నా కళ్లతో అమెరికా-30(ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డి.సి (భాగం-1))

అమెరికా తూర్పు తీరం రోజు-3 :

ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డి.సి (భాగం-1)

Dr K.Geetaముందు రోజు నాటి న్యూయార్క్ సిటీ టూర్ అలసట మర్నాటికి తెలిసింది. ఉదయం లేవడానికి చాలా కష్టమనిపించింది. కానీ తప్పదుగా.  ఉదయం అయిదు గంటలకే లేచి స్నానాదులు పూర్తి చేసుకుని, 6 గంటల కల్లా బస్సులోకెక్కాం. బస్సు న్యూజెర్శీ నుంచి ఫిలడెల్ఫియాకు బయలుదేరింది.

ప్రయాణం: న్యూజెర్శీ నుంచి ఫిలడెల్ఫియాకు మేం సాగించిన ప్రయాణం లో కనిపించినంతమేర అంతా ఒక రకమైన పల్లెటూరు వాతావరణంలా ఉంది. ఎక్కడెక్కడో విసిరేసినట్లున్న ఇళ్లు. చెట్టూచేమా అన్నీ బద్ధకంగా నిద్రపోతున్న చలి వేళ కావడం వల్లనో ఏమో ప్రపంచం అసలు ఆ సమయం లో ఇంకా ఎక్కడా మేల్కొన్నట్లు లేదు. మా బస్సు తప్ప రోడ్లపై వచ్చే పోయే వాహనాలూ పెద్దగా కనిపించ లేదు. ప్రపంచం సుషుప్తి లో నిశ్శబ్దంగా కలలు కంటున్న వేళ మంచుని చీల్చుకుని మెల్ల మెల్లగా తెల్లవారుతున్న ఉదయపు తొలి మబ్బు వెలుగు ను చూస్తూ ప్రయాణించడం భలే అనుభూతి. ఎన్నో జీవన ప్రయాణాల తర్వాత ఇక్కడ చేస్తున్న ఈ ప్రయాణం మనసుకి ఎంతో ఆహ్లాదంగా అనిపించింది.

ఇంచు మించు రెండు గంటలు పట్టింది ఫిలడెల్ఫియా చేరేసరికి. అంతా అలిసి పోయి ఉన్నామేమో, దానికి తోడు ఉదయమే లేచిన నిద్ర నీరసం ఒకటి. సీట్లలో పడి ఒకటే నిద్రపోయాం. నాకు మెలకువ, నిద్రగా కలలా గడిచింది ఆ ప్రయాణం.

ఫిలడెల్ఫియా-ఇండిపెండెన్సు హాలు: దాదాపు ఎనిమిది  గంటల ప్రాంతం లో ఆ రోజుకి మొదటి స్టాపు ఫిలడెల్ఫియా లో ఆగేం.

అక్కడ ప్రసిద్ధి గాంచిన ఫిలడెల్ఫియా “ఇండిపెండెన్సు హాలు” , లిబర్టీ బెల్లు లను బయటి నుంచే చలిలో తిరిగి చూసేం. ఫిలడెల్ఫియా  ఒక మహా నగరం.  కానీ ఎంత మహా నగరమైనా త్రోవ పొడుగునా నిర్మానుష్యంగా ఉన్న వీధుల వెంబడి ప్రయాణిస్తూంటే అంతటి మహా నగరాన్నీ అంతా వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్లిపోయేరనిపించింది.

ఫిలడెల్ఫియా పెన్సిల్వేనియా రాష్ట్రం లో రెండవ పెద్ద నగరం. 1790-1800 వరకు అమెరికా రాజధానీ నగరం. చరిత్రాత్మకమైన అమెరికన్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్సు ఇక్కడి “ఇండిపెండెన్సు భవంతి” ముందు మేం నడిచిన పెద్ద గ్రవుండు లోనే చదవబడింది.  అక్కడున్న 2000 పౌండ్ల పెద్ద “లిబర్టీ బెల్” ను లిబర్టీ హౌస్ కోసం ఇంగ్లాండ్ లో తయారు చేయించారట.  1753 నుంచి 1846 వరకు ఎన్నో సార్లు పగుళ్లు వచ్చిన ఈ గంట ను బాగు చేయించి వాడారట. తర్వాతి కాలంలో ఇక మోగడం మానేసిన దీనిని పర్యాటకుల సందర్శనార్థమై అక్కడ ఉంచారు.

 ఎదురుగా కనిపిస్తున్న భవంతిని బయటి నుంచి ఫోటోలు తీసుకుని, ఆ ఎదురుగా ఉన్న షాపింగ్ కాంప్లెక్సులో తెరిచి ఉన్న చైనీ హోటలుకి బ్రేక్ ఫాస్టుకి వెళ్లిపొమ్మని చెప్పేడు మా గైడు.సున్నా డిగ్రీల వాతావరణం బయట. వణికించే ఇచ్చిన గంటన్నర టైము లో సరిగ్గా అరగంట కూడా బయట ఉండ లేక పోయాం.  పిల్లలు చలిని తట్టుకోవడానికన్నట్లు కాకుండా దేశం కోసం పోరాడిన సైనికుల్లా కవాతు నడిచి, ఆడుతూ, పరుగులు తీసేరు. చూపించిన ఎదురు భవంతి అసలు ద్వారం లో నుంచి కాకుండా రెస్టారెంటులోకి ఒకమ్మాయి తెరిచి పట్టుకున్న డోరు లో నుంచి లోపలికి వెళ్లేం.  బఫే బ్రేక్ ఫాస్ట్ అది. ఉదయానే నూడుల్స్, నాన్ వెజ్ వగైరా ఉన్న చైనీస్ ఫుడ్ తినలేం అని  ఏవో కాసిన్ని కేకులు, పళ్లు తెచ్చుకున్నాం.  అయితే అక్కడ బిల్లు తెచ్చుకున్న ఫుడ్ ని తూకం వేసి తీసుకుంటారన్న సంగతి బిల్లు కౌంటర్ కు  వచ్చే వరకు తెలియదు. ప్లేట్లలో పెట్టుకునేటప్పుడు అక్కడ ఉన్న వన్నీ ఇంత బరువుగా ఉన్నాయేమిటి,సాధారణంగా అందంగా, నైసు గా లేకుండా అని మధ్యలో ఒకసారి అనుమానం వచ్చింది కూడా.  ఎందుకంటే పళ్ళ ముక్కలు ఒక్కొక్కటి అరచేతి లో సగానికి పట్టేటట్లు ఉన్నాయి. పుచ్చకాయ, చెనీస్ కర్బూజా, పైనాపిల్ అన్నీ ఒకటే సైజు ముక్కలు. ద్రాక్షల్లాంటివి చాలా తక్కువ ఉన్నాయి. ఇలా బరువు పళ్ల ముక్కలు తెచ్చుకోవడం వల్ల  బిల్లు బాగా బాండ్ అయ్యి యాభై డాలర్ల వరకూ వదిలాయి. అప్పటికి ఏమీ చేయలేక బిక్కమొహాలు వేసినా, ఇప్పుడు రెస్టారెంటు వాడి తెలివి తల్చుకుంటే నవ్వు వస్తుంది. ఈ ప్రయాణం లో ఎదురైన ఇలాంటి చేదు అనుభవాల వల్ల సత్య “టూర్  బుక్ చేసే ముందు  ఎవరు నడుపుతున్నారో తెల్సుకోకుండా బుక్ చెయ్యడం ఎంత తప్పై పోయింది!!” అని ఎన్నో సార్లు నెత్తి కొట్టుకున్నాడు.  కానీ నిజానికి ఈ దేశం లో ఇలాంటి వివరాలు ఎవరూ ఎక్కడా పైకి చెప్పరు. అందువల్ల ముందే తెల్సుకోవడం కూడా చాలా కష్ట సాధ్యం.

https://plus.google.com/photos/104256037410703377895/albums/5992677170846954193?banner=pwa

అక్కణ్ణించి మేరీ లాండ్ మీదుగా అమెరికా రాజధానీ నగరం వాషింగ్టన్ డీసీ కు దాదాపు నాలుగైదు గంటల ప్రయాణం చేసాం.

దారి పొడవునా ఒక మాదిరి ఎత్తున్న పైన్ చెట్ల వంటివి తప్ప మరీ ఎత్తైన వృక్షాలు గానీ, అరణ్యాలు గానీ కనిపించలేదు. దారిలో అంతా ఏవో పరిశ్రమలు ఉన్నట్లు అనిపించాయి. కాలిఫోర్నియా కి, ఇక్కడికి తేడా కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇవన్నీ బాగా పాత ప్రాంతాలని వాటి అవతారం చూస్తేనే తెలిసి పోతుంది. ఇటంతా తిరిగి చూసేక అమెరికా తూర్పు తీరం పట్ల క్రేజ్ పోయింది. ఎంతో ఖర్చు ప్రదేశమైనా కాలిఫోర్నియా జీవనం చాలా బావుంటుందన్న విషయం బాగా స్పష్టమైంది.

బాల్టిమోర్ నగరం మీదుగా ప్రయాణించాం. అమెరికా తూర్పు తీరంలో ప్రసిద్ధి చెందిన నౌకా తీరం బాల్టిమోర్. మేరీ లాండ్ రాష్ట్రపు  పెద్ద నగరం.  నిజానికి ప్రతీ నగరం లోనూ ఆగితే ఎంతో బావుణ్ణని అనిపించేది కానీ బస్సు టూరు వల్ల అన్నీ బస్సు అద్దాల లోంచి చూసి సరిపెట్టుకోవలసి వచ్చింది.

పిల్లలు ఎక్కడి వాళ్లక్కడ మరలా గుర్రు పెట్టేరు. కాస్త సమయం దొరికితే ఇలా నిద్ర పోతున్నారేవిటని భలే ఆశ్చర్యంగా అనిపించేది. స్కూళ్ల కు వెళ్లే సమయంలో తెల్లారి 6 గంటలకు లేచినా రాత్రి పదకొండైనా పడుకోరు వీళ్లు. బహుశా: టైం జోను లో 3 గంటలు మేం వెనక్కు రావడం వల్లననుకుంటా అనిపించింది.  నేను కాస్సేపు నిద్రపోయినా, బయట ఏం మిస్సయ్యి పోతున్నానో అని త్వరగా లేచేదాన్ని. అన్ని అనుభూతుల్ని పదిల పరచుకోవడానికి బస్సులో నుంచే ఎన్నో ఫోటోలు తీస్తూ,  కొత్త ప్రదేశాల్ని కళ్ల నింపుకుంటూ నిరంతరం బయటికి చూస్తూ ఉండేదాన్ని.

వాషింగ్టన్ డీసీ- వైట్ హౌసు: పదకొండు గంటల వేళ డీసీ కు చేరుకున్నాం. మొదటి స్టాపు వైట్ హౌస్. వైట్ హౌసు ను చూడడమంటే దాదాపు పావుమైలు దూరం నించి గార్డెన్ ఫెన్స్  మీదుగా ఫోటోలు తీసుకోవడమన్నమాట. అందర్నీ వెంటబెట్టుకుని తీసుకెళ్లాడు మా గైడు.  “ఇదిగో ఇక్కణ్ణించి ఫోటో బాగా వస్తుంది” అని చెప్తూ.  గొప్ప నవ్వు వచ్చింది అక్కణ్ణించి ఏం చూస్తాం? ఒబామా కాదు కదా అనుచరులు కూడా కనిపించడం లేదు.

“వైట్ హౌసు లోపలికి వెళ్లాలంటే నెలల ముందెప్పుడో  అప్లై చేసుకొని, అపాయింటుమెంటు తీసుకుని ఉండాలి. అదో పెద్ద తతంగం” అని చెప్పేడు మా గైడు. మొత్తానికి పది నిమిషాలు అక్కడక్కడే తచ్చాడి గుంపులో ఒక్కొక్కళ్ళు పక్కకి జరగగా వైట్ హౌస్ వ్యూ కొంచెం బాగా కనిపిస్తున్న చోటి నుంచి ఫోటోలు తీసుకుని వైట్ హౌసుకు, ఒబామా కు “గుడ్ బై” చెప్పేం.

మా బస్సు ను మేం తిరిగి చేరుకునేందుకు గంట సమయం ఉంది. వైట్ హౌస్ లోపలికి వెళ్లే ముఖ ద్వారపు గేటు దగ్గర పర్మిషన్లు ఇచ్చే కాంప్లెక్సు దగ్గర బాత్రూములకు వెళ్లేం.

అపరిశుభ్రంగా ఉన్న ఆ ప్రాంతం చూసి ఆశ్చర్యం వేసింది. ప్రైసిడెంటు కూత వేటు దూరం లో ఉన్న చోట ఇలా ఉందేవిటీ అని. కాలిఫోర్నియాలో బాగా శుభ్రతకు అలవాటు పడిపోయినట్లున్నాం అని మరలా అనిపించింది.

కాస్త ఎండ కాచుకుందుకు బయటికొచ్చి ఆ బిల్డింగుకి చుట్టూ ఉన్న పూల మొక్కల చఫ్టాల మీద కూచున్నాం. బయట రోడ్డునానుకుని ఉన్న ఫుడ్ వాన్ల దగర నీళ్లు, కూల్ డ్రింకులు, తిండి సామగ్రి అమ్ముతున్నారు. వాటి చుట్టూ తిరిగి  కాస్సేపు గడిపి కాలక్షేపం చేసేం. ఇక్కడ కూడా ఇలాంటి బళ్ల వాళ్లు ఇండియన్సే కనిపించారు. మమ్మల్ని చూడగానే హిందీ లో పలకరించారు. నాకైతే న్యూఢిల్లీ వచ్చేమా అనిపించింది.

అక్కడ నీళ్లు బయటెక్కడికన్నా ఖరీదు ఎక్కువే. కానీ తప్పదుగా. నేను కాస్సేపు పిచ్చాపాటీ మాట్లాడదాం వాళ్లతో అనుకునే లోగా బస్సు వచ్చింది.

ఆ రోజు ప్రధానంగా వాషింగ్టన్ డీసీ సిటీ టూరన్నమాట. యథావిధిగానే మనం చూడాలనుకున్నవి కాకుండా గైడు చూపించాలనుకున్నవి చూసే క్రమంలో ఆ రోజు సగం వృథా అనిపించింది.

యునైటెడ్ స్టేట్స్ కాపిటల్: అక్కణ్ణించి “యునైటెడ్ స్టేట్స్ కాపిటల్”  పార్లమెంటు బిల్డింగు దగ్గిర ఆపేరు.

ఆ బిల్డింగుని  బయటి నుంచి అర్థ చంద్రాకారం లో లాన్ మీదుగా ఉన్న మెట్ల దారి లో చుట్టి వచ్చి, ఫోటోలు తీసుకోవడానికి పావుగంట సమయం ఇచ్చాడు గైడు.  ఎక్కడా పార్కింగు లేదని బాగా కంగారు పెట్టేడు. అక్కడున్న మెట్లు ఎక్కి, దిగి, చుట్టి రావడానికే పావుగంట పడుతుంది. ఇక ఆగి ఫోటోలు తీసుకునేందుకు సమయం సరిపోదు. అంటే అయిదు నిమిషాలు ఎక్కడ లేటు చేసినా అంత స్పీడుగా నడవాలన్న మాట.  మా చేతిలో పాపాయి తో మాకు మరింత కష్టమైంది. సిరి బేబీ కార్ట్ లో  కూర్చోనని పేచీ పెడితే ఎత్తుకున్నాం. ఇప్పుడు తల్చుకుంటే నవ్వు వస్తూంది ఆ రోజు మా పరుగు తల్చుకుని.  ఆదరా బాదరా గా గైడు చేతులు ఊపుతుంటే పరుగెత్తి బస్సులో కూలబడడం గొప్ప తమాషా అనుభవం.

అంతా పరుగెత్తించేది మమ్మల్ని వాళ్లు అనుకున్న ప్లాను ప్రకారం అన్నీ చూపించడానికే అయినా అలా హడావిడిలో ఏం చూస్తాం అనిపించేది ప్రతీ చోటా.

రాజధానీ నగరం అయినందుకు అంత దీటుగానూ బ్రహ్మాండంగా ఉంది ఊరు. పెద్ద పెద్ద భవంతులు, విశాలమైన రోడ్లు, ఉద్యాన వనాలు.  మరలా ఒక సారి స్థిమితంగా వచ్చి తీరాలి అనిపించింది.

వైట్ హౌస్ చుట్టుపక్కల ఎక్కడ తిరిగినా ఏ మూల నించైనా  పొడవైన “వాషింగ్టన్ మాన్యు మెంట్”  కనిపిస్తూ ఉంటుంది.

అక్కణ్ణుంచి మా తరువాతి స్టాపు “నేచురల్ హిస్టరీ మ్యూజియం”. అక్కడే మధ్యాహ్న భోజనం. నేను చూడాలనుకున్న వాటిల్లో ఈ హిస్టరీ మ్యూజియం ఒకటి కావడం తో సంతోషించాను.

(ఇంకా ఉంది)

http://vihanga.com/?p=11553

ప్రకటనలు
This entry was posted in నా కళ్లతో అమెరికా(Travelog) and tagged , , , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s