కవిత్వానికో కొత్త పలక(పుస్తక సమీక్ష)

కవిత్వానికో కొత్త పలక

ఏనుగు నరసింహా రెడ్డి కవిత్వాన్ని సమీక్షించక్కర లేదు. కవిత్వమే మనల్ని సమీక్షిస్తుంది.కొత్త పలక మొదటి కవిత “శీతాకాలం సాయంత్రం”  లోనే ఆ లక్షణం మనకు కనిపిస్తుంది. నాటకంలోని పాత్రధారుల్లా ఒక్కొక్కరే చౌరస్తా దాటుతూ “శీతాకాలం సాయంత్రం”  మొదలవుతుంది. చుట్టూ ఉన్న జీవన చిత్రంతో కవిత ముడిపడుతూ వెళుతుంది. దీపస్థంభం, మజీదు, రేగుపడ్లు, పల్లీలు… అన్నీ కవిత్వానికి సజీవతను ఇస్తాయి. చౌరస్తా నుంచి చెట్లమీదకీ, ఊరి చుట్టూ తిరిగిన చలి కవిత చివర “చలి తల్లి దాక్కునేందుక్కూడా పేద బతుకులే ఆశ్రయమిస్తై” అన్న చోట ముగుస్తుంది. అప్పటి వరకూ మామూలుగా నడిచిన కవిత “అక్కడ పేద బతుకులే ఆశ్రయమివ్వడంతో” ఉదాత్తమయ్యింది. కవికి కావల్సిన కన్ను ఇది. “కొత్త పలక” మన జీవితాల్లోంచి చెరిగి పోయిన గాథల్ని, గాయాల్ని  గుర్తు తేవడమే కాకుండా, “చెరిపి రాయాల్సిన పాఠాల్ని” కూడా గుర్తుకు తెస్తుంది. పలక తో అనుబంధం, మమకారం  ఉన్న వాళ్లందరూ ఈ కవిత చదవాల్సిందే. అమెరికా లో ఇటీవల ఒక తెలుగు బడి ప్రారంభోత్సవంలో  నా సలహా మీదట పిల్లలకి పలకలు తెప్పించిన సంఘటన  ఈ కవిత చదివాక గుర్తుకు  వచ్చింది.  గ్లోబలైజేషన్ మింగేసిన ఊర్లను “ఒక ఊరు” లో చూడొచ్చు. ఆంధ్ర, తెలంగాణా కవితలు” ఆరునూర్ల పది”, “వాళ్లు కష్టపడ్తర్సార్ ” లలో తరాలుగా ఆంధ్ర ప్రాంత వాసులు మిగుల్చుకున్నదీ, తెలంగాణా వాసులు కోల్పోయినదీ కళ్లకు కట్తిస్తూ “వాళ్లు ధనధాన్యాల గరిసెలు నింపుకుంటూంటే, మనోళ్లు పోరాటాల చరిత్రలు నిర్మిస్తారు” అంటారు. ఉద్యోగరీత్యా ఉన్న మెదక్, నిజామాబాద్ తదితర ప్రాంతాల పట్ల, మనుషుల పట్ల ప్రేమ ప్రతి కవితలో అడుగడుగునా కనిపిస్తుంది. “బతికిపోండ్రి” కవితలో పెద్దపిల్ల నెత్తికి పెట్టిన నూనెకి చేసిన అప్పు కంట తడి పెట్టిస్తుంది.   ఊరి మొగసాల కరువు బరువు బతుకు కనిపింపజేసిన కవిత ఇది. చిన్న రోడ్డు “మలుపు” కూడా కవి హృదయాన్ని పరవశింపజేసి కవితని రాయించిందీ సంపుటిలో. నాన్న జ్ఞాపకాల “కల్లోనికుంట”, జీవన”సర్కస్”, అన్నం ముద్దకు  దు:ఖం అడ్డు తగులుతున్న వేళ లో “పునాదులు తవ్వుతూ”, “మళ్లీ అక్కడికె పోవాలె” వంటి కవితలే కాక ప్రతీ కవితలో అంతర్లీనంగా తన చుట్టూ అల్లాడుతున్న బతుకుల జాడ కవి గుండె కింద చెమ్మయ్యిందని  అర్థం అవుతుంది. పదోతరగతి నాటి జ్ఞాపకాల “కాడమల్లిపూల చెట్టు” చదివిన వారెవరికైనా “అయ్యో, మనమూ చిట్యాల” లో కవితో కలిసి చదవలేదే అని బాధ వేస్తుంది.  ఈ పుస్తకంలో ఆసాంతం మనకు “జానెడు పొట్టకోసం బారెడు చిక్కుల్లో ఇరుక్కుపోతున్నవాళ్లు” కనిపిస్తారు. 52 కవితలున్న “కొత్త పలక” మన చుట్టూ నిత్యం మనం చూస్తూ ఉన్నా ఎప్పుడూ నేర్చుకోని  కొత్త అక్షరాలెన్నో నేర్పిస్తుంది.

 

కొత్తపలక (కవిత్వం)

రచన: ఏనుగు నరసిం హారెడ్డి

http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/jan14/pustakaparichyam.html

ప్రకటనలు
This entry was posted in సాహిత్య వ్యాసాలు and tagged , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s