అనగనగా అమెరికా-21(అమెరికా ఎంజాయ్‌మెంటు)

 

పెళ్లయ్యి అమెరికాకి వెళ్తున్నప్పుడు “అదృష్టమంటే నీదేనే, బాగా ఎంజాయ్ చెయ్”  అన్నారు అంతా స్వప్నతో.

అమెరికా వెళ్లి హాయిగా “ఎంజాయ్ చెయ్యడం” అనే విషయం తల్చుకుంటేనే బహు సంతోషంగా ఉంది.

ఇక్కడిలా రెస్ట్రిక్షన్స్ లేని లైఫ్, సినిమాలు, షికార్లు, హుషారుగా పబ్ లు, అర్థ రాత్రి దాకా తిరగడాలు, గొప్ప గొప్ప మ్యూజిక్ కాన్సర్టులు…… ఇలా ఏవేవో ఊహించుకోవడానికే సమయం సరిపోవడం లేదు.

మొత్తానికి శుభ ఘడియ రానే వచ్చింది. పెళ్లయిన మూడో నెలలో ఒక్క దాన్నీ ఫ్లయిట్ ఎక్కించి పంపించారు భర్త దగ్గరికి. ఎయిర్ పోర్టు నించి ఇంటికి దిగబెడుతూనే ఆఫీసు పనుందని పరుగెత్తాడు.

పోనీలే సాయంత్రం ఎటైనా వెళ్లొచ్చని నిట్టూర్చుకుంది. మర్నాడు అడిగేసింది కూడా. “వచ్చీ రాగానే తిరగడమెందుకు? నీకు జెట్ లాగైనా తీరనీ” అన్నాడు.

“అదీ నిజమే, పగలు నిద్ర, రాత్రి మెలకువ ముందు మారాలి. కొద్ది రోజులు అమెరికా టైమింగ్స్ కి అలవాటు అవుదాం” అనుకుంది.

రెండు మూడ్రోజుల్లో వీకెండ్ వచ్చింది.  హుషారుగా తయారయ్యి ఎదురు చూసింది. పబ్ లు వగైరా అని అంటాడేమోనని. పబ్బు కాదు కదా, పక్క వీధిలోకి కూడా వెళ్దామన్న ఆలోచన కూడా అతనికున్నట్టు లేదు.

ఇరవైనాలుగ్గంటల్లో మెలకువగా ఉండే ప్రతి గంటా కంప్యూటర్ ముందు ఆఫీసు పనిలోనే గడుపుతాడు. అదేమంటే “అమెరికా వచ్చింది సంపాదించడానికి, టైము వేస్టు చేసుకోవడానికి కాదు” అన్నాడు.

కనీసం సినిమాకెళ్దాం అంది ఓ రోజు. ” పన్నెండు డాలర్లు పోసి సినిమా హాలుకెందుకట. అయినా ఇక్కడెవరూ మన దగ్గర్లా సినిమాలు చూడాలంటే సినిమా హాలుకి వెళ్లరు. రాను రాను నీకే తెలుస్తుందిలే. శుభ్రంగా కంప్యూటర్ లో నీకు నచ్చినన్ని సినిమాలు చూసుకో.” అన్నాడు.

ఇక ఇతనితో ఏం మాట్లాడినా లాభం లేదని కనీసం పక్కింటి వాళ్లనైనా పరిచయం చేసుకుందామని  అనుకుంది.

అదేం విచిత్రమో అసలు పక్కింటి వాళ్లు ఎప్పుడూ కనబడరు.  శబ్దాలు వినిపిస్తాయి గానీ. అసలు వాళ్లు ఎవరో కూడా తెలీదు.  “ఇండియన్సు కాని వాళ్లతో జాగ్రత్త. మాట్లాడక పోవడం  మంచిది.” అన్న భర్త ఉచిత సలహాకి తథాస్తు దేవతలు “ఎస్ ” అన్నారేమోనని అనుమానం వచ్చింది స్వప్నకి.

ఇక ఒకట్రెండు సార్లు భర్త ఆఫీసులో జరిగిన పార్టీలకు ఎటెండ్ అయ్యారు. సంతోషంగా వెళ్లిన స్వప్నకి  భర్త స్నేహితులతో ఏమ్మాట్లాడాలో, వాళ్ల ఉద్యోగపు సంభాషణ లో ఏం భాగస్వామ్యం పంచుకోవాలో కూడా అర్థం కాలేదు.

అయితే ఒకందుకు విచిత్రంగా అనిపించింది స్వప్నకి-

ఎంత పనిలో ఉన్నా గురువారం సాయిబాబాని, శనివారం వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి గుళ్లకి వెళ్లడం మాత్రం మర్చిపోడు.  అలా పక్క ఊళ్లల్లోని గుళ్లూ, ఆ పక్క ఊళ్లోని గుళ్లూ మాత్రం వారానికొకటి చొప్పున చూసొస్తున్నారు.

ఇక స్థానిక ఇండియా సంఘాల కార్యక్రమాలు ఫ్రీ అయితే తప్పని సరిగా తీసుకెళ్తాడు. అక్కడ ఇండియా లో కూడా లేని విధంగా పంచె కట్లు, పట్టు చీరలు చూసి మతిపోయింది స్వప్నకి. తను అమెరికా అని చెప్పి పదహారో శతాబ్దానికి వచ్చి పడిందేమోనని అనుమానం వేసి గిల్లుకుంది కూడా. అవన్నీ తనకి చూపిస్తూ మన సంస్కృతిని ఇక్కడెంత బాగా “బతికిస్తున్నారో” అని ముచ్చటపడే భర్తని చూసి “అమెరికా వస్తే ఇలా అయిపోతారాన్నమాట” అనుకుంది.

రాను రాను పగలల్లా ఇంటర్నెట్టు ముందు కూచోవడం తప్ప మరో మార్గం కనిపించ లేదు స్వప్నకి. ఇండియా నించి స్నేహితులంతా అమెరికా విశేషాలు చెప్పమని ఆన్ లైను లో ఒకటే పోరు.

సినిమాకెళ్లడాల్లాంటి చిన్న చిన్న సరదాలు కూడా లేని ఈ దేశం లో ఎంజాయ్ మెంటేముందో అర్థం కాలేదు.

ఏవీ తోచక వారాంతాల్లో కూరగాయలు కొనడానికెళ్లినపుడు షాపు బయటొకటి, లోపలొకటి, కారెక్కాక ఒకటి ఫోటోలు తీసి  ఫేసుబుక్కు లో పోస్ట్ చేసిందో రోజు.

అవన్నీ చూసి ఇండియా నుంచి “ఆహా! గొప్ప ఎంజాయ్ మెంట”ని స్నేహితులు కొనియాడుతూ చేసిన కామెంట్లు చూసి ఇక అదేపనిగా గుళ్లూ గోపురాలకెళ్లినప్పుడల్లా షెడ్ల వంటి ఆ గుళ్ల బయటో, సదరు ఇండియన్ సంస్థల బయటో – అక్కడో ఫోటో, ఇక్కడో ఫోటో తీసి పోస్ట్ చేయడం మొదలు పెట్టింది.

రోజు రోజుకీ ఫోటోల పై  వస్తున్న  గొప్ప రెస్పాన్సు చూసి “అమెరికా లో ఉండడమే గొప్ప ఎంజాయ్ మెంటని” అర్థమైంది స్వప్నకి.

……………

http://www.andhraprabha.com/columns/anaganaga-america/11647.html

ప్రకటనలు
This entry was posted in అనగనగా అమెరికా(ఆంధ్ర ప్రభ కాలం) and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s