అనగనగా అమెరికా-30 (ఉగాది కవులు)

అనగనగా అమెరికా-30

ఉగాది కవులు

స్టేజీ మీద “ఉగాది కవి సమ్మేళనం” జోరుగా జరుగుతోంది. అమెరికా లో ఉగాది పచ్చడి నుంచి మొదలుకొని, వాళ్ల ఊళ్లో ఉగాది పచ్చడి వరకూ ఏమీ మిగల్చకుండా కవులు జనాల్ని తినేస్తున్నారు.  పట్టపగ్గాల్లేని రాగాల పద్యాలతో, వచనానికి ఇటూ అటూ కాని కవిత్వంతో కవులు దొరికిన ఒకే ఒక్క చాన్సుని వదులుకోవడం ఇష్టం లేనట్లు మైకుని ఒక పట్టాన  వదలడం లేదు. అప్పటి వరకూ సాగిన పంచాంగ శ్రవణం ఉత్సాహంగా విన్న జనం  ఈ మొక్కుబడి కవి సమ్మేళనం అయిన తర్వాతే భోజనాలని ఎనౌన్సుమెంటు వల్ల కదల్లేక, మెదల్లేక అక్కడక్కడే తచ్చాడుతూ ఎవరి పిచ్చా పాటీలో వాళ్లున్నారు.

ఇండియా నించి కొత్తగా వచ్చిన ఒక సాఫ్ట్ కవి(వృత్తి రీత్యా సాఫ్ట్ వేరు ఇంజనీరు, ప్రవృత్తి రీత్యా కవి)   వేదిక మీద ఇలాంటి కవి సమ్మేళనాలకి  వచ్చే ఏడాదికి ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తూ

ముందు వరుసలో స్క్రీను మీద కవిత్వం ప్రసారం చేస్తూ కంప్యూటరు ముందు కూచున్న  వ్యక్తి దగ్గరికి వెళ్లాడు. పంచె కట్టు చూసి అతను నిర్వాహకుల్లో వాడేనని సులభంగా గుర్తు పట్టాడు కవి.  పక్కనే సీటొకటి ఉంటే చతికిలబడీ అడిగాడు పంచె కట్టు పెద్దమనిషిని  “ఏవండీ, ఇలా నేను కవిత్వం స్టేజీ మీద చదవాలంటే ఏం చెయ్యాలి?”

“మీరు ఉగాది కవేనా?” అన్నాడా పెద్దమనిషి.

ఆ ప్రశ్నేమిటో అర్థం కాలేదు కవికి. ఇండియాలో అభ్యుదయ కవులు, విప్లవ కవులు, దిగంబర కవులు, స్త్రీవాద, దళిత వాదాలు, పోస్టు మాడ్రనిజం లలో ఎక్కడా ఈ పదం విన్నట్టు లేదు.

“ఊ…ఉహూ…” అని తలని రెండు విధాలా ఆడించాడు ఎందుకైనా మంచిదని.

మళ్లీ “కవిత్వం అంటే….అని నానుస్తూ ఇప్పటిదాకా వంద పై చిలుకు ప్రచురితమయ్యాయండీ, రెండు పుస్తకాలు, అవార్డులు కూడా వచ్చాయి” అన్నాడు ఉత్సాహంగా.

“మీరెన్ని పుస్తకాలు వేసారన్నది కాదండీ ముఖ్యం, ఉగాది కవిత్వం రాసేరా?” అని అన్నాడతను.

“ఉగాది కవిత్వం ..అంటే..” అన్నాడు నానుస్తూ.

“ఉగాది కవిత్వం అంటే,  ఉదాహరణకి ఆ స్టేజీ మీదకి చూడండి అందులో అట్నించి రెండో ఆవిడ ఎప్పుడూ కవిత్వమే రాయలేదు. ప్రతీ ఉగాదికీ “ఉగాది పచ్చడి” కలపడంలో కిచన్ లో సహాయం చేస్తుంది.

ఈ సంవత్సరం “ఉగాది పచ్చడి” అని కవిత రాసేసింది.  ఇట్నించి మూడో ఆయన  ప్రతీ ఉగాదికి మాత్రమే కవిత్వం రాస్తాడు. అందులో ఉగాది తప్ప ఇంకో విషయం ఉండదు. అదీ ఉగాది కవిత్వమంటే. పోనీ మీరెన్ని కవితలు ఎలా రాసినా ఉగాది కవిత్వంలో వేప పువ్వు, మామిడి కాయ తప్పనిసరిగా ఉండాలి.” అన్నాడు విశదంగా.

కవికి మతిపోయింది. “వేపపువ్వు, మామిడికాయ లేకపోయినా వసంతం గురించి రాయొచ్చంటారా” అని

“ఈ వేదిక మీద కవిత్వం చదవాలంటే ఉగాది కవిత్వం రాస్తే చాలు, మీ సభ్యులు కానవసరం లేదన్న మాట” అన్నాడు కవి ఇంకాస్త క్లారిపై చేసుకుంటూ.

అవతలి వ్యక్తి  ఎగా దిగా చూసి, “కానవసరం లేదని ఎవరు చెప్పారండీ, ఇక్కడ వేదిక మీద ఉన్న వారంతా ఏదో “రూపేణా” సంస్థ కి “సహాయం” చేసేవారే. ఇతర సహాయాలు చెయ్య లేకపోతే మీరో పని చెయ్యండి. ఎలాగూ మీరిక ఇక్కడే ఉంటారు గనుక మా సంస్థ  కిచన్ లోనో, భోజనాలకి వడ్డింపు దగ్గరో ప్రతీ ఏడాదీ “ఉచిత సేవ” చెయ్యండి. మీరు కవిత్వం ఇప్పటికే రాస్తున్నారు గనుక వచ్చే ఏడాదే వేదికెక్కించేస్తాం” అని కనుబొమలెగరేసాడు.

కవికి కవిత్వం మీద స్వేచ్ఛ లేని ఈ “ఉగాది కవిసమ్మేళనం” ఏవిటో, ఎవరి కోసమో అర్థం కాలేదు సాఫ్ట్ కవికి.

“అన్నట్లు విశ్వనాథ సత్యన్నారాయణ” గారి పద్యాలు చదివేరా అన్నాడు హఠాత్తుగా కవిత్వం గురించి అతనికి కొంత తెలుసని చెప్పడం కోసం అన్నట్లు అవతలి వ్యక్తి.

” అజంతా, కుందుర్తి, శివారెడ్డి, శిఖామణి లను కూడా  చదివేనండీ” అన్నాడు వినయంగా సాఫ్ట్ కవి.

వాళ్లంతా  ఎవరన్నట్లు నుదురు చిట్లించి చూసి “పద్యం.. పద్యాలు రాసేరా” అని,

“ఇప్పుడిప్పుడు ఇలా కొంత వచనం లోకి దిగిపోయింది కానీ “ఉగాదంటే పద్యం, పద్యం అంటే ఉగాది” అసలు పద్య తాంబూలం లేకుండా ఉగాదేవిటండీ. ఉగాదంటే పంచాంగం శ్రవణం, కవిత్వం ఆస్వాదించడం, ఉగాది పచ్చడి తినడం… ఇలాంటివే కదండీ. భోజ రాజ కాలం నించీ వస్తున్న ఆచారాల్ని అమెరికాలోనూ బతికించడమే  మేం చేస్తున్న పని.” అని చాలా గొప్పగా అన్నాడు.

ఇవన్నీ వినేసరికి ఠారెత్తి “ఉగాది కవి” కావడం కంటే “ఉత్తి కవి” గా ఉండడమే మేలనిపించింది కవికి.

ఇలాంటి కవి సమ్మేళనాల కోసం పాకులాడితే  అసలు తనకిప్పటి వరకూ వచ్చిన కవిత్వం కూడా అటకెక్కిపోతుందేమోననిపించి అంత వరకూ ఈ వివరాలన్నీ కనుక్కున్నందుకు లెంప లేసుకున్నాడు.

……………………

Published: 18 Apr 2014 12:28:49 in Andhraprabha.com

http://www.andhraprabha.com/columns/%E0%B0%89%E0%B0%97%E0%B0%BE%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%95%E0%B0%B5%E0%B1%81%E0%B0%B2%E0%B1%81/15862.html
 

ప్రకటనలు
This entry was posted in అనగనగా అమెరికా(ఆంధ్ర ప్రభ కాలం) and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s