అనగనగా అమెరికా-20(క్రిస్మస్ ట్రీ)

 

 

 

“మమ్మీ, నీ పనేమీ బాలేదు. నాకీసారైనా నా అంత ఎత్తున్న క్రిస్మస్ ట్రీ కొనాల్సిందే” అంది అమ్మాయి.

ఏదో పిల్ల సర్దా పడుతోందని డాలరు స్టోరుకి వెళ్లి  కిందటేడాది ఒక అడుగు పొడుగున్న పొట్టి క్రిస్మస్ ట్రీ కొని తెచ్చింది అమ్మ.”

అది కాదమ్మా, క్రిస్మస్ మన పండగ కాదు” అని “అయినా నీ సర్దా కోసం …”అని ఎప్పటిలా ఉపన్యాసం మొదలాడదామని చూసింది కానీ..అమ్మాయి ఒప్పుకునేట్లు లేదు.

“ఉహూ, అదేం కుదరదు. అయినా అమ్మా! మనం అమెరికాలో ఉన్నాం. ఇవన్నీ నీకు పండగలు కాదు. నాకు ఇవే పండగలు.”అని గట్టిగా చెప్పింది.

పైగా “మా ఫ్రెండ్సందరికీ శాంతా వచ్చి గిఫ్టులు ఇస్తాడు. నాకు ఏవీ ఉండవా” అంది.

“గిఫ్టులకీ, ట్రీకీ సంబంధం ఏవిటీ” అని  ప్రశ్నించే లోగా”అవును మరి  ఇంట్లో ఒక క్రిస్మస్ ట్రీ ఉంటేనే కదా చుట్టూ గిఫ్ట్స్ శాంతా వచ్చి పెట్టేది.‘అని తేల్చింది.

“ఈ పిల్లతో వాదించలేం కానీ నడు నడు” అని నాన్న షాపింగుకి తీసుకెళ్లేడు.

“సర్లే అదేదో పదో పరకతో అయిపోతుంది లెమ్మని” అనుకుంది అమ్మ.

ముందు పచ్చని  క్రిస్మస్ చెట్లు అమ్మే చోటికి వెళ్లేరు. 100 డాలర్ల నించి పైకే ఉన్నాయి. ఇంత డబ్బు పెట్టి కొని వారంలో చెట్టు బయట పడెయ్యాలంటేనే మతి పోయింది.ప్లాస్టిక్ చెట్లని చూద్దురు కదా అవీ ఖరీదే ఉన్నాయి. అయిన ఖరీదు ఎలాగూ అవుతూంది. ప్లాస్టిక్కుదయితే వచ్చే ఏడాది కూడా పెట్టొచ్చు.

“ఇదిగో అమ్మాయ్, ఇక నించీ నువ్వు పెద్దయ్యే వరకూ ఈ చెట్టే క్రిస్మస్ ట్రీ. ప్రతీ సారీ ఒక్కో చెట్టు కొనమని పేచీ పెట్టకూడదు” అంది అమ్మ.

“అదృష్టం కొద్దీ ఇవేళ 50% తగ్గింపుందటోయ్” అన్నాడు నాన్న ఒక చోట సైను బోర్డు చూపించి.

బాక్సుల్లో పేక్ చేసి ఉన్న నాలుగడుగుల చెట్టొక్కటి మోసుకొచ్చి కౌంటర్ దగ్గిరికి వచ్చేరు. లైనులో 30 మంది వెనక నిలబడి, కష్టపడి వచ్చాక బిల్లు కౌంటర్‌లో తేలిందేమిటంటే “50% తగ్గింపు బాక్సుల్లోంచి బయటకు తీసి డిస్ప్లేలో పెట్టిన చెట్లకే”.

అమ్మాయి పరుగున వెళ్లి “నాకీ చెట్టు కావాలి డాడీ” అంది.దానిమీద రేటు 150 డాలర్లుంది. సగం తగ్గింపులో $75కి వస్తుంది. కానీ ఏడడుగుల ఎత్తుంది. మిగులున్న అయిదారు చెట్లలో ఇదే కాస్త నయమని లెక్కలన్నీ వేసాక తేలింది. అయితే దీనికి లైట్లు కూడా ఉన్నాయి.

డాడీ, “ఆర్నమెంట్సూ, స్టాకింగ్సూ!” అంది బుంగమూతి పెట్టి అమ్మాయి.మళ్లీ ఆ సెక్షన్‌లో మరో పది పదిహేను డాలర్లు దానికి  ఖర్చుచేసేరు. తీరా కారులో మూడుముక్కలుగా పట్టుకెళ్లాల్సొచ్చినా చెట్టు పట్టేట్లు లేదు. మొత్తానికి కష్టపడి ఒళ్లో చెట్టు ముక్కలు పెట్టుకుని అతి కష్టమ్మీద తెచ్చారింటికి.ఇక అరపూటంతా ఆ చెట్టుని నిలబెట్టడమూ, అలంకరణలూ చెయ్యడమూ సరిపోయింది తండ్రీ కూతుళ్లకి.

“అదేమిటి లైట్లు సగమే వెలుగుతున్నాయి అంది” ఎగాదిగా చెట్టుని చూసి అమ్మ.

“అదంతే ఎక్కడో మధ్యలో ఏదో బల్బు ఫాల్టు వల్ల ఒక సెక్షన్ అంతా పోయినట్లుంది” అన్నాడు.

ఇక అమ్మాయి సంతోషం అలవి కానట్లుంది.పడుకునేప్పుడు కాసిన్ని పాలు, కుకీలు చెట్టు దగ్గిర ప్రసాదం లాగా పెట్టించింది పైగా.

ఇవన్నీ ఎందుకమ్మా, అంటే “మమ్మీ శాంతా వచ్చి కుకీలు, పాలు తీసుకున్నాకే గిఫ్ట్స్ వదులుతాడు.” అని సంతోషంగా ఇంతలేసి కళ్లేసుకుని చెప్పింది.

అమ్మాయి నిద్రపోయేక అమ్మాయి విష్ లిస్టు ప్రకారం నాన్న పేక్ చేయించి తెచ్చిన గిఫ్టులు చెట్టు దగ్గిర పెట్టొచ్చాడు.

“నాన్నా, కూతురూ కలిసి అన్నీ కలిపి రెండొందలు వదిలించారు క్రిస్మస్ పేరు చెప్పి. మన పండగా కాదు, పాడూ కాదు” అని నెత్తికొట్టుకుంది అమ్మ.

– డా|| కె.గీత

ప్రకటనలు
This entry was posted in అనగనగా అమెరికా(ఆంధ్ర ప్రభ కాలం) and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s