నా కళ్ళతో అమెరికా-28 (న్యూయార్క్ సిటీ టూర్ -మొదటి భాగం)

అమెరికా తూర్పు తీరం- రోజు-2

న్యూయార్క్ సిటీ టూర్ -మొదటి భాగం

అమెరికా తూర్పు తీరపు సందర్శనకి మేం 5 రోజుల బస్సు టూరు బుక్ చేసుకున్నాం. ముందు రోజు రాత్రి కే న్యూయార్క్ కి చేరుకున్నాం. న్యూయార్క్ లోని క్వీన్స్ లో ఉదయం 7 గంటలకు మా టూరు బస్సు ని ఎక్కాలి. హోటల్ లో తెల్లారగట్లే లేచి త్వరత్వరగా 6 గం.టలకే చెకవుట్ చేసి, అక్కడే హోటల్ ఫ్రీ బ్రేక్ ఫాస్టు చేసి బుక్ చేసుకున్న వ్యాను ఎక్కాం. సరిగ్గా పది నిమిషాల వ్యవధి లోనే ఉంది మా బస్టాండు. కానీ బయట కాలు పెట్టగానే భయంకరమైన చలిగా ఉంది. బహుశా: ఒక డీగ్రీ సెంటి గ్రేడు ఉంటుందేమో. అన్నీ బుక్ చేసుకున్నాకా తప్పదుగా.

టూరు బస్సు: అనుకున్న సమయానికి సరిగ్గా బస్టాపుకి చేరుకున్నాం. మేం బస్సు ఎక్కాల్సిన బస్టాండు నిజానికి రోడ్డు పక్క ఎటువంటి షెల్టరూ లేని చిన్న స్టాపు మాత్రమే.

వ్యాను లోంచి దిగంగానే హోరున భయంకరమైన చలి గాలి. సిరి ని ఎత్తుకుని ఎటు పరుగెడదామన్నా ఎటువంటి షెల్టరూ లేదు. రోడ్డు పక్కనే ఉన్న షాపులన్నీ మూసి ఉన్నాయి. పకడ్బందీగా అందరం రెండు మూడు జతల బట్టలు ఒకదానిమీదొకటి వేసుకుని, కోట్లు, కేప్లు, గ్లోవ్స్ వేసుకున్నా చలి వణికిస్తూందంటే బయటి ఉష్ణోగ్రత ఎంతగా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అదృష్టం కొద్దీ మా కోసమే అక్కడ నిలబడ్డుట్టున్న ఒక చైనీ పెద్ద మనిషి “మీ కోసమే ఎదురు చూస్తున్నాను. మీరు ఈస్ట్ కోస్ట్ టూరు బస్సు ఎక్కడానికొచ్చారుగా” అని అడిగాడు. మా చేతిలో సూట్ కేసులు, అయిదుగురం కనబడగానే అర్థమైనట్లుందతనికి. మేం అవునని తలూపగానే టూరు బుక్ చేసుకున్న కాగితం చూపించమని అడిగి పరుగు నడక తో మమ్మల్ని రోడ్డు దాటించి కనుచూపు మేర లో ఉన్న బస్సు లోకి ఎక్కించాడు. అప్పటికే బస్సులో నిండా జనం ఉన్నారు. మేం చివర సీట్లలో కూచున్నాం. మరలా అతను వెళ్లి మరొక ఇద్దరిని అతనితో తీసుకొచ్చాక సరిగ్గా వాళ్లు చెప్పిన టైముకి బస్సు బయలు దేరింది. ఇది క్వీన్సు దగ్గర లో ఉన్న చైనా టవున్ అనీ, అక్కడి నుంచి ముందుగా మేం మన్ హాటన్ లోని చైనా టవున్ కి వెళతామనీ, అక్కడ మేమంతా మా రూట్ల బస్సులు మరలా మారాల్సి ఉంటుందనీ చెప్పాడు.

బస్సులో చక్కగా వెచ్చగా ఉన్నందు వల్ల వెంటనే తేరుకోగలిగాం. కానీ ఆ రోజంతా ఇలాంటి చలిలో న్యూయార్క్ అంతా తిరగాల్సి ఉంది. చిన్న పిల్లతో ఎలారా భగవంతుడా అని భయం పట్టుకుంది మాకు. ఎండ వస్తే బావుణ్నని మనస్సులోనే బోల్డు సార్లు కోరుకున్నాను. నా మొర ఆలకించినట్లు మేం మరో గంట లో మన్ హాటన్ కు చేరే వేళకి సన్నగా సూర్య కిరణాలు విచ్చుకున్నాయి.

చిన్నతనం లో సూర్య నమస్కారాలు చేస్తూ ఉన్న మా అమ్మమ్మని “అమ్మమ్మా! ఎందుకు సూర్య నమస్కారాలు చేస్తున్నావని” ప్రశ్నించినప్పుడు “ప్రపంచానికి వేడిమినిచ్చే సూర్య భగవానుడే లేకపోతే ఈ ప్రపంచానికి అర్థం ఉండేదా?” అని తనిచ్చిన సమాధానం జ్ఞాపకం వచ్చింది. సూర్యుడికి రెండు చేతులూ పైకెత్తి నమస్కారం పెట్టాలని అనిపించింది.

అయితే ఆ సంతోషం ఎక్కువ సేపు మిగలకుండా బస్సు మారడానికి దిగే వేళకి సూర్య కిరణాలకి మించిన చలి గాలి మొదలయ్యింది. మళ్లీ అదే తంతు. ఎటువంటి షెల్టరూ లేదు. అయితే కొంచెం నయం ఇక్కడ. పక్కనే షాపుల మధ్య పైన క్లోజ్డ్ గా ఉన్న సందు ఉంది కనీసం. అక్కడ నిలబడ్డాం. నేను కాస్సేపట్లో సూట్ కేసు వాల్చుకుని కూచుండి పోయాను. సందులో ఉన్నా రెండు పక్కల నించి వీచే గాలెక్కడికి పోతుంది? అందులో మాలాగే బస్సులు దిగి మరో బస్సు పిలుపు కోసం ఎదురు చూస్తున్న వాళ్లు ఉన్నారు. రూట్ ల వారీగా బస్సు కంపెనీ ఏజెంట్లు ఒక్కో బ్యాచ్ నీ ఎక్కిస్తూ ఉన్నారు. మా ఖర్మ కొద్దీ అరగంటా, నలభై నిమిషాల తర్వాత కానీ మా వంతు రాలేదు. అక్కడ సూట్ కేసు వాల్చుకుని చంటి పిల్లని శాలువా లో పొదువుకుని అలాంటి చలిలో కాందిశీకురాలిలా ఎలా కూర్చున్నానో ఇప్పటికీ అర్థం కాదు. అలా మొదలయ్యింది మా తూర్పు తీరపు విహార యాత్ర.

మొత్తానికి మా వంతు వచ్చి మరలా బస్సెక్కాం. మరలా చివరి సీట్లే. అయినా సంతోషంగా తీసుకున్నాం. మా వెనుక మరో రెండు, మూడు సీట్లు ఖాళీగా కూడా ఉన్నాయి. సిరి చక్కగా ఆడుకునేందుకు ఇదే బెస్టని మాకు అప్పటికే అర్థమయ్యింది. టూరులో ఆలస్యం లేకుండా పొద్దుటే బానే బయలుదేరామనుకున్నాను కానీ ఈ బస్సు మారడం వల్ల బాగా లేటయ్యింది. అందుకేననుకుంటా ఇక రోజంతా మా గైడు ప్రతీ చోటా మమ్మల్ని పరుగెత్తించాడు.

 

మన్ హాటన్ : చాలా గొప్ప ధనిక ప్రదేశమంటారు. చైనా టవున్ మాత్రం ఎక్కడున్నా అపరిశుభ్రంగానే ఉన్నట్లు, ఇక్కడా ప్రత్యక్షమయ్యింది. ఇక చైనా టవుననేమిటి ప్రతీ వీధిలోనూ, రోడ్ల పక్కన సంచులతో కట్టిన చెత్త చూస్తే మాత్రం “ఇదేం న్యూయార్క్ రా బాబూ”అనిపించింది.

 

ఇక చలిలో తిరగడానికి సిద్ధమవుతూ “చలికి భయపడేది లేదు, అయినా రాబోయే అయిదు రోజులు ఇలా తిరగాల్సిందే కదా” అని ఎంత సర్ది చెప్పుకున్నా ఒంట్లోంచి పుట్టే వొణుకు ఎక్కడికి పోతుంది. ఆ రోజు మాతో పాటూ చలిని ఓపిక పట్టిన సిరిని చూసి భలే జాలి వేసింది నాకు. బాగా చలిగా ఉన్నప్పుడు “కియ కయ్” అనకుండా అలా కిందికి దిగులుగా చూసుకుంటూనో, మోకాళ్లలో తల దాచుకోవడానికి వంగునో కూర్చునేది బేబీ కార్టులో. అంతే గానీ ఎక్కడా ఏడవలేదు పాపం.

 

వాల్ స్ట్రీట్: అవేళ్టి మా టూరు లో భాగంగా బస్సు మొదట స్టాపు వాల్ స్ట్రీట్. అంటే స్టాక్ మార్కెట్టు వీథన్న మాట. ముందొక ఎర్ర గొడుగు వేసుకుని మా గైడు రయ్యి రయ్యిన వెళ్లిపోతుంటే మేమంతా పరుగులాంటి నడక తో అనుసరించాలి చలిలో. రోజంతా ఇలా పరుగెత్తడమే. అసలే చివరి సీట్లు కావడం వల్ల మేము అందరికంటే ఆలస్యంగా బస్సులోంచి దిగే వాళ్లం. పైగా సిరిని బేబీ కార్టు లో కూచో బెట్టడానికి ప్రతీసారీ కాస్త సమయం పట్టేది మాకు. కానీ అందరితో పరుగెత్తాల్సి వచ్చేది. అందుకే బస్సు దిగంగానే గైడుని అనుసరించి గైడు చెప్పేవి వినే డ్యూటీ వరుకి అప్పగించాము.

వరుకు సాయంగా కోమల్ పరుగెత్తేవాడు.

నేను ఆ పరుగులోనే అక్కడో ఫోటో, ఇక్కడో ఫోటో అంటూంటే, “ఈ చలిలో, హడావిడిలో నీ ఫోటోల గోలేవిటని” సత్య గోల పెట్టేవాడు.(నాకవి చాలా ఇంపార్టెంటు మరి, ఇలా రాసినప్పుడు పంపడానికి!).వాల్ స్ట్రీట్ చూడడమంటే బయటి నుంచి బిల్డింగులు, బోర్డులు అన్నీ నడుస్తూ చూసుకుని వెళ్లిపోవడమన్న మాట. ఉదయం చలి ఎముకలు కొరుకుతున్న వేళ ఎత్తైన ఆకాశహర్మాల మధ్య చిన్నపాటి సందుల్లో నడిపించాడు మా గైడు. రెండు వీధులు నడిచేక అదుగో చూడండి. అని ఒక లోహపు వృషభాన్ని చూపించి “ఇదే “లక్కీ బుల్” దీన్ని ముట్టుకుంటే స్టాకులన్నీ ఆ బుల్ లాగా పరుగెడతాయని అందరి నమ్మకం” అన్నాడు. అంతా అటు పరుగెత్తారు.

అంతా అటు బిజీగా ఉన్న సమయంలో నాకు అక్కడ రోడ్డు పక్కన చిన్న బండి మీద చిన్న చిన్న గాజు బొమ్మలు అమ్ముతున్న మెక్సికన్ అమ్మాయి కనబడింది. పొద్దుటే అంత చలిలో అమ్ముతూంది పాపం. తనకి సాయం చేసినట్లవుతుందని $15 డాలర్లు పెట్టి ఒక చిన్న “గాజు బుల్ బొమ్మ” కొన్నాను. పది నిమిషాల తర్వాత కూడా అంతా లైను లో నిలబడి ఎద్దు బొమ్మని ముట్టుకోవడానికి పోటీ పడ్తూంటే మా గైడు త్వరపెట్టడం మొదలు పెట్టాడు. నాకు నవ్వు వచ్చింది అక్కడి తతంగం చూసి.

బయటికంటే బస్సులోనే నయమనిపించేలా ఉంది వాతావరణం. “ఆ వాల్ స్ట్రీట్ కు దగ్గర్లోనే 9/11 సంఘటన జరిగిన ప్రదేశం ఉందనీ, కానీ అక్కడకు వెళ్లేందుకు ముందే పర్మిషన్ తీసుకోవాలనీ, ఇప్పుటికిప్పుడు వెళ్ళడం కుదరదని” చెప్పేడు మా గైడు. హయ్యో! ఇంతా చేసి నేను చూడాలనుకున్న ప్రదేశం చూపించడం లేదే అని బాధేసింది. సర్లే, మేం స్వంతంగా న్యూయార్క్ లో తిరిగే రోజు ఒకటి ఈ ట్రిప్పులో ఎలాగూ ఉంది కదా, అప్పుడు చూసుకుందామని సర్దిచెప్పుకున్నాను.

https://plus.google.com/photos/104256037410703377895/albums/5970864222964067105?banner=pwa

స్టాట్యూ ఆఫ్ లిబర్టీ: అక్కడి నుంచి తర్వాత “స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ” బోట్ ట్రిప్పు రెండో స్టాపు. మన్ హాటన్ డౌంటౌన్ లో ఉన్న Pier-16 సౌత్ స్ట్రీట్ సీపోర్ట్ నుంచి ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ట్రిప్పు అది. టిక్కెట్టు మనిషికి $30 డాలర్లు. బస్సు దిగి అంతా గైడు ఎర్ర గొడుగుని అనుసరించేం. ఇలా వెళ్తున్న సందర్శనా స్థలాల్లో టిక్కెట్లు అతను ముందే కొని పెట్టాడనీ, ఎవరినీ ప్రత్యేకించి కొనొద్దనీ చెప్పేడు. వీటన్నిటి బిల్లు ట్రిప్పు నాలుగో రోజున చేతికిచ్చేడు. కిక్కిరిసిన బోట్ మరో అరగంట లో బయలుదేరింది. లోపల రెండస్థుల్లో నిండా జనం ఉన్నారు. మేం చివర వెళ్లడం వల్ల గుమ్మం దగ్గరే ఉన్న అడ్డు సీట్ల లో చతికిల బడ్డాం.అప్పటికి మంచి ఎండ వెచ్చగా ముందుకొచ్చింది. తళ తళా మెరుస్తున్న నీటి కెరటాల్ని చీల్చుకుంటూ ప్రయాణం. గాజు అద్దాల లో నుంచి పై డెక్ మీదికెళ్తే గానీ బయటి చల్లదనం తెలియడం లేదు.

“స్టాట్యూ ఆఫ్ లిబర్టీ” – అమెరికా గురించి కలలు గన్న ప్రతి నిమిషమూ చూడాలని తపన పడ్డ స్వేచ్ఛా ప్రతీక. ఇంకాస్సేపట్లో చూడబోతున్నానన్న ఉద్వేగం. నేను ఆమె కోసం ఎదురు చూస్తున్నానా లేక నా కోసమే ఆమె 1886 నించీ నిరంతర జ్యోతిప్రజ్వలనై ఎదురు చూస్తూందా?!

 

అయితే ఊహలన్నీ తారుమారైన సంఘటన జరిగింది. దాదాపు గంట సేపు దగ్గర వరకు ప్రయాణించి పదినిమిషాలు బోట్ ని చుట్టూ ప్రదక్షిణం చేయించి తీసుకెళ్లి వెనక్కి తిప్పేసేరు.

నేను త్వరగా గైడు దగ్గర కెళ్లి “అదేమిటి మనమక్కడ దిగడం లేదా?” అనడిగాను. “అక్కడికి దిగి వెళ్లే ట్రిప్పుకి సగం రోజు పడుతుంది. ఈ టూరు గంటకే పరిమితం” అని సమాధానమిచ్చాడు గైడు.

కూత వేటు దూరం నించి ఎన్నాళ్లుగానో అమెరికా అంటే “Statue of Liberty” అని నమ్మిన మనసులో కనీసం ఆ దీవి మీద అడుగు పెట్టడం లేదన్న అశాంతి హృదయంతో కన్నార్పకుండా అటే చూస్తూ ఉండిపోయాను.

దారంతా మా గైడు అక్కడా విగ్రహం పెట్టడం వెనుక చరిత్రంతా తవ్వి పోస్తున్నాడు. నాకవేమీ వినిపించడం లేదు. అద్దాల తలుపుల్లోంచి అటే దీక్షగా చూస్తూ “అదేంట్రా, అక్కడ దిగకుండా ఉండడానికా ఇంత దూరం వచ్చాం?” అని నాలో నేను అనుకుంటూ పైకి అన్నట్లున్నాను.

“మరలా ఒక రోజు నిన్నక్కడికి తీసుకొస్తానులే అమ్మా!, అప్పుడు చూద్దువు గాని, ఇక రా” అని మా కోమల్ భుజం చుట్టూ చెయ్యి వేసి అన్నాడు.

నిజంగా వచ్చినా, రాకపోయినా వాడా మాట అన్నందుకు భలే ముచ్చటేసింది.

నిజానికి స్టాట్యూ ఆఫ్ లిబర్టీని పై వరకూ వెళ్లి చూసేందుకు, అక్కడే వీలైనంత సమయం గడిపేందుకు లిబర్టీ క్రూయిజ్ టిక్కెట్లు స్వయంగా కొనుక్కుని వెళ్తే టిక్కెట్టు ధర $18 లేదా $21 డాలర్లు మాత్రమే. టూరు వాళ్లతో వెళ్లినందున ఇంతే ప్రాప్తం అనుకుని సరిపెట్టుకోవలసి వచ్చింది.

 

గైడు-భాష: ఇంతకీ మా టూరులో గొప్ప నవ్వు వచ్చిన విషయమేమిటంటే, మా బస్సులో మెజారిటీ చైనీయులే. అసలా బస్సు కంపెనీ కూడా వాళ్లదే. ఇక గైడు సరేసరి. ఇక బస్సులో ఉన్న మెజారిటీ జనం కోసం ప్రతీ సందర్భాన్నీ ముందు చైనా భాష అయిన మాండరీన్ లోనూ మిగతా కొద్ది మందిమైన మా కోసం ఇంగ్లీషులోనూ చెప్పేవాడు. ఆ ఇంగ్లీషు కూడా మాండరీన్ లాగే మాట్లాడడం తో అస్సలు అర్థం అయ్యేది కాదు. పైగా ఎక్కడ ఇంగ్లీషు మాట్లాడుతున్నాడో, ఎక్కడ మాండరీన్ మాట్లాడుతున్నాడో తెలీకుండా కామా, ఫుల్ స్టాపు లేకుండా గబగబా మాట్లాడే వాడు. మేం చెవులు రిక్కించి అతి జాగ్రత్తగా వినే వాళ్లం అతని ఇంగ్లీషుని. ఇక ఇంగ్లీషులో చాలా బ్రీఫ్ గా ఒక వాక్యంలో చెప్పేసి, అక్కడి నుంచి మాండరీన్ లో అరగంట మాట్లాడేవాడు. నాకు నవ్వు వచ్చినా ఒక్కోసారి భలే విసుగూ వచ్చేసింది పాపం పిల్లలకు. సత్య అయితే నెత్తి కొట్టుకునేవాడు ఇదంతా చూసి. మాతో బాటూ బస్సులో మరొక ఇద్దరు ముగ్గురు సౌత్ అమెరికన్సు ఉన్నారు. ఇండియన్సు అసలే లేరు. ఇక ఫుడ్ చూడాలి, ప్రతీ పూటా చైనీ ఫుడ్ తప్పనిసరిగా ఉన్న చోటే ఆపేవాడు. ఒక్కోసారి మాకు వేరే రకమైన ఫుడ్ దొరికేది, కానీ కొన్ని సార్లు మరొక గత్యంతరం లేక అక్కడే తినాల్సి వచ్చేది.

 

UNO కార్యాలయం: తర్వాతి స్టాపు పది నిమిషాలలో UNO కార్యాలయం. అదీ బయటినుంచి చూడ్డమే. బస్సు దిగి రోడ్డు పక్కనించి ఫోటో లు తీసుకుని బస్సెక్కడమన్నమాట. ఆ సరికి పిల్లలు ఎక్కడి వాళ్లక్కడ పడి నిద్రపోవడం మొదలెట్టారు. మేమిద్దరం చప్పున దిగి మరలా బస్సెక్కాం. అసలక్కడ ఏముందో గొప్పగా ఫోటోలు తీసుకోవడానికి అర్థమే కాలేదు.

(ఆ రోజులో మిగతా భాగం వచ్చే సంచికలో)

-కె.గీత

Published in February , 2014 by VIHANGA

http://vihanga.com/?p=11172

ప్రకటనలు
This entry was posted in నా కళ్లతో అమెరికా(Travelog) and tagged , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s