అనగనగా అమెరికా 28(సెల్ఫ్ సర్వీస్)

సెల్ఫ్ సర్వీస్

 
సుబ్రహ్మణ్యం బాబాయి రిటైర్ అయ్యి ఎప్పుడెప్పుడు మొత్తానికి అమెరికాలో పిల్లల దగ్గిరికి వచ్చేద్దామా అని ఎన్నాళ్లు గానో ఎదురుచూసారు. పిల్లలిద్దరూ అమెరికాలోనే సెటిల్ అయ్యారు. పైగా సిటిజన్లు కూడాను. బాబాయికి కూడా గ్రీన్ కార్డు ఇప్పించేసారు. ఇంకేవిటి, శుభ ముహూర్తం కూడా రానే వచ్చింది. బాబాయి అమెరికా వచ్చేసేరు.ఏమాటకామాటే చెప్పుకోవాలి. బాబాయికి తన పిల్లల కంటే నా మీదే నమ్మకం ఎక్కువ. కష్టమైనా, నష్టమైనా నాతోనే మొదట చెప్తారు. ఆ రోజు నేను ఆఫీసులో మీటింగులో ఉన్న సమయంలో వరస పెట్టి నాలుగైదు మిస్డ్ కాల్స్ ఉన్నాయి బాబాయి నించి.ఏమైందోనని ఆదుర్దాగా ఫోన్ చేసాను.అట్నించి తాపీగా ‘ఏం లేదమ్మాయ్, అమెరికా వచ్చి ఆరు నెలలు కూడా కాకుండానే బోల్డు బోరు కొట్టెయ్యడం మొదలైంది. మీ ఆఫీసులో ఏదైనా ఉద్యోగం ఉంటే చెప్తావనీ..’ అన్నారు.’అయ్యో బాబాయ్, మాది సాఫ్ట్‌వేర్ ఆఫీసు కదా. ఇందులో మీరు చెయ్యగలిగిన పన్లు ఉండవు’ అన్నాను.పోనీ మీ ఆయన చేసే చోట ఏదైనా…అంటూండగానే, ‘వాళ్ల ఆఫీసు సంగతి చెప్పనవసరం లేదు’ అన్నాను.’అంటే ఈ దేశం లో నాలాంటి మనుషులు చేసే పనులే ఉండవంటావ్’ అన్నారు నిరాశగా.’అయినా, చక్కగా హాయిగా రిటైర్డ్ జీవితాన్ని…’ అనేదో అనునయించబోయాను.’ఏం చక్కగానో, మీ వయసు వాళ్లకి నా బాధ అర్థం కాదులే’ అన్నారు.’అలా బాధ పడకండి, అంతగా అయితే ఎవరినైనా అడుగుదాం లెండి’ అన్నాను. అన్నానే గానీ ఆ విషయం అక్కడితో మర్చిపోయాను.ఇక అది  మొదలు స్వాతి ముత్యంలో కమల్ హాసన్ జె.వి సోమయాజులు మీద పెట్టుకున్న భరోసా కంటే ఎక్కువగా నా మీద భరోసా పెట్టుకున్న మా బాబాయిఇదే విషయం కదపడం, నేను అదిగో, ఇదిగో అనడం పరిపాటి అయిపోయింది.ఇక ఓ శుభ దినాన తనను తీసుకెళ్తే గానీ వల్ల కాదని భీష్మించుక్కూచున్న బాబాయిని ఓ రోజు సెలవు పెట్టుకుని, కారెక్కించుకుని బయలు దేరాను.ముందు దగ్గిర్లోని బ్యాంకు కెళ్లాం.వాళ్లు సెల్ఫ్ సర్వీసులని త్వరలో  ప్రవేశ పెట్టబోతున్నాం. అందువల్ల కొత్త రిక్రూట్ మెంట్లు చెయ్యడం లేదని చెప్పేరు.బయటకు రాగానే ‘ఎర్రగా బుర్రగా ఉన్న కుర్రవాళ్లు పనిచేసే ఇలాంటి చోట్ల మాకెవరిస్తారమ్మాయ్ ఉద్యోగం’ అన్నారు.అంతలోనే ‘పచారీ కొట్టులో పద్దులు రాసేదేవైనా ఉందేమో కనుక్కుందాం’ అన్నారు.’అవన్నీ నిలబడి చేసే ఉద్యోగాలు బాబాయ్, కాళ్లు లాక్కుపోతాయ్’ అన్నాను.’అయ్యో, ఇంట్లో కూర్చుని కూర్చుని కాళ్లు పడిపోతున్నాయమ్మా’ అన్నారు.సరే  అని దగ్గర్లో సూపర్ మార్కెట్‌కు తీసుకెళ్లాను.వాళ్లు అప్పటికే అక్కడున్న సెల్ఫ్ సర్వీసు సెంటర్లని చూపిస్తూ ఉద్యోగాల్లో ఉన్న వాళ్లనే ఊడబెరికే ప్రయత్నంలో ఉన్నామన్నారు.పొద్దుట్నించి తిరిగి అలిసి పోయాం కానీ ఎక్కడా బాబాయి వయసుకు తగ్గ ఉద్యోగం లేదు.దారిలో ఇండియన్ రెస్టారెంటులో ఆగి భోజనం చేసేం. అతని ఎరికలో ఉద్యోగాలున్నాయేమోనని ఆరా తీసాను. ఎందుకైనా మంచిదని ఉద్యోగం బాబాయికని చెప్పలేదు. ‘ఏవండీ మీకు తెలీనిదేముంది. ఇక్కడ ప్రతీ చోటా మనుషులు చేసే పనులు తక్కువ, యంత్రాలు చేసే పనులు ఎక్కువ. మన ఇండియా లాంటి చోట్ల మెషీన్ల కంటే మనుషులు చవగ్గా దొరుకుతారు, ఈ అమెరికాలో మనుషులతో పని చేయించడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. పది మంది చేసే పనికంటే మెషీన్లతో పని చేయించడం చవక.  మా హోటల్లోపల డిష్ వాషర్లు గిన్నెలు కడుగుతాయి. ఒకరిద్దరు కుక్‌లు తప్ప అన్ని పనులూ మిషన్లే చేస్తాయి. తిన్న తర్వాత ఎవరి టేబుల్ వాళ్లే తుడిచెళ్లి పోయే సెల్ఫ్ సర్వీస్ సిస్టం వల్ల మాకు లేబర్ కాస్ట్ పెద్దగా లేదు. అయినా ఈ దేశపు పౌరులు కూడా ఉద్యోగాల్లేక అల్లల్లాడుతున్నారంటే నమ్మండి. కానీ మాకు సౌలభ్యంగా ఉంది. అదే పదివేలు’ అని ఉపన్యాసం ఇచ్చేడు.వస్తూ వస్తూ దారిలో పెట్రోలు పోయించుకుందామని పెట్రోలు పంపులో ఆగేం.’రెండు నిమిషాల్లో వస్తాను బాబాయ్, ఇక్కడన్నీ సెల్ఫ్ సర్వీసు పెట్రోలు పంపులు కదా, మనమే మన కష్టాలు పడాలి’ అన్నాను.’ఈ దిక్కుమాలిన అమెరికా మెషీన్ల కిచ్చే ప్రాధాన్యత మనుషులకివ్వదన్నమాట. మనుషుల నోట మట్టి కొట్టి, కనబడ్డ చోటల్లా మెషీన్లు ప్రవేశపెట్టి పెట్టి సెల్ఫ్ సర్వీస్ అని గొప్ప పేరొకటి’ అన్నారు బాబాయ్ ఉక్రోషం ఆపుకోలేక.

…………

ప్రకటనలు
This entry was posted in అనగనగా అమెరికా(ఆంధ్ర ప్రభ కాలం) and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s