గుడి ఆవరణలో ఉన్న ఫంక్షను హాలులో ఏదో కార్యక్రమం జరుగుతూందని చూడ్డానికెళ్లేను. ఎంట్రన్సు దగ్గర్లో తిరుగుతూ కనబడిందీవిడ.

“మీరు లోపలికి రాలేదా!” అంది.

“లేదండీ, అసలిదేవిటో చూద్దామని వచ్చాను.”అన్నాను.

“అయ్యో, ఇదేవిటో ఏమిటండీ బాబూ, “ఎన్నారై సాంస్కృతికోద్ధరణ” అని బ్యానర్లో అక్షరాలు పొల్లు పోకుండా చదివింది.

“రండి లోపలికి” అంది చొరవగా నా చెయ్యి పట్టుకుని. “టిక్కెట్టు”అని నేను గొణుగుతూ ఉండగా కాస్సేపు చూసి రావడానికి టిక్కెట్టెందుకూ, అని నన్ను గుమ్మందాకా లాక్కెళ్లింది.

అక్కడ గుమ్మం అంత ఎత్తున్న అమెరికను కాపలాదారుడు మా ఇద్దరి చేతుల వైపు ప్రత్యేకంగా దృష్టి పెట్టి చూసేడు.

అదేమిటా అని నా చేతుల వైపు నేను చూసుకునే లోగా

“ఈవిడ లోపలికెళ్లడానికి కుదరదు, చేతికి బ్యాండు లేదు” అన్నాడు.

నాకూడా ఉన్నావిడ కాస్త విలాసంగా నవ్వి పర్సులోనుంచి ఒక బ్యాండు తీసి అతనికి చూపించింది.

“ఊ.. అది చేతికి ఉండాలి, ఇలా పర్సుల్లో కాదు” అని వదిలాడు.

“గుమ్మం దగ్గిర ఇండియన్నయితే ఏదో రకంగా పరిచయస్తులు బురిడీ కొట్టించేస్తారని నిర్వాహకులు ఇలా అమెరికా వాణ్ణి పెట్టేరిక్కడ. అయితే మనవేమైనా తక్కువ తిన్నామా” అని తెలివిగా చూసింది నా వైపు.

ఈ ఎక్స్‌ట్రా బ్యాండెక్కడిది అనడిగే సాహసం చెయ్యనివ్వలేదు. లోపల మరలా మూడు విభాగాలు ఉన్నాయి. “V.V.I.P, V.I.P, ఉట్టి IP. మూడో విభాగం చాల్లెమ్మని ఇవే సంపాయించేను” అని కూర్చోండి. అని ఒక గాడ్రేజు కుర్చీ మీదకి లాగింది. ప్రతీ చోటా ప్రథమ గుమ్మంలో లాగా సాయుధ దళ సైనికుల్లా జమాజట్టీలుగా ఉన్న కాపలా దారులున్నారు. వచ్చే పోయే వాళ్ల చేతి బ్యాండు రంగుని బట్టి ఆయా సెక్షన్ల లోకి వదలడమే వాళ్ల పని. అంతా నిజానికి ఒకటే పెద్ద హాలు అది.

స్టేజీ మీద రికార్డింగు డాన్సుల మీద రికార్డింగు డాన్సులు పొలో మని చప్పట్ల మధ్య నడుస్తూ ఉన్నాయి.

మధ్యలో “ఏవండీ, ఇందులో సాంస్కృతికోద్ధరణ ఏముందో నాకు ఏమీ అర్థం కాలేదు”

అని పక్కకి తిరిగే సరికి నన్ను లోపల కూచోబెట్టిన పెద్ద మనిషి కనబళ్లేదు. మధ్యలో స్టేజీ మీద నుండి జనం మధ్యలో తిరుగుతూ అవసరమైనవీ, లేనివీ జోకులుగా ఫీలైపోతూ మాట్లాడుతూ ఒకప్పటి ఇండియన్ సీనియర్ టీవీ ఏంకర్ తిరుగుతూంది.

జనం ఆవిడ ఏ వరుసలోకి వస్తే అక్కడ ఫోటోలు చకచకా లాగించేస్తుండడంతో మరింత రెచ్చిపోయి మాట్లాడుతూందామె.

ఇంతలో నా పక్కనే వచ్చి కూలబడింది నన్ను తీసుకొచ్చినావిడ. “రాబోయే సాంగ్‌లో మా కజిన్ ఉంది చూడండి.” అంది.

అదేదో ముసుగు వీరుల పాటలా ఉంది. ఒకటే ధమ ధమా చిందుల పాట చివర్లో ముసుగులు తీసి రెండు స్టెప్పులేస్తూ పక్క వాళ్లతో మాట్లాడుతున్న అమ్మాయిని చూపించి అదిగో అదే మా కజిన్” అందావిడ.

“ఇంతోటి  స్టెప్పులకే ఓ పేద్ద గొప్ప పెర్‌ఫార్మెన్సని మా అత్తగారు….” అనింకేదో మాట్లాడుతూనే ఉందామె.

“నేనలా వెళ్లొస్తానని నెమ్మదిగా లేచి బయట పడదామనుకుంటూండగా “ఆగండి బయటిదాకా నేనూ వస్తాను” అంది.

“వెనక్కి తిరిగి బోర్డు మీద ఎన్నారై సాంస్కృతికోద్ధరణ అన్న చోట ఒక ఫోటో తీస్తారా నాకు” అందావిడ. నేనేదో అనబోతుండగా “ఫేసుబుక్కులో పెట్టాలి మరి. లేకపోతే ఇండియాలో వాళ్లకి మనమిక్కడ సాంస్కృతికోద్ధరణ చేస్తున్న విషయం ఎలా తెలుస్తుందీ…” అని రాగం తీసింది.

 

http://www.andhraprabha.com/columns/%E0%B0%8E%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B1%88-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%82%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B1%83%E0%B0%A4%E0%B0%BF%E0%B0%95%E0%B1%8B%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%B0%E0%B0%A3/10779.html

ప్రకటనలు
This entry was posted in అనగనగా అమెరికా(ఆంధ్ర ప్రభ కాలం) and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s