అనగనగా అమెరికా-26(శివరాత్రి – క్షీరాభిషేకం)

“ఏవండోయ్, ఇవేళ శివరాత్రి మీరు ఆఫీసు నించి త్వరగా రావాలి.” ఆర్డరేసింది భార్యామణి.
“ఏవిటో, అమెరికా వచ్చినా శివరాత్రి, సంకురాత్రి అని గోల” అని లోపల్లోపల విసుక్కుంటూ, చిరునవ్వుతో “ఎందుకో” అన్నాడు.
“ఎందుకేవిటి? సాయంత్రం గుడికెళ్లి శివునికి అభిషేకం చేయించాలి.” అంది.
సాయంత్రం ఇద్దరు పిల్లలకి తలంటుపోసి శుభ్రంగా పరికిణీలు వేసి తయారు చేసి, తనూ పట్టు చీరకట్టుకుని అచ్చు మచ్చు ఇండియాలోలా తయారైంది.
కారు డిక్కీలో రెండు లీటర్ల నాన్ ఫేట్ మిల్కు డబ్బా చూసి, “ఏవోయ్, ఈ డబ్బా మనమొక్కళ్లమే అభిషేకం చేస్తామా? లేక మీ ఫ్రెండ్సందరూనా? అన్నాడు భర్త.
“అయ్యో, లెంపలేసుకోండి కళ్లు పోతాయి,” అని లెంపలేసుకుని,  చూపుడు వేలు చివర చిన్నగా కొరుక్కుంది కూడా.
“అది కాదోయ్, ఇండియాలో పాలాభిషేకమంటే సిలాయి బుడ్డితో పట్టుకెళ్లేవాళ్లం కదా” ఇదేవిటీ అని ఆశ్చర్యపోతూ అన్నాడు.
“మీరు మరీనూ, అమెరికాలో సిలాయి బుడ్లెక్కడ దొరుకుతాయి? అదీగాక ఇండియాలో “గంగి గోవు పాలు గంటెడైనను దొరికిన చాలన్నట్లు” ఆవుపాలు దొరకడమే గగనం. ఇక్కడ అమెరికాలో అన్నీ ఆవుపాలేగా.  అందుకే మనింట్లోని రెగ్యులర్ పాల టిన్ను పడేసుకొచ్చా, తప్పేవుందీ” అని రాగం తీసింది భార్యామణి.
అమెరికా లో ఫిబ్రవరి నెల శీతాకాలపు పొద్దు కావడం వల్ల తొందరగా చీకటైపోయి పిల్లలు జోగడం ఒక వైపు, భర్త ఆఫీసు నించి ఆలస్యంగా వచ్చాడనే కోపం మరో వైపు తిక్క పుట్టిస్తుండగా..
“అరటి పళ్ల బదులు పెరటి నారింజలు, పూల దండ బదులు పూలబొకే, ఆకు వక్కల బదులు ప్లాస్టిక్ ఆకులు… అంటూ లిస్టు చదివి “ఏం అమెరికానో” “అని నెత్తి కొట్టుకుంది.
“అమ్మా, ప్రసాదం తింటా” అనేడుస్తున్న పిల్లలతో “ఈ ప్రసాదం గుడి కోసం నెయ్యి లేకుండా  తిప్పాను” మీ కోసం నేతి ప్రసాదం చేసి పెట్టాను. ఇంటికెళ్లాక తిందురులే”  అంది.
ఓపెన్ హాలులో ఉన్న పది పదిహేనుమంది దేవుళ్లలో ఎవరికీ లేని గిరాకీ ఆ రోజు శివునికి ఉన్నట్లుంది.  లైను అక్కడున్న దేవుళ్ల కంటే పదిరెట్లు ఎక్కువగా ఉంది. లేటుగా వచ్చినందుకు చివరనెక్కడో నిలబడాల్సి వచ్చే సరికి  భర్తకీ చిర్రెత్తుకొచ్చింది.
“ఒక పక్క ఈ పాల డబ్బా చెయ్యి లాగేస్తూంటే, ఈ పిల్ల మరో పక్క” అని భుజమ్మీద చిన్న పిల్లని మోస్తూ గొణిగేడు.
లైనులో ఒక డబ్బా పుచ్చుకుని వెళ్లిన వాళ్లు డబ్బాలో కాసిన్ని పాలు వాడి, మిగతావి ఇంటికి తెచ్చుకోవడం బాగోదనుకుని, అక్కడే వదిలేయడం చేతుల్లో పాల డబ్బా లేని వెనక వాళ్లు వాటితో అభిషేకం చెయ్యడం చూసింది భార్య.
 తమ ముందు నిలబడ్డ వాళ్లు తమ లాగే డబ్బా పుచ్చుకుని రావడం చూసి, మెరిక లాంటి ఆలోచన వచ్చింది ఆవిడకి. భర్త చేతిలో నుంచి పాల డబ్బా లాక్కుని, కారు తాళాలు అడిగి పుచ్చుకుని ఇప్పుడే వస్తానని మాయమైంది.
“వచ్చేటప్పుడు ఉత్తి చేతుల్తో వస్తున్నావిణ్ణి చూసి, మన అభిషేకం పాలేవోయ్” అనడుగుతున్న భర్త ని చూసి నొసలు చిట్లించింది.
అనుకున్న ప్రకారమే తమ ముందు వాళ్లు పాల డబ్బా విప్పి అక్కడ పెడ్తారనుకుంది. కానీ వాళ్లూ ఇలాగే తెలివిగా ఆలోచిస్తారన్న విషయం మరిచిపోయింది.
వాళ్లూ ముందు డబ్బాలో ఎవరివో మిగిలున్న పాలు అక్కడున్న చిన్ని ఉత్సవ లింగానికి  తలా ఒక గరిటెడు పోసి పక్కకు తప్పుకున్నారు.
వాళ్లతో తెచ్చుకున్న నిండు డబ్బా మూత తియ్యకుండానే చక్కా పట్టుకెళ్లిపోయారు.
ఈ తతంగమంతా చూసి భర్త గొణగడం ఖాయం అని అర్థమైపోయింది. అప్పటికప్పుడు గ్రేట్ అయిడియా వచ్చిందే తడవుగా అక్కడున్న డబ్బాలో కాసిన్ని పాలనీ పక్కనున్న చిన్ని ప్లాస్టిక్ గ్లాసులో నిండుగా పోసింది భార్యామణి.
తను స్పూనుడు పోసి, పిల్లలతో మరో రెండు స్పూన్లు పోయించి, భర్తకి సగం పైనే గ్లాసులో వదిలి పెట్టి, శివరాత్రి క్షీరాభిషేకం సజావుగా కానిచ్చి పక్కకొచ్చి లెంపలేసుకుంది.
“ఈ మాత్రానికి ఇంటి నుంచి పాల డబ్బా మోయించడమెందుకో” అని లోపల గొణుక్కున్నా పైకి “శివ శివా” అని రెండు సార్లు అరిచి మూడు గుండ్రాలు తిరిగేడు భర్త.

……………

First Published: 14 Mar 2014

http://www.andhraprabha.com/columns/anaganaga-america-26/13911.html

ప్రకటనలు
This entry was posted in అనగనగా అమెరికా(ఆంధ్ర ప్రభ కాలం). Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s