నా కళ్లతో అమెరికా-29-న్యూయార్క్ సిటీ టూర్ (భాగం-2)

అమెరికా తూర్పు తీరం- రోజు-2

న్యూయార్క్ సిటీ టూర్ (భాగం-2)

మధ్యాహ్నం భోజనాల వేళయ్యిందని పన్నెండు గంటకల్లా మమ్మల్ని రాక్ఫెల్లర్ సెంటర్ చుట్టుపక్కల వదిలేసి గంటన్నరలో భోజనం కూడా కానిచ్చి వెనక్కి రమ్మని చెప్పేడు గైడు.

రాక్ఫెల్లర్ సెంటర్ : మంచి చలిలో జన సమ్మర్దంగా ఉందా చుట్టుపక్కల. మొదటి సారి అమెరికాలో తోపుడు బండి మీద అమ్మే ఫుడ్ ని చూసేను. ఏవో పరిమితమైన కొన్ని ఫుడ్లు మాత్రమే అమ్ముతున్నారు. ప్రెట్జిల్స్, హాట్ డాగ్స్ కనిపించాయి.

మేం వాళ్లని దాటి వెళ్తూండగా గమనించాను. మూడో, నాలుగో ఉన్న ఆ బళ్ల దగ్గిర అమ్ముతున్న వాళ్లు ఇండియన్స్ అని.

చుట్టూ ఉన్న ఆకాశ హర్మ్యాలని దాటి ఎండ ఎక్కడా పడడం లేదు. చెవుల్ని, చేతుల్ని గడ్డ కట్టించే చలి గాలిలో దాదాపు పరుగు లాంటి నడకల్తో రాక్ ఫెల్లర్ సెంటర్ చేరుకున్నాం.

నాలుగు వైపుల్నించీ ప్రవేసించగలిగిన ఓపెన్ స్నో సెంటర్ కు అన్ని వైపుఆ రకరకాళ దేశాల జెండాలు వరసగా సలాము కొడుతున్నాయి.

చలిలో పడి పిల్లలు స్కీయింగ్ చేస్తూండగా, చుట్టూ తల్లిదండ్రులు, సందర్శకులు రెయిలింగుని ఆనుకుని నిలబడి ఉన్నారు. అక్కడ అండర్ గ్రౌడ్ రెస్టారెంటుకి ఆనుకుని ఉన్న ఎత్తైన రాక్ ఫెల్లర్ భవనం వైపు వెళ్లి కిందకు వెళ్లే లిఫ్టు కి లైను లో నుంచున్నాం.

 

లిఫ్ట్ ఎక్కడానికి ముందు ఉన్న అద్దాల వెయిటింగ్ ప్లేసుకి ఎప్పుడు వెళ్తామా అనిపించింది బయటి చలి భరించలేక.

అండర్ గ్రవుండ్ ఫుడ్ సెంటర్ల వరస షాపుల్లోనూ, బయటా ఎక్కడా ఖాళీ లేకుండా ఉన్నారు జనం. కనబడ్డ మొదట పీజా షాపులో పీజా కొనుక్కుని అక్కడే చతికిల బడ్డాం నేను, సిరి. వీళ్లంతా ముందుకీ, వెనక్కీ తిరిగి చూసి నచ్చినవెవో కొనుక్కుని తిన్నారు. ఇక బాత్రూముల దగ్గరా పేద్ద లైన్లు. ఇవన్నీ అయ్యి ఇంకా రాక్ ఫెల్లర్ సెంటర్ పై నించి నగరాన్ని చూసేందుకు వెళ్లడానికి లేకుండా మాకిచ్చిన సమయం అయ్యిపోవడంతో బయటికి పరుగు తీసాం. రాక్ ఫెల్లర్ సెంటర్ పైకి వెళ్లి చూసేందుకు $17 డాలర్ల టిక్కెట్టు తీసుకోవాలి. పైగా అక్కడి లైను లో నిలబడితే సాయంత్రం వరకూ అక్కడే గడిచిపోతుంది.

బస్సు దగ్గరికి వచ్చే సరికి మేమే చివరి వాళ్లం కావడంతో మా గైడు త్వరగా రమ్మని చెయ్యి ఊపుతున్నాడు అప్పటికే.

టైం స్క్వేర్ : మా తర్వాతి స్టాపు టైం స్క్వేర్. అక్కడున్న మెక్ డోనాల్డ్స్ దగ్గర మేం దిగి పక్కనే ఉన్న “రిప్లేస్ బిలివ్ ఇట్ ఆర్ నాట్” మ్యూజియం టిక్కెట్లు గైడు తెచ్చిచ్చినవి తీసుకుని వరసగా లోపలికి నడిచేం. నిజానికి టైం స్క్వే ర్ లో ఇంకా చాలా చూడాలసినవి ఉన్నా, ఇంత కంటే గొప్పవీ ఉన్నా బస్సు టూరు వల్ల వాళ్లు నిర్దేశించినవై చూడాల్సిందే కాబట్టి లోపలికి కదిలేం. ప్రపంచ వింతలుగా పేర్కొనదగిన ఎగ్జిబిట్ల తాలుకు మ్యూజియం అది. చిన్నదే కానీ ప్రతీదీ నమ్మలేనివి, నిజమై కళ్లకు కట్టినట్లు ఉన్నాయి. ప్రపంచంలోకెల్లా ఎత్తైన జిరాఫీ ప్రతిమ, ఖరీదైన ఏనుగు అంబారీ, రెండు తలల ఆవు, మేజాజిక్ అద్దాలు, స్టాంపులతో చేసిన చిత్రపటాలు   వంటివి పిల్లల్ని బాగా ఆకట్టుకున్నాయి. చివరగా బయటకు వచ్చే దారి కళ్లు తిరిగే భ్రాంతి కలిగేటట్లు పెట్టడం పిల్లలకు బాగా నచ్చినా, కనీసం పెద్ద వాళ్ల కోసం, పసిపిల్లల కోసం వాళ్ళు మరో ఎగ్జిట్ పెట్టి ఉంటే బావుండుననిపించింది. సిరి అసలు రెండడుగులు వేసి వెనక్కి పరుగెత్తుకొచ్చింది. ఇక నాకు అలాంటివి అసలే పడవు. కానీ అది తప్ప బయట పడే మరో మార్గం లేదు. అందుకే కళ్లు మూసుకుని, వరు చెయ్యందుకుని బయటకు నడవాల్సొచ్చింది. సిరికి కూడా అలా గట్టిగా కళ్లు మూసి సత్య భుజానేసుకుని పరుగెత్తాడు ఆ కాస్త మేరా.

 

సరిగ్గా గంటన్నర వ్యవధిలో మళ్లీ చెప్పిన ప్రదేశంలో బస్సెక్కాలి కాబట్టి ఇక ఎక్కువ తాత్సారం చెయ్యకుండా బయటికొచ్చాం. కానీ మా బస్సు కి ఇంకా సమయం ఉంది. జనం రద్దీగా ఉన్నా బయట చలి భరించలేక మెక్ డోనాల్డ్స్ లోకి వెళ్లాం. అక్కడా జనమే. పిల్లలు హాట్ చాకొలేట్ ఆర్డరు చేసేరు. తీరా ఆర్డరు ఇచ్చేసేక బస్సు వచ్చేసిందని మా గైడు ఒకటే గోల పెట్టేడు.

అంత రద్దీగా చుట్టూ షాపులు రకరకాల పెద్ద పెద్ద హోర్డింగులతో సందడిగా హాలీవుడ్ సినిమా సెట్టులా ఉన్న ఈ ప్రదేశం సత్యకి, పిల్లలకి బాగా నచ్చేసింది.నిజానికి రాత్రి పూట చూడాల్సిన ప్రదేశమది. “మనం వెళ్లే ముందు రోజు మళ్లీ ఇక్కడికి తప్పకుండా రావాలి” అని పిల్లలు, సత్య పట్టుబట్టారు. ఎలాగూ మేం న్యూయార్క్ స్వయంగా చూసేందుకు చివర ఒక రోజు ఖాళీ ఉంచుకున్నాం   కదా అని నవ్వుతూ “సరే” అన్నాను.

మొత్తానికి మరో అయిదు నిమిషాల్లో అక్కడి నుంచి కదిలింది మా బస్సు.

 

ఎంపైర్ స్టేట్ బిల్డింగు: పొద్దుపోయేలోగా మేం ఆ రోజు టూర్లో ప్రఖ్యాత ఎంపైర్ స్టేట్ బిల్డింగు పైకెక్కి న్యూయార్క్ నగరాన్ని సందర్శించాల్సి ఉంది.

అప్పటికే బయటంతా పొద్దుట్నించీ ఉన్న చలికి మూడు వంతులు అధికమైంది. ఎంపైర్ స్టేట్ కి టిక్కెట్లు రెడీగా టూర్ గైడు ముందే తీసి పెట్టినందు వల్ల మేం తిన్నగా లోపలికి పరుగుతీసాం. ఎక్కడా టిక్కెట్ల కోసం లైనులో నిలబడకుండా. లిఫ్ట్ లో 86 వ ఫ్లోర్ లో ఉన్న Main Deck వరకు వెళ్లి చూడడానికి మనిషికి $27 డాలర్లు టిక్కెట్టు. అక్కణ్ణించి మరలా మొత్తం 102 ఫ్లోర్ లకూ వెళ్లాలంటే 44 డాలర్లు. అదే ఎక్స్ ప్రెస్ అయితే $60 డాలర్లు. నిజానికి కేవలం లిఫ్ట్ లో పైకి తీసుకెళ్లడానికి అంత టిక్కెట్టు మరీ దారుణం అనిపించింది. ఇంతకీ మాది మరో రకం టిక్కెట్టు. అది రెండో ఫ్లోరు లో ఉన్న “స్కై రైడు” తో కలిపిన్ అకాంబో. ఇది పెద్ద వాళ్లకి $49, పిల్లలకి $34.

లైనులో పైకి వెళ్లే ముందే “స్కై రైడు” షో ఉంది. అది వర్చ్యువల్ షో. నిజంగా విహంగమై గాలిలో ఎగురుతూ న్యూయార్క్ నగరాన్ని సందర్శించిన బ్రాంతి కలిగింది. కానీ అతి వేగంగా ప్రయాణిస్తున్న షో కాబట్టి కళ్లూ తిరిగేయి. ఇక ఇలాంటి వాటిల్లో సిరి నేను భయం వేసినప్పుడు యథావిధిగా కళ్లు మూసేసుకుంటాం. వరు కి ఇలాంటివి చాలా ఇష్టం. భయం అన్నదే లేకుండా పెద్ద పెద్ద రోలర్ కోస్టర్లు ఒక్కతీ ఎక్కి వచ్చేస్తుంది. బయటికొచ్చాక వరుని ఎలా ఉంది అనడిగితే “గొప్ప థ్రిల్ ఏమీ కలగలేదు, ఇంకాస్త స్పీడు ఉంటే బావుణ్ణు” అంది.

కోమల్ చిన్నప్పుడంతా బానే ఎక్కేవాడు, ఈ మధ్యనే నాకిలాంటివి పడడం లేదు అనడం మొదలు పెట్టాడు.

ఇక వేగవంతమైన లిఫ్ట్ లో అన్ని ఫ్లోర్లు చప్పున వెళ్లిపోయాం. పైన చుట్టు గుండ్రటి అద్దాల కారిడార్ ఉంది. దానిని ఆనుకుని బయట వైపు రెయిలింగు తో ఉన్న గుండ్రటి ఓపెన్ కారిడార్ ఉంది. అక్కణ్ణించి కనబడే నగర సుందర దృశ్యం చూడడానికి న్యూయార్క్ వచ్చే సందర్శకులు తప్పనిసరిగా వస్తూంటారట.

అంత ఎత్తులో అద్దాల తలుపులు తీసుకుని బయటికి అడుగు పెట్టగానే గొప్ప చలి విసురుగా చుట్టుముట్టింది. అయినా లెక్క చేయకుండా జన్నం కిక్కిరిసి ఉన్నారక్కడ. అందులో కాస్త ఖాళీ చేసుకుని రెయిలింగు దగ్గిరికి వెళ్లి చూద్దుము కదా. చుట్టూ ఎటు చూసినా భూమిని చీల్చుకుని వచ్చిన ఆకాశ హర్మ్యాలతో, అక్కడక్కడా భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన నీటి పాయలతో ఆ సాయం సంధ్య వేళ అత్యద్భుతంగా సాక్షాత్కరించింది న్యూయార్క్ మహా నగరం. మన నగరాలకీ ఇక్కడి నగరాలకీ తేడా అక్కడ స్పష్టంగా కనిపించింది. కనుచూపుమేర ఎక్కడ చూసినా ఆకాశం నగరం మీద ఎలా ఉందో, సుదూరాన సూర్యుడి దగ్గిరా అలానే ఉంది. ఎక్కడా కాలుష్యం వెదజల్లే పొగగొట్టాలు లేవు. నగరమ్మీద కమ్ముకున్న కృత్రిమ కలుషిత మేఘాలు లేవు. పరిశ్రమలు ఇక్కడి కఠిన నిబంధనలు సరిగ్గా పాటించడం వల్లననుకుంటాను.

https://plus.google.com/photos/104256037410703377895/albums/5982648541541937713?banner=pwa&authkey=COr-gJrJkPndAg

చుట్టూ ఉన్న భవంతులన్నీ మేమెక్కిన ఎంపైర్ స్టేట్ కంటే చిన్నవి కావడం వల్ల బొమ్మల అంతస్థులు పేర్చినట్లు భలే తమాషాగా ఉన్నాయి. కానీ సరైన ప్రణాళిక ప్రకారం రోడ్లు నిర్మించబడినట్లు అనిపించలేదు. కిక్కిరిసి ఉన్న రరకాల సైజుల భవంతుల వల్ల సరిగా కనిపించలేదో మరి.

సూర్యాస్తమయం కావచ్చింది. పొద్దుటంతా వెల్తురు, మేఘాల మధ్య దోబూచులాడుతున్న పగలు రెక్కలు అల్లారుస్తూ గూటికి చేరుతున్న వేళ. నారింజ రంగు పలుచని దుస్తులేసుకుని ఆకాశం ముస్తాబవుతున్న వేళ. ఆ క్షణంలో చుట్టూ జనం మాయమైపోయారు. అసలు నేనక్కడ నిలబడ్డ భవంతి మీద కాళ్లూనుకున్న స్పర్శ లేదు. చుట్టూ చూస్తూ కనబడ్డ దృశ్యాలపై దృశ్యాల్ని చెదరని ముద్రలేసుకుంటూ…..భౌతిక స్పర్శల్ని అధిగమించి … అదొక అనంత ప్రయాణం.

నిజానికి పైన చలిలో అయిదు నిమిషాలు ఉండడం కష్టమై గబగబా రెండు ఫోటోలు తీసుకుని అద్దాల లోపలికి పరుగెత్తుకు రావడం, మరలా బయటికి వెళ్లడం చేసేం. కానీ లిప్త పాటైనా ప్రవహించే హృదయాన్ని అనుభూతి పొంగి పొర్లే మనసుని ఆపడం ఎవరి తరం?!

సిరి బాగా చలికి వణికి పోతూండడం తో ఇక పూర్తిగా సన్ సెట్ అద్దాల లో నించే చూసేం. దీపాలు వెలిగిన మొదటి క్షణం వరకు గడిపి సమయం మించి పోతుండడంతో కిందకు వచ్చేసేం.

మేం తవ్రగా మరలా మా బస్సును అందుకోవాలి.

కానీ అదే సమయానికి చాలా మంది కిందికి వస్తూండడంతో మేం చాలా సేపు లిఫ్ట్ ఖాళీ లేక వేచి ఉండవలసి వచ్చింది.

అదీగాకా 80 వ అంతస్థు దగ్గిర మరలా లిఫ్ట్ మారాల్సి ఉంది. అక్కడ పైకి వెళ్లే వాళ్లు, కిందికి దిగే వాళ్ల మధ్య బాగా తొక్కిసలాట లేకుండా లిఫ్ట్ ల దగ్గిర ఆపరేటర్లు ఉండి లైనులో పంపిస్తున్నారు.

తీరా కిందికి వచ్చి మేం పుట్ పాత్ మీద అమ్ముతున్న గాజుబొమ్మలేవో చూస్తూ అసలు బస్సు ఉన్న దారికి సరిగ్గా వ్యతిరేక దిశలో నడిచాం. మొత్తం ఎంపైర్ స్టేట్ భవంతి చుట్టూ ప్రదక్షిణం చేసేం. అసలే చలి, దారి తప్పి బాగా అలిసిపోయేం. ఇంతకీ బస్సు ఉండాల్సిన ప్రదేశానికి వచ్చినా మా బస్సు కనబడలేదు. “అయిపోయింది, మిస్సయ్యిపోయాం” అనుకున్నాం. ఇంతలో మా గైడు మమ్మల్ని రోడ్డుకావలి నించి మమ్మల్ని జనం లో గుర్తు పట్టి చేతులు ఊపాడు. ఆలస్యం కావడం వల్ల బస్సును మరో రోడ్డులో ఆపాల్సి వచ్చిందని మమ్మల్ని వేగంగా నడిపించాడు.

కాస్సేపటి చలికే మాకు నరకంగా అనిపిస్తూంటే అక్కడ ఫుట్పాత్ ల మీద అవీ ఇవీ అమ్ముతూ తిరుగుతున్న వాళ్ల పరిస్థితి ఏమిటా అనిపించింది.

ఇక ఎక్కడ చూసినా కనిపిస్తున్న హోం లెస్ ప్రజల పరిస్థితి ఇంకా దయనీయం. నాకు మనసంతా బాధ చుట్టుకుంది. న్యూయార్క్ నగరం పై నించి కనిపించినంత అందంగా రోడ్ల పై కనబడలేదు. ఉదయం నించీ నాకు ఎప్పుడు ఇలా జనం అవస్థల్లో కనబడినప్పుడల్లా ఈ మన:స్థితి కలుగుతూండడం వల్లనో, లేక చలిలో చంటి పిల్లతో అవస్థ వల్లనో న్యూయార్క్ నగరాన్ని స్వయంగా, ప్రత్యక్షంగా చూసి నేను గొప్ప ఆనందంతో పులకించలేకపోయాను. ఏదో తెలీని దు:ఖం చుట్టుముట్టింది. మొదటి ప్రపంచంలోనూ అలమటిస్తున్న జనానీకమే. నిజానికి ఈ దేశం లో ధనవంతుల పాళ్లు ఎక్కువే. ఇక్కడి మిలియనీర్లు, బిలియనీర్లు మూడో ప్రపంచ దేశాల మీద జాలి చూపించే ముందు తమ దేశం లో జనం రోడ్ల పై చలిలో నిద్రించే దౌర్భాగ్య స్థితిని ఎందుకు ఆలోచించడం లేదు? అనిపించింది.

రాత్రి బస : ఆ రాత్రి మేం మా మొదటి రోజు న్యూయార్క్ బస్సు టూరు ముగించి న్యూజెర్శీ లో రాత్రి బస చేస్తాం. దారిలో భోజనానికి ఆపుతానన్నాడు.

చలి కాలపు పొద్దు కాబట్టి 5 గం||లకే చీకటి అయిపోయింది.

6 గంటల ప్రాంతంలో న్యూయార్క్ నించి బయలు దేరి నగరం శివార్లకు వచ్చే సరికే 7 అయ్యి పోయింది.

అక్కణ్ణించి మరో గంటన్నర పాటు ప్రయాణించేం. పొద్దుట్నించీ అలిసిపోయి ఉన్నామేమో ఎక్కడి వాళ్లక్కడ పడి నిద్ర పోయేం.

రాత్రి భోజనానికి ఒక “పక్కా చైనీసు హోటలు” కు తీసుకొచ్చి ఆపేరు. అదీ బఫే సిస్టం . మనిషికి $15 డాలర్లు టిక్కెట్టు. ఐటెమ్సు చాలానే ఉన్నా తినగలిగేవి కొన్నే ఉన్నాయి.

ఏవో చిన్న చేపల ఫ్రై మాత్రం సిరి బాగా ఇష్టం గా తింది. వరు నాన్ వెజ్, అందునా సీఫుడ్ అసలే దగ్గరకు రానివ్వదు. తను ముక్కు మూసుకుని ప్లెయిన్ నూడుల్స్ అటూ ఇటూ తిప్పి వదిలేసింది.

సూప్స్ అన్నచోట “రైస్ సూప్” అని ఉంటే ఏవిటో కొత్తదని కప్పులో వేసి తెచ్చుకున్నాం. అది మన గంజి అన్నం. కాస్త ఉప్పు వేయడం వల్ల భలే రుచిగా ఉంది.

అంత టిక్కెట్టూ పెట్టి తింటున్నది ఇదా అని నవ్వు వచ్చింది మాకు. మాతో బాటూ బస్సుల్లో చైనీయేతరులు మరో 6 గురు భోజనం చెయ్యకుండా ఒక పక్కగా కూర్చుండిపోయేరు.

మేం ఉడక బెట్టిన కాసిన్ని మొక్క జొన్న పొత్తులూ, నువ్వు పప్పు అంటించి, లోపల కలువగింజల పొడితో అన్నం అద్ది చేసిన ఉండల వంటివీ, పళ్ల ముక్కలూ, కేకులూ తిని కడుపు నింపుకున్నాం.

ఉడకబెట్టిన నత్తగుల్లలూ, పచ్చిరొయ్యలూ, మాంసపు విశేషాల జోలికి వెళ్లాలనిపించలేదెందుకో ఎవరికీ.

మరో గంట తర్వాత మరలా మరో అరగంట ప్రయాణించి న్యూజెర్శీ రాష్ర్ట్ర సరిహద్దుల్లో మా బసకు చేరాం. మేం సాధరణ హోటల్ కాకుండా, డీలక్సుకు డబ్బులు కట్టడం వల్ల మమ్మల్ని హిల్టన్ గ్రూపు హోటల్లో మమ్మల్ని డ్రాప్ చేసి మిగతా వాళ్లని మరో హోటల్ కు పంపారు.

ఉదయం మేమే మొదట గా తయారవ్వాలని చెప్పి మరీ మా రూముల తాళాలు మాకిచ్చాడు గైడు. ఇండోర్ స్విమ్మింగు పూల్ తో, పూల్ వ్యూలో ఉన్న గదుల్లో హాయిగా వెచ్చని స్నానాలు చేసి అంతా ఒక చోట చేరి కబుర్లు చెప్పుకున్నాం కాస్సేపు. మధ్య తలుపు ఉండి ఆనుకుని ఉన్న సూట్ కావడం వల్ల మాట్లాడితే సిరి అటూ ఇటూ తిరగడం మొదలుపెట్టింది.

బస్సులో దారిలో బాగా నిద్రలేసారు కాబట్టి నిద్దర్లు రావట్లేదని టీవీ పెట్టుకున్న పిల్లల్ని పడుకోబెట్టడం నానా యాతనా అయ్యింది.

ముఖ్యంగా సిరి సరిగ్గా అందరికి నిద్రొచ్చే వేళకి మంచి హుషారుగా చెంగు చెంగున గెంతులెయ్యడం మొదలెట్టింది.

మర్నాడు 6 గంటలకు మా హోటల్ చెకవుట్ చేసి లాబీ లో కనిపించాలి మేం. అక్కణ్ణించి ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డీసీ లకు వెళ్లాలి.

పాపాయికి నిద్ర వచ్చేవరకు ఇండోర్ బాల్కనీలో అటూ ఇటూ భుజమ్మీదేసుకుని తిరిగాను. ఉదయం అయిదు గంటలకే లేవాల్సి ఉంది. అయినా పన్నెండింటి వరకు అలా మేల్కొని ఉండక తప్పలేదు మాకు.

అయినా చంటి పిల్లలతో సంవత్సరాల తరబడి ఇలాంటివి బాగా అలవాటై పోయి అలసట అనిపించలేదు.

ఎలా అయితేనేం అలా బస్సుటూరులో మొదటి రోజు యాత్ర చలినధిగమించి విజయవంతంగా పూర్తి చేసామని సంతోషించాం.

……………….

– డా. కె.గీత

Published in March , 2014 by VIHANGA

http://vihanga.com/?p=11370

ప్రకటనలు
This entry was posted in నా కళ్లతో అమెరికా(Travelog) and tagged . Bookmark the permalink.

One Response to నా కళ్లతో అమెరికా-29-న్యూయార్క్ సిటీ టూర్ (భాగం-2)

  1. seena అంటున్నారు:

    Very god description in chaste Telugu. I recollected my travel and related experiences in USA…of course mine was in summer.
    seena

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s