అనగనగా అమెరికా-29(లోకల్ టాలెంట్)

లోకల్ టాలెంట్

 

తెలుగు నాట “సహస్ర అవధానాలు” పూర్తి చేసిన మహావధాని గారికి అబ్బాయి నించి అమెరికాలో “ఉండిపోయే” వీసా వచ్చింది. ఇంకేముంది! మూటా ముల్లే అక్కడే వదిలేసి, అమెరికా గడ్డ మీద తన సహస్ర అవధానాలకి ముందు “శత” చేర్చడానికి అవకాశం వచ్చిందని సంబరంతో ఉన్నపళాన వచ్చి పడ్డారు.వచ్చింది కాలిఫోర్నియా, అందునా బే ఏరియా. ఎక్కడ చూసినా భారతీయులే, కనబడ్డ చోటల్లా తెలుగు వాళ్లే. అవధాని గారి ఆనందానికి అవధుల్లేవు. ఆన్ లైన్ టీవీలో ఎక్కడ చూసినా “ఎన్నారైలు బతికించేస్తున్న” తెలుగు వైభవాన్ని గురించి “ఓ..” హోరెత్తించేస్తుంటే అవధాని గారికి కాళ్లు నేల నిలవడం లేదు.వస్తూనే అమెరికాలో సాంస్కృతిక సంస్థల ఆరా తీయడం మొదలు పెట్టారు.అబ్బాయిని బతిమలాడి మొత్తానికి వారానికొక “పెద్ద మనిషి”ని కలిసే ఏర్పాటు చేసుకున్నారు. వెళ్లిన ప్రతీ చోటా “అయ్యో, మీరు తెలీకపోవడమేమిటీ” అని సాదరంగా కాఫీలిచ్చి పంపించేరు.వేసవి దాటి, చలికాలం వచ్చేసింది. ఎక్కడా అవధాని గారికి ఒక్క ఆహ్వానమూ అందలేదు. పండుగల్లో ఎక్కడా అవధానాలు చేస్తున్న పాపాన పోలేదు.గుళ్లో పరిచయాలైన వారితో మొరపెట్టుకున్నారు. “మీరు ఉగాది వరకూ ఆగాలండీ,  అమెరికాలో అవధానాలకి మంచి గిరాకీ ఉండేది ఉగాది సీజనేనండీ” అన్నారు.ఫిబ్రవరి నెల వచ్చింది. మర్చిపోయిన అవధానాన్ని మరలా గుర్తు చేసుకుంటూ రోజూ ధారణలో గడుపుతున్నారు అవధాని గారు.”లోకల్ సంస్థలు దాదాపు నాలుగైదున్నాయి. ఒక్కొక్కళ్లూ ఒక్కో వారం కుదుర్చుకున్నా, వారాంతంలో రెండు రోజులూ కుదుర్చుకున్నా ఫర్లేదని అన్ని లోకల్ సంస్థలకూ సిగ్గు విడిచి ఫోన్లు చేసి చెప్పెయండి” అని సలహా ఇచ్చేరు కొందరు.అదీ అయ్యింది.అటు ఉగాది వచ్చేస్తూంది గానీ లోకల్ సంస్థల నించి కబురూ లేదు, కాకరకాయా లేదు.”ఇక్కడి వాళ్లంతా ఆఖరి నిమిషంలో పిలుస్తారు కాబోలని అనుకోవడమా, మరోసారి అందరినీ కలవడమా “అని డైలామాలో పడ్డారు అవధాని గారు.స్థానిక ప్రముఖ సంస్థ ఒకటి నిర్వహిస్తున్న ఉగాది కార్యక్రమాల పోస్టరు గుడి బయట కనబడింది.అందులో ఇండియా నించి వస్తున్న “శతావధానుల” పేర్లు కనబడ్డాయి.”సహస్రాన్ని” నేనిక్కడుండగా “శతాల్ని” ఇండియా నించి పిలిపించుకోవడవేవిటీ?” అని బాధ మొదలైంది అవధాని గారికి.తిన్నగా సంస్థ ఆఫీసుకి పోయి కూచున్నారు. అధ్యక్షుడు, కార్యదర్శి కాదు కదా రిసెప్షనిస్ట్ కూడా లేరక్కడ. ఇద్దరు కుర్రాళ్లు కంప్యూటర్లేసుకుని ఉన్నారు. వాళ్లనేమడిగినా సంస్థ లెక్కలు చూడడం తప్ప ఏవీ తెలీవనేవారే.పక్కనే ఉన్న గుడికెళ్లి కూచున్నారు దీర్ఘంగా ఆలోచిస్తూ.అక్కడో పెద్దాయన కండువా వేసుకుని కనబడేసరికి ప్రాణం లేచొచ్చింది. పోస్టరు చూపిస్తూ వివరం అడగబోయేసరికి ఈ మధ్యనే ఆ సంస్థలోంచి బయటికొచ్చి కొత్త సంస్థ పెట్టుకున్న ఆ పెద్దమనిషి.ఈయన్ని ఎగాదిగా చూసి “అయ్యో అవధాని గారూ, ఇన్ని నెలలుగా ఇక్కడుంటున్నా ఈ సంస్థల ధోరణి మీకు అర్థం కాకపోతే ఎలాగండీ”, అని”ఇదిగో చూడండి, ఇక్కడి వాళ్లు ఇండియా నించి జనాన్ని ఎందరిని పిలిపిస్తే వాళ్ల ఖర్చుల నిమిత్తమని అంత “బాగా” చందాలు వసూలు చెయ్యొచ్చు. మీరు ఎంత విలువైన వారైనా, “లోకల్ టేలెంట్ల”ని ఇక్కడెవరూ పట్టించుకోరు. ఇక్కడ వాళ్లకి మీరు ఇప్పుడు “లోకల్”. మిమ్మల్ని పిలిస్తే వీళ్లకి మధ్యలో ఒరిగేదేముంది చెప్పండి? అంచేత మీరు మీ టాలెంటుని ఇక్కడ ఎవరైనా గుర్తించాలంటే వెంటనే ఇండియా వెళ్లిపోండి. అక్కణ్ణించి కూడా మీరు ఎంత “గట్టి ప్రయత్నం” చేసుకుంటారన్నదాని మీద ఆధార పడి ఉంటుంది.” అని అసలు విషయం చెప్పేడు.

…………..

ప్రకటనలు
This entry was posted in అనగనగా అమెరికా(ఆంధ్ర ప్రభ కాలం) and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s